పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

మహాపురుషుల జీవితములు

ఆదినములలోఁ జేసిన మనఃపరిశ్రమమును బట్టియే కాశీనాథుఁడు న్యాయవాదియైన పిదప నతి సూక్ష్మబుద్ధితో వ్యాజ్యముల నడపి ప్రతిష్ఠసంపాదింపఁ గలిగెను. ఆతని వాగ్ధోరణి యాతనియుక్తులు న్యాయాధిపతుల మనస్సులనాకర్షించుచు నతనినేర్పు స్వల్పకాలములోనే వానికి గొప్ప పేరు దెచ్చెను. న్యాయాధిపతులు సయితము పలుమారువానిప్రజ్ఞలకుఁ బొగడుచువచ్చిరి. సంస్కృతమునందతఁడు మిక్కిలి ప్రజ్ఞావంతుఁడగుటచే హిందూశాస్త్రములమీఁద వచ్చిన వ్యాజ్యములలో నతనియాలోచన ప్రమాణమైయుండెను. జడ్జీలు సయితము సందిగ్ధవిషయములలో నీతనిసహాయ మపేక్షించుచువచ్చిరి. యూరపుఖండమున క్రీస్తు దేశమున హోమరను కవి ఈలియడ్డును నొక గ్రంథమువ్రాసెను. దానియందలి కథ యచ్చముగ రామాయణమువలె నుండును. అందుచే సంస్కృతపండితుడగు వీబరను దొరగారు రామాయణము రచించిన వాల్మీకి మహర్షి హోమరుకవి వ్రాతలను దొంగిలించెనని వ్రాసిరి. కాశీనాథతిలాంగు హోమరు కవిత్వము వాల్మీకి కవిత్వము, జాగ్రత్తతో జూపుచు నొకవ్యాసము వ్రాసెను. ఆ వ్యాసము హిందూ దేశస్థులే గాక యింగ్లాండు వారు సయితము చాల మెచ్చిరి.

ఆతఁడు 1873 వ సంవత్సరమున మొట్టమొదట బహిరంగమైన సభలోనికివచ్చి యొక్క యుపన్యాసమిచ్చెను. ఆసభ యప్పుడు క్రొత్తగాబుట్టిన యుప్పుచట్టమును గురించి చర్చించుటకు జరిగెను. అతఁడు నాడిచ్చిన యుపన్యాసము నింగ్లీషుపత్రికలు స్వదేశపత్రికలు సమానముగఁ గొనియాడెను. అతని నోటినుండి యాంగ్లేయభాష వెలువడునప్పు డాంగ్లేయులు సయితము తమభాషకిట్టిసౌకుమార్యము గలదాయని తెల్లబోయి చూచెడువారు. న్యాయవాదియై విశేష ప్రసిద్ధిగాంచుచు రాజకీయవ్యవహారములలో మిగులఁ బనిచేయుచుఁ