[26]
కాశీనాథ త్రియంబక తిలాంగు
201
విధముగా నభ్యాసము చేసికొన్నగాని లౌకిక వ్యవహారములలోఁ దాను ప్రవేశించుటకు తగనని యట్లుచేయుచు వచ్చెను.
అదియునుగాక బొంబాయిలోనున్న ప్రార్థనసమాజ మందిరమున కతఁడు ప్రతివారము బోయి యచ్చట జేయఁబడిన మతబోధలను శ్రద్ధతోవిని గృహమునకు జనిన పిదప విన్నదంతయుఁ గాగితముమీఁద వ్రాసి "మీరు చెప్పినదంతయు నేను సరిగా గ్రహించి వ్రాసితినో లేదో చూడు" డని యుపన్యాస మిచ్చిన వారివద్దకే మరల బంపుచుండెను. ఇతరులు చెప్పిన విషయములను సరిగా గ్రహించి సరిగా దెలియజేయుట నెఱుగనివాఁడు ప్రపంచమునం దెప్పటికిని గొప్పవాఁడు కాలేడనిభావించి యతఁడీ విధమున జేయుచు వచ్చెను. అవ్విధంబున నొరుల యుపన్యాసములు విని జ్ఞాపకముంచుకొని మరల వ్రాయుచుండుటచేతనే యతఁడు మిక్కిలి సరసమైన శైలితో నింగ్లీషువ్రాయుటయు మాటలాడుటయు నతని కలవడెను. ఆంగ్లేయభాషలో మిల్లు, కారై, స్పెన్సరు, మొదలగు మహాత్ముల గ్రంథములయం దతని కత్యంతమభిరుచి. సంస్కృతముమీఁద వానికున్న యభిమానమునకు మేరలేదు. బాపుశాస్త్రీయను నొక పండితుఁడు విద్యార్థులకు బాణినివ్యాకరణము చెప్పుచుండ నతఁడక్కడకు బ్రతిదినముబోయి యా శాస్త్రము నేర్చికొనెను. ఆనందగిరి వ్రాసిన శంకర విజయము మరొకరు వ్రాసిన శంకరవిజయముఁ జదివి కాశీనాథుఁడు శంకరాచార్యుని చరిత్రము సంగ్రహముగా నింగ్లీషున వ్రాసి విద్యార్థుల సమాజమువద్దఁ జదివెను. ఈ కాలముననే యీ విద్వాంసుఁడు భగవద్గీతల నింగ్లీషులోనికి భాషాంతరీకరణము చేసెను. ఈభాషాంతరీకరణముననే సంస్కృత విద్యాపారంగతుఁడగు మోక్సుమూలరు పండితుఁడు తాను ప్రకటించిన ప్రాచీన పవిత్ర గ్రంథములలోఁ జేర్చి లోకమునకు వెల్లడించెను.