పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/243

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
200
మహాపురుషుల జీవితములుచదివించుచు వచ్చిరి. అట్టిగురువులయొద్ద విద్యనభ్యసించుట చేనతఁడు రెండేండ్లకే యనగా పదునెనిమిదేండ్లప్రాయముననే యమ్. ఏ. పరీక్షయందుఁ గృతార్థుఁడయ్యెను. పిమ్మట మఱి రెండేండ్లకు యల్. యల్. బి. అనగా బి. యల్ పరీక్షలో దేరెను. పట్టపరీక్షయందుఁ దేరిన మరుసటిసంవత్సరమే యనగా పదునేడేండ్ల ప్రాయముననే యతఁడు తాను చదువుకొన్న కళాశాలలో నొక యుపాధ్యాయుఁడుగా నియమింపఁబడి బాలుర కింగ్లీషు సంస్కృతము నైదేండ్లు నేర్పెను.

1872 వ సంవత్సరమున కాశీనాథుఁడు న్యాయవాదికిఁగావలసిన మఱికొన్ని పరీక్షలయందును గృతార్థుఁడై బొంబాయి హైకోర్టులో న్యాయవాది యయ్యెను. కుశాగ్రబుద్ధియగు నీతఁడు పరీక్షల యందు గృతార్థుఁడగుటయేగాక బహుగ్రంథములు శోధించి చదివి పలు తెఱంగుల తనజ్ఞానము నభివృద్ధిచేసికొనుచు వచ్చెను. ఆయన యమ్. ఏ. పరీక్షయందుఁదేరిన వాఁడయ్యు దానదివఱకు నేర్చికొనిన విద్య మిక్కిలి స్వల్ప మనియు "అనంతశాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చకాలో బహవశ్చవిఘ్నాః" యను నార్యోక్తినిపట్టి నేర్చికొనవలసినదే విస్తారముగ నున్నదనియుఁ దెలిసికొని న్యాయవాదిపరీక్షకు జదువునప్పుడే యింగ్లీషులోనున్న భాషాగ్రంథములు తత్వశాస్త్రములు మొదలగు వానిని జాగరూకతతోఁ జదివెను. ఇట్లు చదువుటయె కాక యతఁడు బొంబాయిలో నాకాలమున వెడలుచుండిన హిందూప్రకాశము మొదలగు కొన్నిపత్రికలకు వ్యాసములు వృత్తాంతములు వ్రాసిపంపుచు నెడనెడ జ్ఞానాభివృద్ధి కరములగు సభలకుఁ బోయి పెద్దలిచ్చు నుపన్యాసములను విని స్వయముగఁ దానుపన్యాసమును వ్రాసి చదివి యెల్లవిధముల బుద్ధిని వికసింపఁ జేసెను.