పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము/శ్రీమన్నారాయణ కవచము

వికీసోర్స్ నుండి

శ్రీమన్నారాయణ కవచము

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము)
రచయిత: సింగయ


శ్రీమన్నారాయణ కవచము

తెభా-6-296-క.
నారాయణ కవచము
రిభీకర వజ్రకవచ మాశ్రిత సంప
త్పరిణామ కర్మసువచము
పురుహూతున కెట్లు మౌని బోధించె? దగన్.

టీక:- వర = శ్రేష్ఠమైన; నారాయణ కవచమున్ = నారాయణ కవచము యనెడి మహామంత్రము; అరి = శత్రువులకు; భీకర = భయంకరమైన; వజ్ర = వజ్రము వలె దుర్బేధ్యమైన; కవచము = రక్షాకవచము; ఆశ్రిత = ఆశ్రయించినవారికి; సంపత్ = సంపత్కరమైన; పరిణామ = పరిణామములను కలిగించెడి; కర్మ = కార్మముగా గల; సువచము = మంచిమాటలు కలది; పురుహూతున్ = ఇంద్రుని; కు = కి; ఎట్లు = ఏ విధముగ; మౌని = ముని; బోధించె = తెలియజేసెను; తగన్ = చక్కగా.
భావము:- శత్రువులకు భయంకరమైన వజ్రకవచం, ఆశ్రయించిన వారికి సంపదలిచ్చే రక్షాకవచం అయిన ఆ గొప్ప నారాయణ కవచాన్ని విశ్వరూప ముని ఇంద్రుని కెలా బోధించాడు?”

తెభా-6-297-వ.
అనినం బరీక్షిజ్జనపాలునకు మునినాథుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; పరీక్షిత్ = పరీక్షిత్తు; జనపాలున్ = రాజున; కు = కు; ముని = మునులలో; నాథుండు = ప్రభువు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని ప్రశ్నించిన పరీక్షిన్నరేంద్రునితో శుకమహర్షి ఇలా అన్నాడు.

తెభా-6-298-సీ.
"వివయ్య! నరనాథ! మునినాథుఁ డింద్రున-
నువొంద నారాయణాఖ్య మైన
వచంబు విజయ సంల్పంబు నప్రమే-
స్వరూపంబు మహాఫలంబు
మంత్రగోప్యము హరిమాయావిశేషంబు-
సాంగంబుగాఁగ నెఱుంగఁ జేసె;
దాని నే వినిపింతుఁ బూని తదేకాగ్ర-
చిత్తంబుతోడుతఁ జిత్తగింపు;

తెభా-6-298.1-తే.
మొనర ధౌతాంఘ్రిపాణి యై యుత్తరంబు
ముఖముగా నుత్తమాసనమున వసించి
కృ నిజాంగ కరన్యాస తిశయిల్ల
హిత నారాయణాఖ్య వర్మము నొనర్చె.

టీక:- విను = వినుము; అయ్య = తండ్రి; నరనాథ = రాజా; ముని = మునులలో; నాథుడు = ప్రభువు; ఇంద్రున్ = ఇంద్రుని; కున్ = కు; అనువు = అనుకూలము; ఒందన్ = పొందునట్లుగ; నారాయణ = నారాయణ; ఆఖ్యము = పేరు గలది; ఐన = అయిన; కవచంబు = రక్షణతొడుగు వంటి మహామంత్రము; విజయ = విజయమును; సంకల్పంబున్ = చక్కగా కలిగించెడిది; అప్రమేయ = అపరిమితమైన; స్వరూపంబు = స్వరూపము గలది; మహా = గొప్ప; ఫలంబు = ఫలితముల నిచ్చునది; మంత్ర = మంత్రములలో; గోప్యము = రహస్యముగా దాచదగినది; హరి = నారాయణుని; మాయా = మాయతోకూడి; విశేషంబు = విశిష్టమైనది; సాంగంబుగాన్ = అంగన్యాస కరన్యాసములతో సంపూర్ణంగా; ఎఱుంగజేసెద = తెలిపెదను; దానిన్ = దానిని; నేన్ = నేను; వినిపింతు = చెప్పెదను; పూని = ధారణ కలిగి; తదేకాగ్ర = దాని యందే లగ్నమైన; చిత్తంబు = మనసు; తోడుత = తోటి; చిత్తగింపుము = వినుము; ఒనర = సిద్దపరుచుకొన్న;
ధౌత = శుభ్రముగా కడుగుకొన్న; అంఘ్రి = పాదములు; పాణి = చేతులు గలవాడవు; ఐ = అయ్యి; ఉత్తరంబు = ఉత్తరపు; ముఖముగా = వైపునకు చూచువాడవై; ఉత్తమ = మంచి; ఆసనమున = ఆసనముపైన; వసించి = ఉండి; కృత = చేసిన; నిజ = తన యొక్క; అంగ = అవయవములు; కర = కరములను; న్యాస = వాడుటలు; అతిశయిల్ల = అతిశయించునట్లు; మహిత = గొప్ప; నారాయణ = నారాయణ; వర్మము = కవచము; ఒనర్చె = కలిగించెను.
భావము:- “రాజా! విను. విజయాన్ని చేకూర్చేది, ఊహించడానికి వీలుకాని ప్రభావం కలది, మహాఫలాన్ని ఇచ్చేది, రహస్యంగా కాపాడుకోదగినది, వైష్ణవీ మాయాస్వరూపమైనది అయిన నారాయణ కవచాన్ని విశ్వరూపుడు ఇంద్రునికి సాంగోపాంగంగా ఉపదేశించాడు. దాని విధానాన్ని నేను వినిపిస్తాను. ఏకాగ్రచిత్తంతో విను. ముందుగా కాళ్ళు, చేతులు కడుక్కొని, ఉత్తర ముఖంగా ఉత్తమాసనంపై కూర్చొని, అంగన్యాస కరన్యాసాలు చేసి గొప్పదైన ఈ నారాయణ కవచాన్ని ప్రయోగించాలి.

తెభా-6-299-వ.
ఇట్లు నారాయణకవచంబు ఘటియించి, పాదంబులను, జానువులను, నూరువులను, నుదరంబునను, హృదయంబునను, నురంబునను, ముఖంబునను, శిరంబునను నట్లష్టాంగంబులం బ్రణవపూర్వకంబైన యష్టాక్షరీ మంత్రరాజంబు విన్యాసంబుచేసి ద్వాదశాక్షర విద్యచేతం గరన్యాసంబు చేసి, మంత్రమూఁర్తియై భగవచ్ఛబ్ద వాచ్యం బైన ప్రణవాది యకారాంత మహామంత్రంబు చేత నంగుళ్యంగుష్ఠ పర్వసంధులయం దుపన్యసించి, మఱియు హృదయంబున నోంకారంబు, వికారంబు మూర్ధంబున, షకారంబు భ్రూమధ్యంబు నందు, ణకారంబు శిఖ యందు, వేకారంబు నేత్రంబులయందు, నకారంబు సర్వ సంధులయందు మఱియు నస్త్రము నుద్దేశించి మకారంబు నుపన్యసించె నేని మంత్రమూర్తి యగు; మఱియును "అస్త్రాయఫట్"అను మంత్రంబున దిగ్భంధనంబుచేసి, పరమేశ్వరునిం దన భావంబున నిల్పి విద్యామూర్తియుఁ, దపోమూర్తియు నగు షట్చక్తి సంయుతం బైన నారాయణ కవచాఖ్య మైన మంత్రరాజంబు నిట్లని పఠియించె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; నారాయణకవచంబు = నారాయణ కవచమును; ఘటియించి = అనుసంధానము చేసికొని; పాదంబులను = పాదములను; జానువులను = మోకాళ్ళ యందు; ఊరువులను = తొడల యందు; ఉదరంబునను = కడుపు నందు; హృదయంబునను = హృదయమునను; ఉరంబునను = వక్షస్థలమునను; ముఖంబునను = ముఖము నందు; శిరంబునను = తలపైన; ఇట్లు = ఈ విధముగ; ఇట్లు = ఈ విధముగ; అష్టాంగంబులన్ = అష్టాంగములు యందు {అష్టాంగములు - 1పాదములు 2మోకాళ్ళు 3తొడలు 4కడుపు 5హృదయము 6వక్షస్థలము 7ముఖము 8తల}; ప్రణవపూర్వకంబు = ఓంకారము ముందుగా కలది; ఐన = అయిన; అష్టాక్షరీ = అష్టాక్షరి {అష్టాక్షరీమంత్రము - ఓంనమోనారాయణాయ అనెడి 8 అక్షరములు గల ఓంకారముతో ప్రారంభించి శిరస్సుతో మొదలిడి అష్టాంగవిన్యాసముతో చేసెడి మంత్రము}; మంత్ర = మంత్రములలో; రాజంబు = శ్రేష్ఠమైనది; విన్యాసంబు = విన్యాసము; చేసి = చేసి; ద్వాదశాక్షరవిద్య = ద్వాదశాక్షరవిద్య {ద్వాదశాక్షరవిద్య - ఓంనమోభగవతేవాసుదేవాయ అనెడి 12 అక్షరములుగల ఓంకారముతో ప్రారంభించి కరన్యాసముతో చేసెడి మంత్రము}; చేతన్ = చేత; కర = చేతులతో; న్యాసంబు = న్యాసము; చేసి = చేసి; మంత్రమూర్తి = మంత్రమూర్తిగ; ఐ = అయ్యి; భగవత్ = భగవంతుడు యనెడి; శబ్ద = పలుకుచే; వాచ్యంబు = పలుకబడునది; ఐన = అయిన; ప్రణవ = ఓంకారము; ఆది = ముందుకలిగి; అకారాంత = అకారము అంతముగా కలిగిన; మహా = గొప్ప; మంత్రంబు = మంత్రము; చేతన్ = చేత; అంగుళ్య = చేతి వేళ్ళు; అంగుష్ట = బొటకనవేలు; పర్వ = విస్తరించిన; సంధుల = సంధుల; అందు = అందు; ఉపన్యసించి = చక్కగా న్యాసముచేసి; మఱియు = ఇంకను; హృదయంబునన్ = హృదయము నందు; ఓంకారంబు = ఓంకారము; వికారంబు = వికారము; మూర్దంబునన్ = శిరస్సు నందు; షకారంబు = షకారము; భ్రూమధ్యంబున్ = భృకుటి; అందు = అందు; ణకారంబు = ణకారము; శిఖ = పిలకప్రాంతము; అందు = అందు; వేకారంబు = వేకారము; నేత్రంబులు = కన్నులు; అందు = అందు; నకారంబు = నకారము; సర్వ = అన్ని; సంధుల = శరీరసంధుల; అందు = అందు; మఱియున్ = ఇంకను; అస్త్రమున్ = అస్త్రమును; ఉద్దేశించి = ఉద్దేశించి; మకారంబును = మకారము; ఉపన్యసించెనేని = పలికినట్లయితే; మంత్రమూర్తి = మంత్రమూర్తిగ; అగు = అగును; మఱియును = ఇంకను; అస్త్రాయఫట్ = అస్త్రాయఫట్; అను = అనెడి; మంత్రంబునన్ = మంత్రముచేత; దిగ్బంధనంబు = దిగ్బంధనము; చేసి = చేసి; పరమేశ్వరుని = భగవంతుని; తన = తన యొక్క; భావంబునన్ = భావములో; నిల్పి = నిలుపుకొని; విద్యా = విద్య యొక్క; మూర్తియున్ = స్వరూపమును; తపస్ = తపస్సు యొక్క; మూర్తియున్ = స్వరూపమును; అగు = అయిన; షట్చక్తి = ఆరుశక్తులతో; సంయుతంబు = కూడినది; అయిన = అయిన; నారాయణకవచ = నారాయణకవచము; ఆఖ్యము = అనెడి పేరు గలది; ఐన = అయిన; మంత్ర = మంత్రములలో; రాజంబున్ = శ్రేష్ఠమైన దానిని; ఇట్లు = ఈ విధముగ; అని = అని; పఠియించె = చదివెను.
భావము:- ఈ విధంగా నారాయణ కవచాన్ని అనుసంధానం చేసుకొని ‘ఓం నమో నారాయణాయ’ అనే ప్రణవ పూర్వకమైన అష్టాక్షరీ మంత్రంలోని ఎనిమిది అక్షరాలను పాదాలు, మోకాళ్ళు, తొడలు, కడుపు, హృదయం, వక్షఃస్థలం, ముఖం, శిరస్సు అనే అష్టాంగాలలో విన్యాసం చేయాలి. తరువాత ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ద్వాదశాక్షరీ మంత్రంతో కరన్యాసం చేయాలి. ఈ విధంగా అంగన్యాస కరన్యాసాలు చేసి సాధకుడు మంత్రమూర్తియై వెలుగొందిన తర్వాత ‘ఓం విష్ణవే నమః’ అనే మంత్రాన్ని గ్రహించి, హృదయంలో ‘ఓం’కారాన్ని, శిరస్సున ‘వి’కారాన్ని, కనుబొమల నడుమ ‘ష’కారాన్ని, శిఖయందు ‘ణ’కారాన్ని, నేత్రాలలో ‘వే’కారాన్ని, మిగిలిన శరీర సంధి ప్రదేశాలలో ‘న’కారాన్ని, అస్త్రముద్రతో ‘మ’కారాన్ని విన్యాసం చేసి ‘అస్త్రాయ ఫట్’ అనే మంత్రంతో దిగ్బంధనం చేసి భగవంతుణ్ణి మనస్సులో ధ్యానిస్తే విద్యామూర్తిగా, తపోమూర్తిగా రూపొందుతాడు. షట్చక్రాలతో కూడిన ‘నారాయణ కవచం’ అనే మంత్రాన్ని ఈ విధంగా పఠించాలి.

తెభా-6-300-చ.
రుడుని మూఁపుపై బదయుగంబు ఘటిల్లఁగ శంఖచక్ర చ
ర్మ రుచిర శార్ఙ్గ ఖడ్గ శర రాజితపాశ గదాది సాధనో
త్క నికరంబు లాత్మకరకంజములన్ ధరియించి భూతి సం
రిత మహాష్టబాహుఁడు కృపామతితో ననుఁ గాచుఁ గావుతన్.

టీక:- గరుడుని = గరుత్మంతుని; మూపు = వీపు; పైన్ = మీద; పద = పాదముల; యుగంబున్ = రెంటిని; ఘటిల్లగ = ఉండగ; శంఖ = శంఖము; చక్ర = చక్రము; చర్మ = చర్మము; రుచిర = ప్రకాశవంతమైన; శార్ఙ్గ = విల్లు; ఖడ్గ = కత్తి; శర = బాణము; రాజిత = విలసిల్లెడి; పాశ = పాశము; గద = గద; ఆది = మొదలగు; సాధన = ఆయుధ; ఉత్కర = సంపత్తుల; నికరంబులు = సమూహములు; ఆత్మ = తన యొక్క; కర = చేతు లనెడి; కంజములన్ = పద్మము లందు; ధరియించి = ధరించి; భూతి = అష్టైశ్వర్యములు; సంభరిత = అలంకరింపబడిన; మహా = గొప్ప; అష్ట = ఎనిమిది (8); బాహుడు = భుజములు గలవాడు; కృపామతి = దయ గల మనసు; తోన్ = తోటి; నను = నన్ను; కాచుగావుత = కాపాడుగాక.
భావము:- గరుత్మంతుని భుజాలపై రెండు పాదల నుంచి కూర్చున్నవాడు, తన ఎనిమిది చేతుల్లో శంఖం, చక్రం, కవచం, ధనుస్సు, ఖడ్గం, బాణం, పాశం, గద అనే ఆయుధాలు ధరించినవాడు అయిన భగవంతుడు దయతో నన్ను కాపాడుగాక!

తెభా-6-301-ఆ.
ప్రకట మకర వరుణ పాశంబు లందును
ములందు నెందుఁ బొలియ కుండఁ
గాచుఁగాక నన్ను నుఁడొక్కఁ డై నట్టి
త్స్యమూర్తి విద్యమానకీర్తి.

టీక:- ప్రకట = ప్రసిద్ధమైన; మకర = మొసలి; వరుణ = వర్షపు; పాశంబులు = బంధనములు; అందు = అందు; జలములు = నీటి; అందు = అందును; ఎందున్ = దేనిలోను; పొలియకుండన్ = నాశము పొందకుండగ; కాచుగాక = కాపాడుగాక; నన్ను = నన్ను; ఘనుడు = గొప్పవాడు; ఒక్కడు = ఒకడే; ఐనట్టి = అయినట్టి; మత్స్యమూర్తి = మత్స్యవతార స్వరూపుడు; విద్యమాన = ప్రవర్తిస్తున్న; కీర్తి = యశస్సు గలవాడు.
భావము:- ప్రళయకాలంలో తానొక్కడే మిగిలి కీర్తితో ప్రకాశించే మత్స్యావతార మూర్తి అయిన మహానుభావుడు నన్ను వరుణ పాశాలలో పడకుండా జలాలలో రక్షించునుగాక!

తెభా-6-302-క.
టుఁడు సమాశ్రిత మాయా
టుఁడు బలిప్రబల శోభప్రతిఘటనో
ద్భటుడు త్రివిక్రమదేవుఁడు
టులస్థలమందు నన్ను సంరక్షించున్.

టీక:- వటుడు = బ్రహ్మచారి; సమాశ్రిత = చక్కగా ఆశ్రయించిన; మాయా = మాయా; నటుడు = నటనలు చేసెడి వాడు; బలి = బలిచక్రవర్తి; ప్రబల = అత్యధికమైన; శోభన = తేజస్సును; ప్రతిఘటన = ప్రతిఘటించుట యందు; ఉద్భటుడు = బహు గట్టివాడు, మిక్కిలి సమర్థుడు; త్రివిక్రమదేవుడు = వామనుడు {త్రివిక్రమదేవుడు - త్రివిక్రమావతారము ధరించిన దేవుడు, వామనుడు}; చటుల = భయంకరమైన; స్థలము = ప్రదేశముల; అందు = లో; నన్ను = నన్ను; సంరక్షించున్ = కాపాడుగాక.
భావము:- మాయావటుడై నటించి బలి చక్రవర్తి సంపదను అపహరించిన త్రివిక్రమ దేవుడు నన్ను అన్ని భయంకర స్థలాలలో రక్షించునుగాక!

తెభా-6-303-చ.
వుల సంకటస్థలుల నాజిముఖంబుల నగ్ని కీలలం
దెరుల నెల్ల నాకు నుతి కెక్కఁగ దిక్కగుఁగాక శ్రీనృసిం
హుఁడు సురశత్రుయూధప వధోగ్రుడు విస్ఫురి తాట్టహాస వ
క్త్రుఁడు ఘన దంష్ట్ర పావక విధూత దిగంతరుఁ డప్రమేయుఁడై.

టీక:- అడవుల = అడవు లందు; సంకట = ఆపదలు కలిగెడి; స్థలులన్ = స్థలము లందు; ఆజి = యుద్ధపు; ముఖంబునన్ = ఎదురుగ; అగ్నికీలలన్ = నిప్పు మంటలలో; ఎడరులన్ = ఎడారు లందు; ఎల్లన్ = అన్నిచోట్లను; నా = నా; కు = కు; నుతికి = ప్రసిద్ధము; ఎక్కగన్ = అగునట్లు; దిక్కు = రక్షగ; అగుగాక = ఉండుగాక; శ్రీనృసింహుఁడు = నరసింహస్వామి; సురశత్రు = రాక్షసులనెడి {సురశత్రులు - సురల(దేవతల)కు శత్రులు, రాక్షసులు}; యూధప = ఏనుగులను; వధ = సంహరించెడి; ఉగ్రుడు = కోపము గలవాడు; విస్ఫురిత = వెలిగ్రక్కుచున్న; అట్టహాస = వికృతహాసము గల; వక్త్రుడు = నోరు గలవాడు; ఘన = పెద్ద; దంష్ట్ర = దంతముల నుండి జనించిన; పావక = అగ్నిహోత్రునిచే; విధూత = ఎగురకొట్టబడిన; దిగంతరుండు = దిగంతములు గలవాడు; అప్రమేయుండు = పరిమితుల కందని వాడు; ఐ = అయ్యి.
భావము:- దేవతల శత్రువులైన రాక్షసులను సంహరించడంలో ఉగ్రత్వం చూపేవాడు, అత్యంత భయంకరమైన అట్టహాసంతో కూడిన ముఖం కలవాడు, తన కోరల నుండి బయల్వెడలిన అగ్ని జ్వాలలచేత దిగంతాలను చెదరగొట్టినవాడు, ఊహించడానికి శక్యం కాని మహిమ కలవాడు అయిన నృసింహదేవుడు అడవులలోను, ప్రమాద స్థలాలలోను, యుద్ధభూమిలోను, నిప్పుల మంటలలోను, అన్ని ప్రమాదాలలోను నాకు దిక్కగును గాక!

తెభా-6-304-చ.
యఁగ నెల్ల లోకములు నంకిలి నొంద మహార్ణవంబులో
నొరిగి నిమగ్న మైన ధర నుద్ధతిఁ గొమ్మున నెత్తినట్టి యా
కిరిపతి యగ్ని కల్పుఁ డురుఖేలుఁడు నూర్జిత మేదినీ మనో
రుఁడు గృపావిధేయుఁడు సదాధ్వములన్ననుఁ గాచుఁగావుతన్.

టీక:- అరయగన్ = చూడగా; ఎల్ల = సమస్తమైన; లోకములున్ = లోకములు; అంకిలి = కలత, ఆపద; ఒందన్ = బారగా, పొందగా; మహార్ణవంబు = మహాసముద్రము; లోన్ = లోపల; ఒరిగి = ఒరిగిపోయి; నిమగ్నము = మునిగి ఉన్నది; ఐన = అయిన; ధరన్ = భూమిని; ఉద్ధతిన్ = ఉద్దరించుటకు; కొమ్మునన్ = కోరలపై; ఎత్తిన = ధరించిన; అట్టి = అటువంటి; ఆ = ఆ; కిరిపతి = యజ్ఞవరాహుడు {కిరిపతి - కిరి (వరాహము) పతి (ప్రభువు), వరాహావతారుడు}; అగ్నికల్పుడు = అగ్నికల్పుడు; ఉరు = గొప్పగ; ఖేలుడు = క్రీడించువాడు; ఊర్జిత = గొప్పది అయిన, దృఢమైన; మేదినీ = భూదేవికి; మనోహరుడు = ప్రియుడు; కృప = దయకు; విధేయుడు = లొంగిపోవువాడు; సదా = ఎల్లప్పుడు; అధ్వములన్ = దారుల యందు; నన్ను = నన్ను; కాచుగావుత = కాపాడుగాక.
భావము:- లోకాలన్నీ మహాసముద్రం మధ్య మునిగినప్పుడు భూదేవిని ఉద్ధరించి తన కోర కొనపై ధరించిన అగ్నిసమానుడు, క్రీడావినోది, ధరణీమనోహరుడు, కారుణ్యనిధి అయిన ఆది వరాహమూర్తి నన్ను ఎల్లప్పుడు సకల దారులందు కాపాడునుగాక!

తెభా-6-305-క.
రాముఁడు రాజకులైక వి
రాముఁడు భృగు సత్కులాభిరాముఁడు సుగుణ
స్తోముఁడు నను రక్షించును
శ్రీహితోన్నతుఁడు నద్రి శిఖరములందున్.

టీక:- రాముడు = పరశురాముడు; రాజకులైకవిరాముఁడు = పరశురాముడు {రాజ కులైక విరాముఁడు - రాజ (రాజుల) కుల (వంశమునకు) ఏక (సమస్తమును) విరాముడు (తొలగించువాడు), పరశురాముడు}; భృగుసత్కులాభిరాముఁడు = పరశురాముడు {భృగు సత్కు లాభిరాముఁడు - భృగు యొక్క సత్కుల (చక్కటి వంశమునకు) అభిరాముడు (మనోహరమైనవాడు), పరశురాముడు}; సుగుణస్తోముఁడు = పరశురాముడు {సుగుణ స్తోముడు - సుగుణముల సమూహము గలవాడు, పరశురాముడు}; నను = నన్ను; రక్షించును = కాపాడుగాక; శ్రీమహితోన్నతుఁడు = పరశురాముడు {శ్రీమహితోన్నతుడు - శ్రీ (శుభకరమైన) మహిత (గొప్ప) ఉన్నతుడు (ఉన్నతమైనవాడు), పరశురాముడు}; అద్రి = కొండ; శిఖరముల = శిఖరముల; అందున్ = అందు.
భావము:- క్షత్రియకుల వినాశకుడు, భృగువంశంలో ప్రసిద్ధుడు, సద్గుణుడు. గొప్ప మహిమాన్వితుడు అయిన పరశురాముడు పర్వత శిఖరాలలో నన్ను కాపాడుగాక!

తెభా-6-306-సీ.
తాటక మర్దించి పసి జన్నముఁ గాచి-
రువిల్లు విఱిచి ధైర్యమున మెఱసి
ప్రబలు లైనట్టి విరాధ కబంధోగ్ర-
రదూషణాది రాక్షసులఁ దునిమి
వానరవిభు నేలి వాలిఁ గూలఁగ నేసి-
లరాశి గర్వంబుఁ క్కజేసి
సేతువు బంధించి చేరి రావణ కుంభ-
ర్ణాది వీరులఁ డిమిఁ ద్రుంచి

తెభా-6-306.1-తే.
ల విభీషణు లంకకు ధిపుఁ జేసి
భూమిసుతఁ గూడి సాకేత పురము నందు
రాజ్యసుఖములు గైకొన్న రామవిభుఁడు
రుస ననుఁ బ్రోచుచుండుఁ బ్రవాసగతుల.

టీక:- తాటక = తాటకిని; మర్దించి = సంహరించి; తపసి = ఋషి యొక్క; జన్నము = యజ్ఞమును; కాచి = కాపాడి; హరు = శివుని; విల్లు = విల్లును; విఱిచి = విరిచి; ధైర్యమునన్ = ధైర్యముతో; మెఱసి = ప్రకాశించుతూ; ప్రబలులు = మిక్కిలి బలమైనవారు; ఐనట్టి = అయినటువంటి; విరాధ = విరధుడు; కబంధ = కబంధుడు; ఉగ్ర = భయంకరమైన; ఖర = ఖరుడు; దూషణ = దూషణుడు; ఆది = మొదలగు; రాక్షసులన్ = రాక్షసుల; దునిమి = సంహరించి; వానరవిభున్ = సుగ్రీవుని; ఏలి = పాలించి; వాలిన్ = వాలిని; కూలగ = సంహరించుటకు; ఏసి = బాణమువేసి; జలరాశి = సముద్రుని యొక్క; గర్వమున్ = గర్వమును; చక్కజేసి = అణచివేసి; సేతువు = సేతువును; బంధించి = కట్టి; చేరి = పూని; రావణ = రావణుడు; కుంభకర్ణ = కుంభకర్ణుడు; ఆది = మొదలగు; వీరులన్ = వీరులను; కడిమిన్ = పరాక్రమముతో; త్రుంచి = సంహరించి;
అల = ఆయొక్క; విభీషణున్ = విభీషణుని; లంక = లంకారాజ్యమున; కున్ = కు; అధిపున్ = రాజును; చేసి = చేసి; భూమిసుతన్ = సీతాదేవితో {భూమిసుత - భూదేవి యొక్క పుత్రిక, సీత}; కూడి = కలిసి; సాకేత = సాకేతము యనెడి; పురము = పట్టణము; అందు = లో; రాజ్యసుఖములు = రాజభోగములను; కైకొన్న = స్వీకరించిన; రామవిభుడు = శ్రీరామచంద్రుడు; వరుస = క్రమముగా; నను = నన్ను; ప్రోచుచుండు = కాపాడుతుండును; ప్రవాస = దూర ప్రాంతములకు; గతులన్ = పోవునపుడు.
భావము:- తాటకిని సంహరించి, విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడి, శివుని విల్లు విరిచి, ధైర్యవంతుడై బలాఢ్యులైన విరాధుడు, కబంధుడు, ఖరుడు, దూషణుడు మొదలైన రాక్షసులను చంపి, సుగ్రీవుని చేరదీసి, వాలిని నేలకూల్చి, సముద్రుని గర్వాన్ని అణచి, సేతువును బంధించి, రావణుడు కుంభకర్ణుడు మొదలైన రాక్షస వీరులను సంహరించి, విభీషణుని లంకకు రాజును చేసి, సీతతో కూడి అయోధ్యకు వచ్చి, సుఖంగా రాజ్యాన్ని పరిపాలించిన రాముడు దూరదేశాలలో నన్ను రక్షించును గాక!

తెభా-6-307-వ.
మఱియు; నఖిల ప్రమాదంబు లైన యభిచార కర్మంబుల వలన నారాయణుండును, గర్వంబు వలన నరుండును, యోగభ్రంశంబువలన యోగనాథుఁ డయిన దత్తాత్రేయుండును, గర్మబంధంబులవలన గణేశుం డైన కపిలుండును, గామదేవునివలన సనత్కుమారుండును, మార్గంబుల దేవహేళనంబు చేయుటవలన శ్రీహయగ్రీవమూర్తి యును, దేవతానమస్కార తిరస్కార దేవపూజా చ్ఛిద్రంబులవలన నారదుండును, నశేష నిరయంబులవలనఁ గూర్మంబును, నపథ్యంబు వలన భగవంతుం డైన ధన్వంతరియును, ద్వంద్వంబువలన నిర్జితాత్ముం డయిన ఋషభుండును, జనాపవాదంబువలన నగ్నిదేవుండును, జనన మరణాదులం గలుగఁ జేయు కర్మంబులవలన బలభద్రుండును, గాలంబువలన యముండును, సర్పగణంబులవలన శేషుండును, నప్రబోధంబువలన ద్వైపాయనుండును, బాషాండ సమూహంబువలన బుద్ధదేవుండును, శనైశ్చరునివలనఁ గల్కియునై, ధర్మరక్షణపరుం డయిన మహావతారుండు నన్ను రక్షించుంగాత; ప్రాత స్సంగమ ప్రాహ్ణ మధ్యాహ్నాపరాహ్ణ సాయంకాలంబులను ప్రదోషార్ధరాత్రాపరాత్ర ప్రత్యూషానుసంధ్యలను గదాద్యాయుధంబుల ధరియించి, కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసంహార, త్రివిక్రమ, వామన, హృషికేశ, పద్మనాభ, శ్రీవత్సధామ, సర్వేశ్వరేశ, జనార్దన, విశ్వేశ్వర, కాలమూర్తు లను నామ రూపంబులు గల దేవుండు నన్ను రక్షించుంగాక; ప్రళయకాలాన లాతితీక్ష్ణ సంభ్రమ భ్రమణ నిర్వక్రవిక్రమ వక్రీకృత దనుజచక్రం బైన సుదర్శన నామ చక్రంబ! మహావాయు ప్రేరితుండై హుతాశనుండు నీరస తృణాటవుల భస్మీభూతంబు చేయు భంగి, భగవత్ప్రయుక్తంబవై మద్వైరి సైన్యంబుల దగ్ధంబు గావింపుము; జగత్సంహారకాల పటు ఘటిత చటుల మహోత్పాత గర్జారవ తర్జన దశదిశాభి వర్జిత ఘనఘనాంతర నిష్ఠ్యూత నిష్ఠురకోటి శతకోటిసం స్పర్శ స్ఫుర ద్విస్ఫులింగ నిర్గమనానర్గళ భుగ భుగాయమాన మూర్తి విస్ఫూర్తి! నారాయణకరకమలవర్తి! గదాయుధోత్తమ! మదీయవైరి దండోపదండంబుల భండనంబునం జండ గతిం బిండిపిండిగాఁ గూశ్మాండ వైనాయక రక్షో భూత గ్రహంబులు చూర్ణంబులుగాఁ గొండొక వినోదంబు సలుపుము; ధరేంద్రంబ వైన పాంచజన్యంబ! సర్వలోక జిష్ణుండైన శ్రీకృష్ణునిఁ నిఖిల పుణ్యైక సదన వదన నిష్ఠ్యూత నిశ్శ్వాసాధర వేణు పూరితంబవై యున్మత్త భూత, ప్రేత, పిశాచ, విప్ర గ్రహాది క్రూర దుర్గ్రహంబులు విద్రావణంబులుగా, నస్మ త్పరవీరమండ లంబుల గుండియలతోఁ దదీయమానినీ దుర్భర గర్భంబులు గర్భస్థార్భక వివర్జితంబులుగా నవియ, బ్రహ్మాండభాండ భీకరంబయిన భూరి నాదంబున మోదింపు; మతి తీవ్రధారా దళిత నిశాతకోటి కఠోర కంఠ కరాళ రక్తధారా ధౌత మలీమస విసరంబవయిన నందక మహాసి శేఖరంబ! జగదీశ ప్రేరితంబవై మద్విద్వేషి విషమ వ్యూహంబుల మెండు ఖండములుగ ఖడించి చెండాడుము; నిష్కళంక నిరాంతక సాంద్ర చంద్రమండల పరిమండిత సర్వాంగ లక్షణ విచక్షణ ధర్మనిరతం బవయిన చర్మంబ! దుర్మద మద్వైరిలోకంబులకు భీకరాలోకంబులను సమాకుల నిబిడ నిరీంద్ర నిష్ఠుర తమః పటల పటు ఘటనంబులం గుటిల పఱుపుము; నిఖిల పాపగ్రహంబుల వలనను సకల నర మృగ సర్ప క్రోడ భూతాదులవలనను నగు భయంబులు పొందకుండ భగవన్నామ రూప యాన దివ్యాస్త్రంబుల రక్షించుం గాక; బృహద్రథంతరాది సామంబులచేత స్తోత్రంబు చేయం బడుచున్న ఖగేంద్రుండు రక్షణ దక్షుండై నన్ను రక్షించుఁగాక; శ్రీహరి నామ రూప వాహన దివ్యాయుధ పారిషదోత్తమ ప్రముఖంబు లస్మదీయ బుద్ధీంద్రియ మనఃప్రాణంబుల సంరక్షించు; భగవంతుండయిన శేషుండు సర్వోపద్రవంబుల నాశంబు చేయు; జగ దైక్యభావంబయిన ధ్యానంబు గలవానికి వికల్పరహితుండై, భూషణాయుధ లింగాఖ్యలగు శక్తులం దన మాయ చేత ధరియించి తేజరిల్లు చుండు లక్ష్మీకాంతుండు వికల్ప విగ్రహంబులవలన నన్ను రక్షించుఁగాక; లోకభయంకరాట్టహాస భాసుర వదనగహ్వరుం డగుచు, సమస్త తేజోహరణ ధురీణ తేజః పుంజ సంజాత దివ్య నృసింహావతారుం డగు నప్పరమేశ్వరుండు సర్వ దిగ్భాగంబు వలన, సమస్త బహిరంతరంబుల వలన నన్ను రక్షించుచుండుఁ గాత"మని నారాయణాత్మక కవచ ప్రభావం బితిహాస రూపంబున నింద్రుండు దెలిసికొని, ధ్యానంబు చేసి, తద్విద్యాధారణ మహిమవలన నరాతుల నిర్జించెం; గావున నెవ్వరేని నిర్మలాత్ము లగు వార లే తద్విద్యా ధారణులై యనుదినంబును బఠియించిన; నతి ఘోర రణంబుల నత్యుత్కట సంకటంబులను, సర్వ గ్రహ నిగ్రహ కర్మ మారణకర్మాది దుష్కర్మ జన్య క్లేశంబులను వదలి, యవ్యాకుల మనస్కులై, విజయంబు నొందుదురు; మఱియును, సర్వ రోగంబులకు నగమ్యశరీరులై సుఖంబు నొందుదు; రదియునుం గాక.
టీక:- మఱియున్ = ఇంకను; అఖిల = సర్వ; ప్రమాదంబులు = ప్రమాదకరములు; ఐన = అయిన; అభిచారకర్మంబుల = చేతబడుల {అభిచారము - హింసార్థమైన మంత్ర తంత్ర రూపక కర్మము, పంపు, చేతబడి}; వలన = వలన; నారాయణుండును = నారాయణుడు; గర్వంబు = గర్వము; వలన = నుండి; నరుండును = నరుడు; యోగ = యోగాభ్యాసమునుండి; భ్రంశంబు = పతన మగుట; వలన = నుండి; యోగనాథుడు = సకల యోగములకు ప్రభువు; అయిన = ఐన; దత్తాత్రేయుండును = దత్తాత్రేయుడు; కర్మబంధంబుల = కర్మబంధముల; వలన = నుండి; గణేశుండు = గణాధిపతి; ఐన = అయిన; కపిలుండును = కపిలుడు; కామదేవుని = మన్మథుని; వలన = నుండి; సనత్కుమారుండు = సనత్కుమారుడు; మార్గంబులన్ = దారులమ్మట; దేవ = దేవతలను; హేళనంబు = అవమానించుటలు; వలన = నుండి; శ్రీహయగ్రీవమూర్తి = హయగ్రీవుడు; దేవతా = దేవతలను; నమస్కార = నమస్కరించుటను; తిరస్కార = చేయకపోవుట; దేవ = దేవుని; పూజ = పూజలను; ఛిద్రంబుల = లోపముల; వలన = నుండి; నారదుండును = నారదుడు; అశేష = అంతులేని; నిరయంబు = నరకముల; వలన = నుండి; కూర్మంబును = కూర్మావతారుడు; అపథ్యంబు = తినరానిది తినుట; వలన = నుండి; భగవంతుండు = భగవంతుడు; ఐన = అయిన; ధన్వంతరియును = ధన్వంతరి; ద్వంద్వంబు = డోలాయమాన స్థితుల; వలన = నుండి; నిర్జిత = జయింపబడిన; ఆత్ముండు = ఆత్మ గలవాడు; అయిన = ఐన; ఋషభుండును = ఋషభుడు; జన = లోకులచే; అపవాదంబు = నిందల; వలన = నుండి; అగ్నిదేవుండును = అగ్నిదేవుడు; జననమరణాదులు = పునర్జన్మ నొందుట; కలుగజేయు = కలిగించెడి; కర్మంబుల = కార్యముల; వలన = నుండి; బలభద్రుండును = బలభద్రుడు; కాలంబు = కాలప్రభావముల; వలన = నుండి; యముండును = యముడు; సర్ప = పాముల; గణంబుల = సమూహముల; వలన = నుండి; శేషుండును = ఆదిశేషుడు; అప్రబోధంబు = అజ్ఞాన జనితముల; వలన = నుండి; ద్వైపాయనుండును = కృష్ణద్వైపాయనుడు; పాషాండ = వేదవిద్యేతరుల; సమూహంబు = సమూహముల; వలన = నుండి; బుద్ధదేవుండును = బుద్ధదేవుడు; శనైశ్చరుని = శనీశ్వరుని; వలన = నుండి; కల్కియున్ = కల్కి; ఐ = అయ్యి; ధర్మ = ధర్మమును; రక్షణ = రక్షించుట యందు; పరుండు = లగ్నమైనవాడు; అయిన = ఐన; మహావతారుండు = గొప్ప అవతారములు దాల్చెడి వాడు; నన్ను = నన్ను; రక్షించుగాత = రక్షించుగాక; ప్రాతః = ఉదయము {ప్రాత స్సంగమము – పొద్దు పొడుచుటకు ముందు మూడుగడియల కాలము, ఉదయసంధ్య}; సంగమ = పగటి సంధ్యల; ప్రాహ్ణము = లేబగలు {ప్రాహ్ణము - ఉదయము మొదలు పదిగడియలు వరకు గల కాలము, లేబగలు}; మధ్యాహ్న = మధ్యాహ్నము; అపరాహ్ణ = మిట్టమధ్యాహ్నము; సాయంకాలంబులను = సాయంకాలము; ప్రదోష = మునిమాపువేళ; అర్థరాత్రి = అర్థరాత్రి; అపరాత్రి = అపరాత్రి; ప్రత్యూష = ప్రభాతము; అనుసంధ్యలను = ఉదయ సాయం సంధ్య లందు {అనుసంధ్యలు - 1.పొద్దుపొడుచుటకు ముందు మూడుగడియల కాలము (ఉదయ సంధ్య) 2.పొద్దుకుంగిన తరువాత మూడు గడియల కాలము (సాయం సంధ్య)}; గద = గద; ఆది = మొదలగు; ఆయుధంబులు = ఆయుధములను; ధరియించి = ధరించి; కేశవ = కేశవుడు; నారాయణ = నారాయణుడు; గోవింద = గోవిందుడు; విష్ణు = విష్ణువు; మధుసంహార = మధుసంహారుడు; త్రివిక్రమ = త్రివిక్రముడు; వామన = వామనుడు; హృషికేశ = హృషికేశుడు; పద్మనాభ = పద్మనాభుడు; శ్రీవత్సధామ = శ్రీవత్సధాముడు; సర్వేశ్వరేశ = సర్వేశ్వరేశుడు; జనార్దన = జనార్దనుడు; విశ్వేశ్వర = విశ్వేశ్వరుడు; కాలమూర్తులు = కాలమూర్తులు; అను = అనెడి; నామ = పేర్లు; రూపంబులు = రూపములు; కల = కలిగిన; దేవుండు = భగవంతుడు; నన్ను = నన్ను; రక్షించుగాక = కాపాడుగాక; ప్రళయకాల = ప్రళయకాలము నందలి; అనల = అగ్నివలె; అతి = మిక్కిల; తీక్ష్ణ = తీక్షణమైన; సంభ్రమ = అతివేగముగ; భ్రమణ = గిరగిరతిరుగు చున్న; నిర్వక్రమ = ఎదురులేని; విక్రమ = పరాక్రమము గల; వక్రీకృత = వంచబడిన; దనుజ = రాక్షసుల; చక్రంబు = గుంపులు గలది; ఐన = అయిన; సుదర్శన = సుదర్శనము అనెడి {విష్ణుమూర్తి సాధనములు - 1చక్రము (సుదర్శనము) 2గద (కౌముదకి) 3శంఖము (పాంచజన్యము) 4ఖడ్గము (నందకము) 5చర్మము (డాలు) (శతచంద్రము) 6విల్లు (శార్ఙ్గము)}; నామ = పేరు గల; చక్రంబ = (విష్ణు) చక్రమా; మహా = గొప్ప; వాయు = వాయువులచే; ప్రేరితుండు = ప్రేరేపింపబడినవాడు; ఐ = అయ్యి; హుతాశనుండు = అగ్నిదేవుడు; నీరస = బలహీనమైన; తృణ = గడ్డిపరకల; అడవులన్ = అడవులను; భస్మీభూతంబున్ = కాలిపోయినవిగా; చేయు = చేసెడి; భంగిన్ = వలె; భగవత్ = విష్ణుమూర్తిచే; ప్రయుక్తంబవు = ప్రయోగింపబడిన దానవు; ఐ = అయ్యి; మత్ = నా యొక్క; వైరి = శత్రువుల; సైన్యంబులన్ = సైన్యములను; దగ్ధంబు = కాల్చివేయుట; కావింపుము = చేయుము; జగత్ = భువనముల; సంహార = విలయ; కాల = సమయ మందలి; పటు = తీవ్రముగ; ఘటిత = కలుగజేయబడెడి; చటుల = భయంకరమైన; మహా = గొప్ప; ఉత్పాత = ఆపదల; గర్జ = గర్జించెడి; రవ = శబ్దములతో; తర్జనన్ = బెదిరింపులతో; దశదిశ = పదిదిక్కులను {దశదిశలు - 1తూర్పు 2ఆగ్నేయము 3దక్షిణము 4నైరృతి 5పడమర 6వాయవ్యము 7ఉత్తరము 8ఈశాన్యము 9పైన 10కింద అనెడి 10 దిక్కులు}; అభివర్జిత = మిక్కిలి విడువబడిన; ఘన = గొప్పగొప్ప; ఘన = మేఘముల; అంతర = లోని; నిష్ఠ్యూత = వెడలగ్రక్కబడిన; నిష్ఠుర = కఠినమైన; కోటి = అనేకమైన; శతకోటి = వజ్రాయుధములు; సంస్పర్శ = తగిలినట్లు; స్ఫురత్ = అనిపించెడి; విస్ఫులింగ = అగ్నికణములు; నిర్గమ = వెలువడుటచే; అనర్గళ = ఎడతెగని; భుగభుగాయమాన = భుగభుగ మనెడి; మూర్తి = స్వరూపము యొక్క; విస్ఫూర్తి = ప్రకాశము; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; కర = చేతులు యనెడి; కమల = పద్మము లందు; వర్తి = ప్రవర్తించెడి; గదాయుధ = గదాయుధములలో; ఉత్తమ = ఉత్తమమా; మదీయ = నా యొక్క; వైరి = శత్రువుల; తండ = గుంపులు; ఉపతండంబులన్ = ఉపగుంపులను; భండనంబునన్ = యుద్ధములో; చండ = భయంకరమైన; గతిన్ = విధముగ; పిండిపిండిగాన్ = పిండిపిండిగా నగునట్లు; కూశ్మాండ = కూష్మాండములు {కూశ్మాండములు - పిశాచబేధము, కూష్మాండములు}; వైనాయక = వైనాయక; రక్షః = రాక్షసులు; భూత = భూతములు {భూతములు - పిశాచబేధము}; గ్రహంబులు = గ్రహములు {గ్రహములు - పట్టెడివి, పిశాచబేధము}; చూర్ణంబులు = పిండి; కాన్ = అగునట్లు; కొండొక = ఒక విధమైన; వినోదంబున్ = వినోదమును; సలుపుము = చేయుము; దర = శంఖములలో; ఇంద్రంబవు = శ్రేష్ఠమైనవానివి; ఐన = అయిన; పాంచజన్యంబ = పాంచజన్యమ; సర్వలోకజిష్ణుండు = నారాయణుడు {సర్వ లోక జిష్ణుడు - సర్వ (అఖిలమైన) లోక (భువనములను) జిష్ణుండు (జయించెడి శీలము గలవాడు), విష్ణువు}; ఐన = అయిన; శ్రీకృష్ణుని = శ్రీకృష్ణుని; నిఖిల = సమస్తమైన; పుణ్య = పుణ్యములకు; ఏక = ఏకైక; సదన = నివాసమైన; వదన = ముఖమునుండి; నిష్ఠ్యూత = వెలువడెడి; నిశ్శ్సాస = నిశ్వాసముతో; అధర = పెదవు లనెడి; వేణు = వేణువులచే; పూరితంబవు = ఊదబడెడిదానివి; ఐ = అయ్యి; ఉన్మత్త = వెఱ్రెత్తినట్టి; భూత = భూతములు {భూతములు - పిశాచబేధము}; ప్రేత = ప్రేతములు {ప్రేతములు - పిశాచబేధము}; పిశాచ = పిశాచములు {పిశాచములు - పిశాచబేధము}; విప్రగ్రహ = విప్రగ్రహములు {విప్రగ్రహములు - పిశాచబేధము}; ఆది = మొదలగు; క్రూర = క్రూరమైన; దుర్ = చెడ్డ; గ్రహంబులు = పిశాచములు {గ్రహములు - పట్టెడివి, పిశాచబేధము}; విద్రావణంబుల = పారిపోవునవి; కాన్ = అగునట్లు; అస్మత్ = నా యొక్క; పర = శత్రు; వీర = వీరుల; మండలంబులన్ = సమూహముల; గుండిల = గుండెల; తోన్ = తోపాటు; తదీయ = వారి యొక్క; మానినీ = స్త్రీల; దుర్భర = భరింపరాని; గర్భంబులు = కడుపులు; గర్భస్థ = కడుపులో నుండెడి; అర్భక = పిండములు; వివర్జితంబు = పోవునట్లు; కాన్ = అగునట్లు; అవియన్ = పగులునట్లు; బ్రహ్మాండభాండ = బ్రహ్మాండభాండమునకే {బ్రహ్మాండభాండము - సకల లోకములు కల బ్రహ్మాండాలు తనలో గల అతి పెద్దదైన అండ స్వరూప భాండము}; భీకరంబు = భయంకరమైనది; అయిన = ఐన; భూరి = అతిపెద్ద; నాదంబునన్ = శబ్దమును; మోదింపుము = గట్టిగా చేయుము; అతి = మిక్కిలి; తీవ్ర = తీవ్రమైన; దారా = పదునుచే; దళిత = చీల్చబడిన; నిశాత = రాక్షస; కోటి = సమూహముల; కంఠ = కంఠములనుండి; కరాళ = వెరపు పుట్టించెడి; రక్త = రక్తపు; ధారా = ధారలచే; ధౌత = తడిసి; మలీమస = మాసి; విసరంబవు = వేయబడినదానివి; అయిన = ఐన; నందక = నందకము యనెడి; మహా = గొప్ప; అసి = కత్తులలో; శేఖరంబ = శ్రేష్ఠమైనదానా; జగదీశ = విష్ణుమూర్తిచే; ప్రేరితంబవు = ప్రేరేపింపబడిన దానివి; ఐ = అయ్యి; మత్ = నా యొక్క; విద్వేష = శత్రువుల; విషమ = కఠినమైన; వ్యూహంబులన్ = సైనికవ్యూహములను; మెండు = అనేకమైన; ఖండములుగ = ముక్కలుగ; ఖండించి = చీల్చి; చెండాడుము = చెండాడుము; నిష్కళంక = మచ్చలేని; నిరాంతక = నాశములేని; సాంద్ర = చిక్కటి; చంద్రమండల = చంద్రబింబములచే; పరిమండిత = చక్కగ యలంకరింపబడిన; సర్వ = అఖిల; అంగ = విభాగముల; లక్షణ = లక్షణములతో; విచక్షణ = విశిష్టతలుగల; ధర్మ = ధర్మబద్ధమైన; నిరతంబవు = శాశ్వతమైనది; అయిన = అయినట్టి; చర్మంబ = కవచమా; దుర్ = చెడ్డ; మద = గర్వము గల; మత్ = నా యొక్క; వైరి = శత్రువుల; లోకంబులు = సమూహముల; కు = కు; భీకర = భయంకరమైన; ఆలోకంబులను = చూపులతో; సమ = మిక్కిలి; ఆకుల = చీకాకు పెట్టెడి; నిబిడ = దట్టమైన; నీరంధ్ర = చిక్కని; నిష్ఠుర = కఠినమైన; తమస్ = చీకటి; పటల = తెరల; పటు = గట్టి; ఘటనంబులన్ = కార్యములచే; కుటిల = వంచి; పఱుపుము = వేయుము; నిఖిల = సమస్తమైన; పాప = చెడ్డ; గ్రహంబులు = పిశాచములు; వలనను = మూలమున; సకల = సమస్తమైన; నర = మానవులు; మృగ = జంతువులు; సర్ప = పాములు; క్రోడ = అడవి పందులు; భూత = భూతములు; ఆదుల = మొలైనవాని; వలనను = మూలమున; అగు = అయిన; భయంబులు = భయములను; పొందకుండ = పొందకుండగ; భగవత్ = భగవంతుని; నామ = నామముల; రూప = రూపములు; యాన = వాహనములు; దివ్య = దివ్యమైన; అస్త్రంబులన్ = అస్త్రములచే; రక్షించుగాక = కాపాడుగాక; బృహత్ = బృహత్తులు; రథాంతర = రథాంతరములు; ఆది = మొదలైన; సామంబుల = సామవేదస్తోత్రముల; చేత = చేత; స్తోత్రంబు = స్తోత్రములు; చేయంబడుచున్న = చేయబడుతున్నట్టి; ఖగేంద్రుండు = గరుత్మంతుడు {ఖగేంద్రుడు - ఖగము (పక్షులలో) ఇంద్రుడు (ఇంద్రుని వంటివాడు), గరుత్మంతుడు}; రక్షణ = కాపాడెడి; దక్షుండు = సమర్థుడు; ఐ = అయ్యి; నన్ను = నన్ను; రక్షించుగాక = కాపాడుగాక; శ్రీహరి = విష్ణుమూర్తి యొక్క; నామ = నామములు; రూప = రూపములు; వాహన = వాహనములు; దివ్య = దివ్యమైన; ఆయుధ = ఆయుధములు; పారిషత్ = సేవకులలో; ఉత్తమ = శ్రేష్టులు; ప్రముఖంబులు = మొదలగు ముఖ్యులు; అస్మదీయ = నా యొక్క; బుద్ధీంద్రియ = మతి సమర్థత గల ఇంద్రియము {బుద్ధి - మతి (దీని లక్షణములు 1శుశ్రూష 2శ్రవణము 3గ్రహణము 4ధారణము 5ఊహము 6అపోహము 7అర్థవిజ్ఞానము 8తత్త్వజ్ఞానము)}; మనస్ = మనస్సు; ప్రాణంబులన్ = ప్రాణములను; సంరక్షించు = కాపాడెడి; భగవంతుండు = భగవంతుడు; అయిన = అయిన; శేషుండు = ఆదిశేషుడు; సర్వ = అఖిలమైన; ఉపద్రవంబులన్ = హానులను; నాశంబు = నాశనము; చేయు = చేసెడి; జగత్ = జగత్తంతటి; ఐక్యభావము = సంలీన బుద్ధితో; ధ్యానంబుగల = ధ్యానము కలిగిన; వాని = వాని; కి = కి; వికల్పరహితుండు = భ్రాతులు లేనివాడు; ఐ = అయ్యి; భూషణ = ఆభరణములు; ఆయుధ = ఆయుధములు; లింగ = సంకేతములు; ఆఖ్యలు = అనబడెడివి; అగు = అయిన; శక్తులన్ = శక్తులను; తన = తన యొక్క; మాయ = మాయ; చేత = వలన; ధరియించి = ధరించి; తేజరిల్లుచుండు = విలసిల్లెడి; లక్ష్మీకాంతుండు = విష్ణుమూర్తి {లక్ష్మీకాంతుడు - లక్ష్మీదేవి యొక్క కాంతుడు (భర్త), విష్ణువు}; వికల్ప = భ్రాంతుల; విగ్రహంబుల = కలహముల; వలన = నుండి; నన్ను = నన్ను; రక్షించుగాక = కాపాడుగాక; లోక = లోకములకు; భయంకర = భయంకరములైన; అట్టహాస = వికట హాసములచే; భాసుర = ప్రకాశించుతున్న; వదన = నోరు యనెడి; గహ్వరుండు = గుహ గలవాడు; అగుచు = అగుచు; సమస్త = సమస్తమైన; తేజస్ = తేజస్సులను; హరణ = నాశనము చేయగల; ధురీణ = మిక్కిలి నేర్పుగల; తేజస్ = తేజస్సుల; పుంజ = సమూహములను; సంజాత = పుట్టిన; దివ్య = దివ్యమైన; నృసింహ = నరసింహ; అవతారుండు = అవతారము దాల్చిన వాడు; అగు = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుండు = విష్ణుమూర్తి; సర్వ = అఖిలమైన; దిగ్భాగంబు = దిక్కుల; వలన = వలన; సమస్త = సమస్తమైన; బహిర్ = బయటి; అంతరంగంబుల = లోనివాని; వలన = వలన; నన్ను = నన్ను; రక్షించుచుండుగాతము = కాపాడుగాక; అని = అని; నారాయణ = విష్ణుని; ఆత్మక = స్వరూపమైన; కవచ = కవచము యొక్క; ప్రభావంబు = ప్రభావమును; ఇతిహాస = కథా; రూపంబునన్ = రూపములో; ఇంద్రుండు = ఇంద్రుడు; తెలిసికొని = తెలిసికొని; ధ్యానంబు = ధ్యానము; చేసి = చేసి; తత్ = ఆ; విద్యా = విద్యను; ధారణ = ధరించుట యొక్క; మహిమ = మహాత్యము; వలనన్ = మూలమున; అరాతులన్ = శత్రువులను; నిర్జించె = జయించెను; కావున = అందుచేత; ఎవ్వరేని = ఎవరైనను; నిర్మల = స్వచ్ఛమైన; ఆత్ములు = మనసు గలవారు; అగు = అయిన; వారలు = వారు; ఏతత్ = ఆ యొక్క; విద్య = విద్యను; ధారణులు = ధరించినవారు; ఐ = అయ్యి; అనుదినంబును = ప్రతిదినము; పఠియించినన్ = చదివినచో; అతి = మిక్కిలి; ఘోర = భయంకరమైన; రణంబులన్ = యుద్దములను; అతి = మిక్కిలి; ఉత్కట = తట్టుకొనలేని; సంకటంబులను = బాధలను; సర్వ = అఖిలమైన; గ్రహ = పట్టిపీడించెడివి; నిగ్రహకర్మ = అడ్డుకొనెడివి యైన హోమములు; మారణకర్మ = మరణ కారక మగు హోమములు; ఆది = మొదలగు; దుష్కర్మ = చెడు ప్రయోగముల; జన్య = కలిగెడి; క్లేశంబులు = చీకాకులు; వదలి = వదిలిపోయి; అవ్యాకుల = చీకాకులులేని; మనస్కులు = మనసులు గలవారు; ఐ = అయ్యి; విజయంబు = విజయములను; ఒందుదురు = పొందుదురు; మఱియును = ఇంకను; సర్వ = సమస్తమైన; రోగంబుల = జబ్బుల; కున్ = కును; అగమ్య = చేరని; శరీరులు = దేహములు గలవారు; ఐ = అయ్యి; సుఖంబున్ = సౌఖ్యములను; ఒందుదురు = పొందెదరు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- ఇంకా అన్ని ప్రమాదాలకు కారణాలైన అభిచార ప్రయోగాలనుండి నారాయణుడు నన్ను రక్షించునుగాక! గర్వపడడం నుండి నరుడు రక్షించునుగాక! యోగాభ్యాసం నుండి పతనం కాకుండా యోగాలకు అధిపతి అయిన దత్తాత్రేయుడు నన్ను కాపాడుగాక! కర్మబంధాల నుండి గణాధిపతి అయిన కపిలుడు రక్షించుగాక! మన్మథుని నుండి సనత్కుమారుడు కాపాడుగాక! దారిలో వెళ్తూ దేవతలను అవహేళన చేసిన పాపం నుండి శ్రీహయగ్రీవుడు రక్షించుగాక! దేవతలకు నమస్కారం చేయకుండా తిరస్కరించినప్పుడు, దేవపూజలో లోపం జరిగినప్పుడు నారదుడు నన్ను కాపాడుగాక! అంతులేని నరకాలనుండి కూర్మమూర్తి నన్ను రక్షించుగాక! తినరానిది తిన్న దోషం నుండి భగవంతుడైన ధన్వంతరి నన్ను కాపాడుగాక! శీతోష్ణాది ద్వంద్వాల నుండి జితేంద్రియుడైన ఋషభుడు నన్ను రక్షించుగాక! లోకుల నిందల నుండి అగ్నిదేవుడు నన్ను కాపాడుగాక! చావు పుట్టుకలు కలిగించే అసత్కర్మల నుండి బలభద్రుడు నన్ను రక్షించుగాక! కాలప్రభావం నుండి యముడు కాపాడుగాక! సర్ప సమూహం నుండి ఆదిశేషుడు నన్ను రక్షించుగాక! అజ్ఞానం నుండి కృష్ణద్వైపాయనుడు నన్ను కాపాడుగాక! వేదవిద్యా విముఖుల నుండి బుద్ధదేవుడు నన్ను రక్షించుగాక! శనిపీడ నుండి కల్కి నన్ను కాపాడుగాక! ఈ విధంగా ధర్మరక్షణ పరాయణుడైన శ్రీమన్నారాయణుడు ఆయా రూపాలలో నన్ను రక్షించుగాక! ఉదయం, మధ్యాహ్నం, పట్టపగలు, సాయంకాలం, మునిమాపువేళ, అర్ధరాత్రి, అపరాత్రి, పత్యూషకాలం, సంధికాలాలు, ప్రభాతం అనే సకల సమయాలలో గద మొదలైన ఆయుధాలను ధరించి కేశవుడు, నారాయణుడు, గోవిందుడు, విష్ణువు, మధుసూదనుడు, త్రివిక్రముడు, వామనుడు, హృషీకేశుడు, పద్మనాభుడు, శ్రీవత్సాంకుడు, సర్వేశ్వరుడు, జనార్దనుడు, విశ్వేశ్వరుడు, కాలమూర్తి అనే నామ రూపాలు కలిగిన దేవుడు నన్ను రక్షించుగాక! ప్రళయకాలపు అగ్నిజ్వాలలతో అతి తీవ్రంగా తిరుగుతూ అవక్రపరాక్రమంతో రాక్షస సమూహాన్ని చీకాకు పరచే సుదర్శన చక్రమా! పెనుగాలికి పెచ్చరిల్లిన అగ్ని ఎండుగడ్డితో నిండిన అడవులను భస్మం చేసినట్లు నీవు భగవంతునిచే ప్రయోగింపబడి నా శత్రువులను నిశ్శేషంగా దహించు. ప్రళయకాలంలో అమితోత్సాహంతో గర్జిస్తూ పదిదిక్కులలో క్రమ్మిన కారు మబ్బులు వెలిగ్రక్కే కోటానుకోట్ల పిడుగుల నుండి వెడలే అగ్నికణాల భుగభుగ ధ్వనులతో నిండి శ్రీమన్నారాయణుని కరకమలంలో చండప్రచండంగా వెలిగే కౌమోదకీ గదాదండమా! తండోపతండాలైన నా విరోధులను పిండి పిండి కావించు. కూశ్మాండాలు, వైనాయకాలు, యక్షులు, రక్షస్సులు, భూతాలు, గ్రహాలు మొదలైన దుష్టశక్తులను పొడిపొడి చేసి వినోదించు. సకలలోక జయశీలుడైన శ్రీకృష్ణుని పుణ్యసదనమైన వదనం నుండి పూరింపబడే పాంచజన్య శంఖమా! ఉన్మత్తాలైన భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, బ్రహ్మరాక్షసులు మొదలైన వాటిని పారద్రోలు. నా విరోధి వీరుల గుండెలతోపాటు వారి ఇల్లాండ్ర కడుపులలోని పిండాలు అవిసేటట్లు బ్రహ్మాండభాండం బ్రద్దలయ్యే విధంగా పెద్దగా ధ్వనించు. నారాయణుని చేత ప్రయోగింపబడి మిక్కిలి పదునైన అంచుతో రాక్షసుల కఠోర కంఠాలను తెగనరికి ఆ కరాళ రక్తధారలలో మునిగి తేలే నందక మహాఖడ్గమా! నా శత్రు వ్యూహాలను ఖండ ఖండాలుగా చించి చెండాడు. నిష్కళంకాలు, నిరాటంకాలు అయిన శత చంద్రమండలాలతో అలంకరింపబడి, శుభలక్షణాలతో విలక్షణంగా ఉండే ధర్మస్వరూపమైన ఓ కవచమా! దుర్మదులైన నా శత్రు సమూహాలను కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతులను ప్రసరింపజేసి మిక్కిలి చిక్కని చిమ్మచీకట్లలో చిక్కుపడే విధంగా చెయ్యి. భగవంతుని నామాలు, రూపాలు, వాహనాలు, దివ్యాయుధాలు పాపగ్రహాల వలన, క్రూర మృగాల వలన, సర్పాల వలన, అడవి పందుల వలన సంభవించే ఉపద్రవాలను తొలగించి నన్ను రక్షించుగాక! నానా విధాలైన సామగానాలతో స్తోత్రం చేయబడే గరుత్మంతుడు రక్షాదక్షుడై నన్ను కటాక్షించుగాక! శ్రీమన్నారాయణుని నామ రూప వాహనాలు దివ్యాయుధాలు మొదలైనవి నా బుద్ధిని, ఇంద్రియాలను, మనస్సును, ప్రాణాలను సంరక్షించుగాక! భగవంతుడైన శేషుడు ఉపద్రవాల నన్నింటిని దూరంగా తొలగించుగాక! ఈ సమస్త విశ్వాన్ని భగవంతుని స్వరూపంగా భావించి ధ్యానించ బడే వాడు మాయామయుడు అయి, అలంకారాలు, ఆయుధాలు ధరించి తిరుగులేనివాడై విరాజిల్లే మహావిష్ణువు అవశ్యం కాపాడుగాక! సమస్తలోక భయంకరమైన అట్టహాసంతో ప్రకాశించే వదన గహ్వరంతో తేజోవిరాజమానుడై శ్రీ నృసింహదేవుడు లోపల, వెలుపల అన్ని దిక్కుల నుండి నన్ను రక్షించుగాక! ఈవిధంగా శ్రీమన్నారాయణ స్వరూపమైన కవచాన్ని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించాడు. ఇంద్రుడు ఆ కవచాన్ని గ్రహించి దాని ప్రభావంతో తన శత్రువులైన రాక్షసులను జయించాడు. లోకంలో ఎవరైనా సరే మాలిన్యంలేని మనస్సుతో ఈ నారాయణ కవచాన్ని స్వీకరించి ప్రతిదినం పఠిస్తున్నట్లయితే అతి భయంకరమైన యుద్ధాల వల్ల, అత్యంత దుర్భరాలైన కష్టాల వల్ల, ఘోరాతి ఘోరమైన దుష్టగ్రహాల వల్ల, క్రూరమైన మారణ కర్మల వల్ల ఏ విధమైన బాధలు పొందకుండా సుఖంగా ఉంటారు. ఎటువంటి మనోవ్యథలు లేకుండా విజయం సాధించి చక్కని ఆరోగ్యంతో ఆనందిస్తారు.

తెభా-6-308-సీ.
తిభక్తిఁ గౌశికుం ను బ్రాహ్మణుఁడు దొల్లి-
యీ విద్య ధరియించి యెలమి మించి
రుభూమియందు నిర్మలచిత్తుఁడై యోగ-
ధారణంబున బిట్టు నువు విడిచె
దానిపై నొకఁడు గంర్వవరేణ్యుండు-
చిత్రరథాఖ్యుఁ డజేయుఁ డొంటి
దలఁ జనంగఁ దచ్ఛాయ తదస్థిపైఁ-
దసిన నాతఁడు ళవళించి

తెభా-6-308.1-ఆ.
యువిద పిండుతోడ విమానముతోడఁ
నదు విద్యతోడ రణిఁ ద్రెళ్ళి
తిరిగి లేవలేక తికమక గుడువంగ
వాలఖిల్యమౌని వానిఁ జూచి.

టీక:- అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; కౌశికుండు = కౌశికుడు; అను = అనెడి; బ్రాహ్మణుడు = బ్రహ్మణుడు; తొల్లి = పూర్వము; ఈ = ఈ; విద్య = విద్యను; ధరియించి = ధరించి; ఎలమిన్ = వికాసముతో; మించి = అతిశయించి; మరుభూమి = శ్మశానము; అందు = లో; నిర్మల = స్వచ్ఛమైన; చిత్తుడు = మనసు గలవాడు; ఐ = అయ్యి; యోగధారణంబునన్ = యోగధారణ ద్వారా; బిట్టు = శ్రీఘ్రమే; తనువున్ = దేహమును; విడిచె = వదలెను; దాని = దాని; పైన్ = మీద; ఒకడు = ఒకడు; గంధర్వ = గంధర్వులలో; వరేణ్యుండు = శ్రేష్ఠుడు; చిత్రరథ = చిత్రరథుడు; ఆఖ్యుడు = అనబడెడివాడు; అజేయుడు = జయింపరానివాడు; ఒంటిన్ = ఒంటరిగా; చదలన్ = ఆకాశమున; చనంగ = వెళుతుండగ; తత్ = ఆ; ఛాయ = నీడ; తత్ = ఆ; అస్థి = ఎముక; పైన్ = మీద; కదిసిన = చేరగా; ఆతడు = అతడు; కళవళించి = తొట్రుపడి;
ఉవిద = స్త్రీల; పిండు = గుంపు; తోడన్ = తోటి; నవ = కొత్త; విమానము = విమానము; తోడన్ = తోటి; తనదు = తన యొక్క; విద్య = జ్ఞానము; తోడన్ = తోటి; ధరణిన్ = భూమిపైన; త్రెళ్ళి = తూలిపడిపోయి; తిరిగి = మరల; లేవలేక = లేవలేక; తికమక = తొట్రుపాటు; కుడువంగ = పడుతుండగ; వాలఖిల్య = వాలఖిల్యుడు యనెడి; మౌని = ముని; వానిన్ = వానిని; చూచి = చూసి.
భావము:- పూర్వం కౌశికుడనే బ్రాహ్మణుడు ఎంతో భక్తితో ఈ నారాయణ కవచాన్ని ఉపాసించి, నిర్మలమైన హృదయంతో యోగమార్గాన్ని అవలంబించి ఒక ఎడారి ప్రదేశంలో తన దేహాన్ని విడిచిపెట్టాడు. చిత్రరథుడు అనే గంధర్వరాజు తన రాణులతో కలిసి విమానంలో ఆకాశమార్గాన పోతుండగా ఆ విమానం నీడ కౌశికుని అస్థిపంజరం మీద పడగానే అది ముందుకు పోకుండా ఆగిపోయి నేల మీదకు వచ్చిపడింది. చిత్రరథుడు తన రాణులతో క్రింద పడిపోయాడు. అవయవాలు స్తంభించగా అతడు లేవలేక తికమక పడ్డాడు. ఆ సమయంలో వాలఖిల్యుడు అనే ముని ఆ గంధర్వునితో ఇలా అన్నాడు.

తెభా-6-309-క.
"నారాయణ కవచ సమా
ధాణ పుణ్యాస్థి దీని గ్గఱ నీకుం
గూరెడినె? విష్ణుభక్తుల
వాక చేరంగ నెట్టివారికిఁ దరమే?

టీక:- నారాయణకవచ = నారాయణకవచమును; సమ = మిక్కిలిగ; ధారణ = ధరించిన; పుణ్యు = పుణ్యుని; అస్థి = ఎముక; దీని = దీని; దగ్గఱ = వద్ద; నీ = నీ; కున్ = కు; కూరెడినే = ఘటించ సాధ్యమా; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; భక్తులన్ = భక్తులను; వారక = విడువక; చేరంగ = దగ్గరకు వెళ్ళుటకు, దాటుటకు; ఎట్టి = ఎటువంటి; వారికిన్ = వారికైనను; తరమె = సాధ్యమా.
భావము:- “నారాయణ కవచాన్ని ధరించి దేహం విడిచిన పుణ్యాత్ముని అస్థికలివి. వీని దగ్గర నీ మహిమలు పని చేయవు. విష్ణుభక్తులను అతిక్రమించి వెళ్ళడం ఎవరికి సాధ్యం?

తెభా-6-310-ఇం.
సంధించి నీ యంగక సంధులెల్లన్
బంధించి తన్మంత్రబలంబు పేర్మి
న్నందంబు మాన్పింపఁ దన్యమేదీ?
సింధుప్రవాహోన్నతిచేతఁ దీరున్.

టీక:- సంధించి = కూర్చి; నీ = నీ యొక్క; అంగక = దేహము యొక్క; సంధులు = సంధులు; ఎల్లను = అన్నిటిని; బంధించి = బంధించి; తత్ = ఆ; మంత్ర = మంత్రము యొక్క; బలంబు = బలము; పేర్మిన్ = అతిశయము; అందంబున్ = కూడిక; మాన్పింపన్ = ఆపుటకు; తత్ = దానికి; అన్యము = ఇతరము; ఏది = ఏదికలదు; సింధు = సిందునది; ప్రవాహ = ప్రవాహజలము యొక్క; ఉన్నతి = గొప్పదనముచేత; తీరున్ = తీరును.
భావము:- నారాయణ కవచ ప్రభావం వల్ల నీ అవయవ సంధులు బంధింపబడ్డాయి. ఈ ఆపద తొలగటానికి ఒక మార్గం ఉంది. ఈ పుణ్యాత్ముని ఎముకలను నీవు నదీజలాలలో కలిపితే నీ కష్టాలు తీరిపోతాయి.

తెభా-6-311-వ.
కావున నీ పుణ్యశల్యంబులు భక్తియుక్తుండ వై కొనిపోయి ప్రాఙ్ముఖంబునఁ బ్రవహించెడు సరస్వతీ జలంబుల నిక్షేపణంబు జేసి కృతస్నానుండవై యాచమనంబు చేసిన, నీ సర్వాంగబంధనంబు లుడుగు" ననిన నతం డట్ల చేసి, తన విమానం బెక్కి నిజస్థానంబున కరిగెఁ; గావున.
టీక:- కావునన్ = అందుచేత; ఈ = ఈ; పుణ్య = పుణ్యవంతమైన; శల్యంబులు = ఎముకలు; భక్తి = భక్తితో; యుక్తుండవు = కూడినవాడవు; ఐ = అయ్యి; కొనిపోయి = తీసుకు వెళ్ళి; ప్రాక్ = తూర్పు; ముఖంబున్ = వైపునకు; ప్రవహించెడు = ప్రవహించే టటువంటి; సరస్వతి = సరస్వతినది యొక్క; జలంబులన్ = నీటిలో; నిక్షేపణంబు = నిమజ్జనము; చేసి = చేసి; కృత = చేసిన; స్నానుండవు = స్నానము చేసిన వాడవు; ఐ = అయ్యి; ఆచమనంబు = ఆచమనము {ఆచమనము - మంత్రపూర్వకముగ అరచేత జలము తీసుకొనెడి వైదిక ధర్మము}; చేసిన = చేసినచో; నీ = నీ యొక్క; సర్వ = అఖిలమైన; అంగ = అవయవముల; బంధనంబులు = బంధములు; ఉడుగును = విడుచును; అనినన్ = అనగా; అతండు = అతడు; అట్ల = ఆ విధముగ; చేసి = చేసి; తన = తన యొక్క; విమానంబు = విమానమును; ఎక్కి = అధిరోహించి; నిజ = తన; స్థానంబున్ = నివాస స్థానమున; కు = కు; అరిగెన్ = వెళ్ళెను; కావున = అందుచేత.
భావము:- కావున ఈ పవిత్రమైన అస్థికలను భక్తితో తీసికొని పోయి తూర్పుదిక్కుగా ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చెయ్యి. ఆ నదీజలాలలో స్నానం చేసి ఆచమనం చెయ్యి. అప్పుడు నీ సర్వాంగ బంధాలు విడిపోతాయి” అని వాలఖిల్యుడు చెప్పగా విని ఆ చిత్రరథుడు ఆ విధంగానే ఆచరించి బంధవిముక్తుడై విమానమెక్కి తన లోకానికి వెళ్ళిపోయాడు.

తెభా-6-312-క.
నుదినము దీని నెవ్వరు
వినిరేనిఁ బఠించిరేని విస్మయ మొదవన్
భూతజాల మెల్లను
మునుకొని వారలను గాంచి మ్రొక్కుచు నుండున్.

టీక:- అనుదినము = ప్రతిదినము; దీనిన్ = దీనిన్; ఎవ్వరు = ఎవరైనా; వినిరేని = విన్నట్లయితే; పఠించిరేని = చదివిరేని; విస్మయము = ఆశ్చర్యము; ఒదవన్ = కలుగునట్లు; ఘన = గొప్ప; భూత = జీవ; జాలము = సమూహములు; ఎల్లను = అన్నియును; మునుకొని = పూని; వారలను = వారిని; కాంచి = చూసి; మ్రొక్కుచునుండున్ = పూజించు చుండును.
భావము:- ఈ నారాయణ కవచాన్ని ఎవరైతే ప్రతినిత్యం వింటారో, పఠిస్తారో అటువంటి వారిని దర్శించగానే ఆశ్చర్యకరంగా సమస్త జీవకోటి భక్తితో నమస్కరిస్తారు.

తెభా-6-313-ఆ.
విశ్వరూపువలన నైశ్వర్యకరమైన
యిట్టి విద్యఁ దాల్చి యింద్రుఁ డపుడు
మూఁడులోకములకు ముఖ్యమైనట్టి శ్రీ
నుభవించి మించె ధికమహిమ.

టీక:- విశ్వరూపు = విశ్వరూపుని; వలన = వలన; ఐశ్వర్య = ఐశ్వర్యమును; కరము = కలిగించెడిది; ఐన = అయిన; ఇట్టి = ఇటువంటి; విద్య = విద్యను; తాల్చి = ధరించి; ఇంద్రుడు = ఇంద్రుడు; అపుడు = అప్పుడు; మూడులోకముల్ = ముల్లోకముల; కున్ = కు; ముఖ్యము = కామింపదగినది; ఐనట్టి = అయినట్టి; శ్రీ = ఐశ్వర్యములను; అనుభవించి = అనుభవించి; మించెన్ = అతిశయించెను; అధిక = అధికమైన; మహిమ = గొప్పదనముతో.
భావము:- ఐశ్వర్యప్రదమైన ఆ మహావిద్యను విశ్వరూపుని నుండి గ్రహించిన దేవేంద్రుడు ముల్లోకాలకు ప్రభువై మహైశ్వర్యాన్ని అనుభవించాడు.

తెభా-6-314-సీ.
భూపాల! యా విశ్వరూపున కరుదైన-
లలు మూఁ డనువొందఁ లిగి యుండు;
సొరిది సురాపాన సోమపానంబులు-
న్నాద మనఁగను మరవరుల
తోఁగూడి భుజియించి తూకొని వారితో-
జ్ఞభాగంబు ప్రత్యక్ష మొంది
కైకొనుచుండి దుష్కర్ముఁడై యా యజ్ఞ-
భాగంబు రాక్షస ప్రవరులకును

తెభా-6-314.1-ఆ.
ల్లిమీఁద గలుగు తాత్పర్యవశమున
దివిజవరుల మొఱఁగి తెచ్చి యిచ్చు
ది యెఱింగి యింద్రుఁ తిభీతచిత్తుఁడై
నకుఁగాని యతని లలు ద్రుంచె.

టీక:- భూపాల = రాజా; ఆ = ఆ; విశ్వరూపున్ = విశ్వరూపుని; కు = కి; అరుదు = అద్భుతము; ఐన = అయిన; తలలు = శిరస్సులు; మూడున్ = మూడు (3); అనువొంద = అనుకూలముగ; కలిగి = ఉండి; ఉండున్ = ఉండును; సొరిదిన్ = వరుసగా; సుర = సుర; పాన = తాగుటకు; సోమ = సోమరసము; పానంబులున్ = తాగుటలు; అన్న = అన్నమును; ఆదమనన్ = తినుటకు; కను = కోసము; అమర = దేవతలలోని; వరుల = శ్రేష్ఠుల; తోన్ = తోటి; కూడి = కలిసి భుజియించి = తినుచు; తూకొని = పూని; వారి = వారి; తోన్ = తోటి; యజ్ఞ = యజ్ఞములలోని హవిస్ యందలి; భాగంబు = భాగమును; ప్రత్యక్షమున్ = ప్రత్యక్షముగ; ఒంది = పొంది; కైకొనుచుండి = స్వీకరించుతూ; దుష్ = చెడ్డ; కర్ముడు = పనులు చేయువాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; యజ్ఞ = యజ్ఞములలోని హవిస్ యందలి; భాగంబు = భాగములను; రాక్షస = రాక్షసులలో; ప్రవరుల్ = శ్రేష్ఠుల; కును = కు; తల్లి = తల్లి; మీద = పైన; కలుగు = ఉండెడి;
తాత్పర్య = వాత్సల్యము; వశమున = మూలమున; దివిజ = దేవతా; వరులన్ = శ్రేష్ఠుల; మొఱగి = కనుగప్పి; తెచ్చి = తీసుకొని వచ్చి; ఇచ్చున్ = ఇచ్చును; అది = దానిని; ఎఱింగి = తెలిసి; ఇంద్రుడు = ఇంద్రుడు; అతి = మిక్కిలి; భీత = భయపడుతున్న; చిత్తుడు = మనసు గలవాడు; ఐ = అయ్యి; తన = తన; కున్ = కు; కాని = అంగీకారము కాని; అతని = అతని; తలలు = శిరస్సులను; త్రుంచె = ఖండించెను.
భావము:- మహారాజా! విశ్వరూపునికి మూడు తలలు. వానిలో మొదటి తల సురాపానం చేస్తుంది. రెండవది సోమపానం చేస్తుంది. మూడవది అన్నం భుజిస్తుంది. విశ్వరూపుడు దేవతలకు ఆచార్యుడై వారితో కలసి మెలసి ఉంటూ యజ్ఞాలు చేయిస్తూ వారితో పాటు హవిర్భాగాలు అందుకొంటూ ఉండేవాడు. కొంతకాలానికి అతని బుద్ధి వక్రించి ఒక చెడ్డపని చేసాడు. (విశ్వరూపుని తల్లి రచన. ఆమె రాక్షసుల ఆడపడుచు). అతడు యజ్ఞాలలోని హవిర్భాగాలను దేవతల కళ్ళు గప్పి మోసగించి తన తల్లి మీద గల అభిమానంతో ఆమెవైపు వారైన రాక్షసముఖ్యులకు రహస్యంగా ఇవ్వడం మొదలుపెట్టాడు. అది తెలిసికొని ఇంద్రుడు భయపడి తన శ్రేయోభిలాషి కాని విశ్వరూపుని మూడు తలలను ఖండించాడు.

తెభా-6-315-క.
భాసురుఁ డనక మహాత్మా
గ్రేరుఁ డన కతఁడు పూర్వకృత కర్మగతిన్
వేరుఁ డనక మహేంద్రుఁడు
భూసురు తల లపుడు రోషమునఁ దెగ నడిచెన్.

టీక:- భాసురుడు = తేజస్సు గలవాడు; అనక = అని చూడక; మహాత్మా = మహాత్ములలో; అగ్రేసరుడు = బహు గొప్పవాడు; అనక = అని చూడక; అతడు = అతడు; పూర్వ = పూర్వము; కృత = చేసిన; కర్మ = కర్మముల; గతిన్ = వేగముచేత; వేసరుడు = బాధింపబడినవాడు; అనక = అని చూడక; మహేంద్రుడు = ఇంద్రుడు; భూసురు = బ్రాహ్మణుని; తలలు = తలలు; అపుడు = అప్పుడు; రోషమున = కోపముతో; తెగన్ = తెగునట్లు; అడిచెన్ = కొట్టెను.
భావము:- బ్రాహ్మణుడని, మహానుభావులలో మహనీయుడని ఆలోచించకుండా; విధి వైపరీత్యం వల్ల ఇలా జరిగిందని అనుకోకుండా ఇంద్రుడు కోపంతో విశ్వరూపుని తలలు ఖండించాడు.

తెభా-6-316-వ.
ఇట్లయ్యింద్రుఁడు క్రోధంబు సహింపంజాలక విశ్వరూపుతలలు ఖడ్గంబునం దెగనడచిన సోమపానంబు చేయు శిరంబు కపింజలం బయ్యె; సురాపానంబు చేయు శిరంబు కలవింకం బయ్యె; అన్నంబు భక్షించు శిరంబు తిత్తిరి యయ్యె; నిట్లు త్రివిధ పక్షిస్వరూపంబు దాల్చి, బ్రహ్మహత్య యేతెంచి యింద్రునిఁ జుట్టుకొని తమ్ముఁ బరిగ్రహింపు మని నిర్భంధింప నపు డింద్రు డతి భీతచిత్తుండై త్రిలోకనాయకుం డైనన్ దానిం దప్పించుకొనంజాలక యంజలి యొగ్గి, యమ్మహా దోషంబుఁ గైకొని, తద్దోషం బొక్క సంవత్సరం బనుభవించి, యంతం బాపుకొను వాఁడై భూ జల వృక్ష స్త్రీలం బ్రార్థించి, మద్దురితంబు చతుర్విధంబు కొలంబుచ్చికొనుం డనిన, భూమి తనయందుఁ జేయంబడిన ఖాతంబు తనంతన పూఁడునట్టి వరంబును, జలంబు సర్వంబు దనయందు బ్రక్షాళితంబైనం బావనం బగునట్టి వరంబును, వృక్షంబులు భేదింపం బడి పునఃప్రరోహంబు గలుగు వరంబును, స్త్రీ లెల్లపుడుం దమకు గామసుఖంబు గలుగునట్టి వరంబును గోరిన నతం డట్ల కా నొసంగిన నతని దుష్కృతంబు ధరణి నెఱియ లూషర క్షేత్రంబుల విధంబునను, నుదకంబు బుద్బుద ఫేన రూపంబునను, మహీరుహంబులు నిర్యాస భావంబునను, నింతులు రజో వికారంబునను నిట్లు చతుర్భాగంబులం బంచికొనిరి; అంత.
టీక:- ఇట్లు = ఈ విధముగా; ఆ = ఆ; ఇంద్రుడు = ఇంద్రుడు; క్రోధంబు = కోపమును; సహింపజాలక = పట్టుకొనలేక; విశ్వరూపు = విశ్వరూపుని; తలలు = తలకాయలను; ఖడ్గంబునన్ = కత్తితో; తెగనడచిన = ఖండించివేయగా; సోమ = సోమమును; పానంబు = తాగుట; చేయు = చేసెడి; శిరంబు = తల; కపింజలంబు = వానకోయిల, కముజుపిట్ట; అయ్యె = అయ్యెను; సుర = సుర; పానంబు = తాగుట; చేయు = చేసెడి; శిరంబు = తల; కలవింకంబు = ఊరపిచ్చుక; అయ్యె = అయ్యెను; అన్నంబు = ఆహారమును; భక్షించు = తినెడి; శిరంబు = తల; తిత్తిరి = తీతువు పిట్ట; అయ్యె = అయ్యెను; ఇట్లు = ఈ విధముగా; త్రి = మూడు; విధ = రకముల; పక్షి = పక్షుల; రూపంబు = రూపములను; తాల్చి = ధరించి; బ్రహ్మహత్య = బ్రహ్మహత్యాదోషము {బ్రహ్మహత్య - బ్రాహ్మణుని చంపిన పాతకము}; ఏతెంచి = వచ్చి; ఇంద్రుని = ఇంద్రుని; చుట్టుకొని = చుట్టుముట్టి; తమ్ము = తమను; పరిగ్రహింపుము = స్వీకరింపుము; అని = అని; నిర్బంధింపన్ = బలవంతపెట్టగా; అపుడు = అప్పుడు; ఇంద్రుడు = ఇంద్రుడు; అతి = మిక్కిలి; భీత = భయపడినవాడు; ఐ = అయ్యి; త్రిలోక = ముల్లోకములకు; నాయకుండు = ప్రభువు; ఐనన్ = అయినప్పటికిని; దానిన్ = దానిని; తప్పించుకొనంజాలక = తప్పించుకోలేక; అంజలి = నమస్కారము; ఒగ్గి = చేసి; ఆ = ఆ; మహా = గొప్ప; దోషంబున్ = పాతకమును; కైకొని = చేపట్టి; తత్ = ఆ; దోషంబున్ = దోషమును; ఒక్క = ఒక; సంవత్సరంబు = సంవత్సరము; అనుభవించి = అనుభవించి; అంతం = తరువాత; పాపుకొనువాడు = పోగొట్టుకో గోరినవాడు; ఐ = అయ్యి; భూ = భూమిని; జల = నీటిని; వృక్ష = చెట్లను ; స్త్రీలన్ = స్త్రీలను; ప్రార్థించి = వేడుకొని; మత్ = నా యొక్క; దురితంబు = పాతకమును; చతుర్విథంబులన్ = నాలుగు భాగములుగా; పుచ్చుకొనుండు = తీసుకొనుడు; అనిన = అనగా; భూమి = భూమి; తన = తన; అందు = పైన; చేయంబడిన = చేసిన; ఖాతంబు = గొయ్యి; తనంతన = దానంతటదే; పూడున్ = పూడ్చుకుపోయే; అట్టి = అటువంటి; వరంబును = వరమును; జలంబు = నీరు; సర్వంబు = అఖిలమైనవి; తన = తన; అందు = లో; ప్రక్షాళితంబు = కడిగబడినవి; ఐనన్ = అయినచో; పావనంబు = పరిశుద్ధమైనవి; అగునట్టి = అయ్యెడి; వరంబును = వరమును; వృక్షంబులు = చెట్లు; భేదింపంబడి = కొట్టివేయబడినను; పునః = మరల; ప్రరోహంబు = చిగురించ; కలుగు = కలగెడి; వరంబును = వరమును; స్త్రీలు = స్త్రీలు; ఎల్లప్పుడు = అనవరతము; తమ = తమ; కు = కు; కామసుఖంబు = కామసుఖము; కలుగు = కలిగే; అట్టి = అటువంటి; వరంబును = వరమును; కోరిన = కోరుకొనగా; అతండు = అతడు; అట్ల = అలానే; కాన్ = అగునట్లు; ఒసంగినన్ = వరమియ్యగ; అతని = అతని యొక్క; దుష్కృతంబు = పాపము; ధరణిన్ = భూమిపై; నెఱియలు = బీటలు; ఊషర = చవిటి; క్షేత్రంబులు = పఱ్ఱలు; విధంబునను = రూపములోను; ఉదకంబు = నీరు; బుద్బుధ = బుడగలు; ఫేన = నురుగ; రూపంబునను = రూపములోను; మహీరుహంబులు = చెట్లు; నిర్యాస = మానిబంక, జిగురు; భావంబునను = రూపములోను; ఇంతులు = స్త్రీలు; రజోవికారంబునను = నెలసరి స్రావముల వలెను; ఇట్లు = ఈ విధముగా; చతుర్భాగంబులన్ = నాలుగు భాగములుగా; పంచికొనిరి = పంచుకొన్నారు; అంత = అంతట.
భావము:- ఈ విధంగా ఇంద్రుడు కోపాన్ని ఆపుకోలేక విశ్వరూపుని తలలు ఖండించగా సోమపానం చేసే తల కౌజుపిట్టగా మారిపోయింది. సురాపానం చేసే తల ఊరబిచ్చుక అయింది. అన్నం భక్షించే తల తీతువుపిట్ట అయింది. ఈ విధంగా బ్రహ్మహత్యా పాతకం మూడు విధాలైన పక్షి రూపాలు ధరించి ఇంద్రుణ్ణి చుట్టుముట్టి మమ్మల్ని పరిగ్రహించమని నిర్బంధించసాగాయి. ఇంద్రుడు భయపడి ముల్లోకాలకు అధిపతి ఐనా ఆ బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకొనలేక పోయాడు. చేతులు జోడించి ఆ మహాపాపాన్ని స్వీకరించాడు. అలా దానిని ఒక సంవత్సరం అనుభవించి ఆ తరువాత భరించలేక, దానిని వదిలించుకోవాలని నిశ్చయించి భూదేవిని, జలాలను, వృక్షాలను, స్త్రీలను పిలిచి ఆ పాపభారాన్ని నాలుగు భాగాలు చేసి మీరు పుచ్చుకోండి అని ప్రార్థించాడు. అందుకు బదులుగా భూమి తనపై చేయబడ్డ గోతులు వాటంతట అవే పూడిపోయేటట్లు, జలాలు సమస్తం తమలో కడగబడగానే పవిత్రం అయ్యేటట్లు, వృక్షాలు ఎన్నిసార్లు ఛేదించిన తిరిగి చిగురించేటట్లు, స్త్రీలు ఎల్లప్పుడు తమకు అధికంగా కామసుఖం ప్రాప్తించేటట్లు వరాలు కోరుకోగా ఇంద్రుడు అలాగే వరాలిచ్చాడు. అతని పాపాన్ని పొందిన భూమి చౌడౌటను పొందింది. జలాలు బుడగలు, నురుగును పొందాయి. వృక్షాలు జిగురు రూపాన్ని అందుకొన్నాయి. స్త్రీలు రజోవికారాన్ని పొందారు. ఆ విధంగా వారు ఇంద్రుని పాపంలో నాలుగవ వంతు చొప్పున పంచుకున్నారు. అప్పుడు...