పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/షష్ఠ్యంతములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-1-29-ఉ. )[మార్చు]

హా రికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం
హా రికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హా రికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హా రికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.

(తెభా-1-30-ఉ. )[మార్చు]

శీ లికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని
ర్మూ లికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా
పా లికి, వర్ణధర్మపరిపాలికి నర్జునభూజయుగ్మ సం
చా లికి, మాలికిన్, విపుల క్ర నిరుద్ధ మరీచి మాలికిన్.

(తెభా-1-31-ఉ. )[మార్చు]

క్షం కుఁ గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా
రం కు నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ
హం కు నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ
మం కు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.

(తెభా-1-32-ఉ. )[మార్చు]

న్యా యికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్థ్సా యికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధా యికిఁ బీతవస్త్రపరిధాయికిఁ బద్మభవాండభాండ ని
ర్మా యికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.

(తెభా-1-33-వ. )[మార్చు]

సమర్పితంబుగా, నే నాంధ్రంబున రచియింపం బూనిన శ్రీమహా భాగవతపురాణంబునకుం గథాప్రారంభం బెట్టి దనిన.