పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/కుంతి స్తుతించుట
తెభా-1-187-క.
"పురుషుం, డాఢ్యుఁడు, ప్రకృతికిఁ
బరుఁ, డవ్యయుఁ, డఖిలభూత బహిరంతర్భా
సురుఁడును, లోకనియంతయుఁ,
బరమేశ్వరుఁడైన నీకుఁ బ్రణతులగు హరీ!
టీక:- పురుషుండు = పరమ పురుషుడును {పురుషః - శరీరములు అను పురములు (లోకములు) సృష్టించి వానిలో నుండు వాడు, విష్ణుసహస్రనామాలులో 14వ నామం 406వ నామం, నవద్వారముల పురమునందు ఉండువాడు, పురము నందు శయనించు వాడు, సర్వము కంటెను పూర్వ మున్నవాడు}; ఆఢ్యుఁడు = శ్రీమంతుడు {ఆఢ్యుడు - లక్ష్మీదేవి యనే సంపద గలవాడు, సంపన్నుడు}; ప్రకృతి = ప్రకృతి; కిన్ = కంటెను; పరుఁడు = పై నున్న వాడును; అవ్యయుఁడు = నాశనములేనివాడును {అవ్యయః - విష్ణుసహస్రనామాలులో 13వ నామం, 900వ నామం, అజరుడు, అమరుడు, వినాశము కాని, వికారము కాని లేని వాడు,}; అఖిల = సమస్త; భూత = ప్రాణుల యందు; బహిర్ = బయట; అంతర్ = లోపల; భాసురుఁడును = ప్రకాశించువాడును; లోక = లోకములను; నియంతయున్ = పాలించువాడును; పరమేశ్వరుఁడు = పరమమైన ఈశ్వరుడును{పరమేశ్వరః - విష్ణుసహస్రనామాలలో 377వ నామం, ఉత్కృష్టమైన వాడు, అత్యధికమైన శాసనము కలవాడు}; ఐన = అయినట్టి; నీకున్ = నీకు; ప్రణతులు = నమస్కారములు; అగు = చేయుచున్నాము; హరీ = కృష్ణా{హరిః - విష్ణుసహస్రనామాలులో 650వ నామం, అజ్ఞాన జనితమైన సంసార దుఃఖము హరించు వాడు, సమూలముగా సంసారమును హరించువాడు}.
భావము:- “కృష్ణా! నువ్వు పరమపురుషుడవు, దేవాధిదేవుడవు, ప్రకృతికి అవ్వలివాడవు, అనంతుడవు, సకల ప్రాణులలో వెలుపల లోపల ప్రకాశిస్తూ ఉండేవాడవు. విశాల విశ్వాన్ని నడిపేవాడవు, పరమేశ్వరుడవు అయినట్టి నీకు నమస్కారములు.
తెభా-1-188-వ.
మఱియు, జవనిక మఱుపున నాట్యంబు సలుపు నటుని చందంబున, మాయా యవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచేఁ బరమహంసలు, నివృత్తరాగద్వేషులు, నిర్మలాత్ములు నయిన మునులకు నదృశ్యమానుండ వయి పరిచ్ఛిన్నుండవు గాని, నీవు మూఢదృక్కులుఁ, గుటుంబవంతులు నగు మాకు నెట్లు దర్శనీయుండ వయ్యెదు; శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ! పద్మమాలికాలంకృత! పద్మలోచన! పద్మసంకాశచరణ! హృషీకేశ! భక్తియోగంబునం జేసి నమస్కరించెద, నవధరింపుము.
టీక:- మఱియున్ = ఇంకను; జవనిక = తెర; మఱుపున = చాటున; నాట్యంబు = నాట్యము; సలుపు = చేయు; నటుని = నటుని; చందంబునన్ = వలె; మాయా = మాయ అనే; యవనిక = తెర; అంతరాళంబున = చాటున; నిలువంబడి = నిలబడి ఉండి; నీ = నీ యొక్క; మహిమ = మహిమ; చేన్ = చేత; పరమహంసలు = మోక్షస్థితిని పొందినవారు; నివృత్త = నివారింపబడిన; రాగద్వేషులున్ = అనురాగము, ద్వేషములు కలవారును ; నిర్మల = నిర్మలమైన; ఆత్ములున్ = ఆత్మగలవారును; అయిన = అయినట్టి; మునులు = మునుల; కున్ = కు; అదృశ్య = కనుపించక; మానుండు = ఉండేవాడవును; అయి = అయి; పరిచ్ఛిన్నుండవుగాని = సీమ లేదా మితము లేనివాడు, అవిభాజ్యుడు నైన పరబ్రహ్మ స్వరూపమైనవాడవు; నీవు = నీవు; మూఢ = మోసము చెందిన; దృక్కులున్ = దృష్టి కలవారును; కుటుంబవంతులున్ = కుటుంబము గలవారును; అగు = అయినట్టి; మాకు = మాకు; ఎట్లు = ఏవిధంగ; దర్శనీయుండవు = కనబడువాడవు; అయ్యెదు = అవుతావు; శ్రీకృష్ణ = కృష్ణా; వాసుదేవ = కృష్ణా {వాసుదేవుడు - ఆత్మ యందు వసించే దేవుడు, విష్ణువు}; దేవకీనందన = కృష్ణా {దేవకీనందన - దేవకీదేవి పుత్రుడు, కృష్ణుడు}; నంద గోప కుమార = కృష్ణా {నందగోప కుమార - నందుడను గోపాలుని కుమారుడు, కృష్ణుడు}; గోవింద = కృష్ణా {గోవింద - గోవులను పాలించు వాడు, కృష్ణుడు}; పంకజనాభ = కృష్ణా {పంకజనాభుడు - పద్మము నాభిని గల వాడు, విష్ణువు}; పద్మమాలికాలంకృత = కృష్ణా {పద్మమాలికాలంకృతుడు - పద్మ మాలికలతో అలంకరింపబడిన వాడు, కృష్ణుడు}; పద్మలోచన = కృష్ణా {పద్మలోచనుడు - పద్మములవంటి కన్నులు గలవాడు, కృష్ణుడు}; పద్మసంకాశ చరణ = కృష్ణా {పద్మసంకాశ చరణుడు - పద్మముల వలె ప్రకాశించు పాదములు గలవాడు, కృష్ణుడు}; హృషీ కేశ = కృష్ణా {హృషీకేశ - ఇంద్రియములకు ప్రభువు, విష్ణువు}; భక్తి యోగంబునన్ = భక్తి యోగము వలన; చేసి = చేసి; నమస్కరించెదన్ = నమస్కరిస్తున్నాను; అవధరింపుము = స్వీకరింపుము.
భావము:- మాయ అనే యవనిక మాటున వర్తించే నీ మహిమ, తెరచాటున వర్తించే నటునిలా అగోచరమైనది; పరమహంసలు, రాగద్వేషరహితులు, నిర్మలహృదయులు అయిన మునీశ్వరులకు సైతం దర్శింపశక్యంకానికాని వాడవూ, సీమ లేదా మితము లేనివాడు, అవిభాజ్యుడు నైన పరబ్రహ్మ స్వరూపమైనవాడవూ అయిన నిన్ను జ్ఞానహీనులమూ సంసార నిమగ్నులమూ అయిన మా వంటి వారం ఎలా చూడగలం; శ్రీకృష్ణా! వాసుదేవా! దేవకీనందనా! నందగోపకుమారా! గోవిందా! పద్మనాభా! పద్మమాలా విభూషణా! పద్మనయనా! పద్మసంకాశ చరణా! హృషీకేశా! భక్తి పూర్వకమైన నా ప్రణామాలు పరిగ్రహించు. నా విన్నపం మన్నించు.
తెభా-1-189-సీ.
తనయులతోడ నే దహ్యమానంబగు-
జతుగృహంబందునుఁ జావకుండఁ,
గురురాజు వెట్టించు ఘోరవిషంబుల-
మారుతపుత్త్రుండు మడియకుండ,
ధార్తరాష్ట్రుఁడు సముద్ధతిఁ జీర లొలువంగ-
ద్రౌపదిమానంబు దలఁగకుండ,
గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే-
నా బిడ్డ లనిలోన నలఁగకుండ,
తెభా-1-189.1-తే.
విరటుపుత్త్రిక కడుపులో వెలయు చూలు
ద్రోణనందను శరవహ్నిఁ ద్రుంగకుండ,
మఱియు రక్షించితివి పెక్కుమార్గములను,
నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష!
టీక:- తనయులు = పుత్రులు; తోడన్ = తో; నే = నేను; దహ్యమానంబు = మండిపోవుచున్నది; అగు = అయినట్టి; జతు = లక్క; గృహంబు = గృహము; అందును = లో; చావకుండన్ = చనిపోకుండా; కురురాజు = కురువంశ రాజు, దుర్యోధనుడు; వెట్టించు = పెట్టించిన; ఘోర = ఘోరమైన; విషంబులన్ = విషములవలన; మారుతపుత్త్రుండు = భీముడు {మారుతపుత్త్రుడు - వాయుదేవుని పుత్రుడు, భీముడు}; మడియకుండన్ = చనిపోకుండా; ధార్తరాష్ట్రుఁడు = దుశ్శాసనుడు {ధార్తరాష్ట్రుడు - ధృతరాష్ట్రుని కొడుకు, దుశ్శాసనుడు}; సముద్ధతిన్ = మిక్కిలి ఆటోపముతో {సముద్ధతిని - గురువు దగ్గర శిక్షింపబడని వానివలె, మిక్కిలి ఆటోపముతో}; చీరలు = చీరలు, బట్టలు; ఒలువంగన్ = ఒలిచేస్తున్నప్పుడు; ద్రౌపది = ద్రౌపది యొక్క; మానంబు = మానము; తలఁగకుండన్ = తొలగిపోగుండా; గాంగేయ = భీష్ముడు{గాంగేయుడు - గంగ యొక్క పుత్రుడు}, భీష్ముడు; కుంభజ = ద్రోణుడు {కుంభజుడు - కుంభములో పుట్టినవాడు, ద్రోణుడు}; కర్ణ = కర్ణుడు; ఆది = మొదలగు; ఘనులు = గొప్పవారి; చేన్ = చేత; నా = నా; బిడ్డలు = పిల్లలు; అని = యుద్ధము; లోనన్ = లో; నలఁగకుండన్ = నలిగికుండా;
విరటుపుత్త్రిక = ఉత్తర {విరటుపుత్త్రిక - విరటరాజు పుత్రిక, ఉత్తర}; కడుపు = కడుపు; లోన్ = లోపల; వెలయు = వెలసిన; చూలు = గర్భము; ద్రోణనందను = అశ్వత్థామ {ద్రోణనందనుడు - ద్రోణుని యొక్క కొడుకు, అశ్వత్థామ}; శర = బాణముల; వహ్నిన్ = అగ్నివలన; త్రుంగకుండన్ = తునికలు కాకుండగ; మఱియున్ = ఇంకను; రక్షించితివి = కాపాడావు; పెక్కు = అనేకమైన; మార్గములను = విధములుగ; నిన్నున్ = నిన్ను; ఏమని = ఏవిధంగా; వర్ణింతున్ = కీర్తించగలను; నీరజాక్ష = కృష్ణా {నీరజాక్షుడు - నీరజము (పద్మము) లవంటి కన్నులు గలవాడు, కృష్ణుడు}.
భావము:- పుండరీకాక్షా! భగభగ మండుతున్న లక్కయింట్లో నా బిడ్డలు, నేను కాలి భస్మమైపోకుండా కాపాడావు; దుర్యోధనుడు పెట్టించిన విషాన్నం తిని చనిపోకుండా భీమసేనుణ్ణి రక్షించావు; దురహంకారంతో త్రుళ్లిపడుతూ దుశ్శాసనుడు ద్రౌపది కట్టుబట్టలు ఒలుస్తున్న కష్ట సమయంలో అవమానం పాలు కాకుండా ఆదుకొన్నావు; భీష్ముడూ మొదలైన యోధానుయోధాల వల్ల పోరాటంలో నా బిడ్డలకు చేటు వాటిల్లకుండా అడ్డు పడ్డావు; మళ్లీ ఇప్పుడు చిట్టితల్లి ఉత్తర కడుపులోని కసుగందును, అశ్వత్థామ శరాగ్ని జ్వాలలలో మ్రగ్గిపోకుండా కనికరించావు; మరింకా ఎన్నో విధాలుగా నన్నూ, నా బిడ్డలనూ కటాక్షించిన నిన్ను ఏ విధంగా కొనియాడేదయ్యా!
తెభా-1-190-మత్త.
బల్లిదుం డగు కంసుచేతను బాధ నొందుచు నున్న మీ
తల్లిఁ గాచిన భంగిఁ గాచితి ధార్తరాష్ట్రులచేత నేఁ
దల్లడంబునఁ జిక్కకుండఁగఁ దావకీన గుణవ్రజం
బెల్ల సంస్తుతి సేసి చెప్పఁగ నెంతదాన, జగత్పతీ!
టీక:- బల్లిదుండు = మిక్కిలి బలము గలవాడు; అగు = అయిన; కంసు = కంసుని; చేతను = చేత; బాధ = బాధలు; ఒందుచున్ = పొందుతూ; ఉన్న = ఉన్నట్టి; మీ = మీ; తల్లిన్ = తల్లిని; కాచిన = కాపాడిన; భంగిన్ = విధముగ; కాచితి = కాపాడితివి; ధార్తరాష్ట్రుల = కౌరవుల {ధార్తరాష్ట్రులు - ధృతరాష్ట్రుని సంతానము, కౌరవులు}; చేతన్ = చేత; ఏన్ = నేను; తల్లడంబునన్ = ఇబ్బందులలో; చిక్కకుండఁగన్ = చిక్కుకుపోకుండా; తావకీన = నీయొక్క; గుణ = గుణముల; వ్రజంబు = సమూహము; ఎల్లన్ = సమస్తమును; సంస్తుతి = చక్కగ కీర్తిన; చేసి = చేసి; చెప్పఁగన్ = చెప్పుటకు; ఎంతదానన్ = నేను ఎంతటి దానని; జగత్పతీ = కృష్ణా {జగత్పతి - లోకములకు ప్రభువు, కృష్ణుడు}.
భావము:- జగన్నాథా! బలవంతుడైన కంసునిబారి నుంచి మీ తల్లి దేవకీదేవిని రక్షించినట్లుగా, ధృతరాష్ట్రుని కొడుకులు అయిన కౌరవులు పెట్టిన ఇక్కట్లకు గురికాకుండా నన్ను కాపాడిన నీ అనంతకోటి గుణాలు అభివర్ణించటానికి నే నెంతదాన్ని.
తెభా-1-191-క.
జననము, నైశ్వర్యంబును,
ధనమును, విద్యయునుఁ, గల మదచ్ఛన్ను లకిం
చనగోచరుఁడగు నిన్నున్
వినుతింపఁగ లేరు, నిఖిలవిబుధస్తుత్యా!
టీక:- జననమున్ = పుట్టుటయు; ఐశ్వర్యంబును = సంపదయు; ధనమును = విత్తమును; విద్యయును = విద్యయును; కల = కలుగుటవలన; మదచ్ఛన్నులు = గర్వముతో కప్పబడినవారు; అకించన = విత్తహీనులకు; గోచరుఁడు = కనబడువాడు; అగు = అయినట్టి; నిన్నున్ = నిన్ను; వినుతింపఁగన్ = కీర్తించ; లేరు = లేరు; నిఖిలవిబుధస్తుత్యా = జ్ఞానులు అందరిచేత కీర్తింపబడేవాడా (కృష్ణా).
భావము:- నిష్కాములైన భక్తులకు మాత్రమే గోచరించేవాడు, నిఖిల దేవతా సంస్తూయమానుడు అయిన నిన్ను, గొప్పవంశంలో జన్మించామనీ, భోగభాగ్యాలు ఉన్నాయినీ, ధనవంతులము అనీ, విద్యావంతులము అనీ మదాంధులైన మానవులు ప్రస్తుతింపలేరు.
తెభా-1-192-వ.
మఱియు, భక్తధనుండును, నివృత్తధర్మార్థకామ విషయుండును, నాత్మారాముండును, రాగాదిరహితుండునుఁ, గైవల్యదాన సమర్థుండునుఁ, గాలరూపకుండును, నియామకుండును, నాద్యంతశూన్యుండును, విభుండును, సర్వసముండును, సకల భూత నిగ్రహానుగ్రహకరుండును నైన నిన్నుఁ దలంచి నమస్కరించెద, నవధరింపుము; మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయింప నెవ్వఁడు సమర్థుండు; నీకుం బ్రియాప్రియులు లేరు; జన్మకర్మశూన్యుండ వయిన నీవు తిర్యగాదిజీవుల యందు వరాహాది రూపంబులను, మనుష్యు లందు రామాది రూపంబులను, ఋషుల యందు వామనాది రూపంబులను, జలచరంబుల యందు మత్స్యాది రూపంబులను, నవతరించుట లోకవిడంబనార్థంబు గాని జన్మకర్మసహితుం డవగుటం గాదు.
టీక:- మఱియున్ = ఇంకను; భక్త = భక్తులకు; ధనుండును = ధనము అయిన వాడును; నివృత్త = నివారింపబడిన; ధర్మ = ధర్మము; అర్థ = అర్థము; కామ = కామ; విషయుండును = విషయములు కలవాడు; ఆత్మారాముండును= ఆత్మయందు రమించు వాడును; రాగాది = రాగద్వేషములు {త్రయోదశ రాగద్వేషములు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము.}; రహితుండును = లేనివాడును; కైవల్య = మోక్షమును {కైవల్యము - కేవలము తన వలె నగు స్థితి, మోక్షము}; దాన = యిచ్చుటకు; సమర్థుండును = సమర్థత గలవాడును; కాల = కాలమే; రూపకుండును = స్వరూపముగ నున్నవాడు; నియామకుండును = (సర్వ) నియంతయును; ఆది = ఆది; అంత = అంతములు; శూన్యుండును = లేనివాడును; విభుండును = ప్రభువు; సర్వ = సమస్తమునందు; సముండును = సమదృష్టి కలవాడు; సకల = సమస్త; భూత = భూతముల యందు, జీవులకును; నిగ్రహ = నిగ్రహము; అనుగ్రహ = అనుగ్రహము; కరుండునున్ = చేయువాడును; ఐన = అయినట్టి; నిన్నున్ = నిన్ను; తలంచి = స్మరించి; నమస్కరించెదన్ = నమస్కరిస్తున్నాను; అవధరింపుము = స్వీకరింపుము; మనుష్యులన్ = మానవులను; విడంబించు = భ్రమింపజేయు; భవదీయ = నీ యొక్క; విలసనంబున్ = విలాసములను; నిర్ణయింపన్ = వర్ణింపను; ఎవ్వఁడు = ఎవడు; సమర్థుండు = సమర్థత గలవాడు; నీకున్ = నీకు; ప్రియ = ప్రియమైనవారును; అప్రియులు = ప్రియముకానివారును; లేరు = లేరు; జన్మ = జన్మమును; కర్మ = కర్మమును; శూన్యుండవు = లేనివాడవు; అయిన = అయినట్టి; నీవు = నీవు; తిర్యక్ = పశుపక్ష్యాదులు {తిర్యక్ – చలనముగలవి, పశుపక్ష్యాదులు}; ఆది = మొదలగు; జీవుల = జీవుల; అందున్ = లో; వరాహ = వరాహము; ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; మనుష్యుల = మానవుల; అందున్ = లో; రామ = రాముడు; ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; ఋషుల = ఋషుల; అందున్ = లో; వామన = వామనుడు; ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; జలచరంబుల = జలచరముల; అందున్ = లో; మత్స్య= చేప; ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; అవతరించుట = అవతరించుట; లోక = లౌకిక విధానాలను; విడంబన = అనుసరించుట; అర్థంబున్ = కొరకు; కాని = తప్ప; జన్మ = జన్మములను; కర్మ = కర్మములను; సహితుండవు = కలిగివుండు వాడవు; అగుటన్ = అగుటవలన; కాదు = కాదు.
భావము:- అంతేకాకుండా, కృష్ణా! నీవు భక్తులకు కొంగుబంగారానివి; ధర్మార్థ సంబంధమైన వ్యామోహాన్ని తొలగించే వాడివి; ఆత్మారాముడివి; రాగద్వేషములు లేనివాడివి; మోక్షప్రదాతవు; కాలస్వరూపుడివి; జగన్నియంతవు; ఆద్యంతాలు లేనివాడవు; సర్వేశ్వరుడవు; సర్వసముడవు; జీవులందరి యెడ నిగ్రహానుగ్రహ సమర్థుడవు; మానవభావాన్ని అనుకరిస్తూ వర్తించే నీ లీలలు గుర్తించటం ఎవరికి సాధ్యం కాదు; నీకు ఐనవారు కానివారు లేరు; జన్మకర్మలు లేవు; జంతువులలో వరాహాదిరూపాలతో , మానవులలో రామావతారాది రూపాలతో, ఋషులలో వామనావతారాది రూపాలతో, జలచరాలలో మత్స్యాదిరూపాలతో నీవు అవతరించటం లోకం కోసమే తప్పించి నిజానికి నీకు జన్మకర్మాదులు లేనే లేవు; నీ ప్రభావాన్ని భావించి నేను చేసే నమస్కారాలు స్వీకరించు.
గమనిక :- రాగాది అనగా రాగద్వేషములు, ఇవి పదమూడు. 1.రాగము, 2.ద్వేషము, 3.కామము, 4.క్రోధము, 5.లోభము, 6.మోహము, 7.మదము, 8.మాత్సర్యము, 9.ఈర్ష్య, 10.అసూయ, 11.దంభము, 12.దర్పము, 13అహంకారము ఈ పదమూడింటిని త్రయోదశరాగద్వేషములు అంటారు. ఈ రాగద్వేషములు లేని వారిని శాంతమూర్తి అంటారు.
తెభా-1-193-ఉ.
కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో
గోపిక ద్రాటఁ గట్టిన, వికుంచిత సాంజన బాష్పతోయ ధా
రాపరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు, వెచ్చనూర్చుచుం,
బాపఁడవై నటించుట కృపాపర! నా మదిఁ జోద్య మయ్యెడిన్.
టీక:- కోపము = కినుక; తోడన్ = తో; నీవు = నీవు; దధి = పాల; కుంభము = కుండ; భిన్నము = ముక్కలు; చేయుచు = చేస్తూ; ఉన్నచోన్ = ఉన్నపుడు; గోపిక = యశోదాదేవి ; త్రాటన్ = తాడుతో; కట్టిన = కట్టగా; వికుంచిత = వంచిన, జారిన; సాంజన = కాటుకతో కూడిన; బాష్పతోయ = కన్నీటి; ధారా = ధారలతో; పరిపూర్ణ = నిండిన; వక్త్రమున్ = ముఖమును; కరంబులన్ = చేతులతో; ప్రాముచు = అలము కొనుచు; వెచ్చనూర్చుచున్ = వేడినిట్టూర్పులు నిట్టూరుస్తూ; పాపఁడవు = శిశువు; ఐ = అయి; నటించుట = నటించుట; కృప = దయను; పర = ప్రసరించువాడా; నా = నా యొక్క; మదిన్ = మనసులో; చోద్యము = ఆశ్చర్యమును; అయ్యెడిన్ = కలిగిస్తోంది.
భావము:- దయామయా! శ్రీకృష్ణా! చిన్నప్పుడు నీవు ఒకసారి కోపంవచ్చి పాలకుండ బద్దలు కొట్టావు. అప్పుడు మీ అమ్మ యశోదాదేవి తాడు పట్టుకొని వచ్చి కట్టేసింది. అన్నీ తెలిసిన నువ్వేమో కాటుక కలిసిన కన్నీటి ధారలను చేత్తో పామేసుకుంటూ, ఉడికిపోతూ చంటిపిల్లాడిలా నటించటం తలచుకుంటే, ఇప్పటికి నా మనసులో ఆశ్చర్యం కలుగుతోందయ్యా.
తెభా-1-194-క.
మలయమునఁ జందనము క్రియ
వెలయఁగ ధర్మజుని కీర్తి వెలయించుటకై
యిలపై నభవుఁడు హరి యదు
కులమున నుదయించె నండ్రు గొంద, ఱనంతా!
టీక:- మలయమునన్ = మలయపర్వతముమీది; చందనము = గంధపుచెట్టు సువాసన; క్రియన్ = వలె; వెలయఁగన్ = విస్తరించునట్లు; ధర్మజుని = ధర్మరాజు యొక్క {ధర్మజుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; కీర్తి = కీర్తిని; వెలయించుట = ప్రకాశింజేయుట; కై = కోసం; ఇల = భూమి; పై = మీద; అభవుఁడు = కృష్ణుడు {అభవుడు - పుట్టుకలేనివాడు, విష్ణువు}; హరి = కృష్ణుడు; యదు = యదు; కులమునన్ = వంశములో; ఉదయించెన్ = అవతరించెను; అండ్రు = అందురు; కొందఱు = కొందరు; అనంతా = అంతము లేనివాడా, కృష్ణా.
భావము:- ధర్మనందనుని యశస్సు, మలయ మారుతముచే చందనవృక్షపు సౌరభాలు విస్తరించే చందమున, సలుదెసలా ప్రసరింపజేయటానికి, శ్రీకృష్ణా! పుట్టుక ఎరుగని పురుషోత్తముడవైన నీవు యదువంశంలో ఉదయించావని కొంద రంటారు.
తెభా-1-195-క.
వసుదేవదేవకులు తా
పసగతి గతభవమునందుఁ బ్రార్థించిన సం
తసమునఁ బుత్త్రత నొందితి
వసురుల మృతి కంచుఁ గొంద ఱండ్రు, మహాత్మా!
టీక:- వసుదేవ = వసుదేవుడు; దేవకులు = దేవకీదేవులు; తాపస = తాపసుల యొక్క; గతిన్ = వృత్తితో; గత = పూర్వ; భవమునందున్ = జన్మలో; ప్రార్థించినన్ = ప్రార్థించుటవలన; సంతసమునన్ = సంతోషముతో; పుత్త్రతన్ = పుత్రుడుగా ఉండుట; ఒందితివి = వహించితివి; అసురుల = రాక్షసుల; మృతి = మృతి; కిన్ = కోసము; అంచున్ = అనుచు; కొందఱు = కొందరు; అండ్రు = అందురు; మహాత్మా = గొప్ప ఆత్మకలవాడా, కృష్ణా.
భావము:- పూర్వజన్మంలో అపూర్వమైన తపస్సు చేసి దేవకీ వసుదేవులు ప్రార్థించగా, మహానుభావా! శ్రీకృష్ణా! రాక్షస సంహారం కోసం ఆ పుణ్యదంపతులకు పుత్రుడవై పుట్టావని కొందరు చెబుతారు.
తెభా-1-196-క.
జలరాశి నడుమ మునిగెఁడు
కలము క్రియన్ భూరిభారకర్శితయగు నీ
యిలఁ గావ నజుఁడు గోరినఁ
గలిగితి వని కొంద ఱండ్రు, గణనాతీతా!
టీక:- జలరాశి = సముద్రము; నడుమ = మధ్యన; మునిగెఁడు = మునిగిపోతున్న; కలము = ఓడ; క్రియన్ = వలె; భూరి = అత్యంత; భార = భారముతో; కర్శిత = పీడితము; అగు = అయినట్టి; ఈ = ఈ; ఇలన్ = భూమిని; కావన్ = కాపాడుటంకోసం; అజుఁడు = బ్రహ్మ {అజుఁడు - భౌతిక జన్మము లేనివాడు, బ్రహ్మ}; కోరినన్ = కోరగా; కలిగితివి = అవతరించావు; అని = అని; కొందఱు = కొందరు; అండ్రు = అంటారు; గణనాతీతా = కృష్ణా {గణనాతీత - ఎంచుటకు అతీతమైన వాడు, కృష్ణుడు}.
భావము:- బ్రహ్మదేవుడు ప్రార్థింపగా నట్టనడి సముద్రంలో మునిగిపోతున్న నావలాగ భరింపరాని బరువుతో క్రుంగిపోతున్న భూమండలాన్ని ఉద్ధరించటం కోసం, అంచనాలకి అందని అనంత! శ్రీకృష్ణా! నీవు అవతారం ఎత్తావంటారు మరికొందరు.
తెభా-1-197-తే.
మఱచి యజ్ఞాన కామ కర్మములఁ దిరుగు
వేదనాతురులకుఁ దన్నివృత్తిఁ జేయ
శ్రవణ, చింతన, వందనార్చనము లిచ్చు
కొఱకు నుదయించి తండ్రు నిన్ గొంద ఱభవ!
టీక:- మఱచి = మర్చిపోయి; అజ్ఞాన = అజ్ఞనముతో; కామ = ఫలితమును కోరి చేయు; కర్మములన్ = కర్మములందు; తిరుగు = తిరుగుతుండే; వేదన = బాధలుచే; ఆతురులు = పీడింపబడే వారు; కున్ = కి; తత్ = వానినుండి; నివృత్తిన్ = నివారించుటను; చేయన్ = చేయు నిమిత్తము; శ్రవణ = (తన గురించి) వినుట; చింతన = ధ్యానించుట; వందన = నమస్కారము చేయుట; అర్చనములు = పూజించుటలు; ఇచ్చు = ఇచ్చుట; కొఱకున్ = కోసము; ఉదయించితి = అవతరించితివి; అండ్రు = అంటారు; నిన్ = నిన్ను; కొందఱు = కొందరు; అభవ = పుట్టుక లేనివాడా, కృష్ణా.
భావము:- కర్తవ్యం విస్మరించి, కామ్యకర్మలలో మునిగి తేలుతూ, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న ఆపన్నుల ఆర్తి పోగొట్టి, వారికి శ్రవణం, చింతనం, వందనం, అర్చనం మొదలైన భక్తి మార్గాలను ప్రసాదించే నిమిత్తం, పుట్టుకే లేని పురుషోత్తమ! శ్రీకృష్ణా! నీవు అవతరించావని కొందరి అభిప్రాయం.
తెభా-1-198-మ.
నినుఁ జింతించుచుఁ, బాడుచుం, బొగడుచున్ నీ దివ్యచారిత్రముల్
వినుచుం జూతురుగాక లోకు లితరాన్వేషంబులం జూతురే
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ! విశ్వంభరా!
టీక:- నినున్ = నిన్ను; చింతించుచున్ = ధ్యానముచేస్తూ; పాడుచున్ = భజనలు పాడుతూ; పొగడుచున్ = కీర్తిస్తూ; నీ = నీ; దివ్య = దివ్యమైన; చారిత్రముల్ = కథలు; వినుచున్ = వింటూ; చూతురున్ = దర్శించగలుగుతారు; కాక = అంతే తప్ప; లోకులు = మానవులు; ఇతర = ఇతరమైన; అన్వేషంబులన్ = వెతుకులాటలవలన; చూతురే = దర్శించగలరా; ఘన = కరడుగట్టిన; దుర్జన్మ = చెడ్డజన్మల; పరంపరా = వరుసలను; హరణ = కృశింపజేయుటకు; దక్షంబు = సామర్థ్యము గలవి; ఐ = అయి; మహా = గొప్ప; యోగి = యోగుల; వాక్ = వాక్కులచే; వినుతంబు = స్తోత్రము చేయబడునవి; ఐన = అయినట్టి; భవత్ = నీయొక్క; పద = పాదములనే; అబ్జ = పద్మముల; యుగమున్ = జంటను; విశ్వేశ = విశ్వేశుడు - కృష్ణా {విశ్వమునకు ఈశ్వరుడు, కృష్ణ}; విశ్వంభరా = కృష్ణా {విశ్వంభరుడు - విశ్వమును భరించువాడు, కృష్ణ}.
భావము:- ఎల్లప్పుడు నిన్నే ధ్యానిస్తూ, నీ లీలలే గానం చేస్తూ, నిన్నే ప్రశంసిస్తూ, నీ పవిత్ర చరిత్రలే వింటూ ఉండే వారు మాత్రమే, విశ్వేశ్వరా! విశ్వంభరా! శ్రీకృష్ణా! దురంతాలైన జన్మపరంపరలను అంతం చేసేవీ, పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవీ అయిన నీ పాదపద్మాలను, దర్శించగలుగుతారు. అంతేతప్ప మరింకే ఇతర ప్రయత్నాలు ఫలవంతాలు కావు.
తెభా-1-199-వ.
దేవా! నిరాశ్రయులమై, భవదీయ చరణారవిందంబు లాశ్రయించి నీ వారల మైన మమ్ము విడిచి విచ్చేయ నేల, నీ సకరుణావలోకనంబుల నిత్యంబునుఁ జూడవేని యాదవసహితులైన పాండవులు జీవునిం బాసిన యింద్రియంబుల చందంబునఁ గీర్తిసంపదలు లేక తుచ్ఛత్వంబు నొందుదురు; కల్యాణ లక్షణ లక్షితంబులయిన నీ యడుగులచేత నంకితంబైన యీ ధరణీమండలంబు నీవు వాసిన శోభితంబుగాదు; నీ కృపావీక్షణామృతంబున నిక్కడి జనపదంబులు గుసుమ ఫలభరితంబులై యోషధి, తరు, లతా, గుల్మ, నద, నదీ, సమేతంబులై యుండు.
టీక:- దేవా = దేవా, శ్రీకృష్ణా; నిరాశ్రయులము = ఆశ్రమము లేని వారము (ఇతర); ఐ = అయి; భవదీయ = నీ యొక్క; చరణ = పాదములనెడి; అరవిందంబులున్ = పద్మములను; ఆశ్రయించి = ఆశ్రయించి; నీ = నీ; వారలము = వారము; ఐన = అయినట్టి; మమ్ము = మమ్ములను; విడిచి = విడిచిపెట్టి; విచ్చేయన్ = వెళ్ళుట; ఏల = ఎందుకు; నీ = నీ; సకరుణ = దయతో కూడిన; అవలోకనంబులన్ = చూపులతో, దృక్కులతో; నిత్యంబును = ప్రతినిత్యము; చూడవేని = చూడకపోయినట్లైతే; యాదవ = యాదవులతో; సహితులు = కూడిన వారు; ఐన = అయిన; పాండవులు = పాండవులు {పాండురాజు సంతానము - పంచపాండవులు}; జీవునిన్ = ప్రాణం; పాసిన = దూరమైన; ఇంద్రియంబుల = ఇంద్రియముల; చందంబునన్ = వలె; కీర్తి = కీర్తిని; సంపదలు = సంపదలును; లేక = లేకుండాపోయి; తుచ్ఛత్వంబున్ = నీచత్వమును; ఒందుదురు = పొందుతారు; కల్యాణ = శుభమైన; లక్షణ = లక్షణములకు; లక్షితంబులు = గురుతులు; అయిన = అయినట్టి; నీ = నీ; అడుగుల = పాదములు; చేతన్ = చేత; అంకితంబు = గుర్తులు వేయబడినది; ఐన = అయినట్టి; ఈ = ఈ; ధరణీ = భూ; మండలంబున్ = మండలము; నీవు = నీవు; వాసిన = విడిచినట్లైన; శోభితంబు = శోభాయమానము; కాదు = కాదు; నీ = నీ; కృపా = దయతో కూడిన; వీక్షణ = చూపులనే; అమృతంబున = అమృతమువలననే; ఇక్కడి = ఇక్కడి; జనపదంబులు = ఊర్లు; కుసుమ = పువ్వులతోను; ఫల = పండ్లతోను; భరితంబులు = నిండినవి; ఐ = అయి; ఓషధి = మొక్కలు {ఓషధి - ఫలించగానే మరణించు నవి (ధాన్యాదులు), మొక్కలు}; తరు = చెట్లు; లతా = లతలు, తీగలు; గుల్మ = పొదలు; నద = నదములు {నదము - పడమరకు ప్రవహించు నది}; నదీ = నదులు {నది - తూర్పునకు ప్రవహించు నదము}; సమేతంబులు = తో కూడినవి; ఐ = అయి; ఉండున్ = ఉండును.
భావము:- దేవదేవ! శ్రీకృష్ణా! నీ వారలమయ్యా. నిరాశ్రయులమై నీ చరణ కమలాలనే ఆశ్రయించామయ్యా; అటువంటి మమ్మల్ని విడిచి వెళ్లటం న్యాయం కాదు. కరుణామయుడవైన నీవు నిత్యం కటాక్ష వీక్షణాలతో వీక్షించకపోతే యాదవులు, పాండవులు; జీవాత్మను ఎడబాసిన పంచేంద్రియాల వలె పేరు ప్రతిష్ఠలు కోల్పోయి, దిక్కులేనివారు అవుతారు; సమస్త శుభలక్షణాలతో అలరారే నీ పాదపంకజాల ముద్రలతో అంచితమైన ఈ భూభాగం పల్లెలు, పుష్ప, ఫల సమృద్ధి కలిగి ప్రకాశిస్తోంది. పండిన పంటచేలు, వృక్షాలు, లతలు, పొదలు, నదీనదాలు కలిగి ఉంది.
తెభా-1-200-ఉ.
యాదవు లందుఁ, బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి
చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!
టీక:- యాదవులందున్ = యదు వంశమువారి మీదను; పాండుసుతులందున్ = పాండురాజు పుత్రుల మీదను; అధీశ్వర = ప్రభూ; నాకు = నాకున్న; మోహ = మోహమును; విచ్ఛేదమున్ = విమోచనము; సేయుము = చేయుము; అయ్య = అయ్యా; ఘనసింధువున్ = సముద్రము {ఘనసింధువు - అత్యధికమైన నీరుగలది, సముద్రము}; చేరెడి = చేరేటటువంటి; గంగ = గంగ; భంగిన్ = వలెను; నీ = నీయొక్క; పాద = పాదములను; సరోజ = పద్మముల; చింతనము = భక్తి; పైన్ = మీద; అనిశంబు = ఎల్లప్పుడు; మదీయ = నాయొక్క; బుద్ధిన్ = మనసుని; అతి = మిక్కిలి; ఆదర = ఆదరమైన; వృత్తి = ప్రవర్తన; తోన్ = తో; కదియునట్లుగన్ = కూడి ఉండునట్లుగా; చేయన్ = చేయవచ్చు; కద = కదా; అయ్య = అయ్యా; ఈశ్వరా = ఈశ్వరుడా, శ్రీకృష్ణా.
భావము:- స్వామీ! విశ్వేశ్వరా! శ్రీకృష్ణా! ఆత్మీయులైన యాదవులమీద, పాండవులమీద నాకున్న అనురాగ బంధాన్ని తెంపెయ్యి. కడలిలో కలిసే గంగానదిలా, నా బుద్ధి సర్వదా నీ చరణసరోజ సంస్మరణంలోనే లగ్న మయ్యేటట్లు చెయ్యి.
తెభా-1-201-శా.
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!"
టీక:- శ్రీకృష్ణా = కృష్ణా {కృష్ణుడు - 1. నల్లనివాడు, 2. భక్తుల హృదయములు ఆకర్షించువాడు, 3. శ్లో. కృషిర్భూవాచకశ్శబ్దో నశ్చ నిరృతివాచకః, పూర్ణానంద పరబ్రహ్మ కృష్ణ ఇత్యభీయతే., పూర్ణానంద పరబ్రహ్మము, కృష్ణుడు, నల్లనివాడు, 4. కృఞకరణే అను ధాతువుచేత సృష్టిస్థితిలయములను చేయువాడు, 5. శ్లో. కృషిర్భూవాచకశ్శబ్దోనశ్చ నిర్వృతివాచకః, తయోరైక్యాత్పరంబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే (ప్రమాణము), అజ్ఞానబంధమును తెంచివేయువాడు, కృష్ణుడు, , సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు, విష్ణుస్హస్రనామములలో 57వ నామం, 550వ నామం}; యదుభూషణా = కృష్ణా {యదు భూషణుడు - యదు వంశమునకు భూషణము వంటి వాడు, కృష్ణుడు}; నరసఖా = కృష్ణా {నరసఖుడు - అర్జునునకు సఖుడు, కృష్ణుడు}; శృంగారరత్నాకరా = కృష్ణా {శృంగార రత్నాకరుడు - శృంగార రసమునకు సముద్రము వంటివాడు, కృష్ణుడు}; లోకద్రోహినరేంద్రవంశదహనా = కృష్ణా {లోకద్రోహినరేంద్రవంశదహన - దుష్టరాజవంశముల నాశనము చేయువాడు, కృష్ణుడు}; లోకేశ్వరా = కృష్ణా {లోకేశ్వరుడు - లోకములకు ఈశ్వరుడు, కృష్ణుడు}; దేవతానీకగోబ్రాహ్మణార్తి హరణా = కృష్ణా {దేవతానీకగోబ్రాహ్మణార్తి హరణుడు - దేవత = దేవతల, అనీక = సమూహమునకును, బ్రాహ్మణ = బ్రాహ్మణులకును, గోగణ = గోవులమందకును, ఆర్తి = బాధలను, హరణా = హరించువాడు, కృష్ణుడు}; నిర్వాణ సంధాయకా = కృష్ణా {నిర్వాణ సంధాయికుడు - మోక్షమును కలింగించువాడు, కృష్ణుడు}; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరిస్తున్నాను; త్రుంపవే = తెంపుము; భవ = సంసార; లతల్ = బంధనములు; నిత్యానుకంపానిధీ = కృష్ణా {నిత్యానుకంపానిధి -శాశ్వతమైన దయకు నిలయమైనవాడు, కృష్ణుడు}.
భావము:- శ్రీ కృష్ణా! యదుకులవిభూషణా! అర్జునమిత్రా! శృంగార రత్నాకరా! జగత్కంటకులైన రాజుల వంశాలను దహించే వాడా! జగదీశ్వరా! ఆపన్నులైన దేవతల, బ్రాహ్మణుల, ఆవులమందల ఆర్తులను బాపువాడా! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకీ ఈ భవబంధాలను తెంపెయ్యి.
తెభా-1-202-వ.
అని యిట్లు సకలసంభాషణంబుల నుతియించు గొంతిమాటకు నియ్యకొని, గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబు నొందించి, రథారూఢుండై కరినగరంబునకు వచ్చి, కుంతీసుభద్రాదుల వీడ్కొని, తన పురంబునకు విచ్చేయ గమకించి, ధర్మరాజుచేఁ గించిత్కాలంబు నిలువు మని ప్రార్థితుండై, నిలిచె; నంత బంధువధశోకాతురుం డయిన ధర్మజుండు నారాయణ, వ్యాస, ధౌమ్యాదులచేతఁ దెలుపంబడియుఁ దెలియక మోహితుండై, నిర్వివేకం బగు చిత్తంబున నిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధంగా; సకల = సమస్త; సంభాషణంబులన్ = పదముల; నుతియించు = కీర్తించు; గొంతి = కుంతీదేవి; మాట = మాటలు; కున్ = కి; ఇయ్యకొని = అంగీకరించి; గోవిందుండు = కృష్ణుడు {గోవిందుడు - గోవులకు ఒడయుడు (స్వామి), కృష్ణుడు}; మాయా = మాయను; నిరూఢ = నెలకొల్పే; మందహాస = చిరునవ్వు; విశేషంబున = విశిష్టతవలన; మోహంబున్ = మోహమును; ఒందించి = కలిగించి; రథా = రథమును; ఆరూఢుండు = అధిష్టించినవాడు; ఐ = అయి; కరినగరంబు = హస్తినాపురము; కున్ = కు; వచ్చి = వచ్చి; కుంతీ = కుంతియొక్క; సుభద్ర = సుభద్ర; ఆదుల = మొదలగువారి యొక్క; వీడ్కొని = వీడ్కోలు తీసుకొని; తన = తన యొక్క; పురంబు = నగరాని; కున్ = కి; విచ్చేయ = వెళ్ళవలెనని; గమకించి = సంకల్పించి; ధర్మరాజు = ధర్మరాజు; చేన్ = చేత; కించిత్ = కొంచెము; కాలంబు = కాలము; నిలువుము = ఆగుము; అని = అని; ప్రార్థితుండు = వేడుకొనబడినవాడు; ఐ = అయి; నిలిచెన్ = ఆగెను; అంతన్ = అంతట; బంధు = బంధువులను; వధ = వధించిన; శోక = బాధతో; ఆతురుండు = వేదనపడుతున్నవాడు; అయిన = అయినట్టి; ధర్మజుండు = ధర్మరాజు; నారాయణ = కృష్ణుడు {నారాయణుడు - నారముల యందు నివశించువాడు, విష్ణువు}; వ్యాస = వ్యాసుడు; ధౌమ్య = ధౌమ్యుడు; ఆదులు = మొదలగువారి; చేతన్ = చేత; తెలుపంబడియున్ = తెలియజేయబడి నప్పటికీ; తెలియక = సమాధానపడలేక; మోహితుండు = మోహము చెందినవాడు; ఐ = అయి; నిర్వివేకంబు = వివేకశూన్యంము; అగు = అయిన; చిత్తంబునన్ = మనసుతో; ఇట్లు = ఈ విధంగా; అనియెన్ = పలికెను.
భావము:- ఈ విధంగా కుంతీదేవి మధురోక్తులతో మాధవుణ్ణి కొనియాడింది. ఆమె ప్రార్థనను అంగీకరించిన శ్రీకృష్ణుడు మాయా మయమైన తన మధుర మందహాసంతో మైమరపించాడు; రథారూఢుడై హస్తినాపురానికి తిరిగివచ్చాడు. కొంతకాలమైన తరువాత కుంతి, సుభద్ర మొదలగువారికి చెప్పి ద్వారకానగరానికి ప్రయాణమైనాడు గోవిందుడు; కొద్దికాలం ఉండమని ధర్మరాజు బతిమిలాడటంతో ఉండిపోయాడు; చుట్టాలందరినీ మట్టు పెట్టానన్న దుఃఖంతో తల్లడిల్లుతున్న ధర్మజుణ్ణి కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైనవారు ఎన్నో విధాల ఓదార్చారు; అయినా, ఆయన మనస్సు ఊరట చెందలేదు; వ్యాకులమైన హృదయంతో ధర్మరాజు ఇలా అనుకోసాగాడు.
తెభా-1-203-మ.
"తనదేహంబునకై యనేకమృగసంతానంబుఁ జంపించు దు
ర్జనుభంగిం గురు, బాలక, ద్విజ, తనూజ, భ్రాతృ సంఘంబు ని
ట్లనిఁ జంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ నాకు హా
యన లక్షావధి నైన ఘోరనరకవ్యాసంగముల్ మానునే?
టీక:- తన = తన యొక్క; దేహంబు = దేహ పోషణాదులు; కై = కోసం; అనేక = అనేకమైన; మృగ = మృగముల; సంతానంబున్ = సమూహమును; చంపించు = సంహరించు; దుర్జను = చెడ్డవాని; భంగిన్ = వలె; గురు = గురువుల; బాలక = పిల్లల; ద్విజ = బ్రాహ్మణుల; తనూజ = పుత్రుల; భ్రాతృ = సోదరుల; సంఘంబున్ = సమూహములను; ఇట్లు = ఈ విధంగా; అనిన్ = యుద్ధములో; చంపించిన = చనిపోవునట్లు చేసిన; పాప = పాపం; కర్ముడు = చేసినవాడి; కున్ = కి; రాజ్య = రాజ్యముమీద; ఆకాంక్షి = బలీయమైన కోరికతో వేగువాడి; కిన్ = కి; నాకు = నాకు; హాయన = సంవత్సరములు; లక్ష = లక్షలకొలది; అవధి = మేర; ఐనన్ = జరుగునట్టి; ఘోర = ఘోరమైన; నరక = నరకమువలన; వ్యాసంగముల్ = సంబంధములు, వసించుటలు; మానునే = తప్పునే (తప్పవు).
భావము:- అమాయకమైన మృగాలను ఎన్నింటినో తన శరీరపోషణకోసం అని చంపించే దుర్మార్గుడిలా, రాజ్యంకోసం అని గురువులను, బాలకులను, బ్రాహ్మణులను, కొడుకులను, అన్నదమ్ములను యుద్ధరంగంలో చంపించాను. ఇంతటి పాపానికి ఒడిగట్టిన నేను లక్షల సంవత్సరాల పర్యంతం ఘోరమైన నరకం అనుభవించక తప్పదు కదా.
తెభా-1-204-వ.
మఱియుఁ, బ్రజాపరిపాలనపరుం డయిన రాజు ధర్మయుద్ధంబున శత్రువుల వధియించినం బాపంబు లేదని, శాస్త్రవచనంబు గల; దయిన నది విజ్ఞానంబు కొఱకు సమర్థంబు గాదు; చతురంగంబుల ననేకాక్షౌహిణీ సంఖ్యాతంబులం జంపించితి; హతబంధు లయిన సతుల కేనుఁ జేసిన ద్రోహంబు దప్పించుకొన నేర్పు లేదు; గృహస్థాశ్రమధర్మంబు లైన తురంగమేధాది యాగంబులచేతఁ బురుషుండు బ్రహ్మహత్యాది పాపంబుల వలన విడివడి నిర్మలుం డగు నని, నిగమంబులు నిగమించు; పంకంబునఁ బంకిలస్థలంబునకు, మద్యంబున మద్యభాండంబునకును శుద్ధి సంభవింపని చందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబు లయిన యాగంబులచేతం బురుషులకుఁ బాప బాహుళ్యంబ కాని పాపనిర్ముక్తి గాదని శంకించెద."
టీక:- మఱియున్ = ఇంకా; ప్రజా = ప్రజలను; పరిపాలన = పరిపాలించుట; పరుండు = చేయవలసినవాడు; అయిన = అయినట్టి; రాజు = రాజు; ధర్మ = ధర్మబద్ధమైన; యుద్ధంబున = యుద్ధముతో; శత్రువులన్ = శత్రువులను; వధియించినన్ = సంహరించినప్పటికీ; పాపంబు = పాపము; లేదు = లేదు, అంటదు; అని = అని; శాస్త్ర = శాస్త్రములు చెప్పిన; వచనంబున్ = మాట; కలదు = ఉంది; అయినన్ = అయిననూ; అది = అది; విజ్ఞానంబు = విజ్ఞానము; కొఱకున్ = వలన; సమర్థంబు = సరియయినది; కాదు = కాదు; చతురంగంబులన్ = చతురంగబలములతో {చతురంగము - రథములు, ఏనుగులు, గుఱ్ఱములు, కాల్బలము అను సేనా భాగములుతో కూడిన సేన}; అనేక = లెక్కలేనన్ని; అక్షౌహిణీ = అక్షౌహిణుల {అక్షోహిణి - ఇరవైఒక్కవేల ఎనిమిదివందల డెబ్బై రథములు, అన్ని ఏనుగులు, అరవైయైదువేల నాలుగువందల పది గుఱ్ఱాలు, లక్షా తొమ్మిదివేల మూడు వందల యాభై కాల్బలమును కల సేనావిశేషము}; సంఖ్యాతంబులన్ = సంఖ్యలలోనున్న వాటిని; చంపించితిన్ = చనిపోవునట్లు చేసి; హత = చంపబడిన; బంధులు = బంధువులు; అయిన = అయిన; సతులు = స్త్రీలు; కున్ = కు; ఏను = నేను; చేసిన = చేసినటువంటి; ద్రోహంబున్ = ద్రోహమును; తప్పించుకొనన్ = తప్పించుకోడానికి; నేర్పు = మార్గము; లేదు = లేదు; గృహస్థాశ్రమ = గృహస్థాశ్రమపు; ధర్మంబులు = ధర్మాలు; ఐన = అయినట్టి; తురంగమేధ = అశ్వమేధము; ఆది = మొదలగు; యాగంబులు = యాగములు; చేతన్ = చేత; పురుషుండు = మానవుడు; బ్రహ్మహత్య = బ్రాహ్మణులను చంపుట; ఆది = మొదలగు; పాపంబుల = పాపముల; వలనన్ = నుండి; విడివడి = బయటపడి; నిర్మలుండు = నిర్మలమైనవాడు; అగున్ = అగును; అని = అని; నిగమంబులు = వేదములు, నిగమించునవి; నిగమించున్ = నిర్ణయిస్తున్నాయి; పంకంబునన్ = బురదతో; పంకిలస్థలంబు = బురదనేల; కున్ = కును; మద్యంబున = మద్యము వలన; మద్యభాండంబు = మద్యపుకుండ; కున్ = కును; శుద్ధి = పరిశుభ్రత; సంభవింపని = కలుగని; చందంబునన్ = విధంగా; బుద్ధి = ఇష్ట; పూర్వక = పూర్వకముగా చేయు; జీవహింసనంబులు = జీవులనుచంపుటలు; అయిన = అయినట్టి; యాగంబులు = యజ్ఞముల; చేతన్ = వలన; పురుషులు = మానవుల; కున్ = కు; పాప = పాపముల; బాహుళ్యంబ = వృద్ధియే; కాని = కాని; పాప = పాపములనుండి; నిర్ముక్తి = విముక్తి; కాదు = కాదు; అని = అని; శంకించెదన్ = అనుమానిస్తాను.
భావము:- ప్రజలను పరిపాలించే రాజు ధర్మబుద్ధితో శత్రువులను చంపటంలో దోషం లేదని శాస్త్రాలు చెప్పుతున్నాయి. అయినా, ఆలోచించి చూస్తే ఈ మాట నాకు సమంజసం అనిపించటం లేదు. రథాలతో, ఏనుగులతో, గుఱ్ఱాలతో, కాలిబంట్లతో కూడిన పెక్కు అక్షౌహిణుల సైన్యాలను చంపించాను. పతులను, బంధువులను హతమార్చి సతులకు నేను చేసిన మహాద్రోహం క్షమించరానిది. నా యీ పాపానికి నిష్కృతి లేదు. గృహస్థధర్మాలైన అశ్వమేధం మొదలైన యజ్ఞాలు ఆచరిస్తే బ్రహ్మహత్య మొదలగు దోషాలు పరిహారం అవుతాయని వేదాలు చెప్పుతున్నాయి.. కాని బురదవల్ల బురదనేల పరిశుభ్రం కాదు. కల్లుపోసి కడిగి నందువల్ల కల్లుకుండకు శుద్ధి లభించదు. అలాగే బుద్ధి పూర్వకంగా చేసే జీవహింసతో కూడిన యజ్ఞాలవల్ల మానవుల పాపం పెరుగుతుందే కాని తరగదని నా అనుమానం.