పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/సుద్యుమ్నాదుల చరిత్ర

వికీసోర్స్ నుండి

సుద్యుమ్నాదుల చరిత్ర

తెభా-9-10.1-తే.
హోత పెడచేత నిల యను నువిద పుట్టె
దానిఁ బొడగని మనువు సంతాప మంది,
"కొడుకుమేల్ గాక; యేటికిఁ గూతు? రకట
చెప్పవే"యని పోయె వసిష్ఠుకడకు.

టీక:- మనువు = (వైవత్స) మనువు; బిడ్డలు = పుత్రులు; పుట్టన్ = కలుగుటకు; మఖమున్ = యజ్ఞమును; ఆచరించుచోన్ = చేయునప్పుడు; అతని = అతని యొక్క; భార్యయున్ = పెండ్లాము; హోతన్ = హోతను {హోత - హోమము (అగ్నికర్మను) చేయువాడు}; ఆశ్రయించి = చేరి; కూతురు = పుత్రిక; పుట్టన్ = కలుగునట్లు; నా = నా; కున్ = కు; చేయుము = చేయవలసినది; అని = అని; పల్కి = అడిగి; వర = ఉత్తమమైన; భక్తిన్ = భక్తి; తోన్ = తోటి; పయోవ్రతమున్ = పయోవ్రతమును {పయోవ్రతము - నీరుమాత్రము తీసుకొనెడి ఉప్పోషము, నిరాహార వ్రతము}; సలిపె = చేసెను; ఆ = ఆ; సతి = స్త్రీ; చెప్పిన = అడిగిన; అట్ల = ఆ విధముగ; అధ్వర్యుడును = అధ్వర్యుడు {అధ్వర్యుడు - యాగమునందు అధ్వర్యము చేయు ఋత్వికుడు, యాజి}; హోతన్ = హోతను; అగుగాక = కానిమ్ము; వేలుపుము = హోమముచేయుము; అనుచున్ = అంటూ; పలికెన్ = చెప్పెను; హవిస్ = హోమద్రవ్యమును {హవిస్సు - 1హోమము చేయుటకైన ఇగురబెట్టిన అన్నము 2నెయ్యి}; అందుకొని = తీసుకొని; కూతురు = పుత్రిక; అయ్యెడుము = కలుగుగాక; అని = అని; వషట్కారంబు = వషట్కారములు {వషట్కారము - వేల్చునపుడు హవిస్సు త్యాగము చేయుచు వౌషట్ అని పలుకుట}; చెప్పుచున్ = పలుకుతు; కదిసి = చేరి; వేల్వన్ = ఆహుతిచేయగా.
హోత = హోతయొక్క; పెడచేతన్ = తప్పుపనివలన; ఇల = ఇల; అనున్ = అనెడి; ఉవిద = ఇంతి, స్త్రీ; పుట్టెన్ = కలిగినది; దానిన్ = దానిని; పొడగని = చూసి; మనువు = ఆ మనువు; సంతాపము = బాధ; అంది = పడి; కొడుకున్ = పుత్రుడుకలిగిన; మేల్ = మంచిది; కాక = అలాకాకుండగ; ఏటికి = ఎందుచేత; కూతురున్ = పుత్రికకలిగినది; అకట = అయ్యో; చెప్పవే = తెలుపుము; అని = అనుకొని; పోయెన్ = వెళ్ళెను; వసిష్ఠున్ = వసిష్ఠుని; కడ = వద్ద; కున్ = కు.
భావము:- వైవస్వత మనువు పుత్రుల కోసం యజ్ఞము చేసేటప్పుడు అతని భార్య దితి హోతను పుత్రిక పుట్టేలా చేయమని అడిగింది. భక్తిగా పయోవ్రతమును చేసింది. అధ్వర్యుడు హోమ ద్రవ్యమును పుత్రిక కలుగుగాక అని వషట్కారములు పలుకుతుండగా ఆహుతిచేసాడు. ఆ హోత తప్పుపనివలన ఇల అనెడి ఇంతి కలిగింది. ఆమెను చూసి మనువు బాధ పడి “పుత్రుడు కాకుండగ పుత్రిక ఎందుకు కలిగింది” అనుకొని వసిష్ఠుని వద్దకు వెళ్ళాడు.

తెభా-9-11-వ.
చని యిట్లనియె.
టీక:- చని = వెళ్ళి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా వెళ్ళిన మనువు ఇలా అన్నాడు.

తెభా-9-12-క.
"అయ్యా! కొడుకుల కొఱకై
యియ్యాగము నీ యనుజ్ఞ నేఁ జేయంగా
నియ్యాఁడు దేల పుట్టెను?
మియ్యంతటివారి కొండు మేరయుఁ గలదే!

టీక:- అయ్యా = తండ్రీ; కొడుకుల్ = పుత్రుల; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; ఈ = ఈ; యాగమున్ = యజ్ఞమును; నీ = నీయొక్క; అనుజ్ఞన్ = అనుమతితో; చేయంగా = ఆయరించగా; ఈ = ఈ; ఆడుది = ఇంతి, స్త్రీ; ఏల = ఎందుచేత; పుట్టెను = కలిగినది; మీ = తమ; అంతటి = అంతగొప్ప; వారి = వారల; కిన్ = కును; ఒండు = ఇంకొక; మేర = విధముగజరుగుట; కలదే = ఉన్నదా.
భావము:- “తండ్రీ! పుత్రుల కోసం ఈ యజ్ఞమును ఆచరించగా ఈ ఇంతి ఎలా పుట్టింది. తమ అంత గొప్ప వారికి ఇలా జరుగుతుందా?

తెభా-9-13-వ.
అదియునుంగాక; మీరు బ్రహ్మవాదులరు; మంత్రవాదులరుఁ; బాపంబు లందకుండం జేయించువా; రిది యేమి?” యనవుడు మా తాత వసిష్ఠుండు హోతృవ్యభిచారం బెఱింగి, మనువున కిట్లనియె.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; మీరు = తమరు; బ్రహ్మవాదులరు = బ్రహ్మజ్ఞానులు; మంత్రవాదులరు = మంత్రవేత్తలు; పాపంబులు = పాపములు; అందకుండన్ = అంటుకోకుండ; చేయించువారు = కర్మలుచేయించువారు; ఇది = ఇలాజరిగినది; ఏమి = ఎందుచేత; అనవుడు = అనగా; మా = మా; తాత = ముత్తాత; వసిష్ఠుండు = వసిష్ఠుడు; హోతృ = హోతయొక్క; వ్యభిచారంబు = విధిని యతిక్రమించుట; ఎఱింగి = తెలిసికొని; మనువున్ = మనువున; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- తమరు బ్రహ్మజ్ఞానులు, మంత్రవేత్తలు, పాపస్పర్శ లేకుండా కర్మలు చేయించువారు. ఎందుచేత ఇలా జరిగింది.” అనగా మా ముత్తాత వసిష్ఠుడు హోత చేసిన పని తెలిసికొని మనువుతో ఇలా అన్నాడు.

తెభా-9-14-తే.
"ధిప! సంకల్ప వైషమ్య గుటఁ జేసి
హోతకల్లతనంబుననువిదగలిగె
నైనఁగలిగింతు నీకుఁబ్రియాత్మజునిగ
నీవు మెచ్చంగఁజూడు నా నేర్పుబలిమి."

టీక:- అధిప = రాజా; సంకల్ప = సంకల్పమంత్రపఠనములో; వైషమ్యము = తేడా; అగుటన్ = జరుగుట; చేసి = వలన; హోత = హోతయొక్క; కల్లతనంబు = వంచనబుద్ధివలన; ఉవిద = ఇంతి; కలిగెన్ = పుట్టినది; ఐనన్ = అయినను; కలిగింతున్ = చేసెదను; నీ = నీ; కున్ = కు; ఆత్మజునిగ = పుత్రునిగా; నీవున్ = నీవు; మెచ్చంగన్ = మెచ్చునట్లు; చూడు = చూడుము; నా = నా; నేర్పు = సామర్థ్యముయొక్క; బలిమి = శక్తిని.
భావము:- “రాజా! సంకల్పమంత్ర పఠనములో తేడా జరుగుట వలన హోత వంచనబుద్ధి వలన ఆడపిల్ల పుట్టింది. అయినా, పరవాలేదు లే. నీకు నచ్చేలా పుత్రునిగా చేస్తాను చూడు నా శక్తి సామర్థ్యాలు.”

తెభా-9-15-వ.
అని పలికి భగవంతుండగు వసిష్ఠుండు గీర్తితత్పరుండు గావున మనువు కూఁతు మగతనంబు కొఱకు నేక చిత్తంబున నాదిపురుషుం డగు హరిం బొగడిన నప్పరమేశ్వరుండు మెచ్చి, తపసి కోరిన వరం బిచ్చె; నది నిమిత్తంబుగా నిలాకన్యక సుద్యుముండను కుమారుండయి రాజ్యంబు చేయుచు.
టీక:- అని = అని; పలికి = చెప్పి; భగవంతుండు = పూజనీయుడైన; అగు = అయిన; వసిష్ఠుండు = వసిష్టుడు; కీర్తి = కీర్తి; తత్పరుండు = కాంక్షగలవాడు; కావున = కనుక; మనువు = మనువు; కూతు = పుత్రికకు; మగతనంబు = పురుషత్వము; కొఱకున్ = కోసము; ఏకచిత్తంబున = ఏకాగ్రతతో; ఆదిపురుషుండు = నారాయణుని {ఆదిపురుషుడు - పురాణపురుషుడు, విష్ణువు}; అగు = అయిన; హరిన్ = నారాయణుని {హరి - భక్తుల హృదయములను ఆకర్షించువాడు, విష్ణువు}; పొగడినన్ = కీర్తించగా; ఆ = ఆ; పరమేశ్వరుండు = నారాయణుడు {పరమేశ్వరుడు - పరమ (అత్యుత్తముడైన) ఈశ్వరుడు, విష్ణువు}; మెచ్చి = సంతోషించి; తపసి = ముని; కోరిన = అడిగిన; వరంబు = వరములను; ఇచ్చెన్ = ఇచ్చెను; అదినిమిత్తంబుగాన్ = ఆకారణముచేత; ఇల = ఇల యనెడి; కన్యక = ఇంతి; సుద్యుమ్నుండు = సుద్యుమ్నుడు; అను = అనెడి; కుమారుండు = పుత్రుడు; అయి = ఐ; రాజ్యంబు = రాజ్యపాలన; చేయుచు = చేస్తూ.
భావము:- అని చెప్పి వసిష్టుడు మనువు పుత్రికకు పురుషత్వము కోసం ఏకాగ్రతతో నారాయణుని కీర్తించగా, ఆ పరమేశ్వరుడు సంతోషించి ముని అడిగిన వరాలను ఇచ్చాడు. అందుచేత పుత్రిక ఇల, పుత్రుడు సుద్యుమ్నుడుగా అయి రాజ్యపాలన చేయసాగాడు.

తెభా-9-16-సీ.
ప్రొద్దు పో కొకనాఁడు పోయి, పేరడవుల-
వెంట వేఁటాడుచు, వేడ్కతోడఁ
గొందఱు మంత్రులుగూడ రా, సైంధవం-
యిన గుఱ్ఱము నెక్కి, యందమైన
లువిల్లుఁ గ్రొవ్వాడి బాణంబులును దాల్చి-
పెను మెకంబులవెంట బిఱుసుతోడ
నుత్తరదిశను మహోగ్రుఁడై చనిచని-
మేరువు పొంతఁ గుమావనముఁ

తెభా-9-16.1-తే.
జేరె; నందు మహేశుండు శివయు నెపుడు
తి సలుపుచుందు; రందుఁ జొరంగఁ బోవ
నాఁడుదయ్యెను రాజు; రాజానుచరులుఁ
డఁతులైరి; తదశ్వంబు డబ యయ్యె.

టీక:- ప్రొద్దుపోక = కాలముగడవక; ఒక = ఒక; నాడు = దినమున; పోయి = వెళ్ళి; పేరడువులన్ = పెద్ద అడవుల; వెంట = వెంబడి, అమ్మట; వేటాడుచున్ = వేటాడుతు; వేడ్క = ఉత్సాహము; తోడన్ = తోటి; కొందఱు = కొంతమంది; మంత్రులు = మంత్రులు; కూడ = కూడా; రాన్ = వస్తుండగా; సైంధవంబు = ఉత్తమజాతిది {సైంధవము - సింధుదేశమునపుట్టినది, ఉత్తమజాతిగుఱ్ఱము}; అయిన = ఐన; గుఱ్ఱమును = గుఱ్ఱమును; ఎక్కి = అధిరోహించి; అందమైన = సుందరమైన; పలు = పెద్ద; విల్లు = విల్లును; క్రొవ్వు = మిక్కిలి; వాడి = వాడియైన; బాణంబులును = బాణములను; తాల్చి = ధరించి; పెను = పెద్దపెద్ద; మెకంబుల = మృగముల; వెంట = వెంబడి; బిఱుసు = గట్టిదనము; తోడను = తోటి; ఉత్తర = ఉత్తరపు; దిశను = దిక్కునందు; మహా = మిక్కిలి; ఉగ్రుడు = భయంకరుడు; ఐ = అయ్యి; చనిచని = చాలాదూరమువెళ్ళి; మేరువు = మేరుపర్వతము; పొంతన్ = దగ్గరలోని; కుమారవనమున్ = కుమారవనమును; చేరెన్ = ప్రవేశించెను; అందు = దానిలో.
మహేశుండు = పరమశివుడు {మహేశుడు - మహా ఈశ్వరుడు, శివుడు}; శివయున్ = పార్వతీదేవి {శివ - శివునిభార్య, పార్వతి}; ఎపుడున్ = ఎల్లప్పుడు; రతి = మన్మథక్రీడ; సలుపుచున్ = జరుపుకొనుచు; ఉందురు = ఉండెదరు; అందున్ = దానిలో; చొరంగ = ప్రవేశించి; పోవన్ = వెళ్ళగా; ఆడుది = స్త్రీ; అయ్యెన్ = అయిపోయెను; రాజు = రాజు; రాజానుచరులున్ = రాజుతోవెళ్ళినవారు; పడతులు = స్త్రీలు; ఐరి = అయిపోయిరి; తత్ = అతని యొక్క; అశ్వంబున్ = గుఱ్ఱముకూడ; బడబ = ఆడుగుఱ్ఱము; అయ్యె = అయిపోయెను.
భావము:- కొంత కాలం తరువాత, సుద్యుమ్నుడు మంత్రులను వెంట పెట్టుకుని గొప్ప గుఱ్ఱాన్ని ఎక్కి ఉత్సాహంగా వేటకోసం తన నగరం ప్రతిష్టానపురం నుండి బయలుదేరాడు. ఉత్తరపు దిక్కులో పెద్ద విల్లు మిక్కిలి వాడియైన బాణములను ధరించి అడవులలో వేటాడుతు ఉన్నాడు. అలా పెద్దపెద్ద మృగాల పాలిటి భీకరుడు అయ్యి. చాలా దూరం వెళ్ళి మేరుపర్వతం దగ్గరలోని కుమారవనం ప్రవేశించాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. ఆ కుమారవనంలో ప్రవేశించగానే రాజు, రాజుతో వెళ్ళినవారు అందరు స్త్రీలు అయిపోయారు. అతని గుఱ్ఱము కూడ ఆడుగుఱ్ఱము అయిపోయింది..

తెభా-9-17-వ.
ఇట్లు మగతనంబు చెడి మగువలై యొండొరుల మొగంబులు చూచి మఱుఁగుచుండి"రనిన విని శుకునకు రాజిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; మగతనంబు = పురుషత్వము; చెడి = కోల్పోయి; మగువలు = స్త్రీలు; ఐ = అయ్యి; ఒండొరులన్ = ఒకరికొకరు; మొగంబులున్ = ముఖములను; చూచి = చూసుకొని; మఱుగుచుండిరి = ఉడికిపోతుండిరి; అనిన = అనగా; విని = విని; శుకున్ = శుకుని; కున్ = కి; రాజు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధముగ మగతనం పోయి స్త్రీలు అయిపోయిన వాళ్లు అందరు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుని ఉడికిపోతున్నారు.” అనగా విని రాజు శుకమునితో ఇలా పలికెను.

తెభా-9-18-ఆ.
"రాజుఁ తోటివారు మణు లై రంటివి;
కాంత లగుట యేమి కారణమున?
నిట్టి దేశ మెఱుఁగ మెన్నఁడు; నా కథల్
వేడ్కదీర నాకు విస్తరింపు.

టీక:- రాజు = రాజు; తోటివారు = కూడనున్నవారు; రమణులు = స్త్రీలు {రమణి - రమణీయమైనామె, సుందరి}; ఐరి = అయినారు; అంటివి = అన్నావు; కాంతలు = స్త్రీలు; అగుటన్ = అయిపోవుట; ఏమి = ఎట్టి; కారణమునన్ = కారణముచేత; ఇట్టి = ఇటువంటి; దేశమున్ = ప్రదేశమును; ఎఱుగము = తెలియదు; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; ఆ = ఆయొక్క; కథల్ = కథలను; వేడ్కన్ = కుతూహలము; తీరన్ = తీరునట్లుగ; నా = నా; కున్ = కు; విస్తరింపు = వివరించుము.
భావము:- “రాజు, అతని వెంట ఉన్నవారు స్త్రీలు అయిపోయారు అన్నావు. ఎందుకని అలా స్త్రీలు అయిపోయారు. ఇలాంటి ప్రదేశం గురించి ఎప్పుడు విన లేదు. ఆ కథలను వివరంగా చెప్పుము.

తెభా-9-19-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతే కాకుండగ.

తెభా-9-20-ఆ.
గువతనము మాని గవాఁడు గావచ్చుఁ;
గాక పేరుఁ బెంపు గాసి గాఁగ
గతనంబు మాని గువ గావచ్చునె
మానవంతుఁ డైన మానవునకు?"

టీక:- మగువతనము = స్ర్తీత్వము; మాని = వదలివేసి; మగవాడు = పురుషుడు; కావచ్చున్ = అయిపోవచ్చును; కాక = కాని; పేరుపెంపున్ = పేరుప్రతిష్టలు; గాసిగాగ = నశించిపోవునట్లుగ; మగతనంబు = పురుషత్వము; మాని = వదలివేసి; మగువ = స్త్రీ; కావచ్చునే = అయిపోవచ్చునా; మానవంతుడు = ఆత్మాభిమానంగలవాడు; ఐనన్ = అయిన; మానవున్ = పురుషున; కున్ = కు.
భావము:- స్త్రీత్వము వదలివేసి పురుషుడు అయిపోవచ్చును. కాని ఎవడైనా ఆత్మాభిమానంగల పురుషుడు పేరుప్రతిష్టలు నశించిపోయేలా పురుషత్వము వదలి స్త్రీ అయిపోతాడా.”

తెభా-9-21-వ.
అని యడిగిన నర్జునపౌత్రునకు వ్యాసపుత్రుం డిట్లనియె.
టీక:- అని = అని; అడిగిన = అడిగినట్టి; అర్జునపౌత్రున్ = పరీక్షిన్మహారాజున {అర్జునపౌత్రుడు - అర్జునుని పౌత్రుడు (మనుమడు), పరీక్షిత్తు}; కున్ = కు; వ్యాసపుత్రుండు = శుకమహర్షి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని అడిగిన పరీక్షిన్మహారాజుతో శుకమహర్షి ఈ విధముగ పలికెను.

తెభా-9-22-సీ.
"పురవైరి కొకనాఁడు పొడచూపు వేడుకఁ-
ద్దయు దిక్కుల మము లెల్లఁ
మతమ వెలుఁగులు గిలి గొందులు సొరఁ-
గొందఱు మౌనులు గోరి రాఁగఁ,
బ్రాణేశు తొడలపై భాసిల్లు నంబిక-
వారలఁ జూచి మై లువ లేమి
సిగ్గు పుట్టిన లేచి చీరఁ గట్టినఁ జూచి-
దేవియు దేవుండు దీర్ఘ లీల

తెభా-9-22.1-తే.
నొంటి దమలోనఁ "గ్రీడించుచున్నవారు
నకు సమయంబు గా"దని, రలి మునులు
రుఁడు నారాయణుండు ననారతంబు
మెలఁగు చోటికి నడచిరి మేదినీశ!

టీక:- పురవైరి = పరమశివుడు {పురవైరి - త్రిపురముల శత్రువు, శివుడు}; ఒక = ఒక; నాడు = దినమున; పొడచూపు = దర్శించెడి; వేడుకన్ = ఉత్సాహముతో; దద్దయున్ = మిక్కిలిగ; దిక్కులన్ = అన్నిదిక్కులలోని; తమములు = చీకట్లు; ఎల్లన్ = అన్నీ; తమతమ = వారియొక్క; వెలుగులున్ = ప్రకాశమునకు; తగిలి = లొంగి; గొందులు = సందులలోనికి; చొరన్ = దూరిపోగా; కొందఱు = కొంతమంది; మౌనులు = మునులు; కోరి = ఆశించి; రాగన్ = రాగా; ప్రాణేశు = భర్తయొక్క; తొడల = ఒడి; పైన్ = అందు; భాసిల్లు = విలసిల్లెడి; అంబిక = పార్వతీదేవి; వారలన్ = వారిని; చూచి = చూసి; మైన్ = ఒంటిమీద; వలువ = బట్టలు; లేమిన్ = లేకపోవుటచేత; సిగ్గు = లజ్జ; పుట్టిన = కలుగగా; లేచి = లేచిపోయి; చీర = బట్టలు; కట్టినన్ = కట్టుకొనగా; చూచి = చూసి; దేవియన్ = పార్వతీదేవి; దేవుండు = శివుడు; దీర్ఘలీలన్ = పూర్తిగాలీనమై; ఒంటిన్ = ఏకాంతముగ; తమలోనన్ = వారులోవారు; క్రీడించుచున్నవారు = రమించుచున్నారు.
మన = మన; కున్ = కు; సమయంబు = తగినసమయము; కాదు = కాదు; అని = అని; మరలి = వెనుతిరిగి; మునులు = ఋషులు; నరుడునారాయణుడు = నరనారాయణులు; అనారతంబు = నిత్యము; మెలగు = వసించెడి; చోటు = ప్రదేశమున; కిన్ = కు; నడచిరి = వెళ్ళిరి; మేదినీశ = రాజా {మేదినీశ - మేదిని (భూమికి) ఈశ (ఫ్రభువు), రాజు}.
భావము:- “పరీక్షిన్మహారాజ! త్రిపురవైరిని దర్శించె ఉత్సాహంతో కొంతమంది మునులు ఒక మారు చీకటి పడే వేళ వచ్చారు. వారి తేజస్సు తట్టుకోలేక చీకట్లు సందుగొందుల్లోకి దూరాయి. అప్పుడు భర్త ఒడిలో ఉన్న పార్వతీదేవి వారిని చూసి, సిగ్గుతో లేచి బట్టలు కట్టుకొంది. మునులు “పార్వతీపరమేశ్వరులు ఇప్పుడు ఏకాంతంగా క్రీడిస్తున్నారు. వారిని దర్శించడానికి ఇది తగిన సమయం కాదు.” అని వెనుతిరిగి వెళ్ళిపోయారు.

తెభా-9-23-వ.
అది కారణంబుగా, భగవంతు డగు శివుండు దన ప్రియురాలి వేడుకల కొఱకు నిట్లని వక్కాణించె.
టీక:- అదికారణంబుగాన్ = అందుచేత; భగవంతుండు = పరమశివుడు {భగవంతుడు - అష్టైశ్వర్యములుగల పూజ్యుడు, శివుడు}; అగు = అయిన; శివుండు = పరమశివుడు; ప్రియురాలి = భార్య; వేడుకలు = వినోదము; కొఱకున్ = కోసము; ఇట్లు = ఇలా; అని = అని; వక్కాణించెను = ప్రకటించెను.
భావము:- అందుచేత, పరమశివుడు భార్య వినోదం కోసం ఇలా అని ప్రకటించాడు.

తెభా-9-24-క.
"ఈ నెల వెవ్వఁడు జొచ్చిన
మానిని యగు"ననిన తొంటి మాట కతమునన్,
మావుఁడు మగువ పోఁడిమి
మాక పేరడవులందు ఱియుం దిరిగెన్.

టీక:- ఈ = ఈ; నెలవు = ప్రదేశమును; ఎవ్వడు = ఎవరైననుసరే; చొచ్చిన = ప్రవేశించినచో; మానిని = స్త్రీ; అగును = అయిపోవును; అనిన = అనినట్టి; తొంటి = పూర్వపు; మాట = వచనము; కతమునన్ = ప్రకారము; మానవుడు = పురుషుడు; మగువపోడిమి = స్త్రీత్వము; మానక = తప్పకపొంది; పేరడవుల్ = కారడవుల; అందున్ = లో; మఱియున్ = ఇంక; తిరిగెను = వసించెను.
భావము:- “ఈ ప్రదేశంలోకి ఎవరు ప్రవేశించినా వారు అందరు స్త్రీలు అయిపోవుదురు గాక.” ఆ శంకరుని వచనము ప్రకారము ప్రద్యుమ్నుడు స్త్రీత్వము పొంది రాకుమారిగా కారడవులలో నివసించసాగాడు.

తెభా-9-25-వ.
ఇట్లు చెలికత్తియల మొత్తంబులుం, దానును, నా రాచపూఁబోడి వాఁడిచూపుల నాఁడు పోఁడిమి నెఱపుచు, దైవయోగంబున సోమ సుతుండును, భగవంతుడును నగు బుధుని యాశ్రమంబు జేరి, మెలఁగుచున్న యెడ.
టీక:- ఇట్లు = ఈ విధముగ; చెలికత్తియల = సేవకురాళ్ళ; మొత్తంబులున్ = సమూహములును; తానును = తను; ఆ = ఆ; రాచపూబోడి = రాకుమారి {రాచపూబోడి - రాచ (రాజ) పూబోడి (స్త్రీ), రాకుమారి}; వాడిచూపులన్ = కోరచూపులతో; ఆడుపోడిమ = స్త్రీత్వము; నెఱపుచు = కనబరుస్తూ; దైవయోగంబునన్ = దైవఘటనవలన; సోమ = చంద్రుని; సుతుండును = కుమారుడును; భగవంతుడును = పూజ్యనీయుడు; అగు = ఐన; బుధుని = బుధునియొక్క; ఆశ్రమంబున్ = ఆశ్రమమునకు; చేరి = ప్రవేశించి; మెలగుచున్న = విహరించుచున్నట్టి; ఎడన్ = సమయమునందు.
భావము:- ఒక దినము సేవకురాళ్ళతో సహా ఆ రాకుమారి వాడిచూపులతో స్త్రీవిలాసాలు కనబరుస్తూ దైవఘటనవలన చంద్రుడి కుమారుడు అయిన బుధుడి ఆశ్రమం ప్రవేశించి విహరించసాగింది. ఆ సమయములో.....

తెభా-9-26-ఆ.
రాజు కొడుకుఁ జూచె రాజీవదళనేత్ర;
రాజవదనఁ జూచె రాజుపట్టి;
దొంగ కాముఁ డంత దొందడిఁ జిగురాకు
వాలు వెఱికి యుఱికి, వారి మొత్తె.

టీక:- రాజు = చంద్రుని {రాజకొడుకు - రాజ (చంద్రుని) కొడుకు, బుధుడు}; కొడుకు = పుత్రుడు; చూచెన్ = చూసెను; రాజీవదళనేత్రన్ = సుందరిని {రాజీవదళనేత్ర - రాజీవము (పద్మములవంటి) నేత్ర (కన్నులుగలామె), అందగత్తె}; రాజవదన = అందగత్తె {రాజవదన - రాజు (చంద్రునివంటి) వదన (మోముగలామె), సుందరి}; చూచెన్ = చూసెను; రాజు = చంద్రుని; పట్టిన్ = కుమారుని; దొంగ = కొంటెవాడైన; కాముడు = మన్మథుడు; అంతన్ = అంతట; దొందడి = సందడిచేసెడి; చిగురాకు = చిగురాకు అనెడి; వాలున్ = కత్తిని; పెఱికి = బయటకులాగి; ఉఱికి = ఉరికి; వారిన్ = వారిని; మొత్తెన్ = దాడిచేసెను.
భావము:- చంద్రుని కొడుకు బుధుడు ఆ సుందరాంగి రాకుమారిని చూసాడు. ఆ రాకుమారి బుధుడిని చూసింది. అంతట కొంటె మన్మథుడు సందడి చేసాడు. మొదటి చూపులోనే ఒకరిని ఒకరు వరించారు.

తెభా-9-27-వ.
ఇట్లలరువిల్తుని నెఱబిరుదు చిగురు టడిదంబు మొనకు నోహటించి, వారలిరువురుం బైపడి వేడుకలకుం జొచ్చిన, వారలకుం బురూరవుం డను కుమారుండు పుట్టె; నివ్విధంబున.
టీక:- ఇట్లు = ఇలా; అలరువిల్తుని = మన్మథుని {అలరువిలుతుడు - అలరు (అరవిందాది పుష్పములు) విలుతుడు (బాణములుగలవాడు), మన్మథుడు}; నెఱబిఱుదున్ = గట్టి శౌర్యముతో; చిగురు = చిగురాకు అనెడి; అడిదంబు = బాకు; మొన = కొన; కున్ = కి; ఓహటించి = ఓడి; వారలు = వారు; ఇరువురన్ = ఇద్దరు; పైబడి = రతిక్రియల; వేడుకల్ = క్రీడించుటల; కున్ = కు; చొచ్చిన = మొదలిడగా; వారల్ = వారి; కున్ = కు; పురూరవుండు = పురూరవుడు; అను = అనెడి; కుమారుండు = పుత్రుడు; పుట్టెన్ = పుట్టెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగా.
భావము:- ఇలా మన్మథుని చిగురాకు దాడికి లొంగి పరస్పరం వరించిన వారు ఇద్దరు క్రీడించసాగారు. వారికి పురూరవుడు అనెడి పుత్రుడు పుట్టాడు. ఇలా......

తెభా-9-28-ఆ.
నుసుతుండు ఘనుఁడు గనాలి తనమునఁ
గొడుకుఁ గాంచి, విసివి, కుందికుంది,
చింతఁ బొంది, గురు వసిష్ఠుని భావించె,
తని తలఁపుతోన తఁడు వచ్చె.

టీక:- మను = మనువుయొక్క; సుతుండు = పుత్రుడు; ఘనుడు = గొప్పవాడు; మగనాలితనమునన్ = స్త్రీత్వముతోనున్న; కొడుకున్ = కుమారుని; కాంచి = చూసి; విసివి = విసిగిపోయి; కుందికుంది = మిక్కిలికుంగిపోయి; చింతన్ = బాధ; పొంది = పడి; గురు = గురువు; వసిష్ఠుని = వసిష్ఠుని; భావించెన్ = తలచుకొనెను; అతని = అతనియొక్క; తలపు = భావము; తోనన్ = వెంటనే; అతడు = అతడు; వచ్చెన్ = వచ్చెను.
భావము:- మహానుభావుడైన మనువు తన పుత్రుడు స్త్రీత్వముతో విహరించుట చూసి విసిగి, వేసారి గురువు వసిష్ఠుని తలచుకొన్నాడు. వసిష్ఠుడు వెంటనే వచ్చాడు.

తెభా-9-29-వ.
వచ్చి సుద్యుమ్నుండు మగవాఁడగు కొఱకు, నమ్మునిపుంగవుండు శంకరు నారాధింప, నీశ్వరుండును దపసి ప్రయాసంబునకు సంతసిల్లి, యిట్లనియె.
టీక:- వచ్చి = అలావచ్చి; సుద్యుమ్నుండు = సుద్యుమ్నుడు; మగవాడు = పురుషుడు; అగు = అగుట; కొఱకున్ = కోసము; ఆ = ఆ; ముని = ఋషులలో; పుంగవుండు = శ్రేష్ఠుడు; శంకరున్ = పరమశివుని; ఆరాధింపన్ = పూజించగా; ఈశ్వరుండును = పరమశివుడు; తపసి = ఋషియొక్క; ప్రయాసంబున్ = పూనిక; కున్ = కు; సంతసిల్లి = సంతోషించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా వచ్చిన వసిష్ఠ ఋషిశ్రేష్ఠుడు ఇలాసుందరి సుద్యుమ్నుడుగా పురుషుడుగా మరల మారడం కోసం పరమశివుని పూజించాడు. పరమశివుడు సంతోషించి ఈ విధంగ పలికాడు.

తెభా-9-30-మ.
"తను మున్నాడిన మాటయున్ నిజముగాఁ, దన్మౌనికిం బ్రీతిగా, మనుజుండున్ నెల వో నెలం బురుషుఁడై, మాసాంతరంబైనఁ గా మినియై, యీ గతి వీడు పాటమర భూమిం దాన రక్షించుఁ బొ"మ్మనినన్ వచ్చె వసిష్ఠుఁ; డా మనుసుతుండారీతి రాజ్యస్థుఁడై.
టీక:- తను = తనచేత; మున్ను = పూర్వము; ఆడిన = పలకబడిన; మాటయున్ = మాట; నిజముగాన్ = పొల్లుపోకుండగ; తత్ = ఆ; మౌని = ఋషి; కిన్ = కి; ప్రీతి = ఇష్టము; కాన్ = అగునట్లు; మనుజుండున్ = మనువంశస్థుడు; నెల = మాసము; పోన్ = తరువాత; నెలన్ = మాసము; పురుషుడు = మగవాడు; ఐ = అయ్యి; మాస = నెల; అంతరంబు = రెండవది; ఐనన్ = రాగా; కామిని = స్త్రీ; ఐ = అయ్యి; ఈ = ఈ; గతిన్ = విధముగా; వీడు = ఇతను; పాటు = సమర్థత; అమర = చెల్లునట్లుగా; భూమిన్ = రాజ్యమును; తాన = తనే; రక్షించున్ = పరిపాలించును; పొమ్ము = ఇక వెళ్ళు; అనినన్ = అనగా; వచ్చెన్ = తిరిగివచ్చెను; వసిష్ఠుడు = వసిష్ఠుడు; ఆ = ఆ; మను = మనువుయొక్క; సుతుండు = పుత్రుడు; ఆ = ఆ; రీతిన్ = విధముగా; రాజ్యస్థుడు = రాజ్యపాలనచేయువాడు; ఐ = అయ్యి.
భావము:- తను ఇంతకు ముందు అన్న మాట పొల్లుపోకుండ, ఆ ఋషి కోరినట్లు సిద్ధించేలా, “ఈ మనుపుత్రుడు; సుద్యుమ్నుడుగా మగవాడు అయ్యి ఒక నెల, ఇలగా స్త్రీ అయ్యి ఒక నెల ఇలా నెలనెలకు మారుతూ ఉంటాడు. ఈ విధంగా మారుతూ సమర్థతతో రాజ్యము పరిపాలిస్తాడు. ఇక వెళ్ళు.” అని వరం ఇచ్చాడు. వసిష్ఠుడు తిరిగివచ్చాడు. ఆ మనువు పుత్రుడు అలాగే రాజ్యపాలన చేసేవాడు.

తెభా-9-31-ఆ.
గువ యగుచు మరల గవాఁడు నగుచును
భూధాత్రి యంత నాతఁ డేలెఁ
బ్రజలు సంతసింప బాహాబలముతోడఁ
గురుని కరుణఁ జేసి కువలయేశ!

టీక:- మగువ = స్త్రీ; అగుచున్ = అవుతూ; మరల = మళ్ళీ; మగవాడు = పురుషుడు; అగుచును = అగుచూ; భూతధాత్రిన్ = నేలను {భూతధాత్రి - భూత (జీవులను) ధాత్రి (ధరించునది), భూమి}; అంతన్ = సమస్తమును; ఆతడున్ = అతను; ఏలెన్ = పరిపాలించెను; ప్రజలున్ = లోకులు; సంతసింపన్ = సంతోషపడునట్లుగా; బాహాబలము = భుజబలము; తోడన్ = తోటి; గురుని = గురువుయొక్క; కరుణన్ = దయ; చేసి = వలన; కువలయేశ = రాజా {కువలయేశ - కువలయము (భూమి)కి ఈశుడు (ప్రభువు), రాజు}.
భావము:- రాజా పరీక్షిత్తు! గురువు దయ వలన, తన భుజబలం తోటి, నెల మార్చి నెల స్త్రీ అవుతూ మళ్ళీ పురుషుడు అవుతూ రాజ్యం పరిపాలిస్తూ లోకులను సంతోషపెట్టేవాడు.

తెభా-9-32-వ.
అతనికి నుత్కళుండును, గయుండును, విమలుండును నను కొడుకులు మువ్వురు గలిగి, ధర్మపరులై యుత్తరాపథంబునకు రాజులైరి; సుద్యుమ్నుండు ముదుసలి యయి ప్రతిష్ఠానపురంబు విడిచి, పురూరవునకు భూమి నిచ్చి, వనంబునకుం జనియె; నివ్విధంబున.
టీక:- అతని = అతని; ఉత్కళుండును = ఉత్కళుడు; గయుండును = గయుడు; విమలుండును = విమలుడు; అను = అనెడి; కొడుకులు = పుత్రులు; మువ్వురు = ముగ్గురు; కలిగి = జన్మించి; ధర్మపరులు = ధర్మవర్తనులు; ఐ = అయ్యి; ఉత్తరా = ఉత్తరపు; పథంబున్ = భూముల; కున్ = కు; రాజులున్ = ప్రభువులుగా; ఐరి = అయితిరి; సుద్యుమ్నుండు = సుద్యుమ్నుడు; ముదుసలి = ముసలివాడు; అయి = ఐ; ప్రతిష్టానపురంబు = ప్రతిష్టానపురమును; విడిచి = వదలిపెట్టి; పురూరవున్ = పురూరవుని; కిన్ = కి; భూమిని = రాజ్యమును; ఇచ్చి = ఇచ్చివేసి; వనంబున్ = అడవి; కున్ = కి; చనియెన్ = వెళ్ళెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగా.
భావము:- అలా సుద్యుమ్నుడికి ఉత్కళుడు, గయుడు, విమలుడు అని ముగ్గురు పుత్రులు జన్మించి ధర్మవర్తనులు అయ్యి ఉత్తరపు భూములకు ప్రభువులుగా అయ్యారు. సుద్యుమ్నుడు ముసలివాడై తను ఇలగా బుధునికి జన్మనిచ్చిన పురూరవునికి రాజ్యమును ఇచ్చి ప్రతిష్టానపురం వదలిపెట్టి వానప్రస్థానికి అడవికి వెళ్ళిపోయాడు.

తెభా-9-33-సీ.
కొడుకు సుద్యమ్నుండు ఘోరాటవుల కేఁగ-
వందుచు మనువు వైస్వతుండు
నకు బిడ్డలు గల్గఁ ప మాచరించెను-
రిఁగూర్చి నూఱేండ్లు మునలోన,
రి యంత నిక్ష్వాకుఁ డాదిగాఁ బదుగురు-
పుత్రుల నిచ్చెను, బొసఁగ; వారి
యందుఁ బృషద్ధ్రాఖ్యుఁ నువాఁడు, గురునాజ్ఞ-
విమల ధర్మంబులు వెలయఁబూని

తెభా-9-33.1-తే.
సుల కదుపులఁ గాచుచు, లుమొగిళ్ళు
చ్చి నడురేయి జోరున వాన గురియ,
మంద విడియించి, చుట్టు నేఱక యుండె
డవి మొకములు చొరకుండ రసికొనుచు.

టీక:- కొడుకు = కుమారుడు; సుద్యుమ్నుండు = సుద్యుమ్నుడు; ఘోర = భయంకరమైన; అడవుల్ = అడవులకు; ఏగన్ = వెళ్ళగా; వందుచున్ = సంతాపపడుతు; మనువు = మనువు; వైవస్వతుండు = వైవస్వతుడు; తన = అతని; కున్ = కి; బిడ్డలు = పుత్రులు; కల్గన్ = పొందుటకోసము; తపమున్ = తపస్సును; ఆచరించెన్ = చేసెను; హరిన్ = నారాయణుని; కూర్చి = గురించి; నూఱు = వంద; ఏండ్లు = సంవత్సరములు; యమున = యమునాతీరము; లోనన్ = అందు; హరి = నారాయణుడు; అంతన్ = అంతట; ఇక్ష్వాకుడు = ఇక్ష్వాకుడు; ఆదిగా = మున్నగు; పదుగురు = పదిమంది; పుత్రులన్ = కుమారులను; ఇచ్చెను = ప్రసాదించెను; పొసగన్ = చక్కగా; వారిన్ = వారి; అందున్ = లో; పృషద్ధ్ర = పృషద్ధ్రుడు; అనువాడు = అనెడివాడు; గురున్ = గురువుయొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞప్రకారము; విమల = స్వచ్ఛమైన; ధర్మంబులున్ = ధర్మములను; వెలయన్ = ప్రసిద్ధముగా; పూని = ధరించి.
పసుల = పసువుల; కదుపులన్ = మందలను; కాచుచు = కాచుచు; పలు = దట్టమైన; మొగిళ్ళు = మబ్బులు; వచ్చి = చేరి; నడురేయి = అర్థరాత్రి; జోరున = భోరుమని; వాన = వర్షము; కురియన్ = కురియగా; మందన్ = మందను; విడియించి = ఒకచోటజేర్చి; చుట్టున్ = అన్నిపక్కలను; ఏమఱక = కనిపెట్టుకొని; ఉండెన్ = ఉండెను; అడవి = క్రూర; మొకములు = జంతువులు; చొరబడకుండన్ = దాడిచేయకుండగ; అరసికొనుచు = చూసుకొంటూ.
భావము:- అలా కుమారుడు సుద్యుమ్నుడు అడవులకు వానప్రస్థాశ్రమం స్వీకరించి వెళ్ళిపోడంతో, మనువు వైవస్వతుడు ఎంతో సంతాపం చెందాడు. యమునాతీరంలో వైవస్వతుడు పుత్రులు కోసం నారాయణుని గురించి వంద సంవత్సరములు తపస్సు చేసాడు. నారాయణుడు అంతట ఇక్ష్వాకుడు మున్నగు పదిమంది కుమారులను ప్రసాదించాడు. వారి లో పృషధ్రుడు గురువు ఆజ్ఞ మేరకు స్వచ్ఛమైన ధర్మములను పాటిస్తూ, పసుల మందలను కాస్తున్నాడు. ఒకనాడు, దట్టమైన మబ్బులు కమ్మి అర్థరాత్రి భోరుమని వర్షము కురుస్తుంటే, క్రూర జంతువులు దాడిచేయకుండగ చూసుకొంటూ మందను ఒకచోట చేర్చి అన్ని ప్రక్కలను కనిపెట్టుకొని ఉన్నాడు.

తెభా-9-34-వ.
అంత.
టీక:- అంతన్ = అంతట.
భావము:- అంతట.

తెభా-9-35-క.
ప్రబ్బికొనిన పెంజీఁకటి
నిబ్బరముగ నడిఁకినడిఁకి, నింగికి వడితో
గొబ్బున నెగసి, తటాలున
బెబ్బులి మందావుఁ బట్టెఁ బెలుకుఱి యఱవన్.

టీక:- ప్రబ్భికొనిన = కమ్ముకొన్న; పెంజీకటిన్ = చిమ్మచీకటిలో; నిబ్బరముగన్ = స్థైర్యముతో; నడకినడకి = ఒదిగి ఒదిగి; నింగి = ఆకాశమున, పై; కిన్ = కి; వడి = వేగము; తోన్ = తోటి; గొబ్బునన్ = శీఘ్రముగ; ఎగసి = ఎగిరి; తటాలున = చటుక్కున; బెబ్బులి = పెద్దపులి; మందావున్ = మందలోని ఆవును; పట్టెన్ = పట్టుకొనెను; పెలుకుఱి = విహ్వలించి; అఱవన్ = అరవగా.
భావము:- కమ్ముకొన్న ఆ చిమ్మచీకటిలో పెద్దపులి ఒకటి ఒదిగి ఒదిగి వచ్చి దూకి చటుక్కున మందలోని ఒక ఆవును పట్టుకుంది. ఆవు భయంతో అంబా అని అరచింది.

తెభా-9-36-క.
ల్లములు గలఁగి మొదవుల
వెల్లువ లన్నియును లేచి, విచ్చలవిడితోఁ
జెల్లాచెదురై, పాఱెను
బెల్లుగ నంబే యటంచు బెబ్బులి గాలిన్.

టీక:- ఉల్లములున్ = హృదయములు; కలగి = కలతచెంది; మొదవుల = పశువుల; వెల్లువలు = మందలు; అన్నియును = సమస్తమును; లేచి = లేచిపోయి; విచ్చలవిడి = స్వతంత్రించుట; తోన్ = తోటి; చెల్లాచెదురు = చెల్లాచెదురు; ఐ = అయ్యి; పాఱెను = పరిగెట్టినవి; పెల్లుగన్ = గట్టిగా; అంబే = అంబా; అటంచున్ = అనుచు; బెబ్బులి = పెద్దపులి; గాలిన్ = వాసనపసిగట్టుటచే.
భావము:- పెద్దపులి వాసనపసిగట్టి, గుండెలు అదరిన పశువులు అన్నీ మంద వీడి చెల్లాచెదురు అయ్యి అంబా అంటూ గట్టిగా అరుస్తూ చెల్లాచెదరు అయ్యాయి.

తెభా-9-37-వ.
అయ్యవసరంబున.
టీక:- ఆ = ఆ; అవసరంబున = సమయమునందు.
భావము:- ఆ సమయములో.

తెభా-9-38-శా.
పెంజీకటి మ్రోలఁ గాన కడిదం బంకించి శార్దూల మం
చా పుల్లావు శిరంబుఁ ద్రుంచి, తెగదో యంచుం, బులిన్ వెండియున్
వాపోవం దెగ వ్రేసి, భూవరుఁడు ద్రోవన్ ఖడ్గరక్తంబుచేఁ
బైపై గీయుచుఁ, జేరి చూచెఁ దల ద్రెవ్వంబడ్డ యద్ధేనువున్.

టీక:- ఆ = ఆ; పెంజీకటిన్ = కారుచీకట్లో; మ్రోలన్ = ముందు, ఎదురుగా; కానక = కనబడక; అడిదంబున్ = కత్తిని; అంకించి = ఆడించి; శార్దూలము = పెద్దపులి; అంచున్ = అనుచు; ఆ = ఆ; పుల్లావు = కపిలధేనువు; శిరంబున్ = తలను; త్రుంచి = ఖండించి; తెగదో = తెగలేదేమోనని; అంచున్ = అనుచు; పులిన్ = పెద్దపులిని; వెండియున్ = మరల; వాపోవంగన్ = అరచుతుండగ; తెగవ్రెసి = ఖండించి; భూవరుడున్ = రాజు; త్రోవన్ = దారిలో; ఖడ్గ = కత్తియొక్క; రక్తంబున్ = రక్తమును; చేన్ = చేతితో; పైపైన్ = మెల్లిగా; గీయుచున్ = తుడుస్తూ; చేరి = దగ్గరకెళ్ళి; చూచెన్ = చూసెను; తల = శిరస్సు; త్రెవ్వంబడ్డ = ఖండింపబడిన; ఆ = ఆ; ధేనువున్ = ఆవును.
భావము:- ఆ కారుచీకట్లో ఎదురుగా ఉన్నవి కనబడక, అతను పెద్దపులి పెద్దపులి అని అరుస్తూ కత్తితో ఒక కపిలధేనువు తల ఖండించాడు. తెగలేదేమోనని అనుకుని, పెద్దపులి అని మరల అరస్తూ మళ్ళీ కత్తితో నరికాడు. ఆ పృషధ్రుడు దారిలో కత్తికున్న రక్తం చేతితో మెల్లిగా తుడుస్తూ దగ్గరకెళ్ళి చూస్తే, ఏముంది శిరస్సు ఖండింపబడినది కపిల ఆవు కనబడింది.

తెభా-9-39-వ.
చూచి, దుఃఖితుండయి యున్న పృషద్ధ్రునిం గని, కులగురుం డగు వసిష్ఠుండు కోపించి, “నీవు రాజత్వంబునకుఁ బాసి, యీ యపరాధంబున శూద్రుండవు గ” మ్మని శపియించె; నతండును గృతాంజలి యయి, తన కులాచార్యుని వలన మరలం గైకోలు వడసి, యతని యనుమతంబున.
టీక:- చూచి = అదిచూసి; దుఃఖితుండు = దుఃఖించుచున్నవాడు; అయి = ఐ; ఉన్న = ఉన్నట్టి; పృషద్ధ్రునిన్ = పృషద్ధ్రుని; కని = చూసి; కులగురుండు = కులగురువు; అగు = ఐన; వసిష్టుండు = వసిష్టుడు; కోపించి = కోపగించి; నీవున్ = నీవు; రాజత్వంబున్ = క్షత్రియత్వమున; కున్ = కు; పాసి = దూరమై; ఈ = ఈ; అపరాధంబునన్ = తప్పువలన; శూద్రుండవు = శూద్రుడవు; కమ్ము = అవుదువుగాక; అని = అని; శపియించెన్ = శపించెను; అతండును = అతడుకూడ; కృతాంజలి = నమస్కరించినవాడు; అయి = అయ్యి; తన = తన; కులాచార్యుని = కులగురువు; వలన = అందుచేత; మరలన్ = మళ్ళీ; కైకోలు = అనుజ్ఞ; పడసి = పొంది; అతని = అతనియొక్క; అనుమతంబునన్ = అనుమతితో.
భావము:- అదిచూసి దుఃఖిస్తూ ఉన్న పృషధ్రుని కులగురువు ఐన వసిష్టుడు చూసి కోపంతో “నీవు ఈ తప్పువలన క్షత్రియత్వానికి దూరమై శూద్రుడవు అవుదువు గాక!” అని శపించాడు. అతడు తన కులగురువు అనుజ్ఞ పొంది అతని అనుమతితో.

తెభా-9-40-సీ.
ఖిలాత్ముఁ డగుచున్న రియందుఁ, బరునందు;-
క్తితోఁ జాలఁ దత్పరత మెఱసి,
యూర్ధ్వరేతస్కుఁ డై యున్న ప్రాణులకెల్ల-
నాప్తుఁడై, సర్వేంద్రిములు గెల్చి,
సంగంబునకుఁ బాసి, శాంతుండు నపరిగ్ర-
హుండునై, కోరక యుండి, తనకు
చ్చిన యదియ జీనము గావించుచుఁ-
నుఁదాన నిలుపుచు, న్యబుద్ధి

తెభా-9-40.1-తే.
డుని తెఱగున, నంధుని చందమునను,
జెవిటి భంగిని, మహి నెల్లఁ జెల్లఁ దిరిగి,
డవులకు నేఁగి, కార్చిచ్చునందుఁ జొచ్చి
చిక్కి, నియతుఁడై బ్రహ్మంబుఁ జెందె నతఁడు.

టీక:- అఖిలాత్ముడు = సర్వవ్యాపి; అగుచున్న = అయినట్టి; హరి = విష్ణుని; అందున్ = ఎడల; పరున్ = పరమాత్మ; అందున్ = ఎడల; భక్తి = భక్తి; తోన్ = తోటి; చాలన్ = అధికమైన; తత్పరతన్ = మనసులగ్నముచేసి; మెఱసి = ప్రకాశించి; ఊర్ధ్వరేతస్కుడు = కామవ్యాపారమును జయించినవాడు {ఊర్ధ్వరేతస్కుడు - అథఃపతనము లేకపోవుటచేత స్తంభింపబడిన శుక్లము కలవాడు, సనకాది, ఋషి}; ఐ = అయ్యి; ఉన్న = జీవించియున్నసమస్త; ప్రాణులు = జీవుల; కిన్ = కి; ఎల్లన్ = అన్నిటికిని; ఆప్తుడు = ఇష్టుడు; ఐ = అయ్యి; సర్వ = ఎల్ల; ఇంద్రియములు = ఇంద్రియములను; గెల్చి = అదుపుచేసి; సంగంబున్ = తగులముల; కున్ = కు; పాసి = దూరమై; శాంతుండున్ = శాంతగుణముగలవాడు; అపరిగ్రహుండు = విషయమువంకబోనివాడు; ఐ = అయ్యి; కోరకన్ = కోరికలులేకుండగ; ఉండి = ఉండి; తన = అతని; కున్ = కి; వచ్చిన = ఏది లభించిన; అదియ = అదే; జీవనము = జీవనాధారముగ; కావించుచున్ = చేసి; తనుదానన్ = తననుతానే; నిలుపుచు = నిగ్రహించుకొనుచు; ధన్య = తృప్తిచెందిన; బుద్ధి = బుద్ధితో.
జడుని = మూగవాని; తెఱంగునన్ = వలె; అంధుని = గుడ్డివాని; చందమునను = వలె; చెవిటి = చెవిటివాని; భంగినిన్ = వలె; మహిన్ = లోకమునందు; ఎల్లన్ = అన్నిచోట్లను; తిరిగి = సంచరించి; అడవులు = అడవులు; కున్ = కు; ఏగి = వెళ్ళి; కార్చిచ్చు = దావానలము; అందున్ = లో; చొచ్చి = పడి; చిక్కి = చిక్కుపోయి; నియతుడు = నియమముతప్పనివాడు; ఐ = అయ్యి; బ్రహ్మంబున్ = పరబ్రహ్మను; చెందెన్ = కలిసెను; అతడు = అతడు.
భావము:- సర్వవ్యాపి, పరమాత్మ అయిన విష్ణుని ఎడల భక్తి పెంచుకుని, కామాన్ని జయించాడు. ఊర్ధ్వరేతస్కుడు అయ్యి జీవకోటులు సమస్తానికి ఇష్టుడు అయ్యాడు. ఇంద్రియములను అదుపుచేసి, తగులములకు దూరమై, శాంతగుణము గలవాడై, విషయముల వంక బోక, నిష్కాముడై, తనకు లభించిన దానినే జీవనాధారముగ చేసుకొనుచు, తననుతానే నిగ్రహించుకొనుచు తృప్తిగా జీవించాడు. మూగవాడిలా, గ్రుడ్డివాడిలా, చెవిటి వాడిలా నలుచెరగులా తిరిగాడు. చివరికి అడవిలో కార్చిచ్చులో పడి పరబ్రహ్మలో లీనమయ్యాడు.

తెభా-9-41-క.
వి యను కడపటి కొమరుఁడు
నము రాజ్యంబు విడిచి, బంధులతో నేఁ
గి, నమునఁ బరమపురుషునిఁ
బ్రవిమలమతిఁ దలఁచితలఁచి, రముం బొందెన్.

టీక:- కవి = కవి; అను = అనెడి; కడపటి = చివరి; కొమరుడు = పుత్రుడు; భవనము = కోట; రాజ్యంబున్ = రాజ్యమును; విడిచి = వదలివేసి; బంధులు = బంధువుల; తోన్ = తోటి; ఏగి = వెళ్ళి; వనమునన్ = అడవియందు; పరమపురుషునిన్ = నారాయణుని; ప్రవిమల = పరిశుద్ధమైన; మతిన్ = బుద్ధితో; తలచితలచి = మిక్కిలిధ్యానముచేసి; పరమున్ = మోక్షమును; పొందెన్ = పొందెను.
భావము:- కవి అనె వైవస్వత మనువు కడపటి కొడుకు కోటని రాజ్యాన్ని వదలివేసి, బంధువుల తోసహా వెళ్ళి అడవిలో నారాయణమూర్తిని గురించి పరిశుద్ధ బుద్ధితో ధ్యానం చేసి మోక్షం పొందాడు.

తెభా-9-42-వ.
మఱియుఁ గరూశుండను మానవునివలనం గొందఱు కారూశులు క్షత్రియులు గలిగి, ధర్మంబుతోడి ప్రియంబున బ్రహ్మణ్యులై యుత్తరాపథంబునకు రక్షకులైరి; ధృష్టుని వలన ధార్ష్టం బను వంశంబు గలిగి, భూతలంబున బ్రహ్మభూయంబు నొంది నెగడె; నృగుని వంశంబున సుమతి పుట్టె; నతనికి భూతజ్యోతి పుట్టె; నతనికి వసువు జనించె; వసువునకుం బ్రతీతుండు గలిగెఁ; బ్రతీతునికి నోఘవంతుండు జనించె; నతని కూఁతు నోఘవతి యను కన్యకను సుదర్శనుండు వివాహంబయ్యె; నరిష్యంతుండను మనుపుత్రునికి జిత్రసేనుం; డా విభునకు దక్షుం; డా పుణ్యునకు మీఢ్వాంసుం; డా సుజనునికి శర్వుం; డమ్మహాత్మునికి నింద్రసేనుం; డా రాజునకు వీతిహోత్రుం; డా సుమతికి సత్యశ్రవుం; డా ఘనునికి నురుశ్రవుం; డా వీరునకు దేవదత్తుం; డా పండితునకు నగ్నివేశుండు సుతు లయి జనియించి; రయ్యగ్నివేశుండు గానీనుం డన నెగడి, జాతకర్ణుండను మహర్షి యై వెలసె; నతని వలన నాగ్నివేశ్యాయనం బను బ్రహ్మకులంబు గలిగెను. ఇవ్విధంబున.
టీక:- మఱియున్ = ఇంకను; కరూశుండు = కరూశుడు; అను = అనెడి; మానవుని = మనువంశజుని; వలనన్ = వలన; కొందఱు = కొంతమంది; కారూశులు = కారూశులు; క్షత్రియులు = రాజులు {క్షత్రియుడు - క్షతము (దెబ్బ) వలన రక్షించువాడు వాని సంతానము, రాజులు}; కలిగి = పుట్టి; ధర్మంబు = వేద ధర్మములు; తోడి = అందు; ప్రియంబునన్ = ప్రియమువలన; బ్రహ్మణ్యులు = బ్రాహ్మణప్రియులు; ఐ = అయ్యి; ఉత్తరాపథంబున్ = ఉత్తరదిక్కురాజ్యముల; కున్ = కు; రక్షకులు = కాపాడువారు; ఐరి = ఐయుంటిరి; ధృష్టుని = ధృష్ఠుని; వలన = వలన; ధార్ష్ఠంబు = ధార్ష్ఠము; అను = అనెడి; వంశంబున్ = వంశము; కలిగి = ఏర్పడి; భూతలంబునన్ = భూలోకమునందు; బ్రహ్మభూయంబున్ = బ్రహ్మత్వంబును; ఒంది = పొంది; నెగడెన్ = వర్ధిల్లినది; నృగుని = నృగుని; వంశంబునన్ = వంశములో; సుమతి = సుమతి అనెడివాడు; పుట్టెన్ = జన్మించెను; అతని = అతని; కిన్ = కి; భూతజ్యోతి = భూతజ్యోతి; పుట్టెన్ = జన్మించెను; అతని = అతని; కిన్ = కి; వసువు = వసువు; జనించెన్ = పుట్టెను; వసువున్ = వసువున; కున్ = కు; ప్రతీతుండు = ప్రతీతుడు; కలిగెన్ = పుట్టెను; ప్రతీతున్ = ప్రతీతుని; కిన్ = కి; ఓఘవంతుండు = ఓఘవంతుడు; జనించెన్ = పుట్టెను; అతని = అతనియొక్క; కూతున్ = పుత్రికను; ఓఘవతి = ఓఘవతి; అను = అనెడి; కన్యకను = ఇంతిని; సుదర్శనుండు = సుదర్శనుడు; వివాహంబు = పెండ్లి; అయ్యెన్ = అయ్యెను; అరిష్యంతుండు = అరిష్యంతుడు; అను = అనెడి; మను = మనువుయొక్క; పుత్రున్ = పుత్రుని; కిన్ = కి; చిత్రసేనుండు = చిత్రసేనుడు; ఆ = ఆ; విభున్ = ప్రభువున; కున్ = కు; దక్షుండు = దక్షుడు; ఆ = ఆ; పుణ్యున్ = పుణ్యవంతున; కున్ = కు; మీఢ్వాంసుండు = మీఢ్వాంసుండు; ఆ = ఆ; సుజనున్ = మంచివాని; కిన్ = కి; శర్వుండు = శర్వుడు; ఆ = ఆ; మహాత్మున్ = గొప్పవాని; కిన్ = కి; ఇంద్రసేనుండు = ఇంద్రసేనుడు; ఆ = ఆ; రాజున్ = రాజున; కున్ = కు; వీతిహోత్రుండు = వీతిహోత్రుడు; ఆ = ఆ; సుమతి = మంచివాని; కిన్ = కి; సత్యశ్రవుండు = సత్యశ్రవుడు; ఆ = ఆ; ఘనుని = గొప్పవాని; కిన్ = కి; ఉరుశ్రవుండు = ఉరుశ్రవుడు; ఆ = ఆ; వీరున్ = శూరుని; కున్ = కి; దేవదత్తుండు = దేవదత్తుడు; ఆ = ఆ; పండితున్ = పండితుని; కున్ = కి; అగ్నివేశుండు = అగ్నివేశుడు; సుతులు = పుత్రులు; అయ్యి = ఐ; జనియించిరి = పుట్టిరి; అగ్నివేశుండు = అగ్నివేశుడు; కానీనుండు = కన్యకకొడుకు; అనన్ = అనబడి; నెగడి = ప్రసిద్ధుడై; జాతకర్ణుండు = జాతకర్ణుండు {జాతకర్ణుడు - పుట్టుకచే కర్ణునివంటివాడు}; అను = అనెడి; మహర్షి = గొప్పఋషి; ఐ = అయ్యి; వెలసెన్ = విలసిల్లెను; అతని = అతని; వలన = మూలమున; అగ్నివేశ్యాయనంబు = అగ్నివేశ్యాయనము; అను = అనెడి; బ్రహ్మకులంబున్ = బ్రాహ్మణకులము; కలిగెను = ఏర్పడినది; ఈ = ఈ; విధంబునన్ = విధముగా.
భావము:- ఇంక, కరూశుడు అనె కొడుకునకు కొంతమంది కారూశులు అను రాజులు పుట్టారు. వారు వేద ధర్మములు అందు ప్రీతితో బ్రాహ్మణప్రియులు అయ్యి ఉత్తరదిక్కు రాజ్యాలు పాలించారు. ధృష్ఠుని వలన ధార్ష్ఠము అనె వంశము ఏర్పడి భూలోకములో బ్రాహ్మణత్వం స్వీకరించింది. మను పుత్రుడు నృగుని వంశములో సుమతి జన్మించాడు. అతనికి భూతజ్యోతి జన్మించాడు; అతనికి వసువు పుట్టాడు; వసువునకు ప్రతీతుడు పుట్టాడు; ప్రతీతునికి ఓఘవంతుడు పుట్టాడు; అతని పుత్రిక ఓఘవతి అనె ఇంతిని సుదర్శనుడు పెండ్లాడాడు. అరిష్యంతుడు అనె మనుపుత్రునికి చిత్రసేనుడు; ఆ ప్రభువుకు దక్షుడు; అతనికి మీఢ్వాంసుండు; ఆ మంచివానికి శర్వుడు; ఆ గొప్పవానికి ఇంద్రసేనుడు; ఆ రాజునకు వీతిహోత్రుడు; ఆ మంచివాడికి సత్యశ్రవుడు; ఆ గొప్పవాడికి ఉరుశ్రవుడు; ఆ శూరుడికి దేవదత్తుడు; ఆ పండితుడికి అగ్నివేశుడు పుట్టారు. అగ్నివేశుడు కన్యకకొడుకు అనబడి, జాతకర్ణుండు అను పేర గొప్పఋషిగా విలసిల్లాడు. అతని వలన అగ్నివేశ్యాయనం అను బ్రాహ్మణకులం ఏర్పడింది. ఈ విధముగా.....

తెభా-9-43-క.
తెలుపఁబడె, నరిష్యంతుని
కు మెల్లను నీకు, దిష్టకులముం దెలియం
దెలిపెద రాజేంద్రోత్తమ!
తెలియుము సర్వంబు నీకుఁ దేటపడంగన్.

టీక:- తెలుపబడెన్ = చెప్పితిని; అరిష్యంతుని = అరిష్యంతునియొక్క; కులము = వంశము; ఎల్లను = సమస్తమును; నీ = నీ; కున్ = కు; దిష్ట = దిష్టునియొక్క; కులమున్ = వంశమును; తెలియన్ = తెలియునట్లు; తెలిపెద = చెప్పెదను; రాజేంద్ర = మహారాజులలో; ఉత్తమ = ఉత్తమమైనవాడ; తెలియుము = వినుము; సర్వంబున్ = అంతటిని; నీ = నీ; కున్ = కు; తేటపడంగన్ = అర్థమగునట్లుగ.
భావము:- మహారాజ! అరిష్యంతుడి వంశము యావత్తూ చెప్పాను. ఇక నీకు దిష్టుడి వంశము గురించి సవిస్తారంగా చెప్తాను.