Jump to content

పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/విశ్వామిత్రుని వృత్తాంతము

వికీసోర్స్ నుండి

విశ్వామిత్రుని వృత్తాంతము

తెభా-9-492-వ.
అంత గాధికి నగ్నితేజుండగు విశ్వామిత్రుండు జన్మించి, తపోబలంబున రాజధర్మంబును దిగనాడి, బ్రహ్మర్షియై యేకశతసంఖ్యాగణితు లగు కొడుకులం గనియె; నయ్యెడ భృగుకులజాతుండైన యజీగర్తునికొడుకు శునశ్శేఫుండు దల్లిదండ్రులచేత హరిశ్చంద్రుని యాగపశుత్వంబునకు నమ్ముడుపడి, బ్రహ్మాదిదేవతల వినుతిచేయుచు మెప్పించి, దేవతలచేత బంధవిముక్తుండయిన వానియందుఁ గృపగలిగి విశ్వామిత్రుండు పుత్రుల కిట్లనియె.
టీక:- అంతన్ = అంతట; గాధి = గాధి; కిన్ = కి; అగ్ని = అగ్ని వంటి; తేజుండు = తేజస్సు కలవాడు; అగు = ఐన; విశ్వామిత్రుండు = విశ్వామిత్రుడు; జన్మించి = పుట్టి; తపస్ = తపస్సు యొక్క; బలంబునన్ = శక్తివలన; రాజ = క్షత్రియ; ధర్మంబునున్ = ధర్మమును; దిగనాడి = విడిచిపెట్టి; బ్రహ్మర్షి = బ్రహ్మ ఋషి; ఐ = అయ్యి; ఏకశత = నూటొక్కమంది (101); సంఖ్యాగణితులు = లెక్కకు వచ్చువారు; అగు = ఐన; కొడుకులన్ = పుత్రులను; కనియెన్ = పుట్టించెను; ఆ = ఆ; ఎడన్ = సమయము నందు; భృగుకుల = భృగు వంశము నందు; జాతుండు = పుట్టినవాడు; ఐన = అయిన; అజీగర్తుని = అజీగర్తుని; కొడుకు = పుత్రుడు; శునశ్శేపుండున్ = శునశ్శేపుడు; తల్లిదండ్రుల్ = తల్లిదండ్రుల; చేతన్ = చే; హరిశ్చంద్రుని = హరిశ్చంద్రుని యొక్క; యాగ = యాగమునకు; పశుత్వంబున్ = బలిపశువగుట; కున్ = కు; అమ్ముడుపడి = అమ్మబడి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మున్నగు; దేవతల్ = దేవతలను; వినుతి = స్తుతి; చేయుచున్ = చేసి; మెప్పించి = మెప్పించి; దేవతల = దేవతల; చేతన్ = వలన; బంధవిముక్తుండు = వదలిపెట్టబడినవాడు; అయిన = ఐన; వాని = అతని; అందున్ = ఎడల; కృప = కరుణ; కలిగి = కలిగి; విశ్వామిత్రుండు = విశ్వామిత్రుడు; పుత్రుల = కొడుకుల; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అంతట గాధికి అగ్ని వంటి తేజస్సు కల విశ్వామిత్రుడు పుట్టి తన తపోశక్తితో క్షత్రియధర్మం విడిచిపెట్టి బ్రహ్మర్షి అయ్యాడు. ఆయనకు నూటొక్కమంది కొడుకుల పుట్టారు. భృగువంశంలో పుట్టిన అజీగర్తుని కొడుకు శునశ్శేపుడిని అతని తల్లిదండ్రులు హరిశ్చంద్రుని యాగానికి బలిపశువుగా అమ్మారు. బ్రహ్మదేవాది దేవతలను స్తుతించి మెప్పించి వారి వలన వదలిపెట్టబడ్డాడు. ఆ శునశ్శేపుని పట్ల విశ్వామిత్రుడు జాలిపడి కొడుకుగా స్వీకరించి తన వెంటతీసుకెళ్ళాడు. తన కొడుకులతో ఇలా అన్నాడు.

తెభా-9-493-క.
"కన్నులఁ గంటిని వీనిని
న్నన కొమరుండు నాకు క్కువ మీరో
న్నన్న యనుచు నీతని
న్నింపుం" డనినఁ జూచి దసంయుతులై.

టీక:- కన్నులన్ = కళ్లతో; కంటిని = చూసితిని; వీనిని = ఇతనిని; మన్ననన్ = ఆదరముతో; కొమరుండున్ = కొడుకు; నా = నా; కున్ = కు; మక్కువన్ = ప్రీతితో; మీరున్ = మీరు; ఓ = ఓయ్; అన్న = అన్న; అన్న = అన్న; అనుచున్ = అనుచు; ఈతనిన్ = ఇతనిని; మన్నింపుడు = గౌరవింపుడు; అనినన్ = అనగా; చూచి = చూసి; మద = గర్వముతో; సంయుతులు = మిక్కిలి కూడినవారు; ఐ = అయ్యి.
భావము:- “ఈ పుణ్యాత్ముడిని కళ్లరా చూసాను. నేను ఇతణ్ణి ప్రీతితో కొడుకుగా భావిస్తున్నాను. మీరు అన్న అంటూ ఇతణ్ణి గౌరవించండి.” విశ్వామిత్రుని కొడుకుల గర్వించి ఇలా అన్నారు.

తెభా-9-494-క.
"ఇతఁ డన్నఁటపో మాకును
గృకృత్యుల మయితి" మనుచు గేలి యొనర్పన్
సుతులన్ "మ్లేచ్ఛులు గం"డని
ధృతిలేక శపించెఁ దపసి తిరుగుడుపడఁగన్.

టీక:- ఇతడున్ = ఇతగాడు; అన్న = పెద్ద సోదరుడు; అట = అట; పో = పోయి పోయి; మా = మా; కునున్ = కు; కృతకృత్యులమున్ = ధన్యులము; అయితిమి = అయిపోతిమి; అనుచున్ = అనుచు; గేలి = పరిహాసము; ఒనర్పన్ = చేయగా; సుతులన్ = పుత్రులను; మ్లేచ్ఛులు = పాపరతులు; కండు = అయిపోండి; అని = అని; ధృతిలేక = తట్టుకొనలేక; శపించెన్ = శాపమిచ్చెను; తపసి = ఋషి; తిరుగుడుపడగన్ = పరిభ్రమించేలా.
భావము:- “ఇతగాడు మాకు పెద్దఅన్నట. మేం ధన్యులం అయిపోయాం” అంటూ పరిహాసాలు ఆడారు. విశ్వామిత్రుడు బాధపడి పుత్రులను మ్లేచ్చు అయిపోండి అని శపించాడు.

తెభా-9-495-వ.
అయ్యెడ నతని శాపంబునకు వెరచి, యా నూర్వురయందు మధ్యముండైన మధుచ్ఛందుం డేఁబండ్రు దమ్ములుం దానును నమస్కరించి “తండ్రీ నీచెప్పిన క్రమంబున శునశ్శేపుండు మా కన్న యని మన్నింపంగలవార” మనవుడు సంతసించి మంత్రదర్శియైన శునశ్శేపుని వారల యందుఁ బెద్దఁజేసి, మధుచ్ఛందున కిట్లనియె.
టీక:- ఆ = ఆ; ఎడన్ = సమయము నందు; శాపంబున్ = శాపమున; కున్ = కు; వెరచి = బెదిరి; ఆ = ఆ; నూర్వుర = వందమంది; అందున్ = లోను; మధ్యముండు = నడుమవాడు; ఐన = అయిన; మధుచ్ఛందుండు = మధుచ్ఛందుడు; ఏబదండ్రున్ = ఏభైమంది (5); తమ్ములున్ = తమ్ములును; తానున్ = అతను; నమస్కరించి = మ్రొక్కి; తండ్రీ = తండ్రీ; నీ = నీవు; చెప్పిన = చెప్పినట్టి; క్రమంబునన్ = విధముగ; శునశ్శేపుండున్ = శునశ్శేపుడు; మా = మా; కున్ = కు; అన్న = అన్న; అని = అనుచు; మన్నింపగలవారము = గౌరవించెదము; అనవుడు = అనగా; సంతసించి = సంతోషించి; మంత్రదర్శి = మంత్రసిద్ధి; ఐన = అయిన; శునశ్సేపుని = శునశ్శేపుని; వారల = వారి; అందున్ = లో; పెద్దన్ = పెద్దవానిగా; చేసి = నియమించి; మధుచ్ఛందున్ = మధుచ్ఛందున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ సమయంలో ఆ శాపానికి బెదిరి ఆ వందమంది లోను నడిమవాడైన మధుచ్ఛందుడు ఏభైమంది తమ్ములతో వచ్చి మ్రొక్కి, “తండ్రీ! నీవు చెప్పినట్టే శునశ్శేపుని మా అన్నగా గౌరవిస్తాం” అన్నాడు. సంతోషించి మంత్రసిద్ధి పొందిన శునశ్శేపుని వారిలో పెద్దవానిగా నియమించి, మధుచ్ఛందునితో ఇలా అన్నాడు.

తెభా-9-496-ఆ.
"పాడి చెడక వీఁడు నేఁడు మీకతమునఁ
గొడుకు గలిగె నాకుఁ గొడుకులార!
డుపులార! మీరు గొడుకులఁ గనుఁ డింక
బ్రీతితోడ దేవరాతుఁ గూడి."

టీక:- పాడి = పద్ధతి; చెడక = తప్పక; వీడు = ఇతను; నేడున్ = ఇతను; మీ = మీ; కతమునన్ = వలన; కొడుకున్ = పుత్రుడుగా; కలిగెన్ = కలిగెను; నా = నా; కున్ = కు; కొడుకులారా = పుత్రులూ; కడుపులారా = జాతులూ; మీరున్ = మీరు; కొడుకులన్ = పుత్రులను; కనుడు = పుట్టించండి; ఇంకన్ = ఇకనుండి; ప్రీతి = ప్రేమ; తోడన్ = పూర్వకముగ; దేవరాతున్ = దేవరాతునితో; కూడి = కలిసి .
భావము:- “పుత్రులారా! మీరు ధర్మం తప్పక నడుచుకున్నారు. కనుక నాకు మరో పుత్రుడు కలిగాడు. ఇకనుండి ఈ దేవరాతుడు, మీరు ఒద్దికగా, ప్రేమ పూర్వకంగా ఉండి, పుత్రులను పుట్టించండి.”

తెభా-9-497-వ.
అని పలికె; నట్లు శునశ్శేఫుండు దేవతలచేత విడివడుటం జేసి దేవరాతుండయ్యె; మధుచ్ఛందుండు మొదలయిన యేఁబండ్రు నా దేవరాతునకుఁ దమ్ములైరి పెద్దలయిన యష్టక, హారీత, జయంత సుమదాదు లేఁబండ్రును వేఱై చనిరి; ఈ క్రమంబున విశ్వామిత్రు కొడుకులు రెండు విధంబులయినం, బ్రవరాంతంబు గలిగె” నని చెప్పి శుకుం డిట్లనియె “నా పురూరవు కొడుకగు నాయువునకు నహుషుండును, క్షత్త్రవృద్దుండును, రజియును, రంభుండును, ననేనసుండును ననువారు పుట్టి; రందు క్షత్త్రవృద్ధునకుఁ గుమారుండగు సుహోత్రునకుఁ గాశ్యుండుఁ గుశుఁడు గృత్స్నమదుండు నన ముగ్గురు గలిగి; రా కృత్స్నమదునకు శునకుండును, శునకునకు శౌనకుండును, నమ్మహాత్మునికి బహ్వృచప్రవరుండును జన్మించి; రా బహ్వృచప్రవరుండు దపోనియతుండై చనియె; కాశ్యునకుఁ గాశియుఁ గాశికి రాష్ట్రుండును, రాష్ట్రునకు దీర్ఘతపుండును జనించిరి.
టీక:- అని = అని; పలికెన్ = చెప్పెను; అట్లు = ఆ విధముగ; శునశ్సేపుండు = శునశ్సేపుడు; దేవతలు = దేవతలు; చేతన్ = చేత; విడివడుటన్ = విడిపింపబడుట; చేసి = వలన; దేవరాతుండు = దేవరాతుడు; అయ్యెన్ = అయ్యెను; మధుచ్ఛదుండు = మధుచ్ఛదుడు; మొదలయిన = మున్నగు; ఏబండ్రున్ = ఏభైమంది (5); ఆ = ఆ; దేవరాతున్ = దేవరాతుని; కున్ = కి; తమ్ములున్ = తమ్ముళ్ళు; ఐరి = అయ్యిరి; పెద్దలు = పెద్దవాళ్ళు; ఐన = అయినట్టి; అష్టక = అష్టకుడు; హారిత = హారితుడు; జయంత = జయంతుడు; సుమద = సుమదుడు; ఆదులు = మున్నగువారు; ఏబండ్రును = ఏభైమంది (5); వేఱై = విడిపోయి; చనిరి = వెళ్ళిపోయిరి; ఈ = ఈ; క్రమంబునన్ = విధముగ; విశ్వామిత్రు = విశ్వామిత్రుని; కొడుకులున్ = పుత్రులు; రెండు = రెండు (2); విధంబులు = తెగలుగ; అయినన్ = కాగా; ప్రవర = గోత్రమునందు; భేదంబున్ = రకములు; కలిగెను = ఏర్పడినవి; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ఆ = ఆ; పురూరవు = పురూరవుని; కొడుకు = పుత్రుడు; అగున్ = అయిన; ఆయువున్ = ఆయువున; కున్ = కు; నహుషుండునున్ = నహుషుడు; క్షత్రవృద్ధుండునున్ = క్షత్రవృద్దుడు; రజియునున్ = రజి; రంభుండునున్ = రంభుడు; అనేనసుండు = అనేనసుడు; అను = అనెడి; వారున్ = వారు; పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో; క్షత్రవృద్దున్ = క్షత్రవృద్దున; కున్ = కు; కుమారుండు = పుత్రుడు; అగు = ఐన; సుహోత్రున్ = సుహోత్రున; కున్ = కు; కాశ్యుండును = కాశ్యుడు; కుశుడు = కుశుడు; కృత్స్నమదుండున్ = కృత్స్నమదుడు; అనన్ = అనెడి; ముగ్గురు = ముగ్గురు (3); కలిగిరి = పుట్టరి; ఆ = ఆ; కృత్స్నమదున్ = కృత్స్నమదున; కున్ = కు; శునకుండును = శునకుడు; శునకున్ = శునకున్; కున్ = కు; శౌనకుండును = శౌనకుడు; ఆ = ఆ; మహాత్ముని = మహాత్ముని; కిన్ = కి; బహ్వృచప్రవరుండును = బహ్వృచప్రవరుడు; జన్మించిరి = పుట్టిరి; ఆ = ఆ; బహ్వృచప్రవరుండు = బహ్వృచప్రవరుడు; తపస్ = తపస్సు చేయుటందు; నియతుండు = కట్టుబడినవాడు; ఐ = అయ్యి; చనియె = వెళ్ళిపోయెను; కాశ్యున్ = కాశ్యున; కున్ = కు; కాశియున్ = కాశి; కాశి = కాశి; కిన్ = కి; రాష్ట్రుండును = రాష్ట్రుడు; రాష్ట్రున్ = రాష్ట్రున; కున్ = కు; దీర్ఘతపుండును = దీర్ఘతపుడు; జనించిరి = పుట్టిరి.
భావము:- అని విశ్వామిత్రుడు చెప్పాడు. ఆ విధంగ శునశ్సేపుడు దేవతలు చేత విడిపింపబడుట వలన దేవరాతుడు అని పేరు పొందాడు. మధుచ్ఛదుడు మున్నగు ఏభైమంది ఆ దేవరాతునికి తమ్ముళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన అష్టకుడు, హారితుడు, జయంతుడు, సుమదుడు మున్నగువారు ఏభైమంది విడిపోయి వెళ్ళిపోయారు. అలా విశ్వామిత్రుని పుత్రులు రెండు తెగలుగా కాగా గోత్రభేదం కలిగింది.” అని చెప్పి శుకుడు మరల ఇలా చెప్పాడు. “ఆ పురూరవుని పుత్రుడైన ఆయువునకు నహుషుడు, క్షత్రవృద్దుడు, రజి, రంభుడు, అనేనసుడు జన్మించారు. వారిలో క్షత్రవృద్దునకు సుహోత్రుడు; సుహోత్రునకు కాశ్యుడు, కుశుడు, కృత్స్నమదుడు అని ముగ్గురు పుట్టారు. ఆ కృత్స్నమదునకు శునకుడు; శునకునకు శౌనకుడు; ఆ మహాత్మునికి బహ్వృచప్రవరుడు పుట్టారు. ఆ బహ్వృచప్రవరుడు తపస్సు చేసుకుంటాను అని వెళ్ళిపోయాడు. కాశ్యునకు కాశి; కాశికి రాష్ట్రుడు; రాష్ట్రునకు దీర్ఘతపుడు పుట్టారు.

తెభా-9-498-క.
దీర్ఘతపుని కధికుఁడు
శ్రీయితాంశమునఁ బుట్టె సేవ్యుం డాయు
ర్వేజ్ఞఁడు ధన్వంతరి
ఖేదంబులు వాయు నతనిఁ గీర్తనచేయన్.

టీక:- ఆ = ఆ; దీర్ఘతపుని = దీర్ఘతపని; కిన్ = కి; అధికుడు = గొప్పవాడు; శ్రీదయిత = విష్ణువు {శ్రీదయిత - లక్ష్మీదేవి భర్త, విష్ణువు}; అంశమునన్ = అంశతో; పుట్టెన్ = జన్మించెను; సేవ్యుండు = సేవింపదగినవాడు; ఆయుర్వేదజ్ఞుడు = వైద్యముతెలిసినవాడు; ధన్వంతరి = ధన్వంతరి; ఖేదంబులున్ = దుఃఖములు; వాయున్ = తొలగిపోవును; అతనిన్ = అతనిని; కీర్తన = స్తుతించుట; చేయన్ = చేసినచో .
భావము:- ఆ దీర్ఘతపునికి వైష్ణవ అంశతో ఆయుర్వేదం తెలిసిన మహానుభావుడు ధన్వంతరి జన్మించాడు. ఆయనను సేవిస్తే సకల దుఃఖాలు తొలగిపోతాయి.

తెభా-9-499-వ.
వాసుదేవాంశసంభూతుండగు నా ధన్వంతరి యజ్ఞభాగంబున కర్హుం; డతనికిఁ గేతుమంతుండు, గేతుమంతునకు భీమరథుఁడు నతనికి దివోదాసుండనం బరఁగు ద్యుమంతుండు నుదయించి; రా ద్యుమంతునకుఁ బ్రతర్దనుండు జన్మించె; నా ప్రతర్దనుండు శత్రుజిత్తనియును ఋతధ్వజుండనియుం జెప్పంబడె; నాతనికిఁ గువలయాశ్వుండు సంభవించె.
టీక:- వాసుదేవ = విష్ణుని {వాసుదేవుడు - వసుదేవుని కుమారుడు, కృష్ణుడు}; అంశన్ = అంశతో; సంభూతుండు = చక్కగా పుట్టినవాడు; అగున్ = అయిన; ఆ = ఆ; ధన్వంతరి = ధన్వంతరి; యజ్ఞభాగంబున్ = ఙవిర్భాగముల; కున్ = కు; అర్హుండు = అర్హత కలవాడు; అతనిన్ = అతని; కిన్ = కి; కేతుమంతుడున్ = కేతుమంతుడు; కేతుమంతున్ = కేతుమంతుని; కున్ = కి; భీమరథుండును = భీమరథుడు; అతనిన్ = అతని; కిన్ = కి; దివోదాసుండు = దివోదాసుడు; అనన్ = అని; పరగు = ప్రసిద్దమైనవాడు; ద్యుమంతుండును = ద్యుమంతుడును; ఉదయించిరి = పుట్టరి; ఆ = ఆ; ద్యుమంతున్ = ద్యుమంతుని; కున్ = కి; ప్రతర్దనుండు = ప్రతర్దనుడు; జన్మించెన్ = పుట్టెను; ఆ = ఆ; ప్రతర్థునుండు = ప్రతర్థనుడు; శత్రుజిత్తు = శత్రుజిత్తు; అనియునున్ = అని; ఋతుధ్వజుండు = ఋతుధ్వజుడు; అనియున్ = అని; చెప్పంబడియె = పిలువబడెను; ఆతని = ఆతని; కిన్ = కి; కువలయాశ్వుండున్ = కువలయాశ్వుడు; సంభవించె = పుట్టెను.
భావము:- వైష్ణవాంశతో పుట్టిన ధన్వంతరి హవిర్భాగాలకు అర్హుడు. అతనికి కేతుమంతుడు; కేతుమంతునికి భీమరథుడు; అతనికి దివోదాసుడు అని ప్రసిద్దమైన ద్యుమంతుడు పుట్టారు. ఆ ద్యుమంతునికి ప్రతర్దనుడు పుట్టాడు. ఆ ప్రతర్దనుడికి శత్రుజిత్తు అని, ఋతుధ్వజుడు అని పేర్లు ఉన్నాయి. ఆతనికి కువలయాశ్వుడు పుట్టాడు.

తెభా-9-500-ఆ.
సుమతీశ! విను కులయాశ్వభూభర్త
లితపుణ్యు ఘను నర్కుఁ గనియె
నాతఁ డేలె నేల ఱువదియాఱు వే
లేండ్లు వాని భంగి నేల రెవరు.

టీక:- వసుమతీశ = రాజా {వసుమతీశుడు - భూమికి ప్రభువు, రాజు}; విను = వినుము; కువలయాశ్వ = కువలయాశ్వుడను; భూభర్త = రాజు; లలిత = మనోజ్ఞమైన; పుణ్యున్ = ఫుణ్యాత్ముని; ఘనున్ = గొప్పవానిని; అలర్కున్ = అలర్కుని; కనియెన్ = పుట్టించెను; ఆతడు = అతను; ఏలెన్ = పరిపాలించెను; నేలన్ = భూమండలమును; అరువదియాఱువేల = అరవైయారు (66) వేల; ఏండ్లున్ = సంవత్సరములు; వాని = అతని; భంగిన్ = వలె; ఏలరు = పరిపాలించరు; ఎవరున్ = ఎవరూకూడ.
భావము:- రాజా పరీక్షిత్తూ! శ్రద్దగా విను. కువలయాశ్వుడు అలర్కుడు అనే ఫుణ్యాత్ముని గొప్పవానిని పుట్టించాడు. అతను అరవైఆరువేల ఏళ్ళు భూమండలాన్ని ఏలాడు. ఎవరూ అతనిలా పరిపాలించిన వారు లేరు.

తెభా-9-501-వ.
అయ్యలర్కునకు సన్నతియును, నతనికి సునీతుండును, నతనికి సుకేతనుండును, నతనికి ధర్మకేతువు, నతనికి సత్యకేతువును, నాతనికి ధృష్టకేతువును, నా ధృష్టకేతువునకు సుకుమారుండును, సుకుమారునకు వీతిహోత్రుండు, వీతిహోత్రునకు భర్గుండును, భర్గునకు భార్గభూమియు జనియించిరి.
టీక:- ఆ = ఆ; అలర్కున్ = అలర్కున; కున్ = కు; సన్నతియును = సన్నతి; అతని = అతని; కిన్ = కి; సునీతుండును = సునీతుడు; అతని = అతని; కిన్ = కి; సుకేతుండునున్ = సుకేతుడు; అతని = అతని; కిన్ = కి; ధర్మకేతువున్ = ధర్మకేతువు; అతని = అతని; కిన్ = కి; సత్యకేతువునున్ = సత్యకేతువు; ఆతని = అతని; కిన్ = కి; ధృష్టకేతువునున్ = ధృష్టకేతువు; ఆ = ఆ; ధృష్టకేతువున్ = ధృష్టకేతువున; కున్ = కు; సుకుమారుండును = సుకుమారుడు; సుకుమారున్ = సుకుమారున; కున్ = కు; వీతిహోత్రుండున్ = వీతిహోత్రుడ; వీతిహోత్రుని = వీతిహోత్రున; కున్ = కు; భర్గుండును = భర్గుడు; భర్గున్ = భర్గున; కున్ = కు; భార్గభూమియున్ = భార్గభూమి; జనియించిరి = పుట్టిరి .
భావము:- ఆ అలర్కునకు సన్నతి; అతనికి సునీతుడు; అతనికి సుకేతుడు; అతనికి ధర్మకేతువు; అతనికి సత్యకేతువు; అతనికి ధృష్టకేతువు; ఆ ధృష్టకేతువుకు సుకుమారుడు; సుకుమారునికి వీతిహోత్రుడు; వీతిహోత్రునకు భర్గుడు; భర్గునకు భార్గభూమి; పుట్టారు.

తెభా-9-502-ఆ.
వాఁడు తుదయుఁ గాశ్యసుమతీశుం డాది
యైనవారు కాశు నఁగ నెగడి
వనిమీఁద వార లా క్షత్రవృద్ధుని
వంశజాతు లగుచు వంశవర్య!

టీక:- వాడు = అతను; తుదయున్ = ఆఖరివాడుగను; కాశ్య = కాశ్యుడు అనెడి; వసుమతీశుండు = రాజు; ఆది = మొదటివాడుగను; ఐనవారు = పుట్టినవారు; కాశులు = కాశులు; అనగన్ = అని; నెగడిరి = వర్ధిల్లిరి; అవని = భూమి; మీదన్ = మీద; వారలు = వారు; ఆ = ఆ; క్షతవృద్దుని = క్షతవృద్దుని; వంశ = వంశమున; జాతులు = పుట్టినవారు; అగుచున్ = అగుచు; వంశ = కులమును; వర్య = ఉద్దరించినవాడా.
భావము:- ఓ పాండు వంశోద్ధారకా! క్షతవృద్దుని వంశంలో పుట్టిన కాశ్యుడు మొదలు భార్గభూమి వరకు కల రాజులు కాశులు అనే పేర లోకంలో వర్ధిల్లారు.

తెభా-9-503-వ.
మఱియు, క్షత్రవృద్ధునికి రెండవకొడుకగు కుశునికిఁ బ్రీతియును, వానికి సంజయుండును, సంజయునికి జయుండును, జయునికిఁ గృతుండును, గృతునికి హర్యధ్వనుండును, హర్యధ్వనునకు, సహదేవుండును, సహదేవునికి భీముండును, భీమునకు జయత్సేనుండును, జయత్సేనునకు సంకృతియు, సంకృతికి జయుండును, జయునికి, క్షత్రధర్మండును బుట్టిరి; వీరలు క్షత్రవృద్ధుని వంశంబునం గల రాజులు; రంభునికి రభసుండును, రభసునికి గంభీరుండును గంభీరునికిఁ గృతుండును గల్గి; రా గృతునికి బ్రహ్మకులంబు పుట్టె; న య్యనేసునకు శుద్ధుండును, శుద్ధునకు శుచియు, శుచికి బ్రహ్మసారథి యైన త్రికకుత్తును జనించి; రతనికి శాంతరజుండు పుట్టె; నతండు విజ్ఞానవంతుండుఁ, గృతకృత్యుండు, విరక్తుండు నయ్యె.
టీక:- మఱియున్ = ఇంకను; క్షత్రవృద్దున్ = క్షతవృద్దుని; కిన్ = కి; రెండవ = రెండవ (2); కొడుకు = పుత్రుడు; అగు = ఐన; కుశుని = కుశుని; కిన్ = కి; ప్రీతియునున్ = ప్రీతి; వాని = అతని; కిన్ = కి; సంజయుండును = సంజయుడును; సంజయున్ = సంజయుని; కిన్ = కి; జయుండును = జయుడు; జయుని = జయుని; కిన్ = కి; కృతుండును = కృతుండును; కృతుని = కృతుని; కిన్ = కి; హర్యధ్వనుండును = హర్యధ్వనుండును; హర్యధ్వనున = హర్యధ్వనున; కున్ = కు; సహదేవుండునున్ = సహదేవుడు; సహదేవుని = సహదేవుని; కిన్ = కి; భీముండనున్ = భీముడు; భీమున్ = భీమున; కున్ = కు; జయత్సేనుండును = జయత్సేనుడు; జయత్సేనున్ = జయత్సేనున; కున్ = కు; సంకృతియున్ = సంకృతి; సంకృతి = సంకృతి; కిన్ = కి; జయుండును = జయుడు; జయుని = జయుని; కిన్ = కి; క్షత్రధర్ముండును = క్షత్రధర్ముడు; పుట్టిరి = జనించిరి; వీరలు = వీరు; క్షత్రవృద్ధుని = క్షత్రవృద్ధుని; వంశంబునన్ = వంశములో; కల = ఉన్నట్టి; రాజులున్ = రాజులు; రంభున్ = రంభుని; కిన్ = కి; రభసుండును = రభసుడు; రభసుని = రభసుని; కిన్ = కి; గంభీరుండునున్ = గంభీరుడు; గంభీరుని = గంభీరుని; కిన్ = కి; కృతుండును = కృతుడు; కల్గిరి = పుట్టిరి; ఆ = ఆ; కృతున్ = కృతుని; కిన్ = కి; బ్రహ్మకులంబున్ = బ్రాహ్మణకులము; పుట్టెన్ = పుట్టినది; ఆ = ఆ; అనేసున = అనేసుని; కున్ = కి; శుద్ధుండును = శుద్ధుడు; శుద్ధున్ = శుద్దున; కున్ = కు; శుచియున్ = శుచి; శుచి = శుచి; కిన్ = కి; బ్రహ్మ = బ్రహ్మదేవునికి; సారథి = రథసారథి; ఐన = అయినట్టి; త్రికకుత్తునున్ = త్రికకుత్తు; జనించిరి = పుట్టరి; అతని = అతని; కిన్ = కి; శాంతరజుండు = శాంతరజుడు; పుట్టెన్ = పుట్టెను; అతండు = అతడు; విజ్ఞానవంతుండు = మంచిజ్ఞాని; కృతకృత్యుండు = ధన్యుడు; విరక్తుండున్ = విరక్తుడు; అయ్యెన్ = అయ్యెను.
భావము:- మఱియు, క్షతవృద్దుని రెండవ కొడుకైన కుశునికి ప్రీతి; అతనికి సంజయుడు; సంజయునికి జయుడు; జయునికి కృతుండు; కృతునికి హర్యధ్వనుడు; హర్యధ్వనునకు సహదేవుడు; సహదేవునికి భీముడు; భీమునకు జయత్సేనుడు; జయత్సేనునకు సంకృతి; సంకృతికి జయుడు; జయునికి క్షత్రధర్ముడు జనించారు. వీరంతా క్షత్రవృద్ధుని వంశంలోని రాజులు. రంభునికి రభసుడు; రభసునికి గంభీరుడు; గంభీరునికి కృతుడు పుట్టారు. ఆ కృతునికి బ్రాహ్మణకులం పుట్టింది. ఆ అనేసునికి శుద్ధుడు; శుద్దునకు శుచి; శుచికి బ్రహ్మదేవుడి రథసారథి అయిన త్రికకుత్తు పుట్టారు. అతనికి శాంతరజుడు పుట్టాడు. అతడు మంచిజ్ఞాని ధన్యుడు, విరక్తుడు, అయ్యాడు.

తెభా-9-504-సీ.
జియను వానికి రాజేంద్ర! యేనూఱు-
కొడుకులు గలిగిరి ఘోరబలులు
వేల్పులెల్లను వచ్చి వేఁడిన నా రజి-
దైత్యులఁ బెక్కండ్ర రణిఁ గూల్చి
నాకంబు దేవేంద్రుకు నిచ్చె నిచ్చిన-
జికాళ్ళకెఱిఁగి సుప్రభుండు
వెండియు నతనికి విబుధగేహము నిచ్చి-
సంతోషబుద్ధి నర్చన మొనర్చె

తెభా-9-504.1-ఆ.
నంతనా రజి మృతుఁడైన నతని పుత్రు
మరవిభుఁడు తమ్ము డిగికొనిన
నీక యింద్రలోక; మేలిరి యాగభా
ములు పుచ్చికొనిరి ర్వమంది.

టీక:- రజి = రజి; అను = అనెడి; వాని = అతని; కిన్ = కి; రాజేంద్రా = మహారాజా; ఏనూఱు = ఐదువందలమంది (500); కొడుకులున్ = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; ఘోర = భీకరమైన; బలులు = బలశాలులు; వేల్పులు = దేవతలు; ఎల్లను = అందరు; వచ్చి = చేరి; వేడినన్ = కోరగా; ఆ = ఆ; రజి = రజి; దైత్యులన్ = రాక్షసులను; పెక్కండ్రన్ = అనేకులను; ధరణిగూల్చి = నేలకూల్చి; నాకంబున్ = స్వర్గమును; దేవేంద్రున్ = ఇంద్రున; కున్ = కు; ఇచ్చెన్ = ఇచ్చెను; ఇచ్చిన = ఇచ్చినట్టి; రజి = రజి యొక్క; కాళ్లు = పాదముల; కున్ = కు; ఎఱిగి = మ్రొక్కి; సురప్రభుండు = ఇంద్రుడు {సురప్రభువు - దేవతలరాజు, ఇంద్రుడు}; వెండియున్ = ఇంకను; అతని = అతని; కిన్ = కి; విబుధగేహమున్ = పాలనాధికారము {విబుధగేహము - దివ్యమైన (అధికారకేంద్రమైన) గృహమును, పాలనాధికారము}; ఇచ్చి = ఇచ్చి; సంతోష = సంతోషముగల; బుద్ధిన్ = మనసుతో; అర్చనమున్ = సేవించుట; ఒనర్చెన్ = చేసెను; అంతన్ = అప్పుడు; ఆ = ఆ.
రజి = రజి; మృతుండు = మరణించినవాడు; ఐనన్ = కాగా; అతని = అతని యొక్క; పుత్రులు = కొడుకులు; అమరవిభుడు = ఇంద్రుడు {అమరవిభుడు - దేవతలప్రభువు, ఇంద్రుడు}; తమ్మున్ = వారని; అడిగికొనినను = అర్థించినను; ఈక = ఇయ్యకుండగ; ఇంద్రలోకమున్ = స్వర్గమును; ఏలిరి = పాలించిరి; యాగభాగములున్ = హవిర్భాగములను; పుచ్చికొనిరి = తీసుకొనిరి; గర్వమున్ = మదము; అంది = పొంది.
భావము:- పరీక్షిన్మహారాజా! రజికి ఐదువందలమంది గొప్ప బలశాలులైన కొడుకులు పుట్టారు. దేవతలు వచ్చి కోరగా, ఆ రజి పలువురు రాక్షసులను నేలకూల్చి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. అప్పుడు రజి పాదాలకు మ్రొక్కి, ఇంద్రుడు అతనికి స్వర్గాన్ని కాపాడే అధికారం అప్పగించి సేవిస్తున్నాడు. ఆ రజి మరణించాకా అతని కొడుకులు ఇంద్రుడు కోరినా స్వర్గాన్ని ఇవ్వకుండ హవిర్భాగాలు తీసుకుంటూ గర్వంతో స్వర్గాన్ని పాలించసాగారు.

తెభా-9-505-క.
వేలుపులఱేఁడు గురుచే
వేలిమి వేల్పించి బలిమి వెలయఁగ నిజ దం
భోళిని రజిసుతులను ని
ర్మూము గావించి స్వర్గముం గైకొనియెన్.

టీక:- వేలుపులఱేడున్ = ఇంద్రుడు; గురు = బృహస్పతి; చేన్ = చేత; వేలిమిన్ = హోమమును; వేల్పించి = చేయించి; బలిమిన్ = బలము; వెలయగన్ = అతిశయించగ; నిజ = తన; దంభోళిన్ = వజ్రాయుధముతో; రజి = రజి యొక్క; సుతులను = పుత్రులను; నిర్మూలనము = నాశనము; కావించెన్ = చేసెను; స్వర్గమున్ = స్వర్గమును; కైకొనియెన్ = చేపట్టెను.
భావము:- అంతట ఇంద్రుడు బృహస్పతి చేత హోమం చేయించాడు. అతిశయించిన బలంతో వజ్రాయుధం ప్రయోగించి రజి పుత్రులను నాశనం చేసి, స్వర్గాన్ని చేపట్టాడు.