పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/పూరువు వృత్తాంతము

వికీసోర్స్ నుండి

పూరువు వృత్తాంతము

తెభా-9-552-వ.
అని యదుం డొడంబడకున్న యయాతి దుర్వసు ద్రుహ్యాదుల నడిగిన వారును యదువు పలికినట్ల పలికినఁ గడగొట్టు కుమారుండైన పూరువున కిట్లనియె.
టీక:- అని = అని; యదుండు = యదుడు; ఒడంబడకున్న = ఒప్పుకోకపోవుటచే; యయాతి = యయాతి; దుర్వసు = దుర్వసుడు; ద్రుహ్య = ద్రుహ్యుడు; ఆదులన్ = మున్నగువారిని; అడిగినన్ = అడుగగా; వారునున్ = వారు కూడ; యదువు = యదుడు; పలికిన = చెప్పిన; అట్ల = విధముగనే; పలికినన్ = చెప్పగా; కడగొట్టు = అందరిలోకి చిన్న; కుమారుడున్ = పుత్రుడు; ఐన = అయినట్టి; పూరువున్ = పూరువున; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- అని యదువు తిరస్కరించాడు. అంత, యయాతి తుర్వసుడిని ద్రుహ్యుడిని అడుగగా, వారు కూడ యదువు చెప్పినట్లే చెప్పారు. కడగొట్టు కొడుకైన పూరువుని ఇలా అడిగాడు.

తెభా-9-553-ఉ.
"పిన్నవుగాని నీవు కడుఁబెద్దవు బుద్ధుల యందు; రమ్ము నా
న్న! మదాజ్ఞ దాఁటవుగ న్న! వినీతుఁడ వన్న! నీవు నీ
న్నలు చెప్పినట్లు పరిహారము చెప్పకు మన్న! నా జరన్
న్నన దాల్చి నీ తరుణిమం బొనగూర్చుము నాకుఁ బుత్రకా!"

టీక:- పిన్నవున్ = చిన్నవాడవు; కాని = కాని; నీవున్ = నీవు; కడున్ = మిక్కిలి; పెద్దవాడవు = పెద్దవాడవు; బుద్దులన్ = మంచిబుద్దుల; అందున్ = విషయములో; రమ్ము = రా; నా = నా; అన్న = తండ్రి; మత్ = నా యొక్క; ఆజ్ఞన్ = ఉత్తరువును; దాటవుగద = తోసిపుచ్చవుకదా; అన్న = నాయనా; వినీతుడవు = అణకువ కలవాడవు; అన్న = నాయనా; నీవున్ = నీవు; నీ = నీ యొక్క; అన్నలున్ = పెద్దసోదరులు; చెప్పిన = చెప్పిన; అట్లున్ = విధముగ; పరిహారము = తోసిపుచ్చుచు; చెప్పుకుము = చెప్పవద్దు; అన్న = తండ్రి; నా = నా యొక్క; జరన్ = ముసలితనమును; మన్ననన్ = మన్నించి; తాల్చి = గ్రహించి; నీ = నీ యొక్క; తరుణిమన్ = యౌవనమును; ఒనగూర్చుము = కలిగించుము; నా = నా; కున్ = కు; పుత్రకా = కుమారా.
భావము:- “నాయనా! నా తండ్రి! అందరిలోకి చిన్నవాడవు. కాని, మంచి బుద్దుల విషయంలో ఉత్తముడవు, అణకువ కలవాడవు. నా ఉత్తరువును తోసిపుచ్చవు కదా. నీ అన్నలవలె నీవు తోసిపుచ్చవద్దు. నా ముసలితనాన్ని మన్నించి తీసుకుని, నీ యౌవనాన్ని నాకు ఇమ్ము.”

తెభా-9-554-వ.
అనిన విని గురుభక్తిగుణాధారుండయిన పూరుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; గురు = పితృ; భక్తిన్ = భక్తి; గుణా = గుణములు; ధారుండు = కలిగినవాడు; అయిన = ఐనట్టి; పూరుండు = పూరుడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- అనగా విని పితృ భక్తి సుగుణాలు కల పూరుడు ఈ విధముగా పలికాడు.

తెభా-9-555-శా.
"య్యా! నన్నిటు వేఁడనేల? భవదీయాజ్ఞాసముల్లంఘనం
య్యుండం బరిహారమున్నొడువ నే న్యాయినే? నీ జరన్
నెయ్యం బొప్పగఁ దాల్చి, నా తరుణిమన్ నీకిచ్చెదం, బంపినం
య్యం బాడెడి పుత్రకుండు క్రిమిసంకాశుండు గాకుండునే?

టీక:- అయ్యా = తండ్రీ; నన్నున్ = నన్ను; వేడన్ = ప్రార్థించుట; ఏలన్ = ఎందుకు; భవదీయ = నీ యొక్క; ఆజ్ఞా = ఉత్తరువును; సముల్లంఘనంబు = దాటుట; అయ్యుండన్ = చేయుటకు; పరిహారమున్ = తోసిపుచ్చుటను; నొడువన్ = చెప్పుటకు; నేన్ = నేను; అన్యాయుండనే = అధర్మపరుడనా, కాదు; నీ = నీ యొక్క; జరన్ = వృద్దత్వమును; నెయ్యంబు = సంతోష; ఒప్పగన్ = పూర్వకముగ; తాల్చి = ధరించి; నా = నా యొక్క; తరుణిన్ = యౌవనమును; నీ = నీ; కున్ = కు; ఇచ్చెదన్ = ఇచ్చెదను; పంపినన్ = ఆజ్ఞాపించినను; కయ్యంబు = పేచీలు; ఆడెడి = పెట్టెడి; పుత్రకుండు = కుమారుడు; క్రిమి = పురుగుతో; సంకాశుండు = సమానమైనవాడు; కాకుండునే = కాకపోవునే, అవును.
భావము:- “తండ్రీ! మీరు నన్ను ప్రార్థించడం ఎందుకు? మీ ఆజ్ఞ దాటడానికి, తోసిపుచ్చుటానికి, నేను ఏమాత్రం అధర్మపరుడను కాదు. మీ వృద్దత్వాన్ని సంతోష పూర్వకంగ ధరించి నా యౌవనాన్ని మీకు ఇస్తాను. తండ్రి ఆజ్ఞాపించాక పేచీలు పెట్టె కొడుకు పురుగుతో సమానం కదా.

తెభా-9-556-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ .
భావము:- అంతే కాకుండగ.

తెభా-9-557-క.
మునివృత్తి డయ్య నేఁటికి
పాలక! సుగతిఁ గోరు త్పురుషులకుం
నుఁ గన్న తండ్రిజెప్పిన
ని చేసిన సుగతి గొంగుసిఁడియ కాదే?

టీక:- మునివృత్తిన్ = తపస్సు చేయుటచే; డయ్యన్ = కృశించుట; ఏటికిని = ఎందులకు; జనపాలక = రాజా; సుగతిన్ = సద్గతిని; కోరు = కోరెడి; సత్పురుషుల్ = మంచివారి; కున్ = కి; తన్నున్ = తనను; కన్న = పుట్టించిన; తండ్రి = తండ్రి; చెప్పిన = చెప్పినట్టి; పనిన్ = పనిని; చేసినన్ = చేసినచో; సుగతిన్ = సద్గతులు; కొంగుపసిడియ = కొంగుబంగారము; కాదే = కాదా, అవును.
భావము:- మహారాజా! సద్గతిని కోరే వాడు కష్టపడు తపస్సు చేయడం కృశించడం ఎందుకు? కన్న తండ్రి చెప్పినట్టి పని చేస్తే సరిపోదా. సద్గతులు కొంగుబంగారంలా అందవా?

తెభా-9-558-క.
నుపక చేయుదు రధికులు
నిచిన మధ్యములు పొందుఱతురు తండ్రుల్
ని చెప్పి కోరి పనిచిన
నిశము మాఱాడు పుత్రు ధములు దండ్రీ!"

టీక:- పనుపక = చెప్పక మునుపే; చేయుదురు = చేసెదరు; అధికులు = ఉత్తములు; పనిచినన్ = ఆజ్ఞాపించినాక; మధ్యములున్ = మధ్యములు; పొందుపఱతురున్ = సమకూర్చెదరు; తండ్రుల్ = తండ్రులు; పనిన్ = పనిని; చెప్పి = తెలిపి; కోరి = కావాలని; పనిచినన్ = ఆజ్ఞాపించినాక; అనిశము = ఎల్లప్పుడు; మాఱాడు = ఎదురు చెప్పెడి; పుత్రుల్ = కొడుకులు; అధములున్ = నీచులు; తండ్రీ = తండ్రీ.
భావము:- నాన్నగారు! యయాతి మహారాజా! ఉత్తములు తండ్రుల ఇంగితం తెలుసుకౌని చెప్పకుండానే పనులు చేసేస్తారు. మధ్యములు చెప్పిన పిమ్మట చేస్తారు. తండ్రులు చెప్పిన పనికి ఎప్పుడు ఏదో ఒకటి అడ్డు చెప్పి చెయ్యకుండా ఉండే కొడుకులు అధములు."

తెభా-9-559-వ.
అని పలికి పూరుండు ముదిమి చేకొని తన లేబ్రాయంబు యయాతి కిచ్చె; న య్యయాతియుం దరుణుండై.
టీక:- అని = అని; పలికి = చెప్పి; పూరుండు = పూరుడు; ముదిమిన్ = ముసలితనమును; చేకొని = స్వీకరించి; తన = తన యొక్క; లేబ్రాయంబున్ = లేతవయసును; యయాతి = యయాతి; కిన్ = కి; ఇచ్చెను = ఇచ్చెను; ఆ = ఆ; యయాతియున్ = యయాతి; తరుణుండు = యౌవనవంతుడు; ఐ = అయ్యి.
భావము:- అని చెప్పి పూరుడు తండ్రి ముసలితనాన్ని స్వీకరించి తన లేతవయసును యయాతికి ఇచ్చాడు. ఆ యయాతి యౌవనవంతుడు అయి.

తెభా-9-560-శా.
డౌ ద్వీపము లేడు వాడలుగ సర్వేలాతలంబెల్లఁ బె
న్వీడై పోఁడిమి నేలుచుం బ్రజల నన్వేషించి రక్షించుచుం
దోడన్ భార్గవి రా మనోజసుఖసంతోషంబులం దేలుచుం
గ్రీడించెన్ నియతేంద్రియుం డగుచు నా క్రీడాతిరేకంబులన్.

టీక:- ఏడు = ఏడు (7); ఔ = ఐనట్టి; ద్వీపముల్ = ద్వీపములు {సప్తద్వీపములు - 1జంబూ 2ప్లక్ష 3శాల్మలీ 4కుశ 5క్రౌంచ 6శాక 7పుష్కర ద్వీపములు}; ఏడు = ఏడు (7); వాడలు = పేటలు; కన్ = అయినట్లు; సర్వ = సమస్తమైన; ఇలాతలంబున్ = భూమండలమును; ఎల్లన్ = అంతటిని; పెన్ = పెద్ద; వీడు = రాజ్యముగా; ఐ = చేసుకొని; పోడిమిన్ = చక్కటి పద్ధతులతో; ఏలుచున్ = పరిపాలించుతు; ప్రజలన్ = ప్రజలను; అన్వేషించి = పరిశీలించి; రక్షించుచున్ = కాపాడుతు; తోడన్ = తోడునీడగా; భార్గవి = దేవయాని; రాన్ = వస్తుండగా; మనోజ = మన్మథ {మనోజుడు - మనసున పుట్టువాడు, మన్మథుడు}; సుఖ = సౌఖ్యములు; సంతోషంబులన్ = ఆనందములలో; తేలుడున్ = తేలియాడుచు; క్రీడించెను = విహరించెను; నియతేంద్రియుండు = ఇంద్రియలోలుడు; అగుచున్ = అగుచు; ఆ = ఆ; క్రీడా = విహరణలలో; అతిరేకంబులన్ = అతిశయములతో.
భావము:- యయాతి సప్తద్వీపాలను ఏడు పేటలు అయినట్లు సమస్త భూమండలాన్ని తన ఏకఛత్రాధిపత్యం కిందకి తెచ్చుకున్నాడు. అంత పెద్ద రాజ్యాన్ని చక్కటి పద్ధతులతో, ప్రజలను తోడునీడగా కాపాడుతు, పరిపాలించసాగాడు. అనేక విహరణలు, మన్మథ సౌఖ్యాలు, ఆనందాలలో దేవయానిని ఓలలాడించాడు.

తెభా-9-561-క.
ర్మంబుల నతిసాధ్వీ
ర్మంబుల దేవయాని న ప్రాణేశున్
ర్మముల మనోవాక్తను
ర్మంబుల నొండులేక డు మెప్పించెన్.

టీక:- మర్మంబులన్ = గుట్టుమట్టులతో; అతి = మిక్కిలి; సాధ్వీ = పతివ్రతా; ధర్మంబులన్ = లక్షణములతో; దేవయానిన్ = దేవయాని; తన = తన యొక్క; ప్రాణేశున్ = భర్తను; నర్మములన్ = మేలములతో; మనస్ = భావముల; వాక్కు = మాటల; తను = శరీరముల; కర్మంబులన్ = పనులలోను; ఒండు = అన్యము, వ్యతికరము; లేక = లేకుండగ; కడున్ = మిక్కిలి; మెప్పించెన్ = సంతోషింపజేసెను.
భావము:- దేవయాని కూడ గుట్టుమట్టులతో పతివ్రతా ధర్మాలతో తన భర్తను ప్రియభాషణలతో, మనోవాక్కాయకర్మాలలో వ్యతిక్రమం లేకుండా భర్తను మెప్పించింది.

తెభా-9-562-శా.
కాశంబున మేఘబృందము ఘనంబై సన్నమై దీర్ఘమై
యేకంబై బహురూపమై యడఁగు నట్లేదేవుగర్భంబులో
లోశ్రేణి జనించుచున్ మెలఁగుచున్ లోపించు నా దేవు సు
శ్రీకాంతున్ హరిఁగూర్చి యాగములు చేసెన్ నాహషుం డిమ్ములన్.

టీక:- ఆకాశంబునన్ = నింగిని; మేఘ = మబ్బుల; బృందమున్ = గుంపు; ఘనంబు = పెద్దవి; ఐ = అయ్యి; సన్నము = చిన్నవిగ; ఐ = అయ్యి; దీర్ఘము = పొడవైనవి; ఐ = అయ్యి; యేకంబు = ఒకటే; ఐ = అయిపోయి; బహు = అనేక; రూపము = స్వరూపములవి; ఐ = అయ్యి; అడగున్ = అణగు; అట్లున్ = ఆవిధముగ; ఏ = ఏ; దేవు = భగవంతుని; గర్భంబు = కడుపు; లోన్ = లోపల; లోక = భువనముల; శ్రేణి = సముదాయములు; జనించుచున్ = పుట్టునో; మెలగుచున్ = ప్రవర్తిల్లునో; లోపించుచున్ = లయమైపోవునో; ఆ = ఆ; దేవు = భగవంతుని; సుశ్రీకాంతున్ = నారాయణుని {సుశ్రీకాంతుడు - సు (శుభకరమైన) శ్రీ (లక్ష్మీదేవి) కాంతున్ (భర్త), విష్ణువు}; హరిన్ = నారాయణుని; గూర్చి = గురించి; యాగముల్ = యజ్ఞములు; చేసెన్ = ఆచరించెను; నాహుషుండు = యయాతి {నాహుషుడు - నహుషుని పుత్రుడు, యయాతి}; ఇమ్ములన్ = ప్రీతితో.
భావము:- ఆకాశంలో మబ్బులు దట్టం అవుతూ, పెద్దవి అవుతూ, చిన్నవి అవుతూ, పొడవైనవి, పొట్టివి అవుతూ రకరకా రూపాలు పొందుతూ అణిగిపోతూ ఉంటాయో, అదే విధంగ భగవంతుని కడుపులో సకల భువనాలు పుట్టుతూ, ప్రవర్తిల్లుతూ, లయవుతూ ఉంటాయి. ఆ శ్రీకాంతుని గురించి యయాతి ప్రీతితో యాగాలు చేసాడు.

తెభా-9-563-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను .
భావము:- అలా గృహస్థాశ్రమంలో గడుపుతూ ఇంకనూ.

తెభా-9-564-ఉ.
చెలికాండ్రం గరులన్ రథమ్ముల భటశ్రేణిం దురంగంబులం
లోఁగన్న ధనావళిన్ సమములంగాఁ జూచుచున్ భార్యతో
లు వేలేండ్లు మనోజభోగలహరీర్యాప్తుఁడై తేలియున్
లుతృష్ణం గడఁగాన కెంతయు మహాబంధంబులన్ స్రుక్కుచున్.

టీక:- చెలికాండ్రన్ = ఆప్తులను; కరులన్ = ఏనుగుల బలగమును; రథమ్ములన్ = రథముల బలగమును; భటశ్రేణిన్ = కాల్బలములను; తురంగంబులన్ = అశ్వ బలములను; కల = స్వప్నము; లోన్ = అందు; కన్న = చూసిన; ధనాళిన్ = సంపదలతో; సమములన్ = సమానమైనవాని; కాన్ = అయినట్లు; చూచుచున్ = చూస్తూ; భార్య = పెండ్లాము; తోన్ = తోటి; పలు = అనేక; వేల = వేలకొలది; ఏండ్లున్ = సంవత్సరములు; మనోజ = మన్మథ; భోగ = సుఖ; లహరీ = తరంగములలో; పర్యాప్తుడు = తృప్తుడు; ఐ = అయ్యి; తేలియున్ = ఓలలాడినను; పలు = మిక్కిలి; తృష్ణన్ = మోహము; కడన్ = తుది; కానక = చూడలేక; ఎంతయున్ = అత్యధికముగ; మహాబంధంబులన్ = లౌకిక బంధములలో; స్రుక్కుచున్ = చిక్కిపోతూ.
భావము:- ఆప్తులు, ఏనుగులు, రథాలు, అశ్వాలు, భటులు సర్వం కలలో కనుపించిన సంపదలు అయినట్లు చూస్తూ, భార్యతో అనేక వేల సంవత్సరాలు మన్మథసౌఖ్యాలలో ఓలలాడసాగాడు. అలా మిక్కిలి తృష్ణతో లౌకిక బంధాలలో సతమతం కాసాగాడు.