Jump to content

పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/పూరుని చరిత్ర

వికీసోర్స్ నుండి

పూరుని చరిత్ర

తెభా-9-592-క.
"భాత! నీవు జనించిన
పూరుని వంశంబునందుఁ బుట్టినవారిం
జారు యశోలంకారుల
ధీరుల వినిపింతు నధిక తేజోధనులన్.

టీక:- భారత = పరీక్షిన్మహారాజా {భారత - భరతవంశమున పుట్టినవాడ, పరీక్షిత్తు}; నీవున్ = నీవు; జనించిన = పుట్టినట్టి; పూరుని = పూరుని యొక్క; వంశంబున్ = వంశము; అందున్ = లో; పుట్టిన = జన్మించినట్టి; వారిన్ = వారిని; చారు = చక్కటి; యశస్ = కీర్తి అనెడి; అలంకారులన్ = అలంకారములు కలవారిని; ధీరులన్ = ధీరస్వభావుల; వినిపింతున్ = చెప్పెదను; అధిక = మిక్కిలి; తేజస్ = తేజస్సు అనెడి; ధనులన్ = సంపద కలవారిని.
భావము:- "ఓ భరత వంశపు పరీక్షిన్మహారాజా! ఇంక నీవు పుట్టిన పూరుని వంశములోని కీర్తిమంతులను, ధీరస్వభావులను, తేజోసంపన్నులను గురించి చెప్తాను.

తెభా-9-593-వ.
పూరునకు జనమేజయుండు, జనమేజయునకుఁ బ్రాచీన్వాంసుండు, నా ప్రాచీన్వాంసునకుఁ బ్రవిరోధనమన్యువు, నతనికిఁ జారువుఁ బుట్టి; రా చారువునకు సుద్యువు, సుద్యువునకు బహుగతుండును, బహుగతునకు శర్యాతియు, శర్యాతికి సంయాతియు, సంయాతికి రౌద్రాశ్వుండును, రౌద్రాశ్వునకు ఘృతాచి యను నచ్చరలేమ యందు ఋతేపువుఁ, గక్షేపువు, స్థలేపువుఁ, గృతేపువు, జలేపువు, సన్నతేపువు, సత్యేపువు, ధర్మేపువు, వ్రతేపువు, వనేపువు నను వారు జగదాత్మభూతుండైన ప్రాణునకు నింద్రియంబుల చందంబునఁ బదుగురు గొడుకులు జన్మించి; రందు ఋతేపువునకు నంతిసారుండును, నంతిసారునకు సుమతియు, ధ్రువుండు, నప్రతిరథుండునన మువ్వురు పుట్టి; రందు నప్రతిరథునికిఁ గణ్వుండును, గణ్వునికి మేధాతిథియు, నతనికి బ్రస్కందుండు మొదలగు బ్రాహ్మణులును జన్మించి; రా సుమతికి రైభ్యుండు పుట్టె; రైభ్యునకు దుష్యంతుడు పుట్టె.
టీక:- పూరున్ = పూరుని; కున్ = కి; జనమేజయుండు = జనమేజయుడు; జనమేజయున్ = జనమేజయున; కున్ = కి; ప్రాచీన్వాంసుండున్ = ప్రాచీన్వాంసుడు; ఆ = ఆ; ప్రాచీన్వాంసున్ = ప్రాచీన్వాంసున; కున్ = కు; ప్రవిరోధనమన్యువున్ = ప్రవిరోధనమన్యువు; అతని = అతని; కిన్ = కి; చారువున్ = చారువు; పుట్టిరి = జన్మించిరి; ఆ = ఆ; చారువున్ = చారువున; కున్ = కు; సుద్యువున్ = సుద్యువు; సుద్యువున = సుద్యువున; కున్ = కు; బహుగతుండునున్ = బహుగతుడు; బహుగతున్ = బహుదతున; కున్ = కు; శర్యాతియున్ = శర్యాతి; శర్యాతి = శర్యాతి; కిన్ = కి; సంయాతియున్ = సంయాతి; సంయాతి = సంయాతి; కిన్ = కి; రౌద్రాశ్వుండును = రౌద్రాశ్వుడు; రౌద్రాశ్వున్ = రౌద్రాశ్వున; కున్ = కు; ఘృతాచి = ఘృతాచి; అను = అనెడి; అచ్చర = అప్సరస; లేమ = స్త్రీ; అందున్ = తో; ఋతేపువున్ = ఋతేపువు; కక్షేపువున్ = కక్షేపువు; స్థలేపువున్ = స్థలేపువు; కృతేపువున్ = కృతేపువు; జలేపువున్ = జలేపువు; సన్నతేపువున్ = సన్నతేపువు; సత్యేపువున్ = సత్యేపువు; ధర్మేపువున్ = ధర్మేపువు; వ్రతేపువున్ = వ్రతేపువు; వనేపువున్ = వనేపువు; అను = అనెడి; వారు = వారు; జగత్ = విశ్వమే; ఆత్మభూతుండు = తానైనవాడు; ఐన = అయినట్టి; ప్రాణున్ = జీవుని; కున్ = కి; ఇంద్రియంబులన్ = ఇంద్రియముల; చందంబునన్ = వలె; పదుగురు = పదిమంది (10); కొడుకులు = పుత్రులు; జన్మించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; ఋతేపువున్ = ఋతేపువున; కున్ = కు; అంతిసారుండునున్ = అంతిసారుడు; అంతిసారున్ = అంతిసారున; కున్ = కు; సుమతియున్ = సుమతి; ధ్రువుండున్ = ధ్రువుడు; అప్రతిరథుండున్ = అప్రతిరథుడు; అనన్ = అనగా; మువ్వురు = ముగ్గురు; పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో; అప్రతిరథుని = అప్రతిరథుని; కిన్ = కి; కణ్వుడున్ = కణ్వుడు; కణ్వుని = కణ్వుని; కిన్ = కి; మేధాతిథియున్ = మేధాతిథి; అతని = అతని; కిన్ = కి; ప్రస్కందుండున్ = ప్రస్కందుడు; మొదలగు = మున్నగు; బ్రాహ్మణులును = బ్రాహ్మణులు; జన్మించిరి = పుట్టిరి; ఆ = ఆ; సుమతి = సుమతి; కిన్ = కి; రైభ్యుండున్ = రైభ్యుడును; పుట్టెన్ = కలిగెను; రైభ్యున్ = రైభ్యుని; కున్ = కి; దుష్యంతుడున్ = దుష్యంతుడు; పుట్టె = కలిగెను.
భావము:- పూరునికి జనమేజయుడు, జనమేజయునకి, ప్రాచీన్వాంసుడు, ఆ ప్రాచీన్వాంసునకు ప్రవిరోధనమన్యువు, అతనికి చారువు జన్మించారు. ఆ చారువునకు సుద్యువు, సుద్యువునకు బహుగతుడు, బహుగతునకు శర్యాతి, శర్యాతికి సంయాతి, సంయాతికి రౌద్రాశ్వుడు, రౌద్రాశ్వునకు అప్సరస ఘృతాచి అందు జీవునికి దశేంద్రియాల వలె; ఋతేపువు, కక్షేపువు, స్థలేపువు, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, సత్యేపువు, ధర్మేపువు, వ్రతేపువు, వనేపువు అని పదిమంది పుత్రులు పుట్టారు. వారిలో ఋతేపువునకు అంతిసారుడు, అంతిసారునకు సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అని ముగ్గురు జన్మించారు. వారిలో అప్రతిరథునికి కణ్వుడు, అతనికి మేధాతిథి, అతనికి ప్రస్కందుడు మున్నగు బ్రాహ్మణులు పుట్టారు. ఆ సుమతికి రైభ్యుడు, రైభ్యునికి దుష్యంతుడు పుట్టారు.