Jump to content

పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/నాభాగుని చరిత్ర

వికీసోర్స్ నుండి

నాభాగుని చరిత్ర

తెభా-9-75-క.
గుఁడను మనుజపతికిని
శుమతి నాభాగుఁ డనఁగ సుతుఁ డుదయించెం;
బ్రభులై కవి యను తలఁపున
విజించిరి భ్రాత లతని విత్తము, నధిపా!

టీక:- నభగుడు = నభగుడు; అను = అనెడి; మనుజపతి = రాజు {మనుజపతి - మనుజుల (మానవుల)కు పతి (ప్రభువు), రాజు}; కిని = కి; శుభమతి = మంచిమనసుగలవాడు; నాభాగుడు = నాభాగుడు; అనగన్ = అనిపేరుగల; సుతుడు = పుత్రుడు; ఉదయించెన్ = పుట్టెను; ప్రభులు = బలిష్ఠులు; ఐ = అయ్యి; కవి = పర్వినవాడు; అను = అనెడి; తలపునన్ = భావముతో; విభజించిరి = పంచుకొనిరి; భ్రాతలు = సోదరులు; అతని = అతనివంతు; విత్తమున్ = ధనమును; అధిపా = గొప్పవాడా.
భావము:- మహానుభావ! మంచి మనసు గల నభగుడుకి నాభాగుడు అని కొడుకు పుట్టాడు. అతను చాలాకాలం గురుకులంలో ఉండిపోయాడు. సోదరులు బలిష్ఠులు అయ్యి, అతని వంతు ఆస్తిని కూడ వారే పంచేసుకొన్నారు.

తెభా-9-76-వ.
అంత నాభాగుండును బ్రహ్మచారియై, తన తోడంబుట్టువులను ధనంబుల పాలడిగిన, వారలు “దండ్రి చెప్పిన క్రమంబున నిచ్చెద” మనిన నాభాగుండు తండ్రి యగు నభగు కడకుం జని, “విభాగంబు చేయు” మని పలికిన, నతం “డిందు నంగిరసులు మేధ గలవారయ్యును, సత్త్ర యాగంబు చేయుచు, నాఱవ దినంబున నర్హకర్మంబులు దోఁపక, మూఢులయ్యెదరు; వారలకు నీవు వైశ్వదేవసూక్తంబులు రెండెఱింగించినఁ, గవి యనం బ్రసిద్ధి కెక్కెదవు; దానంజేసి వారు కృతకృత్యు లై స్వర్గంబునకు బోవుచు, సత్త్రపరిశేషితంబైన ధనంబు నీకిచ్చెద” రని పలికినం దండ్రి వీడ్కొని నాభాగుండు చని, యట్ల చేసిన, నంగిరసులు సత్త్ర పరిశేషితధనంబు లతని కిచ్చి, నాకంబునకుం జని; రంత.
టీక:- అంతన్ = అంతట; నాభాగుండునున్ = నాభాగుడు; బ్రహ్మచారి = బ్రహ్మచారి; ఐ = గావచ్చి; తన = తనయొక్క; తోడంబుట్టువులన్ = సోదరులను; ధనంబున్ = సంపదలో; పాలు = భాగము పంచిమ్మని; అడిగినన్ = అడుగగా; వారలు = వారు; తండ్రి = నాన్నగారు; చెప్పిన = చెప్పితే; క్రమంబునన్ = ఆవిధముగ; ఇచ్చెదము = ఇస్తాము; అనినన్ = అనగా; నాభాగుండు = నాభాగుడు; తండ్రి = తండ్రి; అగు = ఐన; నభగుడు = నభగు; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; విభాగంబున్ = పంపకాలు; చేయుము = చేయుము; అని = అని; పలికినన్ = చెప్పగా; అతండు = అతడు; ఇందున్ = ఇప్పుడు; అంగిరసులు = అంగిరసులు {అంగిరసులు - అంగిరసగోత్రపువారు}; మేధ = మిక్కిలి జ్ఞానము; కలవారు = ఉన్నవారు; అయ్యున్ = అయినను; సత్రయాగంబున్ = సత్రయాగమును {సత్రయాగము - 13 మొదలు 100 దినముల వరకు చేసెడి యజ్ఞబేధము}; చేయుచున్ = చేస్తూ; ఆఱవది = ఆరో(6); దినంబునన్ = రోజున; అర్హ = తగినట్టి; కర్మంబులు = కర్మకాండ; తోపక = తట్టక; మూఢులు = తెలియనివారు; అయ్యెదరు = అవుతారు; వారల = వారి; కున్ = కి; నీవు = నీవు; వైశ్వేదేవ = విశ్వదేవమునకు చెందిన {విశ్వేదేవము - విశ్వదేవతల గురించి చేసెడి హోమాధికము}; సూక్తంబులున్ = మంత్రములను; రెండు = రెండు (2); ఎఱింగించినన్ = తెలుపగా; కవి = పండితుడు, బ్రహ్మజ్ఞాని; అనన్ = అనబడి; ప్రసిద్ధి = ఖ్యాతి; కిన్ = కి; ఎక్కెదవు = చెందెదవు; దానంజేసి = అందువలన; వారు = వారు; కృతకృత్యులు = కృతార్థులు; ఐ = అయ్యి; స్వర్గంబున్ = స్వర్గమున; కున్ = కు; పోవుచు = వెళ్తూ; సత్ర = సత్రయాగమున; పరిశేషితంబు = మిగిలినది; ఐనన్ = అయిన; ధనంబున్ = సంపదలను; నీవు = నీవు; కున్ = కి; ఇచ్చెదరు = ఇస్తారు; అని = అని; పలికినన్ = చెప్పగా; తండ్రిన్ = తండ్రిని; వీడ్కొని = సెలవుతీసుకొని; నాభాగుండు = నాభాగుడు; చని = వెళ్ళి; అట్లా = ఆ విధము; చేసినన్ = చేయగా; అంగిరసులున్ = అంగిరసులు; సత్ర = యజ్ఞమున; పరిశేషిత = మిగిలిన; ధనంబుల్ = సంపదలను; అతన్ = అతని; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చెసి; నాకంబున్ = స్వర్గమున; కున్ = కు; చనిరి = వెళ్ళిపోయిరి; అంత = అప్పుడు.
భావము:- అటుపిమ్మట, నాభాగుడు బ్రహ్మచారిగా వచ్చి తన సోదరులను సంపదలో భాగం పంచిమ్మని అడిగాడు. వారు “నాన్నగారు ఎలా చెప్పితే అలా ఇస్తాం” అన్నారు. నాభాగుడు తండ్రి నభగుని వద్దకు వెళ్ళి పంపకాలు చేయమని అడిగాడు. అతడు “ఇప్పుడు అంగిరసులు సత్రయాగం చేస్తూ ఆరో(6) దినం తగిన కర్మకాండ తట్టకుండా ఉంటారు. వారికి నీవు విశ్వదేవ మంత్రాలను రెండు (2) తెలుపగా పండితుడు, బ్రహ్మజ్ఞాని అని ఖ్యాతి చెందుతావు. అందువలన వారు కృతార్థులు అయ్యి స్వర్గానికి వెళ్తూ, సత్రయాగంలో మిగిలిన ధనం నీకు ఇస్తారు.” అని చెప్పాడు.

తెభా-9-77-క.
అంగిరసు లిచ్చు పసిఁడికి
మంళమతిఁ జేరు నృపుని మానిచి, యొకఁ డు
త్తుంగుఁడు, గృష్ణాంగుఁడు దగ,
ముంల నిలుచుండి విత్తముం జేకొనియెన్.

టీక:- అంగిరసులు = అంగిరసులు; ఇచ్చు = ఇచ్చెడి; పసిడి = బంగారమున; కిన్ = కు; మంగళమతిన్ = పవిత్రమైనబుద్ధితో; చేరు = దగ్గరకెళ్ళుతున్న; నృపునిన్ = క్షత్రియుని; మానిచి = అడ్డగించి; ఒకడు = ఒకతను; ఉత్తుంగుడు = మంచిపొడగరి; కృష్ణాంగుడు = నల్లనివాడు; తగన్ = తగవుగా; ముంగల = ఎదురుగ; నిలుచుండి = ఆగి; విత్తమున్ = ధనమును; చేకొనియెన్ = లాగికొనెను.
భావము:- అంగిరసులు ఇచ్చిన బంగారం కోసం వెళ్తున్న నాభాగ క్షత్రియుని, ఒక మంచి పొడగరి, నల్లనివాడు తగవుగా వచ్చి అడ్డగించి, ఆ ధనం లాగికొన్నాడు.

తెభా-9-78-వ.
వానింజూచి, నాభాగుండు దనకు మును లిచ్చుటం జేసి తన ధనం బని పలికిన, నమ్మహాపురుషుండు “మీ తండ్రి చెప్పిన క్రమంబ కర్తవ్యం” బనిన నాభాగుండు నభగు నడిగిన, నతండు “యజ్ఞమందిర గతం బయిన యుచ్ఛిష్టం బగు ధనంబు దొల్లి మహామునులు రుద్రున కిచ్చి; రది కారణంబుగా నా దేవుండు సర్వధనంబునకు నర్హుం” డనిన విని, వచ్చి, నాభాగుండు మహాదేవునకు నమస్కరించి, “దేవా! యీ ధనంబు నీ యధీనం బని మా తండ్రి చెప్పె; నే నపరాధంబు చేసితి; సహింపు;” మనవుడు భక్తవత్సలుండగు నమ్మహాపురుషుండు నభగు సత్యవచనంబునకు, నాభాగుని నిజంబునకు మెచ్చి, “నీవు దప్పక పలికితివి కావున, సత్త్రపరిశేషితం బగు ధనంబు నీకు నిచ్చితి” నని పలికి యంతర్దర్శిత్వంబును సనాతనం బగు బ్రహ్మజ్ఞానంబు నునుపదేశించి, తిరోహితుండయ్యె; ఇవ్విధంబున.
టీక:- వానిన్ = అతనిని; చూచి = ఉద్దేశించి; నాభాగుండు = నాభాగుడు; తన = తన; కున్ = కు; మునులు = ఋషులు; ఇచ్చుటన్ = ఇచ్చుట; చేసి = వలన; తన = తనయొక్క; ధనంబు = సంపద; అని = అని; పలికినన్ = చెప్పగా; ఆ = ఆ; మహాపురుషుండు = గొప్పవాడు; మీ = మీయొక్క; తండ్రి = నాన్నగారు; చెప్పిని = చెప్పిని; క్రమంబ = విధమే; కర్తవ్యంబున్ = చేయదగినది; అనినన్ = అనగా; నాభాగుండు = నాభాగుడు; నభగున్ = నభగుని; అడిగినన్ = అడుగగా; అతండు = అతను; యజ్ఞమందిర = యాగశాల; గతంబు = పూర్వమున్నది; అయిన = అయ్యి; ఉచ్ఛిష్టంబు = మిగిలినది; అగు = అయినట్టి; ధనంబున్ = సంపద; తొల్లి = ఇంతకుముందు; మహా = గొప్ప; మునులు = ఋషులు; రుద్రున్ = పరమశివుని {రుద్రుడు - రౌద్రముగలవాడు, శివుడు}; కిన్ = కి; ఇచ్చిరి = ఇచ్చిరి; అది = ఆ; కారణంబుగాన్ = కారణముచేత; ఆ = ఆ; దేవుండు = భగవంతుడు; సర్వ = సమస్తమైన; ధనంబున్ = సంపద; కున్ = కి; అర్హుండు = అర్హతగలవాడు; అనినన్ = అనగా; విని = విని; వచ్చి = వెనుకకువచ్చి; నాభాగుండు = నాభాగుడు; మహాదేవున్ = పరమశివుని; కున్ = కి; నమస్కరించి = మొక్కి; దేవా = ప్రభువా; ఈ = ఈ; ధనంబు = సంపద; నీ = నీకు; అధీనంబు = చెందును; అని = అని; మా = మాయొక్క; తండ్రి = నాన్నగారు; చెప్పెన్ = తెలిపెను; నేన్ = నేను; అపరాధంబున్ = పొరపాటు; చేసితిన్ = చేసేను; సహింపుము = క్షమింపుము; అనవుడు = అనగా; భక్త = భక్తులఎడ; వత్సలుండు = వాత్సల్యముగలవాడు; అగు = ఐన; ఆ = ఆ; మహాపురుషుండు = గొప్పవాడు; నభగున్ = నభగునియొక్క; సత్యవచనంబు = సరియగు తీర్పున; కున్ = కు; నాభాగుని = నాభాగుని; నిజంబున్ = సత్యసంధత; కున్ = కు; మెచ్చి = మెచ్చుకొని; నీవున్ = నీవు; తప్పక = అబద్దమాడక; పలికితివి = చెప్పితివి; కావునన్ = కనుక; సత్ర = సత్రయాగపు; పరిశేషితంబు = మిగిలినది; అగు = ఐన; ధనంబున్ = సంపదలను; నీ = నీ; కున్ = కు; ఇచ్చితిన్ = ఇచ్చివేసితిని; అని = అని; పలికి = చెప్పి; అంతర్దర్శిత్వంబును = ఆత్మదర్శనము; సనాతనంబు = మిక్కిలి పురాతనము; అగు = అయినట్టి; బ్రహ్మజ్ఞానంబునున్ = బ్రహ్మజ్ఞానమును; ఉపదేశించి = ఉపదేశించి {ఉపదేశించు - సమంత్రముగా సాంగికముగ విధివిధానములతో నేర్పుట}; తిరోహితుండు = మాయమైనవాడు; అయ్యె = అయ్యెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
భావము:- నాభాగుడు అతనితో తనకు ఋషులు ఈ సంపద ఇచ్చారు కనుక తనది అని చెప్పగా, ఆ మహాత్ముడు “మీ నాన్నగారు చెప్పినట్లు చేయదగినది.” అన్నాడు. నాభాగుడు నభగుని అడుగగా అతను “యాగం పూర్తి అయ్యాక మిగిలిన సంపదను, ఇంతకు ముందు మహా ఋషులు పరమశివునికి ఇచ్చారు. అందుచేత ఆయన ఆ సంపద సమస్తానికి అర్హుడు.” అనగా విని వెనుకకువచ్చి నాభాగుడు పరమశివునికి మొక్కి, “ప్రభువా! ఈ సంపద నీకు చెందును అని మా నాన్నగారు తెలిపారు. నేను పొరపాటు చేసేను. సహింపుము.” అన్నాడు. అతని సచ్చీలతకు మెచ్చి శంకరుడు ఆ ధనాన్ని అంతా నభాగునికే ఇచ్చి తీసుకు పొమ్మని. తాను అంతర్ధానం అయ్యాడు.

తెభా-9-79-క.
భువిలో నాభాగునికథ
విలి మతిన్ రేపు మాపుఁ లఁచినమాత్రం
వి యగు; మంత్రజ్ఞుం డగుఁ;
బ్రవిమలగతిఁ బొందు నరుఁడు ద్రాత్మకుఁడై.

టీక:- భువి = భూలోకము; లోన్ = అందు; నాభాగుని = నాభాగుని యొక్క; కథన్ = వృత్తాంతమును; తవిలి = పూని, శ్రద్దపూని; మదిన్ = మనసునందు; రేపుమాపున్ = ప్రతిదినము; తలచిన = మననముచేసిన; మాత్రన్ = అంతమాత్రముచేతనే; కవి = పండితుడు; అగున్ = ఐపోవును; మంత్రజ్ఞుండు = మంత్రసిద్ధిపొందినవాడు; అగున్ = అగును; ప్రవిమల = మిక్కిలి స్వచ్ఛమైన; గతిన్ = ముక్తిని; పొందున్ = పొందును; నరుడు = మానవుడు; భద్రాత్మకుండు = శుభములుగలవాడు; అయ్యి = అయ్యి.
భావము:- భూలోకములో నాభాగుని వృత్తాంతం శ్రద్దగా ప్రతిదినము మననము చేసిన వాడు పండితుడు అగును. మంత్రసిద్ధి పొందును. ముక్తిని పొందును. శుభములు కలుగును.