Jump to content

పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

తెభా-9-1-క.
శ్రీరాజిత! మునిపూజిత!
వారిధి గర్వాతిరేక వారణ బాణా!
సూరిత్రాణ! మహోజ్జ్వల
సాయశస్సాంద్ర! రామచంద్ర నరేంద్రా!
టీక:- శ్రీరాజిత = రామా {శ్రీరాజితుడు - శ్రీ (లక్ష్మీదేవి)చేత రాజితుడు (ప్రకాశించెడి వాడు), రాముడు}; మునిపూజిత = రామా {ముని పూజితుడు - మునులచే పూజింపబడువాడు, రాముడు}; వారిధి గర్వాతిరేక వారణ బాణా = రామా {వారిధి గర్వాతిరేక వారణ బాణుడు - వారిధి (సముద్రుని) గర్వాతిరేక(గర్వాతిశయమును) వారణ (వారించిన) బాణుడు (బాణముగలవాడు), రాముడు}; సూరిత్రాణ = రామా {సూరిత్రాణుడు - సూరి (పండితులను) త్రాణుడు (కాపాడెడివాడు), రాముడు}; మహోజ్జ్వలసారయశస్సాంద్ర = రామా {మహోజ్జ్వలసారయశస్సాంద్రుడు - మహా (గొప్ప) ఉజ్జ్వల (ప్రకాశవంతమైన) సార (చేవగలిగిన) యశస్ (కీర్తి) సాంద్రుడు (దట్టముగాగలవాడు), రాముడు}; రామచంద్రనరేంద్రా = రామా {రామచంద్రనరేంద్రుడు - రాముడనెడి చంద్రునివంటివాడైన నరేంద్రుడు (రాజు), రాముడు}.
భావము:- లక్ష్మిగలిగి ప్రకాశించే వాడా! మునులు పూజించు వాడా! సముద్రుడి గర్వం సర్వం పోగొట్టిన బాణం గల వాడా! పండితులను కాపాడే వాడా! బహు ప్రకాశవంతమైన గొప్పకీర్తి గల వాడా! శ్రీరామచంద్ర ప్రభూ! అవధరించు.

తెభా-9-2-వ.
మహనీయ గుణగరిష్ఠులగు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిలపురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుం డయిన పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం గనుంగొని .
టీక:- మహనీయ = గొప్ప; గుణ = సుగుణములుతో; గరిష్ఠులు = శ్రేష్ఠులు; అగు = అయిన; ఆ = ఆ; ముని = మునులలో; శ్రేష్ఠులు = ఉత్తముల; కున్ = కు; నిఖిల = సమస్తమైన; పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = వివరముగా చెప్పెడి; వైఖరీ = విధానము; సమేతుండు = కలిగనవాడు; ఐన = అయిన; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; అట్లు = ఆ విధముగ; ప్రాయోపవిష్ఠుండు = ప్రాయోపవేశదీక్షగలవాడు {ప్రాయోపవేశము - ఆహారాదులను విడచి మరణమునకై వేచియుండుట}; అయిన = ఐనట్టి; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = రాజు {నరేంద్రుడు - నరులకు ప్రభువు, రాజు}; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = గొప్పవానిని; కనుంగొని = చూసి.
భావము:- గొప్ప గుణములు కలిగిన ఆ మునీశ్వరులతో అఖిల పురాణాలను వివరించటంలో నేర్పరి అయిన సూతమహర్షి ఇలా అన్నాడు. "ప్రాయోపవేశం చేసి ఉన్న పరీక్షిత్తు మహారాజు శుకమహర్షిని చూసి.