పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/పూర్ణి

వికీసోర్స్ నుండి

పూర్ణి

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-743-క.
రాజేంద్ర! దైత్యదానవ
రామహాగహన దహన! రాజస్తుత్యా!
రాజావతంస! మానిత
రాధరార్చిత! గుణాఢ్య! రాఘవరామా!

టీక:- రాజేంద్ర = మహారాజా {రాజేంద్రుడు – రాజులలో ఇంద్రుని వంటివాడు, శ్రీరాముడు}; దైత్యదానవరాజమహాగహనదహన = శ్రీరామా {దైత్య దానవ రాజ మహాగహన దహనుడు – దైత్యల యొక్క, దానవుల యొక్క రాజులు అనే గొప్ప అడవిని దహించినవాడు, శ్రీరాముడు}; రాజస్తుత్య = శ్రీరామా {రాజ స్తుత్యుడు - రాజులచేత స్తుతింపబడువాడు, శ్రీరాముడు}; రాజావతంస = శ్రీరామా {రాజా వతంసుడు - రాజులందరిలోను తలమానికమైనవాడు, శ్రీరాముడు}; మానిత = మన్నింపదగినవాడైన; రాజధరార్చిత = శ్రీరామా {రాజధ రార్చితుడు - రాజధరుని (చంద్రధరుడైన శివుని)చే అర్చితుడు, శ్రీరాముడు}; గుణాఢ్య = శ్రీరామా {గుణాఢ్యుడు - సుగుణసంపన్నుడు, శ్రీరాముడు}; రాఘవరామ = శ్రీరామా {రాఘవ రాముడు - రఘువంశలలాముడు, శ్రీరాముడు}.
భావము:- రాజులలో ఇంద్రుని వంటి వాడా! రాక్షస రాజులనే గొప్ప అడవిని కాల్చినవాడా! రాజులచేత స్తుతింప బడినవాడా! రాజులలో తలమానికం అయినవాడా! మహానుభావుడైన శివునిచేత పూజింపబడినవాడా! గుణసంపన్నుడా! రఘవంశలలామా!

తెభా-8-744-మాలి.
దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!
భునభరనివారీ! పుణ్యరక్షానుసారీ!
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషప్రవర్తీ!
ళబహుళకీర్తీ! ర్మనిత్యానువర్తీ!

టీక:- దివిజరిపువిదారీ = శ్రీరామా {దివిజరిపు విదారుడు - దివిజరిపు (రాక్షసు)లను విదారుడు (సంహరించినవాడు), శ్రీరాముడు}; దేవలోకోపకారీ = శ్రీరామా {దేవలో కోపకారుడు - దేవలోక (దేవత లందరికి) ఉపకారుడు (ఉపకారము చేయువాడు), శ్రీరాముడు}; భువనభరనివారీ = శ్రీరామా {భువనభర నివారుడు - భూభారమును నివారించెడివాడు, శ్రీరాముడు}; పుణ్యరక్షానుసారీ = శ్రీరామా {పుణ్య రక్షానుసారుడు - పుణ్యాత్ములను కాపాడెడివాడు, శ్రీరాముడు}; ప్రవిమలశుభమూర్తీ = శ్రీరామా {ప్రవిమల శుభమూర్తి - మిక్కిలి నిర్మలమైన శుభకరమైన రూపము కలవాడు, శ్రీరాముడు}; బంధుపోషప్రవర్తీ = శ్రీరామా {బంధు పోష ప్రవర్తి - ఆత్మీయులను పోషించెడి వాడు, శ్రీరాముడు}; ధవళబహుళకీర్తీ = శ్రీరామా {ధవళ బహుళకీర్తి - స్వచ్ఛమైన గొప్ప కీర్తి కలవాడు, శ్రీరాముడు}; ధర్మనిత్యానువర్తీ = శ్రీరామా {ధర్మ నిత్యానువర్తి - ధర్మమును ఎల్లప్పుడు ఆచరించు వాడు, శ్రీరాముడు}.
భావము:- దేవతల శత్రువులు అయిన రాక్షసులను తెగటార్చినవాడా! దేవతలకు మేలుచేసినవాడా! భూభారమును నివారించినవాడా! పుణ్యాత్ములను రక్షించేవాడా! నిర్మలమైన శుభకరమైన రూపంకలవాడా! ఆత్మీయులను పోషించేవాడా! స్వచ్ఛమైన గొప్పకీర్తి కలవాడా! ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆదరించేవాడా! శ్రీరామా!

తెభా-8-745-గ.
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబయిన శ్రీమహాభాగవత పురాణం బను మహాప్రబంధంబు నందు స్వాయంభువ స్వారోచిషోత్తమ తామస మనువుల చరిత్రంబును, గరిమకరంబుల యుద్ధంబును, గజేంద్ర రక్షణంబును, రైవత చాక్షుష మనువుల వర్తనంబును, సముద్ర మథనంబును, కూర్మావతారంబును, గరళ భక్షణంబును, అమృతాది సంభవంబును, దేవాసుర కలహంబును, హరి కపటకామినీ రూపంబున నసురుల వంచించి దేవతల కమృతంబు పోయుటయు, రాక్షస వధంబును, హరిహర సల్లాపంబును, హరి కపటకామినీరూప విభ్రమణంబును, వైవశ్వత సూర్యసావర్ణి దక్షసావర్ణి బ్రహ్మసావర్ణి భద్రసావర్ణి దేవసావర్ణీంద్రసావర్ణి మనువుల వృత్తాంతంబులును, బలి యుద్ధయాత్రయును, స్వర్గవర్ణనంబును, దేవ పలాయనంబును, వామనావతారంబును, శుక్ర బలి సంవాదంబునుఁ, ద్రివిక్రమ విస్ఫురణంబును, రాక్షసుల సుతల గమనంబును, సత్యవ్రతోపాఖ్యానంబును, మీనావతారంబును నను కథలుఁ గల యష్టమ స్కంధము .
టీక:- ఇది = ఇది; శ్రీ = శుభకరుడైన; పరమేశ్వర = పరమశివుని; కరుణా = దయవలన; కలిత = జన్మించిన; కవితా = కవిత్వము చెప్పుటలో; విచిత్ర = అద్భుతమైనవాడూ; కేసనమంత్రి = కేసనమంత్రి యొక్క; పుత్ర = కుమారుడు; సహజ = సహజసిద్ధముగా; పాండిత్య = పాండిత్యము కలవాడు; పోతన = పోతన యనెడి; అమాత్య = ప్రెగ్గడచేత; ప్రణీతంబు = సంస్కరింపబడినది; అయిన = ఐన; శ్రీ = శుభకరమైన; మహాభాగవతంబు = మహాభాగవతము; అను = అనెడి; మహా = గొప్ప; ప్రబంధంబున్ = గ్రంథము; అందున్ = లోని; స్వాయంభువ = స్వాయంభువుడు; స్వారోచిష = స్వారోచిషుడు; ఉత్తమ = ఉత్తముడు; తామస = తామసుడు యనెడి; మనువుల = మనువుల యొక్క; చరిత్రంబును = కథలు; కరి = గజేంద్రుడు; మకరంబుల = మొసలి; యుద్ధంబును = పోరు; గజేంద్రరక్షణంబును = గజేంద్రమోక్షము; రైవత = రైవతుడు; చాక్షుస = చాక్షుసుడు యనెడి; మనువుల = మనువుల యొక్క; వర్తనంబును = కథలు; సముద్రమథనంబును = సముద్రమథించుట; కూర్మావతారంబును = కూర్మావతారము ఎత్తుట; గరళ = కాలకూటవిషమును; భక్షణంబును = భక్షించుట; అమృత = అమృతము; ఆది = మున్నగనవి; సంభవంబును = పుట్టుట; దేవ = దేవతల; అసుర = రాక్షసుల; కలహంబును = యుద్ధము; హరి = విష్ణువు; కపటకామినీ = జగన్మోహినీ; రూపంబునన్ = అవతారముతో; అసురులన్ = రాక్షసులను; వంచించి = మోసగించి; దేవతల్ = దేవతల; కున్ = కు; అమృతంబున్ = అమృతమును; పోయుటయున్ = తాగించుట; రాక్షస = రాక్షసులను; వధంబునున్ = వధించుట; హరి = విష్ణుమూర్తి; హర = పరమశివుల; సల్లాపంబునున్ = ప్రణయము; హరి = విష్ణుని; కపట = మాయా; కామినీ = మోహిని; రూప = రూపముతో; విభ్రమణంబును = మిక్కిలి భ్రమింపజేయుట; వైవశ్వత = వైవశ్వతుడు; సూర్యసావర్ణి = సూర్యసావర్ణి; దక్షసావర్ణి = దక్షసావర్ణి; బ్రహ్మసావర్ణి = బ్రహ్మసావర్ణి; భద్రసావర్ణి = భద్రసావర్ణి; దేవసావర్ణి = దేవసావర్ణి; ఇంద్రసావర్ణి = ఇంద్రసావర్ణి యనెడి; మనువుల = మనువుల యొక్క; వృత్తాంతంబులును = వివరములు; బలి = బలిచక్రవర్తి యొక్క; యుద్ధయాత్రయును = దండయాత్ర; స్వర్గవర్ణనంబును = స్వర్గము యొక్క వర్ణన; దేవ = దేవతలు; పలాయనంబును = పారిపోవుట; వామన = వామనుడు; అవతారంబును = అవతరించుట; శుక్ర = శుక్రుని; బలి = బలిచక్రవర్తుల; సంవాదంబునున్ = సంభాషణము; త్రివిక్రమ = త్రివిక్రమరూప; విస్ఫురణంబును = విస్తరిల్లుట; రాక్షసుల = రాక్షసుల; సుతల = సుతలమునకు; గమనంబును = ప్రయాణము; సత్యవ్రత = సత్యవ్రతుని; ఉపాఖ్యానంబును = కథ; మీనావతారంబునున్ = మత్స్యావతారము కథ; అను = అనెడి; కథలు = కథలు; కల = కలిగిన; అష్టమ = ఎనిమిదవ; స్కంధము = స్కంధము.
భావము:- ఇది పరమశివుని దయవల్ల కలిగిన కవితాసౌందర్యం కలవాడూ కేశనమంత్రి పుత్రుడూ సహజపాండిత్యుడూ అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీమహాభాగవత పురాణం అనే మహాకావ్యంలోని అష్టమస్కంధం. దీనిలో స్వాయంభువుడూ, స్వారోచిషుడూ, ఉత్తముడూ, తామసుడూ అనే మనువుల చరిత్రమూ; ఏనుగుకూ మొసలికీ జరిగిన పోరాటమూ; శ్రీహరి గజేంద్రుణ్ణి కాపాడడం; రైవతుడూ, చాక్షుషుడూ అనే మనువుల చరిత్రమూ; దేవదానవులు సముద్రాన్ని మధించడం; పరమేశ్వరుడు విషాన్ని మ్రింగడం; పాలసముద్రంలో అమృతం మొదలైనవి పుట్టడం; దేవతలకూ రాక్షసులకూ పోరాటం జరగడం; విష్ణువు మోహిని రూపంతో రాక్షసులను మోసగించి దేవతలకు అమృతాన్ని పోయడమూ; రాక్షససంహారమూ; శివకేశవుల సరస సంభాషణం; విష్ణువు మోహిని రూపంతో శివుణ్ణి భ్రమింపచేయడం; వైవస్వతుడూ, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, భద్రసావర్ణి, దేవసావర్ణి, ఇంద్రసావర్ణి అనే మనువుల వృత్తాంతమూ; బలిచక్రవర్తి యుద్ధానికి వెళ్ళడమూ స్వర్గలోకవర్ణనమూ; దేవతల పలాయనం; వామనావతారమూ; శుక్రాచార్యుడు బలిచక్రవర్తుల సంభాషణమూ; వామనుని త్రివిక్రమస్ఫురణమూ; రాక్షసులు సుతలానికి వెళ్ళడమూ; సత్యవ్రతుని వృత్తాంతమూ; మత్స్యావతార చరిత్రమూ అనే కధలు ఉన్నాయి.


ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!