పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/సృష్టి క్రమంబు
తెభా-2-32-వ.
మఱియునొక్క విశేషంబు గలదు; పుణ్యాతిరేకంబున బ్రహ్మలోకగతులైన వారు కల్పాంతరంబున బుణ్యతారతమ్యంబుల నధికారవిశేషంబు నొందువార లగుదురు; బ్రహ్మాది దేవతాభజనంబునం జనువారు బ్రహ్మజీవిత కాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు; నారాయణచరణకమల భక్తి పరాయణత్వంబునం జనినవారు నిజేచ్ఛావశంబున నిరర్గళ గమనులై బ్రహ్మాండంబు భేదించి, వైష్ణవ పదారోహణంబు సేయువాఁడు నిర్భయుండై మెల్లన లింగ దేహంబునఁ బృథివ్యాత్మకత్వంబు నొంది, యట్టి పృథివ్యాత్మకత్వంబున ఘ్రాణంబున గంధంబును, జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబును, దేజోరూపకత్వంబున దర్శనంబున రూపంబును, సమీరణాత్మకత్వంబున దేహంబున స్పర్శనంబును, గగనాత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును, నతిక్రమించి భూతసూక్ష్మేంద్రియ లయస్థానంబైన యహంకారావరణంబున సంప్రాప్తుం డై, యందు మనోమయంబును, దేవమయంబును నైన సాత్వికాహంకార గమనంబున మహత్తత్త్వంబు సొచ్చి, గుణత్రయంబున లయించి, ప్రధానంబు నొంది, ప్రధానాత్మకత్వంబున దేహంబును, నుపాధి పరంపరావసానంబునం బ్రకృతిం బాసి యానందమయుండై, యానందంబునం బరమాత్మరూపంబైన వాసుదేవ బ్రహ్మంబునందుఁ గలయు"నని చెప్పి వెండియు నిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; ఒక్క = ఇంకొక; విశేషంబున్ = విశేషము; కలదు = ఉన్నది; పుణ్య = పుణ్యము యొక్క; అతిరేకంబునన్ = గొప్పదనమువలన; బ్రహ్మలోక = బ్రహ్మలోకమునకు; గతులు = వెళ్ళిన వారలు; ఐన = అయినట్టి; వారు = వారు; కల్ప = కల్పముల; అంతరంబునన్ = ఇతరములలో; పుణ్య = (తమ) పుణ్యముల; తారతమ్యంబులన్ = తరతమ భేదముల; అధికార = అర్హతా; విశేషంబున్ = విశిష్టతానుసారము; ఒందున్ = పొందిన; వారలు = వారు; అగుదురు = అగుదురు; బ్రహ్మ = బ్రహ్మ; ఆది = మొదలగు; దేవతా = దేవతల యొక్క; భజనంబునన్ = ఆరాధించుటతో; చను = ప్రవర్తించిన; వారు = వారు; బ్రహ్మ = బ్రహ్మ; జీవిత = జీవించు నంత; కాలంబున్ = కాలము; ఎల్లన్ = అంత కాలము; బ్రహ్మ = బ్రహ్మ; లోకంబునన్ = లోకములో; వసియించి = ఉండి; ముక్తులు = ముక్తి పొందిన వారు; అగుదురు = అగుదురు; నారాయణ = విష్ణువుని; చరణ = పాద; కమల = పద్మములందు; భక్తి = భక్తియే; పరాయణత్వంబునన్ = ఉత్తమమైనది అని; చనిన = ప్రవర్తించిన; వారు = వారు; నిజ = తమ; ఇచ్చాన్ = ఇష్టము; వశంబునన్ = ప్రకారము; ముక్తులు = ముక్తి పొందిన వారు; అగుదురు = ఔతారు; నారాయణ = హరి; నిరర్గళ = అడ్డులేని {నిరర్గళ - గళములు లేని, అడ్డులేని}; గమనులు = గమనములు కలవారు; ఐ = అయి; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండమును; భేదించి = ఛేదించుకొనుచు; మహా = మిక్కిలి; ఉన్నత = ఉన్నతమైన; వైష్ణవ = విష్ణువు యొక్క; పద = పథము, లోకమును; ఆరూఢులు = పొందినవారు; అయి = అయి; తేజరిల్లుదురు = ప్రకాశించుదురు; ఈశ్వర = భగవంతునిచేత; అధిష్ఠితంబు = అధిష్ఠిపబడినది; ఐన = అయిన; ప్రకృతి = ప్రకృతి యొక్క; అంశంబునన్ = అంశముతో; మహత్తత్త్వంబు = మహత్తత్త్వము; అగున్ = అగునట్టి; మహత్తత్త్వ = మహత్తత్త్వము యొక్క; అంశంబునన్ = అంశముతో; అహంకారంబున్ = అహంకారము; అగున్ = అగును; అహంకార = అహకారము యొక్క; అంశంబునన్ = అంశముతో; శబ్ద = శబ్దము యొక్క; తన్మాత్రంబున్ = గుణమును; అగున్ = అగును; శబ్ద = శబ్దము యొక్క; తన్మాత్రంబునన్ = గుణమువలన; గగనంబు = ఆకాశము; అగున్ = అగును; గగన = ఆకాశము యొక్క; అంశంబునన్ = అంశముతో; స్పర్శ = స్పర్శ యొక్క; తన్మాత్రంబున్ = గుణము; అగున్ = అగును; స్పర్శ = స్పర్శ యొక్క; తన్మాత్రంబునన్ = గుణమువలన; సమీరణంబు = వాయువు; అగున్ = అగును; సమీరణ = వాయువు యొక్క; అంశంబునన్ = అంశముతో; రూప = రూపము యొక్క; తన్మాత్రంబున్ = గుణము; అగున్ = అగున్; రూప = రూపము యొక్క; తన్మాత్రాంశంబు = గుణము యొక్క అంశము; వలననన్ = వలన; తేజంబు = తేజస్సు, వెలుగు; అగున్ = అగును; తేజోశంబున = తేజస్సు యొక్క అంశమువలన; రస = రుచి యొక్క; తన్మాత్రంబున్ = గుణము; అగున్ = అగును; రస = రుచి యొక్క; తన్మాత్రాంశంబున్ = గుణము యొక్క అంశము; వలనన్ = వలన; జలంబున్ = నీరు; అగున్ = అగును; జల = జలము యొక్క; అంశంబునన్ = అంశముతో; గంధ = వాసన యొక్క; తన్మాత్రంబున్ = గుణము; అగున్ = అగును; గంధ = గంధము యొక్క; తన్మాత్ర = గుణమము యొక్క; అంశంబునన్ = అంశముతో; పృథ్వి = భూమి; అగున్ = అగును; వాని = వాటియొక్క; మేళనంబునన్ = కలియకలతో; చతుర్దశ = పదునాలుగు (14); భువన = లోకములు; ఆత్మకంబు = కలగి ఉన్నది; ఐన = అయినట్టి; విరాట్ = విరాట్టు యొక్త; రూపంబునన్ = రూపము; అగున్ = అగును; ఆ = ఆ; రూపంబున్ = రూపము; కున్ = కు; కోటి = కోటి, వందలక్షల (1, 00, 00, 000); యోజన = యోజనము లంత; విశాలంబున్ = వైశాల్యము కలది; ఐన = అయినట్టి; అండకటాహంబున్ = అండకోశము; ప్రథమ = మొదటి; ఆవరణంబున్ = ఆవరణము, పొర; ఐన = అయినట్టి; పృథ్వి = భూమి; అగున్ = అగును; దీనిన్ = దీనిని; పంచాశత్కోటి = ఏభైకోట్లు (50, 00, 00, 000); విశాలంబు = వైశాల్యము కలది; అని = అని; కొందఱున్ = కొందరు; పలుకుదురు = చెప్పుతారు; ఆ = ఆ; ఆవరణంబు = ఆవరణము, పొర; మీఁద = పైన; సలిల = జలము, నీరు; తేజస్ = తేజస్సు, వెలుగు; సమీర = వాయువు, గాలి; గగన = ఆకాశము; అహంకార = అహంకారము; మహత్తత్త్వంబులున్ = మహత్తత్త్వములు; అనియెడి = అనెడి; ఆవరణంబులున్ = ఆవరణలు, పొరలు; క్రమమంబునన్ = వరుసగ; ఒండొంటికిన్ = ఒకదానికంటెనొకటి; దశ = పది; గుణ = రెట్లు; ఉత్తర = పైన; అధికంబున్ = ఎక్కువైనవి; ఐ = అయి; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; ఏడింటి = ఏడింటి (7); మీఁదన్ = మీద; ప్రకృతి = ప్రకృతి అను; ఆవరణంబున్ = ఆవరణ, పొర; మహా = మిక్కిలి; వ్యాపకంబున్ = వ్యాప్తి కలది; అగున్ = అయినట్టి; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండమును; భేదించి = ఛేదించుకొని; వైష్ణవ = విష్ణువు యొక్క; పద = పథము, లోకమును; ఆరోహణంబున్ = ఎక్కుటను, పొందుటను; చేయున్ = చేయును; వాఁడు = వాడు; నిర్భయుండున్ = భయము లేనివాడు; ఐ = అయి; మెల్లనన్ = మెల్లగ, కంగారు లేకుండగ; లింగదేహంబునన్ = లింగదేహముతో; పృథివి = భూమి; ఆత్మకత్వంబునన్ = తానేయగు తత్వమును; ఒంది = పొంది; అట్టి = అటువంటి; పృథివి = భూమి; ఆత్మకత్వంబునన్ = తానే యగు తత్వమువలన; ఘ్రాణంబునన్ = వాసనచూడు ఇంద్రియముతో; గంధంబునున్ = వాసనను; జల = జలము యొక్క; ఆత్మకత్వంబునన్ = తానేయగు తత్వమువలన; రసన = రుచి చూడు; ఇంద్రియంబునన్ = ఇంద్రియముతో; రసంబునున్ = రుచిని; తేజస్ = తేజస్సు యొక్క; రూపకత్వంబునన్ = రూప స్వభావముతో; దర్శనంబునన్ = చూచుటలో; రూపంబున్ = రూపమును; సమీరణ = వాయువు, గాలి; ఆత్మకత్వంబునన్ = తనే అనుగుణములో; దేహంబునన్ = దేహము నందు; స్పర్శనంబునన్ = స్పర్శమువలన; గగన = ఆకాశము యొక్క; ఆత్మకత్వంబునన్ = తనే అనుగుణములో; శ్రవణంబునన్ = వినుటలో; శబ్దంబునున్ = ధ్వనిని; అతిక్రమించిన్ = దాటినట్టి; భూత = భూతముల; సూక్ష్మేంద్రియ = ఇంద్రియముల సూక్ష్మభావములోను; లయ = లీనమగు; స్థానంబు = చోటు; ఐన = అయినట్టి; అహంకార = అహంకారము యొక్క; ఆవరణంబునన్ = పొరను; సం = పూర్తిగా; ప్రాప్తుండు = పొందినవాడు; ఐ = అయి; అందున్ = అందులో; మనస్ = మనస్సుతో; మయంబునన్ = నిండినదియును; దేవ = దైవత్వముతో; మయంబునున్ = నిండినదియును; ఐన = అయిన; సాత్విక = సాత్వికమైన; అహంకార = అహంకారముతో; గమనంబునన్ = ప్రవర్తనలతో; మహత్తత్త్వంబున్ = మహత్తత్త్వంబునన్; చొచ్చి = ప్రవేశించి; గుణ = గుణములు; త్రయంబునన్ = మూటిని (సత్వరజోత్తామసములు); లయించి = పోగొట్టి; ప్రధానంబున్ = మూలప్రకృతిని; ఒందిన్ = పొంది; ప్రధాన = మూల; ఆత్మకత్వంబున = అహంకారమును; దేహంబునున్ = దేహమును; ఉపాధి = దేహముల, జన్మల; పరంపరా = వరుసల; అవసానంబునన్ = అంతములోని; ప్రకృతిన్ = ప్రకృతిని; పాసి = వదిలి; ఆనంద = ఆనందముతో; మయుండున్ = నిండినవాడును; ఐ = అయి; ఆనందంబునన్ = ఆనందముతో; పరమాత్మ = పరమాత్మ యొక్క; రూపంబున్ = రూపము; ఐన = అయినట్టి; వాసుదేవ = వాసుదేవ, సర్వమున వసించు దేవ; బ్రహ్మంబున్ = బ్రహ్మము; అందున్ = లోపల; కలయున్ = కలయును; అని = అని; చెప్పి = తెలియజేసి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
భావము:- ఇంకొక విశేషముంది వినుము. గొప్ప పుణ్యం వల్ల బ్రహ్మలోకం చేరిన వారు మరొక కల్పంలో తమ తమ పుణ్యాల హెచ్చు తగ్గులను బట్టి ఆ యా అధికారలను పొందుతారు. బ్రహ్మ మొదలైన దేవతలను సేవించి శరీరత్యాగం చేసినవాడు ఆ బ్రహ్మ జీవించినంతకాలం బ్రహ్మలోకంలో నివసించి కడపట ముక్తి పొందుతారు. శ్రీహరి పాదపద్మాలపై అత్యంత భక్తి కలిగి దేహం వీడినవారు స్వేచ్ఛతో నిరాటంకంగా పయనం సాగించి బ్రహ్మాండాన్ని భేదించుకొని అత్యున్నతమైన వైష్ణవస్థానం అధిష్ఠించి ప్రకాశిస్తారు. ఈశ్వరు డధిష్ఠించిన ప్రకృతి అంశంతో మహత్తత్త్వం పుడుతుంది. మహత్తత్త్వం అంశంతో అహంకారం పుడుతుంది. అహంకారం అంశంతో శబ్దతన్మాత్ర పుడుతుంది. శబ్దతన్మాత్ర అంశంతో (1) ఆకాశం పుడుతుంది. ఆకాశం అంశంతో స్పర్శ తన్మాత్ర పుడుతుంది. స్పర్శతన్మాత్ర అంశంతో (2) వాయువు పుడుతుంది. రూపతన్మాత్ర అంశనుండి (3) అగ్ని పుడుతుంది. అగ్ని అంశంతో రసతన్మాత్ర పుడుతుంది. రసతన్మాత్ర అంశనుడి (4) జలం పుడుతుంది. జలాంశం నుండి గంధ తన్మాత్ర పుడుతుంది. గంధ తన్మాత్ర అంశతో (5) పృథ్వి పుడుతుంది. వీటన్నిటి కలయిన వల్ల పదునాల్గు భువనాల స్వరూపమైన విరాడ్రూపం ఉద్భవిస్తుంది. ఆ రూపానికి కోటి యోజనాల విస్తీర్ణమైన అండకటాహమే మొదటి ఆవరణమైన భూమి అవుతుంది. కొందరు దీనిని ఏబదికోట్ల యోజనాల విశాలమని వర్ణిస్తారు. ఈ ఆవరణం మీద జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్త్వం అనే ఆరు ఆవరణాలున్నాయి. అవి క్రమంగా ఒకదాని కొకటి పదేసి రెట్లు పెద్దవిగా ఉన్నాయి. ఆ యేడావరణాల మీద ఎనిమిదవదైన ప్రకృత్యావరణం గొప్పగా వ్యాపించి ఉంది. ఈ బ్రహ్మాండాన్ని భేదించుకొని విష్ణుపదం అధిష్ఠించినవాడు మరణాది భయరహితు డవుతాడు. అతడు మెల్లగా లింగశరీరంతో పృథివీ తత్త్వం పొందుతాడు. ఆ పృథివీ తత్త్వంలో ఘ్రాణేంద్రియంతో గంధాన్ని గ్రహిస్తాడు. జలస్వరూపుడై రసనేంద్రియంతో రసాన్ని గ్రహిస్తాడు. తేజోరూపుడై నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయు స్వరూపుడై త్వగింద్రియంతో స్పర్శాన్ని గ్రహిస్తాడు. గగన స్వరూపుడై శ్రోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు. అన్నింటినీ అతిక్రమించి ఆ యోగి ఆకాశాది పంచభూతాలకూ, సూక్ష్మేంద్రియులకు లయస్థానమైన అహంకారావరణం చేరుకుంటాడు. అక్కడ మనోమయము, దేవమయము ఐన సాత్త్వికాహంకారంతో మహత్తత్త్వంతో ప్రవేశిస్తాడు. ఆ పైని సత్త్వరజస్తమోగుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు. ఆ ప్రకృత్యాత్మకత్వంతో దేహాన్నీ, ఉపాధి పరంపరలన్నీ ముగిసిన పిమ్మట ప్రకృతినీ పరత్యజించి ఆనందమయు డవుతాడు. ఆ ఆనందంతో పరమాత్మ స్వరూపమైన వాసుదేవ పరబ్రహ్మంలో లీనమవుతాడు.” ఈ విధంగా చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు.
తెభా-2-33-ఆ.
"పరమ భాగవతులు పాటించు పథ మిది
యీ పథమున యోగి యేఁగెనేని
మగుడి రాఁడు వాఁడు మఱి సంశయము లేదు
కల్పశతము లైనఁ గౌరవేంద్ర!
టీక:- పరమ = ఉత్కృష్టమైన; భాగవతులు = భాగవతానుయాయులు; పాటించు = అనుసరించు; పథము = విధానము, మార్గము; ఇది = ఇది; ఈ = ఈ; పథమునన్ = మార్గములో; యోగి = యోగియైనవాడు; ఏఁగెన్ = వెళ్ళినట్లు; ఏని = అయితే; మగుడి = వెనుకకు మరలి; రాఁడు = రాడు; వాఁడు = వాడు; మఱి = ఇందులో ఇంక; సంశయమున్ = సంశయము; లేదు = లేదు; కల్ప = కల్పములు; శతములు = వందలు; ఐనన్ = జరిగినప్పటికిని; కౌరవేంద్ర = కౌరవవంశస్థులలో శ్రేష్ఠుడా.
భావము:- “కురురాజా! ఇది భాగవతోత్తములు అనుసరించే మార్గం. ఈ మార్గాన పయనించిన యోగి వందలకొలది కల్పాలు గడచినా మళ్ళీ తిరిగిరాడు. ఇందుకు సందేహం లేదు.
తెభా-2-34-వ.
వినుము; నీ వడిగిన సద్యోముక్తియుఁ గ్రమముక్తియు ననియెడు నీ రెండు మార్గంబులు వేదగీతలందు వివరింపబడియె; వీనిం దొల్లి భగవంతుం డైన వాసుదేవుండు బ్రహ్మచేత నారాధితుండై చెప్పె; సంసార ప్రవిష్టుండైన వానికిఁ దపోయోగాదు లయిన మోక్షమార్గంబులు పెక్కులు గల; వందు భక్తిమార్గంబు కంటె సులభంబు లేదు.
టీక:- వినుము = వినుము; నీవున్ = నీవు; అడిగినన్ = అడిగినట్టి; సద్యోముక్తియున్ = సద్యోముక్తి, వెంటనేకలుగు ముక్తి; క్రమముక్తియున్ = క్రమముక్తి; అనియెడిన్ = అనబడు; ఈ = ఈ; రెండు = రెండు (2); మార్గంబులున్ = మార్గములును; వేద = వేదము యొక్క; గీతలు = గానముచేయు మంత్రములు; అందున్ = లో; వివరింపపడియెన్ = వివరముగ చెప్పపడినవి; వీనిన్ = వీనిని; తొల్లి = పూర్వము; భగవంతుండు = భగవంతుడు, మహిమాన్వితుడు; ఐన = అయినట్టి; వాసుదేవుండు = వాసుదేవుడు; బ్రహ్మ = బ్రహ్మ; చేతన్ = చే; ఆరాధితుండు = ప్రార్థింపబడ్డవాడు; ఐ = అయి; చెప్పెన్ = తెలియజెప్పెను; సంసార = సంసారము నందు; ప్రవిష్టుండున్ = ప్రవేశము; ఐన = అయినట్టి; వాని = వాడి; కిన్ = కి; తపో = తపస్సు; యోగ = యోగము; ఆదులు = మొదలగునవి; అయిన = అయినట్టి; మోక్ష = మోక్షమునకు; మార్గంబులున్ = మార్గములు, విధానములు; పెక్కులున్ = అనేకములు; కలవు = ఉన్నవి; అందున్ = వానిలో; భక్తి = భక్తి; మార్గంబున్ = మార్గము, విధానము; కంటెన్ = కంటె; సులభంబున్ = సులభమైనది; లేదు = లేదు.
భావము:- సద్యోముక్తి, క్రమముక్తి అనే రెండు మార్గాలు నీవు అడిగావు. ఇవి రెండూ వేదగీతలలో వివరింప బడ్డాయి. పూర్వం బ్రహ్మ తనను ఆరాధింపగా భగవంతుడైన విష్ణువు ఆయనకు వీటిని బోధించాడు. సంసారంలో ప్రవేశించిన వానికి తపస్సు, యోగం మొదలైన మోక్ష మార్గాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటి కంటే సులభమైంది భక్తిమార్గం.
తెభా-2-35-మ.
విను, మంభోజభవుండు మున్ను మదిలో వేదంబు ముమ్మాఱు ద
ర్శన యజ్ఞత్వముతోడ నెంతయుఁ బరామర్శించి, మోక్షంబు ద
క్కిన మార్గంబుల వెంట లే దనుచు భక్తిం జింత సేసెన్ జనా
ర్దను నాత్మాకృతి నిర్వికారుఁ డగుచుం దన్మార్గ నిర్ణేతయై.
టీక:- వినుము = వినుము; అంభోజ = (నీటిలో పుట్టిన) పద్మము నందు; భవుండున్ = పుట్టిన వాడు, బ్రహ్మ; మున్ను = పూర్వము; మదిన్ = మనసు; లోన్ = లో; వేదంబున్ = వేదమును; ముమ్మాఱు = మూడు (3) సార్లు; దర్శన = తరిచి చూచు; యజ్ఞత్వము = గట్టి ప్రయత్నము; తోడన్ = తో; ఎంతయున్ = ఎంతగానో; పరామర్శించి = పరిశీలించి; మోక్షంబున్ = మోక్షము; తక్కిన = ఇతరమైన; మార్గంబులన్ = మార్గముల; వెంటన్ = ద్వారా; లేదు = లేదు; అనుచున్ = అనుచు; భక్తిన్ = భక్తితో; చింతన్ = ధ్యానము; చేసెన్ = చేసెను; జనార్ధనున్ = విష్ణువును; ఆత్మా = తన యొక్క; ఆకృతిన్ = రూపములో; నిర్వికారుఁడు = వికార విమోచనుడు; అగుచున్ = అగుచు; తత్ = ఆ; మార్గ = మార్గమును; నిర్ణేత = నిర్మించినవాడు; ఐ = అయి.
భావము:- ఇది ఇంకా వివిరంగా చెపుతాను వినుము. పూర్వం బ్రహ్మ మనసులో మూడుసార్లు వేదాన్ని ధర్మపరాయణమైన దృష్టితో పరామర్శించాడు. అలా పరామర్శించి భక్తితో తప్ప మరో మార్గాన మోక్షం లభించదని నిశ్చయించాడు. ఆ మార్గాన్నే తరణోపాయంగా నిర్ణయించుకొని వికారానికి లోనుగాకుండా జనార్దనుని ఆత్మస్వరూపాన్ని భక్తితో ధ్యానించాడు.
తెభా-2-36-సీ.
అఖిల భూతములందు నాత్మరూపంబున-
నీశుండు హరి యుండు నెల్ల ప్రొద్దు,
బుద్ధ్యాది లక్షణంబులఁ గానఁబడును, మ-
హత్సేవనీయుఁ డహర్నిశంబు
వందనీయుఁడు, భక్త వత్సలుం, డత్యంత-
నియతుఁడై సతతంబు నియతబుద్ధి
నాత్మరూపకుఁడగు హరికథామృతమును-
గర్ణ పుటంబులఁ గాంక్ష దీరఁ
తెభా-2-36.1-తే.
గ్రోలుచుండెడు ధన్యులు కుటిలబహుళ
విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి,
విష్ణుదేవుని చరణారవింద యుగము
కడకుఁ జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర!
టీక:- అఖిలన్ = సమస్తమైన; భూతములున్ = భూతములు; అందున్ = లోను; ఆత్మ = ఆత్మ అగు; రూపంబునన్ = రూపములో; ఈశుండు = అధిపతియైన; హరి = విష్ణువు; ఉండున్ = ఉండును; ఎల్ల = అన్ని; ప్రొద్దున్ = వేళలందును; బుద్ధి = బుద్ధి; ఆది = మొదలగు; లక్షణంబులన్ = లక్షణములలో; కానన్ = చూడ; పడునున్ = పడును; మహత్ = గొప్పవారిచే; సేవనీయుఁడు = సేవింపదగినవాడు; అహర్నిశంబున్ = ఎల్లప్పుడును; వందనీయుఁడు = నమస్కరించదగినవాడు; భక్త = భక్తులందు; వత్సలుండు = వాత్సల్యము కలవాడు; అత్యంత = మిక్కిలి; నియతుడున్ = నియముతోనుండువాడును; ఐ = అయ్యి; సతతంబున్ = ఎడతెగని; నియత = నిగ్రహింపబడుచున్న; బుద్ధిన్ = బుద్ధితో; ఆత్మ = ఆత్మ; రూపకుడు = రూపముకలవాడు; అగు = అయినట్టి; హరి = భగవంతుని; కథా = కథలు అను; అమృతంబున్ = అమృతమును; కర్ణ = చెవుల; పుటంబులన్ = డొప్పలలో; కాంక్షన్ = కోరిక; తీరన్ = తీరునట్లు; క్రోలుచున్ = తాగుచు; ఉండెడి = ఉండునట్టి;
ధన్యులు = అదృష్టవంతులు; కుటిల = వక్రమైన, చెడ్డ; బహుళ = అనేకమైన; విషయ = కోరికలచేత; మలినీకృత = మలినము చేయబడిన; అంగములన్ = శరీరములను; వేగన్ = తొదరగ; విడిచి = విడిచిపెట్టి; విష్ణుదేవునిన్ = హరియొక్క; చరణ = పాదములు అను; అరవింద = పద్మముల; యగమున్ = జంట; కడకున్ = వద్దకు; చనుదురు = వెళ్తారు; సిద్ధంబున్ = తప్పకుండగ; కౌరవ = కౌరవవంశస్తులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా.
భావము:- జగదధిదేవుడు అయిన శ్రీమన్నారాయణుడు సమస్తప్రాణులలో సదా ఆత్మరూపుడై ఉన్నాడు. బుద్ధి మొదలైన లక్షణాలతో ఆయన మనకు గోచరిస్తాడు. విజ్ఞులకు ఆయన సేవింపదగినవాడు. సమస్తవేళల నమస్కరింపదగిన వాడు. భక్తుల మీద వాత్సల్యం కురిపించేవాడు. నియమ నిష్ఠలు కల్గి ఏకాగ్రమైన బుద్ధితో ఆత్మస్వరూపుడైన శ్రీహరి కథా సుధాపూరాన్ని తనివి దీరా, చెవులార గ్రోలేవారు ధన్యులు. అటువంటివారు కుటిలమైన పలువిషయాలతో దూషితాలైన తమ శరీరాలను త్వరగా త్యజించి విష్ణు దేవుని పాదపద్మాలను చేరుకుంటారు. కౌరవేశ్వరా! ఇది సత్యం.
తెభా-2-37-క.
మానుషజన్మము నొందిన
మానవులకు, లభ్యమాన మరణులకు, మహా
జ్ఞానులకుఁ, జేయవలయు వి
ధానము నిగదింపఁ బడియె ధరణీనాథా!
టీక:- మానుష = మానవ; జన్మమున్ = పుట్టుకను; ఒందిన = పొందినట్టి; మానవులు = మనుష్యులు; కున్ = కి; లభ్యమాన = పొందుట నిశ్చయింప బడిన; మరణులు = మరణము కలవారు; కున్ = కి; మహా = గొప్ప; జ్ఞానులు = జ్ఞానము కలవారల; కున్ = కు; చేయన్ = చేయ; వలయున్ = వలసిన; విధానమున్ = పద్ధతి; నిగదింపఁబడియెన్ = వివరముగ చెప్పబడెను; ధరణీ = భూమికి; నాథా = ప్రభువా, మహారాజా.
భావము:- నరేంద్రా! మనుష్యులుగా జన్మించినవాళ్ళూ, మరణము ఆసన్నమైన వాళ్ళూ, మహాజ్ఞానులు చేయవసిన కర్తవ్యం ఇలా నొక్కి వక్కాణింపబడి ఉంది.