పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/అన్యదేవభజన ఫలంబు

వికీసోర్స్ నుండి


తెభా-2-38-వ.
వినుము; బ్రహ్మవర్చసకాముడైన వానికి వేదవిభుండగు చతుర్ముఖుండును, నింద్రియపాటవకామునకు నింద్రుండునుఁ, బ్రజాకామునకు దక్షాది ప్రజాపతులును, భోజనకామునకు నదితియు, స్వర్గకామునకు నాదిత్యాదులును, రాజ్యకామునకు విశ్వదేవతలును, దేశప్రజాసాధనకామునకు సాధ్యులును, శ్రీకామునకు దుర్గయుఁ, దేజస్కామునకు నగ్నియు, వసుకామునకు వసువులును, వీర్యకామునకు వీర్యప్రదులగు రుద్రులును, నాయుష్కామునకు నశ్వనీదేవతలునుఁ, బుష్టికామునకు భూమియుఁ, బ్రతిష్టాకామునకు లోకమాతలైన గగనభూదేవతలును, సౌందర్యకామునకు గంధర్వులునుఁ, గామినీకామునకు నప్సరసయైన యూర్వశియు, సర్వాధిపత్యకామునకు బ్రహ్మయుఁ, గీర్తికామునకు యజ్ఞంబులును, విత్తసంచయకామునకుం బ్రచేతసుండును, విద్యాకామునకు నుమావల్లభుండును, దాంపత్య ప్రీతికామునకు నుమాదేవియు, ధర్మార్థకామునకు నుత్తమశ్లోకుండగు విష్ణువును, సంతానకామునకుఁ బితృదేవతలును, రక్షాకామునకు యక్షులును, బలకామునకు మరుద్గణంబులును, రాజత్వకామునకు మనురూపదేవతలును, శత్రుమరణకామునకుఁ గోణపాలకుం డైన రాక్షసుండును, భోగకామునకుం జంద్రుండును, భజనీయు లగుదురు; మఱియును.
టీక:- వినుము = వినుము; బ్రహ్మ = బ్రాహ్మణ, వేదముల; వర్చస = వికాసమును; కాముఁడు = కోరువాడు; ఐన = అయిన; వానికిన్ = వాడికి; వేద = వేదములకు; విభుండున్ = అధిపతి; అగు = అయినట్టి; చతుర్ముఖండునున్ = చతుర్ముఖ బ్రహ్మయును; ఇంద్రియ = ఇంద్రియముల; పాటవ = పటుత్వమును; కామున్ = కోరువాని; కున్ = కి; ఇంద్రుండునున్ = ఇంద్రుడును; ప్రజా = సంతాన; కామున్ = కోరువాడు; కున్ = కి; దక్ష = దక్షుడు; ఆది = మొదలగు; ప్రజా పతులున్ = ప్రజాపతులును; భోజన = భోజనము; కామున్ = కోరువాడు; కున్ = కి; అదితియున్ = అదితియును; స్వర్గ = స్వర్గమును; కామున్ = కోరువాడు; కున్ = కి; ఆదిత్య = ఆదిత్యుడు {ఆదిత్యాదులు - ద్వాదశాదిత్యులు - ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వినస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు}; ఆదులును = మొదలగు వారును; రాజ్య = రాజ్యమును; కామున్ = కోరువాడు; కున్ = కి; విశ్వదేవతలునున్ = విశ్వదేవతలును; దేశ = దేశము నందలి; ప్రజా = ప్రజల; సాధన = స్వాధీనము, వశపరచుకొను; కామున్ = కోరువాని; కున్ = కి; సాధ్యులునున్ = సాధ్యులును {సాధ్యులు - మనువు, హనుమంతుడు, విష్ణువు, ధర్ముడు, నారాయణుడు మొదలగు పన్నెండు (12) మంది}; శ్రీ = సిరిని; కామున్ = కోరువాని; కున్ = కి; దుర్గయున్ = దుర్గయును; తేజస్ = తేజస్సు, ప్రకాశము, ప్రభావము; కామున్ = కోరువాని; కున్ = కి; అగ్నియున్ = అగ్నియును; వసున్ = సంపదను; కామున్ = కోరువాని; కున్ = కి; వసువులునున్ = వసువులును {అష్టవసువులు - ఆవుడు, ధ్రువుడు, సోముడు,అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు}; వీర్యన్ = వీర్యమును; కామున్ = కోరువాని; కున్ = కి; వీర్యన్ = వీర్యమును; ప్రదులు = కలిగించు వారలు; అగు = అయిన; రుద్రులును = రుద్రులును {ఏకాదశరుద్రులు - అజుడు, ఏకపాదుడు, అహిర్బుద్న్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, త్రయంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు}; ఆయుష్ = (ఎక్కువ) జీవిత కాలము; కామున్ = కోరువాని; కున్ = కి; అశ్వనీదేవతలునున్ = అశ్వనీదేవతలును; పుష్టి = మంచి పోషణము, బలుపు; కామున్ = కోరువాని; కున్ = కి; భూమియున్ = భూమియును; ప్రతిష్టా = ప్రతిష్టను; కామున్ = కోరువాని; కున్ = కి; లోక = లోకమునకు; మాతలు = తల్లులు {పంచమాతలు - రాజుభార్య, అగ్రజునిభార్య, గురుభార్య, భార్యాజనని, స్వజనని}; ఐన = అయినట్టి; గగన = ఆకాశ {ఆకాశదేవతలు - స్వర్లోక దేవతలు}; భూ = భూమి {భూదేవతలు - బ్రాహ్మణులు}; దేవతలును = దేవతలును; సౌందర్య = సౌందర్యమును; కామున్ = కోరువాని; కున్ = కి; గంధర్వులును = గంధర్వులును; కామినీ = కామము కల స్త్రీలను; కామున్ = కోరువాని; కున్ = కి; అప్సరస = అప్సరస; ఐన = అయిన; ఊర్వశియున్ = ఊర్వశియును; సర్వాధిపత్యన్ = సమస్తమైన అధిపత్యములను; కామున్ = కోరువాని; కున్ = కి; బ్రహ్మయున్ = బ్రహ్మయును; కీర్తిన్ = కీర్తిని; కామున్ = కోరువాని; కున్ = కి; యజ్ఞంబులునున్ = యజ్ఞములును; విత్త = ధనమును; సంచయ = కూడబెట్టుటను; కామున్ = కోరువాని; కున్ = కి; ప్రచేతసుండును = ప్రచేతసుడు, వరుణుడు; విద్యా = విద్యలను; కామున్ = కోరువాని; కున్ = కి; ఉమా = ఉమ యొక్క; వల్లభుండునున్ = పతియును; దాంపత్యప్రీతి = దంపతుల మధ్య అనురాగానికి; కామున్ = కోరువాని; కున్ = కి; ఉమాదేవియున్ = ఉమాదేవియును; ధర్మ = ధర్మమును; అర్థ = అర్థమును; కామున్ = కోరువాని; కున్ = కి; ఉత్తమ = ఉత్తమమైన; శ్లోకుండు = ప్రార్థనలకు తగినవాడు; అగున్ = అయినట్టి; విష్ణువునున్ = విష్ణువును; సంతాన = సంతానమును; కామున్ = కోరువాని; కున్ = కి; పితృదేవతలునున్ = పితృదేవతలును; రక్షా = రక్షణమును; కామున్ = కోరువాని; కున్ = కి; యక్షులున్ = యక్షులును; బలన్ = బలమును; కామున్ = కోరువాని; కున్ = కి; మరుద్గణంబులునున్ = మరుద్గణంబులును {మరుత్తులు - ఏడు గణములలో ఏడుగురు చొప్పున 49 మంది}; రాజత్వ = రాజుగా ఉండుటను; కామున్ = కోరువాని; కున్ = కి; మను = మనువుల యొక్క; రూప = రూపములలో ఉండు; దేవతలును = దేవతలును; శత్రు = శత్రువుల; మరణ = మరణమును; కామున్ = కోరువాని; కున్ = కి; కోణ = నైరృతి దిక్కును {నైరృతి దిక్పాలకుడు - నిరృతి}; పాలకుండు = పాలించువాడు; ఐన = అయిన; రాక్షసుండునున్ = రాక్షసుడును (నిరృతి); భోగ = భోగములను {అష్టభోగములు - గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము}; కామున్ = కోరువాని; కున్ = కి; చంద్రుడునున్ = చంద్రుడును; భజనీయులు = పూజింప తగినవారు; అగుదురు = అయివున్నారు; మఱియును = ఇంకను.
భావము:- శ్రద్ధగా వినుము. బ్రహ్మవర్చస్సు కోరేవాడు వేదపాలకుడైన చతుర్ముఖ బ్రహ్మను సేవించాలి. అలాగే ఇంద్రియశక్తి కాంక్షించేవాడు ఇంద్రుణ్ణి, సంతానం అభిలషించేవాడు దక్షుడు మొదలైన ప్రజాపతులను, భోజనం అశించేవాడు అదితినీ పూజించాలి. స్వర్గం వాంఛించేవాడు ఆదిత్యులను, రాజ్యాభిలాష కలవాడు విశ్వేదేవతలను, ప్రజలను అధీనం చేసుకొనగోరువాడు సాధ్యులను, సిరిని వరించేవాడు దుర్గను ఉపాసించాలి. తేజస్సుకోరేవాడు అగ్నిని, ధనాభిలాషి వసువులను, వీర్యం అర్థించేవాడు రుద్రులను, ఆయువు కోరేవాడు అశ్వినీ దేవతలను, పుష్టి కావాలి అనేవాడు భూమిని అర్చించాలి. ప్రతిష్ఠను అపేక్షించేవాడు లోకమాతమాతలైన ఆకాశభూదేవతలను, అందం కోరేవాడు గంధర్వులను, వనితలపై వాంఛకలవాడు అప్సరసయైన ఊర్వశిని, సర్వాధికారం కాంక్షించేవాడు పరమేష్ఠిని భజించాలి. కీర్తికోరేవాడు యజ్ఞమూర్తియైన విష్ణువును, విత్తం ఆశించేవాడు ప్రచేతసుణ్ణి, విద్యపై కోరిక గలవాడు శివుణ్ణి, దాంపత్యసుఖం అర్థించేవాడు పార్వతిని కొలవాలి. ధర్మార్థాలపై అభిలాష కలవాడు పుణ్యచరిత్రుడైన విష్ణువును, సంతానం కోరేవాడు పితృదేవతలను, రక్షణ కాంక్షించేవాడు యక్షులను, బలం కోరేవాడు మరుద్గణాలను, రాచరికం కావాలి అనేవాడు మనురూపంలో ఉన్న దేవతలను, శత్రుమరణం వాంఛించేవాడు నిరృతిని, భోగాలను అభిలషించేవాడు చంద్రుణ్ణి ఆరాధించాలి.

తెలుగుభాగవతం.ఆర్గ్