పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/విరాట్స్వరూపము తెలుపుట
తెభా-2-16-వ.
వినుము; భగవంతుండైన హరి విరాడ్విగ్రహంబు నందు భూత భవిష్యద్వర్తమానం బైన విశ్వంబు విలోక్యమానం బగు ధరణీ, సలిల, తేజస్సమీరణ, గగనాహంకార, మహత్తత్వంబు లనియెడి సప్తావరణంబుల చేత నావృతం బగు మహాండకోశం బైన శరీరంబు నందు ధారణాశ్రయం బయిన వైరాజపురుషుండు దేజరిల్లు; నమ్మహాత్మునికిఁ బాదమూలంబు పాతాళంబు; పార్ష్ణిభాగ పాదాగ్ర భాగంబులు రసాతలంబు; గుల్ఫంబులు మహాతలంబు; జంఘలు తలాతలంబు; జానుద్వయంబు సుతలం; బూరువులు వితలాతలంబు; జఘనంబు మహీతలంబు; నాభీవివరంబు నభస్థ్సలంబు; వక్షంబు గ్రహతారకా ముఖ జ్యోతిస్సమూహ సమేతం బగు నక్షత్రలోకంబు; గ్రీవంబు మహర్లోకంబు; ముఖంబు జనలోకంబు; లలాటంబు తపోలోకంబు; శీర్షంబు సత్యలోకంబు; బాహుదండంబు లింద్రాదులు; గర్ణంబులు దిశలు; శ్రవణేంద్రియంబు శబ్దంబు; నాసాపుటంబు లశ్వనీదేవతలు; ఘ్రాణేంద్రియంబు గంధంబు; వదనంబు వహ్ని; నేత్రంబు లంతరిక్షంబు; చక్షురింద్రియంబు సూర్యుండు; రేయింబగళ్ళు ఱెప్పలు; భ్రూయుగ్మ విజృంభణంబు బ్రహ్మపదంబు; తాలువులు జలంబు; జిహ్వేంద్రియంబు రసంబు; భాషణంబులు సకల వేదంబులు; దంష్ట్రలు దండధరుండు; దంతంబులు పుత్రాది స్నేహకళలు; నగవులు జనోన్మాద కరంబు లయిన మాయావిశేషంబులు; కటాక్షంబు లనంత సర్గంబులు; పెదవులు వ్రీడాలోభంబులు; స్తనంబులు ధర్మంబులు; వె న్నధర్మమార్గంబు; మేఢ్రంబు ప్రజాపతి; వృషణంబులు మిత్రావరుణులు; జఠరంబు సముద్రంబులు; శల్య సంఘంబులు గిరులు; నాడీనివహంబులు నదులు; తనూరుహంబులు తరువులు; నిశ్వాసంబులు వాయువులు; ప్రాయంబు నిరవధికంబయిన కాలంబు; కర్మంబులు నానావిధజంతునివహ సంవృత సంసరణంబులు; శిరోజంబులు మేఘంబులు; కట్టు పుట్టంబులు సంధ్యలు; హృదయంబు ప్రధానంబు; సర్వవికారంబులకు నాశ్రయంబైన మనంబు చంద్రుండు; చిత్తంబు మహత్తత్త్వం; బహంకారంబు రుద్రుండు; నఖంబు లశ్వాశ్వతర్యుష్ట్ర గజంబులు; కటిప్రదేశంబు పశుమృగాదులు; విచిత్రంబులైన యాలాప నైపుణ్యంబులు పక్షులు; బుద్ధి మనువు; నివాసంబు పురుషుండు; షడ్జాదులైన స్వరవిశేషంబులు గంధర్వ, విద్యాధర, చారణాప్సర, స్సమూహంబులు; స్మృతి ప్రహ్లాదుండు; వీర్యంబు దైత్య దానవానీకంబై యుండు; మఱియు న మ్మాహావిభునకు ముఖంబు బ్రాహ్మణులును, భుజంబులు క్షత్రియులును, నూరులు వైశ్యులును, జరణంబులు శూద్రులును, నామంబులు నానా విధంబులయిన వసురుద్రాది దేవతాభిధానంబులును; ద్రవ్యంబులు హవిర్భాగంబులునుఁ; గర్మంబులు యజ్ఞప్రయోగంబులును నగు; నిట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబు ముముక్షువయినవాడు మనంబున ననుసంధానంబు సేయవలయు"నని వక్కాణించి వెండియు నిట్లనియె.
టీక:- వినుము = వినుము; భగవంతుడు = మహిమాన్వితుడు; ఐన = అయినట్టి; హరి = విష్ణుమూర్తి; విరాట్ = విరాట్టు - విశ్వరూపముగల; విగ్రహంబున్ = స్వరూపము; అందున్ = లో; భూత = జరిగిపోయినట్టివి; భవిష్యత్ = జరుగపోవునట్టివి; వర్తమానంబు = జరుగుచున్నట్టివి; ఐన = అయినట్టి; విశ్వంబున్ = మొత్తము విశ్వము; విలోక్యమానంబు = కనబడునది; అగున్ = అయి ఉండును; ధరణీ = భూమి; సలిల = నీరు; తేజస్ = నిప్పు; సమీరణ = గాలి; గగన = ఆకాశము; అహంకార = అహంకారము; మహత్ = మహత్తు; తత్త్వంబున్ = తత్త్వములు; అనియెడి = అనబడు; సప్త = ఏడు (7); ఆవరణంబులు = ఆవరణలు - పొరలు; చేతన్ = చేత; ఆవృతంబున్ = ఆవరింపబడినది; అగు = అయినట్టి; మహా = గొప్ప, మిక్కిలి పెద్దవైన; అండ = అండ(గ్రుడ్డు) రూప గోళముల; కోశంబు = దివ్యభాండాగారము; ఐన = అయినట్టి; శరీరంబు = స్వరూపము; అందున్ = లో; ధారణ = ధారణను; ఆశ్రయంబు = ఆశ్రయముగా కలది; అయిన = అయినట్టి; వై = విరాజిల్లుతున్న, ప్రకాశిస్తున్న; రాజ = మహా, విరాట్; పురుషుండు = పూరుషుడు; తేజరిల్లున్ = ప్రకాశించును; ఆ = ఆ; మహాత్ముడు = గొప్పఆత్మ కలవాడు; కిన్ = కి; పాద = కాలి; మూలంబు = పాదములు; పాతాళంబు = పాతాళము; పార్ష్ణ = మడమ; భాగ = భాగములు; పాదాగ్ర = కాలి వేళ్ళు కల; భాగంబులు = భాగములు; రసా = రసా; తలంబు = తలము; గుల్ఫంబులు = చీలమండలు; మహా = మహా; తలంబు = తలము; జంఘలు = పిక్కలు; తలా = తలా; తలంబు = తలము; జాను = మోకాళ్ళ; ద్వయంబు = జంట; సు = సు; తలంబు = తలము; ఊరువులు = తొడలు; వితలా = వితలా; అతలంబు = అతలము; జఘనంబు = మొల; మహీ = మహీ, భూ; తలంబు = తలము; నాభీ = బొడ్డు యొక్క; వివరంబు = రంధ్రము; నభస్ = ఆకాశము; స్థలంబు = స్థలము; వక్షంబు = రొమ్ము; గ్రహ = గ్రహములు; తారకా = నక్షత్రములు; ఆముఖ = మొదలగు వానితో కూడిన; జ్యోతిస్ = జ్యోతిర్మండలముల; సమూహ = సమూహముల; సమేతంబు = కూడినది; అగు = అయిన; నక్షత్ర = నక్షత్ర; లోకంబు = లోకము; గ్రీవంబు = మెడ; మహస్ = మహస్; లోకంబు = లోకము; ముఖంబు = ముఖము; జన = జన; లోకంబు = లోకము; లలాటంబు = నుదురు; తపస్ = తపో; లోకంబు = లోకము; శీర్షంబు = తల; సత్య = సత్య; లోకంబు = లోకము; బాహుదండంబులు = చేతులు; ఇంద్ర = ఇంద్రుడు; ఆదులు = మొదలగువారు; కర్ణంబులు = చెవులు; దిశలు = దిక్కులు; శ్రవణ = వినునట్టి; ఇంద్రియంబులు = ఇంద్రియములు, చెవిరంధ్రములు; శబ్దంబు = చప్పుడు; నాసా = ముక్కు; పుటంబులు = పుటములు; అశ్వనీ = అశ్వనీ; దేవతలు = దేవతలు; ఘ్రాణ = వాసనచూసు; ఇంద్రియంబు = ఇంద్రియము; గంధంబు = వాసన; వదనంబు = నోరు; వహ్ని = అగ్ని; నేత్రంబులు = కళ్ళు; అంతరిక్షంబు = అంతరిక్షము {అంతరిక్షంబు - అంతర్ + ఈక్షంబు - రెండు వస్తువుల మధ్యన చూడబడునది, space}; చక్షుస్ = చూచునట్టి; ఇంద్రియంబు = ఇంద్రియము; సూర్యుడు = సూర్యుడు; రేయిన్ = రాత్రి; పగళ్ళు = పగళ్ళు; ఱెప్పలు = కనురెప్పలు; భ్రూ = కనుబొమల; యుగ్మ = జంట; విజృంభణము = వికాశము; బ్రహ్మ = బ్రహ్మ; పదంబు = లోకము; తాలువులు = దౌడలు; జలంబు = నీరు; జిహ్వ = రుచిచూచునట్టి, నాలుక; ఇంద్రియంబు = ఇంద్రియము; రసంబు = రుచి; భాషణంబులు = పలుకులు; సకల = సమస్త; వేదంబులు = వేదములు; దంష్ట్రలు = కోరలు; దండధరుండు = యముడు; దంతంబులు = పలువరుస; పుత్ర = పుత్రులు; ఆది = మొదలగు; స్నేహ = స్నేహము యొక్క; కళలు = విలాసములు; నగవులు = నవ్వులు; జన = జనములకు; ఉన్మాద = వెఱ్ఱెక్కించ; కరంబులు = కలిగినవి; అయిన = అయినట్టి; మాయా = మాయ యొక్క; విశేషంబులు = లక్షణములు; కటాక్షంబులు = కడగంటిచూపులు, దయ; అనంత = అనంతమైన; సర్గంబులు = సృష్టులు; పెదవులు = పెదవులు; వ్రీడా = సిగ్గులు మరియు; లోభంబులు = లోభములు; స్తనంబులు = వక్షోజములు; ధర్మంబులు = ధర్మములు; వెన్ను = వెన్నెముక; అధర్మంబులు = అధర్మము యొక్క; మార్గంబు = ప్రవర్తన; మేఢ్రంబు = మేఢ్రము - పురుష జననేంద్రియము; ప్రజాపతి = ప్రజాపతి; వృషణంబులు = వృషణములు; మిత్రా = మిత్రుడు మరియు; వరుణులు = వరుణులు; జఠరంబు = జీర్ణకోశంబు; సముద్రంబులు = సముద్రములు; శల్య = ఎముకల; సంఘంబులు = గూడు; గిరులు = పర్వతములు; నాడీ = నాడీ; నివహంబులు = సమూహములు; నదులు = నదులు; తనుస్ = శరీరము పై; ఊరుహంబులు = మొలచునవి, రోమములు; తరువులు = చెట్లు; నిశ్వాసంబులు = ఊపిరులు; వాయువులు = గాలులు; ప్రాయంబు = వయస్సు; నిరవధికంబు = అంతులేనిది; అయిన = అయినట్టి; కాలంబు = కాలము; కర్మంబులు = చేసికొను పనులు, వృత్తి; నానా = అన్ని; విధ = రకముల; జంతు = జంతువుల; నివహ = సమూహముల; సంవృత = గుంపు; సంసరణంబులు = సంసారములు; శిరోజంబులు = తలవెంట్రుకలు; మేఘంబులు = మేఘములు; కట్టు = కట్టుకొను; పుట్టంబులు = వస్త్రములు; సంధ్యలు = సంధ్యలు; హృదయంబు = గుండె, హృదయము; ప్రధానంబు = మూలప్రకృతి; సర్వ = సమస్తమైన; వికారంబులు = వికారములు; కున్ = కి; ఆశ్రయంబు = ఆశ్రయము; ఐన = అయినట్టి; మనంబు = మనస్సు; చంద్రుండు = చంద్రుడు; చిత్తంబు = ఇంద్రియములతో కూడిన మనస్సు {చిత్తము - ఇంద్రియములతో కూడిన మనస్సు}; మహత్ = మహత్తు అను; తత్త్వంబు = తత్త్వము; అహంకారంబు = అహంకారము; రుద్రుండు = రుద్రుడు; నఖంబులు = గోర్లు; అశ్వ = గుఱ్ఱములు; అశ్వతరి = ఆడు కంచర గాడిదలు; ఉష్ట్ర = ఒంటెలు; గజములు = ఏనుగులు; కటి = నడుము; ప్రదేశము = భాగము; పశు = పశువులు {పశువులు - పాడి కై పెంచబడునవి}; మృగ = మృగములు {మృగములు - అడవిజంతువులు}; ఆదులు = మొదలగునవి; విచిత్రంబులు = విచిత్రములు - ప్రత్యేకములు; ఐన = అయినట్టి; ఆలాప = రాగ; నైపుణ్యంబులు = నేర్పరితనములు; పక్షులు = పక్షులు; బుద్ధి = బుద్ధి; మనువు = మనువు యొక్క; నివాసంబు = నివాసము; పురుషుండు = (పరమ) ఆత్మ; షడ్జ = షడ్జమము (ని); ఆదులు = మొదలగునవి; ఐన = అయిన; స్వర = (సప్త) స్వరములలోని; విశేషంబులు = రకములు; గంధర్వ = గంధర్వులు; విద్యాధర = విద్యాధరులు; చారణ = చారణలు; అప్సరస = అప్సరసలు యొక్క; సమూహంబులు = గుంపులు; స్మృతి = స్మరణలు; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; వీర్యంబు = వీరత్వము; దైత్య = రాక్షసులు; దానవా = దానవులు యొక్క; అనీకంబు = సేన; ఐ = అయి; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకనూ; ఆ = ఆ; మహా = గొప్ప; విభునకున్ = ప్రభువునకు; ముఖంబు = ముఖము; బ్రాహ్మణులునున్ = బ్రాహ్మణులును; భుజంబులు = భుజములు; క్షత్రియులునున్ = రాజులును; ఊరులు = తొడలు; వైశ్యులునున్ = వర్తకులును; చరణంబులు = పాదములు; శూద్రులునున్ = శూద్రులును; నామంబులు = పేర్లు; నానా = వివిధ; విధంబులు = విధములు; ఐన = అయిన; వసు = వసువులు; రుద్ర = రుద్రులు; ఆది = మొదలగు; దేవత = దేవతల; ఆభిదానంబులు = పేర్లు; ద్రవ్యంబులు = వస్తువులు; హవిర్భాగంబులును = హవిర్భాగములును {హవిర్భాగములు - హవిస్సు(అగ్నిహోత్రము అందు వేల్చుటకు ఇవురబెట్టిన అన్నము, నెయ్యి) లోని (దేవతాదులకు పంచబడు) భాగములు}; కర్మంబులు = కర్మలు, పూజనములు; యజ్ఞ = యజ్ఞములు; ప్రయోగంబులును = కార్యములును; అగున్ = అగును; ఇట్టి = ఇటువంటి; సర్వ = సర్వమును; మయుండు = నిండినవాడు - సర్వమయుడు; ఐన = అయినట్టి; పరమ = పరమమైన; ఈశ్వరుని = ప్రభువు యొక్క; విగ్రహంబు = విగ్రహమును - స్వరూపమును; ముముక్షువు = మోక్షమును కోరువాడు; ఐన = అయినట్టి; వాడు = మానవుడు; మనంబునన్ = మనస్సులో; అనుసంధానంబున్ = లగ్నముచేసికొనుట; చేయన్ = చేసి; వలయును = తీరవలెను; అని = అని; వక్కాణించి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- పరీక్షిత్తు విభుడా! విను, భగవంతుడైన విష్ణుని విరాటస్వరూపంలో జరిగిన, జరగనున్న, జరుగుతున్న ప్రపంచమంతా గోచరిస్తుంది. భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్త్వము అనే ఆవరణాలు ఏడూ మహాండకోశమైన విరాట్పురుషుని శరీరమే అయి ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు నెలవై విరాట్పురుషుడు ప్రకాశిస్తున్నాడు. ఆ మహాత్ముడికి పాతాళం అరికాలు; రసాతలం కాలిమడమ మునివ్రేళ్ళు; మహాతలం చీలమండలు; తలాతలం పిక్కలు; సుతలం మోకాళ్ళు రెండు; వితలము అతలము తొడలు; భూతలం పిరుదు; ఆకాశం బొడ్డు; గ్రహాలూ తారకలూ మొదలైన జ్యోతిస్సమూహంతో కూడిన నక్షత్రలోకం వక్షస్థలం; మహర్లోకం మెడ; జనలోకం ముఖం; తపోలోకం నొసలు; సత్యలోకం శిరస్సు; ఇంద్రుడు మొదలైనవారు భుజదండాలు; దిక్కులు చెవులు; శబ్దం శ్రోత్రేంద్రియం; అశ్వినీ దేవతలు ముక్కుపుటాలు; గంధం ఘ్రాణేంద్రియం; అగ్ని నోరు; అంతరిక్షం కళ్లు; సూర్యుడు నేత్రేంద్రియం; రేయింబవళ్ళు కనురెప్పలు; బ్రహ్మపదం కనుబొమలు; జలాలు దవడలు; రసం జిహ్వేంద్రియం; సమస్త వేదాలు భాషణాలు; తుదిలేని సృష్టులే కడగంటి చూపులు; సిగ్గు లోభం పెదవులు; ధర్మ మార్గాలు కడుపు; కొండలు ఎముకలు; నదులు నాడులు; చెట్లు రోమాలు; వాయువు నిట్టూర్పులు; కడలేని కాలమే ప్రాయం; పలువిధాలైన ప్రాణులతో గూడిన సంసారాలు కర్మలు; మబ్బులు శిరోజాలు; సంధ్యలు కట్టుబట్టలు; ప్రధానం హృదయం; చంద్రుడు వికారాలన్నింటికీ నెలవైన మనస్సు; మహత్తత్త్వం చిత్తం; రుద్రుడు అహంకారం; గుఱ్ఱాలు, కంచరగాడిదలు, ఒంటెలు, ఏనుగులు గోళ్ళు; పశువులు, మృగాదులు కటిప్రదేశం; పక్షులు చిత్రమైన మాటల నేర్పులు; మనువు బుద్ధి; పురుషుడు నివాసం; దానవులు వీర్యం. అంతేకాదు. ఆ మహాప్రభువునకు బ్రాహ్మణులు ముఖం; క్షత్రియులు బాహువులు; వైశ్యులు తొడలు; శూద్రులు పాదాలు; వసువులు రుద్రులు మొదలైన పెక్కు దేవతల పేర్లే నామాలు; హవిర్భాగాలు ద్రవ్యాలు; యజ్ఞప్రయోగాలు కర్మలు అవుతున్నాయి. ఇటువంటి విశ్వమయుడైన విరాట్పురుషుని విగ్రహాన్ని మోక్షార్థి అయినవాడు తన మనస్సులో అనుసంధానం చేసుకోవాలి.” అంటూ చెప్పి, ఇంకా ఈ విధంగా చెప్పసాగాడు శుకముని.
తెభా-2-17-క.
"హరిమయము విశ్వ మంతయు,
హరి విశ్వమయుండు, సంశయము పనిలే దా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన; వింటే.
టీక:- హరి = విష్ణువుతో; మయమున్ = నిండినది; విశ్వము = విశ్వము - సృష్టి; అంతయున్ = అంతా; హరి = విష్ణువు; విశ్వము = విశ్వము అంతా; మయుండు = నిండినవాడు; సంశయమున్ = అనుమానము; పనిలేదు = అవసరము లేదు; ఆ = ఆ; హరి = విష్ణువుతో; మయమున్ = నిండినది; కాని = కాకుండు; ద్రవ్యము = వస్తువు; పరమాణువున్ = పరమాణువు కూడా; లేదు = లేదు; వంశ = వంశమును; పావనా = పావనముచేసిన వాడా; వింటే = తెలుసుకొంటే.
భావము:- "కురు కులపావనుడ వైన రాజా! విశ్వమంతా విష్ణుమయం. విష్ణువు విశ్వమయుడు. ఇందులో సందేహం లేదు. విష్ణుమయం కాని పదార్థం ఈ ప్రపంచంలో ఒక్క పరమాణువు కూడా లేదు. వింటున్నావా!
తెభా-2-18-సీ.
కలలోన జీవుండు కౌతూహలంబునఁ-
బెక్కు దేహంబులఁ బేరువడసి,
యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు-
నీక్షించి మఱి తన్ను నెఱుఁగు కరణి,
నఖిలాంతరాత్మకుఁడగు పరమేశ్వరుఁ-
డఖిల జీవుల హృదయముల నుండి
బుద్ధి వృత్తుల నెల్ల బోద్ధ యై వీక్షించు-
బద్ధుండు గాఁడు ప్రాభవము వలన,
తెభా-2-18.1-తే.
సత్యుఁ డానంద బహుళ విజ్ఞానమూర్తి
యతని సేవింప నగుఁగాక, యన్యసేవఁ
గలుగనేరవు కైవల్య గౌరవములు
పాయ దెన్నఁడు సంసారబంధ మధిప!
టీక:- కల = కల - స్వప్నము; లోనన్ = లో; జీవుండు = ప్రాణి; కౌతూహలమునన్ = కుతూహలముతో; పెక్కు = అనేకమైన; దేహంబులన్ = శరీరములలో; పేరున్ = కీర్తులు; పడసి = పొంది; ఇంద్రియంబులన్ = ఇంద్రియముల; వెంటన్ = వలన; ఎల్ల = అన్ని; వృత్తములున్ = విషయములు; ఈక్షించి = చూసిన; మఱిన్ = అప్పటికిని; తన్నున్ = తనను; ఎఱుంగున్ = తెలియును; కరణిన్ = ఆవిధముగనే; అఖిల = సమస్తములకును; అంతరాత్మకుఁడు = లోపల ఉండు ఆత్మ ఐన వాడు; అగు = అయినట్టి; పరమ = పరమమైన; ఈశ్వరుండు = ప్రభువు; అఖిల = సమస్త; జీవుల = జీవుల యొక్క; హృదయములన్ = హృదయములలోను; ఉండి = ఉండి; బుద్ధి = బుద్దులను; వృత్తులన్ = ప్రవర్తనలను; ఎల్లన్ = అన్నిటిని; బోద్ధ = తెలిసికొనువాడు - జ్ఞాని; ఐ = అయ్యి; వీక్షించున్ = చూచుచుండును; బద్దుండున్ = బంధింపబడినవాడు; కాడు = కాకుండును; ప్రాభవము = ప్రభుత్వము - నడపు అదికారము {ప్రాభవము - ప్రభావము కలిగి ఉండుట - ప్రభావము చేయ కలవాడు ప్రభువు అతని తత్వము ప్రభుత్వము}; వలనన్ = వలన;
సత్యుఁడు = సత్యమైన వాడు; ఆనంద = ఆనందము; బహుళ = మిక్కిలి; విజ్ఞాన = విజ్ఞానము లకు; మూర్తి = స్వరూపుడు; అతనిన్ = అతనిని; సేవింపన్ = సేవించుట; అగున్ = తగును; కాఁక = కాకుండగ; అన్య = ఇతరమైన; సేవన్ = సేవిండుటలు వలన; కలుగన్ = కలుగట; నేరవు = జరుగవు; కైవల్య = మోక్షముపొందుటను; గౌరవములున్ = గౌరవములు; పాయదు = వదలదు; ఎన్నడున్ = ఎప్పటికిని; సంసార = సంసారముయొక్క; బంధమున్ = బంధనములు; అధిపా = గొప్పవాడా - రాజా.
భావము:- రాజా! కలలు కనేటప్పుడు జీవుడు ఉబలాటంతో పలు శరీరాలు తాలుస్తాడు. పలుపేర్లతో వ్యవహరింప బడతాడు. ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గమనిస్తాడు. పిమ్మట మెళకువ వచ్చిన తరువాత, తన్ను తాను తెలుసుకుంటాడు. ఇలాగే సమస్తానికి అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు, సర్వ ప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధివ్యాపారా లన్నింటినీ పరిశీలిస్తుంటాడు. తానే అన్నిటికీ ప్రభువు కాబట్టి, దేనికీ బద్ధుడు కాడు. తాను సత్యస్వరూపుడు. ఆనదంతో నిండిన విజ్ఞానమూర్తి. ఆయన సేవ వల్లే మోక్షం సిద్ధిస్తుంది. ఇతరులను కొలిస్తే మోక్షం లభించదు. ఈ సంసార బంధం వదలదు.
తెభా-2-19-మ.
బహు వర్షంబులు బ్రహ్మ తొల్లి జగ ముత్పాదింప విన్నాణి గా
క హరిప్రార్థన ధారణా వశమునం గాదే; యమోఘోల్లస
న్మహనీయోజ్వల బుద్ధియై భువననిర్మాణప్రభావంబుతో
విహరించెన్ నరనాథ! జంతునివహావిర్భావనిర్ణేతయై.
టీక:- బహు = చాలా; వర్షంబులున్ = సంవత్సరములు వరకు; బ్రహ్మ = బ్రహ్మ; తొల్లి = పూర్వము; జగమున్ = జగత్తును - లోకములను; ఉత్పాదింపన్ = సృష్టి చేయుటకు; విన్నాణిన్ = నేర్పు కలవాడు; కాక = కాకపోయి; హరిన్ = విష్ణుమూర్తి; ప్రార్థనన్ = ప్రార్థన యొక్క; ధారణా = ధారణము; వశంబునన్ = వలననే; కాదే = కదా; అమోఘ = అమోఘమైన, వ్యర్థము గాని; ఉల్లసత్ = విప్పారుతున్న; మహనీయ = గొప్పదైన, గౌరవింపదగిన దైన; ఉజ్వల = ప్రకాశించుతున్న; బుద్ధి = బుద్ధి బలము కలవాడు; ఐ = అయి; భువన = విశ్వమును; నిర్మాణ = నిర్మించగలుగు; ప్రభావంబు = శక్తి; తోన్ = తో; విహరించెన్ = ప్రవర్తిల్లెను; నరనాథ = రాజా; జంతు = జంతువుల; నివహ = సమూహముల; ఆవిర్భావ = ఆవిర్భవించుటను, పుట్టుటను; నిర్ణేత = నిర్ణయించువాడు; ఐ = అయి.
భావము:- మహారాజా! పరీక్షిత్తు! పూర్వం ఆదిలో బ్రహ్మ జగత్తును సృష్టించాలనుకొన్నాడు. పెక్కేండ్లు ప్రయత్నించాడు. అయినా నేర్పరి కాలేకపోయాడు. ఆ పైన ఏకాగ్రచిత్తంతో నారాయణుని ప్రార్థించాడు. మహోన్నతమైన బుద్ధి వికాసం పొందాడు. పిమ్మట ప్రాణి కోట్ల పుట్టుకను నిర్ణయించి జగన్నిర్మాణదక్షుడై విహరించాడు.