పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/మాయా ప్రకారంబు

వికీసోర్స్ నుండి


తెభా-2-251-క.
యఁగఁ గల్పప్రళయాం
మున నాద్యంత విరహిక్రియతోడం
రిపూర్ణ నిత్య మహిమం
మాత్ముఁడనై సరోజవ యే నుందున్.

టీక:- అరయఁగన్ = తెలిసికొనినచో; కల్ప = కల్పములు; ప్రళయన్ = ప్రళయములు; అంతరమునన్ = లోపలను; ఆది = మొదలు; అంత = తుది; విరహిత = లేని; క్రియ = విధము; తోడన్ = తో; పరిపూర్ణ = సంపూర్ణమైన; నిత్య = శాశ్వతమైన; మహిమన్ = మహిమతో, ప్రభావముతో; పరమాత్ముడనున్ = పరమాత్ముడను; ఐ = అయి; సరోజ = పద్మము నందు; భవ = పుట్టిన వాడ; ఏను = నేను; ఉందున్ = ఉంటాను.
భావము:- ఓ కమలసంభవుడ! బ్రహ్మదేవుడ! కల్పాంతమున వచ్చే ప్రళయకాలంలో కూడ ఆది అంతము లేని విధంగా సంపూర్ణ శాశ్వత మహత్వముతోటి పరమాత్ముడనుగా నేను ప్రకాశిస్తుంటాను అని తెలిసికొనుము. అని హరి తత్త్వము మరియు బోధించసాగాడు.

తెభా-2-252-వ.
అదియునుంగాక నీవు నన్నడిగిన యీజగన్నిర్మాణ మాయా ప్రకారం బెఱింగింతు; లేని యర్థంబు శుక్తిరజతభ్రాంతియుంబోలె నేమిటి మహిమం దోఁచి క్రమ్మఱఁ దోఁపకమాను నదియె మదీయ మాయావిశేషం బని యెఱుంగు; మదియునుంగాక లేని యర్థంబు దృశ్యమానం బగుటకును, గల యర్థంబు దర్శనగోచరంబు గాకుండుటకును, ద్విచంద్రాదికంబును దమఃప్రభాసంబును దృష్టాంతంబులుగాఁ దెలియు మే ప్రకారంబున మహాభూతంబులు భౌతికంబు లయిన ఘటపటాదులందుఁ బ్రవేశించి యుండు నా ప్రకారంబున నేను నీ భూతభౌతికంబులయిన సర్వకార్యంబు లందు సత్త్వాది రూపంబులం బ్రవేశించి యుందు; భౌతికంబులు భూతంబు లందుం గారణావస్థం బొందు చందంబున భూత భౌతికంబులు గారణావస్థం బొంది నా యందు నభివ్యక్తంబులై యుండవు; సర్వదేశంబుల యందును, సర్వకాలంబుల యందును నేది బోధితంబై యుండు నట్టిదియ పరబ్రహ్మస్వరూపంబు; తత్త్వంబెఱుంగ నిచ్ఛించిన మిము బోఁటి వారలకు నీ చెప్పిన మదీయతత్త్వాత్మకంబైన యర్థంబ యర్థం బని యెఱుంగుదురు; ఈ యర్థం బుత్కృష్టం బయినయది యేకాగ్రచిత్తుండవై, యాకర్ణించి భవదీయచిత్తంబున ధరియించిన నీకు సర్గాది కర్మంబు లందు మోహంబు సెందకుండెడి;"నని భగవంతుండయిన పరమేశ్వరుండు చతుర్ముఖున కానతిచ్చి నిజలోకంబుతో నంతర్థానంబు నొందె;"నని చెప్పి శుకుండు వెండియు నిట్లనియె.
టీక:- అదియునుం = అంతే; కాక = కాకుండగ; నీవున్ = నీవు; నన్నున్ = నన్ను; అడిగిన = అడిగిన; ఈ = ఈ; జగత్ = లోకముల; నిర్మాణ = నిర్మాణము యొక్క; మాయా = రహస్య విధానము; ప్రకారంబున్ = వివరమును; ఎఱింగితున్ = తెలిపెదను; లేని = లేనట్టి; అర్థంబున్ = విషయమును; శుక్తి = ముత్యపు చిప్ప అందలి; రజత = వెండి ఉన్నట్లు కలుగు; భ్రాంతియున్ = భ్రమ; పోలెన్ = వలె; ఏమిటి = దేని; మహిమన్ = ప్రభావము వలన; తోఁచిన్ = ఉన్నట్లు అనిపించి, కనిపించి; క్రమ్మఱఁన్ = మరల; తోఁపకన్ = తోచక ఉండు, కనిపించని; అదియ = అదియే; మదీయ = నా యొక్క; మాయా = మాయ యొక్క; విశేషంబు = ప్రత్యేకత; అని = అని; ఎఱుంగుము = తెలియుము; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; లేని = లేనట్టి; అర్థంబున్ = విషయమును; దృశ్యమానంబున్ = కనిపించునది; అగుటకునున్ = అగుటకు; కల = అయిన; అర్థంబున్ = కారణమును; దర్శన = చూచుటకును; గోచరంబున్ = కనిపించునది; కాన్ = అయి; ఉండుటకునున్ = ఉండుటకును; ద్వి = ఇద్దరు; చంద్ర = చంద్రులు తోచుట; ఆదికంబునున్ = మొదలైనవియును; తమస్ = చీకటి; ప్రభాసంబునున్ = వ్యాపించునట్లు తోచుట; దృష్టాంతములుగాన్ = ఉదాహరణలుగా; తెలియుము = తెలిసికొనుము; ఏ = ఏ; ప్రకారంబునన్ = విధముగ నైతే; మహాభూతంబులున్ = మహాభూతములు {మహాభూతములు - పంచభూతములు మరియు మనసు}; భౌతికంబులు = భౌతికములు {భౌతికములు - భౌతిక స్వరూపము కలవి}; అయిన = అయినట్టి; ఘట = కుండలు; పట = వస్త్రములు; అందుఁన్ = లలో; ప్రవేశించి = చేరి; ఉండున్ = ఉండునో; ఆ = ఆ; ప్రకారంబునన్ = విధముగనే; నేను = నేను; ఈ = ఈ; భూత = భూతములతో కూడి; భౌతికంబులు = భౌతికములు; అయిన = అయినట్టి; సర్వ = సర్వమైన; కార్యంబున్ = కార్యములు {కార్యములు - కారణముల వలన కలుగునవి}; అందున్ = అన్నిటను; సత్త్వాదిన్ = సత్త్వాది, జీవులు మొదలైన; రూపంబులన్ = రూపములలో; ప్రవేశించి = చేరి; ఉందున్ = ఉండెదను; భౌతికంబులు = భౌతికములైనవి {భౌతికములు - భౌతిక స్వరూపము కలవి, సమస్త సృష్టి}; భూతంబులు = మహాభూతములు {మహాభూతములు - పంచభూతములు మరియు మనసు}; అందున్ = అందున; కారణా = కారణమైన; అవస్థన్ = స్థితిని; పొందున్ = పొందు; చందంబునన్ = విధముగ; భూత = సమస్త భూతములు; భౌతికంబులున్ = భౌతికములును; కారణ = కారణమైన; అవస్థన్ = స్థితిని; పొందిన్ = పొంది; నా = నా; అందున్ = లో; అభివ్యక్తంబులు = కనిపించునవి, రూపములు కలవి; ఐ = అయి; ఉండవు = ఉండవు; సర్వ = సర్వమైన; దేశంబులన్ = ప్రదేశములు; అందునున్ = లోను; సర్వ = సర్వమైన; కాలంబులన్ = సమయములు; అందునున్ = లోను; ఏది = ఏదయితే; బోధితంబున్ = తెలియబడుతు; ఐ = అయి; ఉండున్ = ఉంటుందో; అట్టిదియ = అదియె; పరబ్రహ్మ = పరబ్రహ్మ యొక్క; స్వరూపంబున్ = స్వరూపము యొక్క; తత్త్వంబున్ = పరమ తత్త్వమును {తత్త్వము - మొత్తం సృష్టి యొక్క యదార్థ స్థితి}; ఎఱుంగన్ = తెలిసికొన; ఇచ్చించిన = కోరుచున్న; మిమున్ = మీ; బోఁటిన్ = వంటి; వారలకున్ = వారి; కున్ = కి; నీ = నీకు; చెప్పిన = చెప్పిన; మదీయ = నా యొక్క; తత్త్వ = తత్త్వము యొక్క; ఆత్మకంబున్ = లక్షణము; ఐనన్ = అయిన; అర్థంబ = అర్థమే; అర్థంబున్ = అర్థము; అని = అని; ఎఱుంగుము = తెలియుము; ఈ = ఈ; అర్థంబ = అర్థమే; ఉత్కృష్టంబున్ = ప్రశస్తమైనది; అయినయది = అయినట్టిది; ఏకాగ్రన్ = ఏకాగ్రమైన {ఏకాగ్రము - ఒకే దాని యందు కేంద్రీకరింప బడినది}; చిత్తుండవున్ = మనసు కలవాడవు; ఐ = అయి; ఆకర్ణించిన్ = విని; భవదీయ = నీ యొక్క; చిత్తంబునన్ = మనసులో; ధరియించినన్ = తాల్చినచో; నీకున్ = నీకు; సర్గ = సృష్టించుట; ఆది = మొదలగు; కర్మంబులు = కర్మములు; అందున్ = అందు; మోహంబున్ = మోహమును {మోహము - నిజము కానిదాని యందు తగులము ఏర్పడుట}; చెందక = పొందకుండగ; ఉండెడి = ఉండును; అనిన్ = అని; భగవంతుండు = భగవంతుడు {భగవంతుడు - సమస్త మహిమలు కలవాడు}; అయిన = అయినట్టి; పరమేశ్వరుండున్ = పరమేశ్వరుండు {పరమేశ్వరుడు - అత్యున్నత ప్రభుత్వము కలవాడు}; చతుర్ముఖున్ = చతుర్ముఖ బ్రహ్మ {చతుర్ముఖుడు - నాలుగు ముఖములు ఉండువాడు, బ్రహ్మదేవుడు}; కిన్ = కి; ఆనతి = చెప్పి అనుగ్రహము; ఇచ్చి = ప్రసాదించి; నిజ = తన యొక్క; లోకంబున్ = లోకము; తోన్ = తోసహా; అంతర్థానంబున్ = అంతర్థానమును {అంతర్థానము - అదృశ్యము, లోపలి స్థానము}; ఒందెన్ = పొందెను; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండున్ = శుకుడు; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అంతేకాకుండ, ఈ జగత్తు సృష్టింపబడిన విధానాలను నువ్వు అడిగావు కదా వివరిస్తాను శ్రద్ధగా విను. ఆల్చిప్పలలో వెండి ఉన్నట్లు బ్రాంతి కలుగుతుంది. తరచి చూసినచో లేదని తెలుస్తుంది. అలాగే ఏదైతే లేకుండానే ఉన్నట్లు భ్రాంతి కనబడుతుంటుందో. సరిగా చూస్తే లేదని తెలుస్తుంది. దానినే నా మాయగా గ్రహించు. అంతేగాకుండా లేనిది ఉన్నట్లు కనబడుటకు, ఉన్నది లేనట్లు అనిపించుటకు, ఇద్దరు చంద్రుళ్ళు ఆకాశంలో ఒకరు, కింద నీటిలో ఒకరు ఉన్నట్లు కనబడుటకు, చీకట్లు వ్యాపించినట్లు అనిపించుటకు నా మాయాప్రభావంతో కలిగెడి భ్రాంతులుగా తెలిసికొనుము. ఏవిధంగా అయితే ఆకాశం, నిప్పు, వాయువు, నీరు, భూమి, మనస్సు భౌతిక స్వరూపాలు కలిగిన కుండ, బట్ట మున్నగువాని యందు ప్రవేశించి ఉంటాయో. అదేవిధంగా నేను భూతములు, భౌతికములు సమస్తమునందు జీవు లందు ప్రవేశించి కార్య రూపంలో ఉంటాను. భౌతికమైనవి, భూతములకు కారణభూతములై ఉంటాయి. అలాగే సర్వ భూతములు, భౌతికములు కారణభూతములై నాయందు కనబడలేవు. సర్వప్రదేశములలో సర్వకాలములలో ఏదైతే తెలియబడుతుంటుందో అదే బ్రహ్మస్వరూపం. నీవంటి తత్త్వ జిజ్ఞాసువులకు నీకు చెప్పబడినదే సత్యం అని తెలియుము. ఇదే సర్వోత్కృష్ట మయినది. కనుక ఏకాగ్ర దృష్టితో వినుము. నీ మనస్సులో పదిలముగ నిలుపుకొనుము. నీకు సృష్టించుట మున్నగు కార్యములలో మోహం కలుగకుండ ఉంటుంది". అని వైకుంఠుడు చతుర్ముఖ బ్రహ్మకు వివరించి వైకుంఠంతో సహా అంతర్థానం అయ్యాడు."ఈ విధంగా శుకముని పరీక్షిత్తు మహారాజుకి వివరించి ఇంకా చెప్పసాగాడు.

తెభా-2-253-సీ.
"వనీశ! బ్రహ్మ యిట్లంతర్హితుండైనఁ-
బుండరీకాక్షుని బుద్ధినిలిపి
యానందమునఁ బొంది యంజలి గావించి-
త్పరిగ్రహమునఁ నదు బుద్ధిఁ
గైకొని పూర్వప్రకారంబునను సమ-
స్తప్రపంచంబును గ సృజించి
ఱియొక నాఁడు ధర్మప్రవర్తకుఁ డౌచు-
ఖిల ప్రజాపతియైన కమల

తెభా-2-253.1-తే.
ర్భుఁ డాత్మహితార్థమై కాక సకల
భువనహితబుద్ధి నున్నత స్ఫురణ మెఱసి
మానితంబైన యమ నియములు రెంటి
నాచరించెను సమ్మోదితాత్ముఁ డగుచు.

టీక:- అవనీశ = రాజా {అవనీశుడు - అవనికి (భూమికి) ఈశుడు (ప్రభువు)}; బ్రహ్మ = బ్రహ్మ దేవుడు; ఇట్లు = ఈ విధముగ; అంతర్హితుండు = అదృశ్యుడు; ఐనఁన్ = అవ్వగా; పుండరీకాక్షునిన్ = పుండరీకాక్షుని {పుండరీకాక్షుడు - పుడరీక (తెల్లకలువ) వంటి అక్షుడు}; బుద్ధిన్ = బుద్ధి యందు; నిలిపి = నిలిపుకొని; ఆనందమునన్ = ఆనందమును; పొందిన్ = పొంది; అంజలి = చేతులు జోడించి నమస్కారము; కావించి = చేసి; తత్ = అతడు; పరిగ్రహంబునన్ = స్వీకరించుటను; తనదున్ = తన; బుద్ధిన్ = మనసున; కైకొని = గ్రహించి; పూర్వ = ముందటి; ప్రకారంబునన్ = విధముగనే; సమస్త = సమస్తమైన; ప్రపంచంబునున్ = ప్రపంచమును; తగన్ = తగినట్లుగ; సృజించి = సృష్టించి; మఱియొకన్ = ఇంకొక; నాఁడున్ = రోజు; ధర్మ = ధర్మమును అనుసరించి; ప్రవర్తకుఁడు = నడచువాడు; ఔచున్ = అగుచు; అఖిల = సమస్తమైన; ప్రజ = ప్రజలకును, సృష్టికిని; పతి = అధిపతి; ఐనఁన్ = అయిన; కమల = కమలమున;
గర్భుఁడు = పుట్టినవాడు; ఆత్మ = తన; హిత = మేలు; అర్థము = కోసము; ఐ = అయ్యి; కాక = కాకుండగ; సకల = సమస్తమైన; భువన = లోకముల; హిత = మేలు కొరకైన; బుద్ధిన్ = బుద్ధితో; ఉన్నత = గొప్ప; స్పురణన్ = ఆలోచనతో; మెఱసి = అతిశయించి; మానితంబున్ = గౌరవింపదగినది; ఐనఁన్ = అయిన; యమ = యమము {యమము - అంతరింద్రియ నిగ్రహము}; నియమము = నియమము {నియమము - బహిరింద్రియ నిగ్రహము}; రెంటిన్ = రెండింటిని; ఆచరించెన్ = అచరించెను; సమ్మోదిత = సంతోషము తోకూడిన; ఆత్ముఁడు = మనసు కలవాడు; అగుచున్ = అగుచు.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! ఆ విధంగా మాయమైపోయిన పద్మాక్షుడు శ్రీమన్నారాయణమూర్తిని హృదయంలో నిలుపుకొని ఆనందాన్ని పొందాడు. చేతులు జోడించి నమస్కరించాడు. ఆయన అనుగ్రహాన్ని తలచుకుంటు ఇదివరకులాగే సమస్తమైన ప్రపంచాన్ని చక్కగా సృష్టించసాగాడు. తరువాత ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు సర్వలోకాలకు మేలు ఒనగూర్చుటకొరకు గొప్ప ధర్మప్రవర్తకునిగా పూజితములైన యమనియమాలను రెంటినీ సంతోషచిత్తుడై ఆచరించాడు.

తెభా-2-254-వ.
అయ్యవసరంబున.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయమున.
భావము:- అలా బ్రహ్మదేవుడు తపస్సు చేసెడి సమయంలో.

తెభా-2-255-క.
లినాసన నందను
లై సనందాది మునుల గ్రేసరుఁడున్
మానుగఁ బ్రియతముఁడును నగు
నా నారదుఁ డేగుదెంచె బ్జజు కడకున్.

టీక:- ఆ = ఆ; నలినన్ = తామరపువ్వునందు {నలినాసననందనులు - నళిన (తామరపువ్వు) లో ఆసన (కూర్చున్న వాడు, బ్రహ్మదేవుడు) నందనులు (పుత్రులు), నారదుడు మరియు సనకసనందనాదులగు యోగులు}; ఆసనన్ = కూర్చున్నవాని, బ్రహ్మదేవుని; నందనున్ = పుత్రులు; ఐన = అయిన; సనంద = సనందుడు; ఆది = మొదలగు; మునులున్ = మునుల; కున్ = కు; అగ్రేసరుఁడున్ = పెద్దవాడును; మానుఁగన్ = మానుగ, చక్కగ; ప్రియతముఁడునున్ = అత్యంత ప్రియమైనవాడు {ప్రియ - ప్రియతరము - ప్రియతమము}; అగున్ = అయిన; ఆ = ఆ; నారదుఁడున్ = నారదుడు; ఏగుదెంచెన్ = వచ్చెను; అబ్జజున్ = బ్రహ్మదేవుని {అబ్జజుడు - అబ్జము (పద్మము) అందు జుడు (పుట్టినవాడు)}; కడకున్ = వద్దకు.
భావము:- కమలజుడైన బ్రహ్మదేవుని దగ్గరకి తనకు ప్రియపుత్రుడు, సనకసనందాదులకు అన్నగారు అయిన నారదమహర్షి వచ్చాడు.

తెభా-2-256-క.
నుదెంచి తండ్రికిం బ్రియ
మొరఁగ శుశ్రూషణంబు లొనరిచి యతఁడుం
దెసఁ బ్రసన్నుఁ డగుటయుఁ
ని భగవన్మాయ దెలియఁగా నుత్సుకుఁడై.

టీక:- చనుదెంచి = వచ్చి; తండ్రిన్ = తండ్రి; కిన్ = కి; ప్రియము = ప్రీతి; ఒనరఁగన్ = కలుగునట్లు; శుశ్రూషణంబులున్ = సేవలు; ఒనరిచి = కలిగించి, చేసి; అతఁడున్ = అతను; తన = తన; దెసఁన్ = వైపు, అందు; ప్రసన్నుఁడు = ప్రసన్నుడు; అగుటయుఁన్ = అగుట; కని = చూసి; భగవత్ = భగవంతుని; మాయన్ = మాయను; తెలియఁగాన్ = తెలిసికొన; ఉత్సుకుఁడు = కుతూహలము కలవాడు; ఐ = అయి.
భావము:- అలా వచ్చిన నారదమహర్షి తండ్రి యైన బ్రహ్మదేవునికి శుశ్రూషలు చేసి, ప్రసన్నుడగుట గమనించి భగవంతుని మాయని వివరంగా తెలుపమని కుతూహలంగా అడిగాడు.