పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/హేమంతఋతు వర్ణనము
తెభా-10.1-799-క.
శామంతికా స్రగంచిత
సీమంతవతీ కుచోష్ణజితశీతభయ
శ్రీమంతంబై గొబ్బున
హేమంతము దోఁచె; మదనుఁ డేఁచె విరహులన్.
టీక:- శామంతికా = చేమంతిపూల; స్రక్ = దండచేత; అంచిత = అలంకరింపబడిన; సీమంతవతీ = పాపటలు కలిగిన స్త్రీల; కుచ = పాలిండ్ల; ఉష్ణ = వేడిచేత; జిత = జయింపబడిన; శీత = చలివలని; భయ = భయము అనెడి; శ్రీమంతంబు = సంపదలు కలిగినవారు; ఐ = అయ్యి; గొబ్బున = తటాలున; హేమంతము = చలికాలము; తోచెన్ = కనబడెను; మదనుడు = మన్మథుడు; ఏచెన్ = బాధించెను, పీడించెను; విరహులన్ = విరహము కలవారిని.
భావము:- ఇంతలో శ్రీమంతమైన హేమంతం ప్రవేశించేసింది. చేమంతి పూలు ధరించిన పూబంతుల చనుబంతల వేడిమిచే చలి భయాన్ని జంటలు జయించారు. కాని, వియోగులను మన్మథుడు వేధించాడు.
తెభా-10.1-800-క.
ఉత్తరపుగాలి విసరె వి
యత్తలమునఁ దుహినకిరణుఁ డహితుం డయ్యెం
బొత్తు జరిగె మిథునములకు
నెత్తమ్ములు దఱిగె హిమము నెలకొనియె నృపా!
టీక:- ఉత్తరపు = ఉత్తరదిక్కునుండి వచ్చెడి; గాలి = గాలి; విసరెన్ = వీచెను; వియత్తలమునన్ = ఆకాశము నందు; తుహినకిరణుండు = చంద్రుడు {తుహిన కిరణుడు - తుహిన (మంచువలె చల్లని) కిరణములు కలవాడు, చంద్రుడు}; అహితుడు = అయిష్టుడు; అయ్యెన్ = అయ్యెను; పొత్తు = కలియుట; జరిగెన్ = జరిగినది; మిథునముల = దంపతుల; కున్ = కు; నెఱి = వికసించిన; తమ్ములు = కమలములు; తఱిగెన్ = తగ్గెను; హిమము = మంచు; నెలకొనియె = వ్యాపించెను; నృపా = రాజా.
భావము:- రాజా పరీక్షిత్తూ! హేమంతం రాకతో ఉత్తరపు గాలులు వీచాయి. ఆకాశంలో ఉండి చలివెలుగు ఇచ్చే చంద్రుడు విరహాలకు సహింపరాని వాడయ్యాడు. దంపతులకు పొత్తు కుదిరింది. అంతటా మంచు అలుముకుంది. తామరలకు శోభ తరిగిపోయింది.
తెభా-10.1-801-క.
అహములు సన్నము లయ్యెను
దహనము హితమయ్యె దీర్ఘదశ లయ్యె నిశల్;
బహు శీతోపేతంబై
యుహుహూ యని వడఁకె లోక ముర్వీనాథా!
టీక:- అహములున్ = పగటిసమయములు; సన్నములు = తగ్గినవి; అయ్యెను = అయ్యెను; దహనము = అగ్ని; హితము = ఇష్టము కలది; అయ్యెన్ = అయినది; దీర్ఘ = ఎక్కువ; దశలు = కాలముండునవి; అయ్యెన్ = అయినవి; నిశల్ = రాత్రులు; బహు = మిక్కిలి; శీత = చలితో; ఉపేతంబు = కూడినవి; ఐ = అయ్యి; ఉహుహూ = ఉహుహూ అను ధ్వనితో; వడకెన్ = వణకిపోయెను; లోకము = జగత్తు; ఉర్వీనాథా = రాజా {ఉర్వీనాథుడు - ఉర్వి (భూమికి, రాజ్యమునకు) నాథుడు, రాజు}.
భావము:- ఓ పరీక్షన్మహారాజా! పగలు కాలాలు తగ్గిపోయాయి. మంటల వెచ్చదనం ఇష్టమైంది. రాత్రి సమయాలు పెరిగాయి. చలి ఎక్కువై లోకం “ఉహుహూ” అంటూ వణికింది హేమంతంలో.
తెభా-10.1-802-క.
అన్నుల చన్నుల దండ వి
పన్నులు గా కెల్లవారు బ్రతికిరిగా కీ
చన్నుల మీఱిన వలి నా
పన్నులు గా కుండఁ దరమె బ్రహ్మాదులకున్.
టీక:- అన్నుల = స్త్రీల యొక్క {అన్ను - పరవశింప చేయునామె, స్త్రీ}; చన్నుల = పాలిండ్ల; దండన్ = ప్రాపుచేత, అండచేత; విపన్నులు = ఆపదపొందినవారు; కాక = కాకుండగ; ఎల్ల = అందరు; వారున్ = జనులు; బ్రతికిరి = కాపాడబడిరి; కాక = తప్పించి; ఈ = ఈ యొక్క; చన్నులన్ = పాలిండ్లను; మీఱినన్ = లెక్కచేయకపోయినచో; వలిన్ = చలిచేత; ఆపన్నులు = ఆపదలు పొందినవారు; కాకుండన్ = కాకుండుట; తరమె = శక్యమా, కాదు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల = మొదలగువారల; కున్ = కు.
భావము:- ఈ హేమంత ఋతువులో పడతుల పయోధరాల చెంత ప్రజలందరు ఆపదకు లోనుగాకుండ జీవింప గలుగుతున్నారు. వాటి అండే లేకపోతే బ్రహ్మాది దేవతల కైనా చలిబాధ తట్టుకోడం సాధ్యం కాదు కదా.
తెభా-10.1-803-ఆ.
పొడుపుఁగొండమీఁద పొడిచిన మొదలుగాఁ
బరువుపెట్టి యినుఁడు పశ్చిమాద్రి
మఱుఁగుఁ జొచ్చెఁ గాక మసలినఁ జలిచేతఁ
జిక్కెఁజిక్కె ననఁగఁ జిక్కకున్నె.
టీక:- పొడుపు = పొద్దుపొడుపు; కొండ = కొండ; మీద = పైన; పొడిచిన = ఉదయించినది; మొదలుగాన్ = మొదలు పెట్టి; పరువుపెట్టి = పరుగెట్టి; ఇనుడు = సూర్యుడు; పశ్చిమ = పడమరవైపున్న; అద్రి = కొండ; మఱుగున్ = చాటునకు; చొచ్చెన్ = దాగెను; కాక = కాని; మసలినన్ = ఆలస్యము చేసినచో; చలి = చలి; చేతన్ = వలన; చిక్కెజిక్కెన్ = బలే చిక్కిపోయాడు; అనగన్ = అని పరిహాసము చేయగా; చిక్కకన్ = చిక్కకుండ; ఉన్నె = ఉండునా, ఉండడు;
భావము:- సూర్యుడు ఉదయాద్రి మీద ఉదయించింది మొదలు ఎక్కడా ఆగకుండా పరుగులుతీసి అస్తమాద్రి మాటున చేరుకున్నాడు. అలాకాకుండా దారిలో ఆలస్యం చేసి ఉంటే, “చిక్కాడు చిక్కా”డని పరిహసం చేసేలా చలి చేతిలో చిక్కి ఉండే వాడు కదా ఈ హేమంతంలో.
తెభా-10.1-804-క.
చెంగల్వ విరుల గంధము
మంగళముగఁ గ్రోలుచున్న మధుపము లొప్పె
న్నంగజ వహ్నులపై ను
ప్పొంగి విజృంభించు పొగల పోలిక నధిపా!
టీక:- చెంగల్వ = ఎఱ్ఱకలువ {చెంగల్వ - చెన్ను (ఎఱ్ఱదనము కలిగిన) కల్వ (కలువపువ్వు)}; విరుల = పూల యొక్క; గంధము = సువాసన; మంగళముగన్ = మిక్కిల మేలుగా; క్రోలుచున్న = తాగుచున్న; మధుపములు = తుమ్మెదలు; ఒప్పెన్ = చక్కగానున్నవి; అంగజ = మన్మథ; వహ్నులు = అగ్నుల; పైన్ = మీద; ఉప్పొంగి = మిక్కిలిగ సంతోషించి; విజృభించి = చెలరేగునట్టి; పొగల = ధూమముల; పోలికన్ = వలె; అధిపా = రాజా.
భావము:- ఓ పరీక్షన్మహారాజా! హేమంతంలో ఎఱ్ఱకలువ పూవుల పరిమళం శుభప్రదంగా ఆస్వాదిస్తున్న తుమ్మెదలు మన్మథాగ్నుల మీదనుండి ఉవ్వెత్తుగా పైకెగసే పొగల వలె పొడకట్టాయి.
తెభా-10.1-805-ఆ.
శంభుకంట నొకటి జలరాశి నొక్కటి
మఱియు నొకటి మనుజ మందిరముల
నొదిగెఁగాక మెఱసియున్న మూడగ్నులు
చలికి నులికి భక్తి సలుపకున్నె?
టీక:- శంభు = శివుని; కంటన్ = కంటియందు; ఒకటి = ఒకటి; జలరాశిన్ = సముద్రమునందు; ఒక్కటి = ఒకటి; మఱియున్ = ఇంకను; ఒకటి = ఒకటి; మనుజ = మానవుల; మందిరములన్ = నివాసములందు; ఒదిగెన్ = దాగెను; కాకన్ = లేకపోయినచో; మెఱసి = బహిరంగముగామెలగుచు; ఉన్నన్ = ఉండినచో; మూడగ్నులు = త్రేతాగ్నులు మూడు {త్రేతాగ్నులు - 1గార్హపత్యము 2ఆహవనీయము 3దక్షిణాగ్నులు అనెడి మూడు అగ్నులు}; చలి = చలి; కిన్ = కి; ఉలికి = అదిరిబెదిరి; భక్తి = సేవ; సలుపకన్ = చేయకుండగా; ఉన్నె = ఉండునా.
భావము:- చలిదెబ్బకు తట్టకోలేక త్రేతాగ్నులు మూడు అగ్నులలోను ఆహవనీయం అనే అగ్ని ఒకటి శివుని మూడోవ నేత్రంలో అణగి ఉంది. దక్షిణాగ్ని అనే మరొకటి సాగర గర్భంలో చొచ్చింది. గార్హపత్యం అనే అగ్ని ఇంకొకటి గృహస్థుల ఇండ్లలో ఒదిగి ఉంది. అలాకాక బట్టబయల ఉంటే హేమంతఋతు చలికి త్రేతాగ్నులు కొంకర్లు తిరిగి పోయేవి.
తెభా-10.1-806-శా.
ఈ హేమంతము రాకఁ జూచి రమణీహేలాపరీరంభ స
త్సాహాయ్యంబునఁగాని దీని గెలువన్ శక్యంబుగా దంచుఁ దా
రూహాపోహవిధిం ద్రిమూర్తులు సతీయుక్తాంగు లైనారు గా
కోహో! వారలదేమి సంతత వధూయోగంబు రాఁ గందురే?
టీక:- ఈ = ఈ యొక్క; హేమంతము = చలికాలము; రాకన్ = వచ్చుటను; చూచి = చూసి; రమణీ = భార్యల యొక్క {రమణి - క్రీడింపదగినామె, స్త్రీ}; హేలా = విలాసపూరితమైన; పరీరంభ = ఆలింగనముల; సత్ = మంచి; సహాయ్యంబునన్ = తోడ్పాటువలన; కాని = తప్పించి; దీనిన్ = దీనిని; గెలువన్ = జయింప; శక్యంబుగాదు = వీలుకాదు; అంచున్ = అనుచు; తార్ = వారు; ఉహాపోహల =అనుకూల్య ప్రతికూల్యము లూహించుకున్న; విధిన్ = విధముగా; త్రిమూర్తులు = బ్రహ్మవిష్ణుమహేశ్వరులు; సతీ = భార్యలతో (సరస్వతి, లక్ష్మి, పార్వతులతో); యుక్త = కూడిన; అంగులు = దేహములు కలవారు; ఐనారు = అయితిరి; కాకన్ = అలాకాని పక్షమున; ఓహో = ఔరా; వారలు = వారు; అది = అలా; ఏమి = ఎందుకు; సంతత = ఎడతెగని; వధూ = భార్యతో; యోగంబున్ = కూడియుండుటను; రాన్ = కలుగుటను; కందురే = పొందుదురా.
భావము:- హేమంత ఋతువు రావటం చూసి కామినుల విలాసవంతమైన బిగికౌగిళ్ళ తోడ్పాటుతో కాని దీని చలిని జయించటం వీలుపడ దని ఊహించుకొన్నట్లు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు సరస్వతీ, లక్ష్మీ, పార్వతులను ముగ్గురిని తమ తమ దేహాల యందే ధరించారు. ఔనౌను, ఇదే కారణం లేకపోతే ఆ త్రిమూర్తులు స్త్రీమూర్తుల సదా సాంగత్యం కలిగి ఉండరు కదా.
తెభా-10.1-807-క.
ఈ హేమంతము రాకకు
శ్రీహరి యొక్కింత వడఁకి చింతింపంగా
నోహో! వెఱవకు మని తా
మా హరికిని శ్రీకుచంబు లభయం బిచ్చెన్.
టీక:- ఈ = ఆ యొక్క; హేమంతము = హేమంత ఋతువు; రాక = వచ్చుట; కున్ = కు; శ్రీహరి = విష్ణుమూర్తి; ఒక్కింత = బహుకొద్దిగా; వడకి = వణకిపోయి; చింతింపంగా = బాధపడుచుండగా; ఓహో = ఓయీ; వెఱవకు = బెదిరిపోకు; అని = అని; తాము = అవి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; హరి = విష్ణుమూర్తి; కిని = కి; శ్రీ = లక్ష్మీదేవి యొక్క; కుచంబులు = స్తనములు; అభయంబున్ = ధైర్యము చెప్పుట; ఇచ్చెను = చేసెను.
భావము:- హేమంతం రావడంతో శ్రీమహావిష్ణువు కొద్దిగా వణకి బాధపడ్డాడుట. అప్పుడు భయపడకు అంటూ శ్రీమహాలక్ష్మి వక్షోజాలు ఆయనకు అభయం ఇచ్చాయిట.