పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/సురలు పూలుగురియించుట
తెభా-10.1-485-వ.
తదవసరంబున, సురలు కుసుమ వర్షంబులు గురియించిరి; రంభాదు లాడిరి; గంధర్వాదులు పాడిరి; మేఘంబులు మృదంగంబుల భంగి ఘోషించె; సిద్ధ గణంబులు జయజయ భాషణంబులు భాషించి; రంత.
టీక:- తదవసరంబునన్ = ఆసమయమున; సురలు = దేవతలు; కుసుమ = పూల; వర్షంబులున్ = వానలు; కురియించిరి = కురిపించిరి; రంభాదులు = అప్సరసలు {రంభాదులు - రంభమున్నగువారు, ఏకత్రిశంతి యప్సరసలు }; ఆడిరి = నాట్యములు చేసిరి; గంధర్వ = గంధర్వులు; ఆదులు = మున్నగువారు; పాడిరి = పాటలుపాడిరి; మేఘంబులున్ = మేఘములు; మృదంగముల = మద్దెలల; భంగిన్ = వలె; ఘోషించెన్ = మోగినవి; సిద్ధ = సిద్ధుల; గణంబులు = సమూహములు; జయజయ = జయము జయము అనెడి; భాషణంబులు = ధ్వానములు; భాషించిరి = చేసిరి; అంత = అప్పుడు.
భావము:- అప్పుడు, దేవతలు పూలవర్షం కురిపించారు; రంభ మొదలైన అప్సరసలు నాట్యాలు చేసారు; గంధర్వులు గానాలు చేసారు; మేఘాలు మృదంగాలవలె ధ్వనించాయి; సిద్ధులు కృష్ణునికి జయజయధ్వానాలు పలికారు.
తెభా-10.1-486-శా.
ఆ వాద్యంబులు, నా మహాజయరవం, బా పాట, లా యాటలున్
దేవజ్యేష్ఠుఁడు పద్మజుండు విని ప్రీతిన్ భూమి కేతెంచి "నే
డీ వత్సార్భకులన్ భుజంగపతి హింసింపంగ నీ బాలకుం
డేవెంటన్ బ్రతికించె? మే", లనుచు నూహించెం గడుం నివ్వెఱన్.
టీక:- ఆ = ఆ యొక్క; వాద్యంబులున్ = ధ్వనులను; ఆ = ఆ; మహా = గొప్ప; జయరావంబున్ = విజయధ్వానములను; ఆ = ఆ; పాటలు = పాటలను; ఆ = ఆ; ఆటలున్ = నాట్యములను; దేవ = దేవతలలో; జ్యేష్ఠు = పెద్దవాడు; పద్మజుండు = బ్రహ్మదేవుడు; విని = విని; ప్రీతిన్ = కోరి, సంతోషముతో; భూమి = భూలోకమున; కున్ = కు; ఏతెంచి = వచ్చి; నేడు = ఇప్పుడు; ఈ = ఈ; వత్స = దూడలను; అర్భకులన్ = బాలురను; భుజంగ = పాములలో; పతి = గొప్పది; హింసింపంగన్ = చంపుతుండగా; ఈ = ఈ; బాలకుండు = పిల్లవాడు; ఏవెంటన్ = ఏ విధముగా; బ్రతికించెన్ = కాపాడెను; మేలు = గొప్పవిషయమే; అనుచున్ = అనుకొనుచు; ఊహించెన్ = అనుకొనెను; నివ్వెఱన్ = పారవశ్యముతో.
భావము:- దేవతలు అందరికీ పెద్దవాడైన బ్రహ్మదేవుడు ఆ జయజయద్వానాలు, వాద్యాలు, పాటలు విని ఏదో లోకకల్యాణం జరిగిందని సంతోషంతో భూలోకానికి వచ్చాడు. “ఇంతటి మహాసర్పం లేగలను బాలకులను చంపడానికి ప్రయత్నిస్తే ఇంత చిన్న కుఱ్ఱాడు వారిని ఎలా బ్రతికించ గలిగాడో ఆశ్చర్యంగా ఉందే! భలే.” అని నివ్వెరపోయాడు.
తెభా-10.1-487-వ.
అంత న య్యజగర చర్మంబు కొన్ని దివసంబుల కెండి పెద్దకాలంబు గోపాలబాలురకు కేళీబిలంబై యుండె; నిట్లు కౌమార విహారంబుల నైదవ యేటఁ గృష్ణుం డఘాసురునిం దెగఁ జూచుటయుఁ దమ్ముంగాచుటయు నాఱవయేటిదైన పౌగండవృత్తాంతం బని చిత్తంబుల గోపకుమారులు దలంచుచుందు” రని చెప్పిన న ప్పుడమిఱేఁ డ ప్పరమయోగీంద్రున కిట్లనియె.
టీక:- అంతన్ = ఆ తరువాత; ఆ = ఆ; అజగర = కొండచిలువ; చర్మంబు = కళేబరము; కొన్ని = కొద్ది; దివసంబుల = కాలమున; కిన్ = కు; ఎండి = ఎండిపోయి; పెద్ద = చాలా; కాలంబు = కాలమువరకు; గోపాల = యాదవుల; బాలురు = పిల్లల; కున్ = కు; కేళీ = ఆట; బిలంబు = గుహ; ఐ = వలెనయ్యి; ఉండెన్ = ఉన్నది; ఇట్లు = ఈ విధముగ; కౌమార = చిన్ననాటి (5సం.లు కన్నా తక్కువ) {అవస్థాష్టకము - 1కౌమారము (5సం. వరకు) 2పౌగండము (10సం.) 3కైశోఱము (15సం.) 4బాల్యము (16సం.) 6తారుణ్యము (25సం.) యౌవనము (50సం.) 7వృద్దత్వము (70సం.) 8వర్షీయస్త్వము (90సం.వరకు)}; విహారంబులన్ = క్రీడలను; ఐదవ = అయిదవ (5); ఏటన్ = సంవత్సరపు వయసులో; కృష్ణుండు = కృష్ణుడు; అఘాసురునిన్ = అఘాసురుని {అఘాసురుడు - కొండచిలువ రాక్షసుడు}; తెగజూచుటయున్ = చంపుట; తమ్మున్ = వారిని; కాచుటయున్ = కాపాడుటలని; ఆఱవ = ఆరో (6); ఏటిది = సంవత్సరపు వయసులోనిది; ఐన = అయినట్టి; పౌగండ = 5-10 ఏళ్ళ వయసు; వృత్తాంతంబు = వర్తమానము; అని = అని; చిత్తంబుల = మనసులందు; గోప = యాదవుల; కుమారులు = బాలురు; తలంచుచుందురు = భావింతురు; అని = అని; చెప్పినన్ = చెప్పగా; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పుడమిఱేడు = రాజు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పరమ = అతిగొప్ప; యోగి = ఋషులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అటుపిమ్మట ఆ కొండచిలువ చర్మం కొన్నాళ్ళకు ఎండిపోయి చాలాకాలంపాటు గోపబాలురకు ఆటలాడుకునే గుహలాగ పనికి వచ్చింది. ఇలా కృష్ణుడు కౌమార వయస్సులో అంటే అయిదవయేట అఘాసురుని సంహరించాడు. అయితే ఈ సన్నివేశం పౌగండ వయస్సులో అంటే ఆరు సంవత్సరాల వయస్సులో జరిగిందని గోపాలబాలురు అనుకున్నారు.” ఇలా శుకయోగి చెప్పగానే పరీక్షుత్తు ఇలా అడిగాడు.
తెభా-10.1-488-సీ.
"అయిదేండ్లు కౌమార; మటమీఁద నయిదేండ్లు-
పౌగండ మనియెడు ప్రాయ మందు;
నయిదేండ్లవాడైఁన యబ్జాక్షుచరితంబు-
పౌగండ మని గోపబాలు రెల్లఁ
దలఁతు రంటివి యెట్లు తలతురు వారలు?-
నిరుడు చేసిన పని నేటి దనఁగ
వచ్చునే? యిది నాకు వరుసతో నెఱిఁగింపు"-
మనవుడు యతిచంద్రుఁడైన శుకుఁడు
తెభా-10.1-488.1-ఆ.
యోగ దృష్టిఁజూచి యొక్కింత భావించి
"వినుము రాజవర్య! వినయధుర్య!
పరమగుహ్య మనుచుఁ బలుకుదు రార్యులు
శిష్యజనుల కీవు జేయు తలఁపు."
టీక:- అయిదేండ్లు = అయిదేళ్ళవరకు; కౌమారము = కౌమారావస్థ {అవస్థాష్టకము - 1కౌమారము (5సం. వరకు) 2పౌగండము (10సం.) 3కైశోఱము (15సం.) 4బాల్యము (16సం.) 6తారుణ్యము (25సం.) యౌవనము (50సం.) 7వృద్దత్వము (70సం.) 8వర్షీయస్త్వము (90సం.వరకు)}; అటమీద = ఆ పైన; అయిదు = అయిదు (5); ఏండ్లు = ఏళ్ళువరకు; పౌగండము = పౌగండావస్థ; అనియెడి = అనెడి; ప్రాయము = ఈడు, వయస్సు; అందున్ = అలా ఉండగా; అయిదు = ఐదు (5); ఏండ్లవాడు = ఏళ్ళవయసువాడు; ఐన = అయినట్టి; అబ్జాక్షు = కృష్ణుని; చరితంబున్ = వర్తనను; పౌగండము = పౌగండము; అని = అని; గోప = యాదవుల; బాలురు = పిల్లలు; ఎల్లన్ = అందరు; తలతురు = భావించెదరు; అంటివి = అన్నావు; ఎట్లు = ఎలా; తలతురు = అనుకొనెదరు; వారలు = వారు; నిరుడు = గడచిన సంవత్సరమున; చేసిన = చేసినట్టి; పనిన్ = పనిని; నేటిది = ఇప్పటిది; అనగన్ = అనుట; వచ్చునే = సరియేనా, కాదు; ఇది = దీనిని; నా = నా; కున్ = కు; వరుసతోన్ = క్రమముగా; ఎఱిగింపుము = తెలుపుము; అనువుడు = అడుగగా; యతి = యోగులలో; చంద్రుడు = ఉత్తముడు; ఐన = అయినట్టి; శుకుడు = శుకుడు.
యోగ = జ్ఞాన; దృష్టిన్ = దృష్టితో; చూచి = చూసి; ఒక్కింత = కొద్దిసేపు; భావించి = ఆలోచించుకొని; వినుము = వినుము; రాజవర్య = మహారాజ; వినయధుర్య = వినయము ధరించినవాడ; పరమ = అతి; గుహ్యము = రహస్యమైనది; అనుచున్ = అనుచు; పలుకుదురు = చెప్పెదరు; ఆర్యులు = పెద్దలు; శిష్య = శిష్యుల; జనులు = సమూహముల; కిన్ = కు; ఈవు = నీవు; చేయు = వేసెడి; తలపున్ = సందేహముగురించి.
భావము:- “మహర్షీ! మొదటి ఐదేళ్ళ వయస్సును కౌమారము అంటారు. తరువాతి ఐదేండ్లను పౌగండమని అంటారు కదా. ఐదేళ్ళవాడైన కృష్ణుడి కథను పౌగండములో ఆరో ఏట జరిగినకథ అని గోపబాలకులు తలుచుకున్నారని చెప్పావు. అదెలా సంభవము వాళ్ళు అలాఎలా అనుకోగలరు. నిరుడు చేసినపని ఈనాటిది అనుకోవడం ఎవరికైనా ఎలా సాధ్యం. నాకు విపులంగా వివరించు” ఇలా పరీక్షుత్తు అడగగానే శుకయోగీ యోగదృష్టితో చూసి కొంచెంసేపు ఆలోచించాడు. “మహారాజా! నీవు వినయంగా వేసిన ఈ ప్రశ్నలు ముందు ముందు రాబోయే శిష్యులు అందరికి ఎంతో మేలు చేకూరుస్తాయి. నీ ఆలోచన పరమ రహస్యమైంది అని పెద్దలు భావిస్తారు.
తెభా-10.1-489-క.
ప్రియురాలివలని వార్తలు
ప్రియజనులకు నెల్లప్రొద్ధుఁ బ్రియ మగు భంగిన్
ప్రియుఁడగు హరిచరితంబులు
ప్రియభక్తుల కెల్లయెడలఁ బ్రియములు గావే?
టీక:- ప్రియురాలి = ఇష్టసఖి; వలని = గురించిన; వార్తలు = విషయములు; ప్రియజనుల్ = ఇష్టుల; కున్ = కు; ఎల్లపొద్దున్ = ఎల్లప్పుడు; ప్రియము = ఇష్టము; అగు = అయ్యెడి; భంగిన్ = విధముగ; ప్రియుడు = ఇష్టుడు, మేలుచేయువాడు; అగు = ఐన; హరి = కృష్ణుని; చరితంబులు = వర్తనలు; ప్రియ = ఇష్టమైన; భక్తుల్ = భక్తుల; కున్ = కు; ఎల్ల = అన్ని; ఎడలను = సమయము లందును; ప్రియము = ఇష్టము; కావే = కావా ఏమి, అగును.
భావము:- ప్రియురాలిని గురించిన వార్తలు ఎప్పుడు చెప్పినా ప్రియులకు ఎంతో ఇష్టంగా ఉంటాయి. ప్రియుడి కథలు ప్రియురాలికి కూడా అంతే కదా. జీవులందరూ ప్రియురాళ్ళు అయితే భగవంతుడు ప్రియుడు. అతని కథలు ప్రియభక్తులకైతే మరీ ప్రియమైనవి కదా.”
తెభా-10.1-490-వ.
అని పలికి యోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె; "న ట్లఘాసురు మొగంబువలనం గడచి చనిన లేఁగల గోపకుమారులం బ్రతికించి వారును దానునుం జని చని.
టీక:- అని = అని; పలికి = చెప్పి; యోగ = యోగులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; రాజేంద్రున్ = మహారాజున; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను; అట్లు = అలా; అఘాసురుని = అఘాసురుని; మొగంబు = నోటి; వలనన్ = నుండి; కడచిచనిన = బయటపడిన; లేగలన్ = దూడలను; గోప = యాదవుల; కుమారులన్ = బాలురను; బ్రతికించి = కాపాడి; వారునున్ = వారు; తానునున్ = అతను; చనిచని = శ్రీఘ్రముగా వెళ్ళి.
భావము:- ఇలా పలికి శుకయోగి పరీక్షుత్తుతో ఇంకా ఇలా చెప్పాడు “అలా కృష్ణుడు అఘాసురుడి నోట్లోకి పోయిన లేగలను గోపకుమారులను వాడి బారి నుంచి బ్రతికించి, వారితో కలిసి ముందుకు సాగిపోయాడు
తెభా-10.1-491-మ.
కనియెం గృష్ణుఁడు సాధునీరము మహాగంభీరముం బద్మకో
కనదాస్వాద వినోద మోద మదభృంగ ద్వంద్వ ఝంకారమున్
ఘనకల్లోల లతావితాన విహరత్కాదంబ కోలాహల
స్వనవిస్ఫారము మందవాయుజ కణాసారంబుఁ గాసారమున్.
టీక:- కనియెన్ = కనుగొనెను; కృష్ణుడు = కృష్ణుడు; సాధు = మంచి; నీరమున్ = నీళ్ళు కలిగినదానిని; మహా = మిక్కిలి; గంభీరమున్ = లోతు గలదానిని; పద్మ = పద్మముల; కోకనద = ఎఱ్ఱకలువలను; ఆస్వాద = సుగంధాలను ఆస్వాదించుటను; వినోద = క్రీడగా, వేడుకగా; ఆమోద = తీసుకొనుటచే; మద = మత్తెక్కిన; భృంగ = తుమ్మెదల; ద్వంద్వ = జంట యొక్క; ఝంకారమున్ = ఝంకారములు కలదానిని; ఘన = గొప్ప; కల్లోల = పెద్ద అలలు అనెడి; లతా = తీగల; వితాన = సమూహము నందు; విహరత్ = విహరించుచున్న; కాదంబ = కలహంసల {కాదంబము - ధూమ్రవర్ణము కల ముక్కు కాళ్ళు కల హంస}; కోలాహల = కలకల మనెడి; స్వన = ధ్వనులచేత; విస్ఫారమున్ = అధికముగా కల దానిని; మంద = మెల్లని; వాయుజ = గాలివలన కలిగిన; కణ = నీటితుంపరలు; సారంబున్ = దట్టముగా కలదానిని; కాసారమున్ = సరస్సును.
భావము:- అలా అఘాసుర వధానంతరం వెళ్ళిన కృష్ణుడు ఒక కొలనును చూసాడు. అది ఎంతో లోతైనది, స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్నది. పద్మాలు, ఎఱ్ఱకలువలు ఆ చెరువులో వికసించి ఉండగా వాటి సుగందాలకు ఆనందించి మదించిన తుమ్మెదల జంటలు ఝుంకారం చేస్తూ ఆ పూవుల పైననే తిరుగుతున్నాయి. ఆ కొలనులో నీటిఅలల మధ్యగా హంసలు ఈదులాడుతూ కోలాహలం చేస్తూ ఉంటే ఆ ధ్వని చెవుల పండువుగా వినవస్తోంది. చల్లని పిల్లగాలికి నీటితుంపరలు ఎగురుతూ కొలనునిండా వ్యాపించి ఉన్నాయి.
తెభా-10.1-492-వ.
కని తమ్మికంటి తమ్ముల యింటి సొబగునకు నిచ్చ మెచ్చుచుఁ జెచ్చెర గాలి నోలిం గదలెడు కరళ్ళ తుంపురుల జల్లు పెల్లున నొడళ్ళు గగుర్పొడువఁ గొలంకు కెలంకులఁ గాయ పండుల గెలల వ్రేగున వీఁగి పట్టుగల చెట్టుతుటుము నీడల నొప్పుచున్న యిసుక తిప్పల విప్పుఁ జూచి వేడుక పిచ్చలింప నెచ్చెలుల కిట్లనియె.
టీక:- కని = చూసి; తమ్మికంటి = కృష్ణుడు, పద్మాక్షుడు; తమ్ములయింటి = సరస్సు యొక్క {తమ్ముల యిల్లు - తమ్మి (పద్మము)లకు ఇల్లు (నివాసము), సరస్సు}; సొబగున్ = చక్కదనమున; కున్ = కు; ఇచ్చన్ = మనసు నందు; మెచ్చుకొనుచున్ = ప్రశించుచు; చెచ్చెరన్ = శీఘ్రముగా; గాలిన్ = గాలివలన; ఓలిన్ = మిక్కిలి; కదలెడు = కదిలెడి; కరళ్ళ = అలలవలని; తుంపురుల = నీటిబిందువుల; జల్లు = జల్లుల యొక్క; పెల్లునన్ = అతిశయముచేత; ఒడళ్ళు = శరీరములు; గగుర్పొడువన్ = గగుర్పాటు చెందుతుండగ; కొలంకు = సరస్సు యొక్క; కెలంకులన్ = గట్లమీద; కాయ = కాయల; పండుల = పళ్ళ; గెలల = గుత్తుల; వ్రేగునన్ = బరువులకు; వీగి = మొగ్గి; పట్టు = ధృడత్వము; కల = కలిగిన; చెట్టు = వృక్షముల; తుటము = సమూహముల; నీడలన్ = నీడలందు; ఒప్పుచున్న = చక్కగా ఉన్నట్టి; ఇసుకతిప్పల = ఇసకదిబ్బల; విప్పు = విస్తారములను; చూచి = చూసి; వేడుక = ఉత్సాహము; పిచ్చలింపన్ = అతిశయించగా; నెచ్చెలుల = స్నేహితుల; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను.
భావము:- ఆ కొలనును చూసిన తామరకన్నుల కన్నయ్య తామరపూలతో నిండిన దాని అందానికి మెచ్చుకున్నాడు. చెరువు లోని నీరు గాలికి కెరటాలుగా లేచి నీటి తుంపరలు లేస్తున్నాయి. అవి గాలితెరతోపాటు వచ్చి జల్లులాగ తాకగానే ఒళ్ళు గగుర్పొడుస్తున్నది. ఆ కొలను ఒడ్డున ఎన్నో ఫలవృక్షాలు ఉన్నాయి. కాయలు పండ్లు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతూ ఉంటే, ఆ చెట్లు ఆ బరువుకు ఊగిపోతున్నా బలంగానే నిలబడి ఉన్నాయి. అలాంటి చెట్ల గుంపుల నీడలలో విశాలమైన ఇసుకతిన్నెలను చూడగానే కృష్ణుడిలో ఉత్సాహం చెలరేగింది. అతడు స్నేహితులతో ఇలా అన్నాడు.