పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/చల్దు లారగించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెభా-10.1-493-శా.
"ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా
రండో బాలకులార! చల్ది గుడువన్ మ్యస్థలం బిక్క డీ
దండన్ లేఁగలు నీరు ద్రావి యిరవందం బచ్చికల్ మేయుచుం
దండంబై విహరించుచుండఁగ నమంప్రీతి భక్షింతమే?"

టీక:- ఎండన్ = ఎండవలన; మ్రగ్గితిరి = మాడిపోయి ఉన్నారు; ఆకటన్ = ఆకలిచేత; పడితిరి = బడలితిరి; ఇంకన్ = ఇంకను; ఏల = ఎందుకు; విలంబింపగాన్ = ఆలస్యము చేయుట; రండి = రండి; ఓ = ఓహో; బాలకులారా = పిల్లలూ; చల్దిన్ = చద్దికూడులను; కుడువన్ = తినుటకు; రమ్య = అందమైన; స్థలంబు = చోటు; ఇక్కడ = ఇక్కడ; ఈ = ఈ; దండన్ = వైపున; లేగలు = దూడలు; నీరు = నీటిని; త్రావి = తాగి; ఇరవందన్ = ఒప్పారు; పచ్చికల్ = పచ్చిగడ్డి; మేయుచున్ = తినుచు; తండంబు = గుంపు గట్టినవి; ఐ = అయ్యి; విహరించుచుండగన్ = తిరుగుతుండగా; అమంద = మిక్కుటమైన; ప్రీతిన్ = ఇష్టముతో; భక్షింతమే = తినెదము.
భావము:- “మిత్రులారా! ఇప్పటికే ఎండలో మాడిపోయారు ఆకలితో నకనకలాడుతున్నారు కదా. ఇంకా ఆలస్యం దేనికి? ఇది చల్దులు తినడానికి అనువైన అందమైన చోటు. లేగదూడల మందలు ఈ కొలనులో నీరు త్రాగి ఈ ప్రక్కనే ఉన్న పచ్చికబయళ్ళులో స్వేచ్ఛగా మేస్తూ విహరిస్తూ ఉంటాయి. మరి మనం హాయిగా చల్దులు ఆరగిద్దాం. ఏమంటారు?”

తెభా-10.1-494-వ.
అనిన “నగుఁగాక” యని వత్సంబుల నుత్సాహంబున నిర్మలంబు లగు జలంబులు ద్రావించి, పచ్చికల మొల్లంబులుగల పల్లంబుల నిలిపి చొక్కంబులగు చల్దిచిక్కంబులు చక్కడించి.
టీక:- అనినన్ = అనగా; అగుగాక = అలగే; అని = అని; వత్సంబులన్ = దూడలను; ఉత్సాహంబునన్ = హుషారుగా; నిర్మలంబులు = స్వచ్ఛమైనవి; అగు = ఐన; జలంబులున్ = నీళ్ళు; త్రావించి = తాగించి; పచ్చికల = పచ్చిగడ్డి; మొల్లంబులు = అధికముగా; కల = ఉన్నట్టి; పల్లంబులన్ = పల్లపు ప్రదేశము లందు; నిలిపి = ఉంచి; చొక్కంబులు = స్వచ్ఛమైనవి; అగు = ఐన; చల్ది = చద్దికూడులు గల; చిక్కంబులున్ = కావిళ్ళలోని సంచులను; చక్కన్ = చక్కగా; డించి = దింపుకొని.
భావము:- కృష్ణుడిలా అనగానే గోపబాలకులందరూ సరే అన్నారు. లేగదూడలకు నిర్మలమైన నీటిని త్రాగించి, చిక్కని పచ్చికబయళ్ళులో మేతకు వదలిపెట్టారు. నోరూరించే చల్దులను చిక్కాలనుంచి బయటకు తీసారు.

తెభా-10.1-495-మ.
జాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే
కు చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షించుచున్
శిలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులుం బువ్వు లా
కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా!

టీక:- జలజ = పద్మము; అంతస్థిత = అందలి; కర్ణికన్ = బొడ్డును; తిరిగిరాన్ = చుట్టూరా; సంఘంబులు = కలిసిగట్టుగా ఉండెడివి; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ఱేకుల = దళముల; చందంబునన్ = వలె; కృష్ణునిన్ = కృష్ణుడి; తిరిగిరాన్ = చుట్టూరా; కూర్చుండి = కూర్చొని; వీక్షించుచున్ = చూచుచు; శిలలున్ = రాళ్ళు; పల్లవముల్ = చిగుళ్ళు; తృణముల్ = గడ్డిపోచలు; లతల్ = లతలు; చిక్కంబులున్ = సంచులు; పువ్వులున్ = పువ్వులు; ఆకులున్ = ఆకులు; కంచంబులు = తినుటకైన పళ్ళములు; కాన్ = అగునట్లుగా; భుజించిరి = తింటిరి; అచటన్ = అక్కడ; గోప = గొల్లల; అర్భకుల్ = పిల్లలు; భూవరా = రాజా.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! తామర పువ్వు బొడ్డు చుట్టూరా వరుసలు వరుసలుగా రేకులు పరచుకొని ఉంటాయి. అలాగే చల్దులు తినడానికి కృష్ణుడు మధ్యన కూర్చున్నాడు. గోపకలు అందరు చూట్టూరా చేరి కూర్చుని కృష్ణుణ్ణే చూస్తున్నారు. వాళ్ళకి వేరే కంచాలు లేవు. రాతిపలకలు, తామరాకులు, వెడల్పైన గడ్డిపోచలుతోను లతలుతోను పొడుగాటి పొన్న పూలతోను అల్లిన చదరలు, తెచ్చుకున్న చిక్కాలు, వెడల్పైన ఆకులు వీటినే కంచాలుగా వాడుకుంటు అందరు చక్కగా చల్దులు ఆరగించారు.

తెభా-10.1-496-సీ.
మాటిమాటికి వ్రేలు డిఁచి యూరించుచు-
నూరుఁగాయలు దినుచుండు నొక్క;
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి-
  "చూడు లే"దని నోరు చూపునొక్కఁ;
డేగు రార్గురి చల్దు లెలమిఁ బన్నిదమాడి-
కూర్కొని కూర్కొని కుడుచు నొక్కఁ;
డిన్నియుండఁగఁ బంచి యిడుట నెచ్చలితన-
నుచు బంతెనగుండు లాడు నొకఁడు;

తెభా-10.1-496.1-ఆ.
"కృష్ణుఁ జూడు"మనుచుఁ గికురించి పరు మ్రోల
మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు;
వ్వు నొకఁడు; సఖుల వ్వించు నొక్కఁడు;
ముచ్చటాడు నొకఁడు; మురియు నొకఁడు.

టీక:- మాటిమాటికిన్ = పలుమార్లు; వ్రేలున్ = వేలిని; మడిచి = వంచి; ఊరించుచున్ = ఆసపెట్టుచు; ఊరగాయలున్ = ఆవకాయలాంటివి; తినుచున్ = తింటూ; ఒక్కడు = ఒకానొకడు; ఒక్కని = ఒకానొకని యొక్క; కంచము = కంచము; లోనిదిన్ = అందలిదానిని; ఒడిసి = ఒడుపుగా తీసుకొని; చయ్యన = చటుక్కున; మ్రింగి = తినేసి; చూడు = చూసుకొనుము; లేదు = ఏమీలేదు; అని = అని; నోరు = నోటిని; చూపున్ = చూపెట్టును; ఒక్కడు = ఒకతను; ఏగురి = ఐదుగురు (5); ఆర్గురి = ఆరుగురి (6); చల్దులు = చద్దికూడులు; ఎలమి = రెచ్చిపోయి; పన్నిదము = పందెములు; ఆడి = వేసుకొని; కూర్కొనికూర్కొని = బాగా కూరేసుకుంటు; కుడుచున్ = తినును; ఒక్కడు = ఒకతను; ఇన్ని = ఇంత ఎక్కువగ; ఉండగన్ = ఉన్నప్పుడు; పంచి = పంచిపెట్టి; ఇడుట = ఇచ్చుట; నెచ్చలితనము = స్నేహభావము; అనుచున్ = అనుచు; బంతెనగుండులు = వరుసగ అందరికి ముద్దలు పెట్టుట {బంతెనగుండ్లు - బంతి (వరుస)గా కూర్చొన్న వారికి తలా ఒక గుండు ఇచ్చెడి ఆట}; ఆడున్ = చేయును; ఒకడున్ = ఒకతను.
కృష్ణున్ = కృష్ణుడుని; చూడుము = చూడు; అనుచున్ = అనుచు; కికురించి = మాయజేసి; పరున్ = వేరొకని; మ్రోలన్ = ఎదురుగానున్న; మేలి = మంచి; భక్ష్య = తినుబండారముల; రాశిన్ = గుంపును; మెసగు = వేగముగా తినును; ఒకడు = ఒకతను; నవ్వున్ = నవ్వును; ఒకడు = ఒకతను; సఖులన్ = స్నేహితులను; నవ్వించున్ = నవ్వించును; ఒక్కడు = ఒకతను; ముచ్చటలాడు = కబుర్లు చెప్పును; మురియున్ = మురిసిపోవును; ఒకడు = ఒకతను.
భావము:- ఎంత చక్కగా మురిపిస్తున్నాడో చూడండి మన పోతన కృష్ణుడు. – ఒక గొల్ల పిల్లాడు వ్రేళ్ళ మధ్యలో ఊరగాయ ముక్క ఇరికించుకొని మాటి మాటికి పక్కవాడిని ఊరిస్తూ తిన్నాడు. ఇంకొక గోప బాలుడు పక్కవాడి కంచంలోది చటుక్కున లాక్కొని మింగేసి, వాడు అడిగేసరికి ‘ఏదీ ఏంలేదు చూడు’ అంటు తన నోరు చూపించాడు. మరొకడు పందాలు కాసి మరీ, ఐదారుమంది తినే చల్దులు నోట్లో కుక్కుకొని తినేసాడు. మరో పిల్లాడు ‘ఒరే ఇన్ని పదార్థాలు ఉన్నాయి కదా, స్నేహ మంటే పంచుకోడంరా’ అంటు బంతెనగుండు లనే ఆట ఆడుతు తింటున్నాడు. ఇంకో కుఱ్ఱాడు ‘ఒరే కృష్ణుణ్ణి చూడు’ అని దృష్టి మళ్ళించి, మిత్రుడి ముందున్న మధుర పదార్థాలు తినేసాడు. మరింకో కుఱ్ఱాడు తాను నవ్వుతున్నాడు. ఇంకొకడు అందరిని నవ్విస్తున్నాడు. మరొకడు ముచ్చట్లాడుతున్నాడు. వేరొకడు ఉరికే మురిసిపోతున్నాడు.

తెభా-10.1-497-వ.
అ య్యవసరంబున.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:- అలా చల్దులు గుడుస్తున్న ఆ సమయంలో. . .

తెభా-10.1-498-సీ.
డుపున దిండుగాఁ ట్టిన వలువలో-
లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్రదండంబును-
జాఱి రానీక డాచంక నిఱికి
మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది-
ముద్ద డాపలిచేత మొనయ నునిచి
చెలరేఁగి కొసరి తెచ్చిన యూరుగాయలు-
వ్రేళ్ళ సందులయందు వెలయ నిఱికి

తెభా-10.1-498.1-ఆ.
సంగడీల నడుమఁ క్కగఁ గూర్చుండి
ర్మభాషణముల గవు నెఱపి
యాగభోక్త కృష్ణుఁ మరులు వెఱఁగంద
శైశవంబు మెఱసి ల్ది గుడిచె.

టీక:- కడుపున = పొట్టమీద; దిండుగా = నడుముకు దట్టీగా; కట్టిన = కట్టుకొన్న; వలువ = గుడ్డ; లోన్ = అందు; లాలిత = చక్కటి; వంశనాళంబున్ = మురళిని; చొనిపి = దూర్చి; విమల = నిర్మలమైన; శృంగంబును = కొమ్ముబూర; వేత్రదండంబును = బెత్తంకఱ్ఱలను; జాఱిరానీక = జారిపోకుండ; డాచంకన్ = ఎడమచంకలో; ఇఱికి = ఇరికించుకొని; మీగడ = మీగడబాగాకలగిన; పెరుగు = పెరుగు; తోన్ = తో; మేళవించిన = కలిపిన; చల్ది = చద్దన్నము; ముద్ద = కబళము; డాపలి = ఎడమ; చేతన్ = చేతిలో; మొనయన్ = చక్కగా; ఉనిచి = ఉంచుకొని; చెలరేగి = చెలరేగి; కొసరి = మరింకొంచె మని అడిగి; తెచ్చిన = తీసుకు వచ్చిన; ఊరుగాయలు = ఊరగాయ ముక్కలు; వ్రేళ్ళ = వేళ్ళ; సందుల = మధ్య; అందు = లో; వెలయన్ = ఉండునట్లు; ఇఱికి = ఇరికించుకొని.
సంగడీల = తోటివారి; నడుమన్ = మధ్యన; చక్కగన్ = చక్కగా; కూర్చుండి = కూర్చొని; నర్మ = పరిహాసపు; భాషణములన్ = మాటలతో; నగవు = నవ్వులను; నెఱపి = వ్యాపింపజేసి; యాగభోక్త = హవిర్భాగములు భుజించువాడు; కృష్ణుడు = శ్రీకృష్ణుడు; అమరులు = దేవతలు; వెఱగందన్ = అబ్బురపడగా; శైశవంబున్ = బాల్యమును; మెఱసి = ప్రకాశింపజేసి; చల్దిన్ = చద్దికూడులు; కుడిచె = తినెను.
భావము:- యాగభోక్త అయిన శ్రీకృష్ణుడు దేవతలు అందరూ ఆశ్చర్య చకితులు అవుతుండగా మనోహర శైశవ చేష్టలు ప్రదర్శిస్తున్నాడు. పొట్టమీదకు దట్టీలా కట్టిన అంగవస్త్రంలో మనోజ్ఞమైన మురళిని ముడిచాడు. నిర్మలమైన కొమ్ముబూర, పశువుల తోలు కఱ్ఱలను ఎడం చంకలో చక్కగా ఇరికించి జారిపోకుండా పట్టుకున్నాడు. ఎడమ చేతిలో ఏమో మీగడ పెరుగు కలిపిన చద్దన్నం ముద్ద పట్టుకున్నాడు. కోరిమరీ తెచ్చుకున్న నంజుడు ఆవకాయ ముక్కలు వేళ్ళ మధ్య నేర్పుగా ఇరికించుకున్నాడు. తన తోటి పిల్లల మధ్య చక్కగా కూర్చుని వారితో ఒక ప్రక్క పరిహాసాలు ఆడుతున్నాడు. మరొక ప్రక్క చిరునవ్వులు రువ్వుతున్నాడు.

తెభా-10.1-499-వ.
ఇట్లు కృష్ణసహితు లయిన గోపకుమారులు చల్దులు గుడుచునెడఁ గ్రేపులు మేపులకుం జొచ్చి, పచ్చని గఱికిజొంపంబుల గుంపుల కుఱికి, లంపులు మేయుచు, ఘోరంబగు నరణ్యంబు నడుమం దోరంబగు దూరంబు జనిన, వానింగానక వెఱచుచున్న గోపడింభకులకు నంభోజనయనుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కృష్ణ = కృష్ణునితో; సహితులు = కూడుకొన్నవారు; అయిన = ఐన; గోప = గొల్లల; కుమారులు = పిల్లలు; చల్దులు = చద్దిభోజనములు; కుడుచున్ = తినెడి; ఎడన్ = సమయమునందు; క్రేపులు = దూడలు; మేపులు = గడ్డితినుట; కున్ = కోసము; చొచ్చి = మొదలిడి; పచ్చని = పచ్చటి; గఱిక = గడ్డి; జొంపంబుల = దుబ్బుల; గుంపుల్ = సమూహముల; కున్ = కు; ఉఱికి = పరిగెట్టిపోయి; లంపులు = దొంగమేత; మేయుచు = తినుచు; ఘోరంబు = భయంకరమైనది; అగు = ఐన; అరణ్యంబున్ = అడవి; నడుమన్ = మధ్యలో; తోరంబు = అధికమైనది; అగు = ఐన; దూరంబున్ = దూరమునకు; చనినన్ = వెళ్ళగా; వానిన్ = వాటిని, అవి; కానక = చూడలేక, కనబడక; వెఱచుచున్న = బెదురుతున్న; గోప = గొల్లల; డింభకుల్ = పిల్లలు; కున్ = కు; అంభోజనయనుండు = కృష్ణుడు, పద్మాక్షుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా ఇక్కడ కృష్ణుడితోపాటు గోపకుమారులు చల్దులు ఆరగిస్తుండగా, అక్కడ లేగదూడలు పచ్చికలు మేస్తున్నాయి. పచ్చని పచ్చికలున్న గుబుర్లలోనికి జొరబడి దొంగమేతలు మేస్తూ భయంకరమైన అరణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయాయి. గోపబాలకులు భోజనాలు చేస్తూ లేగల కోసం చూస్తే అవి కనిపించ లేదు. వారు కంగారు పడుతుంటే కృష్ణుడు ఇలా అన్నాడు.