పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వసుదేవుని ధర్మబోధ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెభా-10.1-28-మ.
చెలియల్, కన్నియ, ముద్దరా, లబల, నీ సేమంబె చింతించు ని
ర్మ, దీనిన్ బయలాడుమాటలకు నై ర్యాదఁ బోఁదట్టి, స
త్కు జాతుండవు, పుణ్యమూర్తి, వకటా! కోపంబు పాపంబు, నె
చ్చెలి నోహో! తెగవ్రేయఁ బాడి యగునే? చింతింపు భోజేశ్వరా!

టీక:- చెలియల్ = చెల్లెలు; కన్నియ = కన్య; ముద్దరాలు = ముగ్ధ ఐన ఈమె; నీ = నీ యొక్క; సేమంబె = క్షేమమును మాత్రమే; చింతించున్ = తలచును; నిర్మల = కపటములేని ఆమె; దీనిన్ = ఈమెను; బయలాడు = ఆకాశవాణి; మాటల్ = పలుకల; కున్ = కోసము; ఐ = అయ్యి; మర్యాదన్ = కట్టుబాటు; పోదట్టి = తప్పించి; సత్ = మంచి; కుల = వంశమున; జాతుండవు = పుట్టినవాడవు; పుణ్యమూర్తివి = పుణ్యస్వరూపుడవు; అకట = అయ్యో; కోపంబున్ = కోపము; పాపంబు = పాపమునకు; నెచ్చెలి = మిత్రురాలు; ఓహో = ఔరా; తెగవ్రేయన్ = నరకివేయుట; పాడి = తగిన కార్యము; అగునే = ఔతుందా, కాదు; చింతింపు = ఆలోచించుము; భోజేశ్వరా = కంసమహరాజా {భోజేశ్వరుడు - భోజరాజు వంశము వారిలో శ్రేష్ఠుడు, కంసుడు}.
భావము:- ఈ నీ చెల్లెలు వట్టి అమాయకురాలు; అబల; నీ క్షేమాన్నేఎప్పుడూ ఆశిస్తుంది; ఏ పాపమూ ఎరుగనిది. ఇటువంటి ఈమెను ఆక్కడా ఇక్కడా వినబడే మాటలు పట్టుకుని చంపబోవడం న్యాయమేనా? కోపం మహాపాపం సుమా. పవిత్రమైన భోజవంశంలో పుట్టిన వాడివి; పుణ్యమూర్తివి; భోజవంశీయులు అందరికీ నాయకుడవు. ఇలాంటి నువ్వు ప్రియమైన సోదరిని సంహరించడం ధర్మమా? అయ్యో! ఇది నీప్రతిష్టకు భంగకరం కాదా? ఆలోచించి చూడు.

తెభా-10.1-29-సీ.
మేనితోడన పుట్టు మృత్యువు జనులకు-
నెల్లి నేఁడైన నూఱేండ్ల కైనఁ
దెల్లంబు మృత్యువు దేహంబు పంచత-
నందఁ గర్మానుగుండై శరీరి
మాఱుదేహముఁ నూఁది, ఱి తొంటి దేహంబుఁ-
బాయును దన పూర్వ భాగమెత్తి
వేఱొంటిపైఁ బెట్టి వెనుకభాగం బెత్తి-
మనించు తృణజలూయును బోలె;

తెభా-10.1-29.1-ఆ.
వెంటవచ్చు కర్మవిసరంబు; మును మేలు
న్నవేళ నరుడు న్న విన్న
లఁపఁబడిన కార్యతంత్రంబు కలలోనఁ
బాడితోడఁ గానఁడిన యట్లు.

టీక:- మేనితోడన్ = పాంచభౌతికశరీరముతోటే; పుట్టున్ = సిద్ధమగును; మృత్యువు = మరణము; జనుల్ = సకలప్రాణుల; కున్ = కు; నెల్లిన్ = రేపైనా; నేడైనా = ఈరోజైనా; నూఱేండ్లు = వందసంవత్సరముల; కున్ = కు; ఐనన్ = అయినను; తెల్లంబు = స్పష్టమైనది, తప్పనిది; మృత్యువు = మరణము; దేహంబున్ = శరీరము; పంచతన్ = పంచభూతాలలో కలయుట; అందన్ = పొందగానే; కర్మా = తన పుణ్య పాపములకు; అనుగుడు = అనుగుణంగ పొందినవాడు; ఐ = అయ్యి; శరీరి = శరీరములో నుండె జీవుడు; మాఱు = వేరొక {మాఱుదేహము - భోగసాధనమైన దేవ నర పశు పక్షి మృగాది భౌతిక రూపము}; దేహమున్ = శరీరమును; ఊది = చేపట్టి; మఱి = మరి; తొంటి = మునుపటి; దేహంబున్ = శరీరమును; పాయునున్ = విడుచును; తన = తన యొక్క; పూర్వ = ముందరి; భాగము = భాగమును; ఎత్తి = పైకెత్తి; వేఱొంటి = ఇంకొక గడ్డిపోచ; పైన్ = మీద; పెట్టి = ఆన్చి; వెనుక = వెనుకటి; భాగంబున్ = భాగమును; ఎత్తన్ = ఎత్తుటకు; గమకించున్ = యత్నించు; తృణజలూకయును = గడ్డిజలగ; పోలన్ = వలెనే.
వెంట = కూడాపడి; వచ్చున్ = వచ్చును; కర్మ = సంచితకర్మముల; విసరంబు = సమూహము; మును = ముందుగా; మేలుకన్న = మెళకువగా నున్న; వేళన్ = సమయము నందు; నరుడు = మానవుడు; కన్న = చూసినవి; విన్న = విన్నవి; తలపబడిన = అనుకొన్నవి (ఐన); కార్య = పనుల నడకలు; కల = స్వప్నము; లోనన్ = అందు; పాడిన్ = ఒక క్రమమ; తోడన్ = తోటి; కనబడిన = కనబడ్డ; అట్ల = విధముగ.
భావము:- జన్మము ఎత్తినవారికి ఆ శరీరం తోపాటే మృత్యువు కూడా పుట్టి ఉంటుంది. నేడో రేపో నూరేళ్ళకైనా మృత్యువు తప్పదు. మరణించడం అంటే శరీరం పంచభూతాలలో కలసిపోవడమే. ఆకుపురుగును చూడు శరీరం ముందు భాగం ఎత్తి మరోచోట పెట్టి వెనుకభాగం ఎత్తి ముందుకు లాక్కుంటుంది కదా. అలాగే శరీరం ధరించిన జీవుడు తన కర్మను అనుసరించి మరొక దేహం ఏర్పాటు చేసుకుని మరి ఉన్నశరీరం విడిచిపెడతాడు. మనకు మెలుకవగా ఉన్నప్పుడు మానవుడు చూచినవి విన్నవి ఆలోచించినవి అయిన పనులు కలలో చక్కగా కనపడినట్లు శరీరం విడువగానే కర్మవాసనలన్నీ ఆ జీవి వెంటవస్తాయి.

తెభా-10.1-30-క.
తొంటి కర్మరాశికి
నుచరమై బహువికారమై మనసు వడిం
ను; నింద్రియముల తెరువులఁ
నువులు పెక్కైనఁ జెడవు న కర్మంబుల్.

టీక:- తన = తన యొక్క; తొంటి = పూర్వపు; కర్మ = పాప పుణ్య కర్మముల; రాశి = సమూహముల; కిన్ = కి; అనుచరము = ప్రకారము కలుగునది; ఐ = అయ్యి; బహు = అనేకమైన; వికారము = విషయ చాంచల్యాలు కలది {వికారములు - శబ్దస్పర్శాది విషయ చాంచల్యములు}; ఐ = అయ్యి; మనసు = అంతఃకరణము; వడిన్ = వేగముగా; చనున్ = పోవును; ఇంద్రియముల = జ్ఞాన కర్మ అంతరింద్రియముల; తెరువులన్ = సరణులమ్మట; తనువులు = పుట్టుకలు; పెక్కు = అనేకము; ఐనన్ = గడచిపోయినను; చెడవు = నశించవు; తన = తన యొక్క; కర్మంబుల్ = కర్మల వాసనలు.
భావము:- తన పూర్వకర్మలు అనుసరించి మనస్సు అనేక వికారాలు చెందుతూ, ఇంద్రియాల వెంట వేగంగా చరిస్తూ ఉంటుంది. ఎన్ని శరీరాలు ధరించినా తన కర్మలు మాత్రం ఎక్కడకీ పోవు. విశేషార్థము - తాను పూర్వజన్మలలో చేసిన పుణ్య, పాప, మిశ్ర కర్మముల వలన కలుగు ఫలమునకు అనుగుణంగా మనస్సు వినుట, చూచుట, స్పృశించుట, చవిచూచుట, వాసనచూచుట మున్నగు విషయ చాంచల్యములకు లోబడి ఇంద్రియముల వెంబడి పోతూ ఉండును. ఆ పోకడలు కోరికలు. జీవుడు ఆ కోరికలకు అనుగుణమైన పునర్జన్మ ఎత్తును. వాటి ఫలములను అనుభవించును. తానెన్ని జన్మలెత్తినా చేసిన పుణ్య పాప మిశ్ర కర్మముల ఫలములు అనుభవించక తప్పదు. కనుక, జన్మములు మారినంత మాత్రాన వాటిని అనుభవించక తప్పదు.

తెభా-10.1-31-ఆ.
లఘటాదులందుఁ జంద్రసూర్యాదులు
గానబడుచు గాలిఁ దలు భంగి
నాత్మకర్మ నిర్మితాంగంబులను బ్రాణి
దలుచుండు రాగలితుఁ డగుచు.

టీక:- జలఘట = నీటికుండ; ఆదులు = మున్నగువాని; అందున్ = లో; చంద్ర = చంద్రుడు; సూర్య = సూర్యుడు; ఆదులున్ = మున్నగునవి; కానబడుచున్ = కనబడుతూ; గాలిన్ = గాలివలన; కదలు = చలించు; భంగిన్ = వలె; ఆత్మ = తన యొక్క; కర్మ = కర్మములచేత; నిర్మిత = కలిగింపబడిన; అంగంబులను = అవయవములతో; ప్రాణి = జీవి; కదలుచుండున్ = మెలగుచుండును; రాగ = హర్షశోకాదులతో {రాగద్వేషాదులు - రాగము ద్వేషము కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఈర్ష్య అసూయ దంభము దర్పము అహంకారము}; కలితుడు = కూడుకొన్నవాడు; అగుచున్ = ఔతూ.
భావము:- చంద్రబింబం సూర్యబింబం మొదలైనవి నీటికుండలు మొదలైనవాటిలో ప్రతిబింబిస్తూ గాలికి కదులుతూ ఉంటాయి. అలాగే ప్రాణి తన కర్మల చేత నిర్మించుకున్న శరీరాలలో ఆసక్తి చెంది సంచలియించుచూ ఉంటాడు.

తెభా-10.1-32-క.
ర్మములు మేలు నిచ్చును;
ర్మంబులు గీడు నిచ్చుఁ; ర్తలు దనకుం
ర్మములు బ్రహ్మ కైనను;
ర్మగుఁ డై పరులఁ దడవఁగా నేమిటికిన్?

టీక:- కర్మములు = చేసిన కర్మములు; మేలున్ = శుభములను; ఇచ్చును = కలిగించును; కర్మంబులున్ = చేసిన కర్మములు; కీడున్ = అశుభములను; ఇచ్చున్ = కలిగించును; కర్తలు = కలిగించెడివి; తన = తన; కున్ = కు; కర్మములు = చేసుకొన్న కర్మములే; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కైననున్ = కి అయినప్పటికి; కర్మగుడు = కర్మలు చేసుకొన్న వాడు; ఐ = తానై ఉండి; పరులన్ = ఇతరులపై; తడవగాన్ = విచారించుట; ఏమిటికిన్ = ఎందులకు.
భావము:- మంచి అయినా, చెడు అయినా ఎవరికైనా తాను చేసుకున్న కర్మల ఫలితంగానే వస్తుంది. బ్రహ్మదేవుడు అంతటివాడికి అయినా తన కర్మలే తన అనుభవానికి కర్తలు. కర్మను అనుసరించి ప్రవర్తిస్తూ ఇతరులలో దోషాలు వెతకడం ఎందుకు?

తెభా-10.1-33-క.
కావునఁ బరులకు హింసలు
గావింపఁగ వలదు తనకుఁ ల్యాణముగా
భావించి పరుల నొంచినఁ
బోవునె? తత్ఫలము పిదపఁ బొందక యున్నే?

టీక:- కావునన్ = అందుచేత; పరుల్ = ఇతరుల; కున్ = కు; హింసలు = బాధించుటలు; కావింపగన్ = చేయుట; వలదు = వద్దు; తన = తన; కున్ = కు; కల్యాణము = శుభములు; కాన్ = అగునని; భావించి = అనుకొని; పరులన్ = ఇతరులను; ఒంచినన్ = బాధించినచో; పోవునె = తప్పిపోవునా, పోవు; తత్ = ఆ కర్మముల; ఫలము = ఫలితములు; పిదపన్ = తరువాత; పొందకన్ = కలుగకుండా; ఉన్నే = ఉండునా, ఉండవు.
భావము:- కాబట్టి, ఇతరులను బాధించడం మంచిపని కాదు. తన సౌఖ్యం కోసం అనుకుంటూ ఇతరులను బాధిస్తే ఊరకే పోతుందా? దానికి ఫలితం తరువాత అయినా పొందక తప్పదు కదా!”

తెభా-10.1-34-మత్త.
వావిఁ జెల్లెలు గాని పుత్రికవంటి దుత్తమురాలు; సం
భానీయచరిత్ర; భీరువు; బాల; నూత్నవివాహ సు
శ్రీవిలాసిని; దీన; కంపితచిత్త; నీ కిదె మ్రొక్కెదం;
గావే; కరుణామయాత్మక; కంస! మానవవల్లభా!"

టీక:- వావిన్ = వరుసకు; చెల్లెలు = చెల్లెలు; కాని = కాని; పుత్రిక = కూతురు; వంటిది = లాంటిది; ఉత్తమురాలు = మంచియామె; సంభావనీయ = గౌరవింపదగిన; చరిత్ర = నడవడికగలామె; భీరువు = భయస్తురాలు; బాల = చిన్నపిల్ల; నూత్నవివాహ = కొత్తపెళ్ళికూతురు; సు = మేలైన; శ్రీ = కాంతి యొక్క; విలాసిని = విలాసవతి; దీన = దీనురాలు; కంపిత = చలించిన; చిత్త = మనస్సు కలామె; నీ = నీ; కున్ = కు; ఇదె = ఇదిగో; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; కావవే = కాపాడుము; కరుణామయ = దయ గల; ఆత్మక = మనసు కలవాడ; కంస = కంసుడా; మానవవల్లభా = రాజా.
భావము:- ఓ కంసమహారాజా! నువ్వు దయామయుడవు. ఈ దేవకి ఏదో వరసకి చెప్పడానికి నీకు చెల్లెలు కాని నీకు కూతురు వంటిది. చాలా మంచిది. గౌరవించదగ్గ ప్రవర్తన కలది. భయస్తురాలు. కొత్త పెళ్ళికూతురు. మంచి లక్ష్మీకళ ఉట్టిపడుతున్నది. దీనురాలు. భయంతో లోలోన వణికిపోతూ ఉంది. ఇదిగో నీకు మ్రొక్కుతున్నాను, ఈమెను కాపాడవయ్యా!

తెభా-10.1-35-వ.
అని మఱియు సామభేదంబులగు పలుకులు పలికిన వినియు వాఁడు వేఁడిచూపుల రాలు నిప్పులు గుప్పలుగొన ననుకంపలేక, తెంపుఁజేసి చంపకగంధిం జంపఁ జూచుట యెఱింగి మొఱంగెడి తెఱంగు విచారించి తనలో నిట్లనియె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; సామ = మంచి మాటల; భేదంబులు = దిగులు పుట్టించునవి; అగు = ఐన; పలుకులు = మాటలు; పలికిన = చెప్పగా; వినియు = వినినప్పటికి; వాడు = అతడు; వేడి = కోపమువలన వేడెక్కిన; చూపులన్ = చూపులందు; రాలు = పడుతున్న; నిప్పులు = అగ్నికణములు; కుప్పలు = రాసులుగా; కొనన్ = పడుతుండగా; అనుకంప = దయ; లేక = లేకుండగ; తెంపుజేసి = తెగించి; చంపకగంధిన్ = సుందరిని; చంపన్ = సంహరించుటకు; చూచుట = యత్నించుట; ఎఱింగి = తెలిసి; మొఱంగెడి = వంచించెడి, ఒప్పించెడి; తెఱంగు = విధానము; విచారించి = ఆలోచించుకొని; తన = తన మనసు; లోన్ = అందు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా వసుదేవుడు ఎంతో అనునయంగా కంసుడి మనస్సు కరిగించాలని మాట్లాడాడు. అయినా కంసుడికి జాలి పుట్ట లేదు. అతడు కోపపు చూపులతో కన్నుల నుండి నిప్పులు రాలుతూండగా, దేవకిని చంపబోయాడు. అతని మూర్ఖత్వాన్ని గమనించి వసుదేవుడు ఎలాగైనా అతణ్ని ఒప్పించాలని తనలో ఇలా అనుకున్నాడు.

తెభా-10.1-36-క.
"ఎందును గాలము నిజ మని
పంతనంబునను బుద్ధిఁబాయక ఘనులై
యెందాఁక బుద్ధి నెగడెడి
నందాఁకఁ జరింపవలయు నాత్మబలమునన్."

టీక:- ఎందునున్ = ఎప్పటికిని; కాలము = మరణము; నిజము = తథ్యము; అని = అని; పందతనంబునను = పిరికితనముతో; బుద్ధిన్ = తెలివిన్; పాయక = కోల్పోకుండగ; ఘనులు = గొప్పవారు; ఐ = అయ్యి; ఎందాక = ఎంతదూరము; బుద్ధిన్ = తనబుద్ధి; నెగడెడిన్ = వ్యాపించునో; అందాక = అప్పటివరకు; చరింపవలయున్ = ప్రవర్తించుచుండవలెను; ఆత్మబలమునన్ = స్వశక్తిచేత;
భావము:- “మనుషులకు బేలతనం పనికి రాదు. ఎప్పుడైనా కాలమే వాస్తవం అయినది అనే వివేకాన్ని పిరికిదనంతో వదల రాదు. ఆత్మబలంతో గట్టిగా నిలబడి తన బుద్ధి ఎంతవరకు ప్రసరిస్తుందో అంతవరకూ ఉపాయం ఆలోచించి ఆచరిస్తూ ఉండాలి.”

తెభా-10.1-37-వ.
అని నిశ్చయించి.
టీక:- అని = అని; నిశ్చయించి = నిర్ణయించుకొని.
భావము:- అని వసుదేవుడు ఇలా గట్టిగా నిశ్చయించుకొని . . .

తెభా-10.1-38-సీ.
"పన్నురాలైన యంగన రక్షింప-
సుతుల నిచ్చెద నంట శుభము నేడు;
మీ దెవ్వ డెఱుగును? మెలఁత ప్రాణంబుతో-
నిలిచిన మఱునాడు నేరరాదె?
సుతులు పుట్టిర యేని సుతులకు మృత్యువు-
వాలాయమై వెంట చ్చెనేని
బ్రహ్మచేతను వీఁడు పా టేమియును లేక-
యుండునే? సదుపాయ మొకటి లేదె?

తెభా-10.1-38.1-తే.
పొంత మ్రాఁకులఁ గాల్పక పోయి వహ్ని
యెగసి దవ్వులవాని దహించు భంగిఁ
ర్మవశమున భవమృతికారణంబు
దూరగతిఁ బొందు; నిఁక నేల తొట్రుపడఁగ?

టీక:- ఆపన్నురాలు = ఆపదలోపడినామె; ఐన = అయినట్టి; అంగన = స్త్రీని; రక్షింపన్ = కాపాడుటకు; సుతులన్ = పుత్రులను; ఇచ్చెదను = చంపనిచ్చెదను; అంట = అనుట; శుభము = మేలు; నేడు = ఇవాళ; మీద = కాబోవునది; ఎవ్వడు = ఎవరు మాత్రము; ఎఱుగును = తెలియగలడు; మెలతన్ = ఇల్లాలును; ప్రాణంబు = ఊపిరులు; తోడన్ = తోటి; నిలిచినన్ = ఆగినచో; మఱునాడు = మరింకొకరోజు; నేర = సామర్థ్యము; రాదె = కలుగపోతుందా; సుతులు = పుత్రులు; పుట్టిరి = జన్మించిరి; ఏని = అయినచో; సుతుల్ = పుత్రుల; కున్ = కు; మృత్యువు = మరణము; వాలాయము = తప్పనిసరైనది; ఐ = అయ్యి; వెంటన్ = కూడా; వచ్చెన్ = వచ్చినది; ఏని = ఐనను; బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేతను = వలన; వీడు = ఇతను; పాటు = అపాయము; ఏమియును = ఏమాత్రము; లేక = లేకుండగ; ఉండును = ఉండును; ఏ = ఎలాంటి; సదుపాయము = అవకాశములు; ఒకటి = ఒక్కటైనను; లేదే = లేదా ఏమి, తప్పకుండును.
పొంత = దగ్గరగా ఉన్న; మ్రాకులన్ = చెట్లను; కాల్పకన్ = మండించుట చేయకుండగ; పోయి = వెళ్ళి; వహ్ని = అగ్ని మంటలు; ఎగసి = లేచి; దవ్వులన్ = దూరముగా నున్న; వానిన్ = వాటిని; దహించున్ = కాల్చివేసెడి; భంగిన్ = వలె; కర్మ = చేసినకర్మముల; వశమునన్ = అనుసరించి. భవ = పుట్టుక; మృతి = చావులకు; కారణంబు = హేతువులు; దూరగతిన్ = దూరపుమార్గమును; పొందును = చెందును; ఇక = ఇంకా; ఏల = ఎందుకు; తొట్రుపడగ = తడబడుట.
భావము:- “ఆపదపాలైన దేవకిని రక్షించడానికి పుట్టబోయే కుమారులను వీడికి ఇచ్చేస్తాను అనడం ప్రస్తుతానికి తగిన పని. ముందు ఏమి జరగబోతున్నదో ఎవరికి తెలుసు? ఈమె ఇప్పటికి ప్రాణాలతో నిలచి ఉంటే, రేపటికి మరోమార్గం లభించదా? పుత్రులే పుట్టి వారికి వెనువెంటనే మృత్యువు కూడా వస్తేరానీ. అందాకా వీడు బ్రహ్మదేవుడి చేత ఏ ఆపద పొందకుండానే ఉంటాడా? అప్పటికి తగ్గ ఉపాయం ఏదో ఒకటి ఉండదా. అడవిలో పుట్టిన దావాగ్ని ప్రక్కనున్న చెట్లను విడచి ఎగసిపడి ఎక్కడో దూరాన ఉన్న చెట్లను దహించి వేస్తుంది. అలాగే కర్మను అనుసరించి జన్మ మృత్యువు అనే కారణాలు దూరదూరంగా పోతూ ఉంటాయి. ఇంతతెలిసీ ఇంకా తొట్రుపడడం ఎందుకు?

తెభా-10.1-39-క.
కొడుకుల నిచ్చెద నని సతి
విడిపించుట నీతి; వీఁడు విడిచిన మీఁదం
గొడుకులు పుట్టినఁ గార్యము
డఁబడదే? నాటి కొక్క దైవము లేదే?

టీక:- కొడుకులన్ = పుట్టబోవు పుత్రులను; ఇచ్చెదను = ఇస్తాను; అని = అని; సతిన్ = భార్యను; విడిపించుట = కాపాడుట; నీతి = తగినది; వీడు = ఇతడు; విడిచిన = వదలిపెట్టిన; మీదన్ = తరువాత; కొడుకులు = పుత్రులు; పుట్టినన్ = జన్మించినను; కార్యము = ఈ పని; తడబడదే = తప్పిపోదా; నాటి = ఆరోజు; కిన్ = కి; ఒక్క = ఎవరో ఒక; దైవము = దేవుని అనుగ్రహము; లేదే = కలుగదా, కలుగును.
భావము:- పుట్టబోయే కొడుకులను ఇస్తాను అని మాట ఇచ్చి, భార్యను విడిపించడం తెలివైనపని. వీడిప్పుడు వదిలితే తరువాత కొడుకులు పుట్టే నాటికి పరిస్థితులు తారుమారు కాకపోతాయా? ఆనాటికి ఏ దైవమో అడ్డుపడక పోతుందా?

తెభా-10.1-40-క.
నిమిదవ చూలు వీనిం
దునుమాడెడి నంచు మింటఁ దోరపుఁబలుకుల్
వినఁబడియె; నేల తప్పును?
నితను విడిపించు టొప్పు వైళం బనుచున్,"

టీక:- ఎనిమిదవ = ఎనిమిదవ (8); చూలు = పురుటిబిడ్డ; వానిన్ = ఇతనిని; తునుమాడును = సంహరించును; అంచున్ = అనుచు; మింటన్ = ఆకాశమున; తోరపు = గంభీరమైన; పలుకుల్ = మాటలు; వినబడియెన్ = వినిపించినవి; ఏలన్ = ఎందుకు; తప్పును = జరగకుండును; వనితనున్ = ఇంతిని; విడిపించుట = తప్పించుట; ఒప్పు = సరియైనపని; వైళంబు = త్వరితముగా; అనుచున్ = అంటూ.
భావము:- ఎనిమిదవ గర్భంలో పుట్టేవాడు వీడిని సంహరిస్తాడని మాటలు సూటిగా వినువీధి నుంచి వినపడ్డాయి. అవి ఎందుకు తప్పుతాయి. త్వరగా నా భార్యను విడిపించడం మంచిది” అని ఆలోచించాడు వసుదేవుడు.

తెభా-10.1-41-క.
తిన్నని పలుకులు పలుకుచుఁ
గ్రన్నన తగఁ బూజ చేసి కంసు నృశంసున్
న్నించి చిత్త మెరియఁ బ్ర
న్నాననుఁ డగుచుఁ బలికె శౌరి నయమునన్.

టీక:- తిన్నని = మెల్లమెల్లని; పలుకులు = మాటలు; పలుకుచు = మాట్లాడుతూ; క్రన్ననన్ = వేగముగ; తగన్ = చక్కగా; పూజ = గౌరవించుట; చేసి = చేయుచు; కంసున్ = కంసుని; నృశంసున్ = క్రూరుని; మన్నించి = గౌరవించి; చిత్తము = మనస్సు; ఎరియన్ = మండుచున్నను; ప్రసన్న = వికాసవంతమైన; ఆననుడు = ముఖము కలవాడు; అగుచున్ = ఔతూ; శౌరి = వసుదేవుడు {శౌరి - శూరుని కొడుకు, విజ్ఞానము గలవాడు, వసుదేవుడు}; నయమునన్ = మెత్తదనముతో.
భావము:- మర్యాదతో కూడిన మంచిమాటలతో క్రూరుడైన కంసుని గౌరవించి పొగిడాడు. మనస్సులో మంటగా ఉన్నా వసుదేవుడు పైకి నవ్వుతున్న ముఖంతో అనునయంగా నేర్పుగా ఇలా అన్నాడు.

తెభా-10.1-42-క.
"లనకుఁ బుట్టిన కొమరుని
నం దెగె దనుచు గగనవాణి పలికె నం
లిగెద వేని మృగాక్షికిఁ
కొడుకులఁ జంప నిత్తుఁ గ్రమమున నీకున్."

టీక:- లలన = ఇంతి; కున్ = కి; పుట్టిన = పుట్టినట్టి; కొమరుని = పిల్లవాడి; వలనన్ = చేత; తెగెదు = మరణించెదెవు; అనుచున్ = అనుచు; గగనవాణి = ఆకాశవాణి; పలికెన్ = చెప్పినది; అంచున్ = అనుచు; అలిగెదవు = కోపగించుచున్న; ఏని = పక్షమున; మృగాక్షి = సౌందర్యవతి {మృగాక్షి - లేడికన్నులామె, అందమైన స్త్రీ}; కిన్ = కి; కల = కలిగెడి; కొడుకులన్ = పుత్రులను; చంపన్ = సంహరించుటకు; ఇత్తున్ = ఇచ్చెదను; క్రమముగన్ = వరుసగా; నీ = నీ; కున్ = కు.
భావము:- “ఈమెకు పుట్టిన కొడుకు వలన మరణిస్తావని ఆకాశవాణి పలికిందని కదా కోపగిస్తున్నావు. దేవకికి పుట్టిన కొడుకులు అందరినీ నీకు తెచ్చి ఇస్తాను. వారిని నువ్వు చంపుదువుగాని.”

తెభా-10.1-43-వ.
అని యిట్లు పలికిన విని కంసుడు కంపితావతంసుండై సంతసించి గుణగ్రాహిత్వంబుఁ గైకొని కొందలమందు చెలియలి మందలవిడిచి చనియె; వసుదేవుండును బ్రదుకుమందలఁ గంటి ననుచు సుందరియుం దానును మందిరంబునకుం బోయి డెందంబున నానందంబు నొందియుండె; నంతఁ గొంత కాలంబు చనిన సమయంబున.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలికిన = చెప్పగా; విని = విన్నవాడై; కంసుడు = కంసుడు; కంపిత = ఊపిన; అవతంసుడు = తల కలవాడు; ఐ = అయ్యి; సంతసించి = తృప్తిచెంది; గుణ = మంచిని; గ్రాహిత్వంబున్ = స్వీకరించుట; కైకొని = అంగీకరించి; కొందలము = దుఃఖము; అందు = చెందుతున్న; చెలియలిన్ = చెల్లెలను; మందలవిడిచి = ప్రాణాలతో వదలిపెట్టి; చనియెన్ = వెళ్ళిపోయెను; వసుదేవుండును = వసుదేవుడు; బ్రతుకుమందలన్ = బ్రతుకుతెరువు; కంటిన్ = చూచితిని; అనుచున్ = అనుచు; సుందరియున్ = భార్య; తానునున్ = అతను; మందిరంబున్ = నివాసమున; కున్ = కు; పోయి = వెళ్ళి; డెందంబునన్ = మనసు లనందు; ఆనందంబున్ = సంతోషము; ఒంది = కలిగి; ఉండెన్ = ఉండెను; అంతన్ = అంతట; కొంత = కొన్ని; కాలంబున్ = దినములు; చనిన = గడిచిన; సమయంబునన్ = అప్పుడు.
భావము:- వసుదేవుడు ఇలా చెప్పగానే కంసుడు తలూపుతూ సంతోషించాడు. భయపడుతున్న చెల్లెలి కొప్పును విడిచి ఇంటికి వెళ్ళిపోయాడు. బ్రతుకుజీవుడా అనుకుంటూ వసుదేవుడు, అతని భార్య దేవకీదేవి తమ మందిరానికి వెళ్ళి సంతోషంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.

తెభా-10.1-44-క.
విడువక కంసుని యెగ్గులఁ
డి దేవకి నిఖిలదేవభావము దన కే
ర్ప నేఁట నొకని లెక్కను
గొడుకుల నెనమండ్ర నొక్క కూతుం గనియెన్.

టీక:- విడువకన్ = వదలకుండ; కంసుని = కంసుడు పెట్టిన; ఎగ్గులన్ = బాధలను; పడిన్ = అనుభవించుతున్నను; దేవకి = దేవకీదేవి; నిఖిల = సమస్తమైన; దేవ = దైవికమైన; భావమున్ = భావములు; తన = ఆమె; కిన్ = కి; ఏర్పడన్ = కలుగుతుండగా; ఏటన్ = ప్రతి సంవత్సరము; ఒకనిన్ = ఒకడు; లెక్కను = చొప్పున; కొడుకులన్ = పుత్రులను; ఎనమండ్రన్ = ఎనిమిదిమందిని (8); ఒక్క = ఒక; కూతున్ = పుత్రికను; కనియెన్ = ప్రసవించెను.
భావము:- కంసుడి చేత ఎడతెగని బాధలుపడుతూ దేవకీదేవి అందరు దేవతల భావము తాను పొంది ఏడాదికి ఒకరు చొప్పున ఎనిమిదిమంది కొడుకులను ఒక కూతురును కన్నది.

తెభా-10.1-45-వ.
అందు.
టీక:- అందున్ = వారిలో.
భావము:- అలా ఉండగా. . .

తెభా-10.1-46-ఆ.
సుదతి మున్ను గన్న సుతుఁ గీర్తిమంతుని
పుట్టుఁ దడవు కంసభూవరునకుఁ
దెచ్చి యిచ్చెఁ జాల ధృతి గల్గి వసుదేవుఁ
డాశపడక సత్యమందు నిలిచి.

టీక:- సుదతి = పడతి; మున్ను = మొదట; కన్న = ప్రసవించిన; సుతున్ = పుత్రుని; కీర్తిమంతునిన్ = కీర్తిమంతుడు అనెడివానిని; పుట్టున్ = పుట్టినదే; తడవు = ఆలస్యము; కంస = కంసుడు అనెడి; భూవరున్ = రాజున; కున్ = కు; తెచ్చి = తీసుకుకు వచ్చి; ఇచ్చెన్ = ఇచ్చెను; చాలన్ = మిక్కిలి; ధృతి = ధైర్యము; కల్గి = కలిగి; వసుదేవుడు = వసుదేవుడు; ఆశపడకు = ఆశపడకుండగ; సత్యము = మాటమీద నిలబడుట; అందున్ = అందే; నిలిచి = స్థిరముగ ఉండి.
భావము:- దేవకీదేవి మొదటి కాన్పులో ప్రసవించిన కొడుకు కీర్తిమంతుడు. ఆమె కన్న ఆ మొదటి కుమారుడిని పుట్టిన వెంటనే వసుదేవుడు ధైర్యంగా తీసుకువచ్చి అన్నమాట ప్రకారం కంసుడికి ఇచ్చేసాడు.

తెభా-10.1-47-క.
లికిన పలుకులు దిరుగక
సొయక వంచనము లేక సుతుల రిపునకున్
లఁగక యిచ్చిన ధీరుం
డి వసుదేవుండు దక్క నితరుఁడు కలడే?

టీక:- పలకిన = ఆడిన; పలుకుల = మాటను; తిరుగక = తప్పకుండ; సొలయకన్ = వెనుదీయకుండ; వంచనము = మోసగించుట; లేక = లేకుండ; సుతులన్ = కొడుకులను; రిపున్ = శత్రువున; కున్ = కు; కలగకన్ = మనసున కలత చెందక; ఇచ్చిన = ఇచ్చినట్టి; ధీరుండు = ధైర్యశాలి; వసుదేవుండు = వసుదేవుడు; తక్క = తప్పించి; ఇతరుడు = మరి ఒకడు; కలడే = ఉన్నాడా, ఉండడు.
భావము:- ఇచ్చినమాట తప్పకుండా తాత్సారం చేయకుండా బెంగ పడకుండా కన్నకొడుకును శత్రువునకు అప్పగించిన ధీరుడు వసుదేవుడు తప్ప భూమిమీద ఇంకెవ రున్నారు?

తెభా-10.1-48-ఆ.
మానవేంద్ర! సత్యతికి దుష్కరమెయ్య?
దెఱుఁక గలుగువాని కిష్ట మెయ్య?
దీశభక్తి రతుని కీరాని దెయ్యది?
యెఱుక లేనివాని కేది కీడు?

టీక:- మానవేంద్ర = రాజా {మానవేంద్రుడు - మానవులకు ప్రభువు, రాజు}; సత్యమతి = సత్యవంతుని; కిన్ = కి; దుష్కరము = చేయలేనిది; ఎయ్యది = ఏముంది; ఎఱుక = తెలివిడి; కలుగు = కలిగిన; వాని = మనిషికి; కిన్ = కి; ఇష్టము = ప్రీయమైనది; ఎయ్యది = ఏముంది; ఈశభక్తి = విష్ణుభక్తి యెడల; రతున్ = ఆసక్తి కలవాని; కిన్ = కి; ఈరానిది = ఇవ్వలేనిది; ఎయ్యది = ఏముంది; ఎఱుక = జ్ఞానము; లేనివాని = హీనున; కిన్ = కి; ఏది = అంతకంటె ఏది; కీడు = హాని.
భావము:- పరీక్షన్మహారాజా! సత్యము నందు నిశ్చలంగా నిలపడిన బుద్ధిమంతుడికి కష్టమైన పని అంటూ ఏదీ ఉండదు. జ్ఞాని అయినవాడికి ఇష్టమైనది అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు. అజ్ఞానికి అపకారం అంటూ వేరే ఏమీ ఉండదు. పరమేశ్వరుని భక్తుడికి ఇతరులకు ఇవ్వరానిది అంటూ ఏమీ ఉండదు.

తెభా-10.1-49-వ.
ఇట్లు సత్యంబు దప్పక కొడుకు నొప్పించిన వసుదేవుని పలుకునిలుకడకు మెచ్చి కంసుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సత్యంబున్ = ఆడినమాటను; తప్పక = తప్పకుండగ; కొడుకున్ = పుత్రుని; ఒప్పించిన = ఒప్పజెప్పిన; వసుదేవుని = వసుదేవుని; పలుకునిలుకడ = మాటనిలకడ; కున్ = కి; మెచ్చి = మెచ్చుకొని; కంసుండు = కంసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఇలా సత్యం తప్పకుండా కొడుకును తీసుకువచ్చి ఒప్పగించిన వసుదేవుని మాటనిలకడకు మెచ్చుకుని కంసుడు ఇలా అన్నాడు.

తెభా-10.1-50-ఆ.
కొడుకు నీవు మరలఁ గొనిపొమ్ము వసుదేవ!
వెఱపు లేదు నాకు వీనివలన;
ల్గ వీనికి; భవ ష్టమపుత్రుండు
మృత్యు వఁట; వధింతు మీఁద నతని.

టీక:- కొడుకున్ = పుత్రుని; నీవున్ = నీవు; మరలన్ = వెనుకకు; కొనిపొమ్ము = తీసుకువెళ్ళిపో; వసుదేవ = వసుదేవుడా; వెఱపు = భయము; లేదు = లేదు; నా = నా; కున్ = కు; వీని = ఇతని; వలనన్ = మూలమున; అల్గన్ = కోపించను; వీని = ఇతని; కిన్ = ఎడల; భవత్ = నీ యొక్క; అష్టమ = ఎనిమిదవ (8); పుత్రుండు = కుమారుడు; మృత్యువు = చంపువాడు; అటన్ = అట; వధింతున్ = సంహరించెదను; మీదన్ = తరువాత; అతని = అతనిని.
భావము:- “బావా! వసుదేవా! నీ కొడుకును తీసుకువెళ్ళు. వీడి వలన నాకు భయం లేదు. నీ ఎనిమిదవ పుత్రుడే నా పాలిట మృత్యువట. వాడు పుట్టిన వెంటనే వధిస్తాను.”

తెభా-10.1-51-వ.
అనిన నానకదుందుభి నందనుం గొని చనియు నానందంబు నొందక, దుష్టస్వభావుండగు బావపలుకులు వినియు నులుకుచుండె; నంత
టీక:- అనినన్ = అనగా; ఆనకదుందుభి = వసుదేవుడు {ఆనకదుందుభి – పుట్టినప్పుడు ఆనకములు, దుందుభులు మ్రోగినవాడు, వసుదేవుడు}; నందనునన్ = పుత్రుని; కొని = తీసుకొని; చనియున్ = వెళ్ళిపోయినను; ఆనందంబున్ = సంతోషమును; ఒందక = పొందకుండగ; దుష్ట = చెడ్డ; స్వభావుండు = స్వభావము కలవాడు; అగు = ఐన; బావ = భార్య యొక్క అన్న; పలుకులున్ = మాటలు; వినియున్ = విన్నప్పటికిని; ఉలుకుచున్ = కంగారుపడుచు; ఉండె = ఉండెను; అంత = ఆ తరువాత.
భావము:- దుష్ట స్వభావం గల తన బావ కంసుడి మాటలు విని, కొడుకును ఇంటికి అయితే తీసుకొని వెళ్ళాడు కానీ, పుట్టినప్పుడు ఆనకములు, దుందుభులు మ్రోగిన ఆ వసుదేవుడు, ఎప్పుడు ఏమౌతుందో అనే సందేహంతో ఉలికిపడుతూనే ఉన్నాడు. ఇంతలో . . . .