Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వర్షాగమ విహారంబు

వికీసోర్స్ నుండి

తెభా-10.1-760-శా.
ర్షాగమమందు గోవుల నరణ్యాంతంబులన్ మేపుచున్
గోవిందుండు ప్రలంబవైరియుతుఁడై గోపాలవర్గంబుతోఁ
బ్రావీణ్యంబునఁ గందమూలఫలముల్ క్షించుచున్ మంజుల
గ్రావాగ్రంబులఁ బ్రీతిఁ జల్దిగుడిచెం గాసారతీరంబులన్.

టీక:- ఆ = ఆ యొక్క; వర్షాగమము = వర్ష ఋతువు; అందున్ = లో; గోవులన్ = ఆవులను; అరణ్య = అడవుల; అంతంబులన్ = లో; మేపుచున్ = కాచుచు; గోవిందుండు = కృష్ణుడు {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; ప్రలంబవైరి = బలరామునితో {ప్రలంబవైరి - ప్రలంబాసురిని శత్రువు, బలరాముడు}; యుతుడు = కూడినవాడు; ఐ = అయ్యి; గోపాల = గోపకుల; వర్గంబు = సమూహము; తోన్ = తోటి; ప్రావీణ్యంబునన్ = నేర్పరితనముతో; కందమూల = దుంపలు, కందదుంపలు; ఫలముల్ = పండ్లు; భక్షించుచున్ = తినుచు; మంజుల = చక్కటి; గ్రావ = కొండరాళ్ళ; అగ్రంబులన్ = మీద; ప్రీతిన్ = ఇష్టముగా; చల్ది = చల్దన్నములను; కుడిచెన్ = తినెను; కాసార = సరోవరముల; తీరంబులన్ = గట్లమీద.
భావము:- ఆ వర్షఋతువులో శ్రీకృష్ణుడు అడవుల అంచుల్లో ఆవులను మేపుతూ. ప్రలంబాసురుణ్ణి వధించిన బలరాముడితోనూ, గోపాలబాలకులతోనూ కలిసి కందమూలాలు ఫలాలు అరగిస్తూ మడుగుల గట్ల మీద మనోహరమైన శిలాతలాల మీద, సంతోషంగా చల్దులు భుజించాడు.

తెభా-10.1-761-వ.
ఆ సమయంబున.
టీక:- ఆసమయంబునన్ = అప్పుడు.
భావము:- అలా వర్షాకాలంలో. . .

తెభా-10.1-762-సీ.
విశ్వమోహనమైన వేణు నినాదంబు-
రసగంభీర గర్జనముగాఁగ
హనీయ నిర్మల మందహాసద్యుతి-
లిత సౌదామనీ తిక గాఁగఁ
లచుట్టు బాగుగఁ నరు పింఛపుదండ-
శైలభేదను శరానము గాఁగఁ
రుణా కటాక్షవీక్షణ సుధావర్షంబు-
లిలధారా ప్రవర్షంబు గాఁగఁ

తెభా-10.1-762.1-తే.
జాడ నేతెంచు గోపాలన మునీంద్ర
చాతకంబుల దురవస్థఁ క్కఁ జేసి
కృష్ణమేఘంబు బహుతరకీర్తి నొప్పె
విమల బృందావనాకాశవీధి యందు.

టీక:- విశ్వ = లోకములను; మోహనము = మోహింపజేయునది; ఐన = అయినట్టి; వేణు = మురళీ; నినాదంబు = రవము; సరస = నవరసభరితమైన {నవరసములు - 1శృంగారము 2హాస్యము 3కరుణము 4వీరము 5రౌద్రము 6భయానకము 7భీభత్సము 8అద్భుతము 9శాంతము}; గంభీర = గంభీరమైన; గర్జనము = ఉఱుమువంటిది; కాగన్ = అగునట్లుగా; మహనీయ = గొప్పదైన; నిర్మల = స్వచ్ఛమైన; మందహాస = చిరినవ్వుల; ద్యుతి = కాంతి; లలిత = మనోజ్ఞమైన; సౌదామనీ = మెరుపు; లతిక = తీగ; కాగన్ = అగునట్లుగా; తల = శిరస్సు; చుట్టు = చుట్టూర, వలగొని; బాగుగన్ = చక్కగా; తనరు = అతిశయించునట్టి; పింఛపు = నెమలిపింఛము; దండ = మాల; శైలభేదనుశరాసనము = ఇంద్రధనుస్సు {శైలభేదనుశరాసనము - శైలభేదను (పర్వతములను కొట్టెడివాని, ఇంద్రుని) శరాసనము (విల్లు), ఇంద్రధనుస్సు}; కాగన్ = అగునట్లుగా; కరుణా = దయతోకూడిన; కటా = కడ; అక్ష = కన్నుల; వీక్షణ = చూపులు అనెడి; సుధా = అమృతపు; వర్షంబు = జల్లులు; సలిల = నీటి; ధారా = ధారలుగల; ప్రవర్షంబు = మంచివాన; కాగన్ = అగుచుండగ.
జాడన్ = అనుసరించి; ఏతెంచు = వచ్చెడి; గోపాలజన = గొల్లవాళ్ళు; ముని = ఋషి; ఇంద్ర = శ్రేష్ఠులు అనెడి; చాతకంబుల = చాతకపక్షుల, వానకోకిల; దురవస్థన్ = బాధలను; చక్కన్ = బాగు; చేసి = చేసి; కృష్ణ = కృష్ణుడు అనెడి; మేఘంబు = మేఘము; బహుతర = మిక్కిలిఅధికమైన {బహు - బహుతరము - బహుతమము}; కీర్తిన్ = కీర్తితో; ఒప్పెన్ = ఒప్పెను; విమల = స్వచ్ఛమైన; బృందావన = బృందావనము అనెడి; ఆకాశ = ఆకాశపు; వీధి = దారి; అందున్ = లో.
భావము:- నిర్మలమైన బృందావనం అనే వినువీధిలో శ్రీకృష్ణుడనే మేఘం మిక్కిలి విఖ్యాతంగా విహరించింది. భువనాలను సమ్మోహపరచే వేణుగానమే ఆ నీలమేఘానికి రసవంతమైన గంభీరమైన గర్జన అయింది. ఉదాత్తమూ స్వచ్ఛమూ అయిన దరహాస శోభయే మెరుగారు మెరుపుతీగ అయింది. తలచుట్టున చక్కగా విలసిల్లే నెమలిపింఛ కలాపమే ఇంద్రచాపం అయింది. కరుణాపూరితమైన కడగంటి చూపుల నుండి ప్రసరించే అమృతవర్షమే నీటి జల్లులు వార్చే వాన అయింది. ఇలా సంచరించిన ఆ శ్రీకృష్ణజీమూతం, తన్ను అనుసరించే గోపాలురు, మునీంద్రులు అనే చాతకపక్షుల తాపాలను రూపుమాపింది.

తెభా-10.1-763-క.
గోవుల వృషవత్సంబుల
వావిరిఁ బూజించి పిదప ర్షాకాల
శ్రీనితనుఁ బూజించెను
శ్రీల్లభుఁ డయ్యు గోపశేఖరుఁ డధిపా!

టీక:- గోవులన్ = ఆవులను; వృష = ఎద్దులను; వత్సంబులన్ = దూడలను; వావిరిన్ = అధికముగ; పూజించి = పూజించి; పిదపన్ = తరువాత; వర్షాకాల = వర్ష ఋతువు అనెడి; శ్రీవనితను = లక్ష్మీదేవిని; పూజించెను = పూజించెను; శ్రీవల్లభుండు = లక్ష్మీపతి; అయ్యున్ = అయినప్పటికి; గోపశేఖరుడు = కృష్ణుడు {గోపశేఖరుడు - గోపకులలో శేఖరుడు (శ్రేష్ఠుడు), కృష్ణుడు}; అధిపా = రాజా.
భావము:- పరీక్షిత్తు మహారాజా! తాను లక్ష్మీవల్లభుడైనా ఆ యదునందనుడు గోవులను కోడెదూడలను పూజించాడు ఆ పై వర్షలక్ష్మిని అర్చించాడు.