పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వర్షర్తు వర్ణనము
తెభా-10.1-754-సీ.
పూర్వవాయువులు ప్రభూతంబులై వీచెఁ-
బడమట నింద్రచాపంబు దోఁచెఁ
బరివేషయుక్తమై భానుమండల మొప్పె-
మెఱపు లుత్తరదిశ మెఱవఁ దొడగె
దక్షిణగాములై తనరె మేఘంబులు-
జలచరానీకంబు సంతసించెఁ
జాతకంబుల పిపాసలు కడపలఁ జేరెఁ-
గాంతారవహ్నుల గర్వ మడఁగె
తెభా-10.1-754.1-ఆ.
నిజకరాళివలన నీరజబంధుండు
దొల్లి పుచ్చుకొనిన తోయ మెల్ల
మరల నిచ్చుచుండె మహిఁ గర్షకానంద
కందమైన వాన కందు వందు.
టీక:- పూర్వ = తూర్పుకువీచెడి; వాయువులు = గాలులు; ప్రభూతంబులు = హెచ్చినవి; ఐ = అయ్యి; వీచెన్ = వీచినవి; పడమటన్ = పశ్చిమదిక్కునందు; ఇంద్రచాపంబున్ = ఇంద్రధనుస్సు; తోచెన్ = కనబడెను; పరివేష = గుడికట్టుటతో {గుడికట్టుట - ఆకాశమునందు సూర్యునిచుట్టు ఏర్పడెడి ప్రకాశవంతమైన తెల్లని చక్రాకారము తయారగుట}; యుక్తము = కూడినది; ఐ = అయ్యి; భాను = సూర్య; మండలము = బింబము; ఒప్పెన్ = అందగించినది; మెఱుపులు = మెరుపులు; ఉత్తర = ఉత్తరపు; దిశన్ = దిక్కునందు; మెఱవన్ = మెరియుట; తొడగెన్ = సాగెను; దక్షిణ = దక్షిణపువైపు; గాములు = పోవునవి; ఐ = అయ్యి; తనరెన్ = అతిశయించినవి; మేఘంబులు = మబ్బులు; జలచర = జలచరముల; అనీకంబు = సమూహములు; సంతసించెన్ = సంతోషించినవి; చాతకంబుల = చాతకపక్షుల, వానకోకిల; పిపాసలు = దప్పికలు; కడపలజేరెన్ = తుదముట్టెను; కాంతారవహ్నుల = కార్చిచ్చుల; గర్వము = అతిశయము; అడగెన్ = అణగిపోయెను.
నిజ = తన యొక్క; కర = కిరణముల; ఆళి = సమూహముల; వలన = చేత; నీరజబంధుండు = సూర్యుడు {నీరజబంధుడు - నీరజము (కలువపూల)కు బంధువు ఐనవాడు, సూర్యుడు}; తొల్లి = ఇంతకుముందు; పుచ్చుకొనిన = తీసుకొన్నట్టి; తోయము = నీరు; ఎల్లన్ = అంతటిని; మరలన్ = తిరిగి; ఇచ్చుచుండెన్ = ఇచ్చుచుండెను; మహిన్ = భూలోకమునందు; కర్షక = రైతుల, సేద్యగాండ్ర; ఆనంద = సంతోషమునకు; కందము = మూలము; ఐన = అయిన; వాన = వర్ష; కందువ = ఋతువు; అందున్ = అందు.
భావము:- ఇంతలో వర్షాకాలం వచ్చింది. తూర్పుగాలులు విపరీతంగా వీచాయి. పశ్చిమాన ఇంద్రధనుస్సు కనబడింది. చుట్టూ కట్టిన గాలిగుడితో సూర్యుడు చక్కగా ఉన్నాడు. ఉత్తరదిక్కులో మెరుపు మెరిసింది. మబ్బులు దక్షిణదిశకు తిరిగిపోసాగాయి. జలచరాలకు సంతోషం సమకూడింది. చాతకపక్షుల దప్పిక తీరింది. అడవులలోని దావాగ్నులు అణిగిపోయాయి. సూర్యుడు తన కిరణాలతో మునుపు స్వీకరించిన నీటిని అంతటినీ రైతులకు ఆనందదాయకమైన వానాకాలంలో వర్షాల రూపంలో ఇచ్చేస్తున్నాడు
తెభా-10.1-755-క.
వర్షాకాలభుజంగుఁడు
హర్షముతో నిడిన నవ నఖాంకము లని యు
త్కర్షింప భూమిసతిపైఁ
కర్షక హలరేఖ లమరె గహనాంతములన్.
టీక:- వర్షాకాల = వర్ష ఋతువు అనెడి; భుజంగుడు = విటుడు; హర్షము = సంతోషము; తోన్ = తోటి; ఇడిన = పెట్టిన; నవ = నూతనమైన; నఖాంకములు = నఖక్షతములు {నఖక్షతములు - గిల్లుటచేత చర్మముపై ఏర్పడు గోటి గుర్తు}; అని = అని; ఉత్కర్షింపన్ = పొగడునట్లుగా; భూమి = భూమి అనెడి; సతి = స్త్రీ; పైన్ = మీద; కర్షక = సేద్యగాని; హల = నాగలి, నాగేటి; రేఖలు = చాళ్ళు; అమరె = అమరి ఉన్నాయి; గహన = అడవి; అంతములన్ = చివరల యందు.
భావము:- వర్షాకాలం అనే విటుడు భూమి అనే అంగన మీద ఆనందంతో క్రొత్తగా పెట్టిన కొనగోటి నొక్కులవలె నేలపై కర్షకులు వేసిన నాగటిచాళ్ళు చక్కగా ఉన్నాయి.
తెభా-10.1-756-క.
చెలువుఁడు ప్రావృట్కాలుఁడు
పొలసినఁ బులకించు భూమి పులకము లనఁగా
మొలచి తల లెత్తి నిక్కుచు
సలలితగతిఁ జాలువారె సస్యము లధిపా!
టీక:- చెలువుడు = ప్రియుడు; ప్రావృట్కాలుడు = వర్షఋతువు అనెడి పురుషుడు; పొలసిన = సమీపించగా; పులకించు = గగుర్పాటు నొందు; భూమి = నేల; పులకములు = గగుర్పాటులు; అనగా = అన్నట్టుగా; మొలచి = మొలిచి; తలలెత్తి = నిటారుగా నిలబడి; నిక్కుచున్ = బిగువు కలిగి ఉండి; సలలిత = మిక్కిలి మనోజ్ఞముగా; చాలువారెన్ = వరుస కట్టాయి; సస్యములు = పైర్లు; అధిపా = రాజా.
భావము:- ఓ పరీక్షన్మహారాజా! వర్షాకాలమనే ప్రియుడు సమీపించగా, పుడమికి కలిగిన గగుర్పాటేమో అన్నట్లు మొలచి మొలకెత్తి నిలిచిన పైరులు సొగసుగా శోభిల్లాయి.
తెభా-10.1-757-వ.
మఱియుఁ జటుల పవన చలితంబులై మిన్నుదన్ని, లెక్కకు మిక్కిలియై, ఱెక్కలు గల నీలగిరుల సిరుల మీఱి, కాఱుకొని తెఱపిపడక, నిబిడంబులై, శిశిరకిరణ తరణి మండలంబుల చొప్పుదప్పించి, విప్పు కలిగి, చదలు గప్పికొనిన లీలం గ్రాలు నీలమేఘంబులును, మేఘవిముక్తంబులై జలదసమయవిటుండు సరసగతి ధరణిసతి యురమ్మున దర్పించి, నేర్పున సమర్పించు కర్పూరఖండంబుల వడువునఁ బుడమిం బడు కరకలును, గరకానుగతంబులై యసిత భోగిభోగంబుల బాగున నీలమణిమాలికా విశేషంబుల విధంబున నెడపడక పడు సలిలధారలును, ధారాధర విగళిత విమల సలిలంబులం దోఁగుచు మదజలాభిషిక్త మత్త మాతంగంబుల సొబగున నుండు కొండలును, గొండల తుదలనుండి గండ శైలంబులపైఁ బడి వికీర్యమాణంబులగు గిరినిర్ఝరంబుల శీకరంబులును, శీకరపరంపరల చొదుకులు మదుగులుగొనినఁ బిద పిద నగుచుఁ జిదుకుచిదుకుమను రొంపులును, రొంపులుగ్రొచ్చి క్రచ్చర నుచ్చలితంబులై పఱచు వఱదలును, వఱదల వలన మెదలి కదలిపాఱెడి యేఱులును నేఱులవెంట గఱులు త్రిప్పుచు గములుగొని క్రొన్నీటి కెదురునడచు మీనంబులును, మీననయనల మేనుల మెఱుంగు సొంపు పెంపు సైరింపక కంపించి తిరిగి సురిఁగి చనియెడు కరణి మేఘ మధ్యంబులం బొలసి మలసి నిలువక మరలి చను క్రొమ్మెఱుంగులును, మెఱుంగుల తెఱంగునఁ దెఱవలు పురుషులం దగిలి నిలువరని జనుల కెఱుంగ నలువ మొఱయిడిన వడువున మొరయు నుఱుములును, నుఱుముల కులికిపడక కికురుపొడుచుచుఁ బింఛంబులు కొంచెంబులు జేయక విప్పి దెప్పరంబుగ ఱొప్పుచు నర్తనంబులు చేయు మయూరంబులును, మయూర ఘోషంబులు భీషణంబులై చెవులు సోఁక ననూనంబులైన మానంబుల నాసలు చెడి యొండొరులకుం గ్రిందుపడి క్రందుకొను విరహిజనులును, జనులకు రేపు మా పని రూపింప రాక మాలతీ కుసుమ విసర వికసన విదితావసానంబు లగు దుర్దినంబులును, దినావసాన సమయంబున మినుకుమినుకు మని మెఱయుచుం దిరుగు ఖద్యోతంబులును, ఖద్యోతసందర్శనంబు గోరుచు నుడుగక విడువక కురియు జడింబడి వలిగొని వడఁకుచు నశనయత్నంబులు వర్జించి ఖర్జూర జంబూఫల భక్షణంబుల దేహ సంరక్షణంబు లాచరించు వనచరులును, వనచరానందకారిణులై వారరమణులరుచి ననవరత భుజగ సమేతలగు కేతకులును, గేతకీ కదంబ యూధికా కుటజ కుసుమ పరిమళ మిళితంబు లగు విపిన మార్గంబులును మార్గనిరోధంబు లగుచుం బెరిగి రసికంబులై పసరు దొలంకుచు హరిన్మణికిరణ పుంజంబుల భంగి రంజిల్లి తొంగలించుచు జొంపంబులు గొనిన కసువులును, గసువులు మెసవి మిసమిసం దనువులు మెఱయ వలుఁద పొదుఁగుల బరువునం గదలక నిల్చి నెమ రమర నిడు ధేనువులును, గలిగి ధేనువ్రజంబుకైవడిఁ బయఃకణ మనోహరంబై, హరకరంబు భంగిఁ బరిపూర్ణ సారంగ భాసురంబై, సురగిరి చెలువున హరి శరాసన విభీషణంబై, విభీషణ హృదయంబు పోలికఁ బ్రకటిత హరిశబ్ద వైభవంబై, భవపూజనంబు చందంబున నింద్రగోపాది విభవ జనకం బయి, జనక యాగంబు భాతి సీతాప్రకరణాలంకృతం బయి, కృతయుగంబు సొంపున బహువర్షంబునై వర్షాగమంబు చెలువొందె నప్పుడు.
టీక:- మఱియున్ = ఇంకను; చటుల = గట్టి; పవన = గాలులచేత; చలితంబులు = కదల్చబడినవి; ఐ = అయ్యి; మిన్ను = ఆకాశమును; తన్ని = అంటి; లెక్కకుమిక్కిలి = లెక్కలేనన్ని; ఐ = అయ్యి; ఱెక్కలు = రెక్కలు; కల = కలిగిన; నీల = నల్లని; గిరుల = కొండల; సిరులన్ = చక్కదనములను; మీఱి = మించిపోయి; కాఱుకొని = నలుపెక్కి; తెఱపిపడక = ఎడతెగక; నిబిడంబులు = దట్టమైనవి; ఐ = అయ్యి; శిశిరకిరణ = చంద్రుని యొక్క; తరణి = సూర్యుని యొక్క {తరణి - అంధకారమునుండి తరింపజేయువాడు, సూర్యుడు}; మండలంబుల = బింబముల; చొప్పు = చక్కదనములను; తప్పించి = మరుగుపరచి; విప్పు = విస్తారము; కలిగి = ఉండి; చదలు = ఆకాశమును; కప్పికొనిన = కమ్ముకొన్న; లీలన్ = విధముగా; నీల = నల్లని; మేఘంబులును = మబ్బులు; మేఘ = మేఘములనుండి; విముక్తంబులు = విడువబడినవి; ఐ = అయ్యి; జలదసమయ = వర్షఋతువు అనెడి; విటుండు = విటుడు; సరస = సరసములాడు; గతిన్ = విధముగ; ధరణిన్ = నేల అనెడి; సతి = స్త్రీ యొక్క; ఉరమునన్ = రొమ్ములపై; దర్పించి = విజృంభించి; నేర్పునన్ = ప్రౌఢత్వముతో; సమర్పించు = ఉంచెడి; కర్పూర = కర్పూరపు; ఖండంబుల = పలుకుల; వడువునన్ = వలె; పుడమిన్ = నేలపై; పడు = పడుచున్నట్టి; కరకలును = వడగండ్లు; కరక = వడగండ్లను; అనుగతంబులు = వెంబడించునవి; ఐ = అయ్యి; అసిత = నల్లని; భోగి = పాముల యొక్క; భోగంబుల = దేహముల; బాగునన్ = వలె; నీలమణి = నీలాల; మాలికా = దండల; విశేషంబులన్ = ఒకరకముల; విధంబునన్ = వలె; ఎడపడక = ఎడతెగక; పడు = వర్షించు; సలిల = నీటి; ధారలును = ధారలు; ధారాధర = మేఘముల నుండి; విగళిత = జారుతున్న; విమల = స్వచ్ఛములైన; సలిలంబులన్ = మంచినీటి యందు; తోగుచున్ = తడియుచు; మదజల = మదజలముచేత; అభిషిక్త = మిక్కిలతడిసిన; మత్త =మదించిన; మాతంగంబుల = ఏనుగుల; సొబగునన్ = విధముగ; ఉండు = ఉండెడి; కొండలున్ = కొండలు; కొండల = కొండల; తుదల = కొనల; నుండి = నుండి; గండశైలంబులన్ = బండరాళ్ళ; పైన్ = మీద; పడి = పడి; వికీర్యమాణంబులు = చెదురుచున్నవి; అగు = ఐన; గిరి = కొండల యందలి; నిర్ఝరంబులన్ = సెలయేళ్ళ యొక్క; శీకరంబులును = తుంపరలు; శీకర = తుంపరల; పరంపరలన్ = జడితో; చొదుగులు = చెమ్మలు; మదుగులగొని = అనుకులుకట్టి, మట్టిమెత్తగా అయ్యి; పిదపిదనగుచున్ = బురబురదగా ఔతు; చిదుకుచిదుకు = చిదుకు చిదుకు; అను = అనెడి; రొంపులును = బురదలు; రొంపులున్ = బురదలలో; గ్రొచ్చి = పెల్లగించి; క్రచ్చెరన్ = వేగముగా; ఉచ్చలితంబులు = పైకెగయునవి; ఐ = అయ్యి; మెదలి = కొద్దిగా కదిలి; కదలి = వెడలి; పాఱెడి = ప్రవహించెడి; ఏరులును = ప్రవాహములు; ఏరుల = ప్రవాహముల; వెంటన్ = వెనుక; గఱులు = రెక్కలు; త్రిప్పుచు = కదల్చుచు; గములు = గుంపులు; కొని = కట్టి; క్రొత్త = కొత్త; నీటి = నీటి ప్రవాహముల; కిన్ = కు; ఎదురు = ఎదురుగా; నడచు = ఈదెడి; మీనంబులును = చేపలు; మీననయనల = అందగత్తెల {మీననయన - మీన (చేపలవంటి) నయన (కన్నులు కలామె), సుందరి}; మేనుల = దేహముల; మెఱుంగు = కాంతుల; సొంపు = చక్కదనముల; పెంపున్ = అధిక్యమును; సైరింపక = ఓర్వలేక; కంపించి = వణికిపోయి; తిరిగి = వెనుదిరిగి; సురిగి = దాగి; చనియెడు = పోవునట్టి; కరణిన్ = విధముగా; మేఘ = మబ్బుల; మధ్యంబులన్ = నడుమ; పొలసి = కనబడి; మలసి = వ్యాపించి; నిలువకన్ = నిలువకుండా; మరలిచను = మాయమగు; క్రొత్త = నూతనమైన; మెఱుంగులును = మెరుపులు; మెఱుంగుల = మెరుపుల; తెరంగునన్ = వలె; తెఱవలు = స్త్రీలు; పురుషులన్ = పురుషులతో; తగిలి = లగ్నమై, నిలకడగకూడి; నిలువరు = ఉండరు; అని = అని; జనుల్ = ప్రజల; కున్ = కి; ఎఱుంగ = తెలియునట్లు; నలువ = బ్రహ్మదేవుడు; మొఱయిడిన = మొత్తుకొన్న; వడువునన్ = విధముగ; మొరయు = ధ్వనించునట్టి; ఉఱుములును = ఉరుములు; ఉఱుముల్ = ఉరుముల; కున్ = కి; ఉలికిపడక = బెదిరిపోక; కికురుపొడుచుచన్ = మెడలు తిప్పుతు; పింఛంబులున్ = పింఛములను; కొంచెంబులుజేయక = ముడుచుకొనకుండ; విప్పి = విప్పారించి; తెప్పరంబుగన్ = అధికముగ; రొప్పుచున్ = కేకలువేయుచు; నర్తనంబులు = నాట్యములు; చేయు = చేయునట్టి; మయూరంబులును = నెమళ్ళు; మయూర = నెమళ్ళ; ఘోషంబులు = కేకలు; భీషణంబులు = భయంకరములుగ; ఐ = అయ్యి; చెవులున్ = చెవులకు; సోకన్ = తగులగానే; అనూనంబులు = తక్కువకాని, అధికమైన; మానంబులన్ = శీలములమీది; ఆసలు = ఆపేక్షలు; చెడి = పోయి; ఒండొరుల = రెండవవారి; కున్ = కి; క్రిందుపడి = కిందపడి; క్రందుకొను = అతిశయించెడి; విరహి = విరహముగల; జనులును = ప్రజలు; జనుల్ = మానవుల; కున్ = కు; రేపుమాపు = పగలురాత్రి; అని = అనెడిభేదము; రూపింపన్ = చెప్పుటకు; రాక = అనువుగాక; మాలతీ = జాజి; కుసుమ = పూల; విసర = సమూహముల యొక్క; వికసన = విరిసినట్లు; విదిత = తెలియుట; అవసానంబులు = ముగిసినవి; అగు = ఐన; దుః = చెడ్డ; దినంబులును = రోజులు; దినావసాన = సాయంకాల; సమయంబునన్ = సమయమునందు; మినుకుమినుకు = మినుకుమినుకు; అని = అని; మెఱయుచున్ = ఆరివెలుగుతు; తిరుగు = మెలగునట్టి; ఖద్యోతంబులును = మిణుగురు పురుగులును; ఖద్యోత = సూర్యుడు; సందర్శనంబున్ = చక్కగాకనబడుటను; కోరుచును = అపేక్షించుచు; ఉడుగకన్ = తగ్గకుండ; విడువకన్ = వదలకుండ; కురియు = వర్షించెడి; జడిన్ = జల్లులందు; పడి = చిక్కుకొని; వలిగొని = చలిపెట్టి; వడకుచున్ = వణికిపోతు; అశన = వంటవండెడి; ప్రయత్నంబులున్ = ప్రయత్నములను; వర్జించి = విడిచిపెట్టి; ఖర్జూర = ఖర్జూరము, పేరీతల; జంబు = నేరేడు; ఫల = పండ్లను; భక్షణంబులన్ = తినుటచేత; దేహ = శరీర; సంరక్షణంబులు = పోషించుకొనుటలు; ఆచరించు = చేసెడి; వనచరులును = అడవిమనుషులు; వనచర = అడవిమనుషులకు; ఆనంద = ఆనందమును; కారిణులు = కలిగించెడివారు; ఐన = అయినట్టి; వారరమణుల = వేశ్యల; రుచిన్ = వలె; అనవరత = ఎల్లప్పుడు; భుజగ = విటులనెడి మిన్నాగులతో; సమేతలు = కూడినవి; అగు = ఐన; కేతకులును = పచ్చమొగలిచెట్లు; కేతకీ = పచ్చమొగలి; కదంబ = కడిమి; యూధికా = అడవిమొల్ల; కుటజ = కొడిసె; కుసుమ = పూల; పరిమళ = సువాసనతో; మిళితంబులు = కూడినవి; అగు = ఐన; విపిన = అడవి; మార్గంబులును = దార్లు; మార్గ = దారిని; నిరోధంబులు = అడ్డగించునవి; అగుచున్ = ఔతు; పెరిగి = వృద్ధిపొంది; రసికంబులు = రుచికరములైనవి; ఐ = అయ్యి; పసరు = ఆకుపచ్చవన్నెను; తొలంకుచు = ధరించెడి; హిరణ్మణి = పచ్చల; కిరణ = కాంతుల; పుంజంబుల = సమూహముల; భంగిన్ = వలె; రంజిల్లి = ప్రకాశించి; తొంగలించుచున్ = అతిశయించుచు; జొంపంబులుగొనిన = గుబురులుగట్టిన; కసువులును = గడ్డిదుబ్బులు; కసువులున్ = గడ్డిదుబ్బులు; మెసవి = మేసి; మిసమిసన్ = మిసమిసమెరిసెడి; తనువులున్ = శరీరములు; మెఱయన్ = మెరుస్తుండగా; వలుద = లావైన; పొదుగుల = పొదుగుల; బరువునన్ = బరువు వలన; కదలకన్ = కదలకుండ; నిల్చి = నిలబడి; నెమరు = నెమరువేయుట; అమరన్ = చక్కగా; ఇడు = చేయునట్టి; ధేనువులును = ఆవులు; కలిగి = కలదై; ధేను = పాడిఆవుల; వ్రజంబు = మంద; కైవడిన్ = వలె; పయస్ = నీటి, పాల; కణ = బిందువులచేత; మనోహరంబు = అందగించినవి; ఐ = అయ్యి; హర = శంకరుని (సారంగధరుని); కరంబు = చేతి; భంగిన్ = వలె; పరిపూర్ణ = నిండైన; సారంగ = వానకోకిలలచేత, జింకతో; భాసురంబు = ప్రకాశించునది; ఐ = అయ్యి; సురగిరి = మేరుపర్వతము; చెలువునన్ = వలె; హరి = ఇంద్ర, విష్ణువు అనెడి; శరాసన = ధనుస్సుతో, బాణమునకు విల్లు అగుటచేత; విభీషణంబు = మిక్కిలి భయంకరమైనది; ఐ = అయ్యి; విభీషణ = విభీషణుని; హృదయంబు = మనసు; పోలికన్ = వలె; ప్రకటిత = ప్రసిద్ధముగ, ప్రసిద్ధమైన; హరి = కప్పల, హరి అనెడి; శబ్ద = చప్పుళ్ళుతో, మాటచేత; వైభవంబు = కలిమికలది, గొప్పదనము కలది; ఐ = అయ్యి; భవ = శివుని; పూజనంబు = పూజించుట; చందంబునన్ = వలె; ఇంద్రగోప = ఆరుద్రపురుగులు, ఇంద్రునిపోషణ; ఆది = మున్నగువానియొక్క; విభవ = కలిమికి, కలుములు; జనకంబు = జన్మస్థానము, కలుగునది; ఐ = అయ్యి; జనక = జనకమహారాజు యొక్క; యాగంబు = యజ్ఞము; భాతిన్ = వలె; సీతా = నాగేటిచాళ్ళు, సీతాదేవి; ప్రకరణ = చక్కగాచేయుటచేత, సంగతివలన; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐ = అయ్యి; కృతయుగంబు = కృతయుగము; సొంపునన్ = వలె; బహు = అధికమైన, అనేకమైన; వర్షంబున్ = వానలుకలది, సంవత్సరములు కలది; ఐ = అయ్యి; వర్ష = వానాకాలము; ఆగమంబు = వచ్చుట; వచ్చెను = జరిగెను; అప్పుడు = ఆ సమయమునందు.
భావము:- ఇంకా, ఆ వర్షాకాలంలో ప్రచండమైన మారుతాలకు కదలి వచ్చి, మబ్బులు గగనమండలం అంతా ఆక్రమించాయి. గణనాతీతమైన ఆ మేఘాలు రెక్కలు కలిగిన నీలికొండల వలె వ్యాపించి సందు లేకుండా దట్టంగా కమ్ముకున్నాయి. సూర్యచంద్ర బింబాల కాంతులు మూసేసి మహా వ్యాపకాలై అవి ఆకాశతలం ఆవరించాయి. వర్షాకాలం అనే వలపుకాడు సవిలాసంగా పుడమి పడతి యెదపై సమర్పించిన కర్పూర ఖండాల వలె మబ్బుల నుండి వడగళ్ళు రాలాయి, ఆ వడగండ్ల వెంట నల్లత్రాచు పడగల విధంగా ఇంద్రనీల మణిహారాల తీరున అవిఛ్చన్నంగా జలధారలు జాలువారాయి. జలధారల నుంచి కారుతున్న నిర్మల నీళ్ళతో తడిసిన గిరులు మదజలాలతో అభిషేకించబడ్డ మత్తగజాల మాదిరి చెలువొందాయి. కొండ శిఖరాల నుండి చట్టుబండల మీద పడి సెలయేటి నీటిధారలు చెల్లాచెదురు అయ్యాయి. వాటి నీటి తుంపరలకు చెమ్మగిల్లి నేల చితచితలాడుతూ అడుసు అయింది. ఆ బురద మీద దొరలి పొరలిన నీరు వరదలై ప్రవహించింది. వాగులు వంకలు ఏకమై ఏరులై పారాయి. ఆ యేళ్ళలో రెక్కలాడిస్తూ గుంపులు కట్టి చేపలు వరద నీటికి ఎదురీదాయి. ఆ చేపల వంటి బెళుకు కన్నులు కల భామల నెమ్మేని తళతళలకు తాళలేక వణుకుతూ పారిపోతున్నవా అన్నట్లు మబ్బుల మధ్య తళుక్కున మెరసి మరుక్షణంలోనే మెరుపుతీగలు మాయమై పోయాయి. ఆ మెరుపుల్లాగ చంచల చిత్తలైన పొలతులు పురుషుల చెంత నిలకడగా నిలువరు సుమా! అని జనులకు బ్రహ్మదేవుడు ఎలుగెత్తి చాటుతున్నాడా అన్నట్లుగా ఉరుములు ఉరిమాయి. ఆ ఉరుములకు రవంతయినా వెరవక ఫించాలు చక్కగా విప్పుకుని నెమళ్ళు క్రేంకారాలు చేస్తూ నాట్యాలాడాయి. నెమలి కూతలు భీకరంగా చెవుల పడేసరికి విరహంతో వేగుతున్న దంపతులు అభిమానం వదులుకుని ఒకరికొకరు దాసులయ్యారు. మబ్బులు క్రమ్మడం మూలాన ఇది పగలు ఇది రేయి అని తెలియకపోయినా మాలతీపూలు పూచి సంధ్యాసమయాన్నిసూచించాయి. పగలు ముగియగానే మినుకుమినుకు మని మెరుస్తూ మిణుగురులు మింట తిరుగాడాయి. ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న జడివానలో చలికి గడగడా వణుకుతూ ఎండకోసం ఎదురు చూస్తూ, వంట ప్రయత్నాలు మాని కిరాతులు ఖర్జూరాలు నేరేడుపండ్లతో ఆకలి బాపుకున్నారు. ఎల్లప్పుడూ విటుకాండ్ర పొత్తు వీడని వారవనితల లాగ సదా సర్పాల పొత్తు బాయని మొగలిపూలు చెంచులకు సంతోషం సమకూర్చాయి. అడవి త్రోవలు విరబూచిన మొగలి, కడిమి, మొల్ల, గోరంట పూల గుబాళింపులతో నిండిపోయాయి. ఇంద్రనీల మణికాంతుల నెగజిమ్ముతూ దారికడ్డంగా పసరు వెలిగక్కే పచ్చిక గుబురుగా పెరిగింది. ఆ పచ్చిక జొంపాలు మెసవి ఒడలు మిసమిసలాడగా కుండపొదుగుల బరువుచే కదలలేక నిలచి మొదవులు నెమరవేయసాగాయి. ఆ వానకారు క్షీర సంపన్నమైన ఆవులమంద లాగ జల బిందువులతో ఇంపారింది. జింకతో చెలువారే శివుని చెయ్యి లాగ నిండైన వానకోయిలలతో సొంపారింది. విష్ణువనే బాణం అధిష్టించడం చేత భీకరమైన మేరు శైలం లాగ ఇంద్రచాపం చేత చెలువారింది. హరి నామసంకీర్తన వైభవంతో కూడిన విభీషణుని హృదయం లాగ భేకముల బెకబెక ధ్వనులతో ఎసలారింది. ఇంద్రుడు గోవిందుడు మొదలగువారికి ఐశ్వర్యాపాదక మైన శివపూజ లాగ ఆరుద్ర పురుగులతో అలరారింది. సీతామహాదేవి వృత్తాంతంతో జనకచక్రవర్తి యాగంలాగ నాగటిచాళ్ళతో సొబగారింది. బహు సంవత్సరాలు కలిగిన కృతయుగం లాగ మెండైన వానలతో నిండారింది.
ముక్తగ్రస్త వర్షం కురిపించి ఎంత చక్కగా మురిపించారు మన సహజకవి పోతనామాత్యులవారు. (ముందు వర్ణనలో కాని పాదంలో కాని విడిచిన పదాన్ని అందుకుని తరువాతి వర్ణన లేదా పాదం మొదలెడుతుంటే ముక్తగ్రస్తాలంకారం..)
తెభా-10.1-758-క.
వాడక వ్రాలక తెవుళులఁ
గూడక తగ నల్ల గెఱలుగొని నవకములై
చూడఁగ భద్రము లగుచును
వీడెన్ సస్యంబు లిడుమ వీడెం బ్రజకున్.
టీక:- వాడకన్ = వడలిపోకుండ; వ్రాలకన్ = వాలిపోకుండ; తెవుళులన్ = చీడలుతో; కూడకన్ = కూడి ఉండకుండ; తగన్ = చక్కగా, యుక్తముగా; నల్ల = నల్లని; గెఱలుకొని = ఛాయపొంది; నవకములు = కోమలములు; ఐ = అయ్యి; చూడగన్ = చూచుటకు; భద్రములు = బాగున్నవి; అగుచును = అగుచు; వీడెన్ = వికసించినవి; సస్యంబులు = పైర్లు; ఇడుము = ఇక్కట్లు; వీడెన్ = తొలగెను; ప్రజ = జనుల; కున్ = కు.
భావము:- ఎండకు వాడిపోయి నేలమీదకి వ్రాలిపోకుండా, చీడపీడలకు గురికాకుండా, నవనవలాడుతూ నలుపెక్కి పైరులు ఏపుగా పెరిగాయి. ప్రజలకు ఇక్కట్లు తొలిగాయి.
తెభా-10.1-759-క.
జీవనము చాలఁ గలిగియుఁ
గావరమున మిట్టిపడని ఘనునిక్రియ నదీ
జీవనములు చొర జలనిధి
ప్రావృట్కాలమున డిందుపడి యుండె నృపా!
టీక:- జీవనము = మంచి జీవితము; చాలన్ = అధికముగనే; కలిగియున్ = ఉన్నను; కావరమునన్ = గర్వముతో; మిట్టిపడని = మిడిసిపడనట్టి; ఘనుని = గొప్పవాని; క్రియన్ = వలె; నదీ = నదుల యొక్క; జీవనములు = నీళ్ళు; చొరన్ = ప్రవేశించుచున్నను; జలనిధి = సముద్రము; ప్రావృట్కాలమునన్ = వర్ష ఋతువు నందు; డిందుపడి = అణగియే; ఉండెన్ = ఉండెను; నృపా = రాజా.
భావము:- పరీక్షన్నరేంద్రా! ఎంత సంపన్నుడైనప్పటికీ గొప్పవాడు తలపొగరుతో మిడిసిపడడు. అదే విధంగా, నదుల నుండి ఎంత దండిగా నీరు వచ్చి చేరుతున్నా, వానాకాలంలోనూ సాగరుడు హద్దుమీరక అణగి ఉన్నాడు.