Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/బ్రహ్మ వత్స బాలకుల దాచుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-507-శా.
"బాలుం డయ్యు నితం డఘాసురుఁడు ద్రుంపన్ బాలురం గ్రేపులన్
యేలీలన్ బ్రతికించెనొక్కొ? భువి నూహింపం గడుం జోద్య" మం
చాలో నంబుజసంభవుండు చని మాయా బాలు శుంభద్బలం
బాలోకింపఁ దలంచి డాఁచె నొకచో నా లేఁగలన్ బాలురన్.

టీక:- బాలుండు = చిన్నపిల్లవాడు; అయ్యున్ = అయినప్పటికి; ఇతండు = ఇతను; అఘాసురుఁడు = అఘాసురుడు; త్రుంపన్ = చంపబోగా; బాలురన్ = పిల్లలను; క్రేపులన్ = దూడలను; ఏ = ఎట్టి; లీలన్ = విధానముతో; బ్రతికించెనొక్కొ = కాపాడెనో కదా; భువిన్ = భూలోకము నందు; ఉహింపన్ = తలచుటకే; కడున్ = మిక్కిలి; చోద్యము = ఆశ్చర్యకరమైనది; అంచున్ = అనుచు; ఆలోనన్ = అంతలోపల; అంబుజసంభవుండు = బ్రహ్మదేవుడు {అంబుజ సంభవుడు - అంబుజ (పద్మము)న సంభవుడు (పుట్టినవాడు). బ్రహ్మ}; చని = వెళ్ళి; మాయాబాలు = కపటబాలకుని; శుంభత్ =ప్రకాశించెడి; బలంబున్ = శక్తిని; ఆలోకింపన్ = చూడవలెనని; తలంచి = భావించి; డాచెన్ = దాచివేసెను; ఒక = ఒకానొక; చోన్ = స్థలమున; ఆ = ఆ; లేగలన్ = దూడలను; బాలురన్ = పిల్లలను.
భావము:- అలా కృష్ణుడు పశువులను వెతుకుతుంటే, భూమికి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఇలా అనుకున్నాడు. “ఇతడు పసిబాలుడు కదా! అఘాసురుడు మ్రింగిన గోపబాలురను లేగలను ఎలా రక్షించగలిగాడు? ఇది ఈ భూలోకం లోనే చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ మాయబాలకుడి మహాశక్తి ఎలాంటిదో పరీక్షించి చూద్దాం” అనుకున్నాడు. బ్రహ్మయ్య ఇటు అడవిలోని లేగలను, అటు భోజనాలు చేస్తున్న బాలురనూ ఒక రహస్య ప్రదేశంలో దాచాడు.

తెభా-10.1-508-వ.
ఆ సమయంబున, దూడలు పోయిన జాడ యెఱుంగక, తప్పి య ప్పద్మలోచనుం డెప్పటి కొలంకుకడకు వచ్చి, యచ్చోట నె నెచ్చెలులం గానక వారిం జీరి, లేకుండుట నిశ్చయించి గోవిందుండు విశ్వవిదుండు గావున నిది విరించి మొఱంగని యెఱింగి తిరిగి పోవుచు.
టీక:- ఆసమయంబునన్ = అప్పుడు; దూడలు = ఆవుదూడలు; పోయిన = వెళ్ళిన; జాడ = ఆనమాళ్ళు; ఎఱుంగక = తెలియక; తప్పి = తప్పిపోగా; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పద్మలోచనుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; ఎప్పటి = మునుపటి; కొలంకు = కొలను; కడ = వద్ద; కున్ = కు; వచ్చి = వచ్చి; ఆ = ఆ; చోటన్ = ప్రదేశమునందు; నెచ్చెలులన్ = స్నేహితులను; కానక = కనుగొనలేక; వారిన్ = వారిని; చీరి = పిలిచి; లేకుండుట = అక్కడ లేకపోవుటను; నిశ్చయించుకొని = స్థిరపరచుకొని; గోవిందుండు = శ్రీకృష్ణుడు {గోవిందుడు - గో (ఆవులు, జీవుల)కు విందుడు, విష్ణువు}; విశ్వ = సర్వము; విదుండు = తెలిసినవాడు; కావున = కనుక; ఇది = ఈ పని; విరించి = బ్రహ్మదేవుని యొక్క; మొఱంగు = మోసము; అని = అని; ఎఱింగి = తెలుసుకొని; తిరిగి = వెనుకకు (మందకు); పోవుచున్ = వెళ్తూ.
భావము:- అప్పుడు కృష్ణుడు దూడలజాడలు కనపడక తిరిగి కొలను వద్దకు వచ్చాడు. అక్కడ గోపబాలురు కూడా కనిపించలేదు. వారిని పిలిచి వారు ఇక్కడ లేరని నిర్ధారించు కున్నాడు. కృష్ణుడు విశ్వంలోని రహస్యాలన్నీ ఎరిగిన వాడు కదా. ఇది బ్రహ్మదేవుడి మోసం అని గ్రహించాడు. వెంటనే గిరుక్కున వెనుదిరిగాడు.

తెభా-10.1-509-శా.
"వంచింపం బనిలేదు బ్రహ్మ కిచటన్ త్సంబులన్ బాలురన్
వంచించెం గనుఁ బ్రామి; తన్ను మరలన్ వంచించు టాశ్చర్యమే?
వంచింపం మనకేల? తెచ్చుటకునై "ల్దంచు బ్రహ్మాండము
ల్వంచింపన్ మరలింప నేర్చు హరి లీలన్ మందహాసాస్యుఁడై.

టీక:- వంచింపన్ = మోసముచేయుటకు; పనిలేదు = అవసరములేదు; బ్రహ్మ = బ్రహ్మదేవునికి; ఇచటన్ = ఇక్కడ; వత్సంబులన్ = దూడలను; బాలురన్ = పిల్లలను; వంచించెన్ = మోసపుచ్చెను; కనుబ్రామి = మాయచేసి; తన్ను = అతనిని; మరలన్ = తిరిగి; వంచించుట = మోసపుచ్చుట; ఆశ్చర్యమే = అబ్బురమా, కాదు; వంచింపన్ = మోసపుచ్చుట; మన =మన; కున్ = కు; ఏలన్ = ఎందుకులే; తెచ్చుటకునై = తీసుకొని వచ్చుట కోసము; వల్దు = వద్దులే; అంచున్ = అనుచు; బ్రహ్మాండముల్ = బ్రహ్మాండములనే; వంచింపన్ = మాయము చేయ; మరలింప = మరల పుట్టింప; నేర్చు = సమర్థుడైన; హరి = విష్ణువు; లీలన్ = విలాసముగా; మందహాస = చిరునవ్వుకలిగిన; ఆస్యుడు = మోముకలవాడు; ఐ = అయ్యి.
భావము:- “ఇలా పిల్లలను, లేగదూడలను వంచనచేసి మాయం చేయవలసిన అవసరం బ్రహ్మకు ఏమీ లేదు. అయినా నా కన్నుకప్పి మోసం చేసాడు. అతణ్ణి తిరిగి మోసం చేయడం నాకు పెద్ద కష్టమైన పని కాదు. అయినా వారిని తిరిగి తీసుకురాడానికి అతణ్ణి వంచించడం మనకెందుకు వద్దులే” అంటూ పెదవులపై చిరునవ్వులు చిందించాడు. శ్రీహరి ఈ బ్రహ్మాండాలనే వంచించడం మరలించడం అనే విద్యలలో నేర్పరి కదా.

తెభా-10.1-510-క.
"గోపాలసుతులు లే రని
గోపికలకుఁ జెప్ప నేల? గోపాలకులున్
గోపికలు నలర బాలుర
క్రేపులరూపముల నేఁ జరించెద ననుచున్. "

టీక:- గోపాల = గొల్లల; సుతులు = పిల్లలు; లేరు = లేరు; అని = అని; గోపికలు = యాదవస్త్రీల; కున్ = కు; చెప్పన్ = చెప్పుట; ఏలన్ = ఎందుకు; గోపాలకులున్ = గొల్లలు; గోపికలు = గొల్లభామలు; అలరన్ = సంతోషించునట్లు; బాలురన్ = పిల్లలు; క్రేపులన్ = దూడలు; రూపములన్ = ఆకృతులందు; నేన్ = నేనే; చరించెదన్ = వర్తించెదను; అనుచున్ = అనుకొనుచు.
భావము:- “ఇంటికి తిరిగివెళ్ళి మీ పిల్లలు లేరమ్మా అని గోపికలకు చెప్పడం దేనికి? నేనే గోపబాలకుల రూపాల లోనూ; గోవత్సాల రూపాల లోనూ సంచరిస్తాను గోపికలు గోపకులు కూడా ఎప్పటిలాగే చాలా సంతోషిస్తారు."అంటూ