పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వత్స బాలకుల రూపు డగుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెభా-10.1-511-మ.
ముల్ పాదములున్ శిరంబు లవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాం
ముల్ ముక్కులు గన్నులుం శ్రవణముల్ దంతాదులున్ దండ కాం
స్రగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన త
త్పతల్ వీడ్వడకుండఁ దాల్చె విభుఁ డా త్సార్భకాకారముల్.

టీక:- కరముల్ = చేతులు; పాదములున్ = కాళ్ళు; శిరంబుల్ = తలలు; అవలగ్నంబుల్ = నడుములు; ముఖంబుల్ = ముఖములు; భుజాంతరముల్ = వక్షస్థలములు; ముక్కులు = ముక్కులు; కన్నులున్ = కళ్ళు; శ్రవణముల్ = చెవులు; దంత = దంతములు; ఆదులున్ = మున్నగునవి; దండక = చేతికఱ్ఱలు; అంబర = దుస్తులు; స్రక్ = పూలమాలలు; వేణు = పిల్లనగ్రోవులు; విషాణ = కొమ్ముబూరలు; భూషణ = అలంకారములు; వయస్ = ఈడు; భాషా = మాటలు; గుణ = గుణములు; ఆఖ్యాన = పేర్లు; తత్పరతలు = ఆసక్తులు; వీడ్వడకుండన్ = తప్పిపోకుండగ; తాల్చెన్ = ధరించెను; విభుడు = శ్రీకృష్ణుడు; ఆ = ఆ; వత్స = దూడల; అర్భక = పిల్లల; ఆకారముల్ = ఆకృతులను.
భావము:- ఇలా అయితే గోపికలు సంతోషిస్తారు కదా అనుకుంటూ, కృష్ణబాలుడు ఆ యా లేగదూడల, గోపబాలకుల రూపాలను అన్నీ తానే ధరించాడు. అన్ని అవయవాదులు ఆ యా బాలుర పోలికల్లోనే ఉన్నాయి. అంతే కాకుండా, ఆ బాలురు ధరించే చేతికఱ్ఱలు, వస్త్రాలు, దండలు, వేణువులు, కొమ్ముబూరాలు, ఆభరణాలు, వారి వయస్సులు, గుణాలు, మాటలాడే యాస ఏ ఒక్కటీ వదలకుండా సంపూర్ణంగా ఆ యా బాలుర, లేగల స్వరూపాలు అన్నీ తనే ధరించాడు.

తెభా-10.1-512-క.
రూపంబు లెల్ల నగు బహు
రూకుఁ డిటు బాలవత్సరూపంబులతో
నేపారు టేమి చోద్యము?
రూపింపఁగ నతని కితరరూపము గలదే?

టీక:- రూపంబులు = స్వరూపములు; ఎల్లన్ = సమస్తము; అగున్ = తానే ఐనట్టి; బహురూపకుడు = సర్వవ్యాపి; ఇటు = ఇలా; బాల = పిల్లల; వత్స = దూడల; రూపంబులు = ఆకృతుల; తోన్ = తోటి; ఏపారుట = అతిశయించుటలో; ఏమి = ఏమి; చోద్యము = ఆశ్చర్యము కలదు, లేదు; రూపింపగన్ =నిరూపించుటకు, ఋజువు చేయుటకు; అతని = ఆ భగవంతుని; కిన్ = కంటె; ఇతర = అన్యమైన; రూపమున్ = స్వరూపము; కలదే = ఉన్నదా, లేదు.
భావము:- ఈ జగన్నాటకంలో అందరి రూపాలూ ధరించే అంతర్యామి స్వరూపుడు ఆ గోపాలకృష్ణుడు కదా. ఆ మహానటుడు ఇలా బాలుర యొక్క, లేగల యొక్క రూపాలు ధరించడంలో ఏమి ఆశ్చర్యం ఉంది. ఏ రూపంలో అయినా ఉన్నవాడు అతడే. జాగ్రత్తగా గమనిస్తే అతడు సర్వాత్మకుడు రూపాతీతుడు కనుక అతనికి రూపం అన్నది వేరే ఉండదు కదా. అవును, ఆ జగన్నాటక సూత్రధారి ధరించలేని పాత్ర ఏముంటుంది.

తెభా-10.1-513-క.
లుపు మనియెడు కర్తయు
లించు కుమారకులును రలెడి క్రేపుల్
రికింపఁ దాన యై హరి
లం జనె లీలతోడ మందకు నధిపా!

టీక:- మరలుపుము = మళ్ళించు; అనియెడు = అనెడి; కర్త = బాధ్యుడు; మరలించు = మళ్లించెడి; కుమారకులును = బాలురు; మరలెడి = మళ్ళెడి; క్రేపుల్ = దూడలు; పరికింపన్ = పరిశీలించి చూసినచో; తాన = తనే; ఐ = అయ్యి; హరి = కృష్ణుడు; మరలన్ = వెనుకకు; చనెన్ = వెళ్ళిపోయెను; లీల = విలాసము; తోన్ = తో; మందకున్ = రేపల్లె; కున్ = కు; అధిపా = రాజా.
భావము:- విచిత్రంగా మందలోని పశువులను తమ ఇంటి వైపు తోలమని చెప్పేవాడు తానే, అలా తోలుతున్న గొల్లపిల్లలు తానే, అలా తోలబడి తమ ఇళ్ళకు వెళ్తున్న పశువులు తానే అయ్యి ఆ శ్రీహరి గొప్పవినోదంగా రేపల్లెకు వెళ్ళాడు.
సూత్రధారి పాత్రధారి అభేదమా జీవాత్మ పరమాత్మల అభేదమా, ఆహా! ఏమి లీల!

తెభా-10.1-514-వ.
ఇట్లు బాలవత్సరూపంబులతో విహరించుచు మందకు వచ్చి వారివారి దొడ్ల నయ్యై వత్సంబుల ముందఱి కందువల నిలిపి, తత్తద్బాలరూపంబుల నందఱి గృహంబులం బ్రవేశించి వేణునాదంబులు చేసిన.
టీక:- ఇట్లు = ఇలా; బాల = పిల్లల; వత్స = దూడల; రూపంబుల్ = ఆకృతుల; తోన్ = తోటి; విహరించుచున్ = మెలగుచు; మందకున్ = బృందావనమున; కున్ = కు; వచ్చి = చేరి; వారివారి = వారివారి; దొడ్లన్ = పెరళ్ళలో; ఆయ్యై = ఆయా; వత్సంబులన్ = దూడలను; ముందరి = మునుపటి; కందువలన్ = చోట్లలో; నిలిపి = ఉంచి; తత్ = ఆయా; బాల = పిల్లల; రూపంబులన్ = ఆకృతులలో; అందఱి = అందరి; గృహంబులన్ = ఇళ్ళలోకి; ప్రవేశించి = వెళ్ళి; వేణు = మురళీ; నాదంబులు = గానములు; చేసినన్ = చేయగా.
భావము:- ఇలా సమస్తమైన బాలురు, లేగలు యొక్క స్వరూపాలు అన్నీ తానే ధరించి విహరిస్తూ గోకులానికి తిరిగివచ్చి, వారి వారి దొడ్లలో ఆయా దూడలను ఆయా స్థానాలలో కట్టేసి, ఆయా బాలకుల స్వరూపంలో ఆయా ఇళ్ళల్లో ప్రవేశించి వారి వారి వేణువుల ద్వారా వేణునాదం వినిపించసాగాడు.

తెభా-10.1-515-చ.
కొడుకుల వేణునాదములు గొబ్బున వీనులకుం బ్రియంబు లై
ముడిపడ లేచి యెత్తుకొని మూర్కొని తల్లులు గౌగలించుచుం
డిగొనఁ జేపువచ్చి తమన్నుల యందు సుధాసమంబు లై
వెడిలెడి పాలు నిండుకొనువేడుక నిచ్చిరి తత్సుతాళికిన్.

టీక:- కొడుకుల = కుమారుల; వేణు = పిల్లనగ్రోవులు; నాదములు = ధ్వనులు; గొబ్బునన్ = తటాలున; వీనుల్ = చెవుల; కున్ = కు; ప్రియంబులు = ఇష్టమైనవి; ఐ = అయ్యి; ముడిపడన్ = తగుల్కొనగా; లేచి = లేచినుంచుని; ఎత్తుకొని = ఎత్తుకొని; మూర్కొని = ముద్దుచేసి; తల్లులు = ఆయా తల్లులు; కౌగలించుచున్ = కౌగలించుకొనుచు; జడిగొనన్ = మిక్కిలిగా; చేపు = ఉబికి; వచ్చి = వచ్చిన; తమ = వారి; చన్నుల = స్తన్యముల; అందు = అందు; సుధా = అమృతతో; సమంబులు = సమానమైనవి; ఐ = అయ్యి; వెడలెడి = కారెడి; పాలున్ = పాలను; నిండుకొను = సంపూర్ణమైన; వేడుకన్ = కుతూహలముతో; ఇచ్చిరి = ఇచ్చిరి; తత్ = ఆయా; సుత = బాలుర; ఆళి = సమూహమున; కిన్ = కి.
భావము:- గోపబాలకుల తల్లులు కొడుకుల వేణునాదాలు విన్నారు. అవి వీనులవిందుగా వినిపించి వారి మనస్సులు పరవశించాయి. వెంటనే ఆ తల్లులు లేచి కుమారులను కౌగిలించుకుని శిరస్సులను మూర్కొన్నారు. వారి పాలిళ్ళు అందు పాలు ఉవ్వెత్తుగా చేపుకుని వచ్చాయి. గోపికలు అమృతంతో సమాన మైన ఆ పాలను నిండైన ప్రేమతో కొడుకులకు త్రాగించారు.

తెభా-10.1-516-వ.
మఱియుఁ దల్లు లుల్లంబులం బెల్లుగ వెల్లిగొనిన వేడుకలం దమనందనులకు నలుంగు లిడి, మజ్జనంబులు గావించి, గంధంబు లలంది తొడవులు దొడిగి నిటలతటంబుల రక్షాతిలకంబులు పెట్టి, సకలపదార్థసంపన్నంబులైన యన్నంబు లొసంగి సన్నములు గాని మన్ననలు చేసిరి.
టీక:- మఱియున్ = ఇంకను; తల్లులు = తల్లులు; ఉల్లంబులన్ = మనసులలో; పెల్లుగ = అధికముగా; వెల్లిగొనిన = ఉబికెడి; వేడుకలన్ = ఉత్సాహములతో; తమ = వారివారి; నందనుల్ = పిల్లల; కున్ = కు; నలుంగులు = నలుగులు; ఇడి = పెట్టి; మజ్జనంబులు = స్నానములు; కావించి = చేయించి; గంధంబులన్ = గంధములను; అలంది = రాసి; తొడవులు = ఆభరణములు; తొడిగి = తొడిగి; నిటలతటంబులన్ = నొసటిప్రాంతమున; రక్షా = దిష్టి; తిలకంబులు = బొట్లు; పెట్టి = పెట్టి; సకల = అన్ని; పదార్ధ = వస్తువులు; సంపన్నంబులు = సమృద్ధిగా ఉన్నవి; ఐన = అయిన; అన్నంబులున్ = అన్నములను; ఒసంగి = పెట్టి; సన్నములుగాని = ఎక్కువలైన; మన్ననలు = ఆదరణలు; చేసిరి = చేసిరి.
భావము:- పిమ్మట, ఆ గోపికా తల్లుల హృదయాలు ఆనందంతో పరవళ్ళు తొక్కగా వారు ఎంతో వేడుకతో కొడుకులకు నలుగుపెట్టి తలంటి స్నానాలు చేయించారు; గంధాలు పూసారు; చక్కని ఆభరణాలు అలంకరించారు; నుదిటిపై రక్షా తిలకాలు పెట్టారు; అన్ని రకాల పదార్థాలతోనూ భోజనాలు పెట్టారు; ఎంతో ప్రేమతో వారిని ఆదరించారు.

తెభా-10.1-517-క.
ల్లుల కే బాలకు
లే తెఱఁగునఁ దిరిగి ప్రీతి నెఁసగింతురు ము
న్నా ల్లుల కా బాలకు
లా తెఱఁగునఁ బ్రీతిఁ జేసి వనీనాథా!

టీక:- ఏ = ఏ; తల్లులు = తల్లుల; కిన్ = కి; ఏ = ఏ; బాలకులు = పిల్లలు; ఏ = ఏ; తెఱంగునన్ = రీతిని; తిరిగి = మెలగి; ప్రీతిన్ = సంతోషమును; ఎసగింతురు = అతిశయింపజేతురో; మున్ను = ఇంతకుముందు; ఆ = ఆయా; తల్లులు = తల్లుల; కిన్ = కి; ఆ = ఆయా; బాలకులు = పిల్లలు; ఆ = ఆయా; తెఱంగున్ = రీతిని; ప్రీతిన్ = సంతోషమును; చేసిరి = కలిగించిరి; అవనీనాథా = రాజా {అవనీనాథుడు - అవని (భూమి)కి నాథుడు, రాజు}.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! ఇంతకు ముందు ఏ బాలకులు ఏ తల్లులకు ఏ యే విధంగా ఆనందం కలిగించారో; ఇప్పుడు అలాగే ఆ యా బాలకులు ఆ యా తల్లులకు అ యా విధాలైన ఆనందాలు కలిగించారు.

తెభా-10.1-518-వ.
ఆ సమయంబున.
టీక:- ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు.
భావము:- ఆ సమయంలో...

తెభా-10.1-519-ఉ.
పాని వేడ్కతో నునికిట్టులకుం జని గోవులెల్ల నం
బే ని చీరి హుమ్మనుచుఁ బేరిచి మూర్కొని పంచితిల్లి పె
ల్లై తిరేకమై పొదుగులం దెడలేక స్రవించుచున్న పా
లాయెడ నాకుచున్ సుముఖలై యొసఁగెన్ నిజవత్సకోటికిన్.

టీక:- పాయని = తొలగని; వేడ్క = ఉత్సాహములతో; ఉనికిపట్టులు = ఉండేచోటుల; కున్ = కు; చని = వెళ్ళి; గోవులు = ఆవులు; ఎల్లన్ = అన్ని; అంబే = అంబా; అని = అని; చీరి = అరచి; హుమ్మ్ = హుమ్మ్; అనుచున్ = అనుచు; పేరిచి = అతిశయించి; మూర్కొని = మూజూసి; పంచితిల్లి = మూత్రమువిడిచి; పెల్లు = అధికము; ఐ = అయ్యి; అతిరేకము = మించినవి; ఐ = అయ్యి; పొదుగులన్ = పొదుగులనుండి; ఎడలేక = ఎడతెగకుండ; స్రవించుచున్న = కారుచున్న; పాలున్ = పాలు; ఆ = ఆ; ఎడన్ = సమయము నందు; నాకుచున్ = దేహము నాకుచు; సుముఖులు = అనుకూలముగా ఉన్నవి; ఐ = అయ్యి; ఒసగెన్ = ఇచ్చినవి; నిజ = వానివాని; వత్స = దూడ; కోటి = సమూహమున; కిన్ = కు.
భావము:- దొడ్లలో ఉన్న ఆవులు తమ దూడలను చూడగానే అంబా అంటూ బిడ్డలను పిలిచాయి; హుమ్మంటూ దూడలను వాసన చూసి, ఆనందంతో చటుక్కున మూత్రాలు కార్చాయి; ప్రేమతో దూడలను నాకుతూ, పొదుగుల నుండి కురుస్తున్న పాలను లేగదూడలకు త్రాగించాయి.

తెభా-10.1-520-క.
వ్రేలకును గోవులకును
మాతృత్వము జాలఁ గలిగె ఱి మాధవుపై
మా లని హరియు నిర్మల
కౌతూహల మొప్పఁ దిరిగెఁ డు బాల్యమునన్.

టీక:- వ్రేతలు = గోపికల; కును = కు; గోవులు = గోవుల; కును = కు; మాతృత్వము = తల్లిదనము; చాలన్ = మిక్కిలిగా; కలిగెన్ = కలిగినది; మఱి = ఇంకను; మాధవు = కృష్ణుని; పై = మీద; మాతలు = తల్లులు; అని = అని; హరియున్ = కృష్ణుడు కూడ; నిర్మల = స్వచ్ఛమైన; కౌతూహలము = ఉత్సుకుత కలిగి ఉండుట; ఒప్పన్ = చక్కగానుండ; తిరిగెన్ = మెలగెను; కడు = మిక్కిలి; బాల్యమునన్ = పసితనముతో.
భావము:- గోపికలకు, గోవులకు కూడా తమ బిడ్డల రూపంలో ఉన్న కృష్ణునిపై మాతృప్రేమ ఎంతో అధికంగా కలిగింది. శ్రీహరి కూడా వారిని తల్లులు అంటూ ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో పసిపిల్లవాడిగా వారి మధ్య ప్రవర్తించాడు.

తెభా-10.1-521-ఆ.
ఘోషజనుల కెల్లఁ గుఱ్ఱలపై వేడ్క
పూఁటపూఁట కెలమిఁ బొటకరించె
నిచ్చ గ్రొత్త యగుచు నీరజాక్షునిమీఁద
వేడ్క దమకుఁ దొల్లి వెలసినట్లు.

టీక:- ఘోష = గొల్ల; జనుల = వారి; కిన్ = కి; ఎల్లన్ = అందరికి; కుఱ్ఱల = బాలుర; పై = మీద; వేడ్క = ప్రీతి; పూటపూట = ఒక్కొక్కపూటగడిచేకొద్దీ; ఎలమిన్ = సంతోషము; పొటకరించెన్ = అతిశయించెను; నిచ్చ = ఎల్లప్పుడు; క్రొత్త = అపూర్వములు; అగుచున్ = ఔతూ; నీరజాక్షుని = శ్రీకృష్ణుని; మీదన్ = పైన; వేడ్క = కుతూహలము; తమ = వారల; కున్ = కు; తొల్లి = మునుపు; వెలసినట్టు = కుదుర్కొన్నట్లుగా.
భావము:- పూర్వం బాలకృష్ణుని మీద తమకు మిక్కిలి అధికమైన ప్రేమ కలిగినట్లు. ఈ గోపబాలకుల పైన కూడ గోకులంలోని జనులు అందరికి రోజురోజుకీ ప్రేమలు పెరగుతూ ఏరోజు కారోజు క్రొత్తలు తొడుగుతూనే ఉండేవి.

తెభా-10.1-522-వ.
ఇట్లు కృష్ణుండు బాలవత్సరూపంబులు దాల్చి తన్నుఁ దాన రక్షించుకొనుచు, మందను వనంబున నమంద మహిమంబున నొక్క యేఁడు గ్రీడించె, నా యేటికి నైదాఱు దినంబులు కడమపడి యుండ నం దొక్కనాఁడు బలభద్రుండును, దానును వనంబునకుం జని మందచేరువ లేఁగల మేప నతి దూరంబున గోవర్థన శైలశిఖరంబున ఘాసంబులు గ్రాసంబులు గొనుచున్న గోవు లా లేఁగలం గని.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కృష్ణుండు = కృష్ణుడు; బాల = బాలుర; వత్స = దూడల; రూపంబులున్ = ఆకృతులను; తాల్చి = ధరించి; తన్ను = అతనిని; తాన = అతనే; రక్షించుకొనుచు = పాలనచేయుచు; మందను = బృందావనం విడిదిలో; వనంబునన్ = అడవి యందు; అమంద = గొప్ప; మహిమంబునన్ = మహిమతో; ఒక్క = ఒక (1); ఏడున్ = సంవత్సరముపాటు; క్రీడించెను = విహరించెను; ఆ = ఆ యొక్క; ఏటి = సంవత్సరమున; కిన్ = కు; ఐదు = అయిదు (5); ఆఱు = ఆరు (6); దినంబులు = రోజులు; కడమపడి = మిగిలి; ఉండన్ = ఉండగా; అందున్ = అప్పుడు; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; బలభద్రుండును = బలరాముడు; తానునున్ = అతను; వనంబున్ = అడవి; కున్ = కి; చని = వెళ్ళి; మంద = వ్రేపల్లెకు; చేరువన్ = దగ్గరగా; లేగలన్ = దూడలను; మేపన్ = మేపుతుండగా; అతి = చాలా; దూరంబునన్ = దూరమునందు; గోవర్థన = గోవర్థనము అనెడి; శైల = కొండ; శిఖరంబునన్ = కొనయందు; ఘాసంబులున్ = లేతపచ్చికలను, కసవులు; గ్రాసంబులుగొనుచు = ఆహారించుచు, మేస్తూ; ఉన్న = ఉన్నట్టి; గోవులు = గోవులు; ఆ = ఆ యొక్క; లేగలన్ = దూడలను; కని = చూసి.
భావము:- ఇలా బాలకృష్ణుడు గొల్లపిల్లల రూపాలూ దూడల రూపాలు తానే ధరించి, అందరి రూపాలలోనూ ఉన్న తనను తాను రక్షించుకుంటూ, ఆ బృందావనంలోనూ గోకులంలోనూ మహమహిమతో ఒక ఏడాది పాటు విహరించాడు. ఏడాదికి ఇంకా ఐదారు రోజులు ఉన్నయి అనగా, ఒకనాడు తాను బలరాముడు అడవికి వెళ్ళి మందకు దగ్గరగా లేగదూడలను మేపుతున్నారు. ఆ ప్రదేశానికి చాలాదూరంగా గోవర్ధనపర్వత శిఖరంపైన గోపకులు ఆవులు మేపుతున్నారు. ఆ కొండ మీది ఆవులు ఈ క్రింద ఉన్న దూడలను చూసాయి.

తెభా-10.1-523-చ.
ముమున హుంకరించుచును; మూఁపులపై మెడ లెత్తి చాఁచుచున్
ములు నాల్గు రెండయిన బాగునఁ గూడఁగ బెట్టి దాఁటుచున్
నములన్ విశాలతర వాలములన్ వడి నెత్తి పాఱి యా
మొవులు చన్నులంగుడిపె మూఁతుల మ్రింగెడిభంగి నాకుచున్.

టీక:- ముదమునన్ = సంతోషముతో; హుంకరించుచును = హుమ్మనుచు; మూపుల = మూపురముల; పైన్ = మీదకానునట్లు; మెడలు = మెడలను; ఎత్తి = ఎత్తి; చాచుచున్ = సాగదీయుచు; పదములు = కాళ్ళు; నాల్గు = నాలుగు (4); రెండు = రెండు (2); అయిన = ఐన; బాగునన్ = విధముగా; కూడగబెట్ట = దగ్గరకుచేర్చి; దాటుచున్ = దూకుతూ; వదనములన్ = ముఖములను; విశాలతర = బాగాపెద్దవైన {విశాలము - విశాలతరము - విశాలతమము}; వాలములన్ = తోకలను; వడిన్ = విసురుగా; ఎత్తి = పైకెత్తి; పాఱి = పరుగెట్టి; ఆ = ఆ యొక్క; మొదవులు = ఆవులు; చన్నులన్ = స్తన్యములను; కుడిపెన్ = తాగించెను; మూతులన్ = మూతులతో; మ్రింగెడి = మింగేస్తున్నాయా; భంగిన్ = అన్న విధముగా; నాకుచున్ = (దూడలను) నాకుతు {నాకుట - నాలుకతో రాయుటాదులు చేయుట}.
భావము:- ఆనందంతో ఆ ఆవులు ఒక్కసారి హూంకరించాయి; మూపుల పైదాకా మెడలు ఎత్తి వేగంగా చెంగుచెంగున దాట్లువేస్తూ పరిగెత్తాయి; తోకలు ముఖాలపైకి వచ్చేలా ఎత్తి దూడల దగ్గరకు పరిగెత్తాయి; లేగల మూతులను ఆత్రంగా నాకుతూ ఆవులు లేగలకు పాలు కుడిపాయి.

తెభా-10.1-524-వ.
అంత గోపకులు గోవుల వారింప నలవి గాక దిగ్గన నలుకతోడి సిగ్గు లగ్గలంబుగ దుర్గమ మార్గంబున వానివెంట నంటి వచ్చి లేఁగల మేపుచున్న కొడుకులం గని.
టీక:- అంతన్ = అప్పుడు; గోపకులు = గోపాలకులు; గోవులన్ = ఆవులను; వారింపన్ = ఆపుటకు; అలవి = శక్యము; కాక = కాకుండుటచే; దిగ్గనన్ = శీఘ్రముగా; అలుక = కోపము; తోడి = తోగూడిన; సిగ్గులు = లజ్జలు; అగ్గలంబుగన్ = అతిశయించగా; దుర్గమ = అతికష్టమైన; మార్గంబున = దార్లమ్మట; వాని = వాటి; వెంటనంటి = కూడాపడి; వచ్చి = వచ్చి; లేగలన్ = దూడలను; మేపుచున్న = కాచుచున్న; కొడుకులన్ = బిడ్డలను; కని = చూసి.
భావము:- ఇంతవరకూ తమ మాటలను ఆవులు ధిక్కరించేవి కాదు. అలాంటిది అలా వచ్చిన ఆవులను ఆపుచేయడం, గోపకులకు సాధ్యం కాలేదు. వారికి కోపంతోపాటు సిగ్గు కూడా కలిగింది. వాటి వెనుకనే తుప్పల వెంట బండల పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. లేగలను మేపుతున్న తమ బిడ్డలను చూసారు. మమతలతో వారు కోపాలు సిగ్గులు అన్నీ మరచిపోయారు.

తెభా-10.1-525-ఉ.
య్యలఁ గంటి మంచుఁ బులకాంకురముల్ వెలయంగఁ గుఱ్ఱలం
య్యన డాసి యెత్తికొని సంతస మందుచుఁ గౌగలింపఁ దా
య్యెడ నౌదలల్ మనము లారఁగ మూర్కొని ముద్దు చేయుచున్
య్య మెఱుంగు; గోపకులు ద్దయు నుబ్బిరి నిబ్బరంబుగన్.

టీక:- అయ్యలన్ = మాతండ్రులను; కంటిమి = చూసితిమి; అంచున్ = అనుచు; పులకాంకురములు = గగుర్పాటులు; వెలయంగన్ = ప్రసిద్ధముగ కలుగగా; కుఱ్ఱలన్ = బిడ్డలను; చయ్యన = గబుక్కున; డాసి = చేరి; ఎత్తికొని = ఎత్తుకొని; సంతసమున్ = సంతోష; అందుచున్ = పడుతు; కౌగలింపన్ = ఆలింగనములు చేయుచు; తారు = వారు; ఆ = ఆ; ఎడన్ = సమయము నందు; ఔదలల్ = మాడులను, నడినెత్తిలను; మనములారగ = మనస్ఫూర్తిగా; మూర్కొని = మూజూసి, ముద్దిడి; ముద్దు = గారాబములు; చేయుచున్ = చేయుచు; దయ్యము = దేవుడే; ఎఱుంగు = తెలియు; గోపకులు = పశువుల పాలించువారు; తద్దయున్ = మిక్కిలిగా; ఉబ్బిరి = పొంగిపోయిరి; నిబ్బరంబుగన్ = స్థిరముగా.
భావము:- “మా చిన్ని అయ్యలను చూడగలిగాము” అంటూ బిడ్డల వద్దకు చేరి వారిని ఎత్తుకున్నారు. ఒడలంతా పులకలెత్తుతుండగా సంతోషంతో కౌగలించుకుని తలలను మూర్కొని ముద్దులు చేసారు. బిడ్డలలో ఉన్న దైవాన్ని తెలుసుకున్నారా అన్నట్లు ఎంతో సంతోషంతో పొంగిపోయారు.

తెభా-10.1-526-వ.
ఇట్లు బాలకాలింగనంబుల నానందబాష్పపూరిత నయనులై గోపకులు గోవుల మరలించుకొని తలంగిచన వారలం జూచి బలభ ద్రుండు తనలోఁ నిట్లని తలంచె.
టీక:- ఇట్లు = ఇలా; బాలక = బిడ్డలను; ఆలింగనంబులన్ = కౌగలింతలవలన; ఆనంద = సంతోషపు; బాష్ప = కన్నీళ్ళతో; పూరిత = నిండిన; నయనలు = కన్నులు కలవారు; ఐ = అయ్యి; గోపకులు = గోవులను పాలించెడివారు; గోవులన్ = ఆవులను; మరలించుకొని = మళ్ళించుకొని; తలంగి = తొలగి; చనన్ = పోగా; వారలన్ = వారిని; చూచి = చూసి; బలభద్రుండు = బలరాముడు; తనలోన్ = తన మనసు నందు; ఇట్లు = ఈ విధముగ; అని = అని; తలంచె = అనుకొనెను.
భావము:- ఈ విధంగా కుమారులను కౌగలించుకోవడంతో కలిగిన ఆనందబాష్పాలతో నిండిన కన్నులతో గోపకులు కుమారులను వదలిపెట్టి గోవులను మళ్ళించుకుని దూరంగా వెళ్ళిపోయారు. వారిని చూసి బలరాముడు ఇలా అనుకున్నాడు.