Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/నాగకాంతలు స్తుతించుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-673-వ.
కని దండప్రణామంబు లాచరించి నిటలతటఘటిత కరకమలలై యిట్లనిరి.
టీక:- కని = దర్శించి; దండప్రణామంబులు = సాష్టాంగనమస్కారములు; ఆచరించి = చేసి; నిటల = నొసటి; తట = ప్రదేశమున; ఘటిత = కూర్చబడిన; కర = చేతులు అనెడి; కమలలు = పద్మములు కలవారు; ఐ = అయ్యి; ఇట్లు = ఇలా; అనిరి = పలికిరి.
భావము:- ఆ నాగకాంతలు కృష్ణుని దర్శించి సాష్టాంగనమస్కారాలు చేసి, నుదుట చేతులు జోడించి ఇలా అన్నారు:

తెభా-10.1-674-క.
"క్రూరాత్ముల దండింపఁగ
ధారుణిపై నవతరించి నరెడి నీ కీ
క్రూరాత్ముని దండించుట
క్రూత్వము గాదు సాధుగుణము గుణాఢ్యా!

టీక:- క్రూర = కఠినమైన; ఆత్ములన్ = మనసులు కలవారిని; దండింపగ = శిక్షించుటకు; ధారుణి = భూమి; పైన్ = మీద; అవతరించి = పుట్టి; తనరెడి = ఒప్పునట్టి; నీ = నీ; కున్ = కు; ఈ = ఈ యొక్క; క్రూరాత్ముని = కఠినాత్ముని; దండించుట = శిక్షించుట; క్రూరత్వము = కఠినత్వము; కాదు = కాదు; సాధుగుణము = మృదుత్వము; గుణాఢ్యా = త్రిగుణసంపన్నుడా, కృష్ణా.
భావము:- “సర్వగుణ సంపన్నుడవైన కృష్ణా! క్రూరులను దండించడానికి అవతరించిన వాడవు నీవు. క్రూరుడైన కాళియుని శిక్షించుట నీ వీరత్వమే గాని క్రూరత్వం కాదు.

తెభా-10.1-675-క.
వారి సుతుల యందును
యించుక లేక సమతఁ రగెడి నీకుం
గలదె? ఖలుల నడఁచుట
దవనముకొఱకుఁ గాక గదాధారా!

టీక:- పగవారి = శత్రులు యొక్క; సుతుల = బిడ్డల; అందునున్ = ఎడల; పగ = శత్రుత్వము; ఇంచుక = కొద్దిగా కూడ; లేక = లేకుండగ; సమతన్ = సమభావమున; పరగెడి = మెలగెడి; నీ = నీ; కున్ = కు; పగ = శత్రుభావము; కలదె = ఉన్నదా, లేదు; ఖలులన్ = దుష్టులను; అణచుట = శిక్షించుట; జగత్ = లోకమునకు; అవనము = రక్షించుట; కొఱకున్ = కోసము; కాక = తప్ప; జగదాధరా = కృష్ణా {జగ దాధారుడు - జగత్తునకు ఆధారభూత మైనవాడు, విష్ణువు}.
భావము:- సమస్త లోకాలకు ఆధారభూతమైనవాడా! శ్రీకృష్ణా! శత్రువుల కొడుకు లందు సైతము కొంచెం కూడ శత్రుత్వం చూపకుండ నీవు సమానత్వం చూపుతావు. నీకు పగ అన్నది లేదు కదా. నీవు దుష్టులను శిక్షించుట లోకాలను రక్షంచడానికే కదా.

తెభా-10.1-676-క.
నిగ్రహమె మము విషాస్యుల
నుగ్రుల శిక్షించు టెల్ల? నూహింప మహా
నుగ్రహము గాక మాకీ
నిగ్రహము విషాస్యభావనిర్గతిఁ జేసెన్.

టీక:- నిగ్రహమె = అడ్డగించుటె, కాదు; మమున్ = మమ్ములను; విష = విషము గల; ఆస్యులన్ = మోము గలవారలను; ఉగ్రులన్ = భయంకరులను; శిక్షించుట = దండించుటలు; ఎల్లన్ = సమస్తము; ఊహింప = ఆలోచించగా; మహా = గొప్ప; అనుగ్రహము = అనుగ్రహము; కాక = కాకుండగ; మా = మా; కున్ = కు; ఈ = ఈ యొక్క; నిగ్రహము = దండన; విష = విషపు; అస్య = ముఖముల; భావ = తత్వమునుండి; నిర్గతి = విడుదలౌటను; చేసెన్ = కలిగించెను.
భావము:- మేము నోట్లో విషం కలిగి ఉండేవాళ్ళం. తీవ్రమైన కోపం కలవాళ్ళం. అలాంటి మమ్మల్నిశిక్షించడం నిజానికి దండనే కాదు. అది మమ్మల్ని గొప్పగా అనుగ్రహించుటయే. ఈ శిక్ష, మా కున్న విషం కలవాళ్ళ మనే పొగరు దిగిపోయేలా చేసింది.

తెభా-10.1-677-ఉ.
ట్టి తపంబు జేసెనొకొ? యెట్టి సుకర్మము లాచరించెనో?
యెట్టి నిజంబు బల్కెనొకొ? యీ ఫణి పూర్వభవంబు నందు ము
న్నెట్టి మహానుభావులకు నెన్నఁడుఁ జేరువగాని నీవు నేఁ
డిట్టి వినోదలీలఁ దల లెక్కి నటించెద వీ ఫణీంద్రుపై.

టీక:- ఎట్టి = ఎలాంటి; తపంబున్ = తపస్సును; చేసెన్ = చేసెనో; ఒకొ = ఏమో; ఎట్టి = ఎలాంటి; సుకర్మములు = మంచిపనులు; ఆచరించెనో = చేసెనో; ఎట్టి = ఎలాంటి; నిజంబున్ = సత్యమును; పల్కెన్ = పలికెనో; ఒకొ = ఏమో; ఈ = ఈ యొక్క; ఫణి = సర్పము; పూర్వ = ముందు; భవంబున్ = జన్మము; అందున్ = లో; మున్ను = ఇంతకు పూర్వము; ఎట్టి = ఎలాంటి; మహానుభావుల = గొప్పవారల; కున్ = కు; ఎన్నడున్ = ఎప్పుడు; చేరువ = సన్నిహితుడు; కాని = కాని; నీవు = నీవు; నేడు = ఇవాళ; ఇట్టి = ఇటువంటి; వినోద = వినోద; లీన = విలాసములను; నటించెదవు = నాట్యము చేసెదవు; ఈ = ఈ యొక్క; ఫణి = పాము; ఇంద్రు = శ్రేష్ఠుని; పైన్ = మీద.
భావము:- పూర్వ జన్మలలో ఈ కాళియుడు ఎంతటి గొప్ప తపస్సు చేసాడో? ఏగొప్ప మంచిపనులు చేసాడో? ఏసత్యాలు పలికాడో? ఎప్పుడు ఎంతటి మహానుభావుల దగ్గరకువెళ్ళని నువ్వు ఇవేళ ఇలా వినోదంగా ఈ నాగరాజు పడగలమీదెక్కి నాట్యం చేసావు. (అహా! విష్ణుపాద స్పర్శ లభించింది ఎంత అదృష్టవంతుడో కదా ఇతడు?)

తెభా-10.1-678-మ.
హు కాలంబు తపంబు చేసి వ్రతముల్ బాటించి కామించి నీ
నీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ
హిళారత్నము తొల్లి కాంచె నిదె నేమం బేమియున్ లేక నీ
హి నీ పాదయుగాహతిం బడసె నే త్యద్భుతం బీశ్వరా!

టీక:- బహు = చాల; కాలంబు = కాలము; తపంబున్ = తపస్సు; చేసి = చేసి; వ్రతముల్ = వ్రతములు; పాటించి = ఆచరించి; కామించి = కోరి; నీ = నీ; మహనీయ = గొప్ప; ఉజ్వల = ప్రకాశవంతమైన; పాద = పాదముల; రేణు = ధూళి; కణ = లేశము; సంస్పర్శ = సోకునట్టి; అధికారంబు = అర్హతను; శ్రీమహిళారత్నము = లక్ష్మీదేవి; తొల్లి = పూర్వము; కాంచెన్ = పొందెను; ఇదె = ఇదిగో; నేమంబు = నియమములు; ఏమియున్ = ఏమికూడ; లేకన్ = లేకుండగనే; ఈ = ఈ యొక్క; అహి = సర్పము; నీ = నీ యొక్క; పాద = పాదముల; యుగ = జంట యొక్క; హతిన్ = దెబ్బలను; పడసె = పొందెను; నేడు = ఇవాళ; అతి = మిక్కిలి; అద్భుతంబు = ఆశ్చర్యకరము; ఈశ్వరా = కృష్ణా.
భావము:- దేవా? కృష్ణా? పూర్వం లక్ష్మీదేవి ఎంతోకాలం తపస్సు చేసి, పట్టుదలగా వ్రతా లనేకం చేసి, గొప్ప తేజస్సుతో ప్రకాశించే నీ పాదరేణువుల లోని కణాన్ని తాకేటట్టి అర్హత సంపాదించు కొంది. ఆహా! అలాంటిది ఈ సర్పరాజు ఏ తపస్సు చేయకుండానే నీ రెండు పాదాల పవిత్ర స్పర్శకు నోచుకున్నాడు.

తెభా-10.1-679-ఉ.
ల్లరు నిర్జరేంద్రపద మొల్లరు బ్రహ్మపదంబు నొందఁగా
నొల్లరు చక్రవర్తిపద మొల్లరు సర్వరసాధిపత్యము
న్నొల్లరు యోగసిద్ధి మఱియొండు భవంబుల నొందనీని నీ
ల్లలితాంఘ్రి రేణువుల సంగతి నొందిన ధన్యు లెప్పుడున్.

టీక:- ఒల్లరు = అంగీకరించరు; నిర్జరేంద్ర పదము = దేవేంద్ర పదవిని; ఒల్లరు = అంగీకరింపరు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; పదంబున = పదవు; ఒందగా = పొందుటకు; ఒల్లరు = అంగీకరించరు; చక్రవర్తి = సార్వభౌమ; పదమున్ = స్థానమును; ఒల్లరు = అంగీకరింపరు; సర్వ = సమస్తమైన; రస = భూమండలమును; అధిపత్యమున్ = ఏలెడి అధికారమును; ఒల్లరు = అంగీకరించరు; యోగ = యోగసాధనలో; సిద్ధిన్ = సాఫల్యమును; మఱి = మరి; ఒండు = ఇంకొక; భవంబులన్ = జన్మలను; ఒందనీని = పొందనీయని; నీ = నీ యొక్క; సత్ = ప్రశస్తమైన; లలిత = మనోజ్ఞమైన; అంఘ్రి = పాద; రేణువుల = ధూళితోడి; సంగతిన్ = కూడికను; ఒందిన = పొందినట్టి; ధన్యులు = కృతార్థులు; ఎప్పుడున్ = ఎప్పుడైనను.
భావము:- అతి మనోజ్ఞము లైన నీ పాదరేణువుల స్పర్శ పొందిన ధన్యులు ఎప్పటికి మరొక పునర్జన్మను పొందరు. అట్టి ధన్యులు, ఆ భాగ్యాన్ని తప్పించి, ఎప్పుడూ దేవేంద్ర పదవికి కూడా ఇష్టపడరు. బ్రహ్మపదానికి కూడా ఇష్టపడరు. చక్రవర్తి, వరుణ పదవులకి కూడా ఒప్పుకోరు. యోగసిద్ధికి అయినా సరే ఒప్పుకోరు.

తెభా-10.1-680-క.
సంసారాహతులగు
ను లాకాంక్షింపఁ గడు నక్యం బగు శో
ము సమక్షంబున నహి
నియెం దామసుఁడు రోషలితుం డయ్యున్

టీక:- ఘన = గొప్పదైన; సంసార = సంసారపు; ఆహతులు = భారము పడినవారు; అగు = ఐన; జనులు = ప్రజలు; ఆకాంక్షింపన్ = కోరుకొనుట కైనన్; కడు = మిక్కిలి; అశక్యంబు = అసాధ్యము; అగు = ఐన; శోభనము = మేలు; సమక్షంబునన్ = కంటి కెదురుగా; అహి = ఈ సర్పము; కనియెన్ = పొందెను; తామసుడు = తమోగుణాన్వితుడు; రోష = కోపము; కలితుండు = కలవాడు; అయ్యున్ = అయినప్పటికి.
భావము:- నీ సాన్నిధ్యమే పరమ శుభం; అతి భారమైన సంసారం వలన మిక్కిలిగా కూరుకుపోయిన వారికి, కోరడానికి కూడ సాధ్యం కానిది. ఎంత అదృష్టవంతుడో? అట్టి భాగ్యాన్ని ఈ కాళియుడు ఇలా క్రోధం రోషంతో నిండిన వాడైనప్పటికి, పొందాడు.

తెభా-10.1-681-వ.
దేవా! సకల పురుషాంతర్యామి రూపత్వంబు వలనఁ బరమ బురుషుండ వయ్యు, నపరిచ్ఛిన్నత్వంబు వలన మహాత్ముండ వయ్యు, నాకాశాది భూతసమాశ్రయత్వంబు వలన భూతావాసుండ వయ్యును, భూతమయత్వంబు వలన భూతశబ్ద వాచ్యుండ వయ్యుఁ, గారణాతీతత్వంబు వలనఁ బరమాత్ముండ వయ్యును, జ్ఞాన విజ్ఞాన పరిపూర్ణత్వంబు గలిగి నిర్గుణత్వ నిర్వికారత్వంబు వలన బ్రహ్మంబ వయ్యుఁను, బ్రకృతి ప్రవర్తకత్వంబు వలన ననంతశక్తివై యప్రాకృతుండ వయ్యుఁ, గాలచక్రప్రవర్తకత్వంబు వలనఁ గాలుండ వయ్యుఁ, గాలశక్తి సమాశ్రయత్వంబు వలన గాలనాభుండ వయ్యు, సృష్టి జీవన సంహారాది దర్శిత్వంబు వలనం గాలావయవసాక్షి వయ్యు నొప్పు నీకు నమస్కరించెదము; మఱియును.
టీక:- దేవా = భగవంతుడా; సకల = సమస్తమైన; పురుష = జీవుల యొక్క; అంతర్యామి = లోపల వర్తించునట్టి; రూపత్వంబు = రూపము కలవాడవు; వలన = అగుట వలన; పరమపురుషుండవు = పరమపురుషుడవు {పురుషుడు - వ్యుత్పత్తి. పురీ శరీరేశేత ఇతి పురుషః, సకల జీవశరీరముల యందు వసించువాడు పురుషుడు}; అయ్యున్ = అయినప్పటికి; అపరిచ్ఛిన్నత్వంబు = అంఖడ స్వభావము {అపరిచ్ఛిన్నము - దేశ కాల వస్తువుల చేత విభాగింపబడనిది}; వలన = వలన; మహాత్ముండవు = మహాత్ముడవు {మహాత్ముడు - మహత్తత్వ అవ్యక్తములను మీరిన గొప్పరూపము కలవాడు}; అయ్యున్ = అయినప్పటికి; ఆకాశ = ఆకాశము; ఆది = మొదలగు; భూత = పంచభూతములకు {భూత - భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము అనెడి పంచభూతములు ఆ భూతజన్యములైన జీవులు}; సమ = చక్కటి; ఆశ్రయత్వంబు = అండగా ఉండు తత్వము; వలన = వలన; భూత = సమస్త భూతములకు; ఆవాసుండవు = నివాసమైనవాడవు; అయ్యును = అయినప్పటికి; భూత = సమస్త భూతముల; మయత్వంబు = నిండి ఉండు తత్వము; వలన = వలన; భూత = భూతము అనెడి; శబ్ద = నామము చేత; వాచ్యుండవు = పలుకబడువాడవు; అయ్యున్ = అయినప్పటికి; కారణ = మూల ప్రకృతి {మూలప్రకృతి - సర్వకారణములకు కారణమైనది}; అతీతత్వంబు = మీరిన లక్షణము; వలన = వలన; పరమాత్ముండవు = పరమాత్ముడవు; అయ్యును = అయినప్పటికి; జ్ఞాన = అపరోక్షజ్ఞానము నందు; విజ్ఞాన = పరోక్షజ్ఞానము నందు {పరోక్షజ్ఞానము – ప్రపంచ కల్పనాది రూపము కలది}; పరిపూర్ణత్వంబు = సంపూర్ణభావము; కలిగి = ఉండి; నిర్గుణత్వ = త్రిగుణాతీత స్వభావము {నిర్గుణత్వము - శాంతరూపైన సత్వగుణము ఘోరరూపైన రజోగుణము మూఢరూపైన తమోగుణము ఐన త్రిగుణములు లేకపోవుట, మూటికి అతీతముగ వుండుట}; నిర్వికారత్వంబు = షడ్భావవికారాతీతత్వము {నిర్వికారత్వము - షడ్విధ వికారములు లేకపోవుట (1గర్భములో ఉండుట 2పుట్టుట 3పెరుగుట 4ముదియుట 5కృశించుట 6చనిపోవుట)}; వలన = వలన; బ్రహ్మంబవు = పరబ్రహ్మవు {పరబ్రహ్మ - అఖండ పరిపూర్ణ సచ్చిదానంద పరబ్రహ్మ (శో. బహిర్బ్రహ్మ వృద్ధై బృహతేర్ధాతోః అర్థానుగమాత్ దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్నం యద్వస్తు తద్బ్రహ్మేతి భాష్యం)}; అయ్యును = అయినప్పటికి; ప్రకృతి = నీ అవ్యక్త నామ శక్తి యొక్క; ప్రవర్తకత్వంబు = సర్వ వ్యాపార ప్రవర్తకము {సర్వ వ్యాపార ప్రవర్తకము - సమస్తమైన పంచవ్యాపారముల (1సృష్టి 2స్థితి 3లయ 4తిరోధాన 5అనుగ్రహములు) యందు విచిత్రముగ వ్యాపించగలుగుట}; వలనన్ = వలన; అనంతశక్తివి = అంతులేని శక్తి కలవాడవు {అనంత శక్తి - 1సర్వజ్ఞత్వ 2సర్వేశ్వరత్వ 3సర్వభోక్తృత్వ 4సర్వపాలకత్వాది సామర్థ్యములు కలిగ ఉండుట}; ఐ = అయ్యి; అప్రాకృతుండవు = ప్రకృతికి అతీతుడవు; అయ్యున్ = అయినప్పటికి; కాలచక్ర = కాలావయవములను {కాలచక్రము - అఖండమై నిమేష ఘటిక దిన మాస సంవత్సరాది కాలావయవము లనెడి భేదములచే చక్ర భ్రమణయుక్తమైన కాలము}; ప్రవర్తకత్వంబు = నడిపించెడివాడవు; వలన = అగుట వలన; కాలుండవు = అఖండకాలస్వరూపుడవు; అయ్యున్ = అయినప్పటికి; కాల = కాలము అనెడి; శక్తి = శక్తికి (సృష్టిస్థితిలయాదులకు); సమ = మేలైన; ఆశ్రయత్వంబు = ఆశ్రయభూతుడగుట; వలన = వలన; కాలనాభుండవు = కాలము స్వాధీనముగ కలవాడువు; అయ్యున్ = అయినప్పటికి; సృష్టి = సృష్టి; జీవన = స్థితి; సంహార = లయ; ఆది = మొదలగునవానిని; దర్శిత్వంబు = చూపువాడవు; వలన = అగుట వలన; కాల = కాలము యొక్క; అవయవ = భాగములకు (నిమేష సంవత్సరాదులు); సాక్షివి = సాక్షివి {సాక్షి - కాల వస్తు స్థితి స్వభావముల ప్రభావములకు లోనుగాక చూచువాడు}; అయ్యున్ = అయ్యి; ఒప్పు = ఉండునట్టి; నీ = నీ; కున్ = కు; నమస్కరించెదము = మ్రొక్కెదము; మఱియును = ఇంకను.
భావము:- ఓ కృష్ణ దేవుడా! నీవు అందరిలోను నిండి ఉండేవాడవు, కనుక జీవుడనే పురుషుడవు. అంతే కాక, అందరిలోని అంతర్యామివి, కనుక పరమ పురుషుడవు. విడివిడిగా కాకుండా అందరిలోను నిండి ఉండేవాడవు, కనుక మహాత్ముడవు. ఆకాశం మొదలైన పంచభూతాలకు ఆశ్రయుడవు గనుక, నీవు భూతవాసుడవు. సమస్తభూతాలు నీలో ఉన్నాయి గనుక, నీవు భూతమయుడవు. నీకు కారణం ఏమి లేదు కనుక నీవు పరమాత్మవు. పరిపూర్ణమైన జ్ఞానం విజ్ఞానం కలవాడవు కనుకను, గుణాలు ఆటంకాలు మార్పులు లేనివాడవు కనుకను, బ్రహ్మమువవు. ఈ ప్రకృతిని ప్రవర్తింప జేసేవాడవు నీవే కనుక, అనంతశక్తి స్వరూపుడవు. ఆ ప్రకృతి అంటని వాడవు. కాలచక్రాన్ని నడుపుతుంటావు కనుక, కాలస్వరూపుడువు. కాలం యొక్క శక్తిని ఆశ్రయించి ఉన్నావు కనుక, కాలనాభుడవు. సృష్టిలోని జీవులు జన్మించటం మరణించటం చూస్తూ ఉంటావు కనుక, నీవు సర్వసాక్షివి. అటువంటి దేవా? నీకు నమస్కరిస్తున్నాము.

తెభా-10.1-682-సీ.
విశ్వంబు నీవయై విశ్వంబుఁ జూచుచు-
విశ్వంబుఁ జేయుచు విశ్వమునకు
హేతువవై పంచభూమాత్రేంద్రియ-
ములకు మనః ప్రాణ బుద్ధి చిత్త
ముల కెల్ల నాత్మవై మొనసి గుణంబుల-
నావృత మగుచు నిజాంశభూత
గు నాత్మచయమున నుభూతి చేయుచు-
మూ డహంకృతులచే ముసుఁగుబడక

తెభా-10.1-682.1-తే.
నెఱి ననంతుఁడవై దర్శనీయరుచివి
గాక సూక్ష్ముఁడవై నిర్వికారమహిమఁ
నరి కూటస్థుఁడన సమస్తంబు నెఱుఁగు
నీకు మ్రొక్కెద మాలింపు నిర్మలాత్మ!

టీక:- విశ్వంబు = జగత్తు; నీవ = నీవే; ఐ = అయ్యి; విశ్వంబున్ = జగత్తును; చూచుచున్ = సాక్షివై చూచుచు; విశ్వంబున్ = జగత్తును; చేయుచున్ = సృష్టించుచు; విశ్వమున్ = జగత్తున; కున్ = కు; హేతువవు = కారణభూతుడవు; పంచభూత = పంచమహాభూతములకు {పంచమహాభూతములు - 1 భూమి 2నీరు 3అగ్ని 4వాయువు 5ఆకాశము}; మాత్ర = పంచతన్మాత్రలకు {మాత్రలు, పంచతన్మాత్రలు - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంధము}; ఇంద్రియముల్ = జ్ఞానకర్మేంద్రియముల {దశేంద్రియములు - జ్ఞానేంద్రియములు ఐదు (కన్ను ముక్కు చెవులు నాలుక చర్మములు) కర్మేంద్రియములు ఐదు (కాళ్ళు చేతులు నోరు గుదము గుహ్యములు)}; కున్ = కు; మనః = మనస్సునకు {మనస్సు - సంకల్ప రూపము}; ప్రాణ = దశవాయువులకు {ప్రాణములు, దశవాయువులు - పంచవాయువులు ఐదు (ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు) పంచ ఉపవాయువులు ఐదు (నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయములు)}; బుద్ధి = బుద్ధి {బుద్ధి - నిశ్చయము రూపము}; చిత్తముల = చిత్తముల {చిత్తము - సంశయ రూపము}; కిన్ = కి; ఎల్లన్ = సమస్తమునకు; ఆత్మవు = స్వరూపుడవు; ఐ = అయ్యి; మొనసి = పూని; గుణంబులన్ = త్రిగుణములచేత; ఆవృతము = కప్పబడినవాడవు; అగుచున్ = అగుచు; నిజ = నీయొక్క; అంశ = అంశములో; భూతము = ఐనవవి; అగు = అయిన; ఆత్మచయమున = సర్వజీవజాలముల; కున్ = కు; అనుభూతి = జీవన్మరణా ద్యనుభవములు; చేయుచున్ = కలుగజేయుచు; మూడహంకృతుల = త్రిగుణాత్మకహంకృతులు {త్రిగుణాత్మకహంకృతులు - రాజసాహంకృతి తామసాహంకృతి సాత్వికాహంకృతి}; చేన్ = వలన; ముసుగుబడకన్ = కమ్ముకొనబడకుండగ.
నెఱిన్ = పరిపూర్ణత్వముచేత; అనంతుడవు = అంతము లేనివాడవు {అనంతుడు - దేశ కాల వస్తు విభాగము లేనివాడు, అంతము లేనివాడు}; ఐ = అయ్యి; దర్శనీయ = చూడదగిన; రుచివి = తగినవాడవు {రుచి - ప్రకాశము, దృశ్యప్రపంచ రూపమైన ఇదంవృత్తి}; కాక = కాకుండగ; సూక్ష్ముడవు = సూక్ష్మత్వము కలవాడవు; ఐ = అయ్యి; నిర్వికార = షడ్వికార శూన్యత్వ; మహిమన్ = మహత్యముచేత; తనరి = ఒప్పి; కూటస్థుడు = కూటస్థుడు {కూటస్థుడు - కూటస్థము (ఎల్లకాలము ఒకే విధముగా నుండెడి తత్వము) కలవాడు, పంచమహాభూతముల సమూహమున ఉండువాడు, క్షేత్రజ్ఞుడు}; అనన్ = అనబడుతు; సమస్తంబున్ = సమస్తమును {సమస్తము - ద్రష్ట దృక్ దృశ్య మయమైన సమస్తము}; ఎఱుగు = తెలిసి యుండెడి; నీ = నీ; కున్ = కు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; ఆలింపుము = వినుము {పంచమలములు - 1ఆణవము 2కార్మికము 3మాయికము 4మాయేయము 5తిరోధానము }; నిర్మలాత్మా = కృష్ణా {నిర్మలాత్మ - పంచమలములు లేని పరబ్రహ్మ స్వరూపుడు, విష్ణువు}.
భావము:- ఈ సమస్త విశ్వము నీవే; ఈ విశ్వంగా ఉండి దాన్ని చూస్తున్న వాడవు కూడ నీవే. దీన్ని నిర్మిస్తూ ఉండేది నీవే. ఈ విశ్వానికి మూలకారణం నీవే. పంచతన్మాత్రలు, పంచేంద్రియాలు, మనస్సు, ప్రాణం, బుద్ధి, చిత్తం అన్ని కూడ నీవే. ఈ గుణాలచేత ఆవరింపబడి ఉన్నవాడవు నీవే. నీలో కొంత భాగమై, నీ అంశలై ఇన్ని ఆత్మలు వర్తిస్తు ఉంటే, వాటికి అనుభూతి కలిగించే మొత్తంగా నీవే ఉన్నావు. త్రిగుణాలైన సత్వరజస్తమాల రూపంలో పనిచేసే మూడు అహంకారాలుచేత కప్పబడకుండా ఉంటావు. అంతులేని ప్రకాశం కలిగి ఉంటావు. గమనించడానికి శక్యంకాని సూక్ష్మ రూపుడవు అయ్యి ఉంటావు. మార్పులన్నవి లేకుండా ఉండి, అన్నిటిలోను దాగి ఉంటావు కనుక, సమస్తము ఎరుగుదువు. అటువంటి నీకు నిర్మలాత్ముడా! మేము నమస్కరిస్తున్నాము.

తెభా-10.1-683-వ.
మఱియుఁ గలండు లేఁడు; సర్వంబు నెఱుంగు; నించుక నెఱుంగు బద్ధుండు; విముక్తుం డొకం; డనేకుఁడు నను నివి మొదలుగాఁ గల వాదంబులు మాయ వలన ననురోధింపుదురు గావున నానావాదానురోధకుండ వయ్యు, నభిధానాభిధేయ శక్తిభేదంబుల వలన బహుప్రభావప్రతీతుండ వయ్యుఁ, జక్షురాది రూపంబుల వలనఁ బ్రమాణ రూపకుండ వయ్యు, నిరపేక్షజ్ఞానంబు గలిమిం గవి వయ్యు, వేదమయనిశ్వాసత్వంబువలన శాస్త్రయోని వయ్యు, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ రూపంబుల వలనఁ జతుర్మూర్తి వయ్యు, భక్తజనపాలకుండ వయ్యు, నంతఃకరణ ప్రకాశత్వంబు గలిగి సేవకజన ఫలప్రదానంబుకొఱకు గుణాచ్ఛాదకుండ వయ్యుఁ, జిత్తాదివర్తనంబులఁ గానందగిన గుణంబులకు సాక్షివై యొరుల కెఱుంగరామి నగోచరుండ వయ్యుఁ, దర్కింపరాని పెంపు వలన నవ్యాహతవిహారుండ వయ్యు, సకలకార్య హేతు వయ్యు, నంతఃకరణప్రవర్తకత్వంబు వలన హృషీకేశుండ వయ్యును, సాధనవశంబు గాని యాత్మారామత్వంబు వలన ముని వయ్యు, స్థూల సూక్ష్మగతుల నెఱుంగుచు నెందుం జెందక నీవు విశ్వంబుగాకయు విశ్వంబు నీ వయ్యును, విశ్వభావాభావ సందర్శనంబు చేయుచు విద్యావిద్యలకు హేతువైన నీకుం బ్రణామంబు లాచరించెదము; అవధరింపుము.
టీక:- మఱియున్ = అంతేకాక; కలండు = దేవు డున్నాడు {కలండు - దేవుడు త్రికాలములు భూత భవిష్యత్ వర్తమానము లందు ఉన్నాడు}; లేడు = దేవుడు లేడు {లేడు - దేవుడు త్రికాలములు భూత భవిష్యత్ వర్తమానము లందు లేడు}; సర్వంబునెఱుంగున్ = దేముడు సర్వజ్ఞుడు {సర్వంబు నెఱుగు - సృష్టి స్థితి లయ తిరోధానానుగ్రహము లనెడి పంచకృత్యములు మొదలైనవానిని అన్నిటిని దేముడు ఎరుగును}; ఇంచుకనెఱుంగును = దేముడు కొంత మాత్రమే తెలిసిన వాడు; బద్దుండు = మాయకు లోబడువాడు {బద్దుండు - ప్రకృతి పాశములచేత కట్టుబడువాడు, మాయకు లోబడువాడు}; విముక్తుండు = ముక్తిపొందినవాడు {విముక్తుడు - ప్రకృతి పాశములనుండి విముక్తి పొందినవాడు}; ఒకండు = అన్యరహితుడు; అనేకుండును = సర్వ దేవతా రూపకుడు {అనేకుడు - శ్రు. ఏకోదేవా బహుధానివిష్టః, ఒక్కడుగాను అనేకులుగాను ఉన్నవాడు దేవుడు}; అను = అనెడి; ఇవి = ఇవి; మొదలుగాగల = మొదలైన; వాదంబులు = మతములు, ప్రసంగములు; మాయ = భ్రమ; వలనన్ = వలన; అనురోధింపుదురు = జరిపెదరు; కావున = అందుచేత; నానా = అనేక విధములైన; వాదా = ప్రసంగములకు; అనురోధకుండవు = అనుకూలుడవు; అయ్యున్ = అయినప్పటికి; అభిదాన = పేర్ల యొక్క; అభిధేయ = పేర్లుగల వస్తువులయొక్క; శక్తి = వస్తు గుణముల; భేదంబుల = ఎక్కువతక్కుల; వలన = చేత; బహు = అనేకవిధములైన {బహు ప్రభావ ప్రతీతుడు - క. నానా దేహోపాధుల, నానాత్వ భ్రాంతినొంది నానీదనుచున్, నానాభిమానములచే, నానావిభవంబులాయె నారాయణుఁడే (రామస్తవరాజము)}; ప్రభావ = సర్వజ్ఞత్వాది మహిమలచేత; ప్రతీతుండవు = ప్రసిద్ధుడవు; అయ్యున్ = అయినప్పటికి; చక్షుస్ = కన్ను; ఆది = మొదలైన; రూపంబుల = అవయవములచేత; ప్రమాణ = నిశ్చయింపబడిన; రూపకుండవు = రూపము కలవాడవు; అయ్యున్ = అయినప్పటికి; నిరపేక్ష = సాధానానంతరాపేక్ష లేని; జ్ఞానంబున్ = విజ్ఞానమును; కలిమిన్ = కలిగుండుటచేత; కవివి = స్వయంప్రకాశుడవు; అయ్యున్ = అయినప్పటికి; వేదమయ = వేదస్వరూపమైన; నిశ్వాసత్వంబు = నిశ్వాస కలిగి యుండుట; వలనన్ = చేత; శాస్త్ర = శాస్త్రములకు; యోనివి = జన్మస్థానమైనవాడవు; అయ్యున్ = అయినప్పటికి; సంకర్షణ = అహంకారమున కధిదేవత; వాసుదేవ = బుద్ధి కధిదేవత; ప్రద్యుమ్న = మనస్సున కధిదేవత; అనిరుద్ధ = చిత్తమున కధిదేవత; రూపంబుల = వ్యూహరూపములు కలవాడవు; వలన = అగుట వలన; చతుః = నాలుగు విధములైన; మూర్తివి = వ్యూహములు కలవాడవు; అయ్యున్ = అయినప్పటికి; భక్త = అనన్య భక్తి గల; జన = వారిని; పాలకుండవు = ఏలువాడవు; అయ్యున్ = అయినప్పటికి; అంతఃకరణ = మనసులోపల {అంతఃకరణము - మనోబుద్ధి చిత్తాహంకారములకు మూలమైన ప్రధానము}; ప్రకాశత్వంబున్ = తెలియబడుట {ప్రకాశత్వము - శబ్ద స్పర్శాది వ్యాపారములందు ప్రవర్తించునట్లు చేయుట}; కలిగి = కలవాడవై; సేవకజన = భక్తులకు; ఫల = ధర్మార్థ కామ మోక్ష ఫలములు; ప్రదానంబు = ఇచ్చుట; కొఱకున్ = కోసము; గుణ = త్రిగుణములచేత; ఆచ్ఛాదకుండవు = ఆవరింపబడినవాడవు; అయ్యున్ = అయినప్పటికి; చిత్తాది = చిత్తము మున్నగువాని {చిత్తాది వర్తనములు- 1చిత్తము 2అహంకారము 3మనస్సు 4బుద్ధి రూపములైన చతురంతఃకరణముల చలన కర్తవ్య సంకల్ప నిశ్చయ వ్యాపారములు నిర్వహించునవి}; వర్తనంబులు = వ్యాపారములచేత; కానందగిన = తెలిసికొనదగిన; గుణంబులన్ = ఆ త్రిగుణముల; కున్ = కు; సాక్షివి = ఎడమగా నుండి చూచువాడవు; ఐ = అయ్యి; ఒరులకు = బ్రహ్మజ్ఞానులకంటె నితరుల; కున్ = కు; ఎఱుంగరామిన్ = తెలిసికొనశక్యము గానిచేత; అగోచరుండవు = కంటికి కనబడనివాడవు; అయ్యున్ = అయినప్పటికి; తర్కింపరాని = ఇట్టిదట్టిదని చెప్ప వీలుకాని; పెంపు = మహిమ; వలనన్ = వలన; అవ్యాహత = ఊహింపరాని; విహారుండవు = మహిమలు గలవాడవు; అయ్యున్ = అయినప్పటికి; సకలకార్య = సకల కార్యములకు {సకల కార్యములు - అవ్యక్తము మహత్తత్వము అహంకారము పంచతన్మాత్రలు పంచభూతము అనెడి చతుర్దశ కార్యములు}; హేతువు = మూలకారణభూతుడవు, ఉత్పత్తిస్థాన మైనవాడవు; అయ్యున్ = అయినప్పటికి; అంతఃకరణ = చతురంతఃకరణములను {చతురంతఃకరణములు - 1చిత్తము 2అహంకారము 3బుద్ధి 4మనస్సులు}; ప్రవర్తకత్వంబు = నడపువాడవు; వలన = అగుట వలన; హృషీకేశుండవు = హృషీకేశుడవు {హృషీకేశుడు - చతుర్దశేంద్రియములకు (దశేంద్రియములు చతురంతఃకరణములుకు) నియామకుడు}; అయ్యును = అయినప్పటికి; సాధన = యోగాది సాధనలచే నైనను; వశంబుగాని = స్వాధీనముకాని, అందని; ఆత్మారామత్వంబు = ఆత్మారాముడవు {ఆత్మారామత్వము - తన యందు తానే క్రీడించుట కలిగి యుండుట}; వలన = అగుట వలన; మునివి = మౌనశీలివి; అయ్యున్ = అయినప్పటికి; స్థూల = ఆదిభౌతికము; సూక్ష్మ = ఆధ్యాత్మికము; గతులన్ = మార్గము లందును; ఎఱుంగుచున్ = తెలిసికొనుచు; ఎందున్ = దేని యందును; చెందక = అంటక, వస్త్వంతర సంబంధము లేక; నీవు = నీవు; విశ్వంబున్ = ప్రపంచ స్వరూపుడవు; కాకయున్ = కాకపోయినను; విశ్వంబు = ప్రపంచ స్వరూపము; నీవ = నీవే; అయ్యును = అయినప్పటికి; విశ్వ = ప్రపంచము {విశ్వభావాభావసందర్శనము - భగవంతుడు ప్రపంచోత్పత్తికి ముందు లయము తరువాత నుండువాడు కనుక ఉండుట లేకపోవుటలు రెండు చూచును}; భావ = కలిమి, సృష్టితరువాత; అభావ = లేమి, లయముతరువాత; సందర్శనము = చూచుట; చేయుచున్ = చేస్తు; విద్య = ఆత్మజ్ఞానము; అవిద్యల = ఆత్మజ్ఞాన రాహిత్యమున; కున్ = కు; హేతువు = కారణభూతము; ఐన = అయినట్టి; నీ = నీ; కున్ = కు; ప్రణామంబులు = నమస్కారములు; ఆచరించెదము = చేసెదము; అవధరింపుము = చిత్తగింపుము.
భావము:- దేవుడు ఉన్నాడనీ, లేడనీ వాదిస్తు ఉంటారు. దేవుడికి అన్నీ తెలుసుననీ, జీవుడికి కొంచమే తెలుసుననీ అంటారు. జీవుడు ఒకప్పుడు సంసారబంధంలో ఇరుక్కున్నాడనీ పిమ్మట మోక్షం పొందాడనీ అంటారు. దేవుడు ఒకడే అనీ, అనేక రూపాలలో ఉన్నాడనీ అంటారు. ఇలాంటి వాదాలన్నీ మాయ వలన కలుగుతూ ఉంటాయి. అనేక వాదాల చిక్కులుగా తెలియ బడువాడవు నీవే. నీవు అనేక పేర్లు రూపాలు శక్తుల తారతమ్యములతో నానావిధ మహిమల చేత తెలియబడుతూ ఉంటావు. కన్నులు మొదలైన ఇంద్రియాలచే గ్రహించ వీలగు రూపంగాను గమనింపబడతు, ఆ గమనింపులుగా కూడ ఉంటావు. నీ యందలి జ్ఞానానికి ఆధారాలు కాని సంకేతాలు కాని అవసరం లేదు. సమస్తాన్ని కల్పిస్తూ కవివై ప్రవర్తిల్లుతావు. నీ నిశ్వాసమే వేదం కనుక, శాస్త్రం అనే సమస్తము నీనుండే తెలుసుకోబడుతూ ఉంటాయి. ఆ శాస్త్రాలకి ఉత్పత్తి స్థానంగా ఉంటావు కనుక, "సంకర్షణుడు", "వాసుదేవుడు", "ప్రద్యుమ్నుడు", "అనిరుద్ధుడు"అనే "చతుర్వ్యూహమూర్తి"గా తెలియబడతావు. భక్తి కలిగిన వాళ్ళని నీవే సాకుతూ ఉంటావు. అందరి హృదయాలలో సర్వం తెలిసి ఉండి, వారి భక్తికి తగిన ఫలాలను అందేటట్లు చేస్తావు. అందుచేత గుణాలచేత ఆవరింపబడిన వాడివిగా కనబడతావు. చిత్తం మొదలైన వాని వర్తనలచేత తెలియదగిన గుణాలకి గోచరిస్తున్నట్లే ఉంటావు. కాని ఇతరులకు గోచరించకుండా సాక్షిగా వాళ్ళలోనే ఉంటావు. తర్కానికి అతీతమైన వాడవై, ఇట్టిదట్టిదని నిరూపించడానికి రాని విహారం కల వాడవు. సృష్టిలోని సమస్తమైన కార్యాలకి మూలకారణం నీవే. అంతఃకరణానికి విషయ గ్రహణ శక్తి కలుగ చేస్తావు కనుక, సర్వ ఇంద్రియాలకు ఆధిపతివి (హృషీకములకు ఈశుడు). తన యందు తానే క్రీడించు శక్తి కలవాడవు కనుక సాధనకు లొంగే వాడివి కాదు. మునివై మౌనంగా అందరిలోను ఉంటావు. స్థూలమైన వానిలో స్థూలుడుగా, సూక్ష్మమైన వానిలో సూక్ష్ముడుగా తెలియబడుతూ ఉంటావు. కాని రెంటికి నీవు అంటనివాడవు కనుక ప్రపంచానికి అతీతమైనవాడవు, నీవు ప్రపంచ స్వరూపుడవై ఉంటావు. లోకము యొక్క కలిమి లేములను సాక్షివై చూస్తూ ఉంటావు. విద్యకు అవిద్యకు సర్వానికి కారణభూతుడవు, కర్తవు నీవే. అటువంటి నీకు నమస్కరిస్తున్నాము. అవధరింపుము.

తెభా-10.1-684-క.
లో జనిస్థితిలయములు
గైకొని చేయుదువు త్రిగుణలితుఁడవై కా
లాకారమున నమోఘ
శ్రీలితుఁడ వగుచు నిచ్చ జెందక యీశా!

టీక:- లోక = జగత్తునకు; జని = బ్రహ్మరూపమున సృష్టి; స్థితి = విష్ణురూపమున పాలన; లయములు = శివరూపమున లయము; కైకొని = స్వీకరించి; చేయుదువు = నీవే ఆచరించెదవు; త్రిగుణ = మూడుగుణములుతోడ {త్రిగుణములు - 1శాంతవృత్తిగల సత్వగుణము 2ఘోరవృత్తిగల రజోగుణము 3మూఢవృత్తిగల తమోగుణము అనెడి మూడుగుణములు}; కలితుండవు = కూడుకొన్నవాడవు; ఐ = అయ్యి; కాల = కాలము యొక్క {కాలము - నిమేష ప్రళయాది రూపములు కలది, సర్వము కలిగించెడిది}; ఆకారమునన్ = స్వరూపముతో; అమోఘ = వ్యర్థముకాని, తిరుగులేని; శ్రీ = షడ్గుణైశ్వర్యములు; కలితుడవు = కలవాడవు; అగుచున్ = అగుచు; ఇచ్చన్ = అపేక్షను; చెందక = పొందక; ఈశా = కృష్ణా {ఈశుడు - బ్రహ్మాదులను సృష్ట్యాది కార్యము లందు నియమించు వాడు, విష్ణువు}.
భావము:- పరమేశ్వరా! నీవు తిరుగులేని అష్టైశ్వర్యాలూ కలవాడవు. కాల స్వరూపుడవు. త్రిగుణాలను అవలంబించిన వాడవు. అయినట్టి నీవు ఎట్టి అపేక్ష పొందక, ఈ లోకాలను అన్నిటినీ పుట్టిస్తూ, నిలబెట్టుతూ, నశింపచేస్తూ ఉంటావు.

తెభా-10.1-685-క.
శాంతులు గాని తనువు
లీశా! యీ మూఢజాతు లీ సజ్జాతుల్
యీశాంత తనువులందుఁ బ్ర
కాశింతువు ధర్మహితముగా సుజనులలోన్.

టీక:- ఈ = ఈ కనబడుచున్న; శాంతలుగాని = శాంతాది సద్గుణములు లేని; తనువులు = దేహధారి జీవులు; ఈశా = సర్వభోక్త, కృష్ణా; ఈ = ఈ కనబడుచున్న; మూఢ = నీ స్వరూప జ్ఞానములేని; జాతులు = జన్ములు; ఈ = ఈ కనబడుచున్న; సజ్ఞాతుల్ = నీ స్వరూపజ్ఞాన మున్నవి; ఈశాంత = ఈశ్వరుడే తుదిగా గల; తనువులు = దేహధారి జీవులు; అందున్ = అందు; ప్రకాశింతువు = వెలిగెదవు; ధర్మ = వర్ణాచారములకు; హితముగా = మేలు కలుగుటకు; సుజనుల = సజ్జనుల; లోన్ = అందు.
భావము:- ఈశ్వరా! నీవు శాంతి లేని వారిలోను, మూఢులైన వారి లోను, జ్ఞానులైన వారిలోను, ఈశ్వరుడే తుదగా జీవించే వారి లోను అందరిలోను ప్రకాశిస్తుంటావు. కాని ధర్మానికి మేలు చేయటం కోసం మంచి వాళ్ళలో తరచుగా ప్రకాశిస్తావు.

తెభా-10.1-686-ఉ.
నేము లెన్న నెక్కడివి? నేము దలంచు తలంపు లోపలన్
నేరుపు లున్నవే? సుతుల నేరమిఁ దండ్రులు ద్రోచిపుచ్చరే?
నేము చేయువారి ధరణీపతు లొక్కకమాటు గావరే?
నేము గల్గు మద్విభుని నే డిటఁ గావఁగదే కృపానిధీ!

టీక:- నేరములు = తప్పులు (శిక్షించదగినవి); ఎన్నన్ = తరచి చూసినచో; ఎక్కడివి = ఎక్కడ ఉన్నవి; నేము = మేము; తలంచు = తలచెడి; తలంపులు = ఆలోచనలు; అందులోన్ = అన్నిటిలోని; నేరుపులు = చతురత్వములు, నేర్పులు; ఉన్నవే = ఉన్నాయా, లేవు; సుతుల = కొడుకుల; నేరమున్ = తప్పును; తండ్రులు = తండ్రులు; త్రోసిపుచ్చరే = విడిచిపెట్టరా, విడిచెదరు; నేరము = తప్పు; చేయు = చేసెడి; వారిన్ = వారిని; ధరణీపతులు = రాజులు; ఒక్కొక్క = ఒక్కొక్క; మాటు = సారి; కావరే = క్షమించరా; నేరము = తప్పు; కల్గు = చేసినట్టి; మత్ = మా యొక్క; విభుని = భర్తను; నేడు = ఇవాళ; ఇటన్ = ఇక్కడ; కావగదే = కాపాడుము; కృపానిధీ = దయాసాగరా, కృష్ణా.
భావము:- దయాసాగరా! కృష్ణా! మేము చేసే ఆలోచనలలో నేర్పులన్నవి లేవు కదా! నీ సన్నిధిలో నేరాలు అంటూ ఏముంటాయి? పిల్లలు తప్పులు చేస్తే తండ్రులు క్షమించరా! రాజులు కూడ ఒక్కొక్కసారి నేరంచేసేవారిని కూడ క్షమిస్తుంటారు కదా! నేరం చేసిన మా భర్త కాళియుడుని క్షమించు. నీవు కరుణకు పుట్టిల్లు వంటివాడవు కదా! కాపాడు తండ్రీ!

తెభా-10.1-687-శా.
బాలుం డీతఁడు మంచివాఁ డనుచుఁ జెప్పన్ రాము క్రూరుండు దు
శ్శీలుండౌ నవు నైన నేము సుభగశ్రీఁ బాసి వైధవ్య దు
ష్టాలంకారముఁ బొంద నోడెద మనాథాలాప మాలింపవే?
చాలున్ నీ పద తాండవంబు; పతిభిక్షం బెట్టి రక్షింపవే?

టీక:- బాలుండు = అమాయకుడు; ఈతడు = ఇతను; మంచివాడు = యోగ్యుడు; అనుచున్ = అని; చెప్పన్ = చెప్పుటకు; రాము = వచ్చిన వారము కాము; క్రూరుండు = చెడ్డమనసు కలవాడు; దుశ్శీలుండున్ = చెడు నడవడిక గలవాడు; ఔనవున్ = అవును; ఐనన్ = అయినప్పటికి; నేము = మేము; సుభగ = అయిదవతనమను; శ్రీన్ = సంపదను; పాసి = తొలగి; వైధవ్య = వైధవ్యము అనెడి; దుష్ట = చెడ్డ; అలంకారమున్ = అలంకారమును; పొందన్ = పొందుటకు; ఓడెదము = భయపడుచున్నాము; అనాథ = నీవు తప్ప దిక్కులేనివారి; ఆలాపమున్ = వేడ్కొనుటను; ఆలింపవే = వినుము; చాలున్ = ఇక చాలును; నీ = నీ యొక్క; పద = అడుగుల; తాండవంబు = లయబద్ధ ప్రక్షేపములు; పతిభిక్షన్ = భర్త అనెడి భిక్షను; పెట్టి = అనుగ్రహించి; రక్షింపవే = కాపాడుము.
భావము:- ఈ కాళీయుడు అమాయకుడు, మంచివాడు అనడం లేదు. నిజమే! ఇతడు క్రూరుడు, దుష్టుడు. అయినా మేము సౌభాగ్యాన్ని పోగొట్టుకొని అసహ్య రూపాలతో ఉండే వైధవ్యం పొందలేము. మేము అనాథలము. మా దీనాలాపాలను మన్నించు. ఇక నీ పాదతాడనాలు చాలించు. పతిభిక్ష పెట్టి మమ్ము పాలించు!

తెభా-10.1-688-ఉ.
కుల మయ్యె భోగ మిదె యౌదల లన్నియు వ్రస్సెఁ బ్రాణముల్
రాలఁ బోకలం బొలిసె రాయిడి పెట్టక మా నిజేశుపై
నీ రుణాకటాక్షములు నిల్పఁగదే తగ నో! సమస్త లో
కైశరణ్య! యో! యభయకారణ! యో! కమలామనోహరా!

టీక:- ఆకులము = నలగినది; అయ్యెన్ = అయినది; భోగము = ఇతని దేహము; ఇదె = ఇదిగో; ఔదలలు = పడగలు; అన్నియున్ = సర్వము; వ్రస్సెన్ = చిట్లెను; ప్రాణముల్ = పంచప్రాణవాయువులు; రాకలన్ = ఉచ్ఛ్వాసములు; పోకలన్ = నిశ్వాసములు; పొలిసె = క్షీణించెను; రాయిడి = బాధలు; పెట్టక = పెట్టకుండ; మా = మా యొక్క; నిజేశు = భర్త; పైన్ = మీద; నీ = నీ యొక్క; కరుణా = దయ కలగిన; కటాక్షములున్ = కడగంటి చూపులను; నిల్పగదే = ఉంచుము; తగన్ = నిండుగా; ఓ = ఓ; సమస్తలోకైకశరణ్య = కృష్ణా {సమస్త లోకైక శరణ్యుడు - సమస్తమైన చతుర్దశ భువనములకు ఒక్కడే ఐన రక్షకుడు, విష్ణువు}; ఓ = ఓ; అభయకారణ = కృష్ణా {అభయ కారణుడు - భక్తులకు భయములేకుండ చేయుటకు హేతువు ఐనవాడు, విష్ణువు}; ఓ = ఓ; కమలామనోహరా = కృష్ణా {కమలా మనోహరుడు - కమల (లక్ష్మీదేవికి) మనోహరుడు (భర్త), విష్ణువు}.
భావము:- అన్ని లోకాలలోను శరణు ఇవ్వగల ఒకే ఒక్క ప్రభువా! ఓ అభయమును ఇచ్చే దేవా! ఓ లక్ష్మీపతీ! ఇతని దేహమంతా నలిగి చితికిపోయింది. తలలు పగిలిపోయాయి. ప్రాణాలు వస్తున్నాయా, పోతున్నాయా అన్నట్లు ఉన్నాడు. ఇంకా బాధపెట్టకుండా, మా భర్త మీద నీ దయ గల చూపులు ప్రసరించి రక్షించు.

తెభా-10.1-689-ఆ.
మ్ముఁబెండ్లి చేయు మా ప్రాణవల్లభు
ప్రాణమిచ్చి కావు క్తవరద!
నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు
పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు.

టీక:- మమ్మున్ = మమ్ములను; పెండ్లిచేయుము = పెళ్ళిచేయుము, కూర్చుము; మా = మా యొక్క; ప్రాణవల్లభు = భర్త యొక్క; ప్రాణమున్ = ప్రాణమును; ఇచ్చి = ఇచ్చి; కావు = కాపాడుము; భక్తవరద = కృష్ణా {భక్తవరదుడు - భక్తుల కోరికలు తీర్చువాడు, విష్ణువు}; నీవు = నీవు; చేయు = చేసెడి; పెండ్లి = పెళ్ళి, శుభము; నిత్యంబు = శాశ్వతమైనది; భద్రంబు = మేలైనది; పిన్ననాటి = మా చిన్నప్పటి; పెండ్లి = పెళ్శి; పెళ్ళి = పెళ్ళి అని చెప్పదగినది; కాదు = కాదు.
భావము:- భక్తులకు వరాలిచ్చే మహానుభావ! శ్రీకృష్ణ! మా ప్రాణప్రియుడైన కాళీయుడి ప్రాణాలు ప్రసాదించి, అతనితో మాకు కల్యాణం చేయించు. చిన్నప్పుడు జరిగిన మా పెళ్ళి కల్యాణం కాదు. ఇప్పుడు నీవు మాకు చేసేదే కల్యాణం శాశ్వతంగా ఉండేదీ, క్షేమకరమైనదీ.

తెభా-10.1-690-ఇం.
నీయాన; యెవ్వారిని నిగ్రహింపం
డా యుగ్ర పాపాకృతి నంద డింకన్;
నీ యాజ్ఞలో నుండెడు నేఁటఁగోలెన్
మా యీశు ప్రాణంబులు మాకు నీవే."

టీక:- నీ = నీమీద; ఆన = ఒట్టు; ఎవ్వారిని = ఎవరిని; నిగ్రహింపడు = బాధింపడు; ఆ = మునుపటి; ఉగ్ర = భయంకరమైన; పాప = పాపరూపమైన; ఆకృతిన్ = ఆకారమును; అందడు = చెందడు; ఇంకన్ = ఇకపైన; నీ = నీవు పెట్టెడి; ఆజ్ఞన్ = ఆజ్ఞకు; లోన్ = లోబడి; ఉండెడున్ = ఉండగలడు; నేట = ఇవాళ్టి; కోలెన్ = నుంచి; మా = మా యొక్క; ఈశు = భర్త; ప్రాణంబులున్ = ప్రాణములను; మా = మా; కున్ = కు; ఈవే = ఇమ్ము.
భావము:- నీ మీద ఒట్టు; ఈ కాళియుడు ఇంకెవ్వరిని బాధపెట్టడు; ఇంకెప్పటికి భయంకరమైన పాపిష్టి రూపమెత్తడు; ఇవేళ్టి నుంచి నువ్వు చెప్పినట్లే నడచుకుంటాడు; మా భర్త ప్రాణాలను మాకు ప్రసాదించవయ్యా స్వామీ!.”

తెభా-10.1-691-వ.
అని యిట్లు తమ పెనిమిటి బ్రతుకుఁ గోరెడి భుజగసతుల యందు శరణాగతవత్సలుండైన పుండరీకాక్షుండు కరుణించి, చరణ ఘట్టనంబు చాలించి, తలంగిన, నెట్టకేలకుఁ బ్రాణేంద్రియముల మరలం బడసి, చిదిసి నలఁగిన తలలు సవరించుకొని, వగర్చుచు భుజగపతి జలజనయనునికి నంజలిచేసి మెల్లన నిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఇలా; తమ = వారి యొక్క; పెనిమిటి = భర్త; బ్రతుకున్ = జీవించి ఉండుటను; కోరెడి = వేడుకొనెడి; భుజగ = సర్ప; సతుల = స్త్రీల; అందున్ = ఎడల; శరణాగత వత్సలుండు = శరణు చొచ్చినవారి ఎడల అనుగ్రహము కలవాడు; ఐన = అయిట్టి; పుండరీకాక్షుండు = కృష్ణుడు; కరుణించి = దయచూపి; చరణ = పాదముల; ఘట్టనంబు = తాకిడిని, తన్నులను; చాలించి = ఆపి; తలంగినన్ = ఇవతలకు రాగా; ఎట్టకేలకున్ = బహు ప్రయాసముతో; ప్రాణ = ప్రాణములను; ఇంద్రియములన్ = ఇంద్రియములను; మరలన్ = మళ్ళీ; పడసి = వశములోనికి పొంది; చిదిసి = చితికిపోయి; నలగిన = నలగిపోయిన; తలలున్ = పడగలను; సవరించుకొని = చక్కజేసుకొని; వగపు = విచారము; కదురన్ = కలుగగా; భుజగపతి = సర్పరాజు, కాళియుడు; జలజనయనుని = పద్మాక్షుని, కృష్ణుని; కిన్ = కి; అంజలి = నమస్కారము; చేసి = చేసి; మెల్లన = మెల్లిగా; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- ఇలా తమ భర్త జీవించటాన్ని కోరుకుంటున్న కాళియుని భార్యలైన నాగకాంతలను, శరణు జొచ్చినవారిని కాపాడే వాడైన శ్రీకృష్ణుడు కరుణించాడు. తన కాలితాపులు ఆపుచేసి పక్కకి తప్పుకొన్నాడు. నాగరాజు తన ప్రాణాలు చిట్టచివరకు దక్కించుకొన్నాడు. నలిగి చితికిన తన తలలను సవరించుకొన్నాడు. ఆయసంతో వగరుస్తూ కృష్ణుడికి తలవంచి నమస్కారం చేసి నెమ్మదిగా ఇలా అన్నాడు.