Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కాళిందుని విన్నపము

వికీసోర్స్ నుండి

{తలకట్టు | శీర్షిక = పోతన తెలుగు భాగవతము | రచయిత = బమ్మెర పోతన | అనువాదం= | విభాగము = కాళిందుని విన్నపము | ముందరి = నాగకాంతలు స్తుతించుట | తదుపరి = కాళిందుని శాసించుట | వివరములు = తెలుగు భాగవతము |సంవత్సరం= కీ.శ. 15వ శతాబ్దము }}

తెభా-10.1-692-చ.
"లఁకలు మా ప్రచారములు మా ముఖముల్ విషవహ్ని ఘోరముల్;
లులము; రోషజాతులము; ర్వుల; మే మొక మంచివారమే?
ళినదళాక్ష! ప్రాణులకు నైజగుణంబులు మాన నేర్చునే?
వెయవె? మా వికారములు వింతలె? మే లొనరించి తీశ్వరా!

టీక:- మలకలు = వంకర లైనవి; మా = మా యొక్క; ప్రచారములు = సంచారములు, నడకలు; మా = మా యొక్క; ముఖములు = మోములు; విష = విషము అనెడి; అగ్ని = అగ్నితో; ఘోరముల్ = భయంకరమైనవి; ఖలులము = దుష్టులము; రోష = కోపముతోనే; జాతులము = పుట్టినవారము; గర్వులము = అహంకారము కలవారము; మేమున్ = మేము; ఒక = కొంచమైనా; మంచివారమే = మంచివాళ్ళమా, కాదు; నళినదళాక్ష = కృష్ణా {నళినదళాక్షుడు - నళిన (తామర) దళ (రేకులవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు}; ప్రాణుల్ = జంతువుల; కున్ = కు; నైజ = స్వభావమువలన కలిగిన; గుణంబులు = లక్షణములు; మానన్ = పోవుట; నేర్చునే = సాధ్యమా, కాదు; వెలయవె = ప్రసిద్ధములు కావా, అవును; మా = మా యొక్క; వికారములు = దుష్టచేష్టలు; వింతలె = విచిత్రమైనవా, కాదు; మేలు = మంచి; ఒనరించితి = చేసితివి; ఈశ్వరా = కృష్ణా.
భావము:- “కమలలాంటి కన్నులున్న శ్రీకృష్ణా! పరమేశ్వరా! మావి వంకరటింకర వర్తనలు, నడకలు. మా నోర్లు విషాగ్నులతో ఘోరమైనవి. మేము దుష్టులము, పొగరుబోతులము. మా జాతే రోషపు జాతి. ఇంకా మేం మంచివారిలా ఎలా ఉండగలము. ఈ సృష్టిలోని జీవులు తమ సహజగుణాలు మార్చుకోలేవు కదా. అవి స్థిరంగా ఉండిపోతాయి కదా. మేం వికృత చేష్టలు చేయటం వింతేమి కాదు గదా. అయినా ఇవాళ నాకు చాలా ఉపకారం చేసావు.

తెభా-10.1-693-సీ.
వివిధ భావాకార వీర్యబీజాశయ-
వయోనియుతముగా గము లెల్ల
నీవ చేసితి మున్న; నే మా జగంబులో-
హజకోపనులము ర్పములము;
దుర్వారమైన నీ తోరంపు మాయ నే-
మెఱిఁగి దాఁటెడు పని కెంతవార;
మంతకుఁ గారణ ఖిలేశ్వరుండవు-
ర్వజ్ఞుఁడవు నీవు లజనయన!

తెభా-10.1-693.1-తే.
నిచె దేనిని మన్నించి నుపు నన్ను
నిగ్రహించెద వేనిని నిగ్రహింపు;
మింక సర్వేశ! మాయిమ్ము లెందుఁ గలవు
చిత్తమందున్న క్రమమునఁ జేయఁదగును.

టీక:- వివిధ = నానావిధములైన; భావ = జననాది వికారములు; ఆకార = ఆకృతులు; వీర్య = శక్తులు; బీజ = మూలలక్షణములు; ఆశయ = అభిప్రాయములు; జవ = వేగములు; యోని = జన్మస్థానములు; యూతముగా = కూడుకొన్నవి; కాన్ = అయిన; జగములు = భువనములు; ఎల్లన్ = సమస్తమును; నీవ = నీవే; చేసితి = సృష్టించితివి; మున్న = ముందుగనే; నేము = మేము; ఆ = ఆ; జగంబు = విశ్వము; లోన్ = అందు; సహజకోపనులము = కోపముతోడనేపుట్టినవారము {సహజకోపనులము - సహ (కూడా) జ (పుట్టిన) కోపనులము (కోపము కలవారము), పాములము}; సర్పములము = పాములము, ప్రాకులాడువారము; దుర్వారము = దాటరానిది; ఐన = అయిన; నీ = నీ యొక్క; తోరంపు = మిక్కిలి అధికమైన; మాయన్ = మాయను; నేము = మేము; ఎఱిగి = తెలిసికొని; దాటెడు = దాటుటను; పని = చేయుట; కిన్ = కు; ఎంతవారము = అశక్తులము; అంత = సమస్తమున; కున్ = కు; కారణము = కారణభూతుడవు; అఖిలేశ్వరుండవు = సర్వనియామకుడవు; సర్వజ్ఞుడవు = అన్నితెలిసినవాడవు; నీవు = నీవు; జలజనయన = పద్మాక్ష, కృష్ణా.
మనిచెదు = కాపాడెడివాడవు; ఏనినిన్ = అయినచో; మన్నించి = ఆదరించి; మనుపు = కాపాడుము; నన్నున్ = నన్ను; నిగ్రహించెదవు = శిక్షించెడివాడవు; ఏనినిన్ = అయినచో; నిగ్రహింపుము = శిక్షింపుము; ఇంక = ఇక; సర్వేశా = కృష్ణా {సర్వేశుడు - పంచకృత్యములను (సృష్టి స్థితి లయ తిరోధానానుగ్రహములను) నియమించు ప్రభువు, విష్ణువు}; మా = మాకు; ఇమ్ములు = ఇష్టాలు; ఎందు = ఎక్కడ; కలవు = ఉన్నాయి; చిత్తము = నీ మనసు; అందున్ = లో; ఉన్న = ఉన్నట్టి; క్రమమునన్ = ప్రకారముగా; చేయదగును = చేయుము.
భావము:- పద్మాక్షా! శ్రీకృష్ణా! ఈ సృష్టి అంతటికి నువ్వే కారణభూతుడవు, సర్వేశ్వరుడవు. సమస్తము తెలిసిన వాడవు. పూర్వం నువ్వే ఈ లోకాలన్నిటిని వివిధ స్వభావాలు, రూపాలు, వీర్యములు, వీర్యాతిశయాలు, జననస్థానాలతో కూడినవిగా సృష్టించావు. మేం ఆ సృష్టిలో సహజంగా కోపస్వభావం కలిగిన పాములం. అద్భుతమైన నీ మాయ దాటరానిది. ఆ మాయని తెలుసుకొని దాటాలంటే మా వల్ల కాదు. కనుక పరమేశ్వరా! నన్ను క్షమించదలచుకొంటే క్షమించి పాలించు. శిక్షించదలచు కొంటే శిక్షించు. ఇంకా మా ఇష్టాలు ఎక్కడున్నాయి. నీ ఇష్ట ప్రకారమే చెయ్యి.

తెభా-10.1-694-క.
నా పుణ్య మేమి చెప్పుదు?
నీ పాదరజంబుఁ గంటి నే; సనకాదుల్
నీ పాదరజముఁ గోరుదు
రే దమం దున్ననైన నిఁక మేలు హరీ!"

టీక:- నా = నా యొక్క; పుణ్యము = అదృష్టము; ఏమి = ఏమని; చెప్పుదు = చెప్పగలను; నీ = నీ యొక్క; పాద = కాలి; రజంబున్ = దుమ్మును; కంటిన్ = పొందితిని; నేన్ = నేను; సనకాదుల్ = పరమ ఋషులు {సనకాదులు - సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు}; నీ = నీ యొక్క; పాద = పాద; రజమున్ = ధూళిని; కోరుదురు = అపేక్షింతురు; ఏ = ఏ; పదము = స్థానము; అందున్ = లో; ఉన్ననైనన్ = ఉండినను; ఇకన్ = ఇకమీద; మేలు = మంచిదే; హరీ = కృష్ణా.
భావము:- శ్రీహరీ! సనకసనందాది దివ్యమునులు కూడ నీ పాద ధూళినే కావాలని కోరుకుంటారు. అలాంటి నీ పాదధూళి నేను పొందగలిగాను. నా పుణ్యం ఎంత గొప్పదో కదా? ఇంక నేను ఏ స్థితిలో ఉన్నా సరే నాకు శోభనమే.”