పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/నందుడు వసుదేవుని చూచుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-198-వ.
అది మొదలు మొదవుల కదుపులు పొదువులు గలిగి యుండె; నంత నందుండు గోపకుల ననేకుల గోకులరక్షకుం దక్షులైన వారిని నియమించి, మథురకుం జని, కంసునకు నేఁటేఁటం బెట్టెడి యరింబెట్టి, వీడ్కొని, వసుదేవుని కడకుం జని, యథోచితంబుగ దర్శించిన.
టీక:- అది = అప్పటి; మొదలు = నుంచి; మొదవుల = పాడియావుల; కదుపులు = గుంపులు; పొదుపులు = నిండైన పొదుగులు; కలిగి = కలిగి; ఉండెన్ = ఉండెను; అంతన్ = అంతట; నందుండు = నందుడు; గోపకులన్ = గోపాలకులను; అనేకులన్ = అనేకమందిని; గోకుల = గోవులమందలను; రక్ష = కాపాడుట; కున్ = కోసము; దక్షులు = సమర్థులు; ఐనన్ = అయినట్టి; వారిని = వారలను; నియమించి = ఏర్పరచి; మథుర = మథురానగరి; కున్ = కి; చని = వెళ్ళి; కంసున్ = కంసుని; కున్ = కి; ఏటేటన్ = ప్రతి సంవత్సరము; పెట్టెడి = కట్టవలసిన; అరిన్ = కప్పమును, పన్నును; పెట్టి = కట్టి; వీడ్కొని = సెలవు తీసుకొని; వసుదేవుని = వసుదేవుడి; కడ = దగ్గర; కున్ = కు; చని = వెళ్ళి; యథోచితంబుగన్ = తగిన విధముగా; దర్శించినన్ = చూడబోగా.
భావము:- ఆ బాలుడు పుట్టినప్పటి నుండి వ్రేపల్లె లోని ఆలమందలు కుండపొదుగులతో కనులపండుగ చేసాయి. ఒకనాడు నందుడు ఆలమందలను వ్రేపల్లెను రక్షించడానికి నిపుణులైన గోపకులను నియమించాడు. తాను మధురానగరానికి వెళ్ళి, ఏటేటా చెల్లించవలసిన పన్నులను కంసునికి సమర్పించాడు. అతని వద్ద సెలవుతీసుకుని వసుదేవుని దగ్గఱకి వెళ్ళాడు. ఎంతో గౌరవంగా అతనిని దర్శనం చేసుకున్నాడు.

తెభా-10.1-199-క.
నందుని గనుఁగొని ప్రాణముఁ
బొందిన బొందియునుఁ బోలెఁ బొలుపారుచు, నా
నందాశ్రులు గడకన్నుల
గ్రందుకొనం, గేలుసాఁచి కౌఁగిటఁ జేర్చెన్.

టీక:- నందునిన్ = నందుడును; కనుగొని = చూసి; ప్రాణమున్ = ప్రాణములను; పొందిన = తిరిగి పొందినట్టి; బొందియునున్ = శవము; పోలెన్ = వలె సంతోషముతో; పొలుపారుచున్ = ఒప్పుచు; ఆనంద = ఆనందముతో కూడిన; అశ్రులు = కన్నీరు; కడకన్నులన్ = కనుగొలకు లందు; క్రందుకొనన్ = కమ్ముకొనగా; కేలున్ = చేతులు; సాచి = చాచి; కౌగిటన్ = కౌగిటి యందు; చేర్చెన్ = చేర్చుకొనెను.
భావము:- నందుని చూడగానే ఆనందాశ్రువులతో చేతులు సాచి వసుదేవుడు నందుడిని కౌగలించుకున్నాడు. ప్రాణంలేని కళేబరానికి ప్రాణాలు వచ్చినట్లు అతనికి నందుని చూడగానే ప్రాణాలు లేచి వచ్చాయి.

తెభా-10.1-200-వ.
మఱియుఁ గౌఁగిలించుకొని, సుఖాసీనునింగాఁజేసి, వసుదేవుండు దన కొడుకువలని మోహంబు దీపింప నందుని కిట్లనియె.
టీక:- మఱియున్ = మరింకను; కౌగలించుకొని = ఆలింగనములు చేసి; సుఖా = సుఖవంతమైన; ఆసీనునిన్ = పీఠంపై కూర్చున్నవాని; కాన్ = అగునట్లు; చేసి = చేసి; వసుదేవుండు = వసుదేవుడు; తన = తన యొక్క; కొడుకు = పుత్రుని; వలని = ఎడలి; మోహంబు = ప్రేమము; దీపింపన్ = ప్రకాశించునట్లుగా; నందుని = నందుడుతో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆవిధంగా నందుని కౌగిలించుకుని, సుఖాసీనుణ్ణి చేసాడు. అప్పుడు వసుదేవుడికి కన్నకొడుకుపై ప్రేమ పొంగింది. అంతట వసుదేవుడు నందునితో ఇలా అన్నాడు.

తెభా-10.1-201-క.
"సంతి లే దని మును ఘన
చింనముల మునిఁగి, ముదిసి చిక్కిన నీకున్
సంతి గలిగెను; భాగ్యము;
సంతిహీనునికి సౌఖ్యసంతతి గలదే?

టీక:- సంతతి = పిల్లలు; లేదు = కలుగలేదు; అని = అని; మును = ఇంతకు ముందు; ఘన = గొప్ప; చింతనములన్ = విచారము లందు; మునిగి = ములిగిపోయి; ముదిసి = ముసలితనముపొంది; చిక్కిన = కృశించిన; నీ = నీ; కున్ = కు; సంతతి = సంతానము; కలిగెన్ = లభించినది; భాగ్యము = నీదే అదృష్టము; సంతతి = సంతానము; హీనుని = లేనివాని; కిన్ = కి; సౌఖ్య = సుఖముల; సంతతి = విశేషము; కలదే = కలుగునా, కలుగదు.
భావము:- “మిత్రమా! సంతానం లేదని ఎన్నో ఏళ్ళ నుండి తీరని చింతతో చిక్కిపోయిన నీకు ఈనాటికి సంతతి కలిగింది. ఎంత అదృష్టవంతుడవు నిజానికి సంతానం లేని వాడికి సౌభాగ్యం ఎక్కడ ఉంటుంది.

తెభా-10.1-202-క.
పొగంటి నిన్ను; బ్రతికితిఁ;
చితి నాపదల నింకఁ గార్యములం దే
యెమడుగు లేని నెచ్చలిఁ
బొగాంచుట చచ్చి మఱలఁ బుట్టుట గాదే?

టీక:- పొడగంటి = కనుగొంటిని; నిన్నున్ = నిన్ను; బ్రతికితిన్ = బతికిపోయాను; కడచితి = దాటితిని; ఆపదలన్ = ఇడుములను; ఇంకన్ = ఇకమీద; కార్యములు = పనులు; అందున్ = ఎడల; ఏ = ఎట్టి; ఎడమడుగు = అరమరికలు; లేని = లేనట్టి; నెచ్చలిన్ = స్నేహితుని; పొడగాంచుట = దర్శించుట; చచ్చి = చచ్చిపోయిన వెనుక; మరల = తిరిగి; పుట్టుట = బతుకుట; కాదే = కదా, అవును.
భావము:- ఎన్నోరోజులకు నిన్నుచూసాను, బ్రతికిపోయాను. నా ఆపదలన్నీ గడచినట్లు అనిపిస్తూ ఉంది. కార్యనిర్వహణలో ఏమాత్రం భేదభావం చూపని స్నేహితుణ్ణి చూడడం అంటే పునరుజ్జీవితుడు కావడమే కదా.

తెభా-10.1-203-క.
లుపాటులఁబడు జనులకు
ని నొకచో నుండఁ గలదె? యేఱుల వెంటం
సి చను, మ్రాఁకు లన్నియుఁ
లువెంటలఁ బోవుఁగాక; పాయక యున్నే?

టీక:- పలు = బహువిధమైన; పాటులన్ = శ్రమలను; పడు = పొందెడి; జనుల్ = మానవుల; కున్ = కు; ఇలన్ = భూమండలముపై; ఒక = ఒకటే; చోన్ = స్థలము నందే; ఉండన్ = ఉండుట; కలదే = కుదురునా, కుదరదు; ఏఱుల = నదీప్రవాహ; వెంటన్ = మార్గమున; కలసి = పక్కపక్కన; చను = వెళ్ళెడి; మ్రాకులు = చెట్లమానులు; అన్నియున్ = అన్నీ; పలు = అనేక; వెంటలన్ = మార్గములలో; పోవు = కొట్టుకుపోవుచుండును; కాక = కాని; పాయక = ఒకదాని నొకటి విడువక; ఉన్నే = ఉండునా, ఉండవు.
భావము:- బ్రతుకుతెరువులో ఎన్నోపాట్లు పడతూ ఉండే జనులకు ఒకే చోట ఉండాలంటే వీలు అవుతుందా? మరి నదులలో ఎన్నో చెట్లు మ్రాకులు కొట్టుకుని వస్తూ ఉంటాయి; క్రొన్ని మ్రాకులు కలిసి ఒక చోట చేరి ప్రయాణం చేస్తాయి; మళ్లీ విడిపోయి తమ దారిని తాము వెళ్ళిపోతాయి కదా.

తెభా-10.1-204-మ.
లురోగంబుల నొందకున్నవె పసుల్? పాలిచ్చునే ధేనువుల్?
గొలఁకుల్ వాగులు వారిపూరితములే? గోష్ఠ ప్రదేశంబులం
బులులున్ దుప్పులు సంచరింపవు గదా? పొల్పారునే ఘోషముల్?
వే పచ్చని పూరిజొంపములు, తత్కాంతార భాగంబులన్?

టీక:- పలు = వివిధములైన; రోగంబులన్ = జబ్బులను; పొందక = పడకుండగ; ఉన్నవె = సుఖముగ ఉన్నవా; పసుల్ = పసువులు; పాలున్ = పాలను; ఇచ్చున్ = సమృద్ధిగా ఇచ్చుచున్నవా; ధేనువుల్ = ఆవులు; కొలకుల్ = చెరువులు; వాగులు = ఏర్లు; వారి = నీటితో; పూరితములే = నిండుగా ఉన్నవి కదా; గోష్ట = పశువులదొడ్ల; ప్రదేశంబులన్ = చుట్టుపక్కలకి; పులులున్ = వ్యాఘ్రములు, పెద్దపులులు; దుప్పులు = లేళ్ళు; సంచరింపవు = తిరుగుటలేదు; కదా = కదా; పొల్పారునే = బాగున్నవి కదా; ఘోషముల్ = గొల్లపల్లెలు; కలవె = సమృద్ధిగ ఉన్నవి గదా; పచ్చని = పచ్చ; పూరి = గడ్డి; జొంపములున్ = దుబ్బులు; తత్ = అక్కడి; కాంతార = అటవీ; భాగంబులన్ = ప్రదేశము లందు.
భావము:- మిత్రమా! మీ ఆవులన్నీ చక్కగా పాలు ఇస్తున్నాయా? ఏ అంటురోగాలూ లేవు కదా? మీ ప్రాంతాల చెరువులూ ఏరులూ నీళ్ళతో నిండి ఉన్నాయా? మీ గొల్లపల్లెలన్నీ వృద్ధి పొందుతున్నాయా? మీ గోవులు నిలిచేచోట పులులూ, దుప్పులూ సంచరించడం లేదు కదా? మీ అడవులలో చక్కని పచ్చని పచ్చికబయళ్ళు సమృద్ధిగా ఉన్నాయి కదా?

తెభా-10.1-205-క.
పుత్ర మిత్ర ముఖరులఁ
నుపక, చూడకయు, వారు ఱిఁగి నశింపన్
నుచు గృహమేధియాశ్రమ
ము నుండెడువాని, కొక్క మోదము గలదే?

టీక:- తన = తన యొక్క; పుత్ర = కుమారులు; మిత్ర = మిత్రులు; ముఖరులన్ = మున్నగువారిని; తనుపక = సంతోషపెట్టకుండ; చూడకయున్ = కళ్ళారా చూడకుండగ; వారు = వారలు; తఱగి = కృశించి; నశింపన్ = నశించిపోతుండగ; మనుచు = బతికి; గృహమేధి = మరియొక గృహస్థుని; ఆశ్రమమునన్ = ఇంటి యందు; ఉండెడు = ఉండెడి; వాని = అతని; కిన్ = కి; ఒక్క = ఏ విధమైన; మోదమున్ = సంతోషమైనను; కలదే = ఉండునా, ఉండదు.
భావము:- తన పుత్రులూ, మిత్రులు మొదలైన వారిని సంతృప్తి పరచకుండా; వారి క్షేమం చూడకుండా; వారు క్షీణించి నశించిపోయేలా ప్రవర్తించే గృహస్థు పోషణలో ఉన్నవారికి ఏమాత్రం సంతోషం ఉండదు కదా.