Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ద్వారకానగర నిర్మాణము

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1593-ఆ.
రుణుపురముకంటె వాసవుపురికంటె
నదువీటికంటె దండధరుని
గరికంటె బ్రహ్మ గరంబుకంటెఁ బ్ర
స్ఫుటముగాఁగ నొక్క పురముఁ జేసె.

టీక:- వరుణుపురము = శ్రద్ధావతీ పట్టణము {వరుణుపురము - వరుణదేవుని పట్టణము, శ్రద్ధావతి}; కంటెన్ = కంటె; వాసవుపురి = అమరావతీ పట్టణము {వాసవుపురి - వాసవుని (వసువులు (రత్నములు) కల వాని, ఇంద్రుని) పట్టణము, అమరావతి}; కంటెన్ = కంటె; ధనదువీటి = అలకాపురీ పట్టణము {ధనదువీటి - ధనదుడు (ధనమును ఇచ్చు వాడు, కుబేరుని) వీటి (పట్టణమ), అలకాపురి}; కంటెన్ = కంటె; దండధరునినగరి = సంయమనీ పట్టణము {దండధరుడు - దండించుటను ధరించిన వాడు, యముడు}; కంటెన్ = కంటె {దండధరునినగరి - యమపురి, సంయమని}; బ్రహ్మనగరంబు = సత్యవతీ పట్టణము {బ్రహ్మనగరంబు - బ్రహ్మదేవుని పట్టణము, సత్యవతి}; కంటెన్ = కంటె; ప్రస్పుటము = మిక్కిలి ప్రకాశవంత మైనది; కాగన్ = అగునట్లుగా; ఒక్క = ఒకానొక; పురమున్ = పట్టణమును; చేసె = నిర్మించెను.
భావము:- విశ్వకర్మ సముద్రం మధ్యన వరుణుడు, దేవేంద్రుడు, కుబేరుడు, యముడు, బ్రహ్మదేవుడు మొదలైన వారి పట్టణాల కంటే దృఢముగా ఒక నగరం నిర్మించాడు.

తెభా-10.1-1594-వ.
అందు.
టీక:- అందు = దానిలో.
భావము:- ఆ పట్టణంలో

తెభా-10.1-1595-క.
సము తోడిచూ లనఁ
బ్రాకారము పొడవు గలదు పాతాళమహా
లోముకంటెను లోఁ తెం
తో ల దా పరిఖ యెఱుఁగ దొరక దొకరికిన్.

టీక:- ఆకసము = ఆకాశము; తోడిచూలు = తోడబుట్టినది; అనన్ = అన్నట్లుగా; ప్రాకారము = కోటగోడ; పొడవున్ = ఎత్తుగా; కలదు = ఉన్నది; పాతాళ = పాతాళము అనెడి; మహా = గొప్ప; లోకము = లోకము; కంటెను = కంటె; లోతు = లోతు; ఎంతో = అధికముగా; కలదు = ఉన్నది; ఆ = ఆ యొక్క; పరిఖ = అగడ్త, కందకము; ఎఱుగను = తెలిసికొనుటకు; దొరకదు = అందదు; ఒకరికిన్ = ఎవరికైనను.
భావము:- ప్రాకారం ఆకాసానికి అప్పచెల్లెలులా ఉంది. కందకం పాతాళం కంటే లోతయినది. దాని లోతు. ఎంతో ఎవరికీ అంతు చిక్కదు.

తెభా-10.1-1596-క.
కోయు మిన్నును దమలోఁ
బాటికి జగడింప నడ్డడి నిల్చిన వా
చాటుల రుచిఁ దారకములు
కూటువలై కోటతుదలఁ గొమరారుఁ బురిన్.

టీక:- కోటయున్ = కోట; మిన్నున్ = ఆకాశము; తమలోన్ = ఒకదానితో నొకటి; పాటి = సరిపోలుట; కిన్ = కు; జగడింపన్ = దెబ్బలాడుకొనుచుండగా; అడ్డపడి = అడ్డుకొన వెళ్ళి; నిల్చిన = నిలబడినట్టి; వాచాటుల = తీర్పరుల; రుచిన్ = విధముగా; తారకలు = నక్షత్రములు; కూటువులు = రాశులుగా; ఐ = అయ్యి; కోట = కోట యొక్క; తుదలన్ = కొనలందు; కొమరారు = అందగించును; పురిన్ = ఆ పట్టణము నందు.
భావము:- ఎత్తు విషయములో కోట, ఆకాశము కలహించుకోగా అడ్డుపడి నిలచిన తీర్పరుల వలె కోట అగ్రభాగాన చుక్కల గుంపులు ప్రకాశిస్తూ ఉంటాయి.

తెభా-10.1-1597-శా.
సాధుద్వార కవాట కుడ్య వలభి స్తంభార్గళాగేహళీ
వీధీవేది గవాక్ష చత్వర సభా వేశ్మ ప్రఘాణ ప్రపా
సౌధాట్టాలక సాల హర్మ్య విశిఖా సౌపాన సంస్థానముల్
శ్రీధుర్యస్థితి నొప్పుఁ గాంచనమణి స్నిగ్ధంబులై య ప్పురిన్.

టీక:- సాధు = చక్కని; ద్వార = గుమ్మములు; కవాట = తలుపులు; కుడ్య = గోడలు; వలభి = వసారాలు, ముందు చూరులు; స్తంభా = స్తంభములు; అర్గళా = గడియమాను, అడ్డగడియ; గేహళీ = గడపలు; వీధీ = వీధులు; వేది = అరుగులు; గవాక్ష = కిటికీలు; చత్వర = ముంగిళ్ళు; సభా = సభాస్థలములు {సభ - అనేకులు కలసి సంభాషణాదులుకై కూడునది}; వేశ్మ = ఇండ్లు; ప్రఘాణ = కొట్టుగది {ప్రఘాణము - తలవాకిటికి పక్కన ఉండెడి చిన్నగది, కొట్టుగది}; ప్రపా = పానీయశాలలు {ప్రప - చలిపందిరి, పానీయశాలిక}; సౌధ = రాజభవనములు {సౌధము - రాజగృహము, నగరు}; అట్టాలక = అటకల ఇళ్ళు; సాల = చావిడీ, శాల; హర్మ్య = మిద్దె ఇళ్ళు, మేడలు; విశిఖా = రాజమార్గములు; సౌపాన = మెట్లు; సంస్థానముల్ = సన్నివేశ స్థలములు; శ్రీ = శోభ; ధుర్య = వహించినట్టి; స్థితిన్ = విధముగా; ఒప్పున్ = చక్కగా ఉన్నవి; కాంచన = బంగారము; మణి = రత్నాలు; స్నిగ్ధంబులు = చిక్కగా కలవి; ఐ = అయ్యి; ఆ = ఆ యొక్క; పురిన్ = పట్టణము నందు.
భావము:- ఆ పురమందు చక్కని ద్వారములతో, తలుపులతో, గోడలతో, ముందర చూరులతో, స్తంభములతో, గడియలతో, గడపలతో, వీధి అరుగులతో, కిటికీలతో, ముంగిళ్ళతో, చావళ్ళతో, వాకిటి గదులతో కూడిన సౌధములు; మేడలు; పానీయశాలలు; కోటబురుజులు; ప్రాకారములు; రాజమార్గములు; సోపానములు; హేమరత్నమయములై శోభాసమృద్ధితో సొంపారుతూ ఉంటాయి.

తెభా-10.1-1598-క.
కూడి గ్రహంబులు దిరుగఁగ
మేలతుది నిలువులందు మెలఁగెడి బాలల్
క్రీడింపరు పురుషులతో
వ్రీడం దద్వేళ లందు విను మా వీటన్.

టీక:- కూడి = చేరి; గ్రహంబులున్ = సూర్యాది; తిరుగగన్ = తిరుగుచుండగా; మేడలన్ = అంతస్తుల భవనము; తుదిన్ = చివరి; నిలువులు = మీది అంతస్తు; అందు = మీద; మెలగెడి = తిరుగునట్టి; బాలల్ = బాలికలు; క్రీడింపరు = రమింపరు; పురుషుల = పెనిమిటుల; తోన్ = తోటి; వ్రీడన్ = సిగ్గుచేత; తత్ = ఆయా; వేళలన్ = సమయము లందు; వినుమా = నమ్ముము; ఆ = ఆ యొక్క; వీటన్ = పట్టణము నందు.
భావము:- ఆ పట్టణపు మేడల చివరి అంతస్తులలో సూర్యాదిగ్రహములు సంచరిస్తూ ఉండడం వల్ల ఆ సమయాలలో అక్కడ నివసించే కన్యలు సిగ్గుచేత పురుషులతో క్రీడించడం మానివేస్తారు.

తెభా-10.1-1599-ఉ.
త వజ్ర నీలమణి హాటక నిర్మిత హర్మ్య సౌధ వా
తానరంధ్ర నిర్యదసితాభ్ర మహాగరు ధూపధూమముల్
తోద పంక్తులో యనుచుఁ దుంగమహీరుహ రమ్యశాఖలం
జేయుచునుండుఁ దాండవవిశేషము ల ప్పురి కేకిసంఘముల్.

టీక:- ఆయత = ఎత్తైన, నిడుపైన; వజ్ర = వజ్రములు; నీల = ఇంద్రనీలములు; మణి = రత్నములు; హాటక = బంగారముచేత; నిర్మిత = రచింపబడిన; హర్మ్య = మేడలు; సౌధ = రాజభవనముల యొక్క; వాతాయన = కిటకీల; రంధ్ర = రంధ్రములనుండి; నిర్యత్ = వెడలుచున్న; అసిత = నల్లని; అభ్ర = మబ్బుల వంటి; మహా = గొప్ప; అగరుధూప = అగరొత్తుల; ధూమముల్ = పొగలను; తోయద = మేఘముల; పంక్తులో = సమూహములేమో; అనుచున్ = అని; తుంగ = ఎత్తైన; మహీరుహ = వృక్షముల {మహీరుహము - భూమినందు పుట్టునది, చెట్టు}; రమ్య = మనోహరములైన; శాఖలన్ = కొమ్మ లందు; చేయుచున్ = చేయుచూ; ఉండున్ = ఉండును; తాండవ = నాట్యములలోని; విశేషముల్ = విశిష్టతలను; ఆ = ఆ యొక్క; పురి = పట్టణపు; కేకి = నెమలి; సంఘముల్ = సమూహములు.
భావము:- ఆ నగరంలో వజ్రాలు, ఇంద్రనీలమణులు, బంగారం మున్నగునవి విస్తృతంగా వాడ కట్టిన మేడలు మిద్దెల కిటికీల నుంచి నల్లని అగరు ధూపధూమాలు వెలువడుతూ ఉంటాయి. అవి మేఘమాలికలు అనే భ్రమ కలిగిస్తాయి. అందుకే అక్కడ ఎత్తైన చెట్లకొమ్మలపై చేరి నెమిళ్ళ గుంపులు నాట్యం చేస్తుంటాయి.

తెభా-10.1-1600-ఆ.
రస నడచుచుండి సౌధాగ్ర హేమ కుం
ములలోన నినుఁడు ప్రతిఫలింప
నేర్పరింపలేక నినులు పెక్కం డ్రంచుఁ
బ్రజలు చూచి చోద్యడుదు రందు.

టీక:- సరసన్ = పక్కన; నడచుచుండి = వెళ్ళుచు; సౌధ = రాజగృహముల; అగ్ర = మీద; హేమ = బంగారు; కుంభముల = కలశముల; లోనన్ = అందు; ఇనుడు = సూర్యుడు; ప్రతిఫలింపన్ = ప్రతిబింబించగా; ఏర్పరింపన్ = వివరము తెలిసికొన; లేక = లేకపోవుటచేత; ఇనులు = సూర్యులు; పెక్కండ్రు = అనేకులు ఉన్నారు; అంచున్ = అని; ప్రజలు = లోకులు; చూచి = చూసి; చోద్యపడుదురు = ఆశ్చర్యపోవుదురు; అందు = ఆ పట్టణము నందు.
భావము:- సమీపాన సంచరిస్తుండి భవనాల ఉపరిభాగమున ఉన్న బంగారు కలశాలలో సూర్యుడు ప్రతిబింబించగా చూసి నిర్ధారణ చెయ్యలేక, సూర్యులు పలువురు ఉన్నారు అని అక్కడి ప్రజలు భ్రమ చెందుతుంటారు.

తెభా-10.1-1601-ఉ.
శ్రీమణీయ గంధములఁ జెన్నువహించుఁ బురీవనంబులం
గోక జాలకస్తబక కుట్మల పుష్పమరందపూర వి
స్ఫా లతా ప్రకాండ విటచ్ఛద పల్లవవల్లరీ శిఫా
సాపరాగ మూల ఫల సంభృత వృక్షలతా విశేషముల్.

టీక:- శ్రీ = శోభచేత; రమణీయ = మనోహరములైన; గంధములన్ = సువాసనలతో; చెన్ను = అందము; వహించున్ = కలిగి ఉండును; పురీ = ఆ పట్టణపు; వనంబుల్ = ఉద్యానవనము లందు; కోరక = మొగ్గలు; జాలక = పసరు మొగ్గలు; స్తబక = పూలగుత్తులు; కుట్మల = విరియబోవు మొగ్గలు; పుష్ప = పువ్వులు; మరంద = మకరందపు; పూర = ప్రవాహములచే; విస్ఫార = ప్రకాశించుచున్న; లతా = తీగలు; ప్రకాండ = చెట్టు మొదళ్ళు; విటప = కొమ్మలు; ఛద = ఆకుల; పల్లవ = చిగుళ్ళు; వల్లరీ = పూచిన లేత కొమ్మలు; శిఫా = ఊడలు; సార = దట్టమైన; పరాగ = పుప్పొడి; మూల = వేళ్ళతో; ఫల = పండ్లుతో; సంభృత = నిండుదనము కలిగిన; వృక్ష = చెట్లు; లతా = తీగలు; విశేషముల్ = రకరకములవి.
భావము:- అక్కడి ఉద్యానవనాలలో రకరకాల వృక్షాలు, లతలు, మదికి ఇంపుగొల్పుతూ; మొగ్గలతో, పసరుమొగ్గలతో, అరవిరి మొగ్గలతో, విరిసిన పూలతో, తేనెలతో, బోదెలతో, కొమ్మలతో, ఆకులతో, చిగురాకులతో, పూచిన లేత కొమ్మలతో, ఊడలతో, దట్టమైన పుప్పొడితో, వేళ్ళతో, పండ్లతో కూడినవై కమ్మని సువాసనలు విరజిమ్ముతూ ఉంటాయి.

తెభా-10.1-1602-క.
శ్రీరములు జనహృదయ వ
శీరములు మందపవనశీర్ణ మహాంభ
శ్శీరములు హంస విహం
గారములు నగరి కువలయాబ్జాకరముల్.

టీక:- శ్రీ = సంపదలను; కరములు = కలిగించునవి; జన = ప్రజల; హృదయ = మనస్సులను; వశీకరములు = మైమరపించెడివి; మంద = మెల్లని; పవన = గాలిచేత; శీర్ణ = చెదిరిన; మహా = గొప్ప; అంభః = నీటి; శీకరములు = తుంపరలు కలవి; హంస = హంసలకు; విహంగ = పక్షులకు; ఆకరములు = ఉనికిపట్లు; నగరి = పట్టణపు; కువలయాబ్జాకరముల్ = సరోవరములు {కువలయాబ్జాకరము - కువలయ (కలువల) అబ్జ (తామరల) కు ఆకరము (ఉనికిపట్టు), సరస్సు}.
భావము:- ఆ పురంలో సరస్సులు కలువలతో, కమలములతో, కూడి శ్రీకరములై జనులకు మనరంజకములై ఉంటాయి. అక్కడ పిల్లగాలులచే చెదరగొట్టబడిన నీటితుంపరలు విస్తారంగా ఉంటాయి. ఆ సరోవరాలులో అనేక హంసలు, మొదలైన పక్షులు నివాసం ఉంటాయి.

తెభా-10.1-1603-క.
కుసుమామోద భరా
నము రతిఖిన్నదేహ స్వేదాంభో
నము సమధిగతవనము
నము విహరించుఁ బౌరవనము లందున్.

టీక:- నవ = మృదువైన; కుసుమ = పూల; ఆమోద = సువాసనలతో; భర = నిండుటచేత; అజవనము = మెల్లనిది; రతి = మన్మథక్రీడ యందు; ఖిన్న = బడలినట్టి; దేహ = శరీరము లందు; జ = పుట్టిన; స్వేద = చెమట; అంభః = నీటిని; లవనము = తొలగించునది; సమధిగత = పొందబడిన; వనము = తేమ గలది; పవనము = గాలి; విహరించున్ = వీచుచుండును; పౌర = పట్టణములోని; భవనములు = గృహముల; అందున్ = లో.
భావము:- ఆ ఉద్యానవనాల నుంచి వచ్చే మలయమారుతం కొత్తపూల పరిమళములను విరజిమ్ముతూ సురతశ్రాంతుల శరీరాలమీది చెమటబిందువులను తొలగిస్తూ ఆ పట్టణ మందిరాలలో విహరిస్తుంది.

తెభా-10.1-1604-క.
బ్రహ్మత్వము లఘు వగు నని
బ్రహ్మయు బిరుదులకు వచ్చి ట్టఁడుగా కా
బ్రహ్మాది కళలఁ దత్పురి
బ్రహ్మజనుల్ బ్రహ్మఁ జిక్కు ఱుపరె చర్చన్

టీక:- బ్రహ్మత్వము = బ్రహ్మపదవి కలిగి ఉండుటకు; లఘువు = చులకన; అగున్ = కలుగును; అని = అని; బ్రహ్మయున్ = బ్రహ్మదేవుడు కూడ; బిరుదుల్ = పోటీలకు; వచ్చి = వచ్చి; పట్టడు = వహించడు; కాక = లేనిచో; ఆ = ఆ ప్రసిద్ధమైన; బ్రహ్మ = వేదములు; ఆది = మున్నగు; కళలన్ = విద్య లందు; తత్ = ఆ యొక్క; పురి = పట్ఠణపు; బ్రహ్మజనుల్ = బ్రాహ్మణులు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; చిక్కు = కలతను; పఱుపరె = చెందించరా, చెందింతురు; చర్చన్ = శాస్త్రవిచారము లందు.
భావము:- బ్రహ్మత్వము తేలిక అవుతుందని బ్రహ్మదేవుడు పంతాలకు రాడు కాని, వస్తే ఆ వీటి లోని విప్రులు బ్రహ్మవిద్యా చర్చల్లో అతడిని చీకాకుపరచగలంత వారు.

తెభా-10.1-1605-క.
రీభూసుర కృత లస
ణిత మఖధూమ పిహితమై గాక మహా
నము నీలం బగునే?
మిగులఁగ బెడగగునె గ్రహసమృద్ధం బయ్యున్.

టీక:- నగరీ = పట్టణపు; భూసుర = బ్రాహ్మణులచేత; కృత = చేయబడిన; లసత్ = ప్రకాశించుచున్న; అగణిత = లెక్కపెట్టలే నన్ని; మఖ = యాగముల యొక్క; ధూమ = పొగచేత; పిహితము = కప్పబడినది; ఐ = అగుటచేత; కాక = తప్పించి; మహాగగనము = మహాభూతమైన ఆకాశము; నీలంబు = నీలము రంగు కలది; అగునే = కాగలదా, కాలేదు; మిగులగ = మిక్కిలిగ; బెడగు = అతిశయించినది; అగునె = కాగలదా, కాలేదు; గ్రహ = చుక్కలు; సమృద్ధంబు = అధికముగా కలది; అయ్యున్ = అయినప్పటికిని.
భావము:- ఆ పురిలోని బ్రాహ్మణులు సలిపే యజ్ఞ హోమలలో పుట్టిన పొగ ఆవరించడం మూలాన ఆకాశం నల్లబడింది. కాకపోతే, సూర్యచంద్రాది గ్రహాలతో కూడినదైనట్టి అంబరం అలా కావడానికి మరో కారణం ఏముంది.

తెభా-10.1-1606-క.
తిరుగరు పలు కర్థులకును
సురుఁగరు ధన మిత్తు రితర సుదతీమణులన్
రుగరు రణమునఁ బిఱిఁదికి
రుగరు రాజన్యతనయు లా నగరమునన్.

టీక:- తిరుగరు = తప్పరు; పలుకు = ఇచ్చిన మాటను; అర్థుల్ = కోరినవారి; కున్ = కి; సురుగరు = ముఖము చాటేయరు; ధనమున్ = ధనములను; ఇత్తురు = ఇచ్చెదరు; ఇతర = అన్య; సుదతీమణులన్ = స్త్రీలను; మరుగరు = మోహించరు; రణమునన్ = యుద్ధము నందు; పిఱిది = వెనుదిరగుట; కిన్ = కు; అరుగరు = వెళ్ళరు; రాజన్య = రాచవారి; తనయులు = పిల్లలు; ఆ = ఆ యొక్క; నగరమునన్ = పట్టణము నందు.
భావము:- ఆ నగరిలోని రాజకుమారులు ఆడినమాట తప్పరు; అర్థిజనులకు ధనమిచ్చుటలో వెనుదీయరు; పరకాంతల పొందుకోరరు; సమరంలో వెనుకంజ వేయరు;

తెభా-10.1-1607-క.
త్నాకరమై జలనిధి
త్నము లీ నేర దద్ది త్నాకరమే?
త్నములఁ గొనుదు రిత్తురు
త్నాకరజయులు వైశ్యత్నములు పురిన్.

టీక:- రత్న = రత్నములకు; ఆకరము = నిధి; ఐ = అయి ఉండి; జలనిధి = సముద్రము {జలనిధి - నీటికి ఉనికిపట్టు, కడలి}; రత్నముల్ = రత్నములను; ఈన్ = ఇచ్చుటకు; నేరదు = చాలదు; అద్ది = అది; రత్నాకరమే = సముద్రమేనా; రత్నములన్ = నవరత్నములను; కొనుదురు = వెలయిచ్చి తీసుకొందురు; ఇత్తురు = అమ్ముదురు; రత్నాకర = సముద్రములను; జయులు = జయించువారు; వైశ్య = వ్యాపారులలో; రత్నములు = శ్రేష్ఠులు; పురిన్ = ఆ పట్టణము నందు.
భావము:- సముద్రము రత్నాలకు నిలయమని పేరు పడింది కాని, ఎవరికీ రత్నాలివ్వదు. మరి అదేమి రత్నాకరమో. కాని ఇక్కడి వైశ్యరత్నాలు మాత్రం రత్నాలు కొంటారు. అమ్ముతారు. వారు నిజంగా రత్నాకరమునే జయించారు.
రత్నాకరజయులు వైశ్యరత్నములు అని వారు సముద్ర వ్యాపారంలో దిట్టలు అని సూచిస్తున్నారు.

తెభా-10.1-1608-క.
తుంగంబులు కరహత గిరి
శృంగంబులు దానజల వశీకృత భంగీ
భృంగంబులు శైలాభ స
మాంగంబులు నగరి మత్తమాతంగంబుల్.

టీక:- తుంగంబులు = ఉన్నతమైనవి; కర = తొండముచేత; హత = కొట్టబడిన; గిరి = కొండ; శృంగంబులు = శిఖరములు కలవి; దాన = మద; జల = జలముచేత; వశీకృత = లోబరచుకొనబడిన; భంగీ = అట్టివైన; భృంగంబులు = తుమ్మెదలు కలవి; శైల = పర్వతముల; ఆభ = శోభతో; సమాంగంబులు = సరిపోలునవి; నగరి = పట్టణము నందలి; మత్త = మదించిన; మాతంగంబుల్ = ఏనుగులు.
భావము:- ఆ పట్టణంలోని మదపుటేనుగులు ఎత్తైనవి. కొండల వంటి దేహాలు కలవి. తొండాలతో కొండశిఖరాలనైనా పగలగొట్టగలవు. మదజలాలచే ఆడు తుమ్మెదలను మగ తుమ్మెదలను వశపరచుకుంటాయి.

తెభా-10.1-1609-క.
ప్రిములు జితపవన మనో
ములు కృతజయము లధికమణీయ గుణా
న్వములు సవినయములు ని
ర్భములు హతరిపుచయములు ట్టణ హయముల్.

టీక:- ప్రియములు = ప్రియమైనవి; జిత = జయింపబడిన; పవన = గాలి యొక్క; మనః = మనస్సు యొక్క; రయములు = వేగములు కలవి; కృత = చేయబడిన; జయములు = విజయములు కలవి; అధిక = మిక్కిలి; రమణీయ = మనోహరమైన; గుణ = సుగుణములు; అన్వయములు = వంశపారంపర్యము కలవి; సవినయములు = చెప్పిన మాటవినునవి; నిర్భయములు = భయములేనివి; హత = చంపబడిన; రిపు = శత్రువుల; చయములు = సమూహములు కలవి; పట్టణ = పట్టణములోని; హయముల్ = గుఱ్ఱములు.
భావము:- అ నగరంలోని అశ్వాలు అందమైనవి. వాయువేగ మనోవేగాలను మించినవి. విజయము చేకూర్చేవి. మిక్కిలి చక్కని గుణాలూ జాతీ కలవి. భయం లేనివి, అణకువ కలవి. శత్రువు సమూహాలను హతమార్చేవి.

తెభా-10.1-1610-క.
పులుల పగిదిఁ గంఠీరవ
ము క్రియ శరభముల మాడ్కి ముదిత మదేభం
బు తెఱఁగున నానావిధ
హమహోద్భటులు భటులు ల రా వీటన్.

టీక:- పులుల = పెద్దపులుల; పగిదన్ = వలె; కంఠీరవముల = సింహముల; క్రియన్ = వలె; శరభముల = శరభమృగముల {శరభమ - సింహములను తినునది, మీద కళ్ళు, 8 కాళ్ళు ఉండెడి జంతువు, మీగండ్లమెకము}; మాడ్కిన్ = వలె; ముదిత = సంతోషించిన; మదేభంబుల = మదపుటేనుగుల; తెఱగున = వలె; నానా = పెక్కు; విధ = రకములైన; కలహ = యుద్ధము లందు; మహా = గొప్ప; ఉద్భటులు = దిట్టదనము వారు; భటులు = సైనికులు; కలరు = ఉన్నారు; ఆ = ఆ యొక్క; వీటన్ = పట్టణము నందు.
భావము:- ఆ వీటి లోని వీరభటులు పులులు సింహాలు శరభాలు మత్తగజాల వంటివారు అన్నివిధాల యుద్ధాలలో ఆరితేరినవారు.

తెభా-10.1-1611-క.
వీట నుండువారికి
భావింపఁగ లేవు క్షుత్పిపాసాదులు త
ద్గోవింద కృపావశమున
దేప్రతిమాను లగుచు దీపింతు రిలన్.

టీక:- ఆ = ఆ యొక్క; వీటన్ = పట్టణములో; ఉండు = నివసించెడి; వారి = వారల; కిన్ = కు; భావింపగన్ = తలచుటకు కూడ; లేవు = లేవు; క్షుత్ = ఆకలి బాధలు; పిపాస = దప్పిక బాధలు; ఆదులు = మున్నగునవి; తత్ = ఆ ప్రసిద్ధుడైన; గోవింద = కృష్ణుని; కృపా = దయ యొక్క; వశమునన్ = విశేషమువలన; దేవ = దేవతలతో; ప్రతిమానులు = సరితూగువారు; అగుచున్ = అవుతూ; దీపింతురు = ప్రకాశించెదరు; ఇలన్ = భూమిమీద.
భావము:- ఆ పట్టణంలోని ప్రజలకు ఆకలిదప్పులు లేవు. గోవిందుని కరుణావశమున వారు దేవతలతో సమానులై తేజరిల్లుతుంటారు.

తెభా-10.1-1612-సీ.
సక్తి కృష్ణముఖావలోకనమంద-
రిపాదసేవనమంద చింత
వెఱపు నారాయణ విముఖకార్యములంద-
పారవశ్యము విష్ణుక్తి యంద
బాష్పనిర్గతి చక్రిద్య సంస్తుతులంద-
క్షపాతము శార్ఙ్గిక్తులంద
లేమి గోవిందాన్య లీలాచరణమంద-
శ్రమము గోవిందపూనములంద

తెభా-10.1-1612.1-తే.
బంధ మచ్యుతపరదుష్టథములంద
జ్వరము మాధవవిరహితక్షణములంద
త్సరము లీశు కైంకర్యతములంద
రవరోత్తమ! వినుము త న్నాగరులకు.

టీక:- ఆసక్తి = ఇష్టము; కృష్ణ = శ్రీకృష్ణుని; ముఖ = ముఖమును; అవలోకనము = చూచుట; అంద = అందుమాత్రమే; హరి = శ్రీకృష్ణుని; పాద = పాదములను; సేవనము = కొలచుట; అంద = అందుమాత్రమే; చింత = స్మరించుకొనుట; వెఱపు = భయము; నారాయణ = శ్రీకృష్ణుని; విముఖ = వ్యతిరేకములైన; కార్యములు = పనులు; అంద = అందుమాత్రమే; పారవశ్యము = పరవశించుట; విష్ణు = శ్రీకృష్ణుని; భక్తి = భక్తి; అంద = అందుమాత్రమే; బాష్ప = కన్నీళ్ళు; నిర్గతి = కార్చుట; చక్రి = శ్రీకృష్ణుని; పద్య = పద్యములు; సంస్తుతులు = స్తోత్రములు; అంద = అందుమాత్రమే; పక్షపాతము = మొగ్గుచూపుట; శార్ఙ్గి = శ్రీకృష్ణుని {శార్ఙ్గి - శార్ఙ్గము అను విల్లు కలవాడు, విష్ణువు}; భక్తులు = భక్తులు; అంద = అందుమాత్రమే; లేమి = లేకపోవులు; గోవింద = శ్రీకృష్ణునికంటె; అన్య = ఇతరమైనవారి; లీలా = లీలలను; ఆచరణము = నడపుట; అంద = అందుమాత్రమే; శ్రమము = శ్రమించుటలు; గోవింద = శ్రీకృష్ణుని; పూజనములు = పూజించుటలు; అంద = అందుమాత్రమే.
బంధము = తగులము; అచ్యుత = విష్ణువునకు; పర = విరుద్ధమైన; దుష్ట = చెడ్డ; పథములు = మార్గములు; అంద = అందుమాత్రమే; జ్వరము = పరితాపము; మాధవ = శ్రీకృష్ణుని; విరహిత = ఎడబాసిన; క్షణములు = వేళల; అంద = అందుమాత్రమే; మత్సరము = చలములు; ఈశు = కృష్ణుని; కైంకర్య = కొలచుట లందలి; మతములు = పద్ధతులు; అంద = అందుమాత్రమే; నరవరోత్తమ = మహారాజా {నరవరోత్తముడు - నరవరుల (రాజుల)ల ఉత్తముడు, మహారాజు}; వినుము = శ్రద్ధగా విను; తత్ = ఆ యొక్క; నాగరుల్ = పట్టణమున నండు వారి; కున్ = కి.
భావము:- ఓ రాజశ్రేష్ఠుడా! పరీక్షన్మహారాజా! విను. ఆ ద్వారక లోని ప్రజలకు శ్రీకృష్ణుని వదనారవింద సందర్శనమందే అపేక్ష. ఆ గోవిందుని చరణాలు సేవించుట యందే వారు తలంపు కలిగి ఉంటారు. హరికి విరుద్ధము లైన పనులు అంటే వారు భయపడతారు. విష్ణుభక్తి యందే వారికి మైమరపు కలుగుతుంది. చక్రధరుని మీద పద్యాలల్లి ప్రస్తుతించే టప్పుడు వారికి ఆనందబాష్పాలు కారుతాయి. విష్ణుభక్తులు అంటేనే వారికి అభిమానం ఎక్కువ. అచ్యుతుని కంటే అన్యములైన లీలలను ఆచరించుట విషయంలో వారికి ఉన్నది లేమిడి. పురుషోత్తముని పూజించుట కోసమే వారు ఎక్కువ శ్రమిస్తారు. శ్రీహరిని పొందించని కుమార్గములే వారికి చెఱలు. క్షణకాలం పద్మనేత్రుని విడిచితే వారు పరితపించిపోతారు. పరమేశ్వరుని కైంకర్యములు విషయంలో వారికి పట్టుదల ఎక్కువ.

తెభా-10.1-1613-వ.
మఱియు న ప్పురవరంబున హరికిం బారిజాతమహీజంబును సుధర్మ మనియెడి దేవసభను దేవేంద్రుం డిచ్చెఁ; గర్ణైకదేశంబుల నలుపు గలిగి మనోజవంబులును శుక్లవర్ణంబులు నైన తురంగంబుల వరుణుం డొసంగె; మత్స్య కూర్మ పద్మ మహాపద్మ శంఖ ముకుంద కచ్ఛప నీలంబు లను నెనిమిది నిధులఁ గుబేరుండు సమర్పించె; నిజాధికార సిద్ధికొఱకుఁ దక్కిన లోకపాలకులును దొల్లి తమకు భగవత్కరుణా కటాక్షవీక్షణంబుల సంభవించిన సర్వసంపదల మరల నతిభక్తితో సమర్పించి రి వ్విధంబున.
టీక:- మఱియున్ = ఇంకను; ఆ = ఆ యొక్క; పుర = పట్టణములలో; వరంబునన్ = శ్రేష్ఠమైనదాని యందు; హరి = కృష్ణుని; కిన్ = కి; పారిజాత = కల్ప; మహీజంబును = వృక్షమును; సుధర్మ = సుధర్మ; అనియెడి = అనెడి; దేవ = దివ్యమైన; సభను = సింహాసనమును; దేవేంద్రుండు = ఇంద్రుడు; ఇచ్చెన్ = ఇచ్చెను; కర్ణ = చెవులు; ఏక = ఒకే ఒక్క; దేశంబులన్ = చోటులందే; నలుపు = నలుపురంగు; కలిగి = ఉండి; మనః = మనస్సు వంటి; జవంబులును = వేగములు కలిగినవి; శుక్ల = తెల్లటి; వర్ణంబులున్ = రంగు కలవి; ఐన = అయినట్టి; తురంగంబులన్ = గుఱ్ఱములను; వరుణుండు = వరుణదేవుడు; ఒసంగెన్ = ఇచ్చెను; మత్స్య = మత్స్యము; కూర్మ = కూర్మము; పద్మ = పద్మము; మహాపద్మ = మహాపద్మము; శంఖ = శంఖము; ముకుంద = ముకుందము; కచ్ఛప = కచ్ఛపము; నీలంబున్ = నీలములు; అను = అనెడి; ఎనిమిది = ఎనిమిది (8); నిధులన్ = నిధులను {నిధులు - ఎనిమిది చెప్పబడినవి (1మత్స్య 2కూర్మ3పద్మ 4మహాపద్మ 5శంఖము 6ముకుందము 7కచ్ఛపము 8నీలము) తొమ్మిదవది వరము తప్పించి, మరియొక విధమున నవనిధులు అని చెప్పెదరు (1పద్మము 2మహాపద్మము 3శంఖము 4మకరము (మొసలి) 5కచ్ఛపము (తాబేలు) 6ముకుందము 7కుందము (పంది) 8నీలము 9వరము (ఖర్వము)), మరియొక విధమున నవనిధులు అని చెప్పునవి 1. కాళము 2. మహాకాళము 3. పాండుకము 4. మాణవకము 5. నైసర్పము 6. సర్వరత్నము 7. శంఖము 8. పద్మము 9. పింగళము.}; కుబేరుండు = కుబేరుడు; సమర్పించెన్ = ఇచ్చెను; నిజ = తమతమ; అధికార = అధికారముల; సిద్ధి = సిద్దించుట; కొఱకున్ = కోసము; తక్కిన = మిగిలిన; లోకపాలకులును = దిక్పాలకులు; తొల్లి = మునుపు; తమ = వారి; కున్ = కి; భగవత్ = పరమేశ్వరుని; కరుణా = దయగల; కటాక్ష = దృష్టితో; వీక్షణంబులన్ = చూచుటచేత; సంభవించిన = కలిగిన; సర్వ = సమస్తమైన; సంపదలన్ = సంపదలను; మరల = తిరిగి; అతి = మిక్కిలి; భక్తి = భక్తి; తోన్ = తోటి; సమర్పించిరి = ఇచ్చితిరి; ఈ = ఇట్టి; విధమున = విధముగా.
భావము:- మఱియు శ్రేష్ఠమగు ఆ పట్టణంలో నివసించే కృష్ణుడికి పారిజాతవృక్షమును, సుధర్మ అనే దేవసభను దేవేంద్రుడు ఇచ్చాడు. ఒక చెవి మాత్రమే నలుపురంగు తక్కిన శరీరం అంతా తెల్లటి రంగు కలిగి మనోవేగం కలిగిన గుఱ్ఱాలను వరుణుడు ఇచ్చాడు. వరము తప్పించి నవనిధులలోని మత్స్యం, కూర్మం, పద్మం, మహాపద్మం, శంఖం, ముకుందం, కచ్ఛపం, నీలం, అనే పేర్లు కల ఎనిమిది నిధులను కుబేరుడు సమర్పించాడు. తక్కిన లోకపాలురు అందరూ తమతమ అధికారాల సిద్ధి కోసం మునుపు తమకు భగవంతుని అనుగ్రహం వలన లభించిన సకల విభూతులను మరల అచ్యుతునికే మిక్కిలి భక్తితో సమర్పించుకున్నారు.

తెభా-10.1-1614-క.
ర్పించి చేసి పురము స
ర్పించెను విశ్వకర్మ మంగళగుణ సం
ర్పిత గహ్వరికిని గురు
ర్పిత దుఃఖప్రవాహ రికిన్ హరికిన్.

టీక:- దర్పించి = విజృంభించి; చేసి = నిర్మించి; పురమున్ = పట్టణమును; సమర్పించెను = ఇచ్చెను; విశ్వకర్మ = విశ్వకర్మ అను దేవశిల్పి; మంగళ = శుభప్రదమైన; గుణ = సుగుణములచేత; సంతర్పిత = తృప్తి పొందింపబడినట్టి; గహ్వరి = భూదేవి కలవాని; కిని = కి; గురు = మిక్కిలి, గురువునకు; దర్పిత = ఉప్పొంగెడి; దుఃఖ = దుఃఖపు; ప్రవాహ = వెల్లువను; తరి = దాటించెడివాని; కిన్ = కి; హరి = కృష్ణుని; కిన్ = కి.
భావము:- ఆ విధముగా, విశ్వకర్మ మిక్కిలి ఉత్సాహంతో నైపుణ్యంతో పట్టణం నిర్మించి; కల్యాణగుణాలు కూడిన భూదేవి భర్త, మహా విజృంభణం కలిగిన దుఃఖమనే ప్రవాహాన్ని దాటడానికి నావ, సకల పాపాలు హరించువాడూ అయిన శ్రీకృష్ణుడికి సమర్పించాడు.