Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/దేవకీవసుదేవుల విడుదల

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1390-వ.
అని విలపించుచున్న రాజవల్లభల నూరార్చి, జగద్వల్లభుండైన హరి కంసాదులకుం బరలోకసంస్కారంబులు చేయం బనిచి దేవకీ వసుదేవుల సంకలియలు విడిపించి, బలభద్ర సహితుండై వారలకుం బ్రణామంబులు జేసిన.
టీక:- అని = ఈ విధముగ; విలపించుచున్న = తపించుచున్న; రాజ = కంసుని యొక్క; వల్లభలన్ = భార్యలను; ఊరార్చి = ఊరడించి; జగత్ = లోకమునకు; వల్లభుండు = ప్రభువు; ఐన = అయినట్టి; హరి = కృష్ణుడు; కంస = కంసుడు; అదుల్ = మొదలగువారల; కున్ = కు; పరలోకసంస్కారంబులు = అంత్యక్రియలు; చేయన్ = చేయుటకు; పనిచి = నియమించి; దేవకీ = దేవకీదేవి; వసుదేవులన్ = వసుదేవులను; సంకలియలు = బంధనముల నుండి; విడిపించి = విడుదల చేయించి; బలభద్ర = బలరామునితో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; వారల = వారి; కున్ = కి; ప్రణామంబులు = నమస్కారములు; చేసిన = చేయగా.
భావము:- అలా ఏడుస్తున్న రాజు భార్యలను ఓదార్చి, లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు కంసుడు మొదలైన వారికి ఉత్తరక్రియలు చేయమని ఆదేశించాడు. పిమ్మట, దేవకీవసుదేవులను చెర విడిపించి, బలరాముడు తను కలిసి వారికి నమస్కారాలు చేయగా. . .

తెభా-10.1-1391-మ.
ని లోకేశులుగాని వీరు కొడుకుల్గారంచుఁ జిత్తంబులన్
యిత్రీ జనకుల్ విచారపరులై శంకింపఁ గృష్ణుండు దా
సమ్మోహినియైన మాయఁ దదభిజ్ఞానంబు వారించి యి
ట్లనియెన్ సాగ్రజుఁడై మహావినతుఁడై యానందసంధాయియై.

టీక:- కని = చూసి; లోక = లోకములనేలెడి; ఈశులు = భగవంతులు; కాని = తప్పించి; వీరు = వీరు; కొడుకులు = పుత్రులు; కారు = కారు; అంచున్ = అని; చిత్తంబులన్ = మనసులలో; జనయిత్రీ = తల్లి; జనకుల్ = తండ్రులు; విచారపరులు = విచారించువారు; ఐ = అయ్యి; శంకింపన్ = సందేహించుచుండగా; కృష్ణుండు = కృష్ణుడు; తాన్ = అతను; జన = ఎల్లరను; సమ్మోహిని = మోహింపజేసెడిది; ఐన = అయినట్టి; మాయన్ = మాయచేత; తత్ = ఆ యొక్క; అభిజ్ఞానంబున్ = ప్రత్యక్షజ్ఞానమును; వారించి = పోగొట్టి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; సాగ్రజుడు = అన్నతో కూడినవాడు; ఐ = అయ్యి; మహా = మిక్కిలి; వినతుడు = వినయము కలవాడు; ఐ = అయ్యి; ఆనంద = సంతోషమును; సంధాయి = కలిగించెడివాడు; ఐ = అయ్యి.
భావము:- తల్లితండ్రులైన దేవకీవసుదేవులు తమ పుత్రులను చూసి “వీరు సకల లోకాలకు ప్రభువులు తప్ప సాధారణ మానవులు కారు” అని ఆలోచిస్తూ తమ మనసులలో సంశయ పడసాగారు. అప్పుడు, శ్రీకృష్ణుడు జనులను సమ్మోహింప జేసే మాయాశక్తిని ప్రయోగించి, వారి ఎరుకను మరుగు పరచి, అన్న బలభద్రుడుతో కూడి వచ్చి మిక్కిలి వినయంతో ఆనందాలు పంచుతూ ఇలా అన్నాడు

తెభా-10.1-1392-సీ.
"మ్ముఁ గంటిరిగాని మా బాల్య పౌగండ-
కైశోర వయసులఁ దిసి మీర
లెత్తుచు దించుచు నెలమి మన్నించుచు-
నుండు సౌభాగ్యంబు నొంద రైతి;
రాకాంక్ష గలిగియున్నది దైవయోగంబు-
  /> ల్లిదండ్రుల యొద్ద నయు లుండి
యే యవసరమున నెబ్బంగి లాలితు-
గుచు వర్ధిల్లుదు ట్టి మహిమ

తెభా-10.1-1392.1-తే.
మాకు నిన్నాళ్ళు లే దయ్యె ఱియు వినుఁడు
నిఖిల పురుషార్థహేతువై నెగడుచున్న
మేని కెవ్వార లాఢ్యులు మీరకారె
యా ఋణముఁ దీర్ప నూఱేండ్లకైనఁ జనదు.

టీక:- మమ్మున్ = మమ్ములను; కంటిరి = జన్మింపజేసితిరి; కాని = తప్పించి; మా = మా యొక్క; బాల్య = శైశవపు {బాల్యము - తనకు తాను లేవలేని దశ (1 సం.), కౌమారము, పసితనము}; పౌగండ = పౌగండపు {పౌగండము - 5 నుండి 10 సంవత్సరముల బాల్యము}; కైశోర = కిశోరపు {కైశోరము - మంచిచెడ్డలు చెప్పినను తెలిసికోచాలని దశ (15)}; వయసులన్ = ప్రాయములందు; కదిసి = చేరి; మీరలు = మీరు; ఎత్తుచున్ = ఎత్తుకొనుచు; దించుచున్ = దింపుతు; ఎలమిన్ = సంతోషముతో; మన్నించుచున్ = గారాముచేయుచు; ఉండు = ఉండెడి; సౌభాగ్యంబున్ = అదృష్టమును; ఒందరు = పొందనివారు; ఐతిరి = అయ్యారు; ఆకాంక్ష = కోరుతు; కలిగియున్నన్ = ఉన్నప్పటికిని; అది = ఆస్థితి; దైవయోగంబు = దైవనిర్ణయము; తల్లిదండ్రుల = తల్లిదండ్రుల; ఒద్దన్ = దగ్గర; తనయులు = పిల్లలు; ఉండి = ఉండి; ఏ = ఏఏ; అవసరమునన్ = సమయము లందు; ఎబ్బంగి = ఏ విధముగ; లాలితుల్ = లాలనచేయబడినవారు; అగుచున్ = అగుచు; వర్ధిల్లుదురు = పెరుగుదురో; అట్టి = అటువంటి; మహిమ = గొప్పదనము.
మా = మా; కున్ = కు; ఇన్ని = ఇన్ని; నాళ్ళు = దినములవరకు; లేదు = కలుగనిది; అయ్యెన్ = అయినది; మఱియున్ = ఇంకను; వినుడు = వినండి; నిఖిల = సమస్తమైన; పురుషార్థ = చతుర్విధపురుషార్థముల {చతుర్విధపురుషార్థములు - 1ధర్మము 2అర్థము 3కామము 4మోక్షము}; హేతువు = కారణభూతము; ఐ = అయ్యి; నెగడుచున్న = అతిశయించుచున్న; మేని = శరీరమున; కున్ = కు; ఎవ్వారలు = ఎవరు; ఆఢ్యులు = మూలమైనవారు; మీర = మీరే; కారె = కాదా, అవును; ఆ = ఆ యొక్క; ఋణమున్ = పితృఋణము {ఋణత్రయము - 1దేవఋణము 2ఋషిఋణము 3పితృఋణము}; తీర్పన్ = తీర్చుకొనుటకు; నూఱు = వంద; ఏండ్ల = సంవత్సరముల; కైనన్ = అయినప్పటికి; చనదు = శక్యముకాదు.
భావము:- “అమ్మా! నాన్నా! మమ్మల్ని కన్నారు కానీ, మా బాల్య, పౌగండ, శైశవ ప్రాయాలలో ప్రేమగా ఎత్తుకుంటూ, దింపుతూ, లాలించి పాలించే భాగ్యాన్ని మీరు పొందలేదు. కోరిక ఉండి కూడా దైవయోగము చేత అది తీరలేదు. తలితండ్రుల సమక్షంలో బిడ్డలుండి ఎప్పుడూ బుజ్జగింప బడుతూ ఎలా ఎదుగుతారో, అలాంటి అదృష్టం మా కిన్నాళ్ళూ లేకపోయింది. ధర్మార్ధకామమోక్షము లనే పురుషార్థములు సాధించడానికి కారణమైన ఈ శరీరాలకు కర్త లెవరు? జననీజనకులైన మీరే కదా! ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి నూరేండ్లయినా సరిపోదు.

తెభా-10.1-1393-క.
చెల్లుబడి గలిగి యెవ్వఁడు
ల్లికిఁ దండ్రికిని దేహనముల వృత్తుల్
చెల్లింపఁ డట్టి కష్టుఁడు
ప్రల్లదుఁ డామీఁద నాత్మలలాశి యగున్.

టీక:- చెల్లుబడి = సాగుదల; కలిగి = ఉన్నను; ఎవ్వడు = ఎవడైతే; తల్లి = తల్లి; కిన్ = కి; తండ్రి = తండ్రి; కిని = కి; దేహ = శారీరక; ధనములన్ = ఆర్థిక; వృత్తుల్ = జరపదగిన పనులు; చెల్లింపడు = జరుపడో; అట్టి = అలాంటి; కష్టుడు = కఠినుడు; ప్రల్లదుడు = దుష్టుడు; ఆ = అటు; మీద = పిమ్మట; ఆత్మ = స్వంత; పలల = మాంసము; ఆశి = తినువాడు; అగున్ = అవుతాడు.
భావము:- ఎవడైతే సమర్థత కలిగి ఉన్నా కూడా తన శరీరంతో ధనంతో తన తల్లితండ్రులకు సేవచేయడో, అలాంటి వాడు కష్టుడు దుష్టుడు. వాడు చచ్చాక తన మాంసం తానే తింటాడు

తెభా-10.1-1394-క.
నీజనకుల వృద్ధులఁ
యుల గురు విప్ర సాధు దారాదులనే
నుఁడు ఘనుఁ డయ్యుఁ బ్రోవక
రును జీవన్మృతుండు వాఁడు ధరిత్రిన్.

టీక:- జననీజనకుల = తల్లిదండ్రులను; వృద్ధులన్ = పెద్దవారిని; తనయులన్ = కొడుకులు కూతుళ్ళు; గురు = ఉపాధ్యాయులు; విప్ర = బ్రాహ్మణులు; సాధు = సాధువులు; దార = భార్య; ఆదులన్ = మున్నగువారిని; ఏ = ఏ యొక్క; జనుడు = మానవుడు; ఘనుడు = గొప్పవాడు; అయ్యున్ = అయినప్పటికిని; ప్రోవక = పోషింపకుండ; వనరునున్ = తపించునో; జీవన్మృతుడు = నడుస్తున్నశవము లాంటివాడు; వాడు = అతడు; ధరిత్రిన్ = భూమిమీద.
భావము:- ఏ నరుడైతే తల్లితండ్రులను, వయోవృద్ధులనూ, భార్యాపిల్లలనూ, గురువులనూ, బ్రాహ్మణులనూ, సాధువులలు మొదలైనవారిని సమర్థుడై ఉండి కూడా పోషింపక ఏడుస్తుంటాడో, అలాంటి వాడు ఈ భూమి మీద బ్రతికున్న శవం వంటి వాడే.

తెభా-10.1-1395-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతేకాక. . .

తెభా-10.1-1396-శా.
కారాశాలల మా నిమిత్తము మిముం గంసుండు గారింపఁగా
వారింపంగ సమర్థతల్ గలిగియున్ వారింపఁగా లేక ని
ష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహాకౌటిల్యసంచారులన్
సారాతిక్షములార! మమ్ముఁ గొఱతల్ సైరించి రక్షింపరే."

టీక:- కారాశాలలన్ = చెరశాలలో; మా = మా; నిమిత్తమున్ = కారణముచేత; మిమున్ = మిమ్ములను; కంసుండు = కంసుడు; కారింపగా = బాధించుచుండగా; వారింపంగన్ = అడ్డుకొనుటకు; సమర్థతల్ = సామర్థ్యములు; కలిగియున్ = ఉన్నప్పటికి; వారింపగాన్ = మాన్పివేయుట; లేక = చేయలేక; నిష్కారుణ్య = దయలేని; ఆత్ములము = మనసు గలవారము; ఐన = అయిన; క్రూరులన్ = కఠినులను; మహా = మిక్కిలి; కౌటిల్య = వంకర; సంచారులన్ = నడకవారిని; సారా = శ్రేష్ఠమైన; అతి = మిక్కిలి; క్షములార = ఓర్పుకలవారలూ; మమ్మున్ = మమ్ములను; కొఱతల్ = నిష్ప్రయోజకత్వములను; సైరించి = ఓర్చి; రక్షింపరే = క్షమించండి.
భావము:- జననీజనకులారా! మీరు మిక్కిలి ఓర్పు కలవారు. మా కారణంగా మిమ్మల్ని కంసుడు చెరసాలలో బంధించి, బాధిస్తూ ఉంటే, వారించే సామర్థ్యం ఉండి కూడా వారించని దయమాలినవాళ్ళం; క్రూరులం; మిక్కిలి కుటిలమైన నడత కల వాళ్ళం. మా లోపాలు సహించి మమ్మల్ని మన్నించండి.”

తెభా-10.1-1397-వ.
అని యిట్లు మాయామనుష్యుండైన హరి పలికిన పలుకులకు మోహితులై వారల నంకపీఠంబుల నిడుకొని కౌఁగిలించుకొని వారి వదనంబులు కన్నీటం దడుపుచుఁ బ్రేమపాశబద్ధులై, దేవకీవసుదేవు లూరకుండి; రంత వాసుదేవుండు మాతామహుండైన యుగ్రసేనుం జూచి.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; మాయా = మాయతోటి; మనుష్యుండు = మానవుడుగా; ఐన = వర్తించువాడు అయిన; హరి = కృష్ణుడు; పలికినన్ = చెప్పిన; పలుకుల్ = మాటల; కున్ = కు; మోహితులు = మోహములో పడినవారు; ఐ = అయ్యి; వారలన్ = వారిని; అంక = ఒడి అనెడి; పీఠంబులన్ = పీటలమీద; ఇడుకొని = ఉంచుకొని; కౌఁగిలించుకొని = ఆలింగనము చేసికొని; వారి = వారి యొక్క; వదనంబులు = ముఖములను; కన్నీటన్ = అశ్రుజలములచే; తడపుచున్ = తడిపేస్తూ; ప్రేమ = ప్రీతి అనెడి; పాశ = తాళ్ళచే; బద్ధులు = కట్టబడినవారు; ఐ = అయ్యి; దేవకీ = దేవకీదేవి; వసుదేవులు = వసుదేవులు; ఊరక = మారుమాట్లాడకుండ; ఉండిరి = ఉన్నారు; అంత = అటు పిమ్మట; వాసుదేవుండు = శ్రీకృష్ణుడు (వాసుదేవుడు - వసుదేవుని కొడుకు, కృష్ణుడు); మాతామహుండు = తాత (అమ్మకి తండ్రి); ఐన = అయినట్టి; ఉగ్రసేనున్ = ఉగ్రసేనుని; చూచి = ఉద్దేశించి.
భావము:- అంటూ ఇలా పలికిన మాయామానుషవిగ్రహుడైన శ్రీకృష్ణుడి మాటలకు దేవకీవసుదేవులు మోహము చెందారు. వారు తమ పుత్రులను ఒడిలోకి తీసుకున్నారు; గట్టిగా ఆలింగనం చేసుకున్నారు; కన్నీళ్ళతో వారి తలలు తడిపారు; ప్రేమాతిశయం వలన మాటలు పెగలక మౌనం వహించారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లికి తండ్రిగారైన ఉగ్రసేనుడితో ఇలా అన్నాడు.