పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/చిలుకుతున్న కవ్వం పట్టుట
తెభా-10.1-354-వ.
అంత నొక్కనాఁడు తన యింటికడ పాప లందఱు నయ్యై పనులందుఁ బంపుపడిపోయిన నందసుందరి సంరంభంబునం దరికంబంబు కడఁ గుదురున నొక్క దధికుంభంబు పెట్టి మిసిమిగల మీఁగడపెరుగు గూడంబోసి వీఁక నాఁక త్రాడు కవ్వంబున నలంవరించి.
టీక:- అంతన్ = అప్పుడు; ఒక్క = ఒకానొక; నాడున్ = రోజు; తన = తన యొక్క; ఇంటి = నివాసము; కడన్ = వద్ద; పాపలు = సేవకురాళ్ళు; అందఱున్ = అందరు; అయ్యై = వేరువేరు; పనులు = పనులు; అందున్ = లో; పడిపోయినన్ = మునిగిపోగా; నంద = నందుని యొక్క; సుందరి = భార్య; సంరంభంబునన్ = వేగిరపాటుతో; తరి = చిలుకుటకైన; కంబంబున్ = స్తంభము; కడన్ = వద్ద; కుదురున్ = కుండ పెట్దే కుదురు మీద {కుదురు - కుండ కదలకుండ కుండ క్రింద పెట్టెడి గుండ్రని చుట్ట}; ఒక్క = ఒకానొక; దధి = పెరుగు; కుంభంబు = కుండను; పెట్టి = ఉంచి; మిసిమి = వెన్న; కల = ఉన్నట్టి; మీగడ = తొరకకట్టిన; పెరుగున్ = పెరుగులను; కూడన్ = కలియ; పోసి = పోసి; వీకన్ = పూనికతో; నాకత్రాడు = కవ్వపుతాడు; కవ్వంబునన్ = కవ్వమునకు; అలంవరించి = చక్కగాచుట్టి.
భావము:- ఒక రోజు యశేదాదేవి ఇంటివద్ద ఉన్న యువతులు అందరూ వారి పనులమీద వెళ్ళిపోయారు. యశోదాదేవి పెరుగు చిలకడానికి చిలుకు స్తంభం వద్ద కుదురు పెట్టి, దానిమీద పెరుగు కుండను పెట్టింది. తరిత్రాటిని కవ్వానికి తగిలించి పెరుగు చిలకడం మొదలు పెట్టింది.
తెభా-10.1-355-సీ.
కరకమలారుణ కాంతిఁ గవ్వుపు ద్రాడు-
పవడంపు నునుఁదీఁవ పగిది మెఱయఁ;
గ్రమముతో రజ్జు వాకర్షింపఁ బాలిండ్లు-
వీడ్వడి యొండొంటి వీఁక నొత్తఁ;
గుచకుంభములమీఁది కొంగు జాఱఁగ జిక్కు-
పడుచు హారావళుల్ బయలుపడగఁ;
బొడమిన చెమటతోఁ బొల్పారు నెమ్మోము-
మంచు పైఁబడిన పద్మంబుఁ దెగడఁ;
తెభా-10.1-355.1-తే.
గౌను నులియంగఁ; గంకణక్వణన మెసఁగఁ;
దుఱుము బిగివీడఁ; గర్ణికాద్యుతులు మెఱయ;
బాలు నంకించి పాడెడి పాట వలనఁ
దరువు లిగురొత్త బెరు గింతి దరువఁ జొచ్చె.
టీక:- కర = చేతులు అనెడి; కమల = పద్మముల; అరుణ = ఎఱ్ఱని; కాంతిన్ = మెరుపువలన; కవ్వపుత్రాడు = నాకతాడు, తరితాడు; పవడంపు = పగడాల; నును = నున్నటి; తీవ = తీగలాగ; పగిదిన్ = వలె; మెఱయన్ = ప్రకాశించుచుండగా; క్రమము = ఒకపద్దతి; తోన్ = ప్రకారము; రజ్జువున్ = తాడును; ఆకర్షింపన్ = పట్టుకొని లాగుతుండగా; పాలిండ్లు = స్తనములు; వీడ్వడి = విడివిడిగానై; ఒండొంటిన్ = ఒకదానినొకటి; వీకన్ = గట్టిగా; ఒత్తన్ = ఒరసికొనగా; కుచ = స్తనములు అనెడి; కుంభముల = కుండల; మీది = మీద ఉన్న; కొంగు = చీరకొంగు; జాఱగన్ = జారుచుండగా; చిక్కుపడుచున్ = మెలికలుపడుతు; హార = మెడలోనిదండల; ఆవళుల్ = వరుసలు; బయలుపడగన్ = బయటికిరాగా; పొడమిన = పుట్టిన; చెమట = చెమటబిందువుల; తోన్ = తోటి; పొల్పారు = అందంగా కనబడుతుండగా; నెఱ = నిండైన; మోము = ముఖము; మంచు = మంచు బిందువులు; పైన్ = మీద; పడిన = పడినట్టి; పద్మంబున్ = పద్మములను; తెగడన్ = పరిహసించగా; కౌను = నడుము.
నులియంగన్ = ఊగిసలాడగా; కంకణ = చేతికంకణముల, గాజుల; క్వణన = శబ్దము; ఎసగన్ = అతిశయించగా; తుఱుము = జుట్టుముడి; బిగి = బిగింపు; వీడన్ = వదులుకాగా; కర్ణికా = చెవి ఆభరణముల; ద్యుతులు = కాంతులు; మెఱయన్ = మెరుస్తుండగా; బాలున్ = బాలకృష్ణుని; అంకించి = ఉద్దేశించి; పాడెడి = పాడుతున్న; పాట = పాట; వలన = వలన; తరువులు = చెట్లు; ఇగురొత్తన్ = చిగురించునట్లుగా; పెరుగున్ = పెరుగును; ఇంతి = యశోద; తరువజొచ్చె = చిలకసాగెను.
భావము:- అలా యశోదాదేవి పెరుగు చిలుకుతుండగా, ఆమె చేతుల అరుణకాంతులు కవ్వం తాటిపై పడి అది పగడపుతీగలాగ మెరుస్తోంది. తాడును క్రమపద్దతిలో ఒకదాని తరువాత ఒకటి లాగుతుంటే, ఆమె పాలిండ్లు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటున్నాయి. వక్షోజాలపై ఉన్న కొంగు జారుతోంది. మెడలోని హారాలు చిక్కు పడుతూ కనబడుతూ ఉన్నాయి. పట్టిన చెమట బిందువులతో అందంగా ఉన్న ముఖం మంచుబిందువులు చెందిన తామరపూవు కన్నా మనోహరంగా ఉంది. సన్నని నడుము జవజవలాడుతూ ఉంది. చేతుల గాజులు గలగలలాడుతూ ఉన్నాయి. కొప్పుముడి బిగింపు సడలుతూ ఉంది. చెవుల కమ్మల కాంతులు తళుక్కుమంటూ ఉన్నాయి. ముద్దు కృష్ణుని ఉద్దేశించి ఆమె పాడేపాటకు చెట్లు చిగురుస్తూ ఉన్నాయి. ఇలా యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉంది.
తెభా-10.1-356-వ.
ఆ సమయంబున.
టీక:- ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు.
భావము:- యశోద పెరుగు చిలుకుతూ ఉండగా.
తెభా-10.1-357-క.
సుడియుచు వ్రాలుచుఁ గిదుకుచు
సడి గొట్టుచు "నమ్మ! రమ్ము; చన్ని"మ్మనుచున్
వెడవెడ గంతులు వైచుచుఁ
గడవఁ గదిసి బాలకుండు గవ్వముఁ బట్టెన్.
టీక:- సుడియుచున్ = గుండ్రంగా తిరుగుతూ; వ్రాలుచున్ = వాలిపోతూ; కిదుకుచున్ = గారాలుపోతూ; చడిగొట్టుచున్ = గోలచేస్తు, చప్పుళ్ళు చేస్తూ; అమ్మ = తల్లి; రమ్ము = రా; చన్ను = చనుబాలు; ఇమ్ము = ఇయ్యి; అనుచున్ = అంటూ; వెడవెడ = పిల్లిగంతులు; వైచుచున్ = వేస్తూ; కడవన్ = పెరుగుకుండను; కదిసి = చేరి; బాలకుండు = పిల్లవాడు; కవ్వమున్ = కవ్వమును; పట్టెన్ = పట్టుకొన్నాడు.
భావము:- కృష్ణబాలకుడు ఆమె చుట్టూ తిరుగుతూ, మీద పడుతూ, పైటలాగతూ అల్లరి చేయసాగాడు. “అమ్మా! రావే! నాకు పాలియ్యవే!” అంటూ గంతులు వేస్తూ దగ్గరకొచ్చి, చిన్నారి కన్నయ్య కవ్వాన్ని కదలకుండా పట్టుకున్నాడు.
తెభా-10.1-358-క.
కవ్వముఁ బట్టిన ప్రియసుతు
న వ్వనరుహనేత్ర దిగిచి యంకతలమునన్
నవ్వుచు నిడుకొని కూఁకటి
దువ్వుచుఁ జన్నిచ్చె; నతఁడు దూఁటుఁచుఁ గుడిచెన్.
టీక:- కవ్వమున్ = కవ్వమును; పట్టిన = పట్టుకొనిన; ప్రియ = ముద్దుల; సుతున్ = పుత్రుని; ఆ = ఆ; వనరుహనేత్ర = సుందరి {వనరుహనేత్ర - వనరుహ (పద్మములవంటి) నేత్రములు కలామె, స్త్రీ}; తిగిచి = తీసుకొని; అంకతలమునన్ = ఒడిలో; నవ్వుతున్ = నవ్వుతూ; ఇడుకొని = ఉంచుకొని; కూకటిన్ = జుట్టుపిలక; దువ్వుచున్ = దువ్వుతూ; చన్ను = చనుబాలు; ఇచ్చెన్ = ఇచ్చెను; అతడున్ = అతను; దూటుచున్ = పీల్చుచు; కుడిచెన్ = తాగెను.
భావము:- యశోదాదేవి కవ్వం పట్టుకున్న తన కొడుకు కృష్ణుడిని నవ్వుతూ దగ్గరకు తీసుకుంది. ఒళ్లో కూర్చుండ బెట్టుకుంది. ప్రేమగా జుట్టు దువ్వుతూ అతనికి పాలు ఇవ్వసాగింది. నల్లనయ్య చక్కగా తల్లిరొమ్ములో తలదూర్చి తాగుతున్నాడు.
తెభా-10.1-359-మ.
కడుపారం జనుబాలు ద్రావని సుతుం గంజాక్షి పీఠంబుపై
నిడి పొంగారెడు పాలు డించుటకుఁనై యేగంగఁ దద్బాలుఁ డె
క్కుడు కోపంబున వాఁడిఱాత దధిమత్కుంభంబుఁ బోఁగొట్టి తెం
పడరం గుంభములోని వెన్నఁ దినె మిథ్యా సంకులద్భాష్పుఁడై.
టీక:- కడుపారన్ = కడుపునిండుగా; చనుబాలు = చనుబాలు; త్రావని = తాగుటపూర్తిచేయని; సుతున్ = పుత్రుని; కంజాక్షి = పద్మాక్షి; పీఠంబు = పీట; పైన్ = మీద; ఇడి = పెట్టి; పొంగారెడు = పొంగిపోవుచున్న; పాలున్ = పాలను; డించుట = పొయ్యి మీంచి దింపుట; కున్ = కోసము; ఐ = అయ్యి; ఏగంగన్ = వెళ్ళగా; తత్ = ఆ; బాలుడు = పిల్లవాడు; ఎక్కుడు = అధికమైన; కోపంబునన్ = కోపముతో; వాడి = సూదియైన; ఱాతన్ = రాయితో; దధిమత్కుంభంబున్ = పెరుగుతో నిండుగానున్న కుండను; పోగొట్టి = పగులగొట్టి; తెంపు = పెంకితనము; అడరన్ = పెరిగిపోగా; కుంభము = కుండ; లోని = అందలి; వెన్నన్ = వెన్నను; తినెన్ = తినెను; మిథ్యా = దొంగ; సంకులత్ = కారుతున్న; భాష్పుడు = కన్నీరు కలవాడు; ఐ = అయ్యి.
భావము:- కవ్వం పట్టుకున్న చిన్నారి కృష్ణునికి యశోదాదేవి పాలు ఇస్తూ, పొయ్యిమీది పాలు పొంగిపోతున్నాయి అని చూసింది. అతను పాలు తాగటం పూర్తికాకుండానే పీటమీదకి దింపేసింది. పాలకుండ దింపడానికి గబగబా లోపలికి వెళ్ళింది. తన కడుపు నిండకుండా మధ్యలో వెళ్ళిందని కోపంతో వాడిరాతితో నిండుగా ఉన్న పెరుగుకుండను పగులగొట్టాడు. పగిలిన కుండలోని వెన్నను తినసాగాడు. పైపెచ్చు దొంగకన్నీళ్లు కారుస్తూ ఏడవటం మొదలెట్టాడు.
తెభా-10.1-360-వ.
అంత నా లోలలోచన పాలు డించి వచ్చి వికలంబు లయిన దధికుంభ శకలంబులఁ బొడఁగని తుంటకొడుకు వెన్నదింట యెఱింగి నగుచు నా కలభగామిని యతనిం గానక చని చని.
టీక:- అంతన్ = అప్పుడు; ఆ = ఆ; లోలలోచన = సుందరి {లోల లోచన - చలించెడి కన్నులు కలామె, స్త్రీ}; పాలున్ = పాలను; డించి = పొయ్యిమీదనుంచి దించి; వచ్చి = వెనుకకు వచ్చి; వికలంబులు = పగిలిపోయిన; దధికుంభ = పెరుగుకుండ; శకలంబులన్ = పెంకులను; పొడగని = చూసి; తుంట = తుంటరి; కొడుకు = కుమారుడు; వెన్నన్ = వెన్నని; తింటన్ = తినుట; ఎఱింగి = తెలిసికొని; నగుచున్ = నవ్వుతూ; ఆ = ఆ; కలభగామిని = సుందరి {కలభగామిని - కలభ (ఏనుగుగున్న వంటి) నడక కలామె, స్త్రీ}; అతనిన్ = అతనిని; కానకన్ = కనుగొనలేక; చనిచని = బాగా తిరిగి.
భావము:- యశోదాదేవి పొయ్యిమీది పాలు దించి వచ్చింది. పగిలిపోయిన పెరుగుకుండ ముక్కలను చూసింది. తుంటరి కొడుకు వెన్న మీగడలు తిన్నాడని గ్రహించి నవ్వుకుంటూ చూస్తే, కొంటె కృష్ణుడు కనిపించలేదు. అతణ్ణి వెతుక్కుంటూ బయలుదేరింది యశోద.
తెభా-10.1-361-ఆ.
వికచకమలనయన వే ఱొక యింటిలో
వెలయ ఱోలు దిరుగవేసి యెక్కి
యుట్టిమీఁది వెన్న నులుకుచు నొక కోఁతి
పాలు జేయుచున్న బాలుఁ గనియె.
టీక:- వికచకమలనయన = పడతి {వికచ కమల నయన - విరిసిన పద్మముల వంటి కన్నులు కలామె, స్త్రీ}; వేఱొక = మరొకరి; ఇంటి = నివాసము; లోన్ = అందు; వెలయన్ = చక్కగా; ఱోలున్ = రోటిని; తిరుగవేసి = తిరగేసి; ఎక్కి = పైకెక్కి; ఉట్టి = ఉట్టి {ఉట్టి - పాలు పెరుగాదులు దాచుట కోసం వేళ్ళాడలా కట్టబడెడి చిక్కము}; మీది = పైనున్న; వెన్నన్ = వెన్నను; ఉలుకుచున్ = బెదురుతూ; ఒక = ఒకానొక; కోతి = కోతి; పాలున్ = కిపెట్టుట; చేయుచున్న = చేస్తున్న; బాలునిన్ = పిల్లవానిని; కనియెన్ = చూసెను.
భావము:- ఇంట్లో పెరుగుకుండ పగలగొట్టిన కృష్ణుడు, అక్కడ మరొక ఇంటిలో ఒక రోలుని తిరగేసి, చక్కగా దానిమీద ఎక్కాడు. ఉట్టిమీద ఉన్న వెన్నతీసి బెదురుతూనే ఒక కోతికి పెడుతున్నాడు. యశోదమ్మ వచ్చి అతడు చేస్తున్న ఆ అల్లరి పని చూసింది.