పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/యశోద కృష్ణుని అదిలించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెభా-10.1-362-మ.
ని చేతన్ సెలగోలఁ బట్టికొనుచుం "గానిమ్ము గానిమ్ము రా
యా! యెవ్వరి యందుఁ జిక్కుపడ నేదండంబునుం గాన నే
వినివారంబును బొంద నే వెఱపు నే విభ్రాంతియుం జెంద ము
న్ననియో నీవిటు నన్నుఁ గైకొనమి నేఁడారీతి సిద్ధించునే."

టీక:- కని = చూసి; చేతన్ = చేతితో; సెలగోల = చెర్నాకోల, కొరడాకఱ్ఱ {సెలగోల - కఱ్ఱచివర తాడువంటిది ఉండి గుఱ్ఱబ్బండి ఆదుల తోలు కొరడాకఱ్ఱ, చెర్నాకోల}; పట్టికొనుచున్ = పట్టుకొంటు; కానిమ్ము = చెయ్యి; కానిమ్మురా = అలానే చెయ్యి; తనయా = కొడుకా; ఎవ్వరి = ఎవరి; అందున్ = కును; చిక్కుపడన్ = దొరకినవాడను కాను; ఏ = ఎట్టి; దండంబునున్ = శిక్షించుటను; కానన్ = చూసినవాడను కాను; ఏ = ఎట్టి; వినివారంబునున్ = నిర్బంధమును; పొందన్ = పొందినవాడను కాను; ఏ = ఎట్టి; వెఱపున్ = బెదిరించుటను; ఏ = ఏట్టి; విభ్రాంతియున్ = తొందరపాటులు; చెందన్ = చెందినవాడను కాను; మున్ను = ఇప్పటివరకు; అనియో = అనగా ఏమి; నీవు = నువ్వు; ఇటున్ = ఇలా; నన్నున్ = నన్ను; కైకొనమి = లక్ష్యపెట్టకపోవుట; నేడు = ఇవాళ; ఆరీతిన్ = ఆవిధముగ; సిద్ధించునే = జరుగునా, జరుగదు.
భావము:- కృష్ణుడు కోతికి వెన్న పెడుతూ అల్లరిచేస్తుండటం చూసిన యశోద బెత్తం చేతిలో పట్టుకొని “కన్నయ్యా! నువ్వు ఇప్పటివరకూ ఎవరి చేతికీ చిక్కలేదనీ, నిన్ను ఎవరూ శిక్షించలేరని, ఎవరూ అడ్డుకోలేరని, నిన్ను భయపెట్టరనీ, నీకు అదురూ బెదురూ లేకుండా పోయింది. అందుకే గదా నా మాట బొత్తిగా వినటంలేదు! సరే కానియ్యి! ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను”

తెభా-10.1-363-వ.
అని యదలించుచు కొడుకు నడవడిం దలంచి తనుమధ్య దన మనంబున.
టీక:- అని = అని; అదిలించుచున్ = బెదిరించుచు; కొడుకున్ = పుత్రుని; నడవడిన్ = ప్రవర్తనను; తలంచి = తలచికొని; తనుమధ్య = ఇంతి {తను మధ్య - సన్నని నడుము కలామె, స్త్రీ}; తన = ఆమె యొక్క; మనంబునన్ = మనసునందు.
భావము:- అంటూ యశోద కృష్ణున్ని అదలిస్తూ, తన కొడుకు దుడుకుతనం తలచుకుంటూ ఇలా అనుకుంటోంది..

తెభా-10.1-364-సీ.
"బాలుఁ డీతండని భావింతు నందునా-
యే పెద్దలును నేర రీక్రమంబు
వెఱ పెఱుంగుటకు నై వెఱపింతు నందునా-
లిగి లే కొక్కఁడు గాని లేఁడు
వెఱపుతో నా బుద్ధి వినిపింతు నందునా-
నుఁ దాన యై బుద్ధిఁ ప్పకుండు
నొం డెఱుంగక యింట నుండెడి నందునా-
చొచ్చి చూడని దొకచోటు లేదు

తెభా-10.1-364.1-ఆ.
న్ను నెవ్వరైనఁ లపోయఁ బాఱెడి
యోజ లేదు భీతి యొక టెఱుంగఁ
డెలమి నూరకుండఁ డెక్కసక్కెము లాడుఁ
ట్టి శాస్తిజేయు భంగి యెట్లు?"

టీక:- బాలుడు = పిల్లవాడు; ఈతండు = ఇతను; అని = అని; భావింతునందునా = అనుకొందామంటే; ఏ = ఎలాంటి; పెద్దలును = పెద్దవారుకూడ; నేరరు = చేయలేరు; ఈక్రమంబున్ = ఈవిధముగా; వెఱపున్ = భయము; ఎఱుంగుటకు = చెప్పుటకు; ఐ = కోసము; వెఱపింతును = భయపెట్టెదను; అందునా = అనుకొందామంటే; కలిగిలేక = లేకలేక; ఒక్కడు = ఇతడొక్కడే; కాని = తప్పించి; లేడు = మరొకడులేడు; వెఱపు = భయపెట్టుట; తోన్ = తోటి; నా = నా యొక్క; బుద్ధిన్ = మంచిబుద్ధిని; వినిపింతున్ = చెప్పెదను; అందునా = అనుకొందామంటే; తనున్ = తనంతట; తాన = తానే; ఐ = ఉండి; బుద్ధిన్ = మంచిబుద్ధిని; తప్పకుండున్ = క్రమముగానుండును; ఒండున్ = ఇతర విషయములేవీ; ఎఱుంగక = తెలిసికొనకుండ; ఇంటన్ = ఇంట్లోనే; ఉండెడిన్ = ఉండుము; అందునా = అనుకొందామంటే; చొచ్చి = దూరి; చూడనిది = చూడనట్టిది; ఒక = ఒక్కటైనా; చోటు = స్థలము; లేదు = లేదు.
తన్నున్ = అతనిని; ఎవ్వరైనన్ = ఎవరైనాసరే; తలపోయెన్ = తలచుకొనినచో; పాఱెడి = పరిగెట్టిపోయెడి; ఓజ = విధము; లేదు = లేదు; భీతి = భయము; ఒకటెఱుంగడు = అసలులేదు; ఎలమిన్ = చక్కగా; ఊరకుండడు = ఊరుకోడు; ఎకసక్కెములు = వంకరమాటలు; ఆడున్ = పలుకును; పట్టి = పట్టుకొని; శాస్తి = తగినశిక్ష; చేయన్ = చేయవలసిన; భంగి = విధము; ఎట్లు = ఏమిటి.
భావము:- కన్నయ్యని పోనీ పసిపిల్లాడులే అనుకుందామంటే, ఇలాంటి నడవడి పెద్దలకు ఎవరికి తెలియదు; పోనీ ఇతడికి కొద్దిగా భయం చెబ్దాం అనుకుందామంటే, లేకలేక పుట్టినవాడు వీడొక్కడే మరోడు లేడాయె; బెదిరించి బుద్ధులు నేర్పుదాం అంటే, తనంతట తనే బుద్ధిగా ఉంటున్నాడాయె; అలాగనీ ఏమి తెలియకుండా ఇంట్లో కూర్చుంటాడులే అనుకుంటే, వీడు వెళ్ళని చోటు, చూడని చోటు ఏదీ లేనే లేదాయె; తనని ఎవరైనా చూస్తే పారిపోదామనే ఆలోచనే కూడా వీడికి రాదు; అసలు భయం అన్నదే తెలియదు; మళ్ళీ ఊరికే ఉండడు, ఎకసెక్కాలాడుతూనే ఉంటాడు; వీణ్ణి పట్టుకొని తగిన శాస్తి చేయటం ఎలా?

తెభా-10.1-365-వ.
అని వితర్కించి.
టీక:- అని = అని; వితర్కించి = బాగుగ తర్కించుకొని.
భావము:- కన్నయ్యకు బుద్ధి చెప్పటం ఎలా అని ఆలోచించుకుంటోంది

తెభా-10.1-366-క.
లానమున బహుదోషము
లోలిం బ్రాపించుఁ దాడనోపాయములన్
జా గుణంబులు గలుగును
బాలురకును దాడనంబ థ్యం బరయన్.

టీక:- లాలనమునన్ = గారాబముచేత; బహు = అనేకమైన; దోషములు = లోపములు; ఓలిన్ = క్రమముగా; ప్రాపించున్ = కలుగును; తాడనోపాయములన్ = దండోపాయములచేత; చాలన్ = మిక్కిలిగ, చాలా; గుణంబులున్ = సుగుణములు; కలుగును = లభించును; బాలురు = మగపిల్లల; కును = కు; తాడనంబ = కొట్టి దండించుటయే; పథ్యంబు = తగినపని, మందు; అరయన్ = తరచిచూసినచో.
భావము:- గారాబం మరీ ఎక్కువ చేస్తే పిల్లలు చివరికి చెడిపోతారు. అప్పుడప్పుడు తగలనిస్తుంటే మంచి గుణాలు అలవడతాయి. పిల్లల మితిమీరే అల్లరికి చక్కటి ఔషధం దండోపాయం.
“దండం దశగుణ భవేత్” అంటారు కదా.
“శ్లో.| లాలనాద్బహవో దోషాన్తాడనాద్బహవో గుణాః|
తస్మాత్పుత్రం చ శిష్యం చ తాడయేన్నతులాలయేత్ఛ||”
అని ఒక నీతిశాస్త్ర బోధ.

తెభా-10.1-367-వ.
అని నిశ్చయించి కేలనున్న కోల జళిపించి “బాలా! నిలునిలు” మని బగ్గుబగ్గున నదల్చుచు దల్లి డగ్గఱిన బెగ్గడిలిన చందంబున నగ్గలికచెడి ఱోలు డిగ్గ నుఱికి.
టీక:- అని = అని; నిశ్చయించి = నిర్ణయించుకొని; కేలన్ = చేత; ఉన్న = ఉన్నట్టి; కోలన్ = కొరడాకఱ్ఱను; జళిపించి = వేగముగా ఊపి; బాలా = పిల్లవాడా; నిలునిలుము = ఆగిపొమ్ము; అని = అని; బగ్గుబగ్గున = కోపముతో మండిపోతూ; అదల్చుచు = బెదిరించుచు; తల్లి = అమ్మ; డగ్గఱినన్ = దగ్గరకు రాగా; బెగ్గడిలిన = భయపడిపోయిన; చందంబునన్ = విధముగ; అగ్గలిక = ఉత్సాహము; చెడి = పోయి; ఱోలున్ = రోటిని; డిగ్గన = దుమికి; ఉఱికి = పరుగెట్టి.
భావము:- అల్లరి కృష్ణుని ఆగడాలు ప్రత్యక్షంగా చూసిన తల్లి యశోద. .
దండించాలి అని నిర్ణయించుకొంది. చేతిలో బెత్తం పట్టుకొని కోపంతో ఝళిపిస్తూ “ఒరేయ్ పిల్లాడా! ఆగక్కడ” అని అరుస్తూ యశోద దగ్గరకు వచ్చింది . కృష్ణ బాలుడు భయపడినట్లు ముఖం పెట్టి, అల్లరి ఆపేసాడు. గభాలున రోలుమీంచి కిందకి దూకాడు

తెభా-10.1-368-క.
జ్జలు గల్లని మ్రోయఁగ
జ్జలు ద్రొక్కుటలు మాని తిజవమున యో
షిజ్జనములు నగఁ దల్లియుఁ
జ్జం జనుదేర నతఁడు రువిడె నధిపా!

టీక:- గజ్జలు = కాలిగజ్జలు; గల్లు = గల్లుగల్లు; అని = అని; మ్రోయగన్ = మోగుతుండగా; అజ్జలు = చిందులు; త్రొక్కుటలు = వేయుట; మాని = వదిలేసి; అతి = మిక్కిలి; జవమునన్ = వేగముగా; యోషిజ్జనములు = ఆడవాళ్ళు; నగన్ = నవ్వుతుండగ; తల్లియున్ = తల్లి; పజ్జన్ = కూడా; చనుదేరన్ = వస్తుండగా; అతడు = అతను; పరువిడెన్ = పరుగెట్టెను; అధిపా = రాజా.
భావము:- చిలిపి కృష్ణుడు చిందులు తొక్కటాలు మానేసి, చాలా వేగంగా పరుగు లంకించుకున్నాడు. కాలి గజ్జలు గల్లు గల్లు మని మ్రోగుతున్నాయి. తల్లి యశోదాదేవి వెంట పరుగెట్టుకుంటూ వస్తోంది. గోపికా స్త్రీలు నవ్వుతూ చూస్తున్నారు.

తెభా-10.1-369-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = ఆ సమయము నందు.
భావము:- అప్పుడు.

తెభా-10.1-370-మ.
స్తభారంబున డస్సి క్రుస్సి యసదై వ్వాడు మధ్యంబుతో
నిత స్వేదముతోఁ జలత్కబరితో స్రస్తోత్తరీయంబుతో
జాతేక్షణ గూడ బాఱి తిరిగెన్ వారించుచున్ వాకిటన్
యోగీంద్ర మనంబులున్ వెనుకొనంగా లేని లీలారతున్.

టీక:- స్తన = స్తనముల; భారమునన్ = బరువు వలన; డస్సి = అలసిపోయి; క్రుస్సి = చిక్కిపోయి; అసదు = సన్ననిది; ఐ = అయ్యి; జవ్వాడు = ఊగిపోయెడి; మధ్యంబు = నడుము; తోన్ = తోటి; జనిత = పట్టిన; స్వేదము = చెమట; తోన్ = తోటి; చలత్ = కదిలిపోతున్న; కబరి = జుట్టుముడి; తోన్ = తోటి; స్రస్త = జారిపోయిన; ఉత్తరీయంబు = పైట; తోన్ = తోటి; వనజాతేక్షణ = పద్మాక్షి; కూడ = వెంట; పాఱి = పరుగెట్టి; తిరిగెన్ = వెళ్ళెను; వారించుచున్ = ఆగుమనుచు; వాకిటన్ = ఇంటి ముందటి వాకిట్లో; ఘన = గొప్ప; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; మనంబులున్ = మనసులం దైనను; వెనుకొనంగాలేని = వెంబడింప జాలని; లీలారతున్ = విహారములు కలవానిని.
భావము:- యశోదామాత “ఆగు, ఆగు” అంటూ ఇంటి ముంగిలిలో పరుగెడుతున్న బాలకృష్ణుడి వెంట పరుగెడుతున్నది. పెద్ద వక్షోజాల బరువుతో అలసిపోతూ, వంగిపోతూ ఉంది. సన్నని నడుము జవజవలాడుతూ ఉంది. పరుగెట్టే వేగానికి కొప్పు కదిలి జారిపోతూ ఉంది. చమటలు కారిపోతూ ఉన్నాయి. పైట జారిపోతూ ఉంది. మహామహా యోగీంద్రుల మనస్సులు కూడా పట్టుకోలేని ఆ లీలాగోపాల బాలుణ్ణి పట్టాలనే పట్టుదలతో వెంటపడి తరుముతూ ఉన్నది.
ఎంత అదృష్టం యశోదాదేవిది.