పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/చంద్రోదయ వర్ణన

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1298-సీ.
ప్రాచీదిశాంగనా ఫాలతలంబున-
దీపించు సింధూరతిలక మనఁగ
ర్పించి విరహుల ధైర్యవల్లులు త్రెంప-
ర్పకుం డెత్తిన దాత్ర మనఁగ
లిగి కాలకిరాతుఁ డంధకారమృగంబు-
ఖండింప మెఱయించు డ్గ మనఁగ
గనతమాలవృక్షము తూర్పుకొమ్మను-
లితమై మెఱయు పల్లవ మనంగఁ

తెభా-10.1-1298.1-తే.
దొగలు సంతసిల్ల దొంగలు భీతిల్లఁ
డలి మిన్నుముట్టి డలుకొనఁగఁ
బొడిచె శీతకరుఁడు భూరిచకోరక
ప్రీతికరుఁడు జారభీతికరుఁడు.

టీక:- ప్రాచీ = తూర్పు; దిశా = దిక్కు అనెడి; అంగనా = స్త్రీ యొక్క; ఫాలతలంబున = నుదుటి యందు; దీపించు = ప్రకాశించునట్టి; సింధూర = సింధూరపు; తిలకము = బొట్టు; అనగన్ = అన్నట్లుగా; దర్పించి = గర్వించి; విరహుల = ప్రియ ఎడబాటుగలవారి; ధైర్య = ధైర్యము అనెడి; వల్లులు = తీగలు; త్రెంపన్ = తెంపివేయుటకు; దర్పకుండు = మన్మథుడు; ఎత్తిన = చేతిలోపట్టుకొన్న; దాత్రము = కొడవలి; అనగన్ = అన్నట్లుగా; అలిగి = కోపించి; కాల = కాలము అనెడి; కిరాతుడు = వేటగాడు; అంధకార = అంధకారము అనెడి; మృగంబు = మృగమును; ఖండింపన్ = నరకుటకు; మెఱయించు = ఝళిపించుతున్న; ఖడ్గము = కత్తి; అనగన్ = అనగా; గగన = ఆకాశము అనెడి; తమాల = చీకటి; వృక్షము = మాను; తూర్పు = తూర్పుదిక్కు; కొమ్మను = కొమ్మ యందు; లలితము = చక్కటివి; ఐ = అయ్యి; మెఱయు = మెరుస్తున్న; పల్లవము = చిగురు; అనగన్ = అన్నట్లుగా; తొగలు = కలువలు.
సంతసిల్లన్ = సంతోషింపగ, వికసించగా; దొంగలు = చోరులు; భీతిల్లన్ = భయపడునట్లు; కడలి = సముద్రము; మిన్నుముట్టి =ఆకాశమును తాకి; కడలు = గొప్ప అలలు; కొనగన్ = కలది అగునట్లు; పొడిచెన్ = ఉదయించెను; శీతకరుడు = చంద్రుడు; భూరి = విశేషముగా; చకోరక = చకోరపక్షులకు; ప్రీతి = సంతోషమును; కరుడు = కలిగించువాడు; జార = విటులకు; భీతిన్ = భయమును; కరుడు = కలిగించువాడు.
భావము:- చకోరపక్షులకు ప్రీతిని, విటులకు భీతిని కలిగిస్తూ చంద్రుడు ఉదయించాడు. అతడు తూర్పుదిక్కనే మగువ ముఖంమీద దీపించే కుంకుమబొట్టా అన్నట్టుగానూ; వియోగుల ధైర్యమనే తీగలను త్రెంచడానికి గర్వంతో మన్మథుడు ఎత్తిన కొడవలా అన్నట్టుగానూ; కాలుడు అనే వేటగాడు అంధకారము అనే మృగాన్ని ఛేదించడం కోసం జళిపించే కరవాలమా అన్నట్టుగానూ; ఆకాశమనే కానుగుచెట్టు యొక్క తూర్పుకొమ్మలో మెరిసే మెత్తని చిగురాకా అన్నట్టుగానూ ఉన్నాడు. అతడిని చూసి కలువలు వికసించాయి. దొంగలు భయపడ్డారు. సముద్రం తరంగాలు ఎత్తి ఆకాశాన్ని అందుకుంది.

తెభా-10.1-1299-క.
ర్పిత తారాధిప పరి
ర్పిత కిరణౌఘమిళిత కలదిశంబై
యేర్పడి కమలభవాండము
ర్పూరపు క్రోవి భంగిఁ నుపట్టె నృపా.

టీక:- దర్పిత = విజృంభించిన; తారాధిప = చంద్రుని యొక్క {తారాధిపుడు - నక్షత్రములకు భర్త, చంద్రుడు}; పరిసర్పిత = పూర్తిగా ఆవరించిన; కిరణ = కిరణముల; ఓఘ = సమూహములతో; మిళిత = కూడి యున్న; సకల = ఎల్ల; దిశంబు = దిక్కులు కలది {దశదిశలు - 1తూర్పుదిక్కు 2పడమరదిక్కు 3దక్షిణముదిక్కు 4ఉత్తరముదిక్కు 5ఈశాన్యమూల 6ఆగ్నేయమూల 7నైఋతిమూల 8వాయవ్యమూల 9పైవైపు 10కిందవైపు}; ఐ = అయ్యి; ఏర్పడి = తయారై; కమలభవాండము = బ్రహ్మాండము {కమలభవాండము - కమలభవ (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కర్పూరపు = కర్పూరపు; క్రోవి = మూస; భంగిన్ = వలె; కనుపట్టెన్ = కనబడెను; నృపా = రాజా.
భావము:- ఓరాజా! విజృంభిస్తున్న నక్షత్ర విభుడైన చంద్రుడి కిరణాల సమూహం నాలుగుప్రక్కలా వ్యాపించగా బ్రహ్మండం ఒక కర్పూర మూసలా కనిపిస్తోంది.

తెభా-10.1-1300-క.
రేయి గోపయుతులై
క్షీరాన్నముఁ గుడిచి రామకృష్ణులు మదిఁ గం
సారంభ మెఱిఁగి యిష్ట వి
హారంబుల నప్రమత్తులై యుండి రిటన్

టీక:- ఆ = అట్టి; రేయి = రాత్రి; గోప = గోపకులతో; యుతులు = కూడినవారు; ఐ = అయ్యి; క్షీరాన్నమున్ = పరవాన్నమును {క్షీరాన్నము - పాలతో ఉడికించిన అన్నము, పరవాన్నము}; కుడిచి = భుజించి; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడులు; మదిన్ = మనసు నందు; కంస = కంసుని యొక్క; ఆరంభమున్ = ప్రయత్నములు; ఎఱిగి = తెలిసి; ఇష్టవిహారంబులన్ = క్రీడాసంచారము లందు; అప్రమత్తులు = జాగరూకత కలవారు; ఐ = అయ్యి; ఉండిరి = ఉన్నారు; ఇటన్ = ఇక్కడ.
భావము:- రామకృష్ణులు ఆ రాత్రి గోపకులతో కలసి పాలబువ్వ తిని కంసుడి ప్రయత్నాలన్నీ మనసున ఎరిగిన వారై, యథేచ్ఛా విహారాలలో ఆ నగరోపవనంలో జాగరూకతతో ఉండి గడిపారు.