పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపికలు యుద్ధవుని గనుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-10.1-1451-వ.
అని మఱియుఁ బెక్కు విధంబుల హరి ప్రభావంబు లుపన్యసించుచు నారేయి గడపి మఱుఁనాడు దధిమథనశబ్దంబు లాకర్ణించుచు లేచి కృతానుష్ఠానుండై యుద్ధవుం డొక్క రహస్యప్రదేశంబున నున్న సమయంబున.
టీక:- అని = అని; మఱియు = ఇంకను; పెక్కు = అనెక; విధంబులన్ = విధములుగ; హరి = విష్ణువు యొక్క; ప్రభావంబులున్ = మహిమలను; ఉపన్యసించుచున్ = పేర్కొనుచు; ఆ = ఆ యొక్క; రేయి = రాత్రి; గడపి = జరిపి; మఱునాడు = తరువాతి దినమున; దధి = పెరుగు; మథన = చిలికెడి; శబ్దంబులు = ధ్వనులు; ఆకర్ణించుచున్ = వినుచు; లేచి = నిద్రలేచి; కృతా = చేయబడిన; అనుష్ఠానుండు = ఆచారములు కలవాడు; ఐ = అయ్యి; ఉద్ధవుండు = ఉద్ధవుడు; ఒక్క = ఒకానొక; రహస్య = సంకేత, ఏకాంత; ప్రదేశంబునన్ = స్థలమునందు; ఉన్నన్ = ఉన్నట్టి; సమయంబునన్ = సమయమునందు.
భావము:- అని ఉద్ధవుడు అనేక విధాల శ్రీకృష్ణుడి మహిమలను గురించి చెప్తూ ఆ రాత్రి గడిపాడు. వేకువనే పెరుగు చిలుకుతున్న చప్పుళ్ళు విని నిద్రలేచాడు. నిత్యానుష్ఠానాలు అన్నీ నెరవేర్చుకున్నాడు. తరువాత ఒక ఏకాంత స్థలంలో ఉన్నాడు. ఆసమయంలో. . .

తెభా-10.1-1452-శా.
"రాజీవాక్షుఁడు సుందరాస్యుఁడు మహోస్కుండు పీతాంబరుం
డాజానుస్థిత బాహుఁ డంబురుహ మాలాలంకృతుం డుల్లస
ద్రాత్కుండలుఁ డొక్క వీరుఁ డిచటన్ రాజిల్లుచున్నాఁడు మా
రాజీవాక్షుని భంగి"నంచుఁ గనిరా రాజాన్వయున్ గోపికల్.

టీక:- రాజీవాక్షుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; సుందర = అందమైన; ఆస్యుడు = ముఖము కలవాడు; మహా = పెద్ద; ఉరస్కుడు = వక్షస్థలము కలవాడు; పీత = పచ్చని; అంబరుండు = వస్త్రములు కలవాడు; ఆజానుస్థిత = మోకాళ్ళవరకు ఉన్న; బాహుండున్ = చేతులు కలవాడు; అంబురుహ = పద్మముల {అంబురుహము - నీట పుట్టినది, పద్మము}; మాల = దండచేత; అలంకృతుండు = అలంకరింపబడినవాడు; ఉల్లసత్ = వికాసము కలిగి; రాజత్ = ప్రకాశించుచున్నట్టి; కుండలుండు = కుండలములు గలవాడు; ఒక్క = ఒకానొక; వీరుడు = శూరుడు; ఇచటన్ = ఇక్కడ; రాజిల్లుచున్నాడు = విలసిల్లుచున్నాడు; మా = మా యొక్క; రాజీవాక్షుని = కృష్ణుని; భంగిన్ = వలె; అంచున్ = అని పలుకుచు; కనిరి = చూసిరి; ఆ = ఆ యొక్క; రాజాన్వయున్ = ఉద్ధవుని {రాజాన్వయుడు - రాజ (చంద్ర) అన్వయుడు (వంశమువాడు), ఉద్ధవుడు}; గోపికల్ = గోపస్త్రీలు.
భావము:- చంద్రవంశస్థు డైన ఉద్ధవుణ్ణి చూసి అక్కడకి వచ్చిన గోపవనితలు “పద్మముల వంటి కన్నులు కలవాడు; అందమైన మోము కలవాడు; విశాలమైన వక్షము కలవాడు; పచ్చని పట్టుబట్టలు కట్టినవాడు; మోకాళ్ళ వరకు వేలాడు చేతులు కలవాడు; కలువల దండలు అలంకరించుకున్న వాడు; మెరుస్తున్న కుండలములు ధరించినవాడు అయిన ఒకానొక వీర పురుష పుంగవుడు మా కృష్ణుడి వలె ఇక్కడ ప్రకాశిస్తున్నాడు” అని అనుకోసాగారు

తెభా-10.1-1453-వ.
కని లజ్జాసహిత హాసవిలోకనంబులు ముఖంబులకుం జెలువొసంగ నిట్లనిరి.
టీక:- కని = చూసి; లజ్జా = సిగ్గుతో; సహిత = కూడిన; హాస = చిరునవ్వుల; విలోకనంబులు = చూపులు; ముఖంబుల్ = ముఖముల; కున్ = కుండలములుగలవాడు; చెలువ = సొగసు; ఒసంగను = కలిగించుచుండగా; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- అలా చూసిన ఆ గొల్లభామినుల వదనాలు సిగ్గుతో కూడిన నవ్వులు చూపులుతో అందాలు చిందుతున్నాయి. వారు ఉద్ధవుడితో ఇలా అన్నారు.

తెభా-10.1-1454-చ.
"ఱుఁగుదు మేము నిన్ను వనజేక్షణమిత్రుఁడ వీవు; కూరిమిన్
మెయుచుఁ దల్లిదండ్రులకు మే లెఱిఁగింపఁ బ్రియుండు పంపఁగా
లెడు భక్తి వచ్చితివి; వారలనైన మనంబులోపలన్
వఁడు శౌరి మేలు; మఱి మాన్యులు రాజున కెవ్వ రిచ్చటన్.

టీక:- ఎఱుగుదుము = తెలిసియున్నాము; ఏము = మేము; నిన్నున్ = నిన్ను; వనజేక్షణ = కృష్ణుని {వనజేక్షణుడు - వన (నీటిలో) జ (పుట్టినది) (పద్మము) వంటి ఈక్షణుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు}; మిత్రుడవు = స్నేహితుడవు; ఈవు = నీవు; కూరిమిన్ = స్నేహము నందు; మెఱయుచున్ = అతిశయించుచు; తల్లిదండ్రుల్ = అమ్మానాన్నల; కున్ = కు; మేలు = కుశలములు; ఎఱిగింపన్ = తెలుపుటకు; ప్రియుండు = మా కిష్టమైన వాడు; పంపగాన్ = పంపించగా; వఱలెడు = చక్కటి; భక్తిన్ = భక్తితో; వచ్చితివి = వచ్చావు; వారలన్ = వారిని; ఐనన్ = అయినైనను; మనంబు = మనసు; లోపలన్ = లో; మఱవడు = మరచిపోడు; శౌరి = కృష్ణుడు {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}; మేలు = మంచిది; మఱి = ఇంక; మాన్యులు = మన్నింపదగినవారు; రాజున్ = రాజు ఐన కృష్ణున; కున్ = కు; ఎవ్వరు = ఎవరున్నారు; ఇచ్చటన్ = ఇక్కడ.
భావము:- “మాకు నీవు తెలుసును. నీవు కమలముల వంటి కన్నులు కల కన్నయ్య నెచ్చెలివి. తన క్షేమ సమాచారాలు తల్లితండ్రులకు చెప్పడం కోసం ఆయన నిన్ను ఇక్కడకి పంపించగా ప్రస్ఫుటమైన భక్తితో వచ్చావు. మా ప్రియుడు ఆ శూరసేన మహారాజు మనవడు తన అమ్మా నాన్నలను కూడా మరచిపోలేదు పోనీలే. ఇంకా ఆయనకు గుర్తుపెట్టుకోదగ్గ వారు ఇక్కడ ఈ వ్రేపల్లెలో మరింకెవరు ఉన్నారుట?

తెభా-10.1-1455-క.
మునివరులైనను బంధుల
సఖ్యము విడువలేరు గాక విడువరే
నిమిత్తసఖ్య మాఁకటి
నిదీరిన నళులు విరులఁ బాయునొ లేదో."

టీక:- ముని = ముని; వరులు = శ్రేష్ఠులు; ఐననున్ = అయినను; బంధుల = బంధువులతోడి; ఘన = మిక్కిలి అధికమైన; సఖ్యమున్ = స్నేహమును; విడువలేరు = వదలలేరు; కాక = కాని; విడువరే = వదలరా, వదలెదరు; అనిమిత్త = ప్రయోజనములేని; సఖ్యమున్ = స్నేహమును; ఆకటిపని = కడుపునిండుట; దీరిన = పూర్తి యైన తరవాత; ఆళులు = తుమ్మెదలు; విరులన్ = పూలను; పాయునోలేదో = విడుచునుకదా.
భావము:- బంధువులతోడి స్నేహానుబంధాన్ని సర్వసంగ పరిత్యాగులైన మహాత్ములు సైతం వదులుకోలేరు. మఱి శ్రీకృష్ణుడు తన జననీజనకులకు ప్రియ మాచరించడంలో వింత ఏముంది. కాని, ఆకలి తీరిన పిదప తుమ్మెదలు పూలను విడవడం లేదా? అలాగే కొందరు ప్రయోజనం తీరిన స్నేహబంధం వదలివేస్తారు కదా.”