పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కేశిని సంహారము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెభా-10.1-1167-సీ.
ఖురపుటాహతిఁ దూలి కుంభినీచక్రంబు-
ణిరాజఫణులకు రువుసేయ
భీషణహేషా విభీషితులై మింట-
మృతాంధు లొండొరు నండఁ గొనఁగఁ
టుల చంచల సటాచ్ఛటల గాడ్పుల మేఘ-
ములు విమానములపై ముసుఁగు పడఁగ
వివృతాస్యగహ్వర విపులదంతంబులు-
ప్రళయాగ్నికీలల గిది మెఱయఁ

తెభా-10.1-1167.1-ఆ.
గాలపాశలీలగా వాల మేపార
వాహ మగుచు గంధవాహగతుల
విజితశక్రపాశి వీర్యపయోరాశి
కేశి వచ్చె మంద క్లేశ మంద.

టీక:- ఖుర = కాలిగొరిజల, గిట్టల; పుటా = ప్లుత, అశ్వగతి; హతి = తాకుడులచే; తూలి = చలించి; కుంభినీచక్రము = భూమండలము; ఫణిరాజ = ఆదిశేషుని; ఫణులు = పడగల; కున్ = కు; బరువు = బరువెక్కువగుటను; చేయన్ = కలుగజేయగా; భీషణ = భయంకరమైన; హేషా = సకిలింతలచేత; విభీషితలు = భయపెట్టబడినవారు; మింటన్ = ఆకాశమునందు; అమృతాంధులు = దేవతలు {అమృతాంధనులు - అమృతము ఆహారముగా కలవారు, దేవతలు}; ఒండొరులన్ = ఒకరినొకరు; అండకొనగ = అండగాచేసికొనగ; చటుల = తీవ్రముగా; చంచల = చలించుచున్న; సటాత్ = జూలు; ఛటల = సమూహముల యొక్క; గాడ్పుల = వాయువులచేత; మేఘములు = మబ్బులు; విమానముల = విమానముల; పైన్ = మీద; ముసుగుపడగన్ = కమ్ముకొనగ; వివృత = తెరవబడిన; అస్య = నోరు అనెడి; గహ్వర = బిలము నందలి; విపుల = పెద్దవైన; దంతంబులు = పళ్ళు; ప్రళయ = ప్రళయకాల మందలి; అగ్ని = అగ్ని యొక్క; కీలల = మంటల; పగిదిన్ = వలె; మెఱయన్ = ప్రకాశింపగా; కాల = యముని; పాశ = పాశము.
లీలగా = వలె; వాలము = తోక; ఏపార = అతిశయించగా; వాహము = గుఱ్ఱము యొక్క; అగుచున్ = రూపము కలవాడు అగుచు; గంధవాహ = గాలి; గతులన్ = వీచెడి విధములుగ; విజిత = గెలువబడిన; శక్ర = ఇంద్రుడు; పాశి = వరుణుడు కలవాడు; వీర్య = వీరత్వము నందు; పయోరాశి = సముద్రము వంటివాడు; కేశి = కేశి; వచ్చెన్ = వచ్చెను; మంద = గొల్లపల్లె; క్లేశము = దుఃఖమును; అంద = పొందగా.
భావము:- కేశి అనే రాక్షసుడు ఇంద్రుడిని, వరుణుడిని మించిన వాడు, శౌర్యానికి సముద్రం లాంటి వాడు. వాడు కంసుని ప్రోత్సాహంతో గుఱ్ఱము రూపు ధరించి వాయువేగంతో నందుని మందలో ప్రవేశించి సంకటం కలిగించాడు. అతని అశ్వగతి వేగంతో కూడిన దిట్టమైన గిట్టల తాకిడికి చలించిన భూమండలం మోస్తున్న ఆదిశేషుని పడగలకు భారమైంది. అతని భీతిగొలిపే సకిలింతలకు మిక్కిలి భయపడిపోయి ఆకాశంలో దేవతలు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. అతను జూలు ఊపిన విసురుకి జనించిన గాలి వలన మేఘాలు చెల్లాచెదురు అయిపోయి, విమానాలను క్రమ్ముకున్నాయి. తెరిచిన అతని నోటి గుహలోని పెద్ద పండ్లు ప్రళయకాలంలోని అగ్నిజ్వాలల మాదిరి మెరిశాయి. అతని తోక యమపాశం లాగా ప్రకాశించింది.

తెభా-10.1-1168-వ.
మఱియును.
టీక:- మఱియును = అంతేకాక.
భావము:- అంతే కాదు . . .

తెభా-10.1-1169-క.
భీణ ఘోటక దానవ
హేషానిర్ఘోషభిన్న హృదయ నిఖిల గో
యోషా పురుషార్భకమై
ఘోము హరి చూడ దైన్యఘోషం బయ్యెన్.

టీక:- భీషణ = భయంకరమైన; ఘోటక = గుఱ్ఱపు రూపున ఉన్న; దానవ = రాక్షసుని; హేషా = సకిలింతల; నిర్ఘోష = అధికమైన ధ్వనిచేత; భిన్న = పగిలిన; హృదయ = గుండెలు కలిగిన; నిఖిల = సమస్తమైన; గో = ఆవులు; యోషా = స్త్రీలు; పురుష = మగవారు; అర్భకము = పిల్లలు కలది; ఐ = అయ్యి; ఘోషము = మంద; హరి = కృష్ణుడు; చూడన్ = చూచుచుండగా; దైన్యఘోషంబు = మొర ఇడెడి ధ్వని కలది; అయ్యెన్ = అయినది.
భావము:- దారుణమైన అశ్వాకారంలో ఉన్న ఆ రాక్షసుడి సకిలింత వినబడేసరికి, అక్కడున్న ఆవులు, దూడలు, స్త్రీలు, పురుషులు, బిడ్డలు అందరి హృదయాలు దద్ధరిల్లాయి. కృష్ణుడు చూస్తుండగానే ఆ గొల్లపల్లె అంతా దీనంగా ఘోషించసాగింది.

తెభా-10.1-1170-వ.
అ య్యవసరంబున.
టీక:- అయ్యవసరంబునన్ = అప్పుడు.
భావము:- అలా అల్లకల్లోలం సృష్టిస్తున్న ఆ సమయంలో కేశి ఇలా అనసాగాడు. . .

తెభా-10.1-1171-ఉ.
"పేల ఘోషగోపకుల బిట్టదలించుట వీరధర్మమా?
కాదు; వ్రజంబులో దనుజస్మరుఁ డే"డని తన్ను రోయు క్ర
వ్యాదునిఁ జూచి గోపకుల డ్డమువచ్చి "నిశాట! యింకఁ బో
రా"ని శౌరి చీరె మృగరాజు క్రియన్ నెదిరించె దైత్యుఁడున్.

టీక:- పేదలన్ = అశక్తులను; ఘోష = మందలోని; గోపకులన్ = గొల్లవారిని; బిట్టు = మిక్కిలిగ; అదలించుట = బెదిరించుట; వీర = వీరులకు; ధర్మమా = న్యాయమా; కాదు = కాదు; వ్రజంబు = మంద; లోన్ = అందు; దనుజఘస్మరుడు = కృష్ణుడు {దనుజఘస్మరుడు - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు}; ఏడి = ఏక్కడ ఉన్నాడు; అని = అని; తన్ను = తనను; రోయు = నిందించెడి; క్రవ్యాదునిన్ = రాక్షసుని {క్రవ్యాదుడు - మాంసమును తిను వాడు, రాక్షసుడు}; చూచి = కనుగొని; గోపకుల్ = గొల్లవారి; కున్ = కి; అడ్డమువచ్చి = అడ్డపడి; నిశాట = రాక్షసుడా {నిశాటుడు - రాత్రించరుడు, రాక్షసుడు}; ఇంకన్ = ఇకమీదట; పోరాదు = పోవుటకు వీలులేదు; అని = అని; శౌరి = కృష్ణుడు {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}; చీరెన్ = పిలిచెను; మృగరాజు = సింహము; క్రియన్ = వలె; ఎదిరించెన్ = ఎదుర్కొనెను; దైత్యుడున్ = రాక్షసుడు.
భావము:- “బలహీనులైన మందలోని గొల్లలను భయపెట్టడం తరిమికొట్టడం నావంటి వీరుడికి ధర్మం కాదు. ఈ గొల్లపల్లెలో దానవహంత కృష్ణుడు ఏడీ, ఎక్కడ” అంటూ తనను తిడుతున్న ఆ అసురుణ్ణి కృష్ణుడు చూసాడు. గోపాలురకు అడ్డంగా వచ్చి శూరుని మనుమడైన కృష్ణుడు “ఓరీ నిశాచరా! ఇంక నువ్వు ఎక్కడకీ పోలేవు” అంటూ సింహంలాగ గర్జించి వాడిని పోరుకి పిలిచాడు. ఆ రక్కసుడు వాసుదేవుని ఎదిరించాడు.

తెభా-10.1-1172-ఆ.
నిష్ఠురోగ్ర సింహ నినదంబుతో నింగి
మ్రింగుభంగి నోరు మిగులఁ దెఱచి
ఱవరాఁగ నతఁడు గాటు దప్పించినఁ
న్నె నెగసి తురగదానవుండు.

టీక:- నిష్ఠుర = కఠినమైన; ఉగ్ర = భయంకరమైన; సింహనినాదంబు = గర్జన; తోన్ = తోటి; నింగి = ఆకాశము; మ్రింగు = మింగివేయునట్టి; భంగిన్ = విధముగ; నోరు = నోటిని; మిగుల = అధికముగ; తెఱచి = తెరుచుకొని; కఱవన్ = కరుచుటకు; రాగన్ = రాగా; అతడు = అతను; కాటు = కరవబడుటను; తప్పించినన్ = తప్పించుకొనగా; తన్నెన్ = కాలితో తన్నెను; ఎగసి = ఎగిరి; తురగదానవుడు = కేశి {తురగదానవుడు - గుఱ్ఱము రూపున గల రాక్షసుడు, కేశి}.
భావము:- ఆ అశ్వరూప రాక్షసుడు కర్కశంగా గట్టిగా సకిలిస్తూ, ఆకాశాన్నే మ్రింగబోతున్నట్లు నోరు పెద్దగా తెరచి, కరవడానికి వచ్చాడు; కృష్ణుడు ఆ పోటు తప్పించుకున్నాడు; వాడు ఎగిరి తన్నాడు.

తెభా-10.1-1173-ఉ.
న్నిన తన్నునం బడక దానవహంత సమీకరంతయై
న్నులఁ గెంపు పెంపెనయ గ్రక్కున ఘోటనిశాటు పాదముల్
న్నె చెడంగఁ బట్టి పడవైచె ధనుశ్శతమాత్రదూరమున్
న్నగడింభమున్ విసరి పాఱఁగవైచు ఖగేంద్రు కైవడిన్.

టీక:- తన్నినన్ = కాలితో తన్నగా; తన్నునన్ = తన్నునకు; పడకన్ = దొరకకుండ; దానవహంత = కృష్ణుడు {దానవహంత - రాక్షసులను హతమార్చు వాడు, విష్ణువు}; సమీకరంత = యుద్ధములో క్రీడించు వాడు; ఐ = అయ్యి; కన్నులన్ = కన్నుల యందు; కెంపు = ఎఱ్ఱదనము; పెంపు = పెరుగుట; ఎనయన్ = పొందగా; గ్రక్కునన్ = చటుక్కున; ఘోటనిశాటున్ = గుఱ్ఱపురూపు రాక్షసుని; పాదముల్ = కాళ్ళు; వన్నె = చక్కదనము; చెడంగన్ = నశించునట్లుగ; పట్టి = పట్టుకొని; పడవైచె = విసిరివేసెను; ధనుః = విల్లుపొడుగులు; శత = వంద అంత; మాత్ర = మేర; దూరమున్ = దూరముగా; పన్నగ = పాము; డింభమున్ = పిల్లను; విసరి = విసిరి; పాఱగవైచు = పారవేసెడి; ఖగేంద్రున్ = గరుత్మంతుని {ఖగేంద్రుడు - పక్షులలో శ్రేష్ఠుడు, గరుత్మంతుడు}; కైవడిన్ = వలె.
భావము:- గుఱ్ఱమురక్కసుడు తన్నిన తన్ను తప్పించుకుని, కృష్ణుడు రాక్షసాంతకుడు రణోత్సాహం వహించాడు. కోపంతో గోపాలకృష్ణుడి కళ్ళు జేవురించాయి. వెంటనే తురగాసురుడి పొంగు అణిగేలా చటుక్కున, వాడి కాళ్ళు పట్టుకుని గరుత్మంతుడు పాముపిల్లను విసిరేయునట్లు, వాడిని నాలుగు వందల మూరల దూరం పారేశాడు.

తెభా-10.1-1174-ఉ.
వైచిన మ్రొగ్గి లేచి వెస వాజినిశాటుఁడు హుంకరించి సం
కోము లేక పైఁ బడిన గోపకులేంద్రుఁడు దిగ్గజేంద్ర శుం
డాటుల ప్రభాబల విడంబకమైన భుజార్గళంబు దో
షారు నోటిలోన నిడెఁ జండఫణిన్ గుహ నుంచుకైవడిన్.

టీక:- వైచినన్ = విసిరివేయగా; మ్రొగ్గి = వాలిపోయి; లేచి = పైకి లేచి నిలబడి; వెసన్ = శీఘ్రముగ; వాజినిశాటుడు = కేశి {వాజినిశాటుడు - గుఱ్ఱపు రూపున ఉన్న రాక్షసుడు, కేశి}; హుంకరించి = హుమ్మని; సంకోచము = జంకు; లేక = లేకుండ; పైన్ = మీద; పడినన్ = పడగా; గోపకులేంద్రుడు = కృష్ణుడు {గోప కులేంద్రుడు - గోపకుల వంశము నందు శ్రేష్ఠుడు, కృష్ణుడు}; దిగ్గజేంద్రము = ఐరావతము {దిగ్గజేంద్రము - దిగ్గజములలో శ్రేష్ఠమైనది, ఐరావతము}; శుండా = తొండమువలె; చటుల = భయంకరమైన; ప్రభా = ప్రభావమును; బల = శక్తి యందు; విడంబకము = పరిహాసము చేయునది; ఐన = అయినట్టి; భుజ = భుజము అనెడి; అర్గళంబు = గడకఱ్ఱను; దోషాచరు = రాక్షసుని {దోషాచరుడు - పాపమునందు మెలగు వాడు, రాక్షసుడు}; నోటి = నోరు; లోన్ = అందు; ఇడెన్ = పెట్టెను; చండ = భయంకరమైన; ఫణిన్ = సర్పమును; గుహన్ = పెద్దబిలములో; ఉంచు = పెట్టెడి; కైవడిన్ = విధముగ.
భావము:- అలా విసరిపారేయడంతో నిశాచరుడు నేలమీద పడి, వేగంగా పైకి లేచి అహంకారంతో హుంకరిస్తూ జంకూగొంకూ లేకుండా కృష్ణుడి మీదకి లంఘించాడు. అప్పుడా యదుకుంజరుడు భయంకర సర్పాన్ని పర్వత గుహలోకి చొప్పించినట్లు, దిగ్గజతొండమువలె బహు బలిష్టమైన తన బాహుదండమును వాడి నోటిలోనికి దూర్చాడు.

తెభా-10.1-1175-శా.
దంభోళిప్రతిమాన కర్కశ మహోద్యద్వామ దోఃస్తంభమున్
శుంల్లీల నఘారి వాని రదముల్ చూర్ణంబులై రాలఁగా
గంభీరంబుగఁ గుక్షిలోఁ జొనిపి వీఁకన్ వృద్ధిఁ బొందించుచున్
గుంభించెం బవనంబు పిక్కటిలఁ దత్కుక్షిన్ నరేంద్రోత్తమా!

టీక:- దంభోళి = వజ్రాయుధముతోటి; ప్రతిమాన = సమానమైన; కర్కశ = కాఠిన్యము గల; మహా = గొప్పగా; ఉద్యత్ = పైకెత్తిన; వామ = ఎడమ; దోఃస్తంభమున్ = చేతిని; శుంభత్ = అధికమైన; లీలన్ = విలాసముతో; అఘారి = కృష్ణుడు {అఘారి - అఘాసురుని శత్రువు, కృష్ణుడు}; వాని = అతని; రదముల్ = దంతములు; చూర్ణంబులు = పొడిపొడిగ; ఐ = అయ్యి; రాలగా = రాలిపోవునట్లుగ; గంభీరంబుగన్ = గొప్పగా; కుక్షి = కడుపు; లోన్ = లోపలికి; చొనిపి = దూర్చి; వీకన్ = ఉత్సాహముతో; వృద్ధిబొందించుచున్ = పెద్దది చేస్తూ; కుంభించెన్ = బంధించెను; పవనంబున్ = ప్రాణవాయువును; పిక్కటిలన్ = వ్యాపించ; తత్ = దాని; కుక్షిన్ = కడుపు; నరేంద్రోత్తమా = మహారాజా.
భావము:- పరీక్షన్మహారాజా! అఘాసురుడిని హరించిన హరి వజ్రాయుధం వలె కఠినమైనది, స్తంభంవలె ఉన్నది అయిన తన ఎడమ చేతిని, ఆ తురగ దైత్యుడి దంతాలు పొడి పొడి అయి రాలిపోయేలాగ, అవలీలగా వాడి కడుపులోనికి జొప్పించాడు. వాడి కడుపు ఉబ్బిపోయేలాగ తన చేతిని అంతకంతకూ పెంచుతూ, వాడి ఊపిరి ఉక్కిరిబిక్కిరి అయ్యేలా నిరోధించాడు.

తెభా-10.1-1176-క.
వాయువు వెడలక నిలిచినఁ
గాయంబు చెమర్పఁ గన్నుఁవ వెలి కుఱుకన్
మాచెడి తన్నుకొనుచును
గూయుచు నశ్వాసురుండు గూలెన్ నేలన్.

టీక:- వాయువు = ఊపిరి; వెడలక = నడవకుండ; నిలిచినన్ = ఆగిపోగా; కాయంబున్ = దేహము; చెమర్పన్ = చలువలు కమ్ముకొనగ; కన్ను = కన్నులు; గవ = రెండును (2); వెలికుఱుకన్ = బయటకు రాగా; మాయ = మాయారూపము; చెడి = చెడిపోయి; తన్నుకొనుచున్ = శరీరము కొట్టుకొనుచు; కూయుచున్ = అరచుచు; అశ్వాసురుండు = గుఱ్ఱపురాక్షసుడు; కూలెన్ = కూలిపోయెను; నేలన్ = నేలమీదకి.
భావము:- ఆ కేశి దానవుడికి ఒంట్లోని గాలి బయటకి పోకపోడంతో ఒళ్ళంతా చెమట పట్టింది. కనుగుడ్లు వెలికి వచ్చాయి. తన మాయలు పనిచేయకపోడంతో వాడు విలవిలా తన్నుకుంటూ పెడబొబ్బలు పెడుతూ నేల మీదకి కూలిపోయాడు.

తెభా-10.1-1177-ఆ.
ఘోటకాసురేంద్రు కుక్షిలోఁ గృష్ణుని
బాహు వధికమైనఁ ట్టలేమిఁ
గిలి దోసపండు గిదిఁ దద్దేహంబు
సుమతీశ రెండు వ్రయ్య లయ్యె.

టీక:- ఘోటకాసురేంద్రు = గుఱ్ఱపురాక్షసుని; కుక్షి = కడుపు; లోన్ = లోపల; కృష్ణుని = కృష్ణుడి యొక్క; బాహువు = చెయ్యి; అధికము = పెద్దది; ఐనన్ = కాగా; పట్టలేమిన్ = పట్టకపోవుటచేత; పగిలి = పగిలిపోయి; దోసపండు = దోసపండు; పగిదిన్ = వలె; తత్ = వాని; దేహంబు = దేహము; వసుమతీశ = రాజా; రెండు = రెండు (2); వ్రయ్యలు = ముక్కలు; అయ్యె = అయ్యెను.
భావము:- ఓ దేశాధీశా! పరీక్షిత్తూ! తురగాసురుడి పొట్టలో కృష్ణుడి చెయ్యి బాగా ఎక్కువగా పెరిగి పోడంతో, పట్టుటకు చోటులేక వాడి దేహం దోసపండులా రెండు ముక్కలు అయిపోయింది.

తెభా-10.1-1178-క.
ళినాక్షుఁడు లీలాగతి
వియముఁ బొందించె నిట్లు వీరావేశిన్
లాశిన్ జగదభినవ
రాశిన్ విజితశక్రపాశిం గేశిన్.

టీక:- నళినాక్షుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; లీలా = విలాసవంతమైన; గతిన్ = విధముగ; విలయము = చావును; పొందించెన్ = చెందించెను; ఇట్లు = ఈ విధముగ; వీర = వీరత్వముచేత; ఆవేశిన్ = ఒళ్ళుతెలియనివానిని; పలలాశిన్ = రాక్షసుని {పలలాశి - మాంసము తినువాడు, రాక్షసుడు}; జగత్ = లోకమునందు; అభినవ = సరికొత్త; బల = బలము యొక్క; రాశిన్ = పోగు కలవానిని; విజిత = గెలువబడిన; శక్ర = ఇంద్రుడు; పాశిన్ = వరుణుడు కలవానిని; కేశిన్ = కేశి అనువానిని.
భావము:- వీరావేశం కలవాడూ, మాంసాహారుడూ, లోకంలో నవనవీన శక్తియుక్తుడూ, ఇంద్ర వరుణులను జయించిన వాడూ అయిన కేశిని దానవుడిని తామరరేకుల వంటి కన్నుల కల కృష్ణుడు అలవోకగా అంతమొందించాడు.