పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కృష్ణుని వ్రేపల్లెకు తరలించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెభా-10.1-137-వ.
అంత వసుదేవుండు దనకుం జేయవలసిన పను లీశ్వరుండైన హరివలన నెఱింగిన వాడు గావున.
టీక:- అంత = అంతట; వసుదేవుండు = వసుదేవుడు; తన = అతని; కున్ = కు; చేయవలసిన = పూర్తిచేయవలసిన; పనులు = కార్యములు; ఈశ్వరుండు = భగవంతుడు; ఐన = అయినట్టి; హరి = విష్ణుమూర్తి; వలనన్ = వలన; ఎఱింగిన = తెలుపబడిన; వాడు = వాడు; కావునన్ = కనుక.
భావము:- అప్పుడు వసుదేవుడు తాను చేయ వలసిన పనులను శ్రీహరి సంకల్పం వలన గ్రహించాడు. కనుక.

తెభా-10.1-138-క.
పురిటి యిల్లు వెలువడి
పానిఁ దరలించుకొనుచుఁ ఱచెద ననుచున్
రూపింప నందుభార్యకుఁ
బా యగుచు యోగమాయ బ్రభవించె నృపా!

టీక:- ఆ = ఆ; పురిటి = ప్రసవము జరిగిన; ఇల్లు = నివాసమును; వెలువడి = బయటపడి; పాపనిన్ = చంటిపిల్లవానిని; తరలించుకొనుచున్ = తీసుకొని పోతూ; పఱచెదను = వేగముగా వెళ్ళెదను; అనుచున్ = అని భావించుచు; రూపింపన్ = నిశ్చయించుకొనగా; నందు = నందుని యొక్క; భార్య = భార్య; కున్ = కు; పాప = బిడ్డ; అగుచున్ = ఔతు; యోగమాయ = యోగమాయాదేవి; ప్రభవించెన్ = పుట్టెను; నృపా = రాజా.
భావము:- పరీక్షిత్తు మహారాజా! అప్పుడు శిశురూపి అయిన విష్ణుని తీసుకొని, పురిటిల్లు దాటించి త్వరత్వరగా తీసుకుపోవాలని గ్రహించాడు. అదే సమయంలో వ్రేపల్లె లోని నందుని భార్య యశోదాదేవి యోగమాయను ఆడబిడ్డగా ప్రసవించింది.

తెభా-10.1-139-వ.
అ య్యవసరంబున
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:- ఆ సమయంలో

తెభా-10.1-140-క.
బిడ్డనిఁ గరముల ఱొమ్మున
డ్డంబుగ బట్టి పదము ల్లన యిడుచున్
డ్డనఁ గావలి వారల
యొడ్డు గడచి పురిటిసాల యొయ్యన వెడలెన్.

టీక:- బిడ్డని = చంటిపిల్లవానిని; కరములన్ = చేతులతో; ఱొమ్మునన్ = వక్షస్థలమున; అడ్డంబున్ = అడ్డముగా; పట్టి = పట్టుకొని; పదములు = అడుగులు; అల్లనన్ = మెల్లగా; ఇడుచున్ = వేయుచు; జడ్డనన్ = తటాలున; కావలి = కాపలా; వారలన్ = వాళ్ళ యొక్క; ఒడ్డు = అడ్డమును; గడచి = దాటి; పురిటిసాలన్ = ప్రసవగృహమును; ఒయ్యనన్ = చటుక్కున; వెడలెన్ = బయటపడెను.
భావము:- అప్పుడు, వసుదేవుడు పసిబిడ్డను చక్కగా చేతులతో ఎత్తుకొని, రొమ్ముకు అడ్డంగా హత్తుకొన్నాడు. చప్పుడు చేయకుండ మెల్ల మెల్లని అడుగలు వేస్తూ, గభాలున కావలి వాళ్ళు ఉండే ఆవరణ దాటాడు. చటుక్కున పురిటిల్లు నుంచి బయట పడ్డాడు.

తెభా-10.1-141-వ.
అంత నట.
టీక:- అంతన్ = అప్పుడు; అట = అక్కడ.
భావము:- అక్కడ, వ్రేపల్లెలో.

తెభా-10.1-142-క.
నందుని సతికి యశోదకుఁ
బొందుగ హరి యోగమాయ పుట్టిన మాయా
స్పంమున నొక్క యెఱుఁగమి
క్రందుకొనియె నూరివారిఁ గావలివారిన్.

టీక:- నందుని = నందుని యొక్క; సతి = భార్య; కిన్ = కి; యశోద = యశోద; కున్ = కు; పొందుగన్ = చక్కగా; హరి = విష్ణుమూర్తి యొక్క; యోగమాయ = యోగమాయాదేవి; పుట్టినన్ = జన్మించగా; మాయా = మాయ యొక్క; స్పందమునన్ = ప్రభావము వలన; ఒక్క = ఒకానొక విధమైన; ఎఱుగమి = మైకము; క్రందుకొనియెన్ = కమ్ముకొనెను; ఊరి = వ్రేపల్లెలోని; వారిన్ = వారిని; కావలి = కాపలా; వారిన్ = వాళ్ళను.
భావము:- అక్కడ, నందుడి భార్య యశోదకి యోగమాయ చక్కగా పుట్టింది. వెంటనే ఆ వ్రేపల్లెలో ఊరివారిని, కావలివారిని అందరిని విష్ణుమాయ ఆవరించి చిత్రమైన మైకం కమ్మింది.

తెభా-10.1-143-వ.
అప్పుడు చప్పుడు కాకుండఁ దప్పుటడుగు లిడుచు, నినుప గొలుసుల మెలుసులు వీడిన దాలంబులు మహోత్తాలుండైన బిడ్డనికి నడ్డంబు గాక కీలూడి వీడిపడ, నరళంబులు విరళంబు లయిన సరళంబులగు మొగసాలలం గడచి, పాఁపఱేఁడు వాకిళ్ళు మరల మూయుచుఁ బడగ లెడగలుగ విప్పి, కప్పి, యేచి, కాచికొని వెంట నంటి రాఁగ దూఁగి నడచునెడ.
టీక:- అప్పుడు = ఆ సమయమునందు; చప్పుడు = శబ్దము; కాకుండన్ = అవ్వకుండగ; తప్పుటడుగులు = ఎత్తెత్తిఅడుగులు; ఇడుచున్ = వేస్తూ; ఇనపగొలుసుల = ఇనపసంకెళ్ళ; మెలుసులు = సంబంధములు, మెలికలు; వీడినన్ = విడిపోగా; తాలంబులున్ = బీగములు; మహా = మిక్కిలి; ఉత్తాలుండు = గొప్పవాడు; ఐన = అయిన; బిడ్డన్ = పిల్లవాని; కిన్ = కి; అడ్డంబు = అడ్డము; కాక = కాకుండగా; కీలు = కీళ్ళు; ఊడి = వదలివేసి; వీడిపడన్ = విడిపోవుటతో; అరళంబులు = తలుపులు; విరళంబులు = ఎడము కలవి, తెఱచుకున్నవి; అయినన్ = కాగా; సరళంబులు = ప్రతి బంధకములు లేనివి; అగు = ఐన; మొగసాలన్ = సింహద్వారములను; గడచి = దాటి; పాపఱేడు = ఆదిశేషుడు {పాపఱేడు - పాప (సర్పము)లకు ఱేడు (రాజు), ఆదిశేషుడు}; వాకిళ్ళున్ = ద్వారములను; మరల = మళ్ళా; మూయుచున్ = మూసివేయుచు; పడగలు = పడగలను; ఎడగలుగన్ = విశాల మగునట్లు; విప్పి = విడదీసి; కప్పి = గొడుగువలె కప్పి; ఏచి = అతిశయించి; కాచికొని = కనిపెట్టుకొని ఉండి; వెంటనంటి = వెనుకనే; రాగా = వస్తుండగా; తూగి =తూలుతూ, వెడలి; నడచున్ = వెళ్ళుతున్న, పోవుచున్న; ఎడన్ = సమయము నందు.
భావము:- వసుదేవుడు పురిటింటిని దాటి, తప్పటడగులు వేస్తూ చడి చప్పుడు కాకుండా వస్తున్నాడు. విష్ణుమాయ వలన కాళ్ళకి చేతులకి ఉన్న ఇనపగొలుసులు, సంకెళ్ళు అతుకులు వీడి ఊడిపోయాయి. ఆ మహామహిమాన్వితుని సంకల్పానికి అడ్డు రాలేక తలుపుల తాళాలు కీళ్ళు ఊడి పడిపోయాయి. ద్వారాలు వాటంతట అవే తెరుచుకొన్నాయి. వసుదేవుడు మెల్ల మెల్లగా ముందున్న చావళ్ళు అన్ని దాటాడు. అక్కడెక్కడా దాక్కుందా మన్నా ఏమి లేని తిన్నని పొడుగైన చావళ్ళు. అయినా శ్రీహరి మాయ వలన ఎవరు చూడలేదు. వసుదేవుడు ఇలా చావళ్ళు దాటుతుంటే ఆదిశేషుడు ఆ ద్వారాలని మూస్తూ వెనువెంట వస్తున్నాడు. పడగలు విప్పి ఆ బాలునికి గొడుగులా పట్టి వెనుకనించి ఎలాంటి ఆపద రాకుండా కాస్తూ అనుసరిస్తున్నాడు. వసుదేవుడు ముందుకు వెళుతూ ఉన్నాడు.

తెభా-10.1-144-క.
శౌరికిఁ దెరువొసఁగెఁ బ్ర
కాశోద్ధత తుంగ భంగ లిత ధరాశా
కా యగు యమున మును సీ
తేశునకుఁ బయోధి త్రోవ యిచ్చిన భంగిన్.

టీక:- ఆ = ఆ; శౌరి = వసుదేవుని {శౌరి - శూరిని పుత్రుడు, వసుదేవుడు}; కిన్ = కి; తెరువు = దారి; ఒసంగెన్ = ఇచ్చెను; ప్రకాశ = బాగుగా కనబడుతు; ఉద్ధతన్ = అతిశయించిన; తుంగ = పొడవైన; భంగ = అలలు; కలిత = కలిగిన; ధర = భూమి; ఆశ = దిక్కులు; ఆకాశ = ఆకాశము కలది; అగు = ఐన; యమున = యమునానది; మును = ఇంతకు పూర్వము; సీతేశున్ = శ్రీరాముని {సీతేశుడు - సీతాదేవి యొక్క భర్త, రాముడు}; కున్ = కు; పయోధి = సముద్రము {పయోధి - పయస్ (నీటి)కి నిధి, కడలి}; త్రోవ = దారి; ఇచ్చిన = ఇచ్చిన; భంగిన్ = విధముగా.
భావము:- శూరుని పుత్రుడైన వసుదేవుడు నవజాత శిశువుని రేపల్లెకు తరలిస్తు యమున దగ్గరకు వచ్చాడు. ఎగిసిపడుతున్న పెద్దపెద్ద అలలతో భూమినుండి ఆకాశందాకా నల్దిక్కులను కమ్ముకుంటు ప్రవహిస్తూ ఉన్న, ఆ నది పూర్వకాలంలో శ్రీరామునికి లంకాపురం వెళ్ళటానికి సముద్రుడు త్రోవ యిచ్చినట్లే, ఆ శిశు రూపి శ్రీకృష్ణ భగవానునికి యమున దారి యిచ్చింది.