పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కృష్ణుడు శిశురూపి యగుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-135-వ.
అని యిట్లు పలికి యీశ్వరుం డా రూపంబు విడిచి.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలికి = చెప్పి; ఈశ్వరుండు = శ్రీహరి; ఆ = ఆ; రూపంబున్ = ఆకృతిని; విడిచి = వదలివేసి.
భావము:- ఈ విధంగా చెప్పిన పిమ్మట విష్ణుమూర్తి ఆ బృహద్రూపాన్ని విడిచి పెట్టాడు.

తెభా-10.1-136-క.
ఱెప్ప లిడక తలిదండ్రులు
ప్పకఁ దనుఁ జూడ మాయఁ నరి లలితుఁడై
ప్పు డటు గన్న పాపని
యొప్పున వేడుకలు జేసె నొకకొన్ని నృపా!

టీక:- ఱెప్పలు = కనురెప్పలు; ఇడకన్ = మూయకుండగ; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; తప్పకన్ = విడువకుండగ; తనున్ = అతనిని; చూడన్ = చూచుచుండగా; మాయన్ = మహిమతో; తనరి = అతిశయించి; లలితుడు = మిక్కిలి కోమలుడు; ఐ = అయ్యి; అప్పుడ = అప్పుడే; అటు = అలా; కన్న = ప్రసవించబడిన; పాపని = బిడ్డ; ఒప్పునన్ = వలె; వేడుకలు = వినోదపు చేష్టలు; చేసెన్ = చేసెను; ఒక = ఒకానొక; కొన్ని = కొన్ని; నృపా = రాజా.
భావము:- పరీక్షిన్మహారాజా! ఈ విధంగా విష్ణుమూర్తి చెప్పిన పిమ్మట. దేవకీవసుదేవులు ఆశ్చర్యచకితులై కన్నార్పకుండ చూస్తుండగా హరి, మాయను ఆవరింపజేసుకొని ఆ దివ్య రూపాన్ని వదలి, అప్పుడే పుట్టిన పసిబిడ్డ రూపం ధరించాడు. కేరుకేరు మనడం లాంటి కొన్ని వేడుకలు చేసాడు.