పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కృష్ణ బలరాముల క్రీడాభివర్ణన
తెభా-10.1-289-సీ.
జానుభాగముల హస్తములు వీడ్వడఁ జేసి-
నిగుడు చల్లనఁ బోదు రింత నంత
నవ్వల పయ్యెద లంది జవ్వాడుదు-
రాల క్రేపుల తోఁక లలమి పట్టి
విడువ నేరక వాని వెనువెంట జరుగుదు-
రప్పంకముల దుడు కడర జొత్తు
రెత్తి చన్నిచ్చుచో నిరుదెసఁ బాలిండ్లు-
చేతులఁ బుడుకుచుఁ జేఁపు గలుగ
తెభా-10.1-289.1-తే.
దూటుదురు గ్రుక్క గ్రుక్కకు దోర మగుచు
నాడుదురు ముద్దుపలుకు లవ్యక్తములుగఁ
గరము లంఘ్రులు నల్లార్చి కదలుపుదురు
రామకృష్ణులు శైశవరతులఁ దగిలి.
టీక:- జానుభాగములన్ = మోకాళ్ళపైనుండి; హస్తములున్ = చేతులు; వీడ్వడన్ = విడిచివచ్చునట్లుగ; చేసి = చేసి; నిగుడుచున్ = నిక్కుతూ; పోదురు = వెళ్ళెదరు; ఇంతనంతన్ = కొంచెము దూరము; అవ్వల = అమ్మల యొక్క; పయ్యెదలు = పైటకొంగులు; అంది = అందుకొని; జవ్వాడుదురు = ఊగులాడెదరు; ఆలక్రేపుల = ఆవుదూడల; తోకలున్ = తోకలను; అలమి = ఒడిసి (గట్టిగా); పట్టి = పట్టుకొని; విడువన్ = వదల; నేరక = లేక; వాని = వాటి; వెనువెంటన్ = వెనకాతలనే; జరుగుదురు = జారుతారు; ఆ = ఆ; పంకములన్ = బురదలలో; దుడుకు = దుడుకుతనము; అడరన్ = అతిశయించగా; చొత్తురు = దూరుదురు; ఎత్తి = ఎత్తుకొని; చన్నున్ = చనుబాలు; ఇచ్చుచోన్ = ఇచ్చునప్పుడు; ఇరు = రెండు (2); దెసన్ = పక్కల; పాలిండ్లున్ = స్తనములను; చేతులన్ = చేతులతో; పుడుకుచున్ = పిసుకుతూ.
దూటుదురు = పీల్చుకొనెదరు; గ్రుక్కగ్రుక్క = ప్రతిగుక్క; కున్ = కు; తోరము = అధిక రుచికరముగ; అగుచున్ = ఔతూ; ఆడుదురు = పలికెదరు; ముద్దు = ఇంపైన; పలుకులు = మాటలు; అవ్యక్తములుగన్ = చక్కగతెలియకుండునట్లు; కరములు = చేతులను; అంఘ్రులున్ = కాళ్ళు; అల్లార్చి = ఊపుతూ; కదలుపుదురు = కదుపుతారు; రామ = బలరాముడు; కృష్ణులున్ = కృష్ణుడులు; శైశవ = బాల; రతున్ = క్రీడలందు; తగిలి = ఆసక్తులై.
భావము:- బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు పసితనంలో క్రమంగా బాల్యక్రీడలతో గోకులంలో అందరకు సంతోషం కలిగిస్తున్నారు. మోకాళ్ళపై చేతులు వూని పట్టి నెమ్మదిగా లేచి నిలబడతారు. తూలుతారు మళ్ళా నిలబడతారు. అటునిటు నడుస్తారు. లేగ ఆవుదూడల తోకలు పట్టుకొంటారు, అవి పరుగెడుతుంటే, ఆ తోకలు వదలిపెట్టలేక వాటి వెనుక జరుగుతు ఉంటారు. తల్లులు పాలు ఇస్తుంటే రెండు చేతులతోను పాలిండ్లు రెండు తడుముతు గుక్కగుక్కకు చేపుకు వచ్చేలా పాలు త్రాగుతుంటారు. వచ్చీరాని ముద్దుమాటలు పలుకుతారు. చేతులు కాళ్ళు కదుపుతు పసిక్రీడలలో నాట్యాలు ఆడేవారు.
తెభా-10.1-290-క.
తడ వాడిరి బలకృష్ణులు
దడ వాడిరి వారిఁ జూచి తగ రంభాదుల్
దడవాడి రరులు భయమునఁ
దడ వాడిరి మంతనములఁ దపసులు వేడ్కన్.
టీక:- తడవు = చిరకాలం; ఆడిరి = క్రీడించిరి; బల = బలరాముడు; కృష్ణులున్ = కృష్ణుడు; తడవు = కొంతసేపు; ఆడిరి = నాట్యము లాడిరి; వారిన్ = వారిని; చూచి = చూసి; తగన్ = తగినట్లుగ; రంభ = రంభ; ఆదుల్ = మున్నగువారు; తడవాడిరి = తడబడిరి; అరులు = శత్రువులు; భయమునన్ = భీతిచేత; తడవు = చాలాసేపు; ఆడిరి = మాట్లాడుకొనిరి; మంతనములన్ = రహస్యముగా; తపసులు = ఋషులు; వేడ్కన్ = కుతూహలముతో.
భావము:- బాల్యక్రీడలలో బలరామ కృష్ణులు ఆలా ఎంతోసేపు ఆడుతుంటే చూసి, రంభ మొదలైన అప్సరసలు ఆకాశంలో ఆనందంగా ఆడుతున్నారు. అరిషడ్వర్గం అనే శత్రువులు పెచ్చుమీరినవారు దుర్మార్గులు. వారు భయంతో తడబడ్డారు. ఋషులు లోకానికి మంచి దనే సంతోషంతో రహస్యంగా ముచ్చట్లలో ఓలలాడారు.
తెభా-10.1-291-సీ.
తల లెత్తి మెల్లనఁ దడవి యాడెడు వేళ-
పన్నగాధీశులపగిదిఁ దాల్తు;
రంగసమ్మృష్ట పంకాంగరాగంబుల-
నేనుగుగున్నల నెత్తువత్తు;
రసమంబులైన జవాతిరేకమ్ముల-
సింగంపుఁగొదమల సిరి వహింతు;
రాననంబుల కాంతు లంతకంతకు నెక్కు-
బాలార్క చంద్రుల పగిదిఁ దోతు;
తెభా-10.1-291.1-తే.
రెలమిఁ దల్లుల చన్నుఁబా లెల్లఁ ద్రావి
పరమయోగోద్భవామృత పానలీల
సోలి యెఱుగని యోగుల సొంపు గందు
రా కుమారులు జనమనోహారు లగుచు.
టీక:- తలలు = శిరస్సులను; ఎత్తి = పైకెత్తి; మెల్లనన్ = మెల్లగా; తడవియాడెడి = పాకెడి; వేళన్ = సమయమునందు; పన్నగాధీశుల = సర్పరాజుల {పన్నగాధీశులు - ఆదిశేషుడు అనంతుడు వాసుకి మున్నగు సర్పరాజులు}; పగిదిన్ = విధమును; తాల్తురు = ధరింతురు; అంగ = అవయవములకు; సమ్మృష్ట = బాగా పూసుకొన్న; పంక = బురద యనెడి; అంగరాగంబులన్ = గంధపుపూతలచే; ఏనుగు = ఏనుగు; గున్నలన్ = పిల్లల; ఎత్తువత్తురు = సాటియగుదురు; అసమంబులు = సాటిలేని; ఐన = అయినటువంటి; జవ = జవసత్వాదుల; అతిరేకమ్ములన్ = అధిక్యములచేత; సింగపు = సింహపు; కొదమల = పిల్లల; సిరిన్ = మేలిమిని; వహింతురు = పొందెదరు; ఆననంబుల = మోముల; కాంతులు = వికాసములు; అంతంతకున్ = అంతకంతకు; ఎక్కు = ఏక్కువగుతు; బాల = అప్పుడే ఉదయించిన; అర్క = సూర్యబింబము; చంద్రుల = చంద్రబింబముల; పగిదిన్ = వలె; తోతురు = కనబడుదురు; ఎలమిన్ = చక్కగా; తల్లుల = తల్లుల యొక్క.
చన్నుబాలు = స్తన్యములు; ఎల్లన్ = అన్ని; త్రావి = తాగి; పరమ = సర్వోత్కృష్టమైన; యోగ = బ్రహ్మనిష్ఠ వలన; ఉద్భవ = పుట్టిన; అమృత = ఆనందామృతమును; పాన = తాగిన; లీలన్ = విధముగ; సోలి = మైమరచి; ఎఱుగని = తెలియని; యోగుల = యోగుల; సొంపున్ = ఆనందమును; కందురు = పొందెదరు; ఆ = ఆ; కుమారులు = పిల్లలు; జన = ప్రజల; మనః = మనసులను; హారులు = దోచుకొనువారు; అగుచున్ = ఔతూ.
భావము:- అలా బలభద్ర కృష్ణులు బాల్యక్రీడలలో నేలపై ప్రాకుతు మెల్లగా తలలెత్తి ఆడుకుంటు ఉంటే, ఆదిశేషుడు వంటి సర్పరాజులు పడగెత్తి ఆడుతున్నట్లు కనిపిస్తారు. ఆటల్లో ఒంటినిండ మట్టి అంటినప్పుడు ఏనుగు గున్నలలా గోచరిస్తారు. కుప్పిగంతులు వేసేటప్పుడు సాటేలేని జవసత్వాలతో సింహం పిల్లలులా కనిపిస్తారు. రోజు రోజుకి వారి ముఖాలలోని తేజస్సు పెరుగుతు ఉదయిస్తున్న సూర్య చంద్రులు లాగ కనబడతారు. తల్లుల చనుబాలన్నీ త్రాగి నిద్ర కూరుకు వస్తుంటే, చక్కటి యోగసాధనతో కలిగిన అనుభవం అనే అమృతాన్ని ఆస్వాదిస్తున్న యోగీశ్వరుల వలె గోచరిస్తున్నారు, వారి లీలలు వీక్షిస్తున్న వ్రేపల్లెవాసులకు తన్మయత్వం కలుగుతోంది.
తెభా-10.1-292-క.
చూడని వారల నెప్పుడుఁ
జూడక లోకములు మూఁడు చూపులఁ దిరుగం
జూడఁగ నేర్చిన బాలక
చూడామణి జనుల నెఱిఁగి చూడఁగ నేర్చెన్.
టీక:- చూడని = భక్తిలేక తనని లెక్కచేయని; వారలన్ = వారిని; ఎప్పుడును = ఏ సమయము నందును; చూడక = దయచూడకుండ; లోకములున్ = లోకములు {ముల్లోకములు - 1భూలోకము 2స్వర్గలోకము 3పాతాళలోకము}; మూడున్ = మూడింటిని; చూపులన్ = తన ఆజ్ఞ ప్రకారము; తిరుగన్ = నడచునట్లుగ; చూడగన్ = చేయుట; నేర్చిన = తెలిసిన; బాలక = బాలురలో; చూడామణి = శ్రేష్ఠుడు (తలపైని మణివలె); జనులన్ = చుట్టుపక్కల వారిని; ఎఱిగి = ఆనమాలుపట్టి; చూడగన్ = చూచుటను; నేర్చెన్ = నేర్చుకొనెను.
భావము:- ఊర్థ్వ, అధో, భూలోకాలు మూటిని తన కనుసన్నలలో నడుపే ఆ శ్రీహరి, భక్తిలేక తనని లెక్కచేయని వారి ఎడల దయచూపడు. అట్టి శ్రీహరి శైశవశ్రేష్ఠు డైన కృష్ణుడుగా కళ్ళు తిప్పుతు చుట్టుపక్కలవారిని చూసి గుర్తుపట్ట నారంభించాడు.
తెభా-10.1-293-క.
నగవుల నవిద్య పోఁడిమి
నగుబాటుగఁ జేయనేర్చు నగవరి యంతన్
నగుమొగముతోడ మెల్లన
నగుమొగముల సతులఁ జూచి నగనేర్చె నృపా!
టీక:- నగవులన్ = నవ్వులతో; అవిద్య = మాయల యొక్క; పోడిమి = సమర్థత; నగుబాటుగ = పరిహాసముగ; చేయన్ = చేయగలుగుట; నేర్చు = తెలిసిన; నగవరి =పరిహాస వేది; అంతన్ = అప్పుడు; నగు = నవ్వు; మొగము = మోము; తోడన్ = తోటి; మెల్లనన్ = మృదువుగ; నగుమొగముల = చిరునవ్వులు కల; సతులన్ = ఇంతులను; చూచి = కనుగొని; నగన్ = నవ్వుట; నేర్చెన్ = నేర్చుకొనెను; నృపా = రాజా.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! మహావిష్ణువు చిరునవ్వు నవ్వితే ఆత్మజ్ఞానము కాని లౌకిక విద్యలను దట్టమైన అజ్ఞానం నవ్వులపాలై, జ్ఞానం పుట్టుకు వస్తుంది. అంతటి పరదైవము మానవ బాలకృష్ణునిగా తనను చూసి నవ్వుతున్న గోపకాంతలను చూసి నవ్వటం నేర్చాడు.
తెభా-10.1-294-క.
అవ్వల నెఱుఁగక మువ్వురి
కవ్వల వెలుఁగొందు పరముఁ డర్భకుఁడై యా
యవ్వలకు సంతసంబుగ
నవ్వా! యవ్వా! యనంగ నల్లన నేర్చెన్.
టీక:- అవ్వలన్ = జననులు, ఇతరమైనది; ఎఱుగక = అసలులేకుండ; మువ్వురి = త్రిమూర్తుల {త్రిమూర్తులు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు}; కున్ = కు; అవ్వల = అతీతముగ; వెలుగొందు = ప్రకాశించెడి; పరముడు = అతీతమైన భగవంతుడు; అర్భకుడు = పిల్లవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; అవ్వలు = తల్లుల; కున్ = కు; సంతసంబుగన్ = సంతోషము కలుగునట్లుగ; అవ్వా = అమ్మ; అవ్వా = అమ్మ; అనంగన్ = అనుటను; అల్లనన్ = మెల్లగా; నేర్చెన్ = నేర్చుకొనెను.
భావము:- బ్రహ్మ విష్ణు మహేశ్వరులగు త్రిమూర్తులకు అతీతంగా ప్రకాశించే శ్రీమన్నారాయణుడు జన్మలు లేని వాడు గనుక తనకు అమ్మ అంటు ఎవరు లేరు. జగత్తు అంతటికి తనే అమ్మ. అంతటి పరమపురుషుడు యశోదమ్మ కొడుకై గోపెమ్మలు అందరికి ఆనందం కలిగేలా అమ్మా అమ్మా అనటం నేర్చాడు.
సర్వకారణమై నిష్కారణమై వెలుగు పరబ్రహ్మము ఆత్మావైపుత్రానామాసీత్ అని శ్రుతి కనుక జగత్తునకు మాతృస్థానమైన తానే పుత్రరూపమై జన్మించి అమ్మా అమ్మా అనసాగాడు. అవ్వ అవ్వ అని వేసిన పంచకంచే మాతృత్వ విలువ చెప్పబడుతోందా? ఆదిపరాశక్తితో అబేధం చెప్పబడుతోందా?
తెభా-10.1-295-క.
అడుగులు వే గలిగియు రెం
డడుగులనే మన్నుమిన్ను నలమిన బాలుం
డడుగిడఁ దొడఁగెను శాత్రవు
లడుగులు సడుగులును వదలి యడు గవనిఁబడన్.
టీక:- అడుగులు = కాళ్ళు; వేగలిగియున్ = వేయిగలిగినను; రెండు = రెండు (2); అడుగులనే = అడుగులతోనే; మన్నున్ = భూమండలము; మిన్నున్ = ఆకాశములను; అలమిన = ఆక్రమించిన; బాలుండు = పిల్లవాడు; అడుగిడన్ = అడుగులువేయుట; తొడగెన్ = మొదలిడెను; శాత్రవుల = శత్రువుల యొక్క; అడుగులు = అడుగులువేయుట; సడుగులును = కీళ్ళును; వదలి = వదులైపోయి; అడుగు = క్రింది; అవనిన్ = నేలపై; పడన్ = వేస్తుండగా.
భావము:- “సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్” అనగా విష్ణుమూర్తి సహస్రాక్షుడు, సహస్రశీర్షుడు, సహస్రపాదుడు. అలా వేయి అడుగులు కలిగిన వాడు. ఇక్కడ వేయి, సహస్రం అంటే అనంతమని గ్రహించదగును. వామనావతారుడై బలిచక్రవర్తి నుండి మూడడుగుల భూమి యాచించి, రెండు అడుగులలో భూమిని ఆకాశాన్ని ఆవరించిన వాడు. అట్టి పరమాత్మ ఇలా శ్రీకృష్ణబాలకుడై తప్పటడుగులు వేయ నారంభించాడు. ఆయన అడుగులు వేయటం చూసి దుష్టులు కాళ్ళు కీళ్ళు జారిపోయి అధమ బుద్ధులు, సణుగుళ్ళు వదిలేసి క్రింద నేలపై పడి అణగిపోయారు.