పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కాళియుని పూర్వకథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెభా-10.1-702-వ.
అనిన విని “మునీంద్రా! యేమి కారణంబునఁ గాళియుండు భుజగనివాసం బైన రమణకద్వీపంబు విడిచె? నతం డొక్కరుండును గరుడున కేమి తప్పుఁ దలంచె?” నని నరవరుం డడిగిన మునివరుం డిట్లనియె.
టీక:- అనినన్ = అని చెప్పగా; విని = వినినవాడై; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా; యేమి = ఏ; కారణంబునన్ = నిమిత్తమై; కాళియుండు = కాళియసర్పరాజు; భుజగ = పాములకు; నివాసంబు = ఉనికిపట్టు; ఐన = అయిన; రమణక = రమణక మనెడి; ద్వీపంబు = ద్వీపమును {ద్వీపము - సప్తద్వీపములలోనిది}; విడిచెన్ = వదలిపెట్టెను; అతండు = అతను; ఒక్కరుండును = ఒక్కడు; గరుడున్ = గరుత్మంతుని; కిన్ = కి; ఏమి = ఏమి; తప్పు = అపకారము; తలంచెను = తలపెట్టెను; అని = అని; నరవరుండు = రాజు, పరీక్షిత్తు; అడిగినన్ = అడుగగా; ముని = మునులలో; వరుండు = ఉత్తముడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:- అలా శుకముని చెప్పగానే పరీక్షిన్మహారాజు ఇలా అడిగాడు. “మునీంద్రా! పాములకు నివాసమైన రమణకద్వీపాన్ని కాళీయుడు ఎందుకు వదలిపెట్టాడు? అతడొక్కడూ గరుత్మంతునికి ఏమి అపచారం చేసాడు.” అప్పుడు శుకయోగి ఇలా అన్నాడు.

తెభా-10.1-703-సీ.
"ర్పభీరువులైన నులెల్ల నెలనెల-
రసభక్ష్యములు వృక్షముల మొదల
ర్పంబులకుఁ బెట్ట, ర్పంబులును మును-
ర్పాంతకుఁడు దమ్ముఁ జంప కుండఁ
బ్రతిమాసమును దమ భాగ భక్ష్యంబు లా-
క్షిరాజున కిచ్చి బ్రతుకు చుండ,
విషవీర్యదుర్మదావిష్టుఁడై కాళియుఁ-
హికులాంతకుని పా పహరించి

తెభా-10.1-703.1-తే.
యీక తనపాలి బలి భాగ మెల్లఁ దినిన
విని ఖగేంద్రుఁడు కోపించి "వీని తలలు
చీఱి చెండాడి భోగంబు చించివైచి
ప్రాణములఁ బాపి వచ్చెదఁ ట్టి"యనుచు.

టీక:- సర్ప = పాములవలన; భీరువులు = భయపడువారు; ఐన = అయిన; జనులు = ప్రజలు; ఎల్లన్ = అందరు; నెలనెల = ప్రతిమాసమునందు; సరస = రసవంతములైన; భక్ష్యములు = భోజన పదార్థములు; వృక్షముల = చెట్ల; మొదలన్ = మొదళ్ళవద్ద; సర్పంబుల్ = పాముల; కున్ = కోసము; పెట్టన్ = పెడుతుండగా; సర్పంబులును = పాములు; మును = పూర్వము; సర్పాంతకుడు = గరుత్మంతుడు {సర్పాంతకుడు - పాములకు యముని వంటి వాడు, గరుత్మంతుడు}; తమ్మున్ = వాటిని; చంపకుండన్ = చంపకుండ ఉండుటకు; ప్రతి = ప్రతి ఒక్క; మాసమునున్ = నెలయందు; తమ = వాటి పాలునుండి; భాగ = ఒకవంతు; భక్ష్యంబుల్ = తినుబండారములను; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పక్షిరాజున్ = గరుడుని; కిన్ = కు; ఇచ్చి = సమర్పించి; బ్రతుకుచుండన్ = జీవించుచుండగా; విష = తన విషపు; వీర్య = అధిక ప్రభావము వలన; దఃర్ = చెడ్డ; మద = గర్వము; ఆవిష్టుడు = ఆవేశించినవాడు; ఐ = అయ్యి; కాళియుడు = కాళియుడు; అహికులాంతకుని = గరుత్మంతుని {అహికులాంతకుడు - అహి (సర్పముల) కుల (సమూహమునకు) అంతకుడు (యమునివంటివాడు), గరుడుడు}; పాలున్ = వంతు, భాగమును; అపహరించి = దొంగిలించి.
ఈకన్ = ఈయకపోవుటచేత; తన = అతని యొక్క; పాలి = వంతునకువచ్చిన; భాగము = ఆహార భాగమును; ఎల్లను = అంతటిని; తినిన = భక్షించగా; విని = తెలిసికొని; ఖగేంద్రుడు = గరుత్మంతుడు {ఖగేంద్రుడు - ఖగము (పక్షి)లందు ఇంద్రుడు (శ్రేష్ఠుడు), గరుడుడు}; కోపించి = ఆగ్రహము పొందినవాడై; వీని = ఇతని; తలలు = పడగలను; చీఱి = చీల్చేసి; చెండాడి = ఎగురగొట్టి; భోగంబున్ = దేహమును; చించివైచి = ముక్కలుచేసి; ప్రాణములన్ పాపి = చంపేసి; వచ్చెదన్ = వెనుకకు వచ్చెదను; పట్టి = పట్టుకొని; అనుచు = అని భావించుచు.
భావము:- “ప్రజలు అందరూ పూర్వం పాములు అంటే ఉన్న భయంతో నెల నెలా మధురమైన పదార్థాలను పాములకు నైవేద్యాలుగా చెట్ల మొదట్లో పెట్టి వెళ్ళేవారు. గరుత్మంతుడు తమను చంపకుండా ఉండటానికి, తమ భాగాలకు వచ్చిన పదార్థాలలో కొంత ప్రతీ మాసం ఖగరాజుకు కానుకగా సమర్పించేవారు. అలా సర్పరాజులు ధైర్యంగా బ్రతుకుతూ ఉండేవారు. కాళీయుడు మాత్రం ఒకసారి తన విషం చాలా గొప్పదని దురహంకారంతో మదించిపోయి, గరుత్మంతుని భాగం ఎగగొట్టి అంతా తానే తినేసాడు. ఇది విన్న గరుత్మంతుడు కోపించి “వీడి తలలు చీల్చి చెండాడి పడగలు చించి ప్రాణాలు తీసి వస్తాను.” అంటూ బయలుదేరాడు.

తెభా-10.1-704-క.
క్షీణ కనకసన్నిభ
క్షయుగోద్భూత ఘోర వమాన మహా
విక్షేప కంపితానే
క్షోణిధరేంద్రుఁ డగుచు రుడుఁడు వచ్చెన్.

టీక:- అక్షీణ = పెద్దవైన {అక్షీణము - క్షీణము (తక్కువ) కానిది, పెద్దది}; కనక = బంగారము; సన్నిభ = వంటి; పక్ష = రెక్కల; యుగ = జంటచేత; ఉద్భూత = పుట్టిన; ఘోర = భయంకరమైన; పవమాన = గాలి యొక్క; మహా = అధికమైన; విక్షేప = వీచుటచేత, ఎగపుచేత; కంపిత = చలించిపోయెడి; అనేక = పెక్కులైన; క్షోణిధర = పర్వత; ఇంద్రుడు = శ్రేష్ఠములు గలవాడు; అగుచున్ = ఔతూ; గరుడుడు = గరుత్మతుడు; వచ్చెన్ = వచ్చెను.
భావము:- బంగారురంగులో మెరిసిపోతూ ఉన్న గరుత్మంతుని పెద్ద పెద్ద రెక్కలనుండి పుట్టిన బ్రహ్మాండమైన వాయువు మహాఘోరమై ఎన్నో పర్వతాలనే కంపింప జేసింది. అంతటి మహావేగంతో గరుత్మంతుడు కాళీయుడి మీదకు వచ్చాడు.

తెభా-10.1-705-ఉ.
చ్చిన సర్పవైరిఁ గని వ్రాలక లేచి మహాఫణావళుల్
విచ్చి దృగంచలంబుల నవీనవిషాగ్నికణంబు లొల్కఁగా
నుచ్చలదుగ్రజిహ్వలు మహోద్ధతిఁ ద్రిప్పుచు నూర్పు లందుఁ గా
ర్చిచ్చెగయంగఁ బాఱి కఱచెన్ విహగేంద్రు నహీంద్రుఁ డుగ్రతన్.

టీక:- వచ్చినన్ = అలారాగా; సర్పవైరిన్ = గరుడుని; కని = చూసి; వ్రాలక = వెనుదీయకుండగ; లేచి = పైకిలేచి; మహా = గొప్ప; ఫణా = పడగల; ఆవళుల్ = సమూహమును; విచ్చి = విప్పదీసుకొని; దృక్ = కళ్ళ; అంచలంబుల్ = కొనలనుండి; నవీన = సరికొత్త; విష = విషము అనెడి; అగ్ని = నిప్పు; కణంబుల్ = రవ్వలు; ఒల్కగన్ = రాలగా; ఉత్ = మిక్కిలిగా; చలత్ = ఆడుతున్న; ఉగ్ర = భయంకరమైన; జిహ్వలు = నాలుకలు; మహా = మిక్కుటమైన; ఉద్ధతిన్ = గర్వముతో; త్రిప్పుచున్ = తిప్పుతూ; ఊర్పులు = శ్వాసముల; అందున్ = లోనుండి; కాఱ్చిచ్చు = దావాగ్ని; ఎగయన్ = చెలరేగునట్లుగా; పాఱి = పరుగెట్టుకు వెళ్ళి; కఱచెన్ = కాటువేసెను; విహగేంద్రున్ = గరుడుని {విహగేంద్రుడు - విహగము (పక్షి)లందు ఇంద్రుడు (శ్రేష్ఠుడు), గరుడుడు}; అహి = సర్పములలో; ఇంద్రుడు = గొప్పవాడు; ఉగ్రతన్ = భీకరముగా.
భావము:- అలా వస్తున్న గరుత్మంతుడిని చూసి కాళీయుడు పడగలు వంచుకుని పారిపోలేదు. కాళీయుడు తన బ్రహ్మాండమైన పడగ విప్పి కళ్ళ నుండి విషాగ్ని కణాలు రాలుస్తూ, నాలుకలు సాచి, మహా వేగంతో తల తిప్పుతూ, ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలలో నుండి జ్వాలలు ప్రసరింప జేస్తూ, ముందుకు దూకి గరుత్మంతుడిని కాటువేశాడు.

తెభా-10.1-706-క.
చిన భుజగము రదములు
విఱుగఁగ వదనముల విషము వెడలఁగ శిరముల్
ఱియలుగ నడిచె గరుడుఁడు
ఱిమి కనకరుచులు గలుగు న డాఱెక్కన్.

టీక:- కఱచినన్ = కాటువేయగా; భుజగము = పాము; రదములు = కోరలు; విఱుగగన్ = ముక్కలుకాగా; వదనములన్ = నోళ్ళనుండి; విషమున్ = విషము; వెడలగ = పడగా; శిరముల్ = పడగలు; పఱియలుగన్ = బద్దలుకాగ; అడిచెన్ = కొట్టెను; గరుడుడు = గరుత్మంతుడు; తఱిమి = తరుముతూ; కనక = బంగారు; రుచులు = ఛాయలు; కలుగు = కలిగిన; తన = అతని యొక్క; డాన్ = డాపలి, ఎడమ; ఱెక్కన్ = రెక్కతోటి.
భావము:- కాళీయుడు అలా కాటు వేయగానే గరుత్మంతుడు విజృంభించాడు కాళీయుడిని తరుముకుంటూ వెళ్ళి బంగారు రంగులు చిమ్ముతున్న తన ఎడమ రెక్కతో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు కాళీయుని కోరలు విరిగిపోయాయి. నోటి వెంట రక్తం క్రక్కుకున్నాడు, తలలు చితికి చీలికలై పోయాయి.

తెభా-10.1-707-వ.
ఇట్లహికులారాతి చేత వ్రేటుపడి వెఱచి పఱతెంచి కాళియుం డీ గభీరంబైన మడుఁగుఁ జొచ్చె; మఱియు నొక్కవిశేషంబు గలదు.
టీక:- ఇట్లు = ఇలా; అహికులారాతి = గరుడుని {అహి కులారాతి - సర్పవంశమునకు శత్రువు, గరుడుడు}; చేతన్ = వలన; వ్రేటుపడి = దెబ్బతిని; వెఱచి = భయపడి; పఱతెంచి = పారిపోయి; కాళియుండు = కాళీయుడు; ఈ = ఈ యొక్క; గభీరమైన = మిక్కిలి లోతైన; మడుగున్ = మడుగును; చొచ్చెన్ = చేరెను; మఱియున్ = ఇంక; ఒక్క = ఒక; విశేషంబు = ప్రత్యేక కారణము; కలదు = ఉన్నది.
భావము:- ఇలా గరుత్మంతుడి చేత దెబ్బలు తిన్న కాళీయుడు భయపడి పారిపోయి ఈ లోతైన మడుగులో ప్రవేశించాడు. ఇక్కడ ఒక విశేషం కూడా ఉంది.

తెభా-10.1-708-సీ.
మున్ను సౌభరి యను ముని యీ హ్రదంబునఁ-
పము జేయుచు నుండ రణిలోన
నాఁకలిగొని పన్నగాంతకుఁ డొకనాడు-
నుదెంచి యందుల లచరేంద్రు
నొడిసి భక్షించిన నున్న మీనము లెల్ల-
ఖిన్నంబులై వగఁ గ్రిస్సి యున్నఁ
జూచి యా మునిరాజు శోకించి కోపించి-
రుడుఁడు నేడాది గాఁగ నిందుఁ

తెభా-10.1-708.1-తే.
జొచ్చి మీనంబులను మ్రింగఁజూచెనేనిఁ
చ్చుఁగావుత మని యుగ్రశాప మిచ్చెఁ
గాళియుం డొక్కఁడా శాపథ నెఱుంగు
నితర భుజగంబు లెవ్వియు నెఱుఁగ వధిప!

టీక:- మున్ను = పూర్వము; సౌభరి = సౌభరి; అను = అనెడి; ముని = ఋషి; ఈ = ఈ యొక్క; హ్రదంబునన్ = మడుగునందు; తపమున్ = తపస్సు; చేయుచుండన్ = చేయుచుండగా; ధరణి = భూలోకము; లోనన్ = అందు; ఆకలిగొని = ఆకలేసి; పన్నగాంతకుడు = గరుడుడు {పన్నగాంతకుడు - పన్నగము (పాము) లకు అంతకుడు (యముని వంటి వాడు), గరుడుడు}; ఒక = ఒకానొక; నాడున్ = దినమున; చనుదెంచి = వచ్చి; అందులన్ = దానిలో; జలచరేంద్రున్ = చేపలరాజును; ఒడిసి = ఒడుపుగాపట్టుకొని; భక్షించినన్ = తినివేయగా; ఉన్న = మిగిలిన; మీనములు = చేపలు; ఎల్లన్ = అన్ని; ఖిన్నంబులు = దుఃఖించుచున్నవి; ఐ = అయ్యి; వగన్ = విచారముతో; క్రిస్సి = చిన్నబోయి; ఉన్నన్ = ఉండగా; చూచి = కనుగొని; ఆ = ఆ యొక్క; ముని = మునులలో; రాజు = శ్రేష్ఠుడు; శోకించి = బాధపడి; కోపించి = ఆగ్రహించి; గరుడుడు = గరుత్మంతుడు; నేడు = ఈదినము; ఆదిగాగాన్ = మొదలుకొని; ఇందున్ = దినిని; చొచ్చి = ప్రవేశించి.
మీనంబులను = చేపలను; మ్రింగన్ = తినవలెనని; చూచెనేని = యత్నించినచో; చచ్చుగావుతము = మరణించుగాక; అని = అని; ఉగ్ర = భయంకరమైన; శాపమున్ = శాపమును; ఇచ్చెన్ = పెట్టెను; కాళియుండు = కాళీయుడు; ఒక్కడు = ఒకడుమాత్రమే; ఆ = ఆ; శాప = శాపము యొక్క; కథన్ = వృత్తాంతమును; ఎఱుంగున్ = తెలిసి ఉండెను; ఇతర = అన్యములైన; భుజగంబులు = పాములు; ఎవ్వియున్ = ఏవికూడ; ఎఱుంగవు = ఎఱుగవు; అధిప = మహారాజ.
భావము:- పూర్వము సౌభరి అనే ముని ఈ మడుగులో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. గరుత్మంతుడు ఒకనాడు ఆకలివేసి, ఈ మడుగు దగ్గరకు వచ్చాడు. ఇందులో ఉన్న చేపలరాజును పట్టుకుని చంపి తిన్నాడు. మిగిలిన చేపలన్నీ దుఃఖంతో ఉసూరుమంటూ ఏడుస్తూ ఉంటే, ఆ మహర్షి వాటి శోకం చూసి, చాలా బాధపడ్డాడు. అతడు కోపంతో “ఈ నాటి నుండి గరుత్మంతుడు వచ్చి ఇందులో ఉన్న చేపలను మ్రింగడానికి ప్రయత్నించా డంటే వెంటనే చచ్చిపోతాడు” అని భయంకరమైన శాపం ఇచ్చాడు. కాళీయుడు ఒక్కడికే ఈ శాపం గురించి తెలుసు. మిగిలిన పాములకు తెలియదు.

తెభా-10.1-709-వ.
అది కారణంబుగాఁ గాళియుం డా మడుఁగు జొచ్చియున్న, గో మనుజ రక్షణార్థంబు కృష్ణుం డతని వెడలించె; నిట్లు దివ్య గంధాంబర సువర్ణ మణిగణ మాలికాలంకృతుండయి, మడుఁగు వెడలివచ్చిన మాధవుం గని, ప్రాణలాభంబులం బొందిన యింద్రియంబులం బోలె, యశోదారోహిణీ సమేతలయిన గోపికలును, నంద సునందాదులయిన గోపకులును మూర్ఛలం బాసి, తేఱి తెప్పఱిలి, లేచి పరమానందంబులం బొందిరి; బలభద్రుండు తమ్ముని యాలింగనంబుఁ జేసె; నప్పుడు.
టీక:- అది = దాని; కారణంబుగాన్ = నిమిత్తముచేత; కాళియుండు = కాళీయుడు; ఆ = ఆ ప్రసిద్ధమైన; మడుగున్ = మడుగును; చొచ్చి = చేరి; ఉన్నన్ = ఉండుటచేత; గో = గోవులను; మనుజ = మానవులను; రక్షణా = కాపాడుట; అర్థంబున్ = కోసము; కృష్ణుండు = కృష్ణుడు; అతనిన్ = అతనిని; వెడలించెన్ = వెడలగొట్టెను; ఇట్లు = ఈ విధముగ; దివ్య = బహుగొప్ప; గంధ = పరిమళ లేపనములు; అంబర = వస్త్రములు; సువర్ణ = బంగారపు; మణి = రత్నాల; గణ = సమూహముచేత; మాలిక = హారములచేతను; అలంకృతుండు = అలంకరింపబడినవాడు; అయి = ఐ; మడుగున్ = మడుగునుండి; వెడలివచ్చిన = బయటకు వచ్చిన; మాధవున్ = కృష్ణుని; కని = చూసి; ప్రాణలాభంబులన్ = తిరిగి దక్కిన ప్రాణములు; పొందిన = పొందినట్టి; ఇంద్రియంబులున్ = ఇంద్రియముల; పోలెన్ = వలె; యశోదా = యశోదాదదేవి; రోహిణీ = రోహిణీదేవిలతో; సమేతలు = కూడినవారు; ఐన = అయిన; గోపికలును = గోపికాస్త్రీలు; నంద = నందుడు; సునంద = సునందుడు; ఆదులు = మొదలగువారు; అయిన = ఐన; గోపకులును = గొల్లలు; మూర్ఛలన్ = బాధా పరవశు లగుట; పాసి = తొలగి; తేఱి = తేరుకొని; తెప్పఱిల్లి = స్తిమితపడి; లేచి = పైకిలేచి; పరమానందంబులన్ = మిక్కిలి సంతోషములను; పొందిరి = పొందిరి; బలభద్రుండు = బలరాముడు; తమ్మునిన్ = తమ్ముడిని; ఆలింగనంబు = కౌగలించుకొనుట; చేసెన్ = చేసెను; అప్పుడు = ఆ సమయమునందు.
భావము:- అందుచేత, కాళీయుడు ఈ మడుగులో ప్రవేశించి ఉంటున్నాడు. కృష్ణుడు గోవులను గోపాలకులను రక్షించడానికి, అతనిని అక్కడ నుండి వెళ్ళగొట్టాడు. ఈ విధంగా దివ్యగంథాలు, వస్త్రాలు, మణిహారాలు అలంకరించుకుని మాధవుడు మడుగులో నుంచి బయటకు వచ్చాడు. అలా మడుగు నుండి వచ్చిన కృష్ణుని చూడగానే ఇంద్రియాలకు ప్రాణాలు వచ్చినట్లు ఆ బృందావనంలోని ప్రజలు అందరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. యశోద రోహిణుల తోపాటు గోపికలు; నందుడు, సునందుడూ మొదలైన గోపకు లందరూ మూర్ఛల నుంచి తేరుకుని తెప్పరిల్లి లేచి పరమానందం పొందారు. బలరాముడు తమ్ముడిని కౌగలించుకున్నాడు.

తెభా-10.1-710-క.
ఱంకెలు వైచె వృషభము ల
హంకారముతోడ; లేఁగ ట్టి ట్టుఱికెం;
బొంముల నొప్పె ధేనువు;
లంకురితము లయ్యె దరువు లా హరిరాకన్.

టీక:- ఱంకెలు = గట్టి అరుపులు; వైచెన్ = అరచినవి; వృషభములు = ఎద్దులు; అహంకారము = గర్వము; తోడన్ = తోటి; లేగలు = దూడలు; అట్టిట్టు = అటునిటు; ఉఱికెన్ = పరుగులు పెట్టినవి; పొంకములన్ = పొందికలతో; ఒప్పెన్ = చక్కగా ఉన్నవి; ధేనువులు = ఆవులు; అంకురితములు = చిగురించినవి; అయ్యెన్ = అయినవి; తరువులు = చెట్లు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; హరి = కృష్ణుడు; రాకన్ = వచ్చుటచేత.
భావము:- కాళింది మడగు నుండి కృష్ణుడు వెలికి వచ్చిన సంతోషంతో, ఆంబోతులు రంకెలు వేసాయి; లేగదూడలు ఆనందంతో అటూ ఇటూ గంతులు వేశాయి; ఆవులు పొంగిపోయాయి; చెట్లు చిగురించాయి.

తెభా-10.1-711-క.
"నీ సుతుఁడహిచే విడివడె
నీ సురుచిర భాగ్యమహిమ నిశ్చల"మనుచున్
భూసురులు సతులుఁ దారును
భాసురవచనముల నందుఁ లికి రిలేశా!

టీక:- నీ = నీ యొక్క; సుతుడు = కొడుకు; అహి = పాము; చేన్ = చేతిలోనుండి; విడివడె = బయటపడెను; నీ = నీ యొక్క; సు = మంచి; రుచిర = మేలైన; భాగ్య = అదృష్టము యొక్క; మహిమ = ప్రభావము; నిశ్చలము = చలనము లేనిది; అనుచున్ = అని; భూసురులు = బ్రాహ్మణులు {భూసురులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; సతులున్ = స్త్రీలు; తారును = వారు; భాసుర = ప్రసిద్ధములైన; వచనములన్ = మంచి మాటలతో; నందున్ = నందుని; పలికిరి = కీర్తించిరి; ఇలేశా = రాజా {ఇలేశుడు - ఇల (భూమి)కి ఈశుడు, రాజు}.
భావము:- “ఓ రాజా! బ్రాహ్మణులు తమ భార్యలతో కలసి నందుని ఉద్దేశించి నీ కొడుకు పాము నోటి నుండి బయటపడ్డాడు. నీది గొప్ప మహద్భాగ్యము. ఇక దానికి తిరుగు లేదు.” అని అభినందించి ఆశీర్వదించారు .

తెభా-10.1-712-శా.
"నిన్నా యుగ్ర భుజంగమంబు గఱవన్ నీ వాపదం బొందుచున్
న్నేమంటి తనూజ! యోడవు గదా నా కూన! నా తండ్రి! రా
న్నా"యంచు శిరంబు మూర్కొని నిజాంకాగ్రంబుపై నిల్పుచున్
న్నీ రొల్కఁగఁ గౌగలించెఁ దనయున్ గారాముతోఁ దల్లి దాన్.

టీక:- నిన్నున్ = నిన్ను; ఆ = ఆ యొక్క; ఉగ్ర = భయంకరమైన; భుజంగమంబు = పాము; కఱవన్ = కాటువేయగా; నీవున్ = నీవు; ఆపదన్ = ప్రమాదమును; పొందుచున్ = చెందుతు; నన్నున్ = నన్ను; ఏమి = ఏమి; అంటి = అడిగితివి; తనూజ = పుత్రుడా {తనూజుడు - తనువున జనించినవాడు, పుత్రుడు}; ఓడవు = భయపడలేదు; కదా = కదా; నా = నా; కూన = కొడుకా; నా = నా; తండ్రి = నాయనా; రావు = రమ్ము; అన్నా = అయ్యా; అంచున్ = అనుచు; శిరంబున్ = తలను; మూర్కొని = ముద్దాడి; నిజ = తన; అంకాగ్రంబు = ఒడి; పైన్ = మీద; నిల్పుచున్ = ఉంచుకొనుచు; కన్నీరు = కన్నీళ్ళు; ఒల్కగాన్ = కారుతుండగా; కౌగలించెన్ = ఆలింగనము చేసుకొనెను; తనయున్ = పుత్రుని; గారాము = గారాబము; తోన్ = తోటి; తల్లి = తల్లి; తాన్ = తాను.
భావము:- యశోద కృష్ణుణ్ణి తన ఒడిలో కూర్చుండ పెట్టుకుని “నా తండ్రీ! నా బాబూ! నిన్ను ఆ భయంకరమైన పాము కరుస్తూ ఉంటే, ఆపదలో చిక్కుపడినప్పుడు నా కోసం ఏమని విలపించావు నాయనా! బెంబేలు పడలేదు కదా” అంటూ కన్నీళ్ళతో గట్టిగా కౌగలించుకుని గారాబం చేసింది.