Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ఆవుల మేపుచు విహరించుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-602-సీ.
కచోట మత్తాళి యూధంబు జుమ్మని-
మ్రోయంగ జుమ్మని మ్రోయుచుండు
నొకచోటఁ గలహంసయూధంబు గూడి కేం-
కృతులు జేయంగఁ గేంకృతులు జేయు
నొకచోట మదకేకియూధంబు లాడంగ-
స్తాబ్జములు ద్రిప్పి యాడఁ దొడఁగు
నొకచోట వనగజయూధంబు నడవంగ-
యముతో మెల్లన డవఁజొఁచ్చుఁ

తెభా-10.1-602.1-ఆ.
గ్రౌంచ చక్ర ముఖర గము లొక్కొకచోటఁ
లుక వానియట్ల లుకుఁ గదిసి
పులుల సింహములను బొడగని యొకచోటఁ
ఱచు మృగములందుఁ ఱచు గూడి.

టీక:- ఒక = ఒకానొక; చోటన్ = స్థలమునందు; మత్త = మదించిన; ఆళి = తుమ్మెదల; యూధంబు = సమూహము; జుమ్మ్ = జుమ్మ్; అని = అనుచు; మ్రోయంగన్ = ధ్వని చేయుచుండగా; జుమ్మ్ = జుమ్మ్; అని = అనుచు; మ్రోయుచుండున్ = ధ్వని చేయుచుండును; ఒక = ఒకానొక; చోటన్ = స్థలమునందు; కలహంస = శ్రేష్ఠమైన హంసల; యూధంబున్ = సమూహములుగా; కూడి = కూడి; కేంకృతులు = కేం అనెడి ధ్వనులు; చేయంగన్ = చేయుచుండగా; కేంకృతులు = కేం అనెడి ధ్వనులు; చేయున్ = చేయును; ఒక = ఒకానొక; చోటన్ = ప్రదేశమునందు; మద = మదించిన; కేకి = నెమళ్ళ; యూధంబులున్ = సమూహములు; ఆడంగన్ = నాట్యముచేయుచుండగా; హస్త = చేతులు అనెడి; అబ్జములున్ = పద్మములను; త్రిప్పి = ఆడించి; ఆడన్ = నాట్యమాడ; తొడగెన్ = మొదలిడును; ఒక = ఒకానొక; చోటన్ = స్థలమునందు; వన = అడవి; గజ = ఏనుగుల; యూధంబున్ = సమూహము; నడవంగన్ = నడచుచుండగా; నయము = మృదుత్వము; తోన్ = తోటి; మెల్లన = మెల్లగా; నడవన్ = నడచుట; చొచ్చున్ = ఆరంభించును.
క్రౌంచ = క్రౌంచ పక్షలు; చక్ర = చక్రవాక పక్షులు; ముఖర = మున్నగునవి; ఖగములు = పక్షులు; ఒక్కొక్క = ఒక్కొక్క; చోటన్ = చోట; పలుకన్ = కూయుచుండగా; వాని = వాటి; అట్లన్ = వలెనె; పలుకున్ = కూయును; కదిసి = చేరి; పులుల = పెద్ద పులుల; సింహములను = సింహములను; పొడగని = కనుగొని; ఒక = ఒకానొక; చోటన్ = ప్రాంతమున; పఱచు = పరుగెట్టును; మృగముల్ = జంతువుల; అందున్ = తోటి; తఱచున్ = పలుమారు; కూడి = కలసి.
భావము:- శ్రీకృష్ణ భగవానుడు వనవిహారం చేస్తూ ఒకచోట మదించిన తుమ్మెదలు జుంజుమ్మని ఎగురుతూ ఉంటే తాను కూడా వాటి తోపాటు ఝంకారం చేయసాగాడు; మరొకచోట కలహంస పంక్తులు క్రేంకారాలు చేస్తూంటే తాను కూడా క్రేంకారాలు చేసాడు; ఇంకొకచోట మదించిన నెమళ్ళు నాట్యం చేస్తుంటే తాను కూడా తామరపూల వంటి చేతులు త్రిప్పుతూ నాట్యం చేసాడు; వేరొకచోట మదపుటేనుగుల గుంపు మంద మందంగా నడుస్తూ ఉంటే తాను కూడా వాటి వలె మెల్ల మెల్లగా నడవసాగాడు; అలాగే ఒకొక్కచోట క్రౌంచపక్షులు చక్రవాకపక్షులు మొదలైనవి కూతలు పెడుతుంటే వాటి ననుసరించి తాను రెట్టించి కూతలు పెట్టాడు; ఒకచోట పులులు సింహాలు లంఘిస్తూ ఉంటే తాను కూడా ఆ మృగాల తోపాటు దూకుతూ పరుగులు తీసాడు.

తెభా-10.1-603-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- ఇంకా

తెభా-10.1-604-సీ.
"రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ!-
మ్ము భగీరథరాజతనయ!
రా సుధాజలరాశి! రా మేఘబాలిక!-
మ్ము చింతామణి! మ్ము సురభి!
రా మనోహారిణి! రా సర్వమంగళ!-
రా భారతీదేవి! రా ధరిత్రి!
రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి!-
మ్ము మందాకిని! రా శుభాంగి!"

తెభా-10.1-604.1-ఆ.
నుచు మఱియుఁ గలుగు నాఖ్యలు గల గోవు
డవిలోన దూరమందు మేయ
నగభీరభాషఁ డునొప్పఁ జీరు నా
భీరజనులు బొగడఁ బెంపు నెగడ.

టీక:- రా = రమ్ము; పూర్ణచంద్రిక = పూర్ణచంద్రిక; రా = రమ్ము; గౌతమీగంగ = గౌతమీగంగ; రమ్ము = రమ్ము; భగీరథరాజతనయ = భగీరథరాజతనయ; రా = రమ్ము; సుధాజలరాశి = సుధాజలరాశి; రా = రమ్ము; మేఘమాలిక = మేఘమాలిక; రమ్ము = రమ్ము; చింతామణి = చింతామణి; రమ్ము = రమ్ము; సురభి = సురభి; రా = రమ్ము; మనోహారిణి = మనోహారిణి; రా = రమ్ము; సర్వమంగళ = సర్వమంగళ; రా = రమ్ము; భారతీదేవి = భారతీదేవి; రా = రమ్ము; ధరిత్రి = ధరిత్రి; రా = రమ్ము; శ్రీమహాలక్ష్మి = శ్రీమహాలక్ష్మి; రా = రమ్ము; మందమారుతి = మందమారుతి; రమ్ము = రమ్ము; మందాకిని = మందాకిని; రా = రమ్ము; శుభాంగి = శుభాంగి.
అనుచున్ = అని; మఱియున = ఇంకను; కలుగు = ఉన్న; ఆఖ్యలు = పేర్లు; కల = కలగిన; గోవులు = పశువులు; అడవి = అడవి; లోనన్ = అందు; దూరము = దూరము; అందున్ = అందు; మేయన్ = గడ్డితినుచుండగా; ఘన = గొప్ప; గభీర = గంభీరమైన; భాషన్ = గొంతుతో; కడున్ = మిక్కిలి; ఒప్పన్ = చక్కగా; చీరున్ = పిలిచును; ఆభీర = యాదవ; జనులు = ప్రజలు; పొగడన్ = కీర్తించుచుండగా; పెంపున్ = గొప్పదనముతో; నెగడన్ = అతిశయించగా.
భావము:- ఇలా రావే ఓ పూర్ణచంద్రికా! రామ్మా గౌతమీగంగ! రావే భాగీరథీతనయా! ఇటు రా సుధాజలరాశి! రావమ్మ ఓ మేఘబాలిక! ఇలా రామ్మా చింతామణి! రామ్మా ఓ సురభి! రావే మనోహారిణీ! రమ్ము సర్వమంగళ! రా భారతీదేవీ! ఇటు రా ధరిత్రీ! రావమ్మా శ్రీమహాలక్ష్మీ! రావే మందమారుతి! రమ్ము మందాకిని! ఇలా రా శుభాంగీ! అంటు తన మేఘగర్జన లాంటి కంఠస్వరంతో అడవిలో దూర ప్రాంతాలకు పోయిన గోవులను వాటి పేరు పెట్టి పేరుపేరునా పిలుస్తున్నాడు. బహుచక్కటి ఆ పలుకుల గాంభీర్యానికి, మాధుర్యానికి ఆనందించి గోకులంలోని ఆభీరజనులు ఎంతో మెచ్చుకుంటున్నారు.
గోవులు (జ్ఞానులు నామ రూప జ్ఞానాలు) మేస్తూ అడవిలో (సంసారాటవిలో) దూరదూరాల్లోకి దారితప్పి వెళ్ళి పోయాయి. శ్రీకృష్ణుడు గొల్లపిల్లలను (పసిమనసు లంత స్వచ్ఛమైన సిద్ధులను) చల్దులు తింటో (మననం చేస్తూ) ఉండ మని చెప్పి గోపాల బాలుడు బయలుదేరాడు ఇదిగో ఇలా, శ్రీకృష్ణ తత్వ ఆవిష్కరణ వెల్లడిస్తూ బమ్మెర వారు బ్రహ్మాండంగా అలతి పొలతి పదాలతో అలరించాడు.

తెభా-10.1-605-క.
కాంతార విహారమ్ముల
శ్రాంతుండై గోపకాంకయుఁడగు నన్నన్
సంతుష్టిఁ బొందఁజేయు ని
రంర కరచరణ మర్శనాదుల నధిపా!

టీక:- కాంతార = అడవి యందలి; విహారమ్ములన్ = సంచారములచేత; శ్రాంతుండు = అలసినవాడు; ఐ = అయ్యి; గోప = గొల్లవాని; అంక = ఒడి యందు; శయనుండు = పండుకొనువాడు; అగున్ = ఐన; అన్నన్ = అన్నను; సంతుష్టిన్ = సంతోషమును; పొందజేయున్ = కలుగజేయును; నిరంతర = ఎడతెరిపి లేకుండ; కర = చేతులు; చరణ్ = కాళ్ళు; మర్శన = ఒత్తుట; ఆదులన్ = మున్నగువానివలన; అధిపా = రాజా.
భావము:- ఓ రాజా! పరీక్షిత్తు! బలరాముడు అడవిలో తిరిగి తిరిగి ఒక్కక్క సారి అలసిపోయి ఆ గొల్లబాలుర తొడల మీద తల పెట్టుకుని విశ్రాంతి తీసుకునేవాడు. అప్పుడు కృష్ణుడు అన్నగారి వద్దకు చేరి ఆయన కాళ్ళు, చేతులు ఒత్తి అలసట పోగొట్టి సంతృష్టి పరచేవాడు.

తెభా-10.1-606-క.
పాడుచు నాడుచు ముచ్చట
లాడుచు నొండొరులఁ దాఁకు నాప్తులఁ గని బి
ట్టాడుచుఁ జేతులు వ్రేయుచుఁ
గ్రీడింతురు నగుచు బలుఁడుఁ గృష్ణుఁడు నొకచోన్.

టీక:- పాడుచున్ = పాటలు పాడుతు; ఆడుచున్ = ఆటలాడుతు; ముచ్చటలాడుచున్ = కబుర్లు చెప్తూ; ఒండొరులన్ = మిగతావారిని; తాకున్ = ముట్టుకొనును; ఆప్తులన్ = ఇష్టమైనవారిని; కని = చూసి; బిట్టు = గట్టిగా; ఆడుచున్ = మాట్లాడుతు; చేతులున్ = చేతులను; వ్రేయుచున్ = వేస్తు; క్రీడింతురు = విహరింతురు; నగుచున్ = నవ్వుతు; బలుడున్ = బలరాముడు; కృష్ణుడున్ = శ్రీకృష్ణుడు; ఒక = ఒక; చోన్ = చోట.
భావము:- అప్పుడప్పుడు గోపబాలకులు ఆట లాడుతూ పాటలు పాడుతూ పరుగు పందాలు వేసుకుంటారు. ఆ అటలలో వారు పరుగెత్తుకుంటూ వచ్చి, బలరామకృష్ణులను తాకుతూ ఉంటారు. అటువంటి ఆప్తులైన గోపబాలురను చూసి వారిద్దరూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ చక్కలిగింతలు పెడుతూ క్రీడిస్తూ ఉంటారు.

తెభా-10.1-607-వ.
ఇవ్విధంబున.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = ప్రకారముగా.
భావము:- ఈవిధంగా. . .

తెభా-10.1-608-సీ.
వేదాంత వీధుల విహరించు విన్నాణి-
విహరించుఁ గాంతారవీధులందు;
ణిరాజశయ్యపైఁ వళించు సుఖభోగి-
ల్లవ శయ్యలఁ వ్వళించు;
గురుయోగి మానసగుహలఁ గ్రుమ్మరు మేటి-
గ్రుమ్మరు నద్రీంద్ర గుహలలోనఁ;
మలతోడఁ బెనంగి డు డయ్యు చతురుఁ డా-
భీరజనులతోడఁ బెనఁగి డయ్యు;

తెభా-10.1-608.1-ఆ.
ఖిల లోకములకు నాశ్రయుండగు ధీరుఁ
లసి తరులనీడ నాశ్రయించు
యాగభాగచయము లాహరించు మహాత్ముఁ
డవిలోని ఫలము లాహరించు

టీక:- వేదాంత = ఉపనిషత్తు లందు చెప్పబడెడి {వేదాంతవీధులు - శో. బ్రహ్మానారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః సర్వం నారాయణః నిష్కళంకో నిరంజనో నిర్వికారో నిరాకారో శుద్ధై కో నారాయణఃనద్వితీయోస్థి (నారయణోపనిషత్తు) వంటి ప్రతిపాదనల మార్గములు}; వీధులన్ = మార్గములందు; విహరించు = సంచరించెడి; విన్నాణి = బహునేర్పరి; విహరించున్ = తిరుగును; కాంతార = అటవీ; వీధుల్ = దారుల; అందున్ = లో; ఫణిరాజ = ఆదిశేషుడు అనెడి; శయ్య = పాన్పు; పై = మీద; పవ్వళించు = పడుకొనెడి; సుఖ = సుఖమును; భోగి = అనుభవించెడి భోగ పురుషుడు; పల్లవ = చిగురుటాకుల; శయ్యలన్ = పక్కలమీద; పవ్వళించున్ = పడుకొనును; గురు = గొప్ప, త్రిలోకాచార్యులైన; యోగి = నారదాది మహర్షుల; మానస = మనసులు అనెడి; గుహలన్ = గుహలలో; క్రుమ్మరు = సంచరించెడి; మేటి = అతి గొప్పవాడు; క్రుమ్మరు = మెలగును; అద్రీంద్ర = గొప్పపర్వతముల; గుహల = గుహల; లోనన్ = అందు; కమల = చిఛ్చక్తి యైన లక్ష్మీదేవి; తోడన్ = తోటి; పెనంగి = కూడి; కడు = మిక్కిలి; డయ్యు = అలసెడి; చతురుడు = నేర్పరి; ఆభీర = గొల్ల; జనుల = వారి; తోడన్ = తోటి; పెనగి = కలసితిరిగి; డయ్యున్ = అలసిపోవును; అఖిల = సమస్తమైన చతుర్దశ.
లోకముల్ = లోకముల; కున్ = కు; ఆశ్రయుండు = శరణ మిచ్చెడి వాడు; అగు = ఐన; ధీరుడు = ధైర్యశాలి; అలసి = బడలిక పొంది; తరుల = చెట్ల; నీడన్ = నీడను; ఆశ్రయించున్ = చేరును; యాగభాగ = హవిర్భాగములు; చయమున్ = అన్నిటిని; ఆహరించు = గ్రహించెడి; మహాత్ముడు = పరమాత్ముడు; అడవి = అరణ్యము; లోని = అందలి; ఫలములు = పండ్లను; ఆహరించు = తినును.
భావము:- వేదాంత వీధులలో విహరించే విన్నాణి, ఈ నాడు విపిన వీధులలో విహరిస్తూ ఉన్నాడు. మృదువైన ఆదిశేషుడు అనే శయ్యపై పవళించే పరమ భోగి, ఇప్పుడు చిగురాకు ప్రక్కల మీద పవళిస్తూ ఉన్నాడు. గొప్ప యోగుల అంతరంగాల లోపల సంచరిస్తూ ఉండే మహానుభావుడు, ఇక్కడ కొండగుహలలో తిరుగుతూ ఉన్నాడు. లక్ష్మీదేవితో క్రీడించి అలసిపోయే చతురుడు ఇవాళ గోపబాలురతో ఆడిపాడి అలసిపోతున్నాడు. సర్వ లోకాలకూ ఆశ్రయమిచ్చి కాపాడే ధీరుడు, ఈ రోజు అలసిపోయి విశ్రాంతికై చెట్ల నీడలను ఆశ్రయిస్తున్నాడు. మహామునీంద్రుల యజ్ఞాల లోని హవిర్భాగాలను భుజించే భగవంతుడు, అడవిలో కాయలు పండ్లు తింటున్నాడు.

తెభా-10.1-609-వ.
ఆ సమయంబున.
టీక:- ఆ = ఆ యొక్క; సమయంబునన్ = సమయము నందు.
భావము:- అలా కృష్ణబాలుడు వనంలో విహరించే సమయాలలో. . .

తెభా-10.1-610-సీ.
లసినచోఁ గొంద తిమోదమున వీపు-
లెక్కించుకొని పోదు రేపు మెఱసి;
సొలసి నిద్రించినచోఁ నూరుతల్పంబు-
లిడుదురు కొందఱు హితవు గలిగి;
చెమరించి యున్నచోఁ జిగురుటాకులఁ గొంద-
ఱొయ్యన విసరుదు రుత్సహించి;
వ్వేగి నిలుచుచోఁ డయకఁ గొందఱు-
దము లొత్తుదు రతిబాంధవమున;

తెభా-10.1-610.1-ఆ.
గోపవరులు మఱియుఁ గొందఱు ప్రియమున
మాధవునకుఁ బెక్కుమార్గములను
నులు చేసిరెల్ల వములఁ జేసిన
పాపసంచయములు స్మములుగ.

టీక:- అలసినచోన్ = అలసిపోయినప్పుడు; కొందఱు = కొంతమంది; అతి = మిక్కిలి; మోదమునన్ = సంతోషముతో; వీపుల్ = వీపులమీద; ఎక్కించుకొని = కూర్చుండబెట్టుకొని; పోదురు = తీసికొని వళ్ళదరు; ఏపు = శక్తి; మెఱసి = చూపి; సొలసి = బడలిక పొంది; నిద్రించినచోన్ = నిద్రపోవునప్పుడు; ఊరు = తొడలనెడి; తల్పంబులు = పాన్పులను; ఇడుదురు = ఇచ్చెదరు; కొందఱు = కొంతమంది; హితవు = ఇష్టము; కలిగి = కలిగి; చెమరించి = చెమటపట్టి; ఉన్నచోన్ = ఉన్నట్లయిన ఎడల; చిగురుటాకులన్ = లేత ఆకులతో; కొందఱు = కొంతమంది; ఒయ్యన్ = గట్టిగా; విసరుదురు = విసురుతారు; ఉత్సహించి = ఉత్సాహముతో; దవ్వు = దూరము; ఏగి = వెళ్ళి; నిలుచుచోన్ = ఆగినప్పుడు; తడయక = వెనుదీయక; కొందఱు = కొంతమంది; పదములు = కాళ్ళు; ఒత్తుదురు = వత్తెదరు; అతి = మిక్కిలి; బాంధవమునన్ = చనువుతో.
గోప = యాదవ; వరులు = శ్రేష్ఠులు; మఱియున్ = ఇంకను; కొందఱు = కొంతమంది; ప్రియమునన్ = ప్రేమతో; మాధవున్ = కృష్ణున {మాధవుడు - మాధవి యొక్క భర్త, విష్ణువు}; కున్ = కు; పెక్కు = అనేకమైన; మార్గములను = రకములుగా; పనులు = ఉపచారములను; చేసిరి = చేసిరి; ఎల్ల = అన్ని (ఇదివరకు ఎత్తిన); భవములన్ = జన్మలందు; చేసిన = చేసినట్టి; పాప = పాపములు; సంచయములు = కూడబెట్టుకొన్నవి; భస్మములు = బూడిదలు; కన్ = అగునట్లు.
భావము:- కృష్ణుడు అలసిపోతే కొందరు గోపబాలకులు చాల సంతోషంతో తమ వీపు మీద ఎక్కించుకుని తీసుకుని వెడతారు. కృష్ణుడు అలసి సొలసి నిద్రపోతే తమ ఒడిలోనే ఎంతో ఇష్టంగా పడుకోపెట్టుకుంటారు. కృష్ణుడికి చెమటలు పోస్తే చిగురుటాకులతో గాలి తగిలేలా వీస్తారు. కొంత దూరం నడచి అలసిపోతే కాళ్ళు నొప్పిపుట్టాయేమో నని పాదాలు వత్తుతారు ఇంకొందరు ప్రేమతో ఎన్నో విధాల సేవలు చేస్తారు. ఆ సేవలతో పూర్వజన్మలలో చేసిన వారి పాపాలన్నీ పటాపంచలు చేసుకున్నారు.