పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ఆలకదుపుల మేపబోవుట
తెభా-10.1-597-వ.
అయ్యెడఁ గృష్ణుం డొక్కనాడు రేపకడ లేచి, వేణువు పూరించి బలభద్ర సహితుండై గోపకుమారులు దన్ను బహువారంబులు గైవారంబులు జేయ, మ్రోల నాలకదుపుల నిడుకొని నిరంతర ఫల కిసలయ కుసుమంబులును, కుసుమ మకరంద నిష్యంద పానానం దేందిందిర కదంబంబును, గదంబాది నానాతరులతా గుల్మ సంకులంబును, గులవిరోధరహిత మృగపక్షిభరితంబును, భరితసరస్సరోరుహపరిమళమిళిత పవనంబును నైన వనంబుఁ గని యందు వేడుకం గ్రీడింప నిశ్చయించి వెన్నుం డన్న కిట్లనియె.
టీక:- ఆ = ఆ; ఎడన్ = సమయము నందు; కృష్ణుండు = శ్రీకృష్ణమూర్తి; ఒక్క = ఒకానొక; నాడున్ = దినమున; రేపకడ = ఉదయము; లేచి = నిద్రలేచి; వేణువున్ = మురళిని; పూరించి = ఊది; బలభద్ర = బలరామునితో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; గోప = గొల్ల; కుమారులు = పిల్లలు; తన్నున్ = అతనిని; బహు = అనేక; వారంబులు = మార్లు; కైవారంబులు = స్తుతించుటలు; చేయన్ = చేయగా; మ్రోలన్ = ముందర; ఆల = ఆవుల; కదుపలన్ = మందలను; ఇడుకొని = ఉంచుకొని; నిరంతర = ఎల్లప్పుడును; ఫల = పండ్లు; కిసలయ = చిగుళ్ళు; కుసుమంబులును = పూలు కలది; కుసుమ = పూలనుండి; నిష్యంద = కారుతున్న; మకరంద = పూదేనె; పాన = తాగుటచేత; ఆనంద = సంతోషించుచున్న; ఇందిందిర = తుమ్మెదల {ఇందిందిరము - పద్మసంపదతో కూడినది, తుమ్మెద (విద్యార్థి కల్పతరువు)}; కదంబంబును = గుంపు కలది; కదంబ = కడిమిచెట్టు; ఆది = మున్నదు; నానా = అనేక రకముల; తరు = చెట్లు; లతా = తీగల యొక్క; గుల్మ = పొదల యొక్క; సంకులంబును = సందడి కలది; కుల = జాతి; విరోధ = వైరము; రహిత = లేనట్టి; మృగ = జంతువులచేత; పక్షి = పక్షులచేత; భరితంబును = నిండి ఉన్నది; భరిత = నిండైన; సరస్ = సరస్సు లందలి; సరోరుహ = తామరపూల యొక్క {సరోరుహము - సరస్సునందు పుట్టునది, తామరపూవు}; పరిమళ = సువాసనతో; మిళిత = కూడిన; పవనంబును = గాలి కలది; ఐన = అయినట్టి; వనంబున్ = అడవిని; కని = చూసి; అందున్ = దానిలో; వేడుకన్ = వినోదముగా; క్రీడింపన్ = విహరించవలెనని; నిశ్చయించి = అనుకొని; వెన్నుండు = విష్ణువు, కృష్ణుడు; అన్న = సోదరుని; కిన్ = తో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా ఉండగా ఒక రోజు, కృష్ణుడు సూర్యోదయానికి ముందే మేల్కొని వేణుగానం చేసాడు. గోపకుమారులు అందరూ వెంటనే మేలుకుని లేగల మందలను తోలుకుని కృష్ణుడి వద్దకు చేరారు. బలరాముడు, కృష్ణులతో కలసి గోపబాలకులు తనను పదేపదే పొగడుతూ ఉండగా ఆవుల మందలను తోలుకుంటూ అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో అవ్ని ఋతువులలోనూ పళ్ళు పూలు చిగుళ్ళు లభిస్తాయి. పూవులలో తేనెలు పొంగిపొరలుతూ ఉంటే ఆ తీయతేనెలను త్రాగడానికి వచ్చి జుమ్ము జుమ్మని ధ్వనులు చేసే తుమ్మెదల గుంపులు ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. కడిమి మొదలైన అనేక రకాల చెట్లు, తీగలు, పొదరిళ్ళు, ఆ అడవి నిండా అడుగడుగునా ఉన్నాయి. అక్కడి జంతువులు పక్షులు తమ తమ జాతి సహజములైన శత్రుత్వాలను మరచిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అక్కడి సరస్సుల లోని నీళ్ళు చక్కని తామర పూల పుప్పొడి పరిమళం వెదజల్లుతూ ఉన్నాయి. ఆ అడవిలో ఉత్సాహంగా ఆడుకోవాలని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. అన్నగారు అయిన బలరాముడితో ఇలా అన్నాడు.
తెభా-10.1-598-శా.
శాఖాపుష్పఫలప్రభారనతలై చర్చించి యో! దేవ! మా
శాఖిత్వంబు హరింపు; మంచు శుకభాషన్ నీ కెఱింగించుచున్
శాఖాహస్తములం బ్రసూనఫలముల్ జక్కన్ సమర్పించుచున్
శాఖిశ్రేణులు నీ పదాబ్జముల కోజన్ మ్రొక్కెడిం జూచితే.
టీక:- శాఖా = కొమ్మల యొక్క; పుష్ప = పూల యొక్క; ఫల = పండ్ల యొక్క; ప్రభార = అధికమైన బరువు వలన; నతలు = వంగినవి, మొక్కుతిన్నవి; ఐ = అయ్యి; చర్చించి = విచారించుకొని; ఓ = ఓయీ; దేవా = దేవుడా; మా = మా యొక్క; శాఖిత్వంబున్ = వృక్షత్వమును, స్థావరజన్మమును; హరింపుము = పోగొట్టుము; అంచున్ = అనుచు; శుక = చిలుకల; భాషన్ = పలుకులచేత; నీ = నీ; కున్ = కు; ఎఱింగించుచున్ = తెలుపుతు; శాఖా = కొమ్మలు అనెడి; హస్తములన్ = చేతులచేత; ప్రసూన = పువ్వులను; ఫలములున్ = పండ్లు; చక్కన్ = చక్కగా; సమర్పించుచున్ = భక్తిగా ఇచ్చుచు; శాఖి = వృక్షముల; శ్రేణులు = వరుసలు; నీ = నీ యొక్క; పద = పాదములు అనెడి; అబ్జముల్ = పద్మముల; కున్ = కు; ఓజన్ = ఉత్సాహముగా; మ్రొక్కెడిన్ = నమస్కరించుచున్నవి; చూచితే = చూచితివా.
భావము:- “అన్నా! బలదేవా! ఈ చెట్లు చూసావా? కొమ్మల నిండా నిండి ఉన్న పూలగుత్తుల బరువుతో, పళ్ళ భారంతో వంగిపోయి నీ పాదాలు స్పృశిస్తూ, నమస్కరిస్తూ ఉన్నాయి. తమ మీద వాలిన చిలుకల వాక్కులతో “ఓ దేవా! మా యీ వృక్షజన్మను పరిహరించి ఉత్తమ జన్మ ప్రసాదించ” మని తమ కోరికను నీకు వివ్నవిస్తూ ఉన్నాయి. తమ కొమ్మలు అనే చేతులతో పూవులు పండ్లు నీకు చక్కగా సమర్పిస్తూ ఈ చెట్లు వరుసలు కట్టి నీ పాదపద్మాలకు చక్కగా మ్రొక్కుతూ ఉన్నాయి
తెభా-10.1-599-సీ.
నిఖిల పావనమైన నీ కీర్తిఁ బాడుచు-
నీ తుమ్మెదలు వెంట నేగుదెంచె
నడవిలో గూఢుండవైన యీశుఁడ వని;
ముసరి కొల్వఁగ వచ్చె మునిగణంబు
నీలాంబరముతోడి నీవు జీమూత మ-
వని నీలకంఠంబు లాడఁ దొడఁగెఁ
బ్రియముతోఁ జూచు గోపికలచందంబున-
నినుఁ జూచె నదె హరిణీచయంబు
తెభా-10.1-599.1-ఆ.
నీవు వింద వనుచు నిర్మలసూక్తులు
పలుకుచున్న విచటఁ బరభృతములు
నేఁడు విపినచరులు నీవు విచ్చేసిన
ధన్యులైరి గాదె తలఁచి చూడ.
టీక:- నిఖిల = సర్వమును; పావనము = పరిశుద్ధముగా చేయునది; ఐన = అయిన; నీ = నీ యొక్క; కీర్తిన్ = యశస్సును; పాడుచున్ = కీర్తించుచు; ఈ = ఈ; తుమ్మెదలు = తుమ్మెదలు; వెంటన్ = కూడా; ఏగుదెంచెన్ = వచ్చినవి; అడవి = అరణ్యము; లోన్ = అందు; గూఢుండవు = రహస్యముగా మెలగువాడవు; ఐన = అయిన; ఈశుడవు = భగవంతుడవు; అని = అని; ముసరి = మూగి; కొల్వగన్ = సేవించుటకు; వచ్చెన్ = వచ్చినవి; ముని = ఋషుల; గణంబున్ = అందరును; నీల = నల్లని; అంబరము = బట్టల; తోడి = తోనున్న; నీవు = నీవు; జీమూతమవు = మేఘమవు; అని = అని; నీలకంఠంబులు = నెమళ్ళు; ఆడన్ = నాట్యము చేయుటను; తొడగెన్ = ఆరంభించినవి; ప్రియము = ఇష్టము; తోన్ = తోటి; చూచు = చూసెడి; గోపికల = గొల్లపడుచుల; చందంబునన్ = పగిదిని; నినున్ = నిన్ను; చూచెన్ = చూచుచున్నవి; అదె = అదిగో; హరిణీ = ఆడుజింకల; చయంబు = సమూహము.
నీవున్ = నీవు; విందవు = చుట్టమవు; అనుచున్ = అనుచు; నిర్మల = శుద్ధమైన; సూక్తులున్ = మంచిమాటలను; పలుకుచున్నవి = పలుకుచున్నవి; ఇచటన్ = ఇక్కడ; పరభృతములు = కోయిలలు; నేడు = ఇవాళ; విపినచరులు = అడవిలోసంచరించెడివారు; నీవున్ = నీవు; విచ్చేసినన్ = రాగా; ధన్యులు = కృతార్థులు; ఐరి = అయినారు; కదే = కదా, అవును; తలచి = విచారించి; చూడన్ = చూసినచో.
భావము:- ఈ తుమ్మెదలు, సర్వులను పావనం చేయగల నీ కీర్తిని గానం చేస్తూ నీ వెనుకనే ఎగిరివస్తూ ఉన్నాయి. ఈ ఋషిపక్షులు నీవు ఈ అరణ్యంలో రహస్యంగా ఉన్న ఈశ్వరుడవు అని గుమికూడి నిన్ను సేవించడానికి వస్తూ ఉన్నాయి. నల్లని వస్త్రం ధరించిన నిన్ను చూసి మేఘము అనుకుని నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. గోపికలు నిన్ను ప్రేమతో చూస్తునట్లు ఈ ఆడలేళ్ళు, నిన్ను అనురాగంతో చూస్తున్నాయి. నీవు తమ అతిధివని కోకిలలు నీకు రాగయుక్తంగా స్వాగతం పాడుతున్నాయి. ఇవాళ నీ రాక చేత ఇక్కడ ఉండే వనచరులు అందరూ ధన్యులయ్యారు.
తెభా-10.1-600-సీ.
నీ పాదములు సోఁకి నేడు వీరుత్తృణ-
పుంజంబుతో భూమి పుణ్య యయ్యె
నీ నఖంబులు దాఁకి నేడు నానాలతా-
తరుసంఘములు గృతార్థంబు లయ్యె
నీ కృపాదృష్టిచే నేడు నదీ శైల-
ఖగ మృగంబులు దివ్యకాంతిఁ జెందె
నీ పెన్నురము మోవ నేడు గోపాంగనా-
జనముల పుట్టువు సఫల మయ్యె”;
తెభా-10.1-600.1-ఆ.
నని యరణ్యభూమి నంకించి పసులను
మిత్రజనులు దాను మేపు చుండి
నళినలోచనుండు నదులందు గిరులందు
సంతసంబు మెఱయ సంచరించె.
టీక:- నీ = నీ యొక్క; పాదములున్ = అడుగులు; సోకి = తగిలి; నేడు = ఇవాళ; నీరును = జలము; తృణ = గడ్డి; పుంజంబు = దుబ్బుల; తోన్ = తోపాటు; భూమి = నేల; పుణ్య = పుణ్యవంతమైనది; అయ్యెన్ = అయినది; నీ = నీ యొక్క; నఖంబులున్ = గోర్లు; తాకి = తగిలి; నేడు = ఇవాళ; నానా = అనేక రకముల; లతా = తీగలు; తరు = చెట్ల; సంఘంబులున్ = సమూహములు; కృతార్థంబులు = ధన్యములు; అయ్యెన్ = అయినవి; నీ = నీ యొక్క; కృపా = దయతోకూడిన; దృష్టి = చూపుల; చేన్ = వలన; నేడు = ఇవాళ; నదీ = నదులు; శైల = కొండలు; ఖగ = పక్షులు; మృగంబులున్ = జంతువులు; దివ్య = గొప్ప; కాంతిన్ = ప్రకాశమును; అందెన్ = పొందినవి; నీ = నీ యొక్క; పెన్ = పెద్ద; ఉరము = వక్షస్థలము; మోవన్ = తగులగా; నేడు = ఇవాళ; గోపాంగనా = గోపికాస్త్రీలు; జనముల = సమూహముల; పుట్టువు = జన్మము; సఫలము = ధన్యమైనది; అయ్యెన్ = అయినది; అని = అని.
అరణ్య = అటవీ; భూమిన్ = ప్రదేశమును; అంకించి = పొగిడి; పసులును = ఆవులు; మిత్ర = స్నేహితుల; జనులున్ = సమూహము; తాను = అతను; మేపుచుండి = కాచుచుండి; నళినలోచనుండు = శ్రీకృష్ణుడు {నళినలోచనుడు - నళినము (పద్మముల) వంటి లోచనుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; నదులు = ఏరులు; అందున్ = లోను; గిరులు = కొండల; అందున్ = లోను; సంతసంబు = సంతోషము; మెఱయన్ = ప్రకాశింపగా; సంచరించెన్ = మెలగెను.
భావము:- నీ యొక్క పాదాలు సోకి నేడు భూదేవి పూపొదలతో పెరిగిన పచ్చికలతో పావనమై పోయింది. రకరకాల తీగలూ చెట్లూ అన్నీ ఈవేళ నీ గోళ్ళు తాకి ధన్యములయ్యాయి. ఇక్కడ ఉన్న నదులూ పర్వతాలు పక్షులూ జంతువులూ నేడు నీ కరుణామయమైన దృష్టి సోకి దివ్యమైన కాంతిని పొందాయి. నీ విశాలమైన వక్షస్థలంపై వాలిన గోపికల జన్మలు ధన్యమయ్యాయి.” ఈవిధంగా పలుకుతూ వనభూములలో ప్రవేశించి తన మిత్రుల తోపాటు తాను పశువులను మేపుతూ కృష్ణుడు నదుల తీరాలలోనూ పర్వత సానువుల పైననూ ఆనందంగా విహారం చేసాడు.
తెభా-10.1-601-వ.
మఱియు నయ్యీశ్వరుండు.
టీక:- మఱియున్ = ఇంకను; ఆ = ఆ ప్రసిద్ధుడైన; ఈశ్వరుండు = కృష్ణుడు, భగవంతుడు.
భావము:- అంతే కాకుండా ఆ శ్రీకృష్ణ భగవానుడు.