పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/అక్రూరుని హస్తిన పంపుట

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1511-వ.
మహాత్మా! పరమభాగవతుండవైన నీవు మాకభీష్టంబు లొనరింప నర్హుండవు; వినుము పాండురాజు పరలోకగతుండైనఁ గుంతీ సహితులైన పాండవులు ధృతరాష్ట్రు శాసనంబున నేతెంచి కరిపురంబున నున్నవారఁట; నిజపుత్రమోహితుం డగు న య్యంధ నృపతి వారి యందు సమత్వంబునం జరింపం డటుగావున.
టీక:- మహాత్మా = గొప్పవాడా; పరమ = ఉత్కృష్టమైన; భాగవతుండవు = భగవద్భక్తుడవు; ఐన = అయిన; నీవు = నీవు; మా = మా; కున్ = కు; అభీష్టములున్ = కోరిన కోరికలు తీరునట్లు; ఒనరింపన్ = చేయుటకు; అర్హుండవు = తగినవాడవు; వినుము = వినుము; పాండురాజు = పాండురాజు; పరలోకగతుండు = మరణించినవాడు; ఐనన్ = కాగా; కుంతీ = కుంతీదేవితో; సహితులు = కూడినవారు; ఐన = అయిన; పాండవులున్ = పాండవులు; ధృతరాష్ట్రు = ధృతరాష్ట్రుని; శాసనంబునన్ = ఆజ్ఞప్రకారము; ఏతెంచి = వచ్చి; కరిపురంబునన్ = హస్తినాపురము నందు; ఉన్నవారు = ఉన్నారు; అట = అట; నిజ = తన; పుత్ర = కొడుకు యందలి ప్రేమచే; మోహితుండు = మోహమున పడినవాడు; అగున్ = ఐన; ఆ = ఆ యొక్క; అంధ = గుడ్డి; నృపతి = రాజు; వారి = వారి; అందున్ = ఎడల; సమత్వంబునన్ = సమత్వభావముతో; చరింపడు = వర్తింపడు; అటుగాన = అట్లగుటచేత.
భావము:- మహాత్మా! భాగవతోత్తముడవైన నీవు మాకోరిక తీర్చుటకు తగినవాడవు. విను. పాండురాజు చనిపోవడంతో, దృతరాష్ట్రుని ఆజ్ఞ ప్రకారం, తల్లి అయిన కుంతితో పాటు పాండవులు విచ్చేసి హస్తినాపురంలో ఉన్నారుట. ఆ గ్రుడ్డిరాజు తన కొడుకులైన దుర్యోధనాదులు అందలి వ్యామోహముతో కురుపాండవుల ఎడ సమబుద్ధితో మెలుగుట లేదు. అందుచేత. . .

తెభా-10.1-1512-క.
వాలు బంధులు గావున
వాలకును మే లొనర్చి వా రలరంగా
వారింప వలయు దుస్థితి
వారిజరిపువంశ! పొమ్ము వారిం జూడన్."

టీక:- వారలు = వారు; బంధులు = బంధువులు; కావునన్ = కనుక; వారల = వారి; కున్ = కి; మేలు = మంచి; ఒనర్చి = చేసి; వారలు = వారు; అలరంగా = సంతోషించగా; వారింపవలయున్ = పోగొట్టవలెను; దుస్థితిన్ = దుర్దశను; వారిజరిపువంశ = అక్రూరా {వారిజరిపువంశుడు - వారిజరిపుని (చంద్రుని) వంశమువాడు, అక్రూరుడు}; పొమ్ము = వెళ్ళు; వారిన్ = వారిని; చూడన్ = చూచుటకు.
భావము:- ఓ అక్రూరా! నీవు తామర శత్రువైన చంద్రుని వంశంలోనే ఉత్తముడవు. (పాండురాజు పుత్రులు ముగ్గురిద్దరు, ధృతరాష్ట్ర పుత్రులు వందమంది రెండుపక్షాలుగా ఉన్నా,) వారూ వీరూ చుట్టాలే కదా. కనుక ఇరుపక్షాల వారికి మేలుచేకూర్చి, వారు సంతోషించేటట్లు, దుఃస్థితిని నివారించాలి. కనుక, నీవు హస్తినలో వారిని పరామర్శించడానికి వెళ్ళు.”

తెభా-10.1-1513-వ.
అని పలికి సంకర్షణోద్ధవసహితుండై హరి నిజగృహంబునకుంజనుటయు నక్రూరుండు కౌరవరాజధాని యగు కరిపురికరిగి యందు ధృతరాష్ట్ర భీష్మ విదుర బాహ్లిక భారద్వాజ గౌతమ దుర్యోధన కర్ణాశ్వత్థామాదులం గుంతీసహితులైన పాండవులం దక్కిన బంధువులనుం గని యధోచిత సత్కారంబుల నొంది తత్తద్వర్తనంబు లెఱింగికొనుచుఁ గొన్నిదినంబు లుండ నొక్కనాడు విదురుండు విన నేకతంబున నక్రూరునికిఁ గుంతి యిట్లనియె.
టీక:- అని = అని; పలికి = చెప్పి; సంకర్షణ = బలరామునితో; ఉద్ధవ = ఉద్ధవునితో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; హరి = కృష్ణుడు; నిజ = తన; గృహంబున్ = ఇంటి; కున్ = కి; చనుటయున్ = వెళ్ళగా; అక్రూరుండు = అక్రూరుడు; కౌరవ = కురువంశస్థుల; రాజధాని = ముఖ్యపట్టణము; అగు = ఐన; కరిపురి = హస్తినాపురమున; కున్ = కు; అరిగి = వెళ్ళి; అందున్ = అక్కడ; ధృతరాష్ట్ర = ధృతరాష్ట్రుడు; భీష్మ = భీష్ముడు; విదుర = విదురుడు; బాహ్లిక = బాహ్లికుడు; భారద్వాజ = ద్రోణుడు; గౌతమ = కృపాచార్యుడు; దుర్యోధన = దుర్యోధనుడు; కర్ణ = కర్ణుడు; అశ్వత్థామ = అశ్వత్థాముడు; ఆదులన్ = మున్నగువారిని; కుంతీ = కుంతీదేవితో; సహితులు = కూడినవారు; ఐన = అయిన; పాండవులన్ = పాండవులను; తక్కిన = తతిమా; బంధువులనున్ = చుట్టములను; కని = చూసి, కలిసి; యధోచిత = తగిన విధమైన; సత్కారంబులన్ = మర్యాదలను; ఒంది = పొంది; తత్తత్ = వారివారి; వర్తనంబులు = నడవడికలు; ఎఱింగికొనుచు = తెలిసికొనుచు; కొన్ని = కొద్ది; దినంబులున్ = రోజులు; ఉండన్ = ఉండగా; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; విదురుండు = విదురుడు; వినన్ = వినుచుండగా; ఏకతంబునన్ = రహస్యముగా; అక్రూరుని = అక్రూరుని; కిన్ = కి; కుంతి = కుంతీదేవి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా వచించి, ఉద్ధవ, బలరామ సహితుడై శ్రీకృష్ణుడు తన భవనమునకు వెళ్ళాడు. అక్రూరుడు కురురాజధాని అయిన హస్తినాపురానికి వెళ్ళాడు. దృతరాష్ట్రడు, భీష్ముడు, విదురుడు, బాహ్లికుడు, భరద్వాజుడు, గౌతముడు, దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ మున్నగువారినీ; కుంతీ దేవితోపాటు పాండవులను; మిగిలిన చుట్టాలనూ అక్కడ దర్శించాడు. వారు చేసిన తగిన సత్కారాలు పొందాడు. అక్కడ వారి వారి నడవడికలు ఎలా ఉన్నాయో పరామర్శిస్తూ కొన్ని దినాలు అక్కడ ఉన్నాడు. అంత, ఒకనాడు విదురుడు మాత్రమే వింటుండగా కుంతీదేవి అక్రూరుడితో ఇలా అన్నది.