Jump to content

పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/స్వాయంభువు జన్మంబు

వికీసోర్స్ నుండి


తెభా-3-387-క.
"తోజసంభవుఁ డత్తఱి
నేయే ముఖమండలమున నేయే సృష్టిన్
ధీయుతుఁడై సృజియించెను
బాక యత్తెఱఁగు దెలియఁ లుకుము నాకున్."

టీక:- తోయజసంభవుడు = బ్రహ్మదేవుడు {తోయజసంభవుడు - తోయజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; ఆ = ఆ; తఱిన్ = సమయములో; ఏయే = ఏయే; ముఖ = ముఖము యొక్క; మండలమునన్ = బింబము నందు; ఏయే = ఏయే; సృష్టిన్ = రకమైన సృష్టిని; ధీ = గొప్ప బుద్ధి; యుతుడు = కలిగినవాడు; ఐ = అయి; సృజియించెను = సృష్టించెను; పాయకన్ = విడువక; ఆ = ఆ; తెఱంగున్ = విధమును; తెలియన్ = తెలియునట్లు; పలుకుము = చెప్పుము; నాకున్ = నాకు.
భావము:- “మహా జ్ఞాని అయిన బ్రహ్మదేవుని ఏయే ముఖంనుండి ఏయే సృష్టి చేసాడో అదంతా నాకు తెలిసేలా చెప్పు.”

తెభా-3-388-వ.
అని యిట్లు విదురుం డడిగిన మైత్రేయుం డతనితో నిట్లనియె "ఋగ్యజుస్సామాధర్వంబు లను వేదంబులును, హోతృకర్మంబు లయిన యప్రగీతమంత్రస్తోత్రంబు లగు శస్త్రంబులును, నధ్వర్యుకర్మంబైన యిజ్యయు, సంప్రగీతస్తోత్రం బయిన స్తుతియు, నుద్గాతృ ప్రయోజనం బైన ఋక్సముదాయ రూపం బగు స్తోమంబును, బ్రాయశ్చిత్తం బగు బ్రహ్మకర్మంబును, నాయుర్వేద ధనుర్వేద గాంధర్వ వేదంబులను, నుపవేదంబులును, విశ్వకర్మశాస్త్రం బగు స్థాపత్యంబును, బ్రాగాది ముఖంబుల నుత్పన్నంబు లయ్యె; పంచమవేదం బగు నితిహాస పురాణంబులు సర్వముఖంబులం గలిగె; మఱియుఁ గర్మతంత్రంబు లయిన షోడశ్యుక్థ్యములును, జయనాగ్నిష్టోమంబులును, నాప్తోర్యామాతిరాత్రంబులును, వాజపేయ గోసవంబులును, ధర్మపాదంబు లైన విద్యా దాన తపస్సత్యంబులును, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ యత్యాశ్రమంబులును గల్గె; వీనికి నొక్కొక్కటికిం జతుర్విధంబు లైన వృత్తులును గలిగి యుండు; అందు సావిత్రం బన బ్రహ్మచర్యంబు యది యుపనయనం బాదిగా దివసత్రయంబు గాయత్రి జపించుటయ; ప్రాజాపత్యం బన వేదవ్రతచతుష్కయంబు యందు బ్రతివ్రతంబును వ్రతులు సంవత్సర పర్యంతంబుగా నాచరింప నగు; బ్రాహ్మంబు వేదగ్రహణాంతంబు నాచరింపం దగు; బృహత్తన నైష్ఠికం బియ్యగునవి బ్రహ్మచారి వృత్తిచతుష్టయంబును; ననిషిద్ధకృష్యాది వృత్తి యగు వార్తయు యజనాది కర్మోపయుక్తం బైన యాజ్ఞాది రూప ధనసంచయంబును, బరుల యాచింపకుండు నయాచితం బగు శాలీనంబును, క్షేత్ర పతిత కణిశ కణ సంగ్రహణరూపం బగు శిలోంఛంబును నను గృహస్తవృత్తులు నాలుగును; నకృష్టపచ్యాహారు లగు వైఖానసులును, నూతనఫలంబు లబ్ధం బైనఁ బూర్వ సంచితపదార్థ త్యాగంబు గల వాలఖిల్యులును, బ్రాతః కాలంబున నే దిక్కు విలోకింతు రద్దిక్కునకుం జని యచ్చట లభించు పదార్థంబుల భుజించి జీవించు నౌదుంబరులును, దమంత ఫలించి తరు పతితంబు లగు ఫలంబులఁ దినుచుండు ఫేనపులును నను చతుర్విధవృత్తులు గల వానప్రస్థులును; స్వాశ్రమవిహిత కర్మంబులం బ్రదానుం డగు కుటీచకుండును, గర్మం బుపసర్జనంబు సేసి జ్ఞానప్రధానుం డయిన బహూదుండును, గేవల జ్ఞానాభ్యాస నిష్ఠుం డగు హంసుండును, బ్రాప్తంబైన పరబ్రహ్మతత్త్వంబు గల నిష్క్రియుండును నను సన్యాసి చతుర్విధ వృత్తులును; మోక్షఫలప్రదం బై యాత్మానాత్మ వివేకవిద్యారూపం బగు నాన్వీక్షకియు, స్వర్గాది ఫలప్రదం బై కర్మవిద్యారూప మగు త్రయియు, జీవనఫల ప్రధానం బై కృష్యాది రూపం బగు వార్తయు, నర్థ సంపాదనైక ప్రయోజనం బగు దండనీతియు, మోక్ష ధర్మకామార్థంబు లైన న్యాయవిద్యా చతుష్కంబును, భూర్భువస్సువ యను వ్యాహృతులును, బూర్వాది ముఖంబులవలన నుదయించె; మఱియు నతని హృదయాకాశంబు వలనం బ్రణవంబును, రోమంబుల వలన నుష్టిక్ఛందంబును, ద్వగింద్రియంబు వలన గాయత్రీఛందంబును, మాంసంబు వలనఁ ద్రిష్టుక్ఛందంబును, స్నాయువు వలన ననుష్టుప్ఛందంబును, నస్థి వలన జగతీచ్ఛందంబును, మజ్జ వలన పంక్తిచ్ఛందంబును, బ్రాణంబు వలన బృహతీఛందంబును, కకారాది పంచ వర్గాత్మకంబు లయిన స్పర్శంబులను, జీవుండును, నకారాది స్వరాత్మకం బైన దేహంబును, నూష్మంబు లను శ ష స హ వర్ణచతుష్టయ రూపంబు లగు నింద్రియంబులును, నంతస్థంబు లగు య ర ల వ యను వర్ణంబులును, షడ్జాది సప్తస్వర రూపంబు నాత్మబలంబు నయిన శబ్దబ్రహ్మంబును, జతుర్ముఖుని లీలావిశేషంబున నుత్పన్నం బయ్యె; వ్యక్తావ్యక్తం బై వైఖరీ ప్రణవాత్మకం బైన శబ్దబ్రహ్మంబు వలనం బరమాత్మ యవ్యక్తాత్మకుం డగుటం జేసి పరిపూర్ణుండును వ్యక్తాత్మకుం డగుటంజేసి యింద్రాది శక్త్యుపబృంహితుండును నై కానంబడు; పదంపడి యజుండు భూరివీర్యవంతు లయిన ఋషిగణంబుల సంతతి యవిస్తృతం బని తలంచి, పూర్వతను పరిగ్రహంబు సాలించి, యనిషిద్ధ కామాసక్తం బైన దేహాంతర పరిగ్రహంబు సేసి, నిత్యంబుఁ బ్రజాసృష్టి యందు వ్యాసక్తుండ నైనం బ్రజ లభివృద్ధి నొందక యుండుట కేమి కారణం బగు నని యచ్చరువొంది; తద్వృద్ధి యగు విధం బాలోచించుచు, దైవం బిచ్చట విఘాతుకంబు గాన తదానుకూల్యం బావశ్యకం బని దాని నెదురుచూచుచు, యథోచిత కృత్య కరణదక్షుం డగుచుండు చతుర్ముఖుని దేహంబు ద్వివిధం బయిన యట్టి రూపద్వయ విభాగంబు స్వరాట్టగు స్వాయంభువ మనువును దన్మహిషి యగు శతరూప యను కన్యకయుంగా మిథునం బయి జనియించె; అమ్మిథునంబు వలన బ్రియవ్రతోత్తానపాదు లను పుత్రద్వయంబు నాకూతి దేవ హూతి ప్రసూతు లను కన్యకా త్రంయంబునుం గలిగిరి; అందు నాకూతిని రుచికునకును, దేవహూతిం గర్దమునకును, బ్రసూతిం దక్షునకును నిచ్చె; వీరల వలనఁ గలుగు ప్రజా సంతతులచేత జగంబులు పరిపూర్ణంబు లయ్యె."
టీక:- అని = అని; ఇట్లు = ఈవిధముగా; విదురుండు = విదురుడు; అడిగినన్ = అడుగగా; మైత్రేయుండు = మైత్రేయుడు; అతని = అతని; తోన్ = తో; ఇట్లు = ఈవిధముగా; అనియెన్ = చెప్పెను; ఋక్ = ఋగ్వేదము; యజుర్ = యజుర్వేదము; సామ = సామవేదము; అధర్వంబులున్ = అధర్వణవేదములును; అను = అనే; వేదంబులున్ = వేదములును; హోతృ = హోమము చేయువాని {చతుర్విధ ఋత్విక్కులు - యజ్ఞ నిర్వహణకు కావలిసిన నలుగురు ఋత్విక్కులు 1 హోత 2 అధ్వర 3 ఉద్గాత 4 బ్రహ్మ}; కర్మంబులు = ఆచరించవలసిన ఆచారములును; అయిన = అయినట్టి; అప్రగీతము = గానము చేసెడివి కానివి; మంత్ర = మంత్రసంబంధములైన; స్తోత్రంబులునున్ = స్తోత్రములును; అగు = అయిన; శస్త్రంబులునున్ = శాస్త్రములును; అధ్వర్యు = యజ్ఞముల అధ్వర్యము చూచువాని; కర్మంబు = ఆచారములు; ఐన = అయిన; ఇజ్యయు = పూజావిధానములును {ఇజ్య - ప్రయోజనము బట్టి యజ్ఞము చేయవలసిన క్రమము, పూజా విధానము}; సంప్రగీత = చక్కగా పాడుకొన తగిన; స్తోత్రంబు = స్తోత్రములును; అయిన = అయిన; స్తుతియున్ = స్తుతులును; ఉద్గాతృ = ఉద్గాత యొక్క; ప్రయోజనంబు = ఉపయోగించునది; ఐన = అయిన; ఋక్ = ఋక్కులు అనబడు మంత్రములు; సముదాయ = సమూహము యొక్క; రూపంబున్ = రూపములు; ఐన = అయిన; స్తోమంబునున్ = స్తోమమును; ప్రాయశ్చిత్తంబున్ = ప్రాయశ్చిత్తముకొరకు {ప్రాయశ్చిత్తము - పొరపాటు జరిగిన దాని దోష విమోచనమునకైన విధానములు}; అగు = అయిన; బ్రహ్మ = బ్రహ్మ యను ఋత్విక్కు యొక్క; కర్మంబునున్ = ఆచారములును; ఆయుర్వేద = వైద్యవిద్య {ఆయుర్వేదము - ఆయువు (ప్రాణము, ఆరోగ్యము) నకు సంబంధించిన శాస్త్రము, వైద్యవిద్య}; ధనుర్విద్య = విలువిద్య {ధనుర్విద్య - ధనుష్ (విల్లు) కు సంబంధించిన విద్య, విలువిద్య}; గాంధర్వ = సంగీతవిద్య {గాంధర్వము - గంధర్వులు చేయునది (గానము) నకు సంబంధించిన విద్య, సంగీతము}; వేదంబులనున్ = విద్యలను, శాస్త్రములను; ఉపవేదములును = వేదశాఖలును {ఉపవేదములు - 1 ఆయుర్వేదము 2 ధనుర్వేదము 3 గాంధర్వము 4 స్థాపత్యము}; విశ్వకర్మశాస్త్రంబు = నిర్మాణవిద్య {విశ్వకర్మశాస్త్రము - విశ్వ (నిర్మింపబడినది) చేయు విద్య, నిర్మాణవిద్య}; అగు = అయిన; స్థాపత్యంబును = స్థపతి ఆచరించవలసిన ఆచారములును {స్థాపత్యము - స్థలములను (ఆవరణలు, నిర్మాణములు మొదలగునవి) ఏర్పరచుట నిర్మించుటాదికి సంబంధించిన శాస్త్రము, స్థపతి యొక్క పని}; ప్రాగాది = నలుదిక్కుల ఉన్న {ప్రాగాది - తూర్పు మొదలగు నాలుగు దిక్కులు, 1 తూర్పు 2 దక్షిణము 3 పడమర 4 ఉత్తరము అను నాలుగు దిక్కులు}; ముఖంబులన్ = ముఖములందు; ఉత్పన్నంబు = పుట్టినవి; అయ్యెన్ = అయ్యెను; పంచమ = అయిదవ (5); వేదంబు = వేదము; అగు = అయిన; ఇతిహాస = ఇతిహాసములు {ఇతిహాసములు - ఇతి (ఈ విధమగ) హ (జరిగి) ఆస (ఉన్నది), జరిగిన కథలు, రామాయణ భాగవతములు}; పురాణంబులునున్ = పురాణములును {పురాణములు - పూర్వము నుండి వచ్చినవి, ఇవి బ్రహ్మాది అష్టాదశ (పద్దెనిమిది (18)), 1 బ్రహ్మ 2 పద్మ 3 వైష్ణవ 4 శైవ 5 భాగవత 6 నారదీయ 7 మార్కండేయ 8 ఆగ్నేయ 9 భవిష్యత్తు 10 బ్రహ్మకైవర్త 11 లింగ 12 వరాహ 13 స్కాంధ 14 వామన 15 కూర్మ 6 మత్స్య17 గరుడ మరియు 18 బ్రహ్మాండ పురాణములు. పురాణమునకు పంచలక్షణములు - సర్గము, విసర్గము, వంశము, మన్వంతరము, రాజవంశానుచరితము}; సర్వ = అన్ని; ముఖంబులన్ = ముఖముల వలనను; కలిగెన్ = పుట్టినవి; మఱియున్ = ఇంకనూ; కర్మ = వేదవిధి కర్మల యొక్క; తంత్రంబులు = ఆచరణ విధానములు; అయిన = అయిన; షోడశీ = (16) తిథులవారీ {షోడశతిథులు - 1 అమావాస్య 2 పౌర్ణమి 3 పాడ్యమి 4 విదియ 5 తదియ 6 చవితి 7 పంచమి 8 షష్టి 9 సప్తమి 10 అష్టమి 11 నవమి 12 దశమి 13 ఏకాదశి 14 ద్వాదశి 15 త్రయోదశి 16 చతుర్దశి}; ఉక్థ్యములును = చేయవలసిన కర్మములు {షోడశ్యుక్థ్యములు - షోడశ (పదహారు, 16) తిథులకు యుక్తములు (అనుసరించ వలసినవి) యైన నియమములు దీక్షలు}; చయనం = యజ్ఞకుండానికి ఇటుకలు పేర్చడం. {చయనం - యజ్ఞకుండానికి ఇటుకలు పేర్చడం, ఒక్కొక యజ్ఞానికి ఒక్కొక విధమైన యజ్ఞ కుండం అవసరమవుతుంది. అలాగే ఒక్కొక వేద శాఖవారికి ఒక్కొక పద్ధతి ఉంటుంది. పారమార్థిక పదకోశము (పొత్తూరి వేంకటేశ్వర రావు)}; అగ్నిష్టోమంబులునున్ = అగ్నిహోత్రములును {అగ్నిష్టోమము - వసంతకాలమందు అయిదు దినములలో చేసి ముగించెడి హోమము}; ఆప్తోర్యామ = ఆప్తోర్యామములు {ఆప్తోర్యామి - దినమును యామములు గా విభజించి చేయు కర్మములు}; అతిరాత్రంబులును = జాగరణ కర్మములును; వాజపేయ = వాజపేయము అను యజ్ఞము; గోసవంబులును = గవాయనము అను యజ్ఞములును; ధర్మ = ధర్మము యొక్క; పాదంబులు = పాదములు, విభాగములు; ఐన = అయిన; విద్య = విద్యలును, శాస్త్రములును; దాన = దానములు; తపస్ = తపస్సు; సత్యంబులును = సత్యములును; బ్రహ్మచర్య = బ్రహ్మచర్యాశ్రమము; గృహస్థ = గార్హస్థాశ్రమము; వానప్రస్థ = వానప్రస్థాశ్రమము; యతి = సన్యాసాశ్రమము అను; ఆశ్రమంబులును = చతురాశ్రమములు; అను = అను; వీని = వీటి; కిన్ = కి; ఒక్కొకటి = ఒకోదాని; కిన్ = కి; చతుః = నాలుగు (4); విధంబులు = విధములు; ఐన = అయిన; వృత్తులును = ప్రవర్తనలు; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును; అందున్ = అందులో; సావిత్రంబు = సావిత్రము {సావిత్రము - సవితను ఉపాసించుట}; అనన్ = అనగా; బ్రహ్మచర్యంబు = బ్రహ్మచర్యము; అది = అది; ఉపనయంబు = వడుగు; ఆదిగా = మొదలుపెట్టి; దివస = దినములు; త్రయంబున్ = మూడు (3); గాయత్రిన్ = గాయత్రిని; జపించుటయ = జపించుటే; ప్రాజాపత్యంబు = ప్రాజాపత్యము; అనన్ = అనగా; వేద = వేదాధ్యయనము చేయు; వ్రత = దీక్షలు; చతుష్కంబున్ = నాలుగును (4); అందున్ = అందులో; ప్రతి = ప్రతి ఒక్క; వ్రతంబును = వ్రతమును; వ్రతులు = వ్రతమును చేయువారు; సంవత్సర = సంవత్సరపు; పర్యంతము = కాలము; కాన్ = అగునట్లు; ఆచరింపన్ = ఆచరించవలసినది; అగు = అగును; బ్రాహ్మంబున్ = బ్రాహ్మము; వేద = వేదములను; గ్రహణ = నేర్చుకొనుట యొక్క; అంతంబునన్ = పూర్తగునప్పుడు; ఆచరింపన్ = ఆచరించుటకు; తగు = తగినది; బృహత్తన = బృహత్తనము; నైష్ఠికంబున్ = నైష్ఠికము; ఇయ్యవి = ఇవియును; అగు = అగు; బ్రహ్మచారి = బ్రహ్మచారుల; వృత్తిన్ = వృత్తుల; చతుష్టయంబునున్ = నాలుగును (4); అనిషిద్ధ = నిషిద్ధము కాని భూమిని; కృషి = పండించుట, వ్వవసాయము; ఆది = మొదలగు; వృత్తిన్ = జీవనోపాధిగా తీసుకొన్నది; అగు = అయిన; వార్తయున్ = వార్తయును; యజన = యజ్ఞము; ఆది = మొదలగు; కర్మ = కర్మములకు; ఉపయుక్తంబు = ఉపయోగించేది; ఐన = అయిన; యజ్ఞ = యజ్ఞము; ఆది = మొదలగు; రూప = రూపములలోని; ధన = సంపదల; సంచయంబును = సంపాదించుటయును; పరులన్ = ఇతరులను; యాచింపక = అడుగక; ఉండున్ = ఉండే; అయాచితంబు = అయాచితము; అగు = అగును; శాలీనంబును = శాలీనమును; క్షేత్ర = పొలమున; పతిత = రాలిన; కణిశ = కంకులందలి, వెన్నులందలి; కణ = గింజలను; సంగ్రహణ = తీసుకొను; రూపంబున్ = రూపము; అగు = అగును; శిలోంఛంబునున్ = శిలోంఛనము {శిలోంఛనము - రాళ్లతో గింజలను నూరుకుని భుజించు వృత్తి}; అను = అను; గృహస్థ = గృహస్థుల; వృత్తులు = జీవనోపాధిగా తీసుకొన్నవి; నాలుగును = నాలుగును (4); అకృష్ట = కృషిచేయబడకయే {అకృష్టపచ్యాహారులు - వానప్రస్థులలో ఒక శాఖ వీరు అకృష్ట (దున్నకుండ లభించినవి) పచ్య (వండినవి) ఐన ఆహారులు (ఆహారం తినువారు}; పచ్య = వండిన; ఆహారులు = ఆహారము తీసుకొనువారు; అగు = అగు; వైఖానసులును = వైఖానసులును; నూతన = కొత్తగా; ఫలంబున్ = ఫలము, పంట; లబ్ధంబు = లభించుట; ఐన = జరిగిన; పూర్వ = ముందు; సంచిత = కూడబెట్టిన; పదార్థ = పదార్థములను; త్యాగంబున్ = విసర్జించు నియమము; కల = కలిగిన; వాలఖిల్యులును = వాలఖిల్యులును; ప్రాతఃకాలంబునన్ = ఉదయమున; ఏ = ఏ; దిక్కు = వైపునకు; విలోకింతురు = చూస్తారో; ఆ = ఆ; దిక్కున్ = దిక్కున; కున్ = కు; చని = వెళ్లి; అచట = అక్కడ; లభించు = దొరకు; పదార్థంబులన్ = పదార్థములను; భుజించి = తిని; జీవించు = బతుకు; ఔదుంబరులును = ఔదుంబరులును; తమంత = వాటంతటవి; ఫలించి = పండి; తరు = చెట్టునుండి; పతితంబులు = పడినవి; అగు = అయిన; ఫలంబులన్ = పండ్లను; తినుచున్ = తింటూ; ఉండున్ = ఉండే; ఫేనపులును = ఫేనపులును; అను = అనే; చతుః = నాలుగు (4); వృత్తులు = ప్రవర్తనలు; కల = కలిగిన; వానప్రస్థులును = వానప్రస్థులును; స్వా = స్వంతమైన; ఆశ్రమ = ఆశ్రమమున; విహిత = నిర్ణయింపబడిన; కర్మంబులన్ = పనుల యందు; ప్రధానుండు = అంకితమైనవాడు; అగు = అయిన; కుటీచకుండును = కుటీచకుడును; కర్మంబున్ = కర్మములను; ఉపసర్జనంబు = విడిచిపెట్టుట; చేసి = చేసి; జ్ఞాన = జ్ఞానమే; ప్రధానుండు = ముఖ్యమైన; అయిన = అయిన; బహూదుండును = బహూదుడును; కేవల = కేవలము; జ్ఞాన = జ్ఞానమును; అభ్యాస = సాధనచేయుటే; నిష్ఠుండు = నిష్ఠగా కలవాడు; అగు = అగు; హంసుండును = హంసుడును; ప్రాప్తంబు = లభించినది; ఐన = అయిన; పరబ్రహ్మ = పరబ్రహ్మ యొక్క; తత్త్వంబున్ = తత్త్వము; కల = కలిగిన; నిష్క్రియుండును = నిష్క్రియుడును; అను = అను; సన్యాసి = సన్యాసి లయొక్క; చతుః = నాలుగు (4); విధ = విధంబులైన; వృత్తులును = నడవడికలును; మోక్ష = మోక్షము అను; ఫల = ఫలమును; ప్రదంబు = ఇచ్చునది; ఐ = అయి; ఆత్మ = ఏదిఆత్మ, ఏదితను; అనాత్మ = ఏదిఆత్మకానిది, ఏదితనుకానిది; వివేక = తెలియజేయు; విద్యా = విద్య యొక్క; రూపంబున్ = రూపము కలది; అగు = అగు; ఆన్వీకాక్షియున్ = ఆన్వీకాక్షి యును; స్వర్గ = స్వర్గము; ఆది = మొదలగు; ఫల = ఫలితములను; ప్రదంబు = ఇచ్చునది; ఐ = అయి; కర్మ = కర్మములను చేయు; విద్యా = విద్య యొక్క; రూపంబున్ = రూపమైనది; అగు = అగు; త్రయియున్ = త్రయి యును; జీవన = జీవించుటనే; ఫల = ఫలితముగా; ప్రదానంబు = ఇచ్చునది; ఐ = అయి; కృషి = వ్యవసాయము; ఆది = మొదలగు; రూపంబున్ = రూపమైనది; అగు = అగు; వార్తయున్ = వార్తయును; అర్థ = ధనమును; సంపాదన = సంపాదించుటయే; ఏక = ముఖ్యమైన; ప్రయోజనంబు = ఫలితము; అగు = అగు; దండనీతియున్ = దండనీతియును; మోక్ష = మోక్షమును; ధర్మ = ధర్మమును; కామ = కామములును; అర్థంబు = సంపదలును; ఐన = కొరకైన; న్యాయ = న్యాయమైన; విద్యా = విద్యల; చతుష్కంబునున్ = నాలుగు (4); భూః = భూలోకము; భువః = భువర్లోకము; సువః = సువర్లోకము; అను = అనే; వ్యాహృతులును = లోకములును {వ్యాహృతులు - వ్యాపించునవి, లోకములు}; పూర్వ = తూర్పు; ఆది = మొదలగు వైపులకు ఉన్న; ముఖంబులన్ = ముఖముల; వలనన్ = నుండి; ఉదయించెన్ = పుట్టినవి; మఱియున్ = ఇంకనూ; అతని = అతని; హృదయ = హృదయమందలి; ఆకాశంబున = అవకాశము; వలనన్ = వలన; ప్రణవంబునున్ = ఓంకార రూప ప్రణవమును; రోమంబుల = రోమముల; వలనన్ = వలన; ఉష్టిక్ = ఉష్టిక్ అను; ఛందంబునున్ = ఛందస్సును; త్వక్ = చర్మము; ఇంద్రియంబు = ఇంద్రియము; వలనన్ = వలన; గాయత్రీ = గాయత్రీ; ఛందంబునున్ = ఛందస్సును; మాంసంబున్ = మాంసము; వలనన్ = వలన; త్రిష్టుక్ = త్రిష్టుక్ అను; ఛందంబునున్ = ఛందస్సును; స్నాయువు = కీళ్లు; వలనన్ = వలన; అనుష్టుప్ = అనుష్టుప్ అను; ఛందంబునున్ = ఛందస్సును; అస్థి = ఎముకలు; వలనన్ = వలన; జగతీ = జగతీ అను; ఛందంబునున్ = ఛందస్సును; మజ్జ = ఎముకలలో నుండు మజ్జ, చమురు; వలనన్ = వలన; పంక్తి = పంక్తి; ఛందంబునున్ = ఛందస్సును; ప్రాణంబు = ప్రాణము; వలనన్ = వలన; బృహతీ = బృహతీ అను; ఛందంబునున్ = ఛందస్సును; కకార = కకారముతో; ఆది = మొదలగు; పంచ = అయిదు (5); వర్గ = వర్గములలో; ఆత్మకంబులు = కూడినవియును; అయిన = అయిన; స్పర్శంబులను = స్పర్శములును; జీవుండునున్ = జీవుడును; అకార = అకారము; ఆది = మొదలగు; స్వర = స్వరములు తో; ఆత్మకంబునున్ = కూడినవియును; ఐన = అయినట్టి; దేహంబునున్ = దేహమును; ఊష్మంబులను = ఊష్మంబులు అను; శషసహ = శషసహ అను; వర్ణ = వర్ణముల; చతుష్టయ = నాలుగు (4); రూపంబులును = రూపములును; ఇంద్రియంబులును = ఇంద్రియములును; అంతస్థంబులు = అంతస్థములు; అగు = అగు; యరలవ = యరలవ; అను = అను; వర్ణంబులు = వర్ణములు; షడ్జ = షడ్జము {షడ్జాది - 1 షడ్జమము (స); 2 ఋషభము (రి); 3 గాంధారము (గ); 4 మధ్యమము (మ); 5 పంచమము (ప) 6 ధైవతము (ద) 7 నిషాదము (ని);అను ఏడు (7) స్వరములు}; ఆది = మొదలగు; సప్త = సప్త {సప్తస్వరములు - సంగీత స్వరములు ఏడు, సరిగమపదని}; స్వర = స్వరములు; రూపంబున్ = రూపము; ఆత్మ = తన; బలంబున్ = బలమును; అయిన = అయిన; శబ్దబ్రహ్మంబును = శబ్దబ్రహ్మమును; చతుర్ముఖుని = బ్రహ్మదేవుని; లీలా = లీలా; విశేషంబునన్ = విశేషము వలన; ఉత్పన్నంబున్ = పుట్టినది; అయ్యెన్ = అయ్యెను; వ్యక్త = తెలియబడునది; అవ్యక్తంబున్ = తెలియబడక ఉండునదియు; ఐ = అయి; వైఖరీ = ఉచ్ఛారణాపూర్వక; ప్రణవ = ప్రణవము; ఆత్మకంబు = కూడినది; ఐన = అయినట్టి; శబ్దబ్రహ్మంబున్ = శబ్దబ్రహ్మము; వలనన్ = వలన; పరమాత్మ = పరబ్రహ్మ; అవ్యక్త = వ్యక్తము కాని; ఆత్మకుండు = స్వరూపుడు; అగుటన్ = అగుట; చేసి = వలన; పరిపూర్ణుండును = పరిపూర్ణుడును; వ్యక్త = వ్యక్తమగు; ఆత్మకుండు = స్వరూపుడు; అగుటన్ = అగుట; చేసి = వలన; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మొదలగు; శక్తిన్ = శక్తులచే; ఉపబృంహితుండును = నిండినవాడును; ఐ = అయి; కానంబడు = తెలియబడును; పదంపడి = మఱియు; అజుండు = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మములేని వాడు, బ్రహ్మదేవుడు}; భూరి = అతి మిక్కిలి; వీర్యవంతులు = తేజస్సు కలవారు; అయిన = అయిన; ఋషి = ఋషుల; గణంబుల = సమూహముల; సంతతి = సంతానములు; అవిస్తృతంబు = విస్తారముకానివి; అని = అని; తలచి = భావించి; పూర్వ = ముందటి; తను = శరీరమును; పరిగ్రహంబు = స్వీకారించుట; చాలించి = వదలివేసి; అనిషిద్ధ = అడ్డులేని; కామ = కామమందు; ఆసక్తంబున్ = ఆసక్తి కలిగినది; ఐన = అయిన; దేహ = శరీరము; అంతరము = ఇంకొటి; పరిగ్రహంబు = స్వీకారించుట; చేసి = చేసి; నిత్యంబున్ = ఎల్లప్పుడూ; ప్రజా = ప్రజల యొక్క; సృష్టిన్ = సృష్టించుట; అందున్ = అందు; వ్యాసక్తుండను = మిక్కిలి ఆసక్తి కలవాడను; ఐనన్ = అయినప్పటికిని; ప్రజలు = లోకులు; అబివృద్ధి = పెరుగుట; ఒందక = పొందక; ఉండుట = ఉండుట; కున్ = కు; ఏమి = ఏమి; కారణంబున్ = కారణము; అగున్ = అగును; అని = అని; అచ్చరువు = ఆశ్చర్యము; ఒంది = పడి; తత్ = వారి సంఖ్య; వృద్ధి = పెరుగుట; అగ = అయ్యే; విధంబున్ = విధానమును; ఆలోచించుచు = ఆలోచిస్తూ; దైవంబు = దైవము; ఇచ్చట = ఇక్కడ; విఘాతకంబు = అడ్డుపడునది; కాన = కావున; తత్ = దాని; అనుకూల్యంబున్ = అనుకూలత; ఆవశ్యకంబు = అవసరము; అని = అని; దానిన్ = దానికై; ఎదురు = ఎదురు; చూచుచు = చూస్తూ; యథోచిత = తగిన విధమైన; కృత్య = పనులు; కరణ = చేయుటకు; దక్షుండు = సిద్దపడువాడు; అగుచున్ = అగుచు; ఉండన్ = ఉండగా; చతుర్ముఖుని = బ్రహ్మదేవుని {చతుర్ముఖుడు - నాలుగు తలలు కలవాడు, బ్రహ్మదేవుడు}; దేహంబున్ = శరీరము; ద్వి = రెండు (2); విధంబు = విధములు; అయినన్ = అయిన; అట్టి = అటువంటి; రూప = రూపములు; ద్వయ = రెండు (2); విభాగంబున్ = విభాగములును; స్వరాట్టు = స్వరాట్టు {స్వరాట్టు - స్వయముగ ప్రకాశించువాడు}; అగు = అగు; స్వాయంభువ = స్వాయంభువ అను {స్వాయంభువుడు - స్వయంభువుడు ( స్వయముగ పుట్టినవాడు, బ్రహ్మదేవుడు) కుమారుడు}; మనువును = మనువును; తత్ = అతని; మహిషి = భార్య; అగు = అయిన; శతరూప = శతరూప; అను = అనే; కన్యకయున్ = స్త్రీయును; కాన్ = అగునట్లు; మిథునంబు = దంపతులు; అయి = అయి; జనియించెన్ = పుట్టిరి; ఆ = ఆ; మిథునంబు = దంపతులజంట; వలనన్ = వలన; ప్రియవ్రత = ప్రియవ్రత; ఉత్తానపాదులు = ఉత్తానపాదులు; అను = అనే; పుత్ర = పుత్రుల; ద్వయంబు = ఇద్దరు (2); ఆకూతి = ఆకూతి; దేవహూతి = దేవహూతి; ప్రసూతులను = ప్రసూతులను; కన్యకా = పుత్రికలు; త్రయంబునున్ = ముగ్గరును (3); కలిగిరి = పుట్టిరి; అందున్ = అందులో; ఆకూతిని = ఆకూతిని; రుచికున్ = రుచికున; కునున్ = కును; దేవహూతిన్ = దేవహూతిని; కర్దమున్ = కర్దమున; కునున్ = కును; ప్రసూతిన్ = ప్రసూతిని; దక్షున్ = దక్షున; కునున్ = కును; ఇచ్చెన్ = ఇచ్చెను; వీరల = వీరి; వలనన్ = వలన; కలుగు = పుట్టిన; ప్రజా = సంతానముల; సంతతులన్ = సమూహముల; చేత = చేత; జగంబులున్ = లోకములును; పరి = పూర్తిగా; పూర్ణంబులు = నిండినవి; అయ్యెన్ = అయ్యెను.
భావము:- ఇలా అడిగిన విదురునితో మైత్రేయుడు ఇలా అన్నాడు “బ్రహ్మదేవుని తూర్పు వైపు ముఖమునుండి “ఋగ్వేదము”, దక్షిణ ముఖంనుండి “యజుర్వేదము”, పశ్చిమ ముఖంనుండి “సామవేదము”, ఉత్తర ముఖంనుండి “అధర్వణవేదము” ఉద్భవించాయి.
యజ్ఞ నిర్వహణకు “హోత”, “అధ్వర్వుడు”, “ఉద్గాత”, “బ్రహ్మ” అని నలుగురు ఋత్విక్కులు ఉంటారు. హోత అనే ఋత్విక్కులు ఆచరించు గానం చేయబడనివి అయిన “శస్త్రములు” అను మంత్ర స్తోత్రాలు తూర్పు ముఖం నుండి వెలువడ్డాయి;
అధ్వర్వుడు ఆచరించు విధి రూపమైన “ఇజ్య”, గాన యోగ్యాలైన “స్తుతులు” అనే మంత్ర స్తోత్రాలూ దక్షిణ ముఖం నుంచి ఉదయించాయి. ఉద్గాత ప్రయోగించే “స్తోమాలు” అనే ఋగ్వేద మంత్రాలు పశ్చిమ ముఖంనుంచి ఉద్భవించాయి.
బ్రహ్మ అనే నాల్గవ ఋత్విక్కు ఆచరించే ప్రాయశ్చిత్త కాండ ఉత్తర ముఖంనుంచి ఉద్భవించింది.
ఉపవేదాలలో, ఆయుర్వేదం తూర్పుముఖం నుంచి, ధనుర్వేదం, దక్షిణ ముఖంనుంచి, గాంధర్వవేదం పశ్చిమ ముఖంనుంచి, విశ్వకర్మకు సంబంధించిన స్ధాపత్యమనే శిల్పవేదం ఉత్తర ముఖంనుంచి ఉత్పన్నమయినాయి.
పంచమవేదమైన ఇతిహాస పురాణాల సముదాయం బ్రహ్మదేవుని అన్ని ముఖాలనుంచి ఆవిర్భవించింది. ఇవి కాక కర్మ తంత్రము లయిన షోడశి, ఉక్థ్యము; చయనము, అగ్నిస్టోమము; అప్తోర్యామము, అతిరాత్రము; వాజపేయము, గోసవము; అనే నాలుగు జంటలూ, ధర్మపాదాలు అయిన విద్య, ధనం, దానం, తపస్సు, అనేవి క్రమంగా బ్రహ్మ నాలుగు ముఖాల నుంచి వెలువడినాయి.
బ్రహ్మచర్యం, గార్హపస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రయ చతుష్టయంకూడా, చతుర్ముఖుని చతుర్ముఖాల నుండి క్రమంగా జనించాయి. పై నాలుగు ఆశ్రమాలలో, ఒక్కొక్కటీ నాలుగు విధాలైన వృత్తులు ఉంటాయి.
బ్రహ్మచర్యంలో వృత్తులు నాలుగు. అవి 1. సావిత్రం (సవిత అంటే సూర్యుడు. ఆయన్ని ఆరాధించే గాయత్రి ఇందులో ప్రధానం కనుక దీనికి ఈ పేరు వచ్చింది.) అనగా ఉపనయనం మొదలుకొని మూడు దినాల పర్యంతం గాయత్రీ మంత్రం జపించటం; 2. ప్రజాపత్యం అనగా వేదాలు నాలుగు చదువుకొనుట; 3. బ్రాహ్మం అనగా వేదవ్రతాలు నాల్గింటిలో ఒక్కొక్కొటి ఒక్కొక్క సంవత్సర పర్యంతం ఆచరించేది; 4. బృహత్తన నైష్ఠికం అనగా వేదం పూర్తిగా నేర్చుకున్న అనంతరం ఆచరించేది;
గృహస్ఠ వృత్తులు నాలుగు. అవి 1. నిషిద్ధం కాని వ్యవసాయం జీవనోపాధిగా గలవారు వార్త అంటారు; 2. యజ్ఞయాగాది కర్మలకు ఉపయోగించే పనులు చేసి జీవించుట సంచయం అంటారు; 3. పరులను యాచించకుండా ఉండటం శాలీనం; 4. పొలాలలో రాలిన ధాన్యం కంకులు ఏరుకొని, వానిని శిలలపై నూర్చుకొని జీవించటం శిలోంఛం;
వానప్రస్ధ వృత్తులు నాలుగు. అవి 1. పండించకుండా లభించిన ఆహారాలు తీసుకొనేవారు వైఖాసనులు. 2. క్రొత్త పంట లభించగానే పూర్వం దాచిపెట్టిన పదార్ధాలను మిగలకుండా ఇతరులకు పంచిపెట్టేవారు వాలఖిల్యులు, 3. ప్రొద్దున లేవగానే ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కుకు పోయి అక్కడ ఆయాచితంగా లభించిన పదార్ధాలను భుజించేవారు ఔదుంబరులు. 4. చెట్టునపండి రాలిన ఫలాలను తిని జీవించేవారు ఫేనపులు. సన్యాసంలో కూడా నాలుగు వృత్తులు ఉన్నాయి. 1. సొంత కుటీరం ఉండి చేయదగిన కర్మలు చేసేవాడు కుటీచకుడు. 2. కుటీరం లేకుండా కర్మలు అప్రధానంగా జ్ఞానియై సంచరిస్తుండేవాడు బహూదుడు. 3. కేవలం జ్ఞానాభ్యాసం చేసేవాడు హంసుడు. 4. జ్ఞానాభ్యాసం కూడా లేకుండా పరబ్రహ్మతత్వం అలవడినవాడు నిష్క్రియుడు.
అన్వీక్షకి, త్రయి, వార్తా, దండనీతి అనే నాలుగు న్యాయవిద్యా చతుష్కం; వీనిలో 1. అన్వీక్షకి అంటే ఆత్మానాత్మ వివేకంకలిగి మోక్షాన్ని ప్రసాదించేవిద్య; 2. త్రయి అంటే స్వర్గాధిఫలాలను అందించే వేదకర్మానుష్ఠానం; 3. వార్త అంటే జీవనోపాధికోసం చేసే కృషి మొదలైన విద్యలు; 4. దండనీతి అంటే అర్ధ సంపాదనమే ప్రయోజనంగా గల విద్య; ఈ నాలుగు విద్యలలో అన్వీక్షకి మోక్షానికి, త్రయి కామానికి, వార్త ధర్మానికి, దండనీతి అర్ధానికి సాధనాలు. ఈ అన్వీక్షకి, త్రయి, వార్తా, దండనీతి న్యాయవిద్యా చతుష్కం నాలుగు బ్రహ్మదేవుని తూర్పు ముఖంనుండి పుట్టాయి; భూః భువః సువః అనే వ్యాహృతులు బ్రహ్మదేవుని దక్షిణ, పశ్చిమ, ఉత్తర ముఖాలనుండి క్రమంగా ఉదయించాయి.
అతని హృదయంలోని ఆకాశంనుండి ఓంకారం పుట్టింది; రోమాలనుండి ఉష్ణిక్ ఛందస్సు, చర్మం నుండి గాయత్రీ ఛందస్సు, మాంసం వలన త్రిష్టుప్ ఛందస్సు, కీళ్ళువల్ల అనుష్టుప్ ఛందస్సు, ఎముకలనుండి జగతీ ఛందస్సు, మజ్జవల్ల పంక్తి ఛ్చందస్సు, ప్రాణంవల్ల బృహతీ ఛందస్సు పుట్టాయి. హల్లులలో క వర్గం మొదలు ప వర్గం వరకూ అయిదు వర్గాలతో స్పర్శాత్మకుడైన జీవుడూ; అకారాది అచ్చులతో స్వరాత్మకమైన దేహమూ; శ, ష, స, హ లతో ఊష్మవర్ణాత్మకాలైన ఇంద్రియాలూ ఏర్పడ్డాయి; య, ర, ల, వ, అనే అంతస్థాలూ; 1. షడ్జం, 2.ఋషభం, 3. గాంధారం, 4. మధ్యమం, 5. పంచమం, 6. నిషాదం, 7. దైవతం, అనే సప్తస్వరాలూ; ఆత్మ బలమైన శబ్ధ బ్రహ్మమూ, ఇవన్నీ చతుర్ముఖుని లీలావిశేషాల వల్ల పుట్టాయి. పరమేశ్వరునకు వ్యక్తము, అవ్యక్తము అని రెండు రూపాలు. వ్యక్తరూపం వైఖరీవాక్కు; పరా, పశ్యంతీ, మధ్యమా అనే వాక్కులు అవ్యక్తరూపం. ఈ వ్యక్తావ్యక్తరూపాలు రెండింటికి ప్రణవమే ఆత్మ. భగవంతుడు, అవ్యక్తాత్ముడు కావటంవల్ల పరిపూర్ణుడు. వ్యక్తాత్ముడు కావటంచేత ఇంద్రాది శక్తి సంయుక్తుడు అయి కనిపిస్తాడు.
అనంతరం అనంత వీర్యవంతులైన ఋషుల సంతానం సవిస్తారమై వృద్ధి కాలేదని తలచి బ్రహ్మ తన పూర్వ శరీరాన్ని వదిలాడు. నిషిద్ధం కాని కామంపై ఆసక్తి కల మరొక్క దేహాన్ని ధరించాడు. నిత్యం ప్రజా సృష్టి యందు ఆసక్తుడు అయ్యాడు. అయినా ప్రజాభివృద్ధి జరుగ లేదు. కారణం తెలియక ఆశ్చర్యపడ్డాడు. అది వృద్ధి అయ్యే విధానాన్ని గూర్చి ఆలోచించాడు. దైవం ఇచట ప్రతికూలం; కాబట్టి దైవానుకూలత అవసరం అనుకున్నాడు; దైవానుకూలత కోసం ఎదురు చూస్తూ దైవాన్ని ధ్యానిస్తూ సందర్భోచిత కర్తవ్యాలు నిర్వర్తించసాగాడు.
అంతట బ్రహ్మదేవుని దేహం రెండు భాగలయింది. అందొకటి స్వరాట్టు అయిన, స్వాయుంభువు మనువుగా; మరొకటి అతని భార్య శతరూప అనే అంగనగా రూపొందాయి. ఆది మిథునమైన ఆ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, అనే ఇద్దరు పుత్రులూ; ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలూ పుట్టారు. వారిలో ఆకూతిని రుచి ప్రజాపతికి; దేవహూతిని కర్దమ ప్రజాపతికి; ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసారు. ఈ దంపతుల వల్ల కలిగిన అనంత ప్రజా సంతతుల వల్ల జగత్తంతా నిండుగా అయ్యాయి.”

తెభా-3-389-క.
ని మైత్రేయుఁడు పలికిన
విని మనమున హర్ష మొదవ విదురుఁడు మునినా
థునిఁ జూచి పలికెఁ గ్రమ్మఱ
జోదర పాదభక్తిశ మానసుఁ డై.

టీక:- అని = అని; మైత్రేయుడు = మైత్రేయుడు; పలికిన = చెప్పగా; విని = విని; మనమునన్ = మనసులో; హర్షము = సంతోషము; ఒదవన్ = కలుగగా; విదురుడు = విదురుడు; ముని = మునులకు; నాథునిన్ = నాయకుని; చూచి = చూసి; పలికెన్ = పలికెను; క్రమ్మఱ = మరల; వనజోదర = విష్ణుని {వనజోదరుడు - వనజము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; పాద = పాదములు ఎడ; భక్తి = భక్తికి; వశమానుండు = పరవశము యైనవాడు; ఐ = అయి.
భావము:- అని మైత్రేయుడు చెప్పగా విదురుడు విని సంతోషం పొందినవాడై హరిపాదభక్తి పరవశుడై మునిమఖ్యుడైన మైత్రేయుణ్ణి చూచి మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-3-390-క.
"ఘనుఁడు స్వయంభువునకుఁ బ్రియ
యుఁడు స్వాయంభువుండు దైతేయవిభే
సేవాచతురుండును
వినుతుండాదిరాజ్యత్తముఁడౌటన్

టీక:- ఘనుడు = గొప్పవాడు; స్వయంభువున్ = స్వయంభువున {స్వయంభువుడు - తనంత తాను పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; కున్ = కు; ప్రియ = ప్రియమైన; తనయుడు = పుత్రుడు; స్వాయంభువుండు = స్వాయంభువుడు {స్వాయంభువుడు - స్వయంభువుడు ( స్వయముగ పుట్టినవాడు, బ్రహ్మదేవుడు) యొక్క కుమారుడు}; దైతేయ = దైత్యుల యొక్క; విభేదన = నాశనము చేయువాని; సేవా = సేవించుట అందు; చతురుండును = నేర్పరుడును; జన = జనులచేత; వినుతుండు = స్తుతింపబడువాడు; ఆది = మొట్టమొదటి; రాజ్య = రాజ్యమును ఏలిన; సత్తముడు = సత్తువ కలవాడు; ఔటన్ = అగుట వలన.
భావము:- “స్వయంభువుడు అయిన బ్రహ్మదేవుని కుమారుడు స్వాయంభువుడు హరిచరణ సేవా పరాయణుడు. ఆదిరాజోత్తములలో అగ్రగణ్యుడై జనుల మన్ననలు అందుకున్నాడు

తెభా-3-391-క.
ని చరిత్రం బవ్యా
సుఖదము నిఖిల మంగళావహము సమం
చిముం గావున బుధసే
వి! నా కెఱుఁగంగఁ బలుకవే మునితిలకా!

టీక:- అతని = అతని యొక్క; చరిత్రంబు = చరిత్ర; అవ్యాహత = అడ్డగింపబడనిది, విఘ్నము లేనిది; సుఖదము = సుఖమును ఇచ్చునది; నిఖిల = సమస్తమైన; మంగళ = శుభములను; ఆవహము = రానిచ్చునది; సమ = మిక్కిలి; అంచితమున్ = పూజనీయమైనది; కావున = కనుక; బుధ = జ్ఞానుల చేత; సేవిత = సేవింపబడువాడ; నాకున్ = నాకు; ఎఱుగంగన్ = తెలియునట్లు; పలుకవే = చెప్పుము; ముని = మునులలో; తిలకా = శ్రేష్ఠుడా {తిలక - తిలకము ఏలా శ్రేష్ఠమైనదో అట్లు శ్రేష్ఠమైన వాడు}.
భావము:- పండితులచే సేవించబడు ఓ మునులలో అగ్రగణ్యుడా! ఆ స్వాయంభువుని చరిత్ర అఖండమైన ఆనందాన్ని అందించేది. సమస్త సౌభాగ్యాలనూ సమకూర్చేది. మిక్కిలి యోగ్యమైనది. అందువల్ల ఆయన వృత్తాంతం దయచేసి నాకు తెలియజెప్పు.

తెభా-3-392-క.
దియును గాక ముకుందుని
కమల మరందపాన రవశులై పెం
పొవినవారి చరిత్రము
మలమతి వినిన భవము ఫలము గాదే!"

టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగా; ముకుందుని = విష్ణుని {ముకుందుడు - ముకుందము (కుందురస్కము అనెడి సుగంధ ద్రవ్యము) వలె మంచిని వ్యాపింపచేయువాడు, (మోక్షప్రదుడు, వ్యు. (ముకుమ్ + దా + క) ముకుమ్ మకారాంతమైన అవ్యయము,మోక్షవాచకము, మోక్షమును ఇచ్చు వాడు, (ఆంద్ర శబ్దరత్నాకరము)) విష్ణువు}; పద = పాదములు అను; కమల = పద్మముల; మరంద = మకరందమును; పాన = తాగుట వలన; పరవశులు = పరవశులు; ఐ = అయి; పెంపొదవిన = అతిశయించిన; వారి = వారి యొక్క; చరిత్రము = వర్తనలు; సత్ = మంచి; అమల = నిర్మల; మతిన్ = మనసుతో; వినిన = వినినట్లయితే; భవము = జన్మము; సఫలము = ధన్యము; కాదే = కాదా ఏమి.
భావము:- అంతేకాక, విష్ణు పాదపద్మాల మకరందాన్ని త్రాగి మైమరచి మహాత్ముల మహానీయ చరిత్రను పరిశుద్ధమైన బుద్ధితో వినినవారి జన్మ తప్పక సార్ధకం అవుతుంది.”

తెభా-3-393-చ.
ని విదురుండు పల్కిన దయాన్వితుఁ డై మునినాథచంద్రుఁ డి
ట్లను ”శ్రుతిశాస్త్రపాఠకలితాత్మకుఁ డైన నరుండు పద్మలో
చరణారవిందయుగ సంగము గల్గిన సజ్జనుండు వొం
దిఫల మొందు భాగవతదివ్యకథాశ్రవణానురక్తిచేన్.”

టీక:- అని = అని; విదురుండు = విదురుడు; పల్కినన్ = అనగా; దయా = దయతో; ఆన్వితుడు = కూడినవాడు; ఐ = అయి; ముని = మునుల; నాథ = నాయకులలో; చంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగా; అను = అనెను; శ్రుతి = వేద; శాస్త్ర = శాస్త్రములను; పాఠ = పఠించుటతో; కలిత = కూడిన; ఆత్మకుడు = మనసు కలవాడు; ఐన = అయిన; నరుండున్ = మానవుడును; పద్మలోచన = విష్ణుని {పద్మలోచనుడు - పద్మముల వంటి లోచనములు కలవాడు, విష్ణువు}; చరణ = పాదములు అను; అరవింద = పద్మముల; యుగ = జంట తో; సంగము = సంబంధము; కల్గిన = కలిగిన; సత్ = మంచి; జనుండు = వాడు; పొందిన = పొందిన; ఫలము = ఫలితమును; ఒందున్ = పొందును; భాగవత = భాగవతము అను; దివ్య = దివ్యమైన; కథా = కథను; శ్రవణ = వినుట యందు; అనురక్తిన్ = కూరిమి; చేన్ = వలన.
భావము:- ఇలా పలుకుతున్న విదురునితో దయాహృదయు డైన మైత్రేయ మహాముని ఇలా అన్నాడు “నాయనా! వేదశాస్త్రం చదువుకునే మానవులూ, శ్రీహరి పాదాలు అనే కమలాల మీద అనురాగం గల సజ్జనులూ ఏ ఫలాన్ని పొందుతారో భగవద్భక్తుల దివ్యమైన కథలను ఆసక్తితో వినడంవల్ల అటువంటి ఫలమే లభిస్తుంది.”

తెభా-3-394-క.
ని చెప్పి మునికులాగ్రణి
నుజారి కథాసుధాప్లుస్వాతుం డై
నువునఁ బులకాంకురములు
మొయఁగ నానందబాష్పములు జడి గురియన్.

టీక:- అని = అని; చెప్పి = చెప్పి; మునికులాగ్రణి = మైత్రేయుడు {మునికులాగ్రణి - ముని జనములలో అగ్రమైన (పెద్ద) వాడు}; దనుజారి = విష్ణుని {దనుజారి - రాక్షసుల శత్రువు, విష్ణువు}; కథా = కథలు అను; సుధా = అమృతముచే; ప్లుత = తడసి; స్వాంతుడు = మనసు కలవాడు; ఐ = అయి; తనవునన్ = శరీరము; పులకాంకురములు = పులకింతలు; మొనయగన్ = పుట్టగా; ఆనంద = ఆనందము వలన; భాష్పములున్ = కన్నీటి బిందువులు అను; జడిన్ = వాన జడి; కురియన్ = కురియగా.
భావము:- ఇలా చెప్తున్న మైత్రేయ మహాముని హృదయం దానవాంతకుడైన శ్రీహరి కధలు అనే అమృతంలో తేలియాడింది. ఆయన శరీరం సంతోషంతో పొంగి పులకించింది. ఆయన నయనాలు ఆనందభాష్పాలు వర్షించాయి.

తెభా-3-395-సీ.
వినిపింపఁ దొడఁగె "నా నుఁడు స్వాయంభువుఁ-
డంగనాయుక్తుఁ డై బ్జగర్భు
కు మ్రొక్కి వినయవిమితోత్తమాంగుఁ డై-
స్తముల్ మొగిచి యిట్లనియె బ్రీతి
"జీవరాశులకు రాజీవసంభవ! నీవ-
నన రక్షణ వినాముల కరయ
హేతుభూతుఁడవు మా కెద్ది యాచరణీయ-
మైన కర్మము దాని నానతిమ్ము

తెభా-3-395.1-తే.
ట్టి కర్మంబు సేసిన నెసఁగు నీకు
వహితం బైన సంతోష మాత్మజుండు
నకునకు భక్తిఁ బరిచర్య లిపి కీర్తి
నంది నుతికెక్కి నర్తించు నందు నిందు.

టీక:- వినిపింపన్ = వినిపించుట; తొడగెన్ = మొదలిడెను; ఆ = ఆ; ఘనుడు = గొప్పవాడు; స్వాయంభువుడు = స్వాయంభువుడు; అంగనా = భార్యతో; యుక్తుడు = కూడినవాడు; ఐ = అయ్యి; అబ్జగర్భున్ = అబ్జగర్భుని; కున్ = కి; మ్రొక్కి = నమస్కరించి; వినయ = వినయముతో; వినమిత = వంగిన; ఉత్తమాంగుడు = శిరస్సు కలవాడు {ఉత్తమాంగము - ఉత్తమమైన అంగము (అవయవము), తల}; ఐ = అయ్యి; హస్తముల్ = చేతులు; మొగిచి = జోడించి; ఇట్లు = ఈవిధముగా; అనియెన్ = పలికెను; ప్రీతిన్ = ఇష్టపూర్వకముగా; జీవ = ప్రాణుల; రాశులు = సమూహముల; కున్ = కి; రాజీవసంభవ = బ్రహ్మదేవుడా {రాజీవసంభవుడు - రాజీవము (పద్మము) న సంభవుడు (పుట్టిన వాడు), బ్రహ్మదేవుడు}; నీవ = నీవే; జనన = సృష్టి; రక్షణ = స్థితి; వినాశములన్ = లయముల; కున్ = కు; అరయన్ = పరిశీలించి చూసిన; హేతు = కారణము; భూతుడవు = వెలసినవాడవు; మాకు = మాకు; ఎద్ది = ఏది; ఆచరణీయము = ఆచరింపదగినది; ఐన = అయినట్టి; కర్మము = పని; దానిన్ = దానిని; ఆనతిమ్ము = తెలుపుము; అని = అని;
ఎట్టి = ఎటువంటి; కర్మంబున్ = కర్మములను; చేసిన = చేస్తే; ఎసగున్ = అతిశయించును; నీకు = నీకు; అవహితంబునన్ = మిక్కిలి ఇష్టముతో; ఐన = కూడిన; సంతోషము = సంతోషము; ఆత్మజుండు = పుత్రుడు {ఆత్మజుడు - ఆత్మన్ (తనకు) జన్మించిన వాడు, కొడుకు}; జనకున్ = తండ్రి; కున్ = కి; భక్తిన్ = భక్తితో; పరిచర్య = సేవలు; సలిపి = చేసి; కీర్తిన్ = కీర్తిని; అంది = పొంది; నుతికిన్ = స్తోత్రములలోనికి; ఎక్కి = ఎక్కి; వర్తించున్ = ప్రవర్తించును; అందున్ = పరమునందును; ఇందున్ = ఇహమునందును.
భావము:- మహానుభావుడైన మైత్రేయుడు విదురునితో ఇలా చెప్పసాగాడు “స్వాయంభువుడు తన భార్య శతరూపతో కూడా బ్రహ్మదేవునకు నమస్కారం చేసాడు. వినయంతో తల వంచుకొని, చేతులు జోడించి ప్రీతి పూర్వకంగా ఇలా అన్నాడు. “ఓ పద్మంలో జనించిన బ్రహ్మదేవా! ఈ విశ్వంలోని సకల ప్రాణులనూ పుట్టించుటకూ, పోషించుటకూ, సంహరించుటకూ, కారణభూత మైన వాడవు నీవే. మేము చేయవలసిన పని ఏమిటో, మాకు ఆజ్ఞాపించు. ఎలాంటి పని చేస్తే నీకు మిక్కిలి సంతోషం కలుగుతుందో, అది చేస్తాము. తండ్రికి భక్తితో సేవ చేసిన తనయుడు ఈ లోకంలో, ఆ లోకంలో అఖండ యశస్సు ఆర్జిస్తాడు. అందరి అభిమానానికి పాత్రుడవుతాడు.”

తెభా-3-396-వ.
కావున నెఱింగింపు మట్టి సత్కర్మంబు."
టీక:- కావున = కనుక; ఎఱింగింపుము = తెలుపుము; అట్టి = అటువంటి; సత్ = మంచి; కర్మంబున్ = పనులను.
భావము:- అందుచేత, ఆ సుకార్యాలు అన్నీ తెలియజెప్పు పితామహా! బ్రహ్మదేవా!”

తెభా-3-397-క.
ని పలికిన స్వాయంభువ
ను మృదుభాషలకు నలరి నమునఁ గమలా
నుఁ డనురాగము ముప్పిరి
గొనఁ బ్రియతముఁ డైన సుతునకును నిట్లనియెన్.

టీక:- అని = అని; పలికిన = పలుకగా; స్వాయంభువ = స్వాయంభువుడు అను; మను = మనువు; మృదు = మృదువైన; భాష = మాటలు; కున్ = కి; అలరి = సంతోషించి; మనమునన్ = మనసులో; కమలాసనుడు = బ్రహ్మదేవుడు {కమలాసనుడు - కమలమువ ఆసీనుడు (కూర్చున్న వాడు), బ్రహ్మదేవుడు}; అనురాగము = ప్రేమ; ముప్పిరిగొనన్ = అతిశయించగా {ముప్పిరిగొను - ముప్పిరి ( మూడు రెట్లు) కొను (అగు), అతిశయించు}; ప్రియతముడు = అత్యంత ప్రియమైనవాడు {ప్రియము - ప్రియతరము - ప్రియతమము}; ఐన = అయిన; సుతున్ = పుత్రుని; కునున్ = కును; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = పలికెను.
భావము:- అని పలికి స్వాయంభువుని మృదు మధుర వాక్యాలకు చతుర్ముఖ బ్రహ్మదేవుడు చాలా సంతోషించాడు. అంతరంగంలో అనురాగం పొంగిపొరలగా అనుంగు నందనునితో కమలసంభవుడు ఇలా అన్నాడు.

తెభా-3-398-చ.
"మునుకొని తండ్రియాజ్ఞఁదలమోచి నిజోచితకృత్యమేమి పం
చినఁ దన శక్తియుక్తి నెడసేయక చేయుట పుండరీకలో
పదసేవ సేయుట ప్రజాపరిపాలనశాలి యౌటయున్
కునకున్ సుతుండు పరిర్య లొనర్చుట సువ్వె పుత్రకా!

టీక:- మునుకొని =పూనుకొని; తండ్రి = తండ్రి యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; తలమోచి = శిరసావహించి; నిజ = తనకు; ఉచిత = తగిన; కృత్యము = పని; ఏమి = ఏదైనను; పంచినన్ = చెప్పినను; తన = తన యొక్క; శక్తిన్ = శక్తిని; యుక్తిన్ = యుక్తిని యందు; ఎడ = అలక్ష్యము; చేయక = చేయకుండగ; చేయుట = చేయుచుండుట; పుండరీకలోచన = విష్ణుని {పుండరీకలోచనుడు - పుండరీకము (పద్మము) లవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; పద = పాదములను; సేవన్ = సేవను; చేయుట = చేయుట; ప్రజా = ప్రజలను; పరిపాలన = పరిపాలించుట యందు; శాలి = సమర్థుడు; ఔటయున్ = అగుట కూడ; జనకున్ = తండ్రి; కున్ = కి; సుతుండు = కొడుకు; పరిచర్యలు = సేవలు; ఒనర్చుట = చేయుట; సువ్వె = సుమా, సమానమే; పుత్రకా = కొడుకా.
భావము:- “నాయనా! స్వాయంభువా! కన్నతండ్రి ఆజ్ఞను శిరసావహించి తనకు తగిన పని యని ఏ పని చెబితే ఆ పనిని దక్షతతో తక్షణం చేయడం; పద్మాక్షుడైన శ్రీహరి పాదసేవ చేయడం; తండ్రి ఆజ్ఞానుసారం ప్రజలను పాలించటం; తనయుడు తన తండ్రికి సేవచేయడం క్రిందకే వస్తాయి.

తెభా-3-399-వ.
కావున.
టీక:- కావున = అందుచేత.
భావము:- అందుచేత.

తెభా-3-400-మ.
విరింపన్ హరి యజ్ఞమూర్తి బరమున్ విష్ణున్ హృషీకేశుఁ గే
వుఁ బద్మాక్షు గుఱించి జన్నములు శశ్వద్భక్తిఁ గావింప మా
వుఁ డాత్మం బరితోష మొందు నతఁ డుద్యత్ప్రీతిఁ గైకొన్న లో
వితానంబులు దుష్టి నొందు ననఘా! కావింపుమా యజ్ఞముల్.

టీక:- వివరింపన్ = వివరముగ చెప్పిన; హరిన్ = భగవంతుని {హరి - దుఃఖములను హరించు వాడు, విష్ణువు}; యజ్ఞమూర్తిన్ = భగవంతుని {యజ్ఞమూర్తి - యజ్ఞములు తన స్వరూపముగా కలవాడు, విష్ణువు}; పరమున్ = భగవంతుని {పరము - సర్వులకును పరమైనవాడు, విష్ణువు}; విష్ణున్ = భగవంతుని {విష్ణువు - స్వయంప్రకాశము కలవాడు, హరి}; హృషీకేశున్ = భగవంతుని {హృషీకేశుడు - హృషీకము (ఇంద్రియము) లకు ఈశ్వరుడు, విష్ణువు}; కేశవున్ = భగవంతుని {కేశవుడు - కేవలము ఈశుడు అయిన వాడు, విష్ణువు}; పద్మాక్షున్ = భగవంతుని {పద్మాక్షుడు - పద్మముల వంటి అక్షులు (కన్నులు) కలవాడు, విష్ణువు}; గుఱించి = కోసము; జన్నములు = యజ్ఞములు; శశ్వత్ = శాశ్వతమైన; భక్తిన్ = భక్తితో; కావింపన్ = చేసిన; మాధవుడు = భగవంతుడు {మాధవుడు - మనసును సంతోషము కలిగించువాడు, విష్ణువు}; ఆత్మన్ = మనసున; పరితోషము = సంతోషము; ఒందున్ = పొందున్; అతండు = అతడు; ఉద్యత్ = అతిశయించిన; ప్రీతిన్ = ఇష్టముగ; గైకొన్న = స్వీకరించిన; లోక = లోకముల; వితానంబులు = గుంపులు; తుష్టిన్ = తృప్తిని; ఒందున్ = పొందును; అనఘా = పుణ్యుడా; కావింపుమా = చేయుము; యజ్ఞముల్ = యజ్ఞములను.
భావము:- పుణ్యాత్మా! స్వాయంభువా! శ్రీమహావిష్ణువు యజ్ఞపురుషుడూ, పరమపురుషుడూ, హృషీకేశుడూ, కేశవుడూ, పద్మాక్షుడూ. అయన గూర్చి అధికమైన భక్తితో యజ్ఞాలు చెయ్యి. అలా చేస్తే ఆ శ్రీపతి ఎంతగానో సంతోషిస్తాడు. ఆ దేవుడు సంతోషిస్తే లోకాలన్నీ సంతృప్తి చెందుతాయి. అందుకని నీవు యజ్ఞాలు ఆచరించు.

తెభా-3-401-చ.
కుటిల భక్తిఁ గేశవ సర్పణబుద్ధిఁ గ్రతుక్రియల్ వొన
ర్ప విపరీతు లై యుముకురాసులు దంచి ఫలంబు నందఁ గా
చెడురీతి నూరక ధవ్యయ మౌటయ కాని మోక్షదా
మగుచున్నఁ దత్ఫలము నందరు విష్ణుపరాఙ్ముఖక్రియుల్.

టీక:- అకుటిల = అకల్మష; భక్తిన్ = భక్తితో; కేశవ = భగవంతునికి {కేశవుడు - కేవలము ఈశుడు అయిన వాడు, విష్ణువు}; సమర్పణ = సమర్పించు; బుద్ధిన్ = భావముతో; క్రతు = యజ్ఞ; క్రియల్ = క్రియలు; పొనర్పకన్ = చేయకుండగ; విపరీతులు = వ్యతిరేక విధముగ చేయువారు; ఐ = అయి; ఉముకు = ఊక; రాసులు = గుట్టలు; దంచి = దంచి {దంచు -బియ్యము మొదలగువాని కొరకు వడ్లు ఆదులను రోకళ్ళతో దంచుట}; ఫలంబున్ = ధాన్యమును {ఫలము - ఫలితము}; అందన్ = పొందుటను; కానక = చూడలేక; చెడున్ = చెడిపోవు; రీతిన్ = విధముగ; ఊరక = ఉట్టినే; ధన = ధనము; వ్యయంబున్ = ఖర్చు; ఔటయున్ = అగుటయే; కాని = కాని; మోక్ష = ముక్తిని; దాయకము = ఇచ్చునది; అగుచున్ = అవుతూ; ఉన్న = ఉన్నట్టి; తత్ = దాని; ఫలమున్ = ఫలితమును; అందరు = పొందరు; విష్ణున్ = విష్ణునికి; పరాన్ముఖ = ఇతరమైన దృక్కులతో; క్రియుల్ = పనులు చేయువారు.
భావము:- పవిత్రమైన చిత్తశుద్ధితో పరమేశ్వరార్పణ బుద్ధితో యజ్ఞకార్యాలు చేయాలి. అలాకాకుండా స్వార్ధబుద్ధితో పనులు చేయడం అంటే, వరిపొట్టును దంచి బియ్యం రాలేదని బాధపడటం లాంటిది. అందుచేత ధననాశమే గాని లవలేశం కూడా లాభం ఉండదు. హరి భక్తులు కాని వారు తాము ఆశించిన మోక్షాన్ని అందుకోలేరు.

తెభా-3-402-ఉ.
కావున యజ్ఞముల్ హరి వికారవిదూరు గుఱించి చేయు నీ
భాము సూనృతవ్రత శుస్థితిఁ జెందెడు నీ కుమారులున్
నీవును నీ ధరాభరము నెమ్మి వహింపుము సజ్జనావలిం
బ్రోవుము ధర్మమార్గమునఁ బుత్రక! దోషలతాలవిత్రకా!"

టీక:- కావునన్ = అందుచేత; యజ్ఞముల్ = యజ్ఞములు; హరిన్ = భగవంతుని; వికారవిదూరున్ = భగవంతుని {వికారవిదూరున్ - మనోవికారములను విశిష్టముగ దూరము చేయువాడు, విష్ణువు}; గురించి = కొరకు; చేయు = చేసేటటువంటి; నీ = నీ యొక్క; భావమున్ = ఉద్ధేశ్యము; సూనృత = సత్యమే; వ్రత = వ్రతముగా కలవాడ; శుభ = శుభమైన; స్థితిన్ = స్థితిని; చెందెడున్ = పొందుదురు; నీ = నీ యొక్క; కుమారులున్ = కుమారులును; నీవునున్ = నీవును; ఈ = ఈ; ధరా = భూమి యొక్క; భారము = బాధ్యత; నెమ్మిన్ = క్షేమమగునట్లు; వహింపుము = వహించండి; సత్ = మంచి; జన = ప్రజల; ఆవలిన్ = సమూహములను; ప్రోవుము = కాపాడండి; ధర్మ = ధర్మబద్ధమైన; మార్గమునన్ = మార్గములో; పుత్రకా = కుమారుడా; దోష = దోషములు అను; లతా = లతలకు; లవిత్రకా = కొడవలి వంటి వాడ.
భావము:- అందుచేత, కుమారా! స్వాయంభువా! పాపాలనే తీగలకు కొడవలివంటివాడవైన నీవు నిర్వికారుడైన శ్రీహరినిగూర్చి యజ్ఞం చేయాలని సంకల్పించు. నీ సంకల్పం సత్య స్వరూపమై శుభప్రదమవుతుంది. నీవు, నీ కుమారులూ సంతోషంతో భూమండలాన్ని ఏలే భారం వహించండి. నిర్మలమైన ధర్మ మార్గంలో, సజ్జనులైన ప్రజలను రక్షిస్తూ, పరిపాలించండి.”