పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/వరహావతార విసర్జనంబు
తెభా-3-708-వ.
అంత.
టీక:- అంత = అంతట.
భావము:- అప్పుడు...
తెభా-3-709-చ.
సవనవరాహమూర్తి సురశాత్రవుఁ ద్రుంచిన మీఁద భారతీ
ధవ ముఖ దేవతాముని కదంబము దన్ను నుతించు నట్టి సం
స్తవమున కాత్మలోనఁ బ్రమదంబునుఁ బొంది సమగ్ర మంగళో
త్సవము దలిర్ప నందఱఁ బ్రసాదవిలోకన మొప్పఁ జూచుచున్.
టీక:- సవనవరాహమూర్తి = యజ్ఞవరాహమూర్తి; సురశాత్రవున్ = హిరణ్యాక్షుని {సుర శాత్రవుడు - సురలు (దేవతలు)కి శత్రువు, హిరణ్యాక్షుడు}; తుంచిన = చంపిన; మీదన్ = తరువాత; భారతీధన = బ్రహ్మదేవుడు {భారతీ ధనుడు - భారతీదేవికి ధనము వంటివాడు, బ్రహ్మదేవుడు}; ముఖ = మొదలగు; దేవతా = దేవతలు యొక్కయు; ముని = మునులు యొక్కయు; కదంబము = కలసిన సమూహము; తన్ను = తనను; నుతించున్ = స్తుతించుచున్న; అట్టి = అట్టి; సం = చక్కటి; స్తవమున్ = స్తోత్రమున; కున్ = కు; ఆత్మ = మనసు; లోనన్ = లోన; ప్రమదంబునున్ = సంతోషమును; పొంది = పొంది; సమగ్ర = సంపూర్ణమైన; మంగళ = శుభములతో కూడిన; ఉత్సవమున్ = పండగలు; తలిర్పన్ = వికసించగా; అందఱన్ = అందరిని; ప్రసాద = అనుగ్రహ; విలోకనము = దృష్టి; ఒప్పన్ = ప్రసరించునట్లు; చూచుచున్ = చూస్తూ;
భావము:- దేవతల శత్రువైన హిరణ్యాక్షుని చంపినందుకు బ్రహ్మాది దేవతలూ, మునులూ తనను కొనియాడుతున్న సంస్తుతులకు యజ్ఞవరాహమూర్తి అయిన విష్ణువు మనస్సులో ఎంతో సంతోషించి సంపూర్ణ మంగళోత్సవం ఒప్పే విధంగా అందరినీ దయాదృష్టితో చూస్తూ....
తెభా-3-710-చ.
అరిగె వికుంఠధామమున కమ్మహితోత్సవసూచకంబుగా
మొరసె సుపర్వదుందుభు లమోఘములై ధరణీతలంబునం
గురిసెఁ బ్రసూనవృష్టి శిఖికుండము లెల్లెడఁ దేజరిల్లె భా
స్కరశశిమండలంబులు నిజద్యుతితో వెలుగొందె నత్తఱిన్. "
టీక:- అరిగెన్ = వెళ్ళెను; వికుంఠ = వైకుంఠ; ధామమున్ = పురమున; కున్ = కి; ఆ = ఆ; మహిత = గొప్ప; ఉత్సవ = వేడుకను; సూచకంబుగా = సూచిస్తున్నట్లుగా; మొరసెన్ = మోగినవి; సుపర్వ = దేవతల; దుందుభులు = పెద్దపెద్ద డోళ్ళు; అమోఘములు = అమోఘములు; ఐ = అయ్యి; ధరణీ = భూ; తలంబునన్ = మండలమున; కురిసెన్ = కురిసెను; ప్రసూన = పూల; వృష్టి = వాన; శిఖి = (యజ్ఞములందలి) అగ్ని; కుండములు = గుండములు; ఎల్లెడలన్ = అన్నిచోట్ల; తేజరిల్లెన్ = తేజోవంతమాయెను; భాస్కర = సూర్య; శశి = చంద్ర; మండలములున్ = మండలములు; నిజ = సహజ; ద్యుతి = కాంతి; తోన్ = తో; వెలుగొందెన్ = ప్రకాశించెను; ఆతఱిన్ = అప్పటినుండి.
భావము:- వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ మహోత్సవానికి సూచకంగా దేవదుందుభులు అమోఘంగా మ్రోగాయి. భూమిపైన పూలవాన కురిసింది. అంతటా హోమకుండాలు అగ్నులతో తేజరిల్లాయి. సూర్యమండలం, చంద్రమండలం సహజ కాంతులతో ప్రకాశించాయి.
తెభా-3-711-క.
అని యీ పుణ్యచరిత్రము
వనరుహసంభవుఁడు త్రిదివవాసులకుం జె
ప్పిన యది మైత్రేయుఁడు విదు
రున కెఱిఁగించిన విధంబు రూఢము గాఁగన్.
టీక:- అని = అని; ఈ = ఈ; పుణ్య = పావనమైన; చరిత్రమున్ = కథను; వనరుహసంభవుడు = బ్రహ్మదేవుడు {వనరుహ సంభవుడు - వనరుహము (పద్మము)న సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; త్రిదివ = స్వర్గలోకమున; వాసుల్ = నివాసుల; కున్ = కి; చెప్పినయది = చెప్పినట్టిది; మైత్రేయుడు = మైత్రేయుడు; విదురున్ = విదురుని; కిన్ = కి; ఎఱిగించిన = తెలిపిన; విధంబున్ = విధము; రూఢము = అర్థము; కాగన్ = అగునట్లు.
భావము:- అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పినటువంటి ఈ పవిత్ర చరిత్రను మైత్రేయుడు విదురునికి వివరించిన విధానాన్ని....
తెభా-3-712-క.
శుకయోగి పరీక్షిత్తున
కకుటిలమతి నెఱుఁగఁ జెప్పె"నని సూతుఁడు శౌ
నక ముఖ్యులైన మునివరు
లకుఁ దెలియగఁ జెప్పె మఱియు లాలనమొప్పన్.
టీక:- శుక = శుకుడు అను; యోగి = యోగి; పరీక్షిత్తున్ = పరీక్షిత్తున; కున్ = కు; అకుటిల = వక్రతలులేని; మతిన్ = విధముగ; ఎఱుగన్ = తెలియ; చెప్పెను = చెప్పెను; అని = అని; సూతుడు = సూతుడు; శౌనక = శౌనకుడు; ముఖ్యులైన = మొదలగు; ముని = మునులలో; వరుల్ = శ్రేష్ఠుల; కున్ = కి; తెలియగన్ = తెలియునట్లు; చెప్పెన్ = చెప్పెను; మఱియున్ = ఇంకనూ; లాలనము = బుజ్జగించుచున్న ధోరణి; ఒప్పన్ = ఒప్పగా.
భావము:- శుకయోగి పరీక్షిత్తుకు మంచిమనస్సుతో వినిపించాడని సూతుడు శౌనకాది మునులకు చక్కగా తెలియ జెప్పాడు.
తెభా-3-713-వ.
ఇవ్విధంబున మైత్రేయుండు సెప్పిన విని విదురుండు సంతసిల్లె నని.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ; మైత్రేయుడు = మైత్రేయుడు; చెప్పిన = చెప్పగా; విని = విని; విదురుండు = విదురుడు; సంతసిల్లెన్ = సంతోషించెను; అని = అని.
భావము:- ఈ విధంగా మైత్రేయుడు చెప్పగా విని విదురుడు సంతోషించాడు” అని...
తెభా-3-714-క.
"అనఘంబగు నీ చరితము
వినినఁ బఠించిన లభించు విశ్రుతకీర్తుల్
వనజోదరుపదభక్తియు
మునుకొని యిహపర సుసౌఖ్యములు జనములకున్."
టీక:- అనఘంబు = పుణ్యవంతము; అగున్ = అయిన; ఈ = ఈ; చరితము = కథను; వినినన్ = వినిననూ; పఠించినన్ = చదివిననూ; లభించున్ = దొరకును; విశ్రుత = పేరు; కీర్తుల్ = ప్రఖ్యాతులును; వనజోదరు = విష్ణుమూర్తి {వనజోదరుడు - వనజము (పద్మము) ఉదరమున కలవాడు, హరి}; పద = పాదముల ఎడ; భక్తియున్ = భక్తియును; మునుకొని = పూనుకొని; ఇహ = ఈలోక; పర = పరలోక; సౌఖ్యముల్ = సౌఖ్యములు; జనముల్ = జనుల; కున్ = కి.
భావము:- పాపాలను తొలగించే ఈ చరిత్రను విన్న, చదివిన లోకులకు విశేషకీర్తీ, విష్ణుపాదాలపై భక్తీ, ఇహపర సుఖాలూ తప్పక లభిస్తాయి”
తెభా-3-715-వ.
అని చెప్పి; వెండియు సూతుండు మహర్షుల కిట్లనియె "నట్లు పరీక్షిన్నరేంద్రుఁడు శుకయోగీంద్రుం గనుంగొని "మునీంద్రా! హిరణ్యాక్ష వధానంతరంబున వసుంధర సమస్థితిం బొందిన విధంబును; స్వాయంభువమనువుఁ బుట్టించిన యనంతరంబున విరించి దిర్యగ్జాతి జంతుసృష్టి నిమిత్తంబు లైన మార్గంబు లెన్ని సృజించె; మహాభాగవతోత్తముం డయిన విదురుండు గృష్ణున కపకారంబులు దలంచిన పాపవర్తను లగు ధృతరాష్ట్రపుత్రులం బాసి జనకుం డగు కృష్ణద్వైపాయనునకు సముం డగుచుఁ దన మనోవాక్కాయకర్మంబులు గృష్ణునంద చేర్చి భాగవతజనోపాసకుండై పుణ్యతీర్థసేవాసమాలబ్ధ యశో విగతకల్మషుం డగుచు మైత్రేయ మహాముని నేమి ప్రశ్నంబు లడిగె; నవి యెల్లం దెలియ నానతి"మ్మనిన రాజేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.
టీక:- అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = ఇంకనూ; సూతుండు = సూతుడు; మహా = గొప్ప; ఋషుల్ = ఋషుల; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అట్లు = ఆ విధముగ; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; నర = నరులకు; ఇంద్రుడు = ప్రభువు; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని; కనుంగొని = చూసి; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా; హిరణ్యాక్షు = హిరణ్యాక్షుని; వధ = సంహారము; అనంతరంబునన్ = తరువాత; వసుంధర = భూమి; సమ = సమమగు; స్థితిన్ = పరిస్థితిని; పొందిన = పొందినట్టి; విధంబునున్ = విధమును; స్వాయంభువ = స్వాయంభువుడు అను; మనువున్ = మనువును; పుట్టించిన = సృష్టించిన; అనంతరంబునన్ = తరవాత; విరించి = బ్రహ్మదేవుడు; తిర్యక్ = జంతు {తిర్యక్కులు - స్వయంచాలన కల జీవులు, జంతువులు}; జాతి = సమూహములను; జంతు = ప్రాణులను; సృష్టి = సృష్టించుటకు; నిమిత్తంబులు = కారణములు; ఐన = అయిన; మార్గంబులున్ = విధానములు; ఎన్ని = ఎన్ని; సృజించెన్ = సృష్టించెను; మహా = గొప్ప; భాగవత = బాగవతులలో {భాగవతుడు - భాగవతము యొక్క మార్గమున నడచువాడు}; ఉత్తముండు = ఉత్తముడు; అయిన = అయినట్టి; విదురుండు = విదురుడు; కృష్ణున్ = కృష్ణుని; కున్ = కి; అపకారంబున్ = అపకారమును; తలంచినన్ = తలపెట్టినట్టి; పాప = పాపపు; వర్తనులు = మార్గమున వర్తించువారు; అగు = అయిన; ధృతరాష్ట్ర = ధృతరాష్ట్రుని; పుత్రులన్ = కొడుకులను; పాసి = వదలి; జనకుండు = తండ్రి; అగు = అయిన; కృష్ణద్వైపాయనున్ = వేదవ్యాసుని; కున్ = కి; సముండు = సమానమైనవాడు; అగుచున్ = అవుతూ; తన = తన యొక్త; మనోవాక్కాయకర్మంబులు = త్రికరణసుద్దిగల కర్మములు; కృష్ణున్ = కృష్ణుని; అంద = అందే; చేర్చి = నిమగ్నముచేసి; భాగవత = భాగవతులగు; జన = జనుల; ఉపాసకుండు = సేవించువాడు; ఐ = అయ్యి; పుణ్య = పుణ్యవంతములగు; తీర్థ = తీర్థములందు; సేవా = సేవించుటచేత; సమా = చక్కగా; లబ్ధ = లభించిన; యశో = కీర్తిచే; విగత = పోగొట్టుకొనిన; కల్మషుండు = పాపములు కలవాడు; అగుచున్ = అవుతూ; మైత్రేయ = మైత్రేయుడు అను; మహా = గొప్ప; మునిన్ = మునిని; ఏమి = ఏమి; ప్రశ్నంబులున్ = ప్రశ్నలను; అడిగెన్ = అడిగెను; అవి = అవి; ఎల్లన్ = సమస్తమును; తెలియన్ = తెలియునట్లు; ఆనతిమ్ము = చెప్పుము; అనిన = అనగా; రాజ = రాజులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని; కున్ = కి; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
భావము:- అని చెప్పి మళ్ళీ సూతుడు మహర్షులతో ఇట్లా అన్నాడు. “ఆ విధంగా హిరణ్యాక్షుని కథ విన్న పరీక్షిత్తు శుకమహర్షిని చూచి “మునీంద్రా! హిరణ్యాక్షుడు చచ్చిన తరువాత లోకం సమస్థితిని పొందిన సంగతిని చెప్పు. స్వాయంభువ మనువును సృష్టించిన తర్వాత బ్రహ్మ పశుపక్ష్యాది జంతువులను సృష్టించడానికి ఎన్ని మార్గాలను కల్పించాడు? భాగవతోత్తముడైన విదురుడు శ్రీకృష్ణునకు అపకారం చేయ దలచిన దుష్టులైన ధృతరాష్ట్రుని కొడుకులను విడిచిపెట్టి, తన తండ్రియైన వేదవ్యాసునితో సమానుడై, వాక్కూ కర్మా సమస్తమూ శ్రీకృష్ణునిపై చేర్చి భగవద్భక్తులను సేవిస్తూ, పుణ్యతీర్థాలను సేవించడం వల్ల మనోవికాసం పొంది, పాపాలను పోగొట్టుకొని మైత్రేయ మహామునిని ఏమని ప్రశ్నించాడు? అవి అన్నీ తెలియజేయండి” అని అడిగిన రాజుతో శుకమహర్షి ఇలా అన్నాడు.
తెభా-3-716-సీ.
"విమలాత్ముఁ డైన యవ్విదురుండు మైత్రేయ-
మునివరుఁ జూచి యిట్లనియెఁ బ్రీతిఁ
"జతురాత్మ సకలప్రజాపతి యైనట్టి-
జలజగర్భుఁడు ప్రజాసర్గ మందు
మును ప్రజాపతులను బుట్టించి వెండియు-
జిత్త మం దేమి సృజింపఁ దలఁచె;
మును సృజించిన యట్టి మును లమ్మరీచాద్యు-
లబ్జజు నాదేశ మాత్మనిలిపి
తెభా-3-716.1-తే.
యర్థి నెట్లు సృజించిరి యఖిలజగము
మెఱసి మఱి వారు భార్యాసమేతు లగుచు
నేమి సృజియించి; రదిగాక కామినులను
బాసి యేమి సృజించి; రా భద్రయశులు.
టీక:- విమల = స్వచ్ఛమైన; ఆత్ముడు = మనసు కలవాడు; ఐన = అయిన; ఆ = ఆ; విదురుండు = విదురుడు; మైత్రేయ = మైత్రేయుడు అను; ముని = మునులలో; వరున్ = శ్రేష్ఠుని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ప్రీతిన్ = ప్రేమగా; చతుర = మంచినేర్పు కల; ఆత్మ = తెలివి కలవాడ; సకల = సమస్తమైన వానికిని; ప్రజాపతి = ప్రజాపతి; ఐన = అయిన; అట్టి = అటువంటి; జలజగర్భుడు = బ్రహ్మదేవుడు {జలజగర్భుడు - జలజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; ప్రజా = సంతానము; సర్గము = పొందుట; అందు = లో; మును = ముందుగ; ప్రజాపతులన్ = ప్రజాపతులను; పుట్టించి = సృష్టించి; వెండియున్ = మరల; చిత్తము = మనసు; అందు = లో; ఏమి = ఏమి; సృజింపన్ = సృష్టింపవలెనని; తలచె = అనుకొనెను; మును = ముందుగ; సృజించిన = సృష్టించిన; అట్టి = అటువంటి; మునుల్ = మునులు; ఆ = ఆ; మరీచి = మరీచి; ఆదులు = మొదలైనవారు; అబ్జజున్ = బ్రహ్మదేవుని {అబ్జజుడు - అబ్జము (పద్మము)న జన్మించినవాడు, బ్రహ్మదేవుడు}; ఆదేశమున్ = ఆజ్ఞను; ఆత్మన్ = మనసున; నిలిపి = ఉంచుకొని; అర్థిన్ = కోరి; ఎట్లు = ఏవిధముగ; సృజియించిరి = సృష్టించిరి; అఖిల = సమస్తమైన; జగమున్ = లోకమును; మెఱసి = ప్రకాశించి; మఱి = మరి; వారు = వారు; భార్యా = భార్యలతో; సమేతులు = కూడినవారు; అగుచున్ = అవుతూ; ఏమి = ఏమి; సృజియించిరి = సృష్టించిరి; కామినులను = స్త్రీలను; పాసి = లేకుండగ; ఏమి = ఏమి; సృజించిరి = సృష్టించిరి; భద్ర = శుభదృష్టి కల; యశులు = కీర్తిమంతులు.
భావము:- పవిత్రమైన మనస్సుగల ఆ విదురుడు మైత్రేయుణ్ణి చూచి ఎంతో సంతోషంతో ఇట్లా అన్నాడు. “చాతుర్యం కల మనస్సు కల ఓ మహర్షీ! సమస్తసృష్టికీ కర్త అయిన బ్రహ్మ ప్రజాసృష్టి కోసం ముందుగా ప్రజాపతులను సృష్టించి, ఆ తర్వాత ఇంకా ఏమి సృష్టించాలనుకున్నాడు? ముందుగా సృష్టించిన మరీచి మొదలగు మునులు బ్రహ్మదేవుని ఆదేశానుసారం లోకాల నన్నిటినీ ఎలా సృష్టించారు? కీర్తివంతులైన ఆ ప్రజాపతులు భార్యలతో ఉన్నప్పుడు ఏమేమి సృష్టించారు? భార్యలను ఎడబాసిన తర్వాత ఏం సృష్టించారు?
తెభా-3-717-క.
అందఱుఁ దమలో నైక్యముఁ
జెందినచో నేమి దగ సృజించిరి; కరుణా
కందళితహృదయ! యిన్నియుఁ
బొందుగ నెఱిగింపు మయ్య బుధనుత! నాకున్."
టీక:- అందఱున్ = అందరును; తమలోన్ = తమలోతాము; ఐక్యమున్ = ఐకమత్యము; చెందిన = కలిగిన; చోన్ = చోట; ఏమి = ఏమి; తగన్ = చక్కగా; సృజించిరి = సృష్టించిరి; కరుణా = దయ; కందళిత = చిగురించిన; హృదయ = హృదయముకలవాడ; ఇన్నియున్ = ఇవి అన్నియును; పొందుగన్ = చక్కగా; ఎఱిగింపుము = తెలుపుము; అయ్య = తండ్రి; బుధ = జ్ఞానులచే; నుత = కీర్తింపబడువాడ; నాకున్ = నాకు.
భావము:- దయామయ హృదయా! బుధులచే పొగడబడే ఓ మహర్షీ! వాళ్ళంతా కలిసికట్టుగా తమలో తాము సమైక్యమై ఏమేమి సృష్టించారు? నాకు వివరంగా చెప్పు”