Jump to content

పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/మహదాదుల సంభవంబు

వికీసోర్స్ నుండి


తెభా-3-201-సీ.
ధృతిఁ బూని కాలచోదితము నవ్యక్తంబుఁ-
బ్రకృతియు నని పేళ్ళఁ రగు మాయ
న మహత్తత్త్వ మెమిఁ బుట్టించె మా-
యాంశ కాలాది గుణాత్మకంబు
నైన మహత్తత్త్వ చ్యుత దృగ్గోచ-
మగుచు విశ్వనిర్మాణవాంఛ
నందుటఁ జేసి రూపాంతరంబునఁ బొందె-
ట్టి మహత్తత్త్వ మందు నోలిఁ

తెభా-3-201.1-తే.
గార్యకారణ కర్త్రాత్మత్వ మైన
హిత భూతేంద్రియక మనోయ మనంగఁ
గు నహంకారతత్త్వ ముత్పన్న మయ్యెఁ
గోరి సత్త్వరజస్తమోగుణక మగుచు.

టీక:- ధ్రుతిన్ = సంకల్పము; పూని = పూని; కాల = కాలముచే; చోదితమున్ = నడుపబడునది; అవ్యక్తంబున్ = అర్థముకానిది; ప్రకృతియున్ = ప్రకృతి; అని = అను; పేళ్ళ = పేరులతో; పరగు = తెలియబడు; మాయ = మాయ; వలన = వలన; మహత్తత్త్వమున్ = మహత్తత్త్వమును {మహత్తత్త్వము - పంచభూతాది సృష్టికంటె ముందు స్థితిలోని సృష్టితత్త్వము}; ఎలమిన్ = వికాసంతో,సంతోషంతో; పుట్టించెన్ = పుట్టించెను; మాయ = మాయయొక్క; అంశ = అంశయు; కాల = కాలము; ఆది = మొదలగు; గుణా = గుణములతో; ఆత్మకంబును = కూడినది; ఐన = అయిన; మహత్తత్త్వమున్ = మహత్తత్త్వము; అచ్యుత = విష్ణువునకు {అచ్యుతుడు - పతనము లేనివాడు, విష్ణువు}; దృక్ = దృష్టికి మాత్రమే; గోచరము = కనిపించునది; అగుచున్ = అవుతూ; విశ్వ = విశ్వమును; నిర్మాణ = నిర్మించవలెనను; వాంఛన్ = కోరిక; అందుటన్ = చెందుట; చేసి = వలన; రూప = రూపములో; అంతరంబునన్ = మార్పును; పొందెన్ = పొందెను; అట్టి = అటువంటి; మహత్త్తత్త్వమున్ = మహత్తత్త్వము; అందున్ = లోపల; ఓలిన్ = క్రమముగా, వరుసగా; కార్య = కార్యములు {కార్యము - చేయబడినది (క్రియ)}; కారణ = కారణములు {కారణము - దానికి (కార్యమునకు) హేతువు (కర్మ?)}; కర్తృ = కర్త {కర్తృ - చేయునది (కర్త)}; ఆత్మకము = కూడినది; ఐన = అయినట్టి;
మహిత = గొప్ప; భూత = పంచభూతములు; ఇంద్రియక = పంచజ్ఞానేంద్రియములు మరియు పంచకర్మేంద్రియములు; మనస్ = మనసు; మయము = కూడినది; అనంగన్ = అనుటకు; తగు = తగిన; అహంకార = అహంకారము యొక్క; తత్త్వము = తత్త్వము; ఉత్పన్నము = పుట్టుట; అయ్యెన్ = జరిగెను; కోరి = కోరి; సత్త్వ = సత్త్వము; రజస్ = రజస్సు; తమస్ = తమస్సులుగా; గుణకము = గుణముల వృద్ధి; అగుచున్ = అవుతూ.
భావము:- కాలచోదితమూ, అవ్యక్తమూ, ప్రకృతి అనే పేర్లతో వ్యవహృతమైన తన మాయవల్ల మహత్తత్త్వాన్ని పుట్టించాడు. మాయకు సంబంధించినదీ, కాలము మొదలైన గుణాలు కలదీ అయిన ఈ మహత్తత్త్వం భగవంతుని కంటికి మాత్రమే కనిపిస్తూ ప్రపంచాన్ని నిర్మించాలనే కోరిక కల్గడంతో ఇంకొక రూపాన్ని పొందింది. రూపాంతరం పొందిన అటువంటి మహత్తత్త్వంలో నుంచి క్రమంగా కారణం, కార్యం, కర్త అనే భేదాలు ఏర్పడి అవి వరుసగా పంచభూతాలు-ఇంద్రియాలు-మనస్సు అను రూపములుగా గోచరించాయి. ఈముడింటితో సత్త్వరజస్తమోగుణాలతో కూడిన అహంకారం ఏర్పడింది.

తెభా-3-202-వ.
వెండియు; రూపాంతరంబులం బొందుచున్న సాత్త్వికాహంకారంబు వలన మనంబును, వైకారికకార్యభూతంబు లైన దేవతాగణంబులును సంభవించె; నింద్రియాధిష్టాత లైన వాని వలన శబ్దంబు పూర్వంబునఁ బ్రకాశం బగుటం జేసి జ్ఞానేంద్రియంబు లయిన త్వక్చక్షుశ్శ్రో త్ర జిహ్వాఘ్రాణంబులునుఁ, గర్మేంద్రియంబు లయిన వాక్పాణి పాద పాయూపస్థములునుఁ, దైజసాహంకారంబు వలన శబ్దస్పర్శ రూపరస గంధంబు లుదయించె; నందు శబ్దంబు నిజగుణం బయిన శబ్దంబువలన నాకాశంబుఁ బుట్టించె; గగనంబు కాలమాయాంశయోగంబునం బుండరీకాక్షు నిరీక్షణంబున స్పర్శతన్మాత్రంబువలన వాయువుం గలిగించె; పవనుండు నభోబలంబున రూపతన్మాత్రాంశంబు వలన లోకలోచనం బైన తేజంబు నుత్పాదించె; తేజంబు కాలమాయాంశ యోగంబున నుత్తమశ్లోకుని విలోకనంబునఁ బవమాన యుక్తం బగుచు రసతన్మాంత్రంబువలన నంబువులం బుట్టించె; సలిలంబు కాలమాయాంశ యోగంబునం బరమేశ్వరానుగ్రహంబు గలిగి తేజోయుక్తం బైన గంధ గుణంబు వలనం బృథివిఁ గలిగించె; అందు గగనంబునకు శబ్దంబును, వాయువునకు శబ్ద స్పర్శంబులును, తేజంబునకు శబ్దస్పర్శ రూపంబులును, సలిలంబునకు శబ్దస్పర్శ రూపరసంబులును, పృథివికి శబ్దస్పర్శ రూపరస గంధంబులును, గుణంబులై యుండు; కాలమాయాంశ లింగంబులు గలిగి మహదాద్యభిమానంబులు నొందిన దేవతలు విష్ణుకళాకలితు లగుదు; రట్టి మహదాది తత్త్వంబు లైక్యంబు సాలమిం, బ్రపంచంబులు గల్పింప సమర్థంబులుగాక కృతాంజలులై యోగీశ్వరేశ్వరుం డైన నారాయణు నిట్లని స్తుతియించె.
టీక:- వెండియున్ = ఇంకనూ; రూప = రూపములో; అంతరంబులన్ = మార్పులను; పొందుచున్ = పొందుతూ; ఉన్న = ఉన్న; సాత్వికాహంకారంబున్ = సాత్వికాహంకారము {సాత్వికాహంకారము - సత్త్వగుణముతో కూడిన అహంకారము}; వలన = వలన; మనంబును = మనసును; వైకారిక = వైకారికములు అగు {వైకారికములు - ఒకపదార్థము నుండి తయారైన (వికారము పొందిన) వస్తువులను ఆ పదార్థము యొక్క వైకారికములు అనబడును}; కార్యభూతంబులు = కార్యరూపులు {కార్యభూతములు - కార్యకారణ సూత్రములోని కార్యరూపులు అయినవి.}; ఐన = అయిన; దేవతా = (అధి) దేవతల; గణంబులును = సమూహములును; సంభవించెన్ = పుట్టినవి; ఇంద్రియ = ఇంద్రియములకు; అధిష్టాతలు = అధికారము కలవారు; ఐన = అయిన; వాని = వాటి; వలన = వలన; శబ్దంబు = శబ్దము {శబ్దము - మార్పు, చలించు, ఝళుపు, ఊగుట}; పూర్వంబునన్ = ముందుగా; ప్రకాశంబు = వ్యక్తము; అగుటన్ = అగుట; చేసి = వలన; జ్ఞానేంద్రియములు = జ్ఞానేంద్రియములు; అయిన = అయినట్టి; త్వక్కు = చర్మము; చక్షు = కళ్ళు; శోత్ర = చెవులు; జిహ్వ = నాలుక; ఘ్రాణంబులును = ముక్కులును; కర్మేంద్రియములున్ = కర్మేంద్రియములు; ఐన = అయినట్టి; వాక్ = నోరు; పాణి = చేతులు; పాద = కాళ్ళు; పాయు = మల విసర్జనావయవము, గుదము; ఉపస్థములును = మూత్రావయవములును; తేజసాహంకారంబు = రజోగుణముతో కూడిన అహంకారము; వలన = వలన; శబ్ద = ధ్వని; స్పర్శ = స్పర్శ; రూప = ఆకారము; రస = రుచి; గంధంబలున్ = వాసనలును; ఉదయించె = పుట్టినవి; అందు = అందులో; శబ్దంబు = శబ్దము; నిజ = తన; గుణము = గుణము; అయిన = అయినట్టి; శబ్దంబు = శబ్దము; వలన = వలన; ఆకాశంబున్ = ఆకాశమును; పుట్టించెన్ = పుట్టించెను; గగనంబున్ = ఆకాశము; కాల = కాలము; మాయ = మాయల; అంశ = అంశముల; యోగంబునన్ = కలియుటవలన; పుండరీకాక్షు = విష్ణుని; నిరీక్షణంబునన్ = చూపువలన; స్పర్శ = స్పర్శ; తన్మాత్రంబు = తన్మాత్రము {తన్మాత్రము - దాని లక్షణము లేదా తత్త్వము}; వలన = వలన; వాయువున్ = గాలి; కలిగించె = పుట్టించెను; పవనుండు = వాయువు; నభస్ = ఆకాశము యొక్క; బలంబునన్ = బలమువలన; రూప = రూప; తన్మాత్రా = తన్మాత్రము యొక్క; అంశంబు = అంశముల; వలన = వలన; లోక = లోకమును; లోచనంబున్ = చూపునది; ఐన = అయిన; తేజంబున్ = తేజస్సును; ఉత్పాదించె = పుట్టించెను; తేజంబున్ = తేజస్సు; కాల = కాలము; మాయ = మాయల; అంశ = అంశల; యోగంబునన్ = కూడుట వలనను; ఉత్తమశ్లోకుని = విష్ణుని {ఉత్తమశ్లోకుడు - ఉత్తములచేత కీర్తింపబడువాడు, విష్ణువు}; విలోకనంబునన్ = చూపువలన; పవమాన = వాయువుతో; యుక్తంబు = కూడినది; అగుచున్ = అవుతూ; రస = రసముయొక్క; తన్మాత్రంబు = తన్మాత్ర; వలన = వలన; అంబువులున్ = నీటిని; పుట్టించెన్ = పుట్టించెను; సలిలంబు = నీరు; కాల = కాలము; మాయ = మాయల; అంశ = అంశల; యోగంబునన్ = కూడుట వలనను; పరమేశ్వర = విష్ణుని {పరమేశ్వరుడు - పరమమైన ఈశ్వరుడు, విష్ణువు}; అనుగ్రహంబున్ = అనుగ్రహము; కలిగి = కలిగి; తేజస్ = తేజస్సుతో; యుక్తంబు = కూడినది; ఐన = అయిన; గంధ = వాసనా; గుణంబు = గుణము; వలనన్ = వలన; పృథివిన్ = పృథివిని; కలిగించెన్ = పుట్టించెను; అందు = అందులో; గగనంబున = ఆకాశమున; కున్ = కు; శబ్దంబును = శబ్దమును; వాయువున్ = వాయువున; కున్ = కు; శబ్ద = శబ్దము; స్పర్శంబులును = స్పర్శంబులును; తేజంబున్ = తేజస్సున; కున్ = కు; శబ్ద = శబ్దము; స్పర్శ = స్పర్శ; రూపంబులును = రూపములును; సలిలంబున = జలమున; కున్ = కు; శబ్ద = శబ్దము; స్పర్శ = స్పర్శ; రూప = రూపము; రసంబులును = రసములును; పృథివి = పృథివి; కిన్ = కి; శబ్ద = శబ్దము; స్పర్శ = స్పర్శ; రూప = రూపము; రస = రసము; గంధంబులును = గంధములును; గుణంబులు = గుణములు; ఐ = అయి; ఉండున్ = ఉండును; కాల = కాలము; మాయా = మాయల; అంశ = అంశలు; లింగంబులు = లింగములు; కలిగి = కలిగి; మహత్ = మహత్తు; ఆది = మొదలగువాని యందలి; అభిమానంబునన్ = ఆసక్తి; ఒందిన = పొందిన; దేవతలు = దేవతలు; విష్ణు = విష్ణుని; కళా = అంశల; కలితులు = కూడినవారు; అగుదురు = అవుతారు; అట్టి = అటువంటి; మహత్ = మహత్తు; ఆది = మొదలగు; తత్త్వంబుల = తత్త్వముల; ఐక్యంబున్ = కలిసి ఒకటిగా నేర్పడుటకు; సాలమిన్ = సరిపోవక పోవుటచే; ప్రపంచంబులున్ = ప్రపంచములను; కల్పింప = సృష్టింప; సమర్థంబులు = సమర్థములు; కాక = కాక; కృతాంజలులు = నమస్కరించినవి; ఐ = అయి; యోగి = యోగులలో; ఈశ్వర = శ్రేష్ఠులకు; ఈశ్వరుండ = ప్రభువు; ఐన = అయినట్టి; నారాయణున్ = విష్ణుని; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించె = స్తుతించెను.
భావము:- మార్పు చెందుతున్న సాత్త్వికాహంకారం వల్ల మనస్సూ, వికారము చెందు కార్యరూపులైన ఇంద్రియాల ఆధిదేవతలైన దేవతా గణాలూ ఉదయించాయి. రాజసాహంకారం వల్ల జ్ఞానేంద్రియాలైన చర్మం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు, కర్మేంద్రియాలైన వాక్కు, హస్తాలు, పాదాలు, పాయువు, ఉపస్థు, జన్మించాయి. తామసాహంకారం వల్ల శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచ తన్మాత్రలు ఆవిర్భవించాయి. వీనిలో శబ్దం వల్ల ఆకాశం పుట్టింది. ఆకాశం కాలమాయాంశ యోగంతో పుడరీకాక్షుని నిరీక్షణంతో స్పర్శతన్మాత్రవల్ల వాయువును పుట్టింది. వాయువు ఆకాశంతో కలసి కాలమాయాంశ యోగంతో పుండరీకాక్షుని నిరీక్షణంతో రూపతన్మాత్రవల్ల లోకలోచనమైన తేజస్సును పుట్టించింది. తేజస్సు వాయువుతో కలసి కాలమాయాంశ యోగంతో పుండరీకాక్షుని నిరీక్షణంతో రసతన్మాత్రవల్ల జలాన్ని కలిగించింది. జలం తేజస్సుతో కలిసి కాల మాయంశయోగంతో పుండరీకాక్షుని నిరీక్షణంతో గంధతన్మాత్రవల్ల పృథ్విని పుట్టించింది.
ఈ విధంగా ఏర్పడ్డ పంచభూతాలలో ఆకాశానికి గుణం శబ్దం, వాయువునకు శబ్ద స్పర్శాలు గుణాలు, తేజస్సుకు శబ్దస్పర్శ రూపాలు గుణాలు, జలానికి శబ్దస్పర్శరూపరసాలు గుణాలు, పృథ్వికి శబ్ద స్పర్శరూపరస గంధాలు గుణాలై ఉంటాయి. కాల మయాంశ లింగ స్వరూపులై మహదాదులందు అభిమానం గల దేవతలు విష్ణుదేవి కళలే. ఐనా మహదాది తత్త్వాలూ, పంచభూతాలూ, పంచేంద్రియాలూ, పంచతన్మాత్రలూ వేరువేరుగా ఉండి అన్నీ సమైక్యం కాకపోవడంతో ప్రపంచాన్ని సృష్టించడానికి సామర్థ్యం వానికి చాలలేదు. అందువల్ల అందరూ చేతులు జోడించి యోగేశ్వరులకు ఈశ్వరుడైన శ్రీమన్నారాయణుని ఇట్లా దండక రూపంలో స్తోత్రం చేశారు-