పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/దేవతలు శ్రీహరిని నుతించుట
తెభా-3-706-వ.
కనుంగొని.
టీక:- కనుంగొని = చూసి.
భావము:- దేవతలు ఆ మహావిష్ణువును చూచి...
తెభా-3-707-చ.
"వనజదళాక్ష! యీ జగతి వారల మర్మము లీ వెఱింగి యీ
సునఁ బగబట్టు నీ దివిజసూదనుఁ జంపితి గాన యింక శో
భన మగు"నంచు హస్తములు ఫాలములం గదియించి యందఱున్
వినమితులై నుతించిరి వివేకవిశాలునిఁ బుణ్యశీలునిన్.
టీక:- వనజదళాక్ష = భగవంతుడ {వనజదళాక్షుడు - వనజము (పద్మము) దళ (రేకుల) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; ఈ = ఈ; జగతిన్ = విశ్వమున కల; వారల = వారి; మర్మముల్ = కీలకములు; ఈవున్ = నీవు; ఎఱింగి = తెలిసి; ఈసునన్ = ఈర్ష్యతో; పగబట్టున్ = పగపట్టెడి; ఈ = ఈ; దివిజ = దేవతలను; సూదనున్ = మర్దించువానిని; చంపితి = సంహరించితివి; కాన = కావున; ఇంక = ఇంక; శోభనము = శుభము; అగున్ = అగును; అంచున్ = అనుచు; హస్తములు = చేతులు; ఫాలములన్ = నుదుట; కదియించి = హత్తించి; అందఱున్ = సర్వులును; వినమితులు = వినయముతో వంగినవారు; ఐ = అయ్యి; నుతియించిరి = స్తుతించిరి; వివేకవిశాలునిన్ = మంచి వివేకము కలవానికిని; పుణుశీలునిన్ = పవిత్రమైన వర్తన కలవానికిని.
భావము:- “ఓ కమలాక్షా! ఈ లోకంలోని అందరి రహస్యాలను తెలిసికొని, అసూయతో పగబట్టిన ఈ దేవతల శత్రువైన హిరణ్యాక్షుని చంపావు. కాబట్టి ఇక అందరికీ శుభం కలుగుతుంది” అంటూ నుదుట చేతులు చేర్చి వినమ్రులై వివేకవంతుడూ, పుణ్యాత్ముడూ అయిన విష్ణువును స్తుతించారు.