పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/దితిగర్భప్రకారంబుజెప్పుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-3-498-ఉ.
దితిగర్భ మందు రుచిరాకృతితో నొక తేజ మన్యతే
జోమ లీల వెల్వడి వసుంధరయున్ గగనంబు నిండి సం
ఛాదిత పద్మబాంధవ నిశాకర దీప్తులు గల్గి సూచికా
భే మహోగ్ర సంతమసభీషణ మైన భయాకులాత్ము లై.

టీక:- ఆ = ఆ; దితి = దితి; గర్భంబున్ = గర్భము; అందున్ = లో; రుచిర = ప్రకాశించుచున్న; ఆకృతిన్ = ఆకారముతో; ఒక = ఒక; తేజమున్ = తేజము; అన్య = ఇతర; తేజస్ = తేజములను; దమ = సంహరించు; లీలన్ = విధముగా; వెల్వడి = ఉద్భవించి; వసుంధరయున్ = భూమియున్; గగనంబున్ = ఆకాశమును; నిండి = నిండి; సంఛాదిత = కప్పబడిన; పద్మబాంధవ = సూర్యుని {పద్మబాంధవుడు - పద్మమములకు బంధువైనవాడు, సూర్యుడు}; నిశాకర = చంద్రుని {నిశాకరుడు - రాత్రి ప్రకాశించువాడు, చంద్రుడు}; దీప్తులు = కాంతులు; కల్గి = కలిగి; సూచికా = సూది; అభేద = కూడా దూరని; మహా = గొప్ప; ఉగ్ర = తీవ్రమైన; సంతమస = కమ్ముకొన్న చీకటితో; భీషణము = భయంకరము; ఐన = అయిన; భయ = భయమును; ఆకుల = చీకాకుపడిన; ఆత్ములు = మనసు కలవారు; ఐ = అయి.
భావము:- ఆ దితి గర్భంలోనుంచి అతిరమణీయమైన ఆకారంతో ఒక తేజస్సు ఇతర తేజస్సు లన్నింటినీ అణచివేస్తూ వెలువడి, నింగీ నేలా నిండుకొని, సూర్యచంద్రుల కాంతులను కప్పివేసింది. సూదికూడా దూరనంతగా మిక్కిలి చిక్కనైన చీకటి భయంకరంగా అంతటా వ్యాపించింది. అందరూ భయంతో వణికిపోయారు.

తెభా-3-499-చ.
రగణంబు లెల్ల గమలాసను పాలికి నేఁగి తత్పదా
బ్జములకు మ్రొక్కి యంజలులు ఫాలములం గదియంగఁ జేర్చి చి
త్తముల భయంబు సంభ్రమముఁ దార్కొన నిట్లని విన్నవించి "రో
రకులాగ్రగణ్య! దురితార్ణవతారణ! సృష్టికారణా!

టీక:- అమర = దేవతా; గణంబులున్ = సమూహములు; ఎల్లన్ = సమస్తమును; కమలాసను = బ్రహ్మదేవుని; పాలికిని = దగ్గరకు; ఏగిన్ = వెళ్ళి; తత్ = అతని; పద = పాదములు అను; అబ్జముల్ = పద్మముల; కున్ = కు; మ్రొక్కి = మొక్కి; అంజలులు = మోడ్చిన చేతులు; ఫాలములన్ = నుదుట; కదియన్ = హత్తునట్లుగా; చేర్చి = చేర్చి; చిత్తములన్ = మనసులలో; భయమున్ = భయమును; సంభ్రమమున్ = తొట్రుపాటును; తార్కొనన్ = తారసిల్లగా; ఇట్లు = ఈవిధముగా; అని = అని; విన్నవించిరి = మనవి చేసిరి; ఓ = ఓ; అమరకులాగ్రగణ్య = బ్రహ్మదేవా {అమరకులాగ్రగణ్యుడు - అమరు (దేవత)ల కులము (గణము)లకు అగ్రగణ్యడు (మొదట లెక్కిందగు వాడు, పెద్దవాడు), బ్రహ్మదేవుడు}; దురితార్ణవతారణ = బ్రహ్మదేవా {దురితార్ణవతారణుడు - దురితములు (పాపములు) అను ఆర్ణవము (సముద్రము) తారణుడు (దాటించువాడు), బ్రహ్మదేవుడు}; సృష్టికారణా = బ్రహ్మదేవా {సృష్టికారణుడు - సృష్టికి కారణము అయినవాడు, బ్రహ్మదేవుడు}.
భావము:- దేవతలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, అతని పాదపద్మాలకు నమస్కరించి, చేతులు జోడించి భయంతోనూ తత్తరపాటుతోనూ ఇలా విన్నవించారు. “ఓ బ్రహ్మదేవా! నీవు దేవతాకులంలో శ్రేష్ఠుడవు. పాపమనే సముద్రాన్ని దాటించేవాడవు. సృష్టికి కారణమైనవాడవు.

తెభా-3-500-ఉ.
నీవు చరాచరప్రచయనేతవు, ధాతవు, సర్వలోకపా
లాళిమౌళిభూషణుఁడ, వంచితమూర్తివి, దేవదేవ! వా
ణీర! యీ యజాండమున నీవు నెఱుంగని యర్థ మున్నదే?
భామునం దలంపుము విన్నుల మమ్ము భవత్ప్రపన్నులన్.

టీక:- నీవు = నీవు; చరాచరప్రచయనేతవు = బ్రహ్మదేవుడవు {చరాచరప్రచయనేత - చరాచర (సమస్తమైన జీవుల) ప్రచయ (సమూహముల)కును నేత, బ్రహ్మదేవుడు}; ధాతవు = బ్రహ్మదేవుడవు {ధాత - ధరించు వాడు, బ్రహ్మదేవుడు}; సర్వలోకపాలావళిమౌళిభూషణుండవు = బ్రహ్మదేవుడవు {సర్వలోకపాలావళిమౌళిభూషణుండు - సమస్తమైన లోకములను పాలించువారి ఆవళి (సమూహము) కిని మౌళి (శిరస్సు)నకు భూషణుండు (భూషణము వంటివాడు), బ్రహ్మదేవుడు}; అంచితమూర్తివి = బ్రహ్మదేవుడవు {అంచితమూర్తి - పూజనీయమైన స్వరూపము కలవాడు, బ్రహ్మదేవుడు}; దేవదేవ = బ్రహ్మదేవా {దేవదేవుడు - దేవతలకే దేవుడు, బ్రహ్మదేవుడు}; వాణీవర = బ్రహ్మదేవా {వాణీవర - వాణి (సరస్వతీదేవి) కి వరుడు (భర్త), బ్రహ్మదేవుడు}; ఈ = ఈ; అజాండమున్ = బ్రహ్మాండమునందు; నీవు = నీవు; ఎఱుంగని = తెలియని; అర్థము = ప్రయోజనము; ఉన్నదే = కలదా ఏమి; భావమునన్ = మనసులో; తలంపుము = యోచింపుము; విపన్నులన్ = ఆపదపొందినవారలము; మమ్మున్ = మమ్ములను; భవత్ = నీ యొక్క; ప్రపన్నులన్ = శరణుజొచ్చిన వారిని.
భావము:- నీవు చరాచరప్రపంచానికి అధినేతవు. సర్వమూ ధరించేవాడవు. లోకపాలకు లందరిలో అగ్రగణ్యుడవు. పూజనీయమైన స్వరూపం కలవాడవు. సరస్వతికి భర్తవైన ఓ దేవదేవా! ఈ బ్రహ్మాండంలో నీకు తెలియనిది ఏదైనా ఉన్నదా? ఆపదల పాలై నిన్ను శరణు చొచ్చిన మమ్మల్ని గురించి మనస్సులో ఆలోచించు.

తెభా-3-501-వ.
దేవా కార్యరూపం బగు చేతనాచేతనాత్మక ప్రపంచంబునకుఁ గారణుండ వైన నీచేత సమస్త భువనంబులును సృజియింపఁ బడియె; నీవు సర్వభూతాత్మ భావవిదుండవు, లోకనాథ శిఖామణిభూతుండవు, విజ్ఞానవీర్యుండ, వవిద్యం జేసి యిట్టి స్రష్టరూపంబు నొందితి; గృహీత రజోగుణుండవు నీ యందుఁ బ్రపంచంబు లీనంబై యుండు; సుపక్వ యోగంబు నొంది నిష్కాములై ధ్యానంబున నిన్నరయుచు నిర్జిత శ్వాసేంద్రియాత్ము లై భవత్ప్రసాదంబు వడసిన వారలకుం బరాభవంబు లెక్కడివి; ఎవ్వని వాగ్జాలంబుచేఁ బాశబద్ధంబులైన పశువుల చందంబున నిఖిల జీవులు వర్తింతు; రట్టి నీకు నమస్కరించెదము; అహోరాత్ర విభాగాభావంబున లుప్తకర్మంబు లగు లోకంబులకు సేమంబు గావింపుము; శరణాగతులమైన మమ్ము నతిశయ కరుణారసపరిపూర్ణంబు లగు కటాక్షంబుల నీక్షించి రక్షింపుము; కశ్యప వీర్యంబు దితిగర్భంబున నుండి సకల దిగ్వలయంబు నాక్రమించి దారువందువహ్ని చందంబున లీనంబై ప్రవృద్ధం బగుచున్నది;"అని విన్నవించిన బృందారక సందోహంబులకు నానందంబు గందళింప నరవిందనందనుం డిట్లనియె.
టీక:- దేవా = బ్రహ్మదేవుడా; కార్య = కార్యకారణములలో కార్యము; రూపంబున్ = రూపమున ఉన్నది; అగు = అయిన; చేతన = చైతన్యము కలవియును; అచేతన = చైతన్యము లేనివియును; ఆత్మకంబున్ = కూడినది యైన; ప్రపంచంబున్ = ప్రపంచమున; కున్ = కు; కారణుండవు = కారణము యైన వాడవు; నీ = నీ; చేతన్ = చేత; సమస్త = సమస్తమైన; భువనంబులును = లోకములును; సృజియింపబడియెన్ = సృష్టింపబడినవి; నీవు = నీవు; సర్వ = అన్ని; భూత = జీవుల; ఆత్మ = మనసులలోని; భావ = భావములను; విదుండవు = తెలిసినవాడవు; లోక = లోకముల యొక్క; నాథ = ప్రభువుల యందు; శిఖామణి = శిరోమణి; భూతుండవు = వంటివాడవు; విజ్ఞాన = విజ్ఞానము, ప్రజ్ఞ; వీర్యుండవు = వీర్యముగా కలవాడవు, సాధనముగా కలవాడవు; అవిద్యన్ = అవిద్య; చేసి = వలన; ఇట్టి = ఇటువంటి; స్రష్ట = సృష్టికర్త; రూపంబున్ = రూపమును; ఒందితి = పొందితివి; గృహీ = స్వీకరించిన; రజోగుణుండవు = రజోగుణము కలవాడవు; నీ = నీ; అందున్ = లోపల; ప్రపంచంబున్ = ప్రపంచము; లీనంబున్ = లీనము, కలిసిపోయి; ఉండున్ = ఉండును; సు = మంచిగా; పక్వ = ఫలించిన; యోగంబున్ = యోగము; ఒంది = పొంది; నిష్కాములు = కోరికలులేనివారు; ఐ = అయ్యి; ధ్యానంబునన్ = ధ్యానము యందు; నిన్నున్ = నిన్ను; అరయుచున్ = కాంచుచూ; నిర్జితశ్వాసేంద్రియాత్ములు = ప్రాణాయామనిష్ణాతులు {నిర్జితశ్వాసేంద్రియాత్ములు - నిర్జిత (జయింపబడిన) శ్వాసేంద్రియ(శ్వాస వాయువులు) (ప్రాణాయామము అందు నేర్పు) ఆత్ముడు (కలవాడు), ప్రాణాయామనిష్ణాతుడు}; ఐ = అయ్యి; భవత్ = నీచేత; ప్రసాదంబునన్ = అనుగ్రహింపబడుట; పడసిన = పొందిన; వారల = వారి; కున్ = కి; పరాభవములు = అవమానములు; ఎక్కడివి = ఎక్కడైనాఉన్నవా లేవు; ఎవ్వని = ఎవరి యొక్క; వాక్ = మాటల; జాలంబున్ = మాయ; చేన్ = చేత; పాశ = తాళ్ళతో; బద్దంబులు = కట్టబడినవి; ఐన = అయిన; పశువుల = పశువుల {పశువులు - పాశబద్ధమగునవి, పెంపుడు జంతువులు}; చందంబునన్ = వలె; నిఖిల = సమస్తమైన; జీవులున్ = జనులు; వర్తింతురు = నడతురు; అట్టి = అటువంటి; నీకున్ = నీకు; నమస్కరించెదము = నమస్కరించెదము; అహ = పగలు; రాత్ర = రాత్రుల; విభాగము = తేడా; అభావంబునన్ = తెలియని పరిస్థితి వలన; లుప్త = లోపించిన; కర్మంబులు = పనులు; అగు = కలిగిన; లోకంబుల్ = లోకముల; కున్ = కు; క్షేమంబున్ = శుభములు చేకూరునట్లు; కావింపుము = చేయుము; శరణా = రక్షణ; గతులము = కోరువారము; అగు = అయిన; మమ్మున్ = మమ్ములను; అతిశయ = మిక్కిలి; కరుణా = దయా; రస = భావములుతో; పరిపూర్ణంబులు = నిండినవి; అగు = అయిన; కటాక్షంబులన్ = అనుగ్రహము కల చూపులతో; ఈక్షించి = చూసి; రక్షింపుము = కాపాడుము; కశ్యప = కశ్యపుని; వీర్యంబునన్ = వీర్యము వలన; దితి = దితి యొక్క; గర్భంబున్ = గర్భము; నుండి = నుండి; సకల = సమస్తమైన; దిక్ = దిక్కులతో కూడిన; వలయంబున్ = వలయమును, చక్రమును; ఆక్రమించి = వ్యాపించి; దారువు = కఱ్ఱ; అందున్ = అందు; వహ్ని = అగ్ని; చందంబునన్ = వలె; లీనంబున్ = లీనము, కలిసిపోయి; ఐ = అయ్యి; ప్రవృద్ధంబున్ = బాగా పెరుగిపోవుట; అగుచున్నది = జరుగుతున్నది; అని = అని; విన్నవించిన = విన్నపము చేయగా; బృందారక = దేవతల; సందోహంబుల్ = సమూహముల; కున్ = ఎడల; ఆనందంబున్ = ఆనందము; కందళింపన్ = చిగురించగా; అరవిందనందనుండు = బ్రహ్మదేవుడు {అరవిందనందనుడు - అరవిందము (పద్మము) యొక్క నందనుడు (కొడుకు), బ్రహ్మదేవుడు}; ఇట్లు = ఈవిధముగా; అనియెన్ = పలికెను;
భావము:- దేవా! కార్యరూపమైన ఈ చరాచర ప్రపంచానికి నీవే కారణమైనవాడవు. నీ చేతనే ఈ సమస్త లోకాలు సృష్టింపబడ్డాయి. సర్వ ప్రాణుల ఆంతర్యం తెలిసినవాడవు. లోకపాలకులలో మశ్రేష్ఠుడవు. విజ్ఞాన సంపన్నుడవు. మాయాప్రభావంతో ఈ సృష్టికర్త రూపాన్ని పొందావు. రజోగుణాన్ని పొందిన నీలో విశ్వమంతా లీనమై ఉంటుంది. యోగులై నిష్కాములై నిన్ను ధ్యానమార్గాన దర్శిస్తూ ప్రాణాయామంతో ఆత్మారాములై నీ అనుగ్రహాన్ని పొందినవాళ్ళకు అవమానా లెక్కడివి? తాళ్ళతో కట్టివేయబడిన పశువుల్లాగా ఎవ్వని ఆజ్ఞకు బద్ధులై సమస్తజీవులు ప్రవర్తిస్తారో అటువంటి నీకు నమస్కరిస్తున్నాము. పగలూ రాత్రీ అనే విభాగం లేకుండా సమస్తకర్మలూ లోపించిన లోకాలకు క్షేమాన్ని ప్రసాదించు. శరణు కోరి వచ్చిన మాపైన నీ పరిపూర్ణమైన దయతో నిండిన కటాక్షాన్ని ప్రసరింపజేసి కాపాడు. కశ్యపుని వీర్యం దితి గర్భంలో అన్ని దిక్కులనూ ఆక్రమించి కట్టెలో రగుల్కొనే అగ్నిలాగా లీనమై వృద్ధిపొందుతున్నది.” అని విన్నవించిన దేవతల నందరికీ ఆనందం కలిగే విధంగా బ్రహ్మ ఇలా అన్నాడు.