పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/కర్దముని తపోయాత్ర
తెభా-3-865-క.
మునిగణ సేవిత మగు వన
మునకుం జని యందు మౌనమున నిస్సంగుం
డును వహ్నిరహితుఁ డనికే
తనుఁడై యాత్మైకశరణ తత్పరు డగుచున్.
టీక:- ముని = మునుల; గణ = సమూహములచే; సేవితము = కొలువబడునది; అగు = అయిన; వనమున్ = తపోవనమున; కున్ = కు; చని = వెళ్ళి; అందున్ = దానిలో; మౌనమునన్ = మౌనముగ; నిస్సంగుడునున్ = తగులములు లేనివాడును; వహ్ని = అగ్నిహోత్రము; రహితుడు = విడిచిపెట్టినవాడు; అనికేతనుడు = ఇల్లు లేనివాడు; ఐ = అయ్యి; ఆత్మ = పరమాత్మ; ఏక = ఒక్కనికే; శరణ = శరణువేడుట యందు; తత్పరుడు = లగ్నమైనవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- కర్దముడు మునులు నివసించే అరణ్యానికి వెళ్ళి, అక్కడ మౌనవ్రతాన్ని పాటిస్తూ, లోకసంబంధాలను త్యజించి, హోమాది అగ్నికార్యాలను విడిచి, స్థిరనివాసం లేనివాడై, తనలోని పరమాత్మనే శరణు జొచ్చినవాడై....
తెభా-3-866-వ.
పరబ్రహ్మంబుఁ జిత్తంబున నిల్పి యహంకారంబు విడిచి మమత్వంబు నిరసించి దయాగుణంబునం జేసి సకల భూతంబు లందు సమత్వంబు భజియించి శాంతశేముషీ గరిష్ఠుం డగుచు నిస్తరంగం బగు వార్థి చందంబున ధీరుండై నిఖిల ప్రపంచంబును వాసుదేవమయంబుగా దలంచుచు భక్తియోగంబున భాగవత గతిం బొందె"నని చెప్పి; వెండియు, మైత్రేయుండు విదురునిం గనుంగొని "కర్దముండు వనంబునకుం జనిన యనంతరంబ మాతృవత్సలుం డయిన కపిలుండు బిందుసరంబున వసియించి యుండ దేవహూతి తత్త్వమార్గ ప్రదర్శకుం డైన సుతునిం గనుంగొని బ్రహ్మవచనంబులు దలంచుచు నిట్లనియె.
టీక:- పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మనే; చిత్తంబునన్ = మనసులో; నిల్పి = నిల్పుకొని; అహంకారంబున్ = అహంకారమును; విడిచి = వదలిపెట్టి; మమత్వంబున్ = మమకారమును; నిరసించి = తిరస్కరించి; దయాగుణంబునన్ = దయాగుణము; చేసి = వలన; సకల = సమస్తమైన; భూతములు = జీవుల; అందున్ = అందు; సమత్వంబున్ = సమబుద్ధిన్; భజియించి = సాధించి; శాంత = శాంతి పొందిన; శేముషీ = బుధ్ధితో; గరిష్ఠుండు = అతిశయించినవాడు; అగుచున్ = అవుతూ; నిస్తరంగంబున్ = అలలులేనిది; అగు = అయిన; వార్థి = సముద్రము; చందంబునన్ = వలె; ధీరుండు = ధారణ కలవాడు; ఐ = అయ్యి; నిఖిల = సమస్తమైన; ప్రపంచంబునున్ = లోకమును; వాసుదేవ = భగవంతునిచే {వాసుదేవుడు - వసించి ఉండు దేవుడు, విష్ణువు}; మయంబున్ = నిండినది; కాన్ = అగునట్లు; తలంచుచు = అనుకొనుచు; భక్తియోగంబునన్ = భక్తియోగమువలన; భాగవత = బాగవత జనులు; గతిన్ = చేరు గమ్యమును; పొందెన్ = చెందెను; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; మైత్రేయుండు = మైత్రేయుడు; విదురునిన్ = విదురుని; కనుంగొని = చూసి; కర్దముండు = కర్దముడు; వనంబున్ = తపోవనమున; కున్ = కు; చనిన = వెళ్ళిన; అనంతరంబ = తరువాత; మాతృ = తల్లి యందు; వత్సలుండు = వాత్సల్యము కలవాడు; అయిన = అయినట్టి; కపిలుండు = కపిలుడు; బిందుసరంబునన్ = బిందుసరోవరము వద్ద; వసియించి = నివసించి; ఉండెన్ = ఉండెను; దేవహూతి = దేవహూతి; తత్త్వ = తత్త్వజ్ఞానమునకు; మార్గ = మార్గమును; ప్రదర్శకుండు = చూపినవాడు; ఐన = అయిన; సుతునిన్ = పుత్రుని; కనుంగొని = చూసి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; వచనంబులున్ = ఉపదేశంబులను; తలంచుచు = తలచుకొనుచు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
భావము:- కర్దముడు పరబ్రహ్మను చిత్తంలో నిల్పుకొని, అహంకారాన్ని విడిచి, మమకారాన్ని వదలి, దయామయ హృదయంతో సమస్త ప్రాణులను తనతో సమానంగా చూస్తూ, ప్రశాంత స్వభావం కలవాడై, అలలు లేని సముద్రం వలె ధీరుడై, సమస్త ప్రపంచాన్ని విష్ణుమయంగా భావిస్తూ, భక్తియోగంతో భాగవతులు పొందే పరమపదాన్ని అందుకున్నాడు - అని మైత్రేయుడు విదురునితో చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “కర్దముడు అరణ్యానికి వెళ్ళిన తరువాత మాతృప్రేమ కలిగిన కపిలుడు బిందుసరోవరం దగ్గర నివసించి ఉండగా దేవహూతి తనకు తత్త్వమార్గాన్ని చూపగలిగే కుమారుని చూచి బ్రహ్మ చెప్పిన మాటలను తలచుకొంటూ ఇలా అన్నది.