Jump to content

పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/పృథుని రాజ్యపాలన

వికీసోర్స్ నుండి


తెభా-4-563-క.
నావుడు విని మైత్రేయుం
డా విదురునిఁ జూచి పలికె తి వినయమునం
బాన చరితుఁడు పృథుఁడు ధ
రారనుతుఁ డలఘుయశుఁడు ప్రమదం బలరన్.

టీక:- నావుడు = అనగా; విని = విని; మైత్రేయుండు = మైత్రేయుడు; ఆ = ఆ; విదురునిన్ = విదురుని; చూచి = చూసి; పలికెన్ = పలికెను; అతి = మిక్కిలి; వినయమునన్ = వినయముతో; పావన = పవిత్రమైన; చరితుడు = వర్తన కలవాడు; పృథుడు = పృథుచక్రవర్తి; ధరావర = రాజులచే {ధరా వరులు - ధర (భూమి)కి వరులు, రాజులు}; నుతుడు = స్తుతింపబడినవాడు; అలఘు = గొప్ప; యశుడు = కీర్తి కలవాడు; ప్రమదంబు = సంతోషము; అలరన్ = వికసించగా.
భావము:- ఆ మాటలు విని మైత్రేయ మహర్షి విదురుని చూచి మిక్కిలి వినయంతో ఇలా అన్నాడు. “పవిత్ర చరిత్రుడు, రాజులచేత నుతింపబడేవాడు, గొప్ప కీర్తి కలవాడు అయిన పృథువు సంతోషంతో…

తెభా-4-564-సీ.
రంగ దుత్తంగ తరంగ గంగా యము-
నా మధ్యమందు నున్నతి వసించి
కైకొని ప్రారబ్ధ ర్మ క్షయార్థమై-
ఖిల పుణ్యంబుల నుభవించు
చును సర్వదేశంబును దనయాజ్ఞ య-
ప్రతిహత సత్ప్రతామునఁ జెల్లఁ
బూని సర్వద్వీపములకు దాఁనొక్కండ-
వైష్ణవ భూసురాళికిఁ దక్కఁ

తెభా-4-564.1-తే.
క్కుఁ గల్గిన ప్రజ కెల్ల దండధరునిఁ
బోలి వర్తించుచును గొంతకా మరుగఁ
విలి యొకనాడు దీర్ఘసత్త్రంబు చేయ
ర్థిఁ గైకొని దీక్షితుం య్యె; నందు.

టీక:- రంగత్ = నాట్యమాడుతున్న; ఉత్తుంగ = ఎత్తైన; తరంగ = అలలుగల; గంగా = గంగానది; యమునా = యమునానది; మధ్యము = నడుమప్రదేశము; అందున్ = లో; ఉన్నతిన్ = అతిశయముతో; వసించి = ఉండి; కైకొని = పూని; ప్రారబ్ధకర్మ = ప్రారంభమైనకర్మఫలము; క్షయ = క్షీణింపచేయుట; అర్థము = కోసము; ఐ = అయ్యి; అఖిల = సమస్తమైన; పుణ్యంబులన్ = పుణ్యములను; అనుభవించుచునున్ = అనుభవిస్తూ; సర్వ = అన్ని; దేశంబులనున్ = దేశములను; తన = తన యొక్క; ఆజ్ఞ = ఆజ్ఞ; అప్రతిహతము = ఎదురులేని; సత్ = మంచి; ప్రతాపమునన్ = శౌర్యము; చెల్లన్ = చెల్లునట్లు; పూని = పూని; సర్వ = అఖిల; ద్వీపముల్ = ద్వీపముల; కున్ = కు; తాన్ = తాను; ఒక్కండ = ఒకడే యయ్యి; వైష్ణవ = వైష్ణవులైన; భూసుర = బ్రాహ్మణ; ఆవళి = సమాజము; కిన్ = కి; తక్క = తప్పించి; తక్కున్ = ఇంకా; కల్గిన = ఉన్నట్టి;
ప్రజ = జనుల; కిన్ = కి; ఎల్లన్ = అందరకి; దండధరుని = యముని; పోలి = వలె; వర్తించుచును = నడుస్తూ; కొంత = కొంత; కాలమున్ = కాలము; అరుగన్ = జరుగగా; తవిలి = పూని; ఒక = ఒక; నాడు = దినమున; దీర్ఘ = చిరకాలముజరిగెడి; సత్రంబున్ = యాగమును; చేయన్ = చేయవలెనని; అర్థిన్ = కోరి; కైకొని = చేపట్టి; దీక్షితుండు = దీక్షవహించినవాడు; అయ్యెన్ = అయ్యెను; అందున్ = దానిలో.
భావము:- ఉత్తుంగ తరంగాలు పొంగి పొరలే గంగా యమునా నదుల మధ్యప్రదేశంలో మహోన్నత స్థానంలో విరాజిల్లాడు. పురాకృత సుకృతం వల్ల సంప్రాప్తమైన భోగభాగ్యాలను అనుభవించాడు. అడ్డులేని ప్రతాపంతో అన్ని ప్రదేశాలలో తన ఆజ్ఞ చెల్లించుకుంటూ బ్రాహ్మణులకు, విష్ణుభక్తులకు తప్ప దుండగు లందరికీ దండధరుడై సప్తద్వీప పరీతమైన రాజ్యాన్ని పాలించాడు. ఇలా కొంతకాలం జరిగిన తరువాత ఒకనాడు దీర్ఘసత్రమనే యాగం చేయాలని సంకల్పించి దీక్ష వహించాడు. ఆ దీర్ఘసత్రంలో…

తెభా-4-565-తే.
రాజఋషి దేవఋషి పితృ బ్రహ్మ ఋషులు
నవరునిచేత విహిత పూనము లొంది
మధి కైశ్వర్యగతి నున్న మయమునను
జిరశుభాకారుఁ డా రాజశేఖరుండు.

టీక:- రాజఋషి = రాజర్షులు; దేవఋషి = దేవర్షులు; పితృ = పితరులు; బ్రహ్మఋషులు = బ్రహ్మర్షులు; జనవరున్ = రాజు; చేతన్ = చేత; విహిత = శాస్రోక్త విధానమున; పూజనములున్ = పూజలను; ఒంది = పొంది; సమధిక = అతిశయించిన; ఐశ్వర్య = ఐశ్వర్యము కల; గతిన్ = విధముగ; ఉన్న = ఉన్నట్టి; సమయముననున్ = సమయములో; చిర = మిక్కిలి; శుభ = మంగళకరమైన; ఆకారుడు = స్వరూపము కలవాడు; ఆ = ఆ; రాజశేఖరుండు = రాజోత్తముడు.
భావము:- రాజశేఖరుడైన ఆ పృథువు రాజర్షులను, దేవర్షులను, బ్రహ్మర్షులను, పితృదేవతలను చక్కగా పూజించాడు. ఆ సమయంలో నిత్యమంగళాకారుడైన ఆ రాజశేఖరుడు మహా తేజస్సుతో విరాజిల్లాడు.

తెభా-4-566-సీ.
న్నతోన్నతుఁడు సముత్తుంగ భుజుఁడు స-
న్మహనీయతర శోభమాన ముఖుఁడుఁ
జారుసంఫుల్ల కంజారుణేక్షణుఁడు సు-
నాసాపుటుండు మంస్మితుండు
క్రసూక్ష్మస్నిగ్ధ రనీల కేశుండుఁ-
మనీయరుచి కంబు కంధరుండు
సుభగ విశాల వక్షుండును ద్రివళి శో-
భిత మధ్యభాగుండుఁ బృథునితంబ

తెభా-4-566.1-తే.
మండలుండు నావర్త సమాన నాభి
వివరుఁడును గాంచనస్తంభ విలసదూరు
రాజితుండును నరుణచణుఁడును ధృత
వ దుకూ లోత్తరీయుఁ డున్నతయశుండు

టీక:- ఉన్నతోన్నతుడు = మిక్కిలిపొడగరి; సమ = మిక్కిలి; ఉత్తుంగ = ఎత్తైన; భుజుడు = భుజములుకలవాడు; సత్ = స్వచ్ఛమై; మహనీయతర = మిక్కిలిగొప్పగా {మహనీయము - మహనీయతరము - మహనీయకమము}; శోభాయమాన = శోభిల్లుతున్న; ముఖుండు = ముఖముకలవాడు; చారు = అందముగా; సంపుల్ల = వికసించిన; కంజ = పద్మము వంటి; అరుణ = ఎఱ్ఱని; ఈక్షణుడు = కన్నులుకలవాడు; సు = మంచి; నాసాపుటుండు = ముక్కుపుటములుకలవాడు; మందస్మితుండు = చిరునవ్వుకలవాడు; వక్ర = ఉంగరాలుతిరిగిన; సూక్ష్మ = సన్నని; స్నిగ్ద = చిక్కనైన; నీల = నల్లని; కేశుండు = శిరోజములు కలవాడు; కమనీయ = మనోహరమైన; రుచి = కాంతివంతమైన; కంబు = శంఖమువంటి; కంధరుండు = కంఠముకలవాడు; సుభగ = సౌభాగ్యకరమైన; విశాల = విశాలమైన; వక్షుండునున్ = వక్షస్థలముకలవాడు; త్రి = మూడు (3); వళి = ముడుతలుతో; శోభిత = శోభిల్లుతున్న; మధ్యభాగుండు = నడుముకలవాడు; పృథు = పెద్ద; నితంబ = పిరుదులు; మండలుండు = గుండ్రముగాకలవాడు; ఆవర్త = సుడిగుండమునకు.
సమాన = సమానమైన; నాభివివరుండడును = బొడ్డుకలవాడు; కాంచన = బంగారు; స్తంభ = స్తంభములవలె; విలసత్ = విలసిల్లెడి; ఊరు = తొడలచే; రాజితుండును = విరాజిల్లుతున్నవాడు; అరుణ = ఎఱ్ఱని; చరణుండును = పాదములుకలవాడు; ధృత = ధరించిన; నవ = కొత్త; దుకూల = తెల్లని వస్త్రము; ఉత్తరీయుండును = ఉత్తరయముగా కలవాడు; ఉన్నత = గొప్ప; యశుండును = కీర్తికలవాడును.
భావము:- పృథుచక్రవర్తి మిక్కిలి పొడవైనవాడు. ఎగుబుజాలవాడు. మహత్తర శోభావైభవంతో ప్రకాశించే ముఖం కలవాడు. చక్కగా వికసించిన కమలదళాలవంటి ఎఱ్ఱని కన్నులు కలవాడు. అందమైన ముక్కు కలవాడు. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతుండే పెదవులు కలవాడు. ఉంగరాలు తిరిగి నునుపుదేరిన నల్లని తల వెండ్రుకలు కలవాడు. శంఖంవంటి తొడలు గలవాడు. వెడద రొమ్మువాడు. మూడు ముడతలతో శోభిల్లే నడుము కలవాడు. బలిసిన పిరుదులు గలవాడు. సుడిగుండం వలె లోతైన పొక్కిలి కలవాడు. బంగారు స్తంభాలవంటి తొడలు గలవాడు. అరుణకాంతులు గల చరణాలు కలవాడు. నిగనిగ మెరిసే క్రొత్త పట్టుబట్టను ఉత్తరీయంగా ధరించినవాడు. అన్ని చోట్లా పేరెన్నిక గన్నవాడు.

తెభా-4-567-వ.
మఱియు, నియమనిమిత్తంబునం బరిత్యక్తభూషణుం డగుటం జేసి వ్యక్తాశేషగాత్రశ్రీకుండును, గృష్ణాజినధరుండును, శ్రీమంతుండును, గుశహస్తుండును, గృతోచితుండును, శిశిరస్నిగ్ధతారాక్షుండును నైన పృథుచక్రవర్తి సభామధ్యంబునం దారాగణమధ్య విభాసితుండును, సకలజనాహ్లాదకరుండును నగు సుధాకరుండునుం బోలె వెలుంగుచు లేచి నిలుచుండి సదస్య సంతోషదాయకంబులును, జిత్రపదవిరాజితంబులును, బ్రసన్నంబులును, బరిశుద్ధంబులును, గంభీరార్థంబులును, నవ్యాకులంబులును నైన భాషణంబుల నిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; నియమ = వ్రతనియమము; నిమిత్తంబునన్ = కోసము; పరిత్యక్త = విడిచిన; భూషణుండు = అలంకరములు కలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; వ్యక్త = వెల్లడగుచున్న; అశేష = సమస్తమైన; గాత్ర = శరీరము యొక్క; శ్రీకుండును = శోభ కలవాడును; కృష్ణాజిన = నల్లని లేడి చర్మము; ధరుండును = ధరించినవాడును; శ్రీమంతుండును = ధనవంతుడును; కుశ = దర్భలు; హస్తుండును = చేతిలో కలవాడును; కృత = చేయుచున్న; ఉచితుండును = తగిన పనులు కలవాడును; శిశిర = చల్లని; స్నిగ్ధ = స్నేహపూరిత మైన, మృదువైన; తారా = నక్షత్రములవలె మెరిసెడి; అక్షుండును = కన్నులు కలవాడును; ఐన = అయిన; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; సభా = సభకు; మధ్యంబునన్ = మధ్య భాగములో; తారా = తారల; గణ = సమూహము; మధ్య = నడుమ; విభాసితుండును = మిక్కిలి ప్రకాశించెడివాడు; సకల = సమస్త; జనా = జనులకు; ఆహ్లాదకరుండును = ఆనందము కలిగించెడి వాడు; అగు = అయిన; సుధాకరుండు = చంద్రుని {సుధాకరుండు - సుధ (వెన్నెల)ని కరుండు (కలుగ జేయువాడు), చంద్రుడు}; పోలెన్ = వలె; వెలుంగుచున్ = ప్రకాశించుతూ; లేచి = లేచి; నిలుచుండి = నిలబడి; సదస్య = సభ్యులకు; సంతోష = ఆనందమును; దాయకంబును = కలుగ చేయునవి; చిత్ర = చిత్రమైన; పద = పదములుచే; విరాజితంబును = విరాజిల్లెడివి; ప్రసన్నంబులును = ప్రసన్నత కనిపించెడివి; పర = మిక్కిలి; శుద్ధంబులును = స్వచ్ఛమైనవి; గంభీర = గంభీరమైన; అర్థంబులునున్ = అర్థములు కలవి; అవ్యాకులంబులు = వ్యాకులపాటు లేనివియును; ఐన = అయిన; భాషణంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ మహారాజు యజ్ఞదీక్షలో ఉన్నందున ఆభరణాలను ధరించలేదు. అందుచేత సహజమైన శరీరశోభ వెల్లడవుతున్నది. జింకతోలు ధరించినా శ్రీమంతుడై విలసిల్లుతున్నాడు. చల్లని చూపులు గల పృథుచక్రవర్తి దర్భలు చేత పట్టుకొని సభ మధ్యభాగంలో నక్షత్రగణాల నడుమ విలసిల్లే చంద్రునివలె సకల జనులకు ఆహ్లాదాన్ని ఇస్తూ ప్రకాశిస్తూ లేచి నిలబడ్డాడు. సదస్యులకు సంతోషాన్ని కలిగించేవి, చిత్రపదాలతో ప్రకాశించేవి, ప్రసన్నములయినవి, పవిత్రమైనవి, గంభీరమైన అర్థాలు కలవి, తడబాటు లేనివి అయిన మాటలతో ఇలా పలికాడు.

తెభా-4-568-క.
"వినుఁడీ సభ్యులు ధర్మము
యము నెఱుఁగంగఁ గోరు ట్టి జనుఁడు దాఁ
తలఁపునఁగల యర్థముఁ
ను నెఱిఁగింపంగ ధీర త్పురుషులకున్.

టీక:- వినుడీ = వినండి; సభ్యులు = సదస్యులు; ధర్మమున్ = ధర్మమును; అనయమున్ = అవశ్యము; ఎఱుగంగన్ = తెలిసికొన; కోరునట్టి = కోరెడి; జనుడు = వాడు; తాన్ = తను; తన = తన; తలపున = మనసున; కల = ఉన్నట్టి; అర్థమున్ = ప్రయోజనమును; చనున్ = తగును; ఎఱిగింపంగ = తెలుపుట; ధీర = ధీబుద్ధి కలిగిన; సత్పురుషులు = మంచివారి; కున్ = కి.
భావము:- “సభ్యులారా! దయచేసి వినండి. ధర్మాన్ని తెలుసుకోవాలని కోరేవాడు తన మనస్సులోని అభిప్రాయాన్ని ధీరులైన సత్పురుషులకు నివేదించడం మంచిది.

తెభా-4-569-సీ.
ను నీ లోకవితానంబు నెల్లను-
శాసించి భూప్రజా సంతతులను
త్త ద్విహిత వృత్తి దానంబులను జేసి-
క్షింప వివిధ మర్యాదఁ దప్పి
పోకుండ నిలుపుటకై మలజుచే ని-
యోగింపఁ బడితి; ని ట్లొనరియుండ
ట్టి ప్రజాపాలనా ద్యనుష్ఠాన వ-
శంబునఁ బ్రాక్కర్మ సాక్షి యీశుఁ

తెభా-4-569.1-తే.
డెట్టివానికి సంతుష్టి నెసగుచుండు
ట్టివానికి నే లోకమండ్రు బుధులు
కామదుఘములు నైన లోములు నాకు
రవిఁ గలుగు ననుష్ఠానరుఁడ నగుట.

టీక:- ఏనున్ = నేనును; ఈ = ఈ; లోక = లోకముల; వితానంబు = సమూహములను; ఎల్లన్ = అన్నిటిని; శాసించి = పాలించి; భూప్రజా = భూలోకవాసులగా; సంతతులను = పుట్టినవారిని; తత్తత్ = వారివారికి; విహిత = విధించబడిన; వృత్తిన్ = వృత్తులను; దానములను = ఇచ్చుట; చేసి = వలన; రక్షింపన్ = కాపాడగా; వివిధ = వివిధములైన; మర్యాదన్ = విధినిషేధములు; తప్పిపోకుండన్ = తప్పిపోకుండగా; నిలుపుట = నిలబెట్టుట; కై = కోసము; కమలజున్ = బ్రహ్మదేవుని {కమలజుడు - కమలమున (పద్మమున) పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; చేన్ = చేత; నియోగింపబడి = నియమించబడితిని; ఇట్లు = ఈ విధముగ; ఒనరి = పొసగి; ఉండన్ = ఉండగా; అట్టి = అటువంటి; ప్రజా = ప్రజలను; పాలనా = పరిపాలించుట; ఆది = మొదలైనవి; అనుష్టాన = నేరవేర్చుటకు; వశంబునన్ = విధేయతలో; ప్రాక్కర్మసాక్షి = భగవంతుడు {ప్రాక్కర్మసాక్షి - ప్రాక్ (సృష్టిలో మొదటి)కర్మకి సాక్షియైనవాడు, విష్ణువు}; ఈశుడు = భగవంతుడు; ఎట్టివానికిన్ = ఎటువంటివానికి.
సంతుష్టిన్ = సంతృప్తితో; ఎసగుచుండున్ = అతిశయించుండును; అట్టి = అటువంటి; వాని = వాని; కిన్ = కి; ఏ = ఏ; లోకము = లోకము ప్రాప్తించును; అండ్రు = అంటుంటారు; బుధులు = జ్ఞానులు; కామదుఘములు = అభీష్టదాయకములు పితుకునవి; ఐన = అయినట్టి; లోకములున్ = లోకములు; నాకున్ = నాకు; సరవిన్ = క్రమముగా; కలుగున్ = పొందును; అనుష్ఠాన = ఆచరించుటలో; పరుడను = నిష్ఠకలవాడను; అగుటన్ = అగుటవలన.
భావము:- లోకాల నన్నిటినీ పరిపాలిస్తూ ప్రజానీకానికి వారివారికి తగిన వృత్తులను ఒడగూర్చి రక్షించడానికి, ధర్మం దెబ్బతినకుండా నిలబెట్టడానికి బ్రహ్మదేవుడు నన్ను నియమించాడు. ఇటువంటి ధర్మబద్ధమైన ప్రజాపాలనం సమర్థంగా ఆచరించేవానికి కర్మసాక్షి అయిన భగవంతుడు సంతోషించి ఏ లోకాలను అనుగ్రహిస్తాడో అటువంటి అభీష్టదాయకాలైన పుణ్యలోకాలు సదాచారపరుడనైన నాకు లభిస్తాయి.

తెభా-4-570-వ.
ఇట్లు ప్రజలను ధర్మంబుల యందు ననుశాసింపక యర్థకాముండై వారివలన నప్పనంబులు గొనెనేని వారల పాపంబు దనకుఁ బ్రాపింపం దేజోహీనుండై భూవిభుండు చెడుం; గావునం బ్రజలు భూపతి హితార్థంబునకు, స్వార్థంబునకు, నసూయారహితులై వాసుదేవార్పణ బుద్ధింజేసి ధర్మంబు నెప్పుడు నాచరింపవలయు; నిదియ నన్ను ననుగ్రహించు; టదియునుం గాక పితృదేవర్షి తుల్యులగు మీర లనుమోదించి కర్తయు ననుశాసకుండు ననుజ్ఞాతయు నయిన నాకుఁ బరలోకంబున నే ఫలంబు గలుగు నట్టి ఫలంబునకు సదృశంబైన కర్మం బాచరింపవలయు; నట్లయిన సంతోషంబు నొందుదు” ననిన వార లా రాజేంద్రున కిట్లనిరి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ప్రజలను = ప్రజలను; ధర్మంబుల = ధర్మమార్గవర్తన; అందున్ = అందు; అనుశాసింపకన్ = శిక్షింపకుండగ; అర్థ = ధనమును; కాముండు = కోరెడివాడు; ఐ = అయ్యి; వారి = వారి; వలనన్ = నుండి; అప్పనంబులున్ = కానుకలు; కొనెనేని = తీసుకొన్నచో; వారల = వారి యొక్క; పాపంబున్ = పాపము; తన = తన; కున్ = కు; ప్రాపింపన్ = చెందగా; తేజస్ = తేజస్సు; హీనుండు = తగ్గిపోయినవాడు; ఐ = అయ్యి; భూవిభుండు = రాజు; చెడున్ = చెడిపోవును; కావునన్ = అందుచేత; ప్రజలు = ప్రజలు; భూపతి = రాజు; హిత = మేలు; అర్థంబున్ = జరుగుట; కున్ = కోసము; స్వార్థంబున్ = తమ ప్రయోజనము; కున్ = కోసము; అసూయ = అసూయ; రహితులు = లేనివారు; ఐ = అయ్యి; వాసుదేవ = విష్ణుమూర్తికి; అర్పణ = సమర్పించు; బుద్ధిన్ = భావము; చేసి = కలిగి; ధర్మంబున్ = ధర్మమార్గవర్తన; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; ఆచరింపన్ = చేయ; వలయును = వలెను; ఇదియ = ఇదే; నన్నున్ = నన్ను; అనుగ్రహించుట = అనుగ్రహించుట; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; పితృ = పితృదేవతలు; దేవర్షి = దేవఋషులకు; తుల్యులు = సరితూగువారు; అగు = అయిన; మీరలన్ = మిమ్ములను; అనుమోదించి = అంగీకరించి; కర్తయున్ = కర్త; శాసకుండున్ = పరిపాలకుడు; అనుజ్ఞాతయున్ = అనుజ్ఞ యిచ్చువాడు; అయిన = అయిన; నాకున్ = నాకు; పరలోకంబునన్ = పై లోకమున; ఏ = ఎట్టి; ఫలంబున్ = ఫలితము; కలుగన్ = కలుగుతుందో; అట్టి = అటువంటి; ఫలంబున్ = ఫలితమున; కున్ = కు; సదృశంబున్ = సరిపడునది; ఐన = అయిన; కర్మంబున్ = కర్మములను; ఆచరింపన్ = చేయ; వలయున్ = వలెను; అట్లు = ఆ విధముగ; అయిన = అయినచో; సంతోషంబున్ = సంతోషమును; ఒందుదును = పొందెదను; అనినన్ = అనగా; వారలు = వారు; ఆ = ఆ; రాజ = రాజులలో; ఇంద్రున్ = ఇంద్రుని వంటివాని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ప్రజలను ధర్మమార్గాన పరిపాలించకుండా ధనాపేక్షతో ప్రజలనుండి పన్నులు గుంజుకొన్న రాజుకు ప్రజల పాపం సంక్రమిస్తుంది. అందుచేత ఆ రాజు తేజోహీనుడై నశిస్తాడు. కాబట్టి ప్రజలు రాజు మేలు కొరకు, తమ మేలు కొరకు అసూయారహితులై పరమేశ్వరార్పణ బుద్ధితో ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరించాలి. మీరు ఇలా చేయడమే నన్ను అనుగ్రహించడమని భావిస్తాను. మీరు నాకు తండ్రుల వంటివారు. దేవతల వంటివారు. ఋషుల వంటివారు. అటివంటి మీరు దీనికి సమ్మతించి మీ నాయకుడనైన నాకు పరలోకంలో ఏ ఫలం కలుగుతుందో అటువంటి ఫలానికి తగిన మంచి కార్యాలను ఆచరించాలి. మీరు అలా చేసినట్లయితే నేను సంతోషిస్తాను” అని పృథుచక్రవర్తి పలుకగా సభ్యులు ఇలా అన్నారు.

తెభా-4-571-క.
"జనాయక! ప్రజ లిర వొం
ది ధర్మము లెల్ల వాసుదేవార్పణ బు
ద్ధినిఁ జేయవలయు నంటివి
యంబును వాసుదేవుఁ నఁ గలఁడె మహిన్? "

టీక:- జననాయక = రాజ; ప్రజలు = ప్రజలకి; ఇరవొందిన = అమరిన; ధర్మముల్ = ధర్మములు; ఎల్లన్ = సమస్తము; వాసుదేవ = నారాయణదేవునికి; అర్పణంబున్ = సమర్పణము చేయు; బుద్ధినిన్ = భావముతో; చేయవలెన్ = చేయవలెను; అంటివి = అన్నావు; అనయంబునున్ = ఎల్లప్పుడును; వాసుదేవుడు = విష్ణుమూర్తి; అనన్ = అనెడివాడు; కలడె = ఉన్నాడ; మహిన్ = భూమ్మీద.
భావము:- “మహారాజా! వాసుదేవార్పణ బుద్ధితో ప్రజలు ధర్మకార్యాలను ఆచరించాలని నీవు చెప్పావు. అసలు వాసుదేవు డనేవాడు అంటూ ఒకడున్నాడా?"

తెభా-4-572-సీ.
నవిని వారికి నుజేశుఁ డను "నర్హ-
ములార! వినుఁడయ్య! విలి మీరు
జ్ఞాధిపతియైన ఖిలేశ్వరుఁడు గొన్ని-
తములఁ గలఁడు ధీమంతులార!
ట్లైన మీరలు నందుకు విప్రతి-
త్తి గల్గుట నుబ్రన్న మరయ
గా దంటిరేని నా నునిచే రచితమై-
కాంతిమంత మగు జగంబు గానఁ

తెభా-4-572.1-తే.
డుచు నున్నది; యిట్టి ప్రపంచ రచిత
ర్మ వైచిత్ర్య మమ్మేటి లుగకున్న
మరు నను తదుక్తు లుపపన్నములు కావు;
కాన నవ్వాసుదేవుండు లఁడు మఱియు.

టీక:- అనన్ = అనగ; విని = విని; వారి = వారి; కిన్ = కి; మనుజేశ్వరుడు = రాజు; అను = అనెను; అర్హతములార = అత్యంతయోగ్యులారా {అర్హులు - అర్హతరులు - అర్హతములు}; వినుడు = వినండి; అయ్య = తండ్రులు; తవిలి = తగిలి; మీరు = మీరు; యజ్ఞాధిపతి = యజ్ఞములకధిపతి; ఐన = అయిన; అఖిలేశ్వరుడు = హరి {అఖిలేశ్వరుడు - సమస్తమునకు ఈశుడు, విష్ణువు}; కొన్ని = కొందరి; మతములన్ = వాదనలలో; కలడు = ఉన్నాడు; ధీమంతులార = ధీశక్తికలవారలారా; అట్లు = ఆ విధముగ; అయినన్ = అయియుండగ; మీరలు = మీరు; అందుకు = దానికి; విప్రతిపత్తి = విరుద్ధవాదనమున; కలుగుటను = ఉండుటచేత; ప్రపన్నమున్ = భక్తినిచూపుట; అరయన్ = తరచిచూసిన; కాదు = సరికాదు; అంటిరేని = అన్నచో; ఆ = ఆ; ఘనునిన్ = గొప్పవాని; చేన్ = చేత; రచితము = సృష్టింపబడినది; ఐ = అయ్యి; కాంతివంతము = ప్రకాశవంతము; అగు = అయిన; జగంబున్ = ప్రపంచము; కానబడుచున్నది = కనపడుతున్నది.
ఇట్టి = ఇటువంటి; ప్రపంచ = లోకములందు; రచిత = సృష్టింపబడిన; కర్మ = కర్మల; వైచిత్ర్యము = చిత్రవిచిత్రములు; ఆ = ఆ; మేటి = గొప్పవాడు; కలుగకున్నన్ = లేనిచో; అమరున్ = కుదురును; అను = అనెడి; తత్ = ఆ; ఉక్తులు = మాటలు; ఉపపన్నములు = అంగీకారయోగ్యములు; కావు = కావు; కానన్ = కావున; ఆ = ఆ; వాసుదేవుడు = నారాయణుడు; కలడు = ఉన్నాడు; మఱియున్ = ఇంకను.
భావము:- సభ్యుల ప్రశ్నను విని పృథుచక్రవర్తి వారితో ఇలా అన్నాడు “యోగ్యులైన బుద్ధిమంతులారా! వినండి. యజ్ఞాధిపతి అయిన సర్వేశ్వరుడు ఉన్నాడు. అందుకు మీరు అంగీకరింపకపోతే ఆయన సృజించిన లోకం కన్నుల ముందు స్పష్టంగా కనిపిస్తున్నది కదా! వాసుదేవుడు లేకపోతే ఈ చిత్రవిచిత్రమైన జగత్తు ఎలా పుట్టింది? అందువల్ల ఈశ్వరుడు ఉన్నాడని ఒప్పుకోక తప్పదు.

తెభా-4-573-వ.
అదియునుం గాక యీ జగద్వైచిత్ర్యంబు కర్తయైన యీశ్వరుండు లేకున్నం గర్మవశంబునం జేసి యుపపన్నంబగు నంటిరేని.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఈ = ఈ; జగత్ = సృష్టి యందలి; వైచిత్ర్యంబున్ = విచిత్రములకు; కర్త = ఆచరించినవాడు; ఐన = అయినట్టి; ఈశ్వరుండు = పరమేశ్వరుడు; లేకున్నన్ = లేకపోయినను; కర్మ = కర్మలకు, కర్మసూత్రమునకు {కర్మసూత్రము - కర్మమునకు ఫలితము ఉండును అనెడి సూత్రము}; వశంబునను = లోబడుట; చేసి = వలన; ఉపపన్నంబున్ = అంగీకారము; అగున్ = అగును; అంటిరేని = అన్నచో;
భావము:- అంతేకాక కర్త అయిన ఈశ్వరుడు లేకున్నప్పటికీ ఈ విచిత్ర జగత్తు కర్మవశాన పుడుతుందని మీరు అన్నట్లైతే….

తెభా-4-574-సీ.
పూని ప్రియవ్రతోత్తాపాదధ్రువ-
నుల కస్మత్పితాహుఁ డనంగఁ
గు నంగ మేదినీవునకు మఱియును-
వినుతి కెక్కిన పృథివీపతులకుఁ
ద్మసంభవ భవ ప్రహ్లాద బలిచక్ర-
ర్తి ప్రముఖ భాగతుల కర్థి
ర్గసుస్వర్గాపర్గంబులకు నను-
తకారణుం డన నత కెక్కి

తెభా-4-574.1-తే.
హీను లగు మృత్యుదౌహిత్రుఁ డై వేన
ముఖ దురాత్ములు ధర్మవిమోహితులును
క్కఁ దక్కినవారికిఁ దాఁ బ్రసన్న
రదుఁడై యిచ్చు నభిమతాళుల నతఁడు.

టీక:- పూని = నిశ్చయించి; ప్రియవ్రత = ప్రియవ్రతుడు; ఉత్తానపాద = ఉత్తానపాదుడు; ధ్రువ = ధ్రువుడు వంటి; మనుల్ = మానవుల; కున్ = కు; అస్మత్ = మా యొక్క; పితామహుడు = తాత; అనగన్ = అనుటకు; తగు = తగిన; అంగ = అంగుడనెడి; మేధినీధవున్ = రాజున; కున్ = కు; మఱియున్ = ఇంకను; వినుతి = ప్రసిద్ది; కిన్ = కి; ఎక్కిన = ఎక్కినట్టి; పృథివీపతుల్ = రాజుల; కున్ = కిని; పద్మసంభవ = బ్రహ్మదేవుడు; భవ = శివుడు; ప్రహ్లాద = ప్రహ్లాదుడు; బలిచక్రవర్తి = బలిచక్రవర్తి; ప్రముఖ = మొదలగు ప్రముఖులు; భాగవతుల్ = భాగవతులు; అర్థివర్గ = కోరికలసమూహము; సుస్వర్గ = మంచిస్వర్గసుఖములు; అవర్గంబుల్ = మోక్షముల; కున్ = కు; అనుగత = అనువర్తించెడి, స్వాభావిక; కారణుండు = కారణమైనవాడు; అనన్ = అనగా; ఘనతన్ = ప్రసిద్ధి; కిన్ = కి; ఎక్కి = ఎక్కి.
హీనులు = తక్కువవాడు; అగు = అయిన; మృత్యు = యమధర్మరాజు; దౌహిత్రుడు = కూతురుకొడుకు, మనుమడు; ఐన = అయిన; వేన = వేనుడు; ముఖ = మొదలగు; దురాత్ములున్ = దుర్మార్గులు; ధర్మ = ధర్మమార్గ; విమోహితులును = వ్యతిరిక్తులు; తక్క = తప్పించి; తక్కినవారు = ఇతరుల; కిన్ = కి; తాన్ = తను; ప్రసన్న = ప్రసన్నమై; వరదుడు = వరములను ఇచ్చువాడు; ఐ = అయ్యి; ఇచ్చు = ఇచ్చును; అభిమత = కామితముల; ఆవళులన్ = సమూహములను; అతడు = అతడు.
భావము:- మృత్యుదేవత మనుమడైన వేనుడు మొదలైన ధర్మహీనుల మాట తీసివేయండి. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మనువు, మా పితామహుడైన అంగరాజు మొదలైన వారికీ, ఇంకా ప్రముఖులైన రాజులకూ, బ్రహ్మ, శివుడు, ప్రహ్లాదుడు, బలి మొదలైన భాగవతులకూ వాసుదేవుడు ప్రసన్నుడై కోరిన కోరికలను ప్రసాదించాడు. స్వర్గాది పుణ్య లోకాలను, పరమపదమైన మోక్షాన్ని అనుగ్రహించేవాడుగా ప్రసిద్ధి కెక్కాడు.

తెభా-4-575-వ.
ఇట్టి విద్వ దనుభవంబున భువన హితుండగు వాసుదేవుండు లేఁడనుట యుపపన్నంబు గా; దదియునుం గాక.
టీక:- ఇట్టి = ఇటువంటి; విద్వత్ = విజ్ఞుల, జ్ఞాన పూర్వక; అనుభవంబునన్ = అనుభవమువలన; భువన = లోకములకు; హితుండు = మేలుకోరెడివాడు; అగు = అయిన; వాసుదేవుండు = హరి; లేడు = లేడు; అనుట = అనెడి వాదనకు; ఉపపన్నంబున్ = ఉపపత్తి కలది, అంగీకారయోగ్యము; కాదు = కాదు; అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- ఇటువంటి పెద్దల అనుభవాలను బట్టి విచారిస్తే భగవంతుడు లేడనడం పొసగని మాట. అంతేకాక…

తెభా-4-576-ఉ.
భూరి తపోభిరామ ముని పూజన మెవ్వని పాదపద్మ సే
వాతి వృద్ధిఁ బొంది యనివారణఁ బూర్వభవానుసార సం
సా మహోగ్రతాపము భృశంబుగఁ బాపఁగ నోపుఁ దత్పదాం
భోరుహజాత దేవనదిఁ బోలి యశేష మనోఘ హారియై.

టీక:- భూరి = అత్యధికమైన; తపః = తపస్సు యొక్క; అభిరామ = చక్కదనము కల; ముని = మునుల; పూజనమున్ = ధ్యానములు; ఎవ్వని = ఎవరి యొక్క; పాద = పాదములు అనెడి; పద్మ = పద్మములను; సేవా = సేవించుట యందలి; రతిన్ = ఆసక్తివలన; వృద్ధిన్ = అభివృద్ధిని; పొంది = పొంది; అనివారణన్ = అడ్డులేకుండ, తప్పక; పూర్వభవ = పూర్వజన్మలనుండి; అనుసార = అనుసరించి వచ్చిన; సంసార = ప్రాపంచిక; మహా = గొప్ప; ఉగ్ర = భయంకరమైన; తాపమున్ = బాధలను; భృశంబుగన్ = సమస్తమును; పాపగన్ = పోగొట్ట; ఓపున్ = చాలిన; తత్ = అతని; పాద = పాదములు అనెడి; అంభోరుహ = పద్మము లందు; జాత = పుట్టిన; దేవనదిన్ = గంగానదిని; పోలి = వలె; అశేష = సమస్తమైన; మనః = మనసు లందలి; అఘ = పాపములను; హారి = పోగొట్టునది; ఐ = అయ్యి.
భావము:- గొప్ప తపస్సంపన్నులైన మహర్షులను పూజించటం వల్ల ప్రాప్తించిన శ్రీహరి పాదసేవ ఆయన పాదపద్మాల నుండి పుట్టిన పవిత్ర గంగానది వలె జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలను, సంసార తాపాలను పూర్తిగా పోగొడుతుంది. అది సమస్త మనోమాలిన్యాలను తుడిచి పెడుతుంది.

తెభా-4-577-వ.
మఱియు.
టీక:- మఱియు = వెండియు.
భావము:- ఇంకా…

తెభా-4-578-చ.
నుపమ భక్తి నెవ్వని పదాంబుజమూలము మందిరంబుగా
యముఁ బొందు వాఁడు నిహతాఖిల భూరి మనోమలుండు స
ద్వినుత విరక్తి బోధ ధృతి వీర్య విశేష సమన్వితుండు దా
నఁ దగి భూరి సంసృతి మత్తర దుఃఖము నందఁ డెన్నఁడున్.

టీక:- అనుపమ = సాటిలేని; భక్తిన్ = భక్తితో; ఎవ్వని = ఎవని యొక్క; పద = పాదములు అనెడి; అంబుజ = పద్మముల; మూలమున్ = మూలమును; మందిరంబుగాన్ = నివాసముగా; అనయమున్ = తప్పక; పొందున్ = పొందును; వాడు = వాడు; నిహత = పూర్తిగా పోగొట్టిన; అఖిల = సమస్తమైన; మనః = మనసు నందలి; మలుండు = మలములు కలవాడు; సత్ = సజ్జనులచే; వినుత = స్తుతింపబడిన; విరక్తి = వైరాగ్యము; బోధ = జ్ఞానము; ధృతి = ధైర్యము; వీర్య = తేజస్సుల; విశేష = విశిష్టమైన; సమన్వితుండ = కలయిక కలవాడు; తాన్ = తాను; అనన్ = అనుటకు; తగి = అర్హుడై; భూరి = అత్యధికమైనట్టి {భూరి - అతి పెద్ధసంఖ్య 1 తరవాత 34 సున్నాలు కలది అదే లక్ష అయితే 5 సున్నాలు మాత్రమే}; సంసృతి = సంసారము అనెడి; మహత్తర = మిక్కిలిగొప్ప {మహత్తు - మహత్తరము - మహత్తమము}; దుఃఖమున్ = దుఃఖమును; అందడు = పొందడు; ఎన్నడున్ = ఎప్పటికి.
భావము:- సాటిలేని భక్తితో భగవంతుడైన నారాయణుని పాదపద్మాలను అనవరతం ఆశ్రయించిన వానికి సమస్త మనోదోషాలు తొలగిపోతాయి. గొప్ప వైరాగ్యం ప్రాప్తిస్తుంది. విజ్ఞానం, ధైర్యం, శక్తి లభిస్తాయి. అటువంటివాడు ఏనాడూ అపారమైన సంసార దుఃఖాన్ని పొందడు.

తెభా-4-579-క.
నారాయణుండు జగదా
ధారుండగు నీశ్వరుండు; లఁప నతనికిన్
లేరెందు సములు నధికులు
ధీరోత్తముఁ డతఁడు నద్వితీయుం డగుటన్.

టీక:- నారాయణుండు = హరి; జగదాధారుండున్ = విష్ణుమూర్తి {జగ దాధారుండు - జగత్ (విశ్వము)నకు ఆధారమైనవాడు, విష్ణువు}; అగు = అయిన; ఈశ్వరుండు = విష్ణుమూర్తి; తలపన్ = తరచిచూసిన; లేరు = లేరు; ఎందున్ = ఏవిధముగను; సములు = సమానమైనవారు; అధికులు = గొప్పవారు; ధీరోత్తముడు = విష్ణుమూర్తి {ధీరోత్తముడు - ధీరులు (జ్ఞానులు)లో ఉత్తముడు, విష్ణువు}; అతడు = అతడు; అద్వితీయుండు = ద్వితీయ మన్నది లేనివాడు.
భావము:- నారాయణుడు జగత్తుకు ఆధారమైన భగవంతుడు. ఆయనతో సమానులు కాని, ఆయన కంటె అధికులైనవారు కాని లేరు. ఆయన మహాధీరుడు, అద్వితీయుడు.

తెభా-4-580-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతేకాక…

తెభా-4-581-ఉ.
ర్మవశంబునన్ జగము ల్గును హెచ్చు నడంగు నన్నచో
ర్మముఁ బుద్ధిఁ జూడ జడకార్యము; గాని ప్రపంచ కల్పనా
ర్మమునందుఁ గర్త యనఁగా విలసిల్లఁగఁ జాల; దీ జగ
త్కర్మక కార్య కారణము గావున నీశుఁడు విష్ణుఁ డారయన్.

టీక:- కర్మ = కర్మసూత్రము {కర్మసూత్రము - ప్రతికర్మ (పని)కి ఫలితం ఉంటుంది; ఎలాగంటే కార్య కారణ సిద్ధాంతము (ప్రతి కార్యానికి కారణము ఉండును) వలెనె, పునర్జన్మలు ఈ కర్మసిద్దాంతం ప్రకారమే కలుగుతాయి అంటారు}; వశంబునన్ = వశమై, అనుసరించి; జగము = విశ్వము; కల్గును = పుట్టును; హెచ్చున్ = పెరుగును; అడంగును = అణగిపోవును; అన్నచో = అంటే; కర్మమున్ = కర్మమును; బుద్ధిన్ = ఆలోచించి; చూడన్ = చూసినచో; జడ = చైతన్యములేనిది; కార్యము = కర్మము; కాని = అంతే కాని; ప్రపంచ = ప్రపంచమును; కల్పనా = సృష్టించెడి; కర్మమున్ = పని; అందున్ = లో; కర్త = పనిచేసినది, కారణము; అనగా = అన; విలసిల్లగ = ప్రసిద్దమగుటకు; చాలదు = సరిపడదు; ఈ = ఈ; జగత్ = భువనము; కర్మక = సృష్టించెడికర్మ అనెడి; కార్య = కార్యమునకు; కారణము = కర్త, చేసినవాడు; కావునన్ = కనుక; విష్ణుడు = విష్ణుమూర్తి; అరయన్ = తరచిచూసిన.
భావము:- కర్మవశం చేతనే ఈ లోకం జన్మిస్తుంది, పెంపొందుతుంది, నశిస్తుందని మీరు అంటారేమో? అది కుదరని మాట. కర్మ జడపదార్థం. కాబట్టి ప్రపంచ సృష్టికి అది కర్త కాజాలదు. ఈ జగత్తు అనే కార్యానికి విష్ణువు కారణం. అందువల్ల ఆయనే భగవంతుడు, పరమేశ్వరుడు.

తెభా-4-582-వ.
కావున మీర లవ్వాసుదేవుని నధికారానుసారంబున నిశ్చితార్థ ఫలసిద్ధి గల వారలై మనోవాక్కాయకర్మంబుల నిష్కపటవృత్తిం దగిలి వినుతి నతి పరిచర్యా పూర్వకంబుగాఁ గామదుఘంబు లయిన యతని పాదపంకజంబులు భజియింపుం; డదియునుం గాక.
టీక:- కావునన్ = అందుచేత; మీరలు = మీరు; ఆ = ఆ; వాసుదేవుని = విష్ణుమూర్తిని; అధికార = అర్హతలను; అనుసారంబునన్ = అనుసరించి; నిశ్చిత = నిశ్చయించుకొనిన; ఫల = పలితముల; సిద్ధి = పొందుట; కలవారలు = ఉన్నవారు; ఐ = అయ్యి; మనః = మనస్సు; వాక్ = మాట; కాయ = దేహము; కర్మంబులన్ = కర్మములను; నిష్కపట = మర్మములేని; వృత్తిన్ = విధముగ; తగిలి = నిశ్చయముతో; వినుతిన్ = చక్కగ స్తుతించుట; అతి = గట్టి; పరిచర్య = సేవలు; పూర్వకంబుగా = కలిగిన విధముగా; కామ = కామితములను; దుఘములు = పితుకునవి, తీర్చునవి {కామదుఘములు – కామధేనువులు వంటివి}; అతని = అతని; పాద = పాదములు అనెడి; పంకజంబులు = పద్మములు {పంకజము - పంకము (నీరు, బురద) యందు జము (పుట్టునది), పద్మము}; భజియింపుడు = సేవించండి; అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- కాబట్టి మీరు మీ మీ శక్తికి తగినట్లుగా నిశ్చితమైన ఫలసిద్ధి, త్రికరణశుద్ధి, నిష్కపటమైన బుద్ధి కలవారై స్తుతి నమస్కార సేవల ద్వారా భక్తాభీష్టప్రదాలైన ఆ దేవదేవుని పాద పద్మాలను సేవించండి. అంతేకాక…

తెభా-4-583-సీ.
రూఢి నీశ్వరుఁడు స్వరూపంబునం జేసి-
పూని విశుద్ధ విజ్ఞాఘనుఁడు
గుణుండు నయినఁ దా రయని కర్మమా-
ర్గమునందు వ్రీహ్యాది ద్రవ్యములును
శుక్లాదిగుణము విస్ఫుర దవఘాతాది-
త్క్రియలును మంత్రసంచయంబు
సంకల్పమును యాగసాధ్యమైనట్టి య-
ఖండోపకారంబు నపదార్థ

తెభా-4-583.1-తే.
క్తియు మఱి జ్యోతిష్టోమ వనముఖ్య
నామత బహు విశేష గుతను మెఱయు
ట్టి యధ్వరరూపమై ఖిల జగము
నందు ననిశంబుఁ బ్రఖ్యాతి నొందుచుండు.

టీక:- రూఢిన్ = నిశ్చయముగా; ఈశ్వరుడు = హరి; స్వ = తన; రూపంబునన్ = రూపము; చేసి = వలన; పూని = ధరించిన; విశుద్ధ = పరిశుద్దమైన; విజ్ఞాన = విజ్ఞానమైన; ఘనుడున్ = గొప్పవాడు; అగుణుండు = త్రిగుణాతీతుడు; అయిన = అయినట్టి; తాన్ = అతను; అరయని = పరిశీలింపరాని; కర్మమార్గమున్ = యజ్ఞకర్మమార్గము; అందున్ = లో; వ్రీహ = గోధుమలు; ఆది = మొదలగు; ద్రవ్యములను = పదార్థములును; శుక్ల = తెలుపు; ఆది = మొదలైన; గుణమున్ = గుణములును; విస్పురత్ = వికసించిన; అవఘాత = దంచుట; ఆది = మొదలగు; సత్ = మంచి; క్రియలును = పనులును; మంత్ర = మంత్రముల; సంచయంబున్ = సమూహము; సంకల్పమునున్ = సంకల్పము; యాగ = యజ్ఞము వలన; సాధ్యము = సాధ్యము; ఐనట్టి = అగునట్టి; అఖండ = నిరంతరాయమైనట్టి; ఉపకారంబున్ = ప్రయోజనములు; ఘన = గొప్ప; పదార్థ = పదార్థములు.
శక్తియు = శక్తి; మఱి = ఇంక; జ్యోతిష్టోమసవన = జ్యోతిష్టోమయాగము; ముఖ్య = మొదలైన; నామతన్ = పేర్లతోను; బహు = మిక్కిలి; విశేష = విస్తారమైన; గుణతను = గుణములుకలిగి యుండుటతోను; మెఱయునట్టి = ప్రకాశించునట్టి; అధ్వర = యజ్ఞము యొక్క; రూపమై = స్వరూపమై; అఖిల = సమస్తమైన; జగమున్ = లోకములు; అందున్ = లోను; అనిశంబున్ = ఎల్లప్పుడు; ప్రఖ్యాతిన్ = ప్రసిద్దిను; ఒందుచుండు = పొందుతుండును.
భావము:- ఈశ్వరుడు స్వచ్ఛమైన విజ్ఞానమే స్వరూపంగా కలవాడు. ఆయన నిర్గుణుడే అయినా నానా విశేష గుణాలు కలిగిన యజ్ఞం భగవంతుని స్వరూపమే. కర్మమార్గంలోనే వ్రీహి మొదలైన ద్రవ్యాలు, తెలుపు మొదలైన గుణాలు, దంచుట మొదలైన క్రియలు, మంత్రసమూహం, సంకల్పం, సాధింపదగిన మహోపకారం, గొప్ప పదార్థాలు, శక్తి, జ్యోతిష్టోమం మొదలైన నామాలు ఇటువంటి అనేక గుణాలతో ఏర్పడే యజ్ఞం భగవంతుని స్వరూపంగా సమస్త జగత్తులో ప్రఖ్యాతి గాంచింది.

తెభా-4-584-వ.
అదియునుం గాక దారుస్థితంబైన యనలంబు తద్దారు గుణంబు లయిన దైర్ఘ్య వక్రత్వాదికంబుల ననుసరించు చందంబున నవ్యక్తంబు తత్క్షోభకం బయిన కాలంబును వాసనయు నదృష్టంబు నను కారణంబుల చేతం బుట్టిన శరీరంబునందు విషయాకారం బయిన బుద్ధి నొంది తద్విషయాభివ్యంగ్యంబైన యానందస్వరూపుం డగుచుఁ గ్రియా ఫలంబునం బ్రసిద్ధి నొందు” నని చెప్పి వెండియు నిట్లను “మదీయ జనంబు లిమ్మేదినీతలంబున దృఢవ్రతులై యజ్ఞభుగీశ్వరుండును గురుండును నయిన సర్వేశ్వరుని, హరిని నిరంతరంబును స్వధర్మ యోగంబునం బూజించుచున్నవారలు; వారు నన్నాశ్చర్యకరంబుగా ననుగ్రహించువా” రని హరిభక్తిరతులైన మహాత్ముల నుతియించి వెండియు నిట్లనియె.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; దారు = కట్టె లందు; స్థితంబున్ = ఉండునది; ఐన = అయిన; అనలంబున్ = అగ్ని; తత్ = ఆ; దారు = కొయ్య యొక్క; గుణంబులు = గుణములు; అయిన = అయినట్టి; దైర్ఘ్య = పొడవు; వక్రత్వ = వంకరా నుండుట; ఆదికంబులన్ = మొదలైనవానిని; అనుసరించు = అనుసరించెడి; చందంబునన్ = విధముగ; అవ్యక్తంబున్ = వ్యక్తము కానిది, కాలము; తత్ = దానిని (అవ్యక్తమును); క్షోభకంబు = కరిగించెడిది, కర్మ; వాసన = సంస్కారము; అదృష్టంబున్ = అదృష్టములు; అను = అనెడి; కారణంబుల్ = కారణముల; చేతన్ = వలన; పుట్టిన = జనించిన; శరీరంబున్ = దేహము; అందున్ = లో; విషయ = ఇంద్రియార్థములు; ఆకారంబున్ = స్వరూపముగా కలది; అయిన = అయిన; బుద్ధిన్ = బుద్ధిని; ఒంది = పొంది; తత్ = ఆ; విషయ = విషయములచే; అభివ్యంగ్యంబు = అనుభవసారము {అభివ్యంగ్యము - వెలువడు గుర్తులచే తెలియబడునది, అనుభవసారము}; ఐన = అయిన; ఆనంద = ఆనందము యొక్క; స్వరూపుండు = స్వరూపము కలవాడు; అగుచున్ = అవుతూ; క్రియా = యజ్ఞక్రియలకు; ఫలంబునన్ = ఫలితము నందు; ప్రసిద్ధిన్ = తెలియబడుటను; ఒందును = పొందును; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనున్ = పలికెను; మదీయజనంబుల్ = నావారు; ఈ = ఈ; మేదినీతలంబునన్ = భూమండలమున; ధృఢ = గట్టి; వ్రతులు = నియమములు కలవారు; ఐ = అయ్యి; యజ్ఞ = యజ్ఞమును; భుగీ = అనుభవించెడి; ఈశ్వరుండును = విభుడును; గురుండును = గొప్పవాడు; అయిన = అయినట్టి; సర్వేశ్వరునిన్ = విష్ణుమూర్తిని; హరిని = విష్ణుమూర్తిని; నిరంతరంబును = ఎల్లప్పుడు; స్వధర్మ = స్వంతధర్మమున; యోగంబునన్ = కూడి యుండి; పూజించుచున్న = సేవిస్తున్న; వారలున్ = వారు; వారున్ = వారు; నన్నున్ = నన్ను; ఆశ్చర్యకరంబుగాన్ = ఆశ్చర్యకరముగా; అనుగ్రహించు = అనుగ్రహించెడి; వారున్ = వారు; అని = అని; హరి = నారాయణుని; భక్తిన్ = భక్తి యందు; రతులున్ = ఆసక్తికలవారు; ఐన = అయిన; మహాత్ములన్ = గొప్పవారిని; నుతియించి = స్తుతించి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అంతేకాక కట్టె తగులబడుతున్నపుడు దాని పొడవు, పొట్టి, వంకర మొదలైన గుణాలు కట్టెలోని నిప్పునకు కూడ సంక్రమిస్తాయి. అలాగే దేహలక్షణాలు దేహంలోని జీవునకూ సంక్రమిస్తాయి. అందుచేత అంతర్యామి దేహ ధర్మాలను అనుసరించియే వ్యక్తమవుతాడు. దేహం పుట్టుకకు కాలం, సంస్కారం, అదృష్టం కారణాలు. ఇటువంటి దేహంలో అంతర్యామిగా ఉండేవాడు ఆనందమయుడు. అతడే యజ్ఞేశ్వరుడు. యోగఫలం కూడ అతడే” అని చెప్పి మహారాజు మళ్ళీ ఇలా అన్నాడు. “ఈ లోకంలోని నా ప్రజలు దృఢ నియమంతో యజ్ఞభోక్తలైన దేవతలకు అధీశ్వరుడు, సర్వ గురుడు, సర్వేశ్వరుడు అయిన శ్రీహరిని సర్వదా స్వధర్మానుసారం పూజిస్తున్నారు. ఈ విధంగా వారు ఎంతగానో నన్ను అనుగ్రహిస్తున్నారు” అని విష్ణుభక్తి పరాయణులైన మహానుభావులను కొనియాడి పృథుచక్రవర్తి మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-4-585-మ.
" సంపద్విభవప్రతాప సుమహైశ్వర్యంబులం బొల్చు నీ
ణీనాథులతేజ మంచిత తపోదాంతిక్షమా విద్యలం
మొప్పారు ధరాసు పర్వ హరిభక్తశ్రేణులం దెప్పుడున్;
లోనం బ్రభవింప కుండు నని యద్ధాత్రీవిభుం డిట్లనున్.

టీక:- వర = శ్రేష్ఠమైన; సంపత్ = సంపదలు; విభవ = వైభవము; ప్రతాప = శౌర్యము; సు = మంచి; మహా = గొప్ప; ఐశ్వర్యంబులన్ = ఐశ్వర్యము లందు; పొల్చు = ఒప్పెడి; ఈ = ఈ; ధరణీనాథుల = రాజుల; తేజము = తేజస్సు; అంచిత = చక్కటి; తపః = తపస్సు; దాంతి = మనోనిగ్రహము; క్షమ = ఓర్పు; విద్యలన్ = విద్య లందు; కరము = మిక్కిలి; ఒప్పారు = చక్కగా నుండును; ధరాసుపర్వ = బ్రాహ్మణులైన {ధరా సుపర్వులు - ధర (భూమి) పైన సుపర్వులు (దేవతలు), బ్రాహ్మణులు}; హరి = విష్ణు; భక్త = భక్తుల; శ్రేణుల్ = సమూహముల; అందున్ = అందు; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; ధర = లోకము; లోనన్ = లో; ప్రభవింపకుండున్ = ప్రభావము చూపకుండుగాక; అని = అని; ఆ = ఆ; ధాత్రీవిభుండున్ = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనున్ = పలికెను.
భావము:- గొప్ప సిరిసంపదలతోను, మహత్తరమైన పరాక్రమంతోను, అఖండమైన వైభవంతోను, ప్రకాశించే రాజుల తేజస్సు తపస్సుతోను, శమదమాదులతోను, క్షమాగుణంతోను విరాజిల్లే బ్రాహ్మణులపైన, విష్ణుభక్తులపైన ఏ మాత్రం తన ప్రభావాన్ని చూపించలేదు.

తెభా-4-586-చ.
యఁగ నే ధరామర పదాంబుజరేణువు లర్థిఁ దాల్చి య
ప్పమ పురాణ పూరుషుఁడు బ్రాహ్మణదేవుఁడు నైనయట్టి యీ
శ్వరుఁడు సదానపాయినిని సాగరకన్యను సర్వలోక వి
స్ఫురిత పవిత్రకీర్తియును బొంది విభూతిఁ దనర్చెఁ గావునన్.

టీక:- అరయగన్ = పరిశీలించినచో; ఏ = ఎట్టి; ధరామర = బ్రాహ్మణుల; పద = పాదములు అనెడి; అంబుజ = పద్మముల కంటిన; రేణువులన్ = ధూళిరేణువులను; అర్థిన్ = కోరి; తాల్చి = ధరించి; ఆ = ఆ; పరమ = అత్యంత; పురాణ = పాతకాలపు; పూరుషుండు = వ్యక్తి; బ్రాహ్మణ = వేదార్థమైనట్టి; దేవుడు = హరి; ఐనయట్టి = అయినట్టి; ఈశ్వరుడు = హరి; సదా = ఎల్లప్పుడు; అనపాయినిని = విడువని యామెను; సాగరకన్యను = లక్ష్మీదేవిని {సాగర కన్య - సాగరునికి పుట్టినామె, లక్ష్మి}; సర్వ = సకల; లోక = లోకములలోను; విస్ఫురిత = విస్తరించిన; పవిత్ర = పుణ్యవంతమైన; కీర్తియును = యశస్సు; పొంది = పొంది; విభూతిన్ = వైభవముతో; తనర్చెన్ = అతిశయించెను; కావునన్ = కనుక.
భావము:- పురాణ పురుషుడైన నారాయణుడు బ్రాహ్మణులను దైవాలుగా భావిస్తాడు. బ్రాహ్మణుల పాదపద్మ పరాగాలను ప్రీతితో ధరిస్తాడు. అందుచేత తనను ఎప్పుడూ విడిచి ఉండని లక్ష్మీదేవిని, సర్వలోకాలలో పరివ్యాప్తమై ప్రకాశించే పవిత్ర కీర్తిని అందుకొని ఆయన విరాజిల్లుతున్నాడు.

తెభా-4-587-సీ.
వసుధామర సేవను జేసి య-
శేషగుణాన్విత స్థితిఁ దనర్చు
ర్వేశ్వరుఁడు మఱి సంతుష్టుఁ డగు నట్టి-
రణిదివిజులఁ ద ద్ధర్మపరులు
లఘు వినీతులునై యవశ్యంబును-
సేవింపరే ధరాదేవ నిత్య
సేవచేఁ బురుషుఁడు చిరతర జ్ఞానవి-
ద్యాభ్యాసి గాకున్న నైన నతఁడు

తెభా-4-587.1-తే.
వేగమున నంతరంగంబు విశద మగుటఁ
జేసి కైవల్య పదమును జెందు; నట్లు
గాన లోకులు భూదేవతానికరముఁ
గిలి భజియింప వలయు నుదాత్త మతిని.

టీక:- ఏ = ఏ; వసుధామర = బ్రాహ్మణులను; సేవనున్ = సేవించుటను; చేసి = వలన; అశేష = సమస్తమైన; గుణ = గుణములు; ఆన్విత = కలిగియుండెడి; స్థితిన్ = స్థితిని; తనర్చు = అతిశయించు; సర్వేశ్వరుడు = విష్ణుమూర్తి; మఱి = మిక్కిలి; సంతుష్టుడు = సంతృప్తిచెందినవాడు; అగున్ = అగునో; అట్టి = అటువంటి; ధరణిదివిజులన్ = బ్రాహ్మణులను {ధరణిదివిజులు - ధరణి (భూమి)కి దివిజులు (దేవతల), బ్రాహ్మణులు}; తత్ = ఆ వేదమార్గ; ధర్మ = ధర్మమునందు; పరులున్ = నిష్ఠకలవారు; అలఘు = గొప్ప; వినీతులు = వినయముకలవారు; అవశ్యంబును = తప్పక; సేవింపరే = సేవించెదరు; ధరాదేవ = బ్రాహ్మణులను; నిత్య = నిత్యము; సేవన్ = సేవించుట; చేన్ = చేత; పురుషుడు = మానవుడు; చిరతర = అత్యధికమైన {చిరము - చిరతరము - చిరతమము}; జ్ఞాన = జ్ఞానము; విద్యా = విద్యలను; అభ్యాసి = చదివినవాడు; కాకున్నన్ = కాకపోయినవాడు; ఐనన్ = అయినప్పటికిని; అతడు = అతడు.
వేగమునన్ = తొందరలోనే; అంతరంగంబున్ = మనసును; విశదము = స్వచ్ఛమైనది, నిర్మలమైనది; అగుటన్ = అగుట; చేసి = వలన; కైవల్యపదమును = మోక్షమును; చెందున్ = పొందును; అట్లుగాన = అందుచేత; లోకులు = ప్రజలు; భూదేవతా = బ్రాహ్మణుల; నికరమున్ = సమూహమును; తగిలి = పూని; భజియింపవలయున్ = సేవింపవలెను; ఉదాత్త = ఉత్తమమైన; మతిన్ = బుద్ధితో.
భావము:- బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులను సేవిస్తే సకల గుణ సంపన్నుడైన సర్వేశ్వరుడు సంతోషిస్తాడు. కాబట్టి అటువంటి బ్రాహ్మణులను ధర్మపరులై వినయ వినమ్రులై అవశ్యం సేవించండి. బ్రాహ్మణులను నిత్యం సేవించేవాడు గొప్ప జ్ఞాని, పండితుడు కాకపోయినా నిర్మల హృదయం కలవాడై మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి లోకులు ఉదాత్త బుద్ధితో బ్రాహ్మణులను సేవించాలి.

తెభా-4-588-వ.
మఱియు.
టీక:- మఱియు = ఇంకా.
భావము:- ఇంకా…

తెభా-4-589-సీ.
విజ్ఞాన ఘనుఁ డన వెలయు నీశ్వరుఁడు త-
త్త్వజ్ఞాన యుతులైన వారిచేత
దీపింప నింద్రాది దేవతోద్దేశంబు-
ను భూమిసుర ముఖంబున హుతంబు
గు హవిస్సులఁ దృప్తి నందిన గతి నచే-
న మైన యా హుతాన ముఖంబు
న వేల్చిన హవిస్సుచేతఁ దృప్తుండు-
గాకుండు కావున లోమందు

తెభా-4-589.1-తే.
గ్ని ముఖమునకంటె ధరామరేంద్ర
ముఖము పరిశుద్ధ మత్యంతముఖ్య మనఁగఁ
నరు నది గాన భూసురార్చనము సకల
నులుఁ గావింపఁ దగు నార్యనములార!

టీక:- విజ్ఞాన = చక్కటిజ్ఞానముకలిగిన; ఘనుడున్ = గొప్పవాడు; అనన్ = అనగా; వెలయు = ప్రసిద్ధచెందిన; ఈశ్వరుడు = నారాయణుడు; తత్త్వ = తత్త్వము యొక్క; జ్ఞాన = జ్ఞానముతో; యుతులు = కలవారు; ఐన = అయిన; వారి = వారి; చేతన్ = చేత; దీపింపన్ = ప్రకాశిస్తుండగా; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మొదలగు; దేవతా = దేవతలను; ఉద్దేశ్యంబునను = ఉద్దేశించి; భూమిసుర = బ్రాహ్మణుల; ముఖంబునన్ = ద్వారా; హుతంబున్ = సమర్పించబడినది; అగు = అయిన; హవిస్సులన్ = హోమముచేయుద్రవ్యములుచే {హవిస్సులు - అగ్నిహోత్రమున హోమముచేయుద్రవ్యములు (ఇగర్చబెట్టినఅన్నము నెయ్యి)}; తృప్తిన్ = తృప్తిని; అందిన = చెందిన; గతిన్ = విధముగా; అచేతనమాన = జడపదార్థమైన; ఆ = ఆ; హుతాశన = అగ్నిహోత్రుని {హుతాశనుడు - హుతముచేయబడినవానిని భుజించువాడు, అగ్ని}; ముఖంబువలన = ద్వారా; వేల్చిన = హోమముచేయబడిన; హవిస్సులన్ = హోమముచేయుద్రవ్యములు; చేతన్ = వలన; తృప్తుండు = తృప్తిండెందినవాడు; కాకుండు = కాడు; కావునన్ = అందుచేత; లోకమున్ = లోకము; అందున్ = లో; అగ్ని = అగ్నిహోత్రుని.
ముఖమున = నోరు; కంటెన్ = కంటె; ధరామర = బ్రాహ్మణ; ముఖమున్ = మోము; పరిశుద్దము = స్వచ్ఛమైనది; అత్యంత = మిక్కిలి; ముఖ్యమున్ = ముఖ్యమైనది; అనగన్ = అనగా; తనరున్ = అతిశయించును; అదిగాన = అందుచేత; భూసుర = బ్రహ్మణుల {భూసురుడు - భూమికి దేవత, బ్రాహ్మణుడు}; అర్చనము = సేవించుట; సకల = సమస్తమైన; జనులున్ = వారును; కావింపన్ = చేయుటకు; తగున్ = తగినది; ఆర్యజనములారా = ఉత్తములారా.
భావము:- ఆర్యమహాజనులారా! తత్త్వజ్ఞాన సంపన్నులైనవారు ఇంద్రాది దేవతల నుద్దేశించి బ్రాహ్మణముఖంగా అర్పించే అన్నం వల్ల తృప్తి చెందినట్లు, అచేతనమైన అగ్నిలో వేల్చిన హవిస్సు వల్ల ఈశ్వరుడు తృప్తి పొందడు. కాబట్టి లోకంలో అగ్నిముఖం కంటె బ్రాహ్మణుల ముఖం పరిశుద్ధమైనది. అత్యంత ప్రధానమైనది. అందువల్ల సకల జనులూ బ్రాహ్మణులకు సమర్పించాలి.

తెభా-4-590-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతే కాక…

తెభా-4-591-సీ.
వేదమం దేని నీ విశ్వ మెల్లను-
ర్పణ ప్రతిబింబి మగు వస్తు
నివహంబు కైవడిఁ దివిరి ప్రకాశించు-
ట్టి విరజమును వ్యయంబు
గుచు సనాతనం గు వేద మే ధరా-
దేవతాజన మనుదినముఁ దగిలి
హిత శ్రద్ధాతపో మంగళ మౌన సం-
మ సమాధులఁ బొలుపారుచుండి

తెభా-4-591.1-తే.
ర్థి సదసద్విచారులై ధికరింతు
ట్టివారల పదరజం ర్థిఁ దాల్చు
లఘులకు సర్వపాపక్షయంబు నఖిల
ద్గుణావాప్తియును నగుఁ తురులార!

టీక:- ఏ = ఏ; వేదము = వేదము; అందేనిని = అందైతే; ఈ = ఈ; విశ్వము = లోకములు; ఎల్లను = సమస్తమును; దర్పణ = అద్దములో; ప్రతిబింబితము = ప్రతిఫలించినవి; అగు = అయిన; వస్తు = వస్తువుల; నివహంబున్ = సమూహము; కైవడిన్ = విధముగా; తివిరి = పూని; ప్రకాశించున్ = ప్రకాశించునో; అట్టి = అటువంటి; విరజమున్ = రజోగుణములేనిది; అవ్యయంబున్ = తరిగిపోనిది; అగుచున్ = అవుతూ; సనాతనంబున్ = పురాతమైనది; అగు = అయిన; వేదము = వేదము; ఏ = ఏ; ధరాదేవతాజనము = బ్రాహ్మణులు; అనుదినమున్ = ప్రతిరోజు; తగిలి = నిష్ఠతో; మహిత = గొప్ప; శ్రద్ధ = శ్రద్ధ; తపః = తపస్సు; మంగళ = శుభకరమైన; మౌన = మౌనము; సంయమ = ఇంద్రియనిగ్రహము; సమాధులన్ = యోగసమాధిలలో; బొలుపారుచుండి = అతిశయించుతూ;
ఆర్తిన్ = కోరి; సదసద్విచారులు = తత్వము తెలిసిన వారు {సదసద్విచారులు - సత్ (సత్తును, సత్యమును) అసత్ (అసత్యమును, చిత్తును) విచారులు (తర్కించుకొనువారు), తత్వజ్ఞులు}; ఐ = అయ్యి; అధికరింతురు = అతిశయించెదరు; అట్టి = అటువంటి; వారలు = వారు; పద = పాదముల; రజంబున్ = ధూళిని; తాల్చు = ధరించు; అలఘుల్ = గొప్పవారి; కున్ = కి; సర్వ = సమస్తమైన; పాప = పాపముల; క్షయంబునున్ = నశించుట; అఖిల = సర్వ; సద్గుణ = మంచిగుణముల; వ్యాప్తియును = వృద్ధి; అగున్ = కలుగును; చతురులారా = నేర్పరులారా.
భావము:- బుద్ధిమంతులారా! అద్దంలో ప్రతిబింబించే భూషణ సముదాయం వలె ఈ విశ్వమంతా వేదంలో ప్రకాశిస్తుంది. కళంకం లేనిది, నాశం లేనిది, సనాతనమైనది అయిన వేదాన్ని ఏ బ్రాహ్మణులు ప్రతిదినమూ శ్రద్ధా తపో మౌన సంయమ సమాధులతో సదసద్విచారంతో అధ్యయనం చేస్తారో అటువంటి బ్రహ్మవేత్తల పాదధూళిని తలదాల్చే మహనీయులకు సర్వ పాపాలు నశిస్తాయి. సమస్త సద్గుణాలు లభిస్తాయి.

తెభా-4-592-వ.
కావున నట్టి విప్రపాద సరోజరేణువు లేనును గిరీటంబున ధరియింతు; నిట్లు బ్రాహ్మణ భజనంబునంజేసి యవాప్త సకల గుణుండును శీలధనుండును గృతజ్ఞుండును శ్రద్ధాయుక్తుండును నైన మహాత్ము నఖిల సంపదలఁ బ్రాపించుం గావున గోబ్రాహ్మణకులంబును ననుచర సమేతుం డయిన జనార్దనుండును నా యెడం బ్రసన్ను లయ్యెదరు గాక” యని పలుకుచున్న పృథుచక్రవర్తిం గనుంగొని పితృదేవద్విజ సత్పురుషులు సంతుష్టాంతరంగులై సాధువాదంబుల నభినందించి యిట్లనిరి.
టీక:- కావునన్ = అందుచేత; అట్టి = అటువంటి; విప్ర = బ్రాహ్మణుల; పాద = పాదములు అనెడి; సరోజ = పద్మము; రేణువులన్ = ధూళిరేణువులను; ఏనునున్ = నేనుకూడ; కిరీటంబున్ = కిరీటమున; ధరియింతున్ = ధరించెదను; ఇట్లు = ఈ విధముగ; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; భజనంబునన్ = సేవించుట; చేసి = వలన; అవాప్త = సంప్రాప్త; సకల = సర్వ; గుణుండు = సుగుణములు కలవాడు; శీల = మంచి నడవడిక అనెడి; ధనుండును = సంపద కలవాడు; కృతజ్ఞుండును = కృతజ్ఞత కలవాడు; శ్రద్ధా = శ్రద్ధతో; యుక్తుండును = కలిగి యుండువాడు; ఐన = అయిన; మహాత్మున్ = గొప్పవానికి; అఖిల = సమస్త మైన; సంపదలన్ = సంపదలు; ప్రాపించును = లభించును; కావునన్ = అందుచేత; గో = గోవులును; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; కులంబునున్ = సమూహమును; అనుచర = అనుచరులతో; సమేతుండు = కూడినవాడు; అయిన = అయిన; జనార్దనుండును = విష్ణుమూర్తియును; నా = నా; ఎడన్ = అందు; ప్రసన్నులు = ప్రసన్నత కలవారు; అయ్యెదరు గాక = అగుగాక; అని = అని; పలుకుచున్న = అనుచున్న; పృథుచక్రవర్తిన్ = పృథుచక్రవర్తిని; కనుంగొని = చూసి; పితృ = పితరులు; దేవ = దేవతలు; ద్విజ = బ్రాహ్మణులు {ద్విజులు - ద్వి (రెండు) జులు (జన్మములు కలవారు), బ్రాహ్మణులు}; సత్పురుషులు = మంచివారు; సంతుష్టాంతరంగులు = సంతృప్తిచెందిన మనసు కలవారు; ఐ = అయ్యి; సాధువాదంబులన్ = బాగు బాగు అనుచు; అభినందించి = అభినందించి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- కాబట్టి అటువంటి బ్రాహ్మణుల పాదపద్మ పరాగాన్ని నేను సైతం నా కిరీటంపై ధరిస్తాను. బ్రాహ్మణులను సేవించేవానికి సకల గుణాలు సంప్రాప్తిస్తాయి. శీలవంతుడు, కృతజ్ఞుడు, శ్రద్ధాళువు అయిన అతణ్ణి సకల సంపదలూ వరిస్తాయి. కాబట్టి గోవులు, బ్రాహ్మణులు, పరివార సమేతుడైన శ్రీమన్నారాయణుడు నన్ను అనుగ్రహింతురు గాక!” అని పలుకుతున్న పృథుచక్రవర్తి మాటలు విని పితృదేవతలు, దేవతలు, బ్రాహ్మణులు, సత్పురుషులు సంతోషంతో “మేలు మేలు” అని అని అభినందించి ఇలా అన్నారు.

తెభా-4-593-క.
"మనుజేంద్ర! నీ కతంబున
నుపమ ఘన బ్రహ్మదండ తుఁ డత్యఘ వ
ర్తనుఁడు నగునట్టి వేనుం
యము నరకంబు వలన ర్థిఁ దరించెన్.

టీక:- మనుజేంద్ర = రాజా {మను జేంద్రుడు - మనుజులలో ఇంద్రునివంటివాడు, రాజు}; నీ = నీ; కతంబునన్ = కారణముచే; అనుపమ = సాటిలేని; ఘన = గొప్ప; బ్రహ్మదండ = తప్పస్సంపన్నుల శాపంఏ వలన; హతుడు = చంపబడినవాడు; అతి = మిక్కిలి; అఘ = పాపపు; వర్తనుడు = నడవడిక కలవాడు; అగున్ = అయిన; అట్టి = అటువంటి; వేనుండు = వేనుడు; అనయమున్ = ఎల్లప్పుడు; నరకంబు = నరకము; వలన = నుండి; అర్థిన్ = కోరి; తరించెన్ = విముక్తు డాయెను.
భావము:- “రాజా! పాపవర్తనుడై బ్రాహ్మణశాపం చేత నిహతుడైన నీ తండ్రి వేనుడు ని న్ను పుత్రునిగా పొందటం చేత నరకలోకం నుండి తరించాడు.

తెభా-4-594-వ.
కావునం "బుత్రేణలోకాన్ జయతి"యను వేదవచనంబు నిశ్చయం; బదియునుం గాక.
టీక:- కావునన్ = అందుచేత; పుత్రేణ = పుత్రులు వలన; లోకాన్ = లోకములను; జయతి = జయించును; అను = అనెడి; వేద = వేదములందలి; వచనంబు = వాక్యములు; నిశ్చయంబున్ = నిశ్చయమైనవి; అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- కాబట్టి ‘పుత్రేణ లోకాన్ జయతి (పుత్రుని వల్ల తండ్రి సర్వలోకాలను జయిస్తాడు)’ అనే వేదవాక్యం యథార్థమయింది. అంతేకాక…

తెభా-4-595-చ.
పురుషవరేణ్య! హేమకశిపుండు రమా లలనేశు నిందచే
కమునొందఁ గోరియు గుజ్ఞుఁడు భాగవతుండునైన యా
తనయప్రభావమున వాసికి నెక్కి విధూత పాపుఁడై
నియముఁ బొందఁ డయ్యె; నతి నిర్మల కీర్తిఁ దనర్చెఁ గావునన్."

టీక:- పురుష = పురుషులలో; వరేణ్య = ఉత్తముడ; హేమకశిపుండు = హిరణ్యకశిపుండు; రమాలలనేశున్ = విష్ణుమూర్తిని; నింద = నిందించుట; చేన్ = చేత; నరకమున్ = నరకమును; ఒందగోరియున్ = పొందవలసియుండియు; గుణజ్ఞుడు = సుగుణములు కలవాడు; భాగవతుండున్ = బాగవతుడును; ఐన = అయిన; ఆ = ఆ; వర = శ్రేష్ఠమైన; తనయ = పుత్రుని; ప్రభావమున = ప్రభావము వలన; వాసి = ప్రసిద్ది; కిన్ = ని; ఎక్కి = చెంది; విధూత = పోగొట్టబడిన; పాపుడు = పాపముకలవాడు; ఐ = అయ్యి; నిరయమున్ = నరకమును; పొందడు = పొందనివాడు; అయ్యెన్ = అయ్యెను; అతి = మిక్కిలి; నిర్మల = స్వచ్ఛమైన; కీర్తిన్ = యశస్సుయందు; తనర్చెన్ = అతిశయించెను; కావునన్ = అందుచేత.
భావము:- పురుషోత్తమా! హిరణ్యకశిపుడు శ్రీహరిని నిందించి నరకాన్ని పొందడానికి అర్హుడయ్యాడు. కాని సుగుణయుక్తుడు, విష్ణుభక్తుడు అయిన తన కొడుకు ప్రహ్లాదుని ప్రభావం చేత పాపాలన్నీ తొలగి నరకానికి పోకుండా మిక్కిలి స్వచ్ఛమైన కీర్తితో విరాజిల్లాడు.”

తెభా-4-596-క.
ని పలికి వీరవర్యుం
నఁదగు పృథుచక్రవర్తి "యుతాబ్దంబుల్
రఁగ జీవింతువుగా"
ని తగ నాశీర్వదించి భిమత మొప్పన్.

టీక:- అని = అని; పలికి = పలికి; వీర = వీరులలో; వర్యుండు = శ్రేష్ఠుడు; అనన్ = అనుటకు; తగు = తగిన; పృథుచక్రవర్తిన్ = పృథుచక్రవర్తిని; అయుత = పదివేలు, అనేకమైన; అబ్దంబుల్ = సంవత్సరములు; తనరగన్ = అతిశయించి; జీవింతువుగాక = జీవించెదవుగాక; అని = అని; తగన్ = తగినట్లు; ఆశీర్వదించి = ఆశీర్వదించి; అభిమతము = ఉద్దేశము; ఒప్పన్ = ఒప్పునట్లు.
భావము:- అని చెప్పి సదస్యులందరూ “ఓ పృథుచక్రవర్తీ! నీవు చిరకాలం జీవింతువు గాక!” అని దీవించి…

తెభా-4-597-వ.
వెండియు నిట్లనిరి "దేవా! నీకు సకలలోకభర్త యగు నారాయణు నందు నిట్టి భక్తి వొడముటం జేసియు బ్రహ్మణ్యదేవుండు నుత్తమశ్లోకుండు నైన సర్వేశ్వరుని సత్కథాజాలంబు వ్యక్తంబు చేయుచున్న నీవు మాకు నాథుండ వగుటం జేసియు నేము ముకుందదాసుల మైతిమి; భవదీయ ప్రజ్ఞానుశాసనంబు ప్రజానురాగంబు కారుణ్యమూర్తులైన మహాత్ములకు స్వభావంబులు; గావున నాశ్చర్యంబు గాదు; దైవసంజ్ఞితంబు లయిన కర్మంబులచేత వినష్టజ్ఞానులమై పరిభ్రమించు మాదగు తమఃపారంబుఁ గంటి; మే సర్వేశ్వరుండు బ్రాహ్మణ జాతి నధిష్ఠించి క్షత్రియులను క్షత్రియజాతి నధిష్ఠించి బ్రాహ్మణులను నీ యుభయంబు నధిష్ఠించి విశ్వంబును భరించు నట్టి, వివృద్ధసత్వుండు సర్వరూపుండు మహాపురుషుండునైన పృథునకు నీశ్వరబుద్ధింజేసి యేము నమస్కరింతు;"మను సమయంబున.
టీక:- వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; దేవా = భగవంతుడా; నీకున్ = నీకు; సకల = సమస్తమైన; లోక = లోకములకును; భర్త = ప్రభువు; అగున్ = అయిన; నారాయణున్ = హరి; అందున్ = ఎడల; ఇట్టి = ఇటువంటి; భక్తి = భక్తి; ఒడముటన్ = కలుగుట; చేసియున్ = వలన; బ్రహ్మణ్య = బ్రాహ్మణులు కొలిచెడి; దేవుండున్ = దేవుడు; ఉత్తమ = ఉత్తములచే; శ్లోకుండు = స్తుతింప బడువాడు; ఐన = అయిన; సర్వేశ్వరుని = నారాయణుని; సత్కథల్ = మంచి కథల; జాలంబున్ = సమూహమును; వ్యక్తంబున్ = తెలియునట్లు; చేయుచున్న = చేయుచున్న; నీవున్ = నీవు; మాకున్ = మాకు; నాథుండవు = ప్రభువవు; అగుటన్ = అగుట; చేసియున్ = వలన; నేము = మేము; ముకుంద = విష్ణుని; దాసులము = సేవించువారము; ఐతిమి = అయినాము; భవదీయ = నీ యొక్క; ప్రజ్ఞ = సమర్థమైన; అనుశాసనంబున్ = పరిపాలన; ప్రజా = ప్రజల యెడ; అనురాగము = కూర్మి; కారుణ్య = దయాపూర్వక; మూర్తులు = స్వరూపము కలవారు; ఐన = అయిన; మహాత్ముల్ = గొప్పవారి; కిన్ = కి; స్వభావంబులున్ = స్వభావములు; కావునన్ = కనుక; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యకరము; కాదు = కాదు; దైవ = దేవుని; సంజ్ఞితంబులు = సూచించునవి; అయిన = అయిన; కర్మంబుల్ = కర్మముల; చేతన్ = చేత; వినష్ట = మిక్కిలి; నష్ట = నష్టమైన; జ్ఞానులము = జ్ఞానము కలవారము; ఐ = అయ్యి; పరిభ్రమించు = తిరిగెడి; మాది = మాది; అగు = అయిన; తమః = అజ్ఞానము యొక్క; పారమున్ = అంతమును; కంటిమి = చూడగలిగితిమి; ఏ = ఏ; సర్వేశ్వరుండు = నారాయణుడు; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; జాతిన్ = జాతిని; అధిష్ఠించి = ఆశ్రయించి యుండి; క్షత్రియులనున్ = రాజవంశమును; క్షత్రియ = క్షత్రియ; జాతిన్ = జాతిని; అధిష్ఠించి = ఆశ్రయించి యుండి; బ్రాహ్మణులనున్ = బ్రాహ్మణులను; ఈ = ఈ; ఉభయంబున్ = ఇద్దరిని; అధిష్ఠించి = ఆశ్రయించి యుండి; విశ్వంబునున్ = జగత్తును; భరించున్ = పాలించెడి; వివృద్ధ = మిక్కిలిఅతిశయించిన; సత్వుండు = శక్తిమంతుడు; సర్వ = అన్ని; రూపుండు = రూపములుతానేయైనవాడు; మహా = గొప్ప; పురుషుండున్ = పౌరుషము కలవాడు; ఐన = అయిన; పృథున్ = పృథుచక్రవర్తి; కున్ = కి; ఈశ్వర = భగవంతుడను; బుద్ధిన్ = ఉద్దేశము; చేసి = కలిగి; ఏము = మేము; నమస్కరింతుము = నమస్కరించెదము; అను = అనెడి; సమయంబున = సమయములో.
భావము:- మళ్ళీ ఇలా అన్నారు “ప్రభూ! సర్వేశ్వరుడైన శ్రీహరి యందలి భక్తి చేత నీవు ఉత్తమశ్లోకుడైన భగవంతుని సత్కథలను కొనియాడుతున్నావు. నీవు మాకు అధీశ్వరుడవు కావడం చేత మేము కూడా హరిభక్తుల మైనాము. ప్రజానురాగం కల దయామయులైన మహాత్ములకు ఇటువంటి అనుశాసనం సహజగుణం కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. దైవ సంజ్ఞితాలైన కర్మలచేత జ్ఞానం నశించి చీకటిలో పరిభ్రమిస్తున్న మమ్ములను ఒడ్డుకు చేర్చావు. బ్రాహ్మణజాతిని ఆశ్రయించి క్షత్రియులను, క్షత్రియులను ఆశ్రయించి బ్రాహ్మణులను, వీరిద్దరినీ, విశ్వాన్నీ భరిస్తున్న సత్త్వగుణ సంపన్నుడవు, సత్య స్వరూపుడవు, మహాపురుషుడవు అయిన నిన్ను ఈశ్వరునిగా భావించి నమస్కరిస్తున్నాము” అని చెప్తున్న సమయంలో….