పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/పృథుండు హరినిస్థుతించుట
తెభా-4-549-క.
“వరదా! యీశ్వర! నిను స
త్పురుషుఁడు దేహాభిమాన భోగములకు నై
వరమెట్లు గోరు నిహసుఖ
వరములు నారకుల కైన వఱలవె చెపుమా.
టీక:- వరదా = వరముల నిచ్చెడివాడ; ఈశ్వర = ప్రభువా; నినున్ = నిన్ను; సత్ = మంచి; పురుషుడు = వాడు; దేహ = దేహముమీది; అభిమాన = మమకారములు; భోగముల్ = భోగములు; కున్ = కోసము; ఐ = అయ్యి; వరమున్ = వరమును; ఎట్లు = ఏ విధముగ; కోరున్ = కోరును; ఇహ = ఈ లోకపు; సుఖ = సౌఖ్యములు; వరములు = ప్రియమైన కోరికలు; నారకుల్ = నరకము నుండెడివారి; కిన్ = కి; ఐనన్ = అయినా; వఱలవె = తీరవా ఏమి; చెపుమా = చెప్పు.
భావము:- “వరదుడవైన ఓ విష్ణుదేవా! సత్పురుషుడైనవాడు దేహాభిమానులు కోరుకునే సుఖాలను ఆశించి నిన్ను వరం ఇమ్మని ఎలా వేడుకుంటాడు? పరమ పాతకులకు సైతం ఈ సుఖాలు లభిస్తాయి కదా!
తెభా-4-550-చ.
ఘన మగు దేవ! యీ వరమె కాదు మహాత్మక వాగ్వినిర్గతం
బనఁదగు తావకీన చరణాంబుజ చారు మరందరూపమై
తనరిన కీర్తియున్ విని ముదంబును బొందఁగ లేని మోక్ష మై
నను మదిఁ గోర నొల్ల నఘనాశ! రమేశ! సరోజలోచనా!
టీక:- ఘనము = గొప్పవాడవు; అగు = అయిన; దేవా = దేవుడా; ఈ = ఈ; వరమె = వరమే; కాదు = కాదు; మహాత్మక = మహాత్ముల యొక్క; వాక్ = నోటినుండి; వినిర్గతంబున్ = చక్కగ వెలువడినది; అనన్ = అనుటకు; తగు = తగిన; తావకీన = నీ యొక్క; చరణ = పాదములు అనెడి; అంబుజ = పద్మముల {అంబుజము - అంబువు (నీరు)యందు జము (పుట్టునది), పద్మము}; చారు = చక్కటి; మరంద = తేనె; రూపము = రూపము కలది; ఐ = అయ్యి; తనరిన = అతిశయించెడి; కీర్తియున్ = కీర్తిని; విని = వినుటచే; ముదంబునున్ = సంతోషమును; పొందగన్ = పొందుటకు; లేని = లేనట్టి; మోక్షము = ముక్తి; ఐనను = అయినప్పటికిని; మదిన్ = మనసులో; కోరన్ = కోరుటను; ఒల్లన్ = ఒప్పుకొనను; అఘనాశ = నారాయణా {అఘ నాశ - పాపమును నాశనముచేయువాడు, విష్ణువు}; రమేశ = నారాయణా {రమేశుడు - రమ (లక్ష్మీదేవి)కి ఈశుడు, విష్ణువు}; సరోజలోచనా = నారాయణా {సరోజ లోచనుడు - సరోజ (పద్మముల) వంటి కన్నులు కలవాడు, విష్ణువు}.
భావము:- దేవా! పాపహరణా! రమాపతీ! ఈ గొప్ప వరాన్నే కాదు, నీ పాదారవిందాల మకరందమై మహాత్ముల వాక్కులనుండి వెలువడే నీ కథాకీర్తనం విని ఆనందం పొందలేని మోక్షాన్ని కూడ నేను కోరుకొనను.
తెభా-4-551-క.
అదిగాన పద్మలోచన!
సదమల భవదీయ ఘనయశము వినుటకునై
పదివేల చెవులు కృప ని
మ్మదియే నా యభిమతంబు నగును ముకుందా!
టీక:- అదిగాన = అందుచేత; పద్మలోచన = నారాయణా; సత్ = మిక్కిలి; అమల = స్వచ్ఛమైన; భవదీయ = నీ యొక్క; ఘన = గొప్ప; యశమున్ = కీర్తిని; వినుట = వినుట; కున్ = కోసము; ఐ = అయ్యి; పదివేల = పదివేలు (10000); చెవులు = చెవులు; కృపన్ = దయతో; ఇమ్ము = ఇమ్ము; అదియే = అదే; నా = నా యొక్క; అభిమతంబున్ = కోరిక; అగును = అయి ఉండెను; ముకుందా = నారాయణా.
భావము:- కాబట్టి కమలనయనా! నీ నిర్మల కీర్తిగాథలను ఆలకించడానికి నాకు పదివేల చెవులను ప్రసాదించు. ముకుందా! ముమ్మాటికి ఇదే నా అభిలాష.
తెభా-4-552-చ.
అనఘ! మహాత్మ వాగ్గళితమైన భవత్పద పంకజాత సం
జనిత సుధాకణానిలవశంబున విస్మృత తత్త్వ మార్గవ
ర్తను లగు దుష్టయోగులకుఁ గ్రమ్మఱఁ దత్త్వముఁ జూపఁజాలు ని
ట్లొనరుట దక్క నన్య వర మొల్లఁ బయోరుహపత్రలోచనా!
టీక:- అనఘ = పుణ్యుడ; మహాత్మ = మహాత్ముల యొక్క; వాక్ = నోటినుండి; గళితము = జారినవి; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; పద = పాదములు అనెడి; పంకజాత = పద్మములనుండి {పంకజాతము - పంక (నీరు, బురద) జాతము (పుట్టినది), పద్మము}; జనిత = పుట్టిన; సుధా = అమృతపు; కణా = బిందువులనెడి; అనిల = వాయువునకు; వశంబునన్ = వశమగుటవలన; విస్మృత = మరచిన; తత్త్వ = తత్త్వము యొక్క; మార్గ = మార్గమున; వర్తనులు = నడచెడివారు; అగు = అయిన; దుష్ట = చెడ్డ; యోగుల్ = యోగుల; కున్ = కు; క్రమ్మఱన్ = మరల; తత్త్వమున్ = తత్త్వమును; చూపన్ = చూపుటకు; చాలున్ = సామర్థ్యము కలవి; ఇట్లు = ఈ విధముగ; ఒనరుట = అగుట; తక్కన్ = తప్పించి; అన్య = ఇతరమైన; వరమున్ = వరమును; ఒల్లన్ = ఒప్పుకొనను; పయోరుహపత్రలోచనా = నారాయణా {పయోరుహ పత్ర లోచనుడు - పయస్ (నీరు) అందు ఊరుహ (పుట్టు) తామర పత్ర (ఆకుల) వంటి లోచనా (కన్నులున్నవాడు), విష్ణువు}.
భావము:- మాలిన్యరహితులైన మహాత్ముల వాక్కులనుండి ప్రసరించే నీ పాదపద్మ సుధాకణాలను మోసికొని వచ్చే మలయమారుతం ద్వారా, ఆత్మ జ్ఞానాన్ని మరచిపోయిన అభాగ్యులకు, అజ్ఞానులకు మళ్ళీ ఆత్మ జ్ఞానాన్ని చూపించగలిగే వరాన్ని అనుగ్రహించు. తామర రేకుల వంటి కన్నులు గల స్వామీ! నాకు ఈ వరం తప్ప మరొక వరం అక్కరలేదు.
తెభా-4-553-సీ.
వినుత మంగళ యశోవిభవ! సర్వేశ్వర!-
యిందిర గుణసంగ్రహేచ్ఛఁ జేసి
యే నీదు శివతరం బైన సత్కీర్తిని-
నర్థిమై వరియించె నట్టి కీర్తి
కలిత సత్పురుష సంగమము గల్గుచు నుండ-
ధృతినెవ్వఁడేని యాదృచ్ఛికతను
జేసియునొకమాటు చెవులార విన్నవాఁ-
డనయంబును గుణజ్ఞుఁ డయ్యెనేని
తెభా-4-553.1-తే.
విరతి నేరీతి బొందును ధరణిఁ బశువుఁ
దక్కఁ దక్కిన తజ్ఞుండు దనుజ భేది
గాన యుత్సుకమతి నైన యేను లక్ష్మి
కరణి నిన్ను భజింతు; నో! పరమపురుష!
టీక:- వినుతమంగళయశోవిభవ = నారాయణా {వినుతమంగళయశోవిభవుడు - స్తోత్రము చేయబడుతున్న శుభకరమైన కీర్తి యొక్క వైభవము కలవాడు, విష్ణువు}; సర్వేశ్వర = నారాయణా; ఇందిర = లక్ష్మీదేవి యొక్క; గుణ = గుణములను; సంగ్రహ = చక్కగగ్రహించెడి; ఇచ్చన్ = కోరిక; చేసి = వలన; ఏన్ = నేను; నీదు = నీ యొక్క; శివతరంబు = మిక్కిలిశుభప్రభమైనది {శివము - శివతరము - శివతమము}; ఐన = అయిన; సత్ = గొప్ప; కీర్తినిని = యశస్సును; అర్థిమై = పూని; వరియించెన్ = వరించెను; అట్టి = అటువంటి; కీర్తిన్ = కీర్తిని; కలిత = కలిగిన; సత్పురుష = మంచివారి; సంగమమున్ = కలియుట; కల్గుచున్ = కలుగుతూ; ఉండన్ = ఉండగా; ధృతిన్ = పూని; ఎవ్వడేని = ఎవరైనా; యాదృచ్చికతనున్ = తలవనితలంపుగా; కతనున్ = కారణము; చేసియున్ = వలనను; ఒకమాటు = ఒకమారు; చెవులార = చెవులనిండుగా; విన్నవాడు = వినినవాడు; అనయంబునున్ = అవశ్యము; గుణజ్ఞుడు = సుగుణములుకలవాడు; అయ్యెనేని = అయినచో.
విరతిన్ = అయిష్టతను; ఏ = ఏ; రీతిన్ = విధముగ; పొందునున్ = పొందును; ధరణిన్ = భూమిపైన; పశువున్ = జంతువు; తక్క = తప్పించి; తక్కిన = ఇతరమైన; తత్ = అది; జ్ఞుండున్ = తెలిసినవాడు; దనుజభేది = నారాయణా {దనుజభేది - దనుజ (రాక్షసులను) భేది (శత్రువు), విష్ణువు}; కాన = కనుక; ఉత్సుక = కుతూహలముగల; మతిని = బుద్ధికలవాడను; ఐన = అయిన; ఏను = నేను; లక్ష్మి = లక్ష్మీదేవి; కరణి = వలె; నిన్నున్ = నిన్ను; భజింతున్ = సేవింతును; ఓ = ఓ; పరమపురుష = నారాయణా.
భావము:- సకల జగదీశ్వరియై మహనీయ మంగళ యశోమందిర అయిన ఇందిరాదేవి గుణగ్రహణ పారీణ బుద్ధితో కళ్యాణకరమైన నీ సత్కీర్తిని వరించింది. అటువంటి నీ యశోగాథలను సత్పురుషుల సహవాసం వల్ల ఒక్కసారి యాదృచ్ఛికంగానైనా సరే చెవులారా విన్నవాడు పశువు కాకుండా గుణజ్ఞుడైనట్లయితే అంతతో తృప్తి పొందక ఇంకా ఇంకా వినాలని కోరుకుంటాడు. కనుక ఓ పరమపురుషా! దనుజమర్దనా! నిన్ను నేను లక్ష్మీదేవి వలె సేవిస్తాను.
తెభా-4-554-వ.
ఇట్లు భవదీయ సేవాతత్పరులమైన యిందిరయు నేను నేక పదార్థాభిలాషం జేసి స్పర్ధమానుల మగుచున్న మా యిద్దఱకును బర్యాయసేవం జేసి కలహంబు లేకుండని;మ్మట్లు గాక భవదీయ చరణ సరోరుహ సేవాసక్త మనోవిస్తారుల మగుటం జేసి యేనయేన మున్ను భజియింతు నను తలంపులం గలహం బయిననుం గానిమ్ము దేవా;” యని వెండియు నిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; భవదీయ = నీ యొక్క; సేవా = సేవించుట యందు; తత్పరులము = దీక్షగొన్నవారము; ఐన = అయిన; ఇందిరయున్ = లక్ష్మీదేవి; నేనున్ = నేను; ఏక = ఒకటే; పదార్థ = వస్తువును; అభిలాషన్ = కోరుచుండుట; చేసి = వలన; స్పర్ధమానులము = పోటీపడుతున్న వారము; అగుచున్న = అవుతున్న; మా = మా; ఇద్దఱ = ఇద్దరి; కునున్ = కిని; పర్యాయ = వంతులవారి; సేవన్ = సేవించుట; చేసి = వలన; కలహంబు = కలహము; లేకుండనిమ్ము = కలుగకుండగ జూడుము; కాక = కాకపోతే; భవదీయ = నీ యొక్క; చరణ = పాదములు అనెడి; సరోరుహ = పద్మముల; సేవా = సేవ యందు; ఆసక్త = ఆసక్తి కలిగిన; మనోవిస్తారులము = మనోవికాసము కలవారము; అగుటన్ = అగుట; చేసి = వలన; ఏనయేన = నేనంటే నేను; మున్న = ముందు; భజియింతును = సేవింతును; అను = అనెడి; తలంపులన్ = భావముల వలన; కలహంబున్ = కలహము; అయినను = కలిగినను; కానిమ్ము = కలుగనిమ్ము; దేవా = దేవుడా; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా నీ సేవాసక్తులమైన లక్ష్మీదేవి, నేను ఒకే వస్తువును అభిలషించి పోటీపడుతున్నాము. కాబట్టి దేవా! మాకు కలహం కలుగకుండా ఒకరి తరువాత ఒకరికి నీ సేవాభాగ్యాన్ని అనుగ్రహించు. లేదా నిన్ను సేవించాలనే ఉత్కంఠతో ‘నేను ముందంటే నేను ముందు’ అని మాలో మాకు కలహం కలుగనీ. అయినా సంతోషమే!” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.
తెభా-4-555-సీ.
“జగదీశ! దేవ! యుష్మత్పద కైంకర్య-
పరతఁ దనర్చు సాగరతనూజ
కృత్యంబునందు నకిల్బిష బుద్ధి నేఁ-
బ్రీతిఁ గోరుట జగన్మాత యైన
యా రమాసతితోడి వైర మవశ్యంబుఁ-
గల్గు నైనను దయాకార! నీవు
దీనవత్సలుఁడవు గాన స్వల్పం బైన-
నధికంబు చేయుదు! వట్లుగాన
తెభా-4-555.1-తే.
భవ్యచరిత! నిజస్వరూపంబునందు
నభిరతుఁడ వైన నీవు నన్నాదరించు
పగిది నిందిర నాదరింపవు మహాత్మ!
భక్తజనలోక మందార! భవవిదూర!
టీక:- జగదీశ = హరి {జగదీశుడు - జగత్తు (లోకముల)కు ఈశ (ప్రభువు), విష్ణువు}; దేవా = హరి; యుష్మత్ = నీ యొక్క; పద = పాదములను; కైంకర్య = సేవించెడి; పరతన్ = దీక్షలో; తనర్చు = అతిశయించెడి; సాగరతనూజ = లక్ష్మీదేవి చేసెడి {సాగరతనూజ - సాగర (సముద్రుని) తనూజ (పుత్రిక), లక్ష్మి}; కృత్యంబున్ = పనులు; అందున్ = లో; అకిల్బిష = కల్మషములేని; బుద్ధి = భావముతో; నేన్ = నేను; ప్రీతిన్ = కూర్మితో; కోరుటన్ = కోరుటవలన; జగన్మాత = జగత్తునకేతల్లి; ఐన = అయిన; ఆ = ఆ; రమాసతి = లక్ష్మీదేవి; తోడి = తోటి; వైరమున్ = కలహము; అవశ్యంబున్ = తప్పక; కల్గున్ = కలుగును; ఐనన్ = అయినప్పటికిని; దయాకర = కృపచేయువాడ; నీవు = నీవు; దీన = దీనులఎడ; వత్సలుడవు = వాత్సల్యముకలవాడవు; కాన = కనుక; స్వల్పంబున్ = కొంచము; ఐనన్ = అయినను; అధికంబున్ = అధికఫలితమును; చేయుదువు = కలుగజేయుదువు; అట్లుగాన = అందుచేత.
భవ్యచరిత = దివ్యమైననడవడికకలవాడ; నిజ = స్వంత; స్వరూపంబున్ = స్వరూపము; అందున్ = ఎడల; అభిరతుండవు = అనురక్తికలవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; నన్ను = నన్ను; ఆదరించు = ఆదరించెడి; పగిదిన్ = విధముగ; ఇందిరన్ = లక్ష్మీదేవిని; ఆదరింపవు = ఆదరింపవు; మహాత్మ = హరి; భక్తజనలోకమందార = హరి {భక్తజనలోకమందార - భక్తులైనజనులు సమస్తమునకు కల్పవృక్షమువంటివాడు, విష్ణువు}; భవవిదూర = హరి {భవవిదూర - భవ (సంసారబంధనములను) విదూర (పోగొట్టువాడు), విష్ణువు}.
భావము:- “దేవా! జగన్నాథా! నీ పాదాలను సేవించాలని లక్ష్మీదేవి తహతహ లాడుతున్నది. నేను కూడ ఆమె చేసే పనినే చేయాలనే సద్బుద్ధితో తొందర పడుతున్నాను. కాబట్టి జగన్మాత అయిన లక్ష్మీదేవితో నాకు వివాదం తప్పదు. దయామయా! నీవు దీనవత్సలుడవు. కాబట్టి కొంచెంగా ఉన్నదానినైనా గొప్పదానిగా చేస్తావు. అందుచేత మహాత్ముడవు, సర్వాంతర్యామివి, భవభంజనుడవు, భక్తజన రంజనుడవు అయిన నీవు నన్ను ఆదరించినంతగా లక్ష్మీదేవిని ఆదరించవు.
తెభా-4-556-వ.
ఇట్లగుటం జేసి సత్పురుషు లైనవారలు నిరస్తమాయాగుణ సముదయంబు గల నిన్ను భజియింతురు; వారలు భవత్పాదానుస్మరణ రూపంబయిన ప్రయోజనంబు దక్క నితర ప్రయోజనంబుల నెఱుంగరు; దేవా! సేవక జనంబులను వరంబులు వేఁడు మని జగద్విమోహనంబు లైన వాక్యంబులు పలుకుదువు; యట్టి భవదీయ వాక్యతంత్రీనిబద్ధులు లోకులు గాకుండిరేని ఫలకాములై కర్మంబుల నెట్టు లాచరింతురు; యీశా! భవదీయ మాయావిమోహితులై జను లేమి కారణంబున నీకంటె నితరంబులఁ గోరుచుందు? రిట్లగుటం జేసి తండ్రి దనంతన బాలహితం బాచరించు నట్లు మాకు నీవ హితాచరణం బాచరింప నర్హుండ"వని పలికిన నాదిరాజర్షి యైన పృథుచక్రవర్తి యర్థవంతంబు లయిన వచనంబులు విని విశ్వద్రష్టయగు నారాయణుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె “మహారాజా! దైవప్రేరితుండవై నా యెడ నిట్టి బుద్ధి గలుగుటం జేసి యచలాచలం బగు భక్తి వొడము; దానిచే దుస్తరం బగు మదీయమాయం దరింతువు; నీవు నాచే నాదిష్టం బగు కృత్యం బప్రమత్తుండ వగుచు నాచరించిన సకల శుభంబులం బొందుదువు; మదీయ భక్తజనంబులు స్వర్గాపవర్గనరకంబులం దుల్యంబులుగా నవలోకింతురు; గావున నీ యధ్యవసాయంబు నట్టిదియ; మఱియు మదీ యాదేశంబున దుస్త్యజం బగు రోషంబును ద్యజించి నా యెడ భక్తి సలిపితివి గాన యదియె నాకుఁ బరమహర్షదం బగు” నని యభినందించి యనుగ్రహించి యతండు గావించు పూజలు గయికొని గమనోన్ముఖుం డయ్యె; నయ్యవసరంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అగుటన్ = అగుట; చేసి = వలన; సత్పురుషులు = మంచివారు; ఐన = అయినట్టి; వారు = వారు; నిరస్త = తొలగింపబడిన; మాయా = మాయ యొక్క; గుణ = గుణముల; సముదయంబున్ = సమూహము; కల = ఉన్నట్టి; నిన్నున్ = నిన్ను; భజియింతురు = సేవింతురు; వారలు = వారు; భవత్ = నీ యొక్క; పాద = పాదములను; అనుస్మరణ = ధ్యానించెడి; రూపంబున్ = రూపముకలది; అయిన = అయినట్టి; ప్రయోజనంబున్ = ప్రయోజనము; తక్క = తప్పించి; ఇతర = ఇతరమైన; ప్రయోజనంబులన్ = ప్రయోజనములను; ఎఱుంగరు = తెలిసికొనరు; దేవా = భగవంతుడా; సేవక = భక్తులైన; జనంబులను = వారిని; వరంబులున్ = వరములు; వేడుము = కోరుకొనుము; అని = అని; జగత్ = లోకములకు; విమోహనంబులు = మిక్కిలి చక్కటివి; ఐన = అయిన; వాక్యంబులున్ = మాటలను; పలుకుదువు = పలికెదవు; అట్టి = అటువంటి; భవదీయ = నీ యొక్క; వాక్య = మాటల; తంత్రీ = తీగలచే; నిబద్దులు = బాగా కట్టబడినవారు; లోకులు = జనులు; కాకుండిరి = కాకుండినట్లు; ఏని = అయితే; ఫల = ఫలితములను; కాములు = కోరువారు; ఐ = అయ్యి; కర్మంబులన్ = కర్మములను; ఎట్టులు = ఏ విధముగ; ఆచరింతురు = చేసెదరు; ఈశా = హరి; భవదీయ = నీ యొక్క; మాయా = మాయచేత; విమోహితులు = మోహమున పడినవారు; ఐ = అయ్యి; జనులు = ప్రజలు; ఏమి = ఎటువంటి; కారణంబునన్ = కారణముచేత; నీకున్ = నీకు; కంటెన్ = కంటె; ఇతరంబులన్ = వేరైనవాటిని; కోరుచుందురు = కోరుతుంటారు; ఇట్లు = ఈ విధముగ; అగుటన్ = అగుట; చేసి = వలన; తండ్రి = తండ్రి; తనంతన = తనంతతానే; బాల = పిల్లలకి; హితంబున్ = ఇష్టమైనవి; ఆచరించునట్లు = చేయునట్లు; మాకున్ = మాకు; నీవ = నీవే; హిత = హితవైనది; ఆచరణంబున్ = చేయుటను; ఆచరింపన్ = జరుపుటకు; అర్హుండవు = తగినవాడవు; అని = అని; పలికినన్ = పలికినట్టి; ఆది = మొట్టమొదటి; రాజర్షి = రాజులలోఋషి తుల్యుడు; ఐన = అయిన; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; అర్థవంతంబులు = చక్కటి అర్థములు కలవి; అయిన = అయిన; వచనంబులున్ = మాటలు; విని = విని; విశ్వద్రష్ట = హరి {విశ్వద్రష్ట - విశ్వమునందు సమస్తమును ద్రష్ట (చూసెడివాడు, తెలియువాడు), విష్ణువు}; అగు = అయిన; నారాయణుండు = హరి; సంతుష్ట = సంతృప్తిచెందిన; అంతరంగుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మహారాజా = చక్రవర్తి; దైవ = దేవునిచే; ప్రేరితుడవు = పురిగొల్పబడినవాడవు; ఐ = అయ్యి; నా = నా; ఎడన్ = అందు; ఇట్టి = ఇటువంటి; బుద్ధిన్ = బుద్ధి; కలుగుటన్ = కలుగుట; చేసి = వలన; అచల = కొండవలె; అచలంబున్ = నిశ్చలమైనది; అగు = అయిన; భక్తి = భక్తి; ఒడమున్ = కలుగును; దాని = దాని; చేన్ = వలన; దుస్తరంబున్ = దాటరానిది; అగు = అయిన; మదీయ = నాయొక్క; మాయన్ = మాయను; తరింతువు = దాటెదవు; నీవు = నీవు; నా = నా; చేన్ = చేత; అధిష్టంబు = ఆదేశింపబడినది; అగు = అయిన; కృత్యంబున్ = కార్యక్రమమును, పనిని; అప్రమత్తుండవు = ఏమరుపాటు లేనివాడవు; అగుచున్న = అవుతూ; ఆచరించినన్ = ఆచరించినచో; సకల = సమస్తమైన; శుభంబులన్ = శుభములను; పొందుదువు = పొందెదవు; మదీయ = నా యొక్క; భక్త = భక్తులైన; జనంబులు = వారు; స్వర్గ = స్వర్గము; అపవర్గ = ముక్తి; నరకంబులన్ = నరకములను; అందున్ = ఎడల; తుల్యంబులు = సమానమైనవి; కాన్ = అయినట్లు; అవలోకింతురు = చూసెదరు; కావునన్ = అందుచేత; నీ = నీ యొక్క; అధ్యవసాయంబున్ = నిశ్చయము, పూనిక; అట్టిదియ = అటువంటిది; మఱియున్ = ఇంకను; మదీయ = నా యొక్క; ఆదేశంబునన్ = ఆదేశము; దుస్త్యజంబున్ = విడువరానిది; అగు = అయిన; రోషంబున్ = రోషమును; త్యజించి = విడిచి; నా = నా; ఎడన్ = అందు; భక్తిన్ = భక్తిని; సలిపితివి = చేసితివి; కాన = కనుక; అదియె = అదే; నాకున్ = నాకు; పరమ = మిక్కిలి; హర్షదంబు = సంతోషము కలిగించునది; అగున్ = అగును; అని = అని; అభినందించి = పొగిడి; అనుగ్రహించి = కరుణించి; అతండు = అతడు; కావించు = చేసెడి; పూజలున్ = సేవించుటలను; కయికొని = స్వీకరించి; గమన = వెళ్ళుటకు; ఉన్ముఖుండు = సిద్దపడినవాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు.
భావము:- అందుకే సజ్జనులు మాయాతీతుడవైన నిన్ను సేవిస్తారు. వారు నీ పాదస్మరణ రూపమైన ఫలాన్ని తప్ప ఇంకొక ఫలాన్ని కోరుకొనరు. దేవదేవా! సేవకులను వరాలు కోరుకొమ్మని జగత్తును మోసగించె వాక్యాలను పలుకుతున్నావు. లోకులు నీ వాక్యాలనబడే త్రాళ్ళతో కట్టుబడిన వారై ఫలాలను ఆశించి కర్మాసక్తు లవుతారు. నీ మాయా విమోహితులు కాకపోతే జనులు నీ భక్తికంటే ఇతర వరాలను ఎందుకు కోరుకుంటారు? కాబట్టి తండ్రి తనంత తాను పిల్లలకు మేలుచేసే విధంగా నీవు మాకు హితం చేకూర్చు” అని పలికిన ఆది రాజర్షి అయిన పృథు చక్రవర్తి మాటలు విని విశ్వకర్త అయిన నారాయణుడు సంతృప్తి పడి ఇలా అన్నాడు. “మహారాజా! దైవప్రేరణ వల్లనే నాయందు నీకు ఇటువంటి బుద్ధి కలిగింది. అందువల్ల కొండవలె నిశ్చలమైన నిండు భక్తి నీకు ప్రాప్తిస్తుంది. ఆ నిశ్చల భక్తి వల్ల దాటటానికి శక్యం కాని నా మాయను నీవు దాటగలవు. నేను ఆజ్ఞాపించిన కార్యాన్ని నీవు జాగరూకుడవై ఆచరిస్తే సకల శుభాలను పొందుతావు. నా భక్తులు స్వర్గాన్ని, మోక్షాన్ని, నరకాన్ని సమానంగా చూస్తారు. నీ భావన కూడా అంతే. ఇదే నాకు పరమానందం” అని అభినందించి పృథు చక్రవర్తి చేసిన పూజలను స్వీకరించి శ్రీహరి వైకుంఠానికి బయలుదేరాడు. ఆ సమయంలో…
తెభా-4-557-సీ.
నర సిద్ధ చారణ సుర ముని గంధర్వ-
కిన్నర పితృ సాధ్య పన్నగులును
నఖిల జనంబులు హరిపార్శ్వవర్తులు-
నానంద మగ్నాంగు లగుచు; వేడ్క
యజ్ఞేశ చింతనుం డైన యా పృథువుచే-
సత్కారములఁ బొంది; సమ్మదమునఁ
జనిరి నిజాధివాసములకు; భగవంతుఁ-
డైన నారాయణుం డచ్యుతుండు
తెభా-4-557.1-తే.
దగ నుపాధ్యాయ సహితుఁడై తనరు పృథుని
విమలమతు లయి చూచుచు నమరవరులు
దన్ను జయజయ కలిత శబ్దములఁ బొగడఁ
జనియె నప్పుడు వైకుంఠ సదనమునకు.
టీక:- నర = నరులు; సిద్ధ = సిద్ధుల; చారణ = చారణులు; సుర = దేవతలు; ముని = మునులు; గంధర్వ = గంధర్వులు; కిన్నర = కిన్నరలు; పితృ = పితరులు; సాధ్య = సాధ్యులు; పన్నగులునున్ = నాగులు; అఖిల = సమస్తమైన; జనంబులున్ = వారు; హరి = విష్ణుమూర్తి; పార్శ్వవర్తులున్ = అనుచరులు {పార్శ్వవర్తులు - పక్కన నడచెడివారు, అనుచరులు}; ఆనంద = ఆనందమున; మగ్న = మునిగిన; అంగులు = దేహములుకలవారు; అగుచున్ = అవుతూ; వేడ్కన్ = కుతూహలముతో; యజ్ఞేశ = నారాయణుని {యజ్ఞేశుడు - యాగములకు ఈశుడు (ప్రభువు), విష్ణువు}; చింతనుండు = ధ్యానించెడివాడు; ఐన = అయిన; ఆ = ఆ; పృథువు = పృథుచక్రవర్తి; చేన్ = చేత; సత్కారంబులన్ = సత్కారములను; పొంది = పొంది; సమ్మదమునన్ = సంతోషముతో; చనిరి = వెళ్ళిరి; నిజ = తమ; అధివాసముల్ = నివాసముల; కున్ = కు; భగవంతుడు = హరి; ఐన = అయిన; నారాయణుండు = హరి; అచ్యుతుండున్ = హరి; తగన్ = తగినట్లు; ఉపాధ్యాయ = ఉపాధ్యాయులతో {ఉపాధ్యాయుడు - వేదమును చదివించువాడు}; సహితుడు = కూడినవాడు; ఐ = అయ్యి.
తనరు = అతిశయించెడి; పృథుని = పృథుచక్రవర్తిని; విమల = నిర్మలమైన; మతులు = మనసులుకలవారు; అయి = అయ్యి; చూచుచున్ = చూస్తూ; అమర = దేవతా {అమరులు - మరణములేనివారు, దేవతలు}; వరులు = ఉత్తములు; తన్ను = తనను; జయజయ = జయజయ యనెడి శబ్దములుతో; కలిత = కూడిన; శబ్దములన్ = మాటలతో; పొగడన్ = పొగుడుతుండగా; చనియెన్ = వెళ్ళెను; అప్పుడు = అప్పుడు; వైకుంఠ = వైకుఠము యనెడి; సదనమున్ = పురమున; కున్ = కు.
భావము:- నరులు, సిద్ధులు, అారణులు, దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నరులు, పితృదేవతలు, సాధ్యులు, పన్నగులు, విష్ణుకింకరులు అందరూ విష్ణుభక్తుడైన పృథుచక్రవర్తి చేసిన సత్కారాలను అందుకొని సంతోషంతో తమ తమ నివాసాలకు వెళ్ళారు. ఋత్విక్కులతో కూడిన పృథుచక్రవర్తిని ఆనందంగా అవలోకిస్తూ దేవతలందరూ తనను జయజయ ధ్వనులతో స్తుతిస్తూ ఉండగా శ్రీహరి వైకుంఠానికి వేంచేసాడు.
తెభా-4-558-వ.
అంతఁ బృథుచక్రవర్తియు నింద్రియాగోచరుం డయ్యును దర్శితాత్ముండును దేవదేవుండును నయిన వాసుదేవునకు నమస్కరించి నిజపురంబునకుం జనుదెంచు సమయంబున మౌక్తిక కుసుమ మాలికా దుకూల స్వర్ణతోరణాలంకృతంబును, లలిత సుగంధ ధూప విలసితంబును, రత్నమయ రంగవల్లికా విరాజితంబును, ఫలపుష్ప లాజాక్షత దీపమాలికా స్తంభ పూగపోతాభిరామ ప్రతిగృహ ప్రాంగణంబును, మృగమద ఘనసార చందనాగరు వాఃపూర సంసిక్త రథ్యావళీ విభాసితంబును, దరుపల్లవాభిశోభితంబును నైన పురంబుఁ బ్రవేశించి రాజమార్గంబునం జనుదేర మండిత రత్నకుండలమణి మరీచులు గండఫలకంబులం దాండవంబులు సలుపం, బురకామినులు గనక పాత్ర విరచితంబు లయిన యశేష మంగళ నీరాజనంబుల నివాళింప, శంఖ దుందుభి ప్రముఖ తూర్యఘోషంబులును ఋత్విఙ్నికాయాశీర్వచనంబులును జెలంగ, వందిమాగధ జన సంస్తూయమానుం డగుచు విగత గర్వుండై యంతఃపురంబుం బ్రవేశించి; యనంతరంబ.
టీక:- అంతన్ = అంతట; పృథుచక్రవర్తియున్ = పృథుచక్రవర్తి; ఇంద్రియ = ఇంద్రియములకు; అగోచరుండు = పొడగనరానివాడు; అయ్యునున్ = అయినను; దర్శిత = దర్శనము కలిగించిన; ఆత్ముండునున్ = మనసు కలిగించువాడు; దేవదేవుండును = దేవుళ్ళకే దేవుడు; అయిన = అయిన; వాసుదేవున్ = విష్ణుమూర్తి; కున్ = కి; నమస్కరించి = నమస్కరించి; నిజ = తన; పురంబున్ = నగరమునకు; చనుదెంచు = వచ్చెడి; సమయంబునన్ = సమయము నందు; మౌక్తిక = ముత్యాలదండలు; కుసుమ = పూల; మాలికా = మాలికలు; దుకూల = తెల్లని వస్త్రములు; స్వర్ణ = బంగారపు; తోరణ = తోరణములతోను; అలంకృతంబును = అలంకరింపబడినది; లలిత = సుకుమార; సుగంధ = సువాసనల; ధూప = ధూపములతో {ధూపము - సుగంధ మూలికలను నిప్పులపై తపింప జేయుట వలన కలుగు సువాసనల పొగ పట్టించుట}; విలసితంబును = విలసిల్లుతున్నది; రత్న = రత్నములు; మయ = నిండిన; రంగవల్లికా = ముగ్గులుతో; విరాజితంబును = విరాజిల్లుతున్నది; ఫల = పండ్లు; పుష్ప = పువ్వులు; లాజ = పేలాలు; అక్షత = అక్షింతలు; దీప = దీపముల; మాలికా = వరుసలుకల; స్తంభ = స్తంభములు; పూగ = పోకచెట్టు; పోత = బోదెలతో; ప్రతి = ప్రతి ఒక్క; గృహ = ఇంటి; ప్రాంగణంబును = ముంగిలులు కలది; మృగమద = కస్తూరి; ఘనసార = పచ్చకర్పూరము; చందన = మంచిగంధముల; అగరు = అగరు కలిపిన; వాః = నీటి, కళ్ళాపి; పూర = జల్లుటచే; సంసిక్త = చక్కగ తడిసిన; రథ్య = రథమార్గముల, రాజమార్గముల; ఆవళీ = సమూహముతో; విభాసితంబునున్ = చక్కగా భాసిల్లుతున్నది; తరు = చెట్ల; పల్లవా = చివుళ్ళతో; అభి = చక్కగా; శోభితంబును = శోభిల్లుతున్నది; ఐన = అయిన; పురంబున్ = నగరమును; ప్రవేశించి = చొచ్చి; రాజమార్గంబునన్ = రాచవీధమ్మట; చనుదేర = రాగా; మండిత = అలంకరింపబడిన; రత్న = రత్నములు తాపిన; కుండల = చెవికుండలముల; మణి = మణుల; మరీచులు = కాంతులు; గండఫలకంబులన్ = చెక్కిటద్దాలపై; తాండవములు = నర్తనములు; సలుపన్ = ఆడుతుండగా; పుర = నగర మందలి; కామినులు = స్త్రీలు; కనక = బంగారు; పాత్ర = పాత్ర లందు; విరచితంబులు = చక్కగా యేర్పరచినవి; అయిన = అయిన; అశేష = సమస్తమైన; మంగళనీరాజనంబులు = మంగళహారతులు; నివాళింపన్ = హారతిపట్టగా {నివాళించుట - హారతి గ్రహీత ఎదురుగా మంగళహారతి పళ్ళెరములను ప్రదక్షిణగా చుట్లుతిప్పి తరువాత నివాళించెడివారి కుడిఅరచేతులతో అందలి ధూపమును గ్రహీతవైపునకు చూపుట, హారతి పట్టుట}; శంఖ = శంఖము; దుందుభి = భేరీ, రాండోళ్ళు; ప్రముఖ = మొదలగు; తూర్య = వాద్యముల; ఘోషంబులును = శబ్దములు; ఋత్విక్ = ఋత్విక్కుల; నికాయా = సమూహము యొక్క; ఆశీర్వచనంబులును = ఆశీర్వచనములు; చెలంగన్ = చెలరేగగా; వంది = వందించెడి {వంది - స్తుతిచేసి జీవించెడివాడు}; మాగధ = మాగధులైన {మాగధుడు - వంశవీర్యాదులను పొగడి జీవించెడివాడు}; జన = వారిచేత; సంస్తూయమానుండు = స్తుతింపబడినవాడు; అగుచున్ = అవుతూ; విగత = విడిచిన; గర్వుండు = గర్వము కలవాడు; అగుచున్ = అవుతూ; అంతఃపురంబున్ = అంతఃపురమును; ప్రవేశించి = చొచ్చి; అనంతరంబ = తరువాత.
భావము:- అప్పుడు పృథుచక్రవర్తి కన్నులకు కనిపించకపోయినా మనస్సులో నెలకొని ఉన్న దేవదేవుడైన వాసుదేవునకు వందనం చేసి తన నగరానికి బయలుదేరాడు. పట్టణంలో ఎక్కడ చూసినా ముత్యాల సరాలు, పూలదండలు, తెలిపట్టు చాందినీలు, బంగారు తోరణాలు అలంకరించారు. కమ్మని సుగంధ ధూపాలు పరిమళాలను వెదజల్లుతున్నాయి. రత్నాలతో మ్రుగ్గులు తీర్చారు. ప్రతి గృహం ముందు పండ్లు, పుష్పాలు, లాజలు, అక్షతలు, దీపమాలికలు, అరటి కంబాలు, పోకచెట్లు కనువిందు చేస్తున్నాయి. రాజవీథులలో కస్తూరి, పచ్చకర్పూరం, మంచిగంధం, అగరు కలిపిన జలాలు చల్లి, చివురాకు గుత్తులు కైసేశారు. రత్నకుండలాల రమణీయ కాంతులు చెక్కుటద్దాలపై నాట్యం చేస్తుండగా పురస్త్రీలు బంగారు పళ్ళెరాలలో మంగళహారతులు వెలిగించి రాజమార్గంలో విచ్చేస్తున్న మహారాజుకు నివాళు లిచ్చారు. శంఖ దుందుభి ధ్వానాలు మిన్ను ముట్టాయి. ఋత్విక్కుల ఆశీర్వాద ధ్వనులతో, వంది మాగధుల కైవారాలతో ప్రశాంత హృదయుడైన పృథుచక్రవర్తి అంతఃపురంలో ప్రవేశించాడు. ఆ తరువాత…
తెభా-4-559-సీ.
సమధికమతిఁ బౌరజన జానపదులచేఁ-
దనరారు వివిధ పూజనము లొంది
రాజు సంతుష్టాంతరంగుండుఁ బ్రియవర-
ప్రదుఁడునై వారల బహువిధములఁ
బూజించె; నివ్విధంబున మహత్తరములై-
నట్టి కర్మంబుల నాచరించు
చును నిరవద్య చేష్టుండై మహత్తముఁ-
డన నొప్పు నా పృథు మనుజవిభుఁడు
తెభా-4-559.1-తే.
మించి భూమండలంబుఁ బాలించి విశద
యశము సర్వధరాచక్రమందు నిలిపి
చారు శుభమూర్తి రాజన్యచక్రవర్తి
పరమ మోదమునఁ బరమ పదము నొందె."
టీక:- సమధిక = అతిశయించిన; మతిన్ = విధముగ; పౌరజన = పురజనులు; జానపదుల్ = జానపదులు; చేన్ = చేత; తనరారు = విలసిల్లెడి; వివిధ = రకరకముల; పూజనములున్ = పూజలను; ఒంది = పొంది; రాజు = పృథుచక్రవర్తి; సంతుష్ట = సంతృప్తిచెందిన; అంతరంగుండు = మనసుకలవాడు; ప్రియ = ఇష్టమైన; వర = వరములను; ప్రదుడున్ = ఇచ్చెడివాడు; ఐ = అయ్యి; వారలన్ = వారిని; బహు = అనేకమైన; విధములన్ = విధములుగ; పూజించెన్ = గౌరవించెను; ఇవ్విధంబునన్ = ఈ విధముగ; మహత్తరములు = మిక్కిలి గొప్పవి {మహత్తు - మహత్తరము - మహత్తమము}; ఐనట్టి = అయ్యినట్టి; కర్మంబులన్ = కర్మములను; ఆచరించుచునున్ = చేయుచూ; నిరవద్య = అనింద్య, పవిత్రములైన; చేష్టుండు = చేష్టలు కలవాడు; ఐ = అయ్యి; మహత్తముడు = బహుమిక్కిలిగొప్పవాడు {మహత్తుడు - మహత్తరముడు - మహత్తముడు}; అనన్ = అనుటకు; ఒప్పు = తగిన; ఆ = ఆ; పృథు = పృథువు అనెడి; మనుజవిభుఁడు = చక్రవర్తి {మనుజవిభుడు - మనుజులకు ప్రభువు, రాజు}.
మించి = అతిశయించి; భూమండలంబున్ = సామ్రాజ్యమును; పాలించి = పరిపాలించి; విశద = స్వచ్ఛమైన; యశమున్ = కీర్తిని; సర్వ = సమస్తమైన; ధరాచక్రము = భూచక్రము; అందున్ = లోను; నిలిపి = స్థాపించి; చారు = చక్కటి; శుభ = శుభకరమైన; మూర్తి = స్వరూపముకలవాడు; రాజన్య = రాజులకు; చక్రవర్తి = రారాజు; పరమ = అత్యున్నతమైన; మోదమునన్ = సంతోషముగా; పరమపదమున్ = మోక్షమును; ఒందె = పొందెను.
భావము:- పురజనులు, జానపదులు మహారాజును అనేక విధాలుగా ఆదరాభిమానాలతో అర్చించి ఆరాధించారు. వారి పూజలకు రాజు సంతోషించాడు. వారి కోర్కెలను ప్రసాదించాడు. ఈ విధంగా పెక్కు ఘనకార్యాలను ఆచరిస్తూ నిష్కళంక చరిత్రతో నిరుపమాన మహిమతో సమస్త భూమండలాన్ని చక్కగా పరిపాలించి స్వచ్ఛమైన సత్కీర్తిని భూమిపై నలుమూలలా నెలకొల్పి పుణ్యమూర్తి అయిన పృథుచక్రవర్తి పరమానందంతో పరమపదం చేరుకున్నాడు.”
తెభా-4-560-క.
అని మైత్రేయ మహాముని
యనఘుఁడు విదురునకుఁ జెప్పె” నని శుకుఁ డభిమ
న్యుని సుతునకుఁ జెప్పిన తెఱఁ”
గని సూతుఁడు చెప్పె శౌనకాదుల తోడన్.
టీక:- అని = అని; మైత్రేయ = మైత్రేయుడు అనెడి; మహాముని = గొప్పముని; అనఘుడు = పుణ్యుడు; విదురున్ = విదురుని; కున్ = కి; చెప్పెన్ = చెప్పెను; అని = అని; శుకుడు = శుకుడు; అభిమన్యునిసుతున్ = పరీక్షితున; కున్ = కు; చెప్పిన = చెప్పిన; తెఱగు = విధము; అని = అని; సూతుడు = సూతుడు; చెప్పెన్ = చెప్పెను; శౌనక = శౌనకుడు; ఆదుల = మొదలగువారి; తోడన్ = తోటి.
భావము:- అని మైత్రేయ మహర్షి విమలహృదయుడైన విదురునకు వినిపించినట్లు శుకుడు పరీక్షిత్తునకు వివరించాడని సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు.
తెభా-4-561-వ.
అట్లెఱింగించి వెండియు నిట్లనియె "నివ్విధంబున నశేష గుణ విజృంభితంబును, నిర్దోషంబును, సత్పురుష సత్కృతంబును నగు పృథుచక్రవర్తి యశంబును బ్రకటంబుగాఁ జేయంజాలు మైత్రేయునిం జూచి మహా భాగవతుం డైన విదురుం డిట్లనియె.
టీక:- అట్లు = ఆ విధముగ; ఎఱింగించి = తెలిపి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఇవిధంబునన్ = ఈ విధముగ; అశేష = సమస్తమైన; గుణ = సుగుణములచేత; విజృంభితంబును = విజృంభించినది; నిర్దోషంబును = దోషములు లేనిది; సత్పురుష = మంచివారిచేత; సత్కృతంబునున్ = మన్ననలను పొందినది; అగు = అయిన; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి యొక్క; యశంబును = కీర్తిని; ప్రకటంబుగాన్ = ప్రసిద్దమగునట్లు; చేయంజాలు = చేయగలిగిన; మైత్రేయున్ = మైత్రేయుని; చూచి = చూసి; మహా = గొప్ప; భాగవతుండు = భాగవతుడు; ఐన = అయిన; విదురుండు = విదురుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ విధంగా చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు “ఈ విధంగా అనంత గుణవంతం, నిర్దోషం, సజ్జన సంస్తుతం అయిన పృథు చక్రవర్తి కీర్తిని వెల్లడింపగలిగిన మహనీయుణ్ణి మైత్రేయుణ్ణి చూచి విష్ణు భక్తుడైన విదురుడు ఇలా అన్నాడు.
తెభా-4-562-సీ.
"మునినాథ; విను పృథు జనపాలచంద్రుండు-
సొబఁగొప్ప మేదినీసురులచేత
రాజ్యాభిషేక సంపూజ్యుఁడై దేవతా-
గణముచే లబ్ధార్హ గుణుఁడు నగుచు
వైష్ణవతేజంబు వలనొప్ప ధరియించి-
యర్థి నేయే కర్మ మాచరించె
నది నాకు నెఱిఁగింపు మనఘాత్మ; భూమి యే-
రూఢి గవాకృతి రూఢ యెవని
తెభా-4-562.1-తే.
విక్రమోద్దీప్తమై యొప్పి వెలయునట్టి
కర్మమున నిప్డు రాజన్య గణము బ్రతుకు
నట్టి పృథుకీర్తి ధరలోన నతి వివేకి
దవిలి యెవ్వఁడు వినకుండు ధన్యచరిత;
టీక:- ముని = మునులలో; నాథుడు = శ్రేష్ఠుడు; విను = వినుము; పృథు = పృథువు అనెడి; జనపాల = రాజులలో; చంద్రుడు = చంద్రునివంటివాడు; సొబగు = సౌందర్యము; ఒప్పన్ = అతిశయించగ; మేదినీసురుల్ = బ్రాహ్మణుల {మేదినీసురులు - మేదిని (భూమి)కి సురులు, బ్రాహణులు}; చేతన్ = చేత; రాజ్యాభిషేక = పట్టాభిషేకముచేత; సంపూజ్యుడు = చక్కగగౌరవింపబడినవాడు; ఐ = అయ్యి; దేవతా = దేవతల; గణము = సమూహము; చేన్ = వలన; లబ్ధ = పొందిన; అర్హ = తగిన; గుణుడు = ఫలితములుకలవాడు; అగుచున్ = అవుతూ; వైష్ణవ = వైష్ణవము యొక్క; తేజంబున్ = తేజస్సును; వలనొప్ప = తగినవిధముగ; ధరియించి = తాల్చి; అర్థిన్ = కోరి; ఏయే = ఏయే; కర్మమున్ = కర్మములను; ఆచరించెన్ = ఒనర్చెను; అది = అది; నాకున్ = నాకు; ఎఱిగింపుము = తెలుపుము; అనఘాత్మ = పుణ్యాత్మా; భూమి = భూదేవి; ఏ = ఏ; రూఢిన్ = విధముగ; గవ = గోవు; ఆకృతిన్ = రూపముతో; రూఢన్ = స్థిరపడి; ఎవని = ఎవని.
విక్రమ = పరాక్రమముచే; ఉద్దీప్తము = ప్రకాశించెడిది; ఐ = అయ్యి; ఒప్పి = చక్కనై; వెలయున్ = విలసిల్లెడిది; అట్టి = అయినట్టి; కర్మమునన్ = కర్మములతో; ఇప్డు = ఇప్పుడు; రాజన్య = రాజుల; గణము = సమూహము; బ్రతుకు = బతుకుతున్నదో; అట్టి = అటువంటి; పృథు = గొప్ప; కీర్తి = కీర్తిని; ధర = భూప్రపంచము; లోనన్ = లో; అతి = మిక్కిలి; వివేకి = వివేకముకలవాడు; తవిలి = కోరి; ఎవ్వడున్ = ఎవడు; వినకుండు = వినకుండావుండును; ధన్య = సార్థకమైన; చరిత = నడవడికకలవాడ.
భావము:- “మునీంద్రా! విను. బ్రాహ్మణుల చేత మహారాజుగా పట్టాభిషిక్తుడై దేవతల వల్ల యోగ్యమైన వరాలను పొంది వైష్ణవతేజంతో విరాజిల్లుతున్న పృథుచక్రవర్తి చేసిన పనులను నాకు వివరించి చెప్పు. గోరూపం ధరించిన భూదేవి నుండి కోరికలను పిదికిన పృథువు పరాక్రమోపేతమైన అనుగ్రహాన్ని ఆధారంగా చేసికొని కదా ఇప్పుడు రాజులు బ్రతుకుతున్నారు! అటువంటి పృథు చక్రవర్తి కీర్తి గాథలను వివేకి అయినవాడు ఎవ్వడూ వినకుండా ఉండలేడు.”